Friday, 8 February 2013

కొల్లేటికోట- శ్రీశ్రీపెద్దింటమ్మతల్లి


         
                        Kolleti Kota Sri Sri Sri Peddintamma Talli


                                  कॊल्लेटिकोट श्री श्री श्री पॆद्दिंटम्म तल्लि    

                               కొల్లేటి కోట      శ్రీశ్రీశ్రీ పెద్దింటమ్మ తల్లి
                
                                 ఆంధ్రదేశం లో  అందమైన ప్రదేశం కొల్లేరు. కొల్లేరు ప్రకృతి రామణీయకత కు శాశ్వత చిరునామా. దక్షిణ కాశ్మీరం గా  పిలువబడే కొల్లేరు సరస్సు లో ఉన్న కోటదిబ్బ పేరే  కొల్లేటి కోట. కొల్లేటి కోట లో కొలువైన అమ్మల గన్న యమ్మ  మన పెద్దింటమ్మ.
             
                                               శ్రీ పెద్దింటమ్మ ఆలయ గాలిగోపురం
                                 ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్దదైన మంచినీటి సరస్సు కొల్లేరు. చరిత్ర ప్రసిద్ధి చెందిన ఈ సరస్సు పరిథి లోకి  కృష్ణాజిల్లా లోని కైకలూరు , మండవల్లి మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదపాడు, ఏలూరు,దెందులూరు భీమడోలు నిడమర్రు, ఉంగుటూరు ఆకివీడు మండలాలు సరిహద్దులు గా ఉన్నాయి. 135 చ.కి.మీ .విస్తీర్ణం గల ఈ కొల్లేరు సరస్సు లో 145 గ్రామా  లున్నాయి. వీటిలో 142 గ్రామాలు పశ్చిమ గోదావరి  జిల్లా లోని 7మండలాల్లో ఉండగా,  మిగిలిన  మూడు గ్రామాలు కృష్ణాజిల్లా లోని కైకలూరు, మండవల్లి  మండలాల్లో ఉన్నాయి.
                       
                 
                 
              శ్రీశ్రీ  పెద్దింటి అమ్మవారు స్థానిక మత్స్యకారుల కులదైవం.  వీరిలో ఎక్కువమంది ఒరిస్సా ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు గా చెపుతారు.
     

           దేవీదర్శనం ;;-----        కొల్లేటి కోట లో  కొలువు తీరిన పెద్దింటమ్మ తొమ్మిదడుగుల ఎత్తు కలిగి, విశాలమైన నేత్రాలతో  వీరాసనం లో    భక్తరక్షణోద్యుక్తురాలై   దర్శన మిస్తుంది. డమరుకం  త్రిశూలం మొదలైన ఆయుధాల తో,  నాగాభరణాల తో,  సూర్య చంద్రాభరణాలతో రక్తాంబర ధారియై రౌద్ర మనోహరం గా  దర్శనమిస్తుంది తల్లి.
              
                    
                                       శ్రీ శ్రీ పెద్దింటమ్మ దివ్యరూపం  


                          అమ్మవారి కి ఎడమ వైపు  జలదుర్గా మాత  విగ్రహం నయన మనోహరం గా , పద్మాసన స్థితయై, అభయ ముద్ర తో చిరునవ్వులు చిందిస్తూ   ప్రత్యక్ష మౌతుంది. శ్రీ పెద్దింటి అమ్మవారు పార్వతీదేవికి ప్రతిరూపమే నని భక్తులు భావిస్తారు. 101 మంది గ్రామ దేవతలలో ఈమె పెద్దది కాబట్టి    ఈమె పెద్దింటమ్మ గా సేవించబడుతూ,.
                   యా దేవీ మధు కైటభ ప్రశమనీ యా మాహిషోన్మీలినీ, !                                                                                    యా ధూమ్రేక్షణ చండముండ దమనీయా రక్తబీజాశనీ    !                                                

                   యాశుంభాదినిశుంభ దైత్యదమనీయా శుద్ద లక్ష్మీపరా   !                                                                                సా చండీ నవకోటి శక్తి సహితా మాం పాతు  విశ్వేశ్వరీ  !!
            -------------     అంటూ భక్తుల చేత స్తుతించబడుతోంది.

             చారిత్రక ప్రాథాన్యం.;;---         కొల్లేటి కోట అతిప్రాచీన పట్టణంగా చారిత్రక ఆథారాలున్నాయి. తొలిసారి  లాంగుళ్య గజపతి   ఈ ఆలయాన్ని నిర్మించి నట్లు గా చెప్పబడుతోంది.ఇక్కడ ఒక పెద్దమట్టికోట ఉండేదని అది కాలక్రమేణ మట్టి దిబ్బ గా మిగిలి పోయినట్లు తెలుస్తోంది .11వ శతాబ్దానికి చెందిన అంబదేవరాయలు   జలదుర్గ  మైన కొల్లేటి కోటను జయించి, జలదుర్గాలయం  లో పెద్దింటమ్మను ప్రతిష్ఠించినట్లు జనశృతి.

         
                                     జలదుర్గామాత దివ్యరూపం


                            వేంగీ –చాళుక్యల కాలం నాటికే కొల్లేరు ప్రాంతం ఒక మండలం గా ఉండేది. ఈ కొల్లేటి కోటను కొలను విషయ,”” సాగరవిషయ, గా  పిలవబడినట్లు చారిత్రకాథారాలున్నాయి. నేటి కొల్లేటి కోటను కొలను పురం, “ “కొలనువీడు, గా వ్యవహరించినట్లు శాసనాథారాలు కన్పిస్తున్నాయి. క్రీ.శ 10-11 శతాబ్దాలలో వేంగీరాజులకు చాళక్యుల తో సంబంధ బాంధవ్యాలుండే వని  12-13 శతాబ్దాలలోని కమలాకర పుర వల్లభుల శాసనాల వలన తెలుస్తోంది. వీరి పురాలు కమలాకరపురం (  నెల్లూరు) పద్మినీపురం ( గణపవరం ) కొలనువీడు (కొల్లేటి కోట )  గా చరిత్రకారులు గుర్తించారు. క్రీ.శ 1076 లో విజయాదిత్యుని మరణం తో వేంగీసామ్రాజ్యం అంతరించింది.  వేంగీరాజైన రాజరాజచోళుడు రాజరాజనరేంద్రుని కుమారుడు. తల్లితరపున వారసత్వం గా  వచ్చిన చోళ సింహాసనాన్ని అధిష్ఠించి కుళోత్తుంగ చోళుడు గా రాజ్య పరిపాలన చేశాడు. ఈతని కుమారుడు వేంగిని పాలిస్తూ, యుద్ధభూమి లో వీరమరణం పొందటం తో వారసుడు లేని రాజ్యం లో సామంతులు తిరుగు బాటు చేసి, స్వాతంత్య్రాన్ని ప్రకటించు కున్నారు. ఈ సమయం లో రాజ్యం పరహస్త గతం కాకుండా ఉండటానికి వృద్ధరాజైన  కుళోత్తుంగ చోళుడు వెలనాటి చోడవీరుని దత్తపుత్రుని గా స్వీకరించి,  సర్వాథికారి గా ప్రకటించాడు.అది ఇష్టం లేని మండలేశ్వరులు తిరుగు బాటు చేశారు. ఆ తిరుగు బాటు చేసిన వారి లో కొలనువీడు మండలేశ్వరుడైన తెలుగు భీముడు కూడ ఉన్నాడు. దీనికోసమే ఇంత చరిత్ర చెప్పాల్సివచ్చింది. ఈ తెలుగు భీముని పేరు తో వెలసిన గ్రామమే నేటి భుజబల ( భీమ) పట్నం  గా చారిత్రకులు గుర్తించారు. బహు సాహసి గా పేరొందిన ఈ తెలుగు భీముడు మిగిలిన తిరుగు బాటు దారుల తో కలసి పితృపురం (నేటి పిఠాపురం )  చాళుక్యరాజుని  విజయాదిత్య చక్రవర్తి గా, వేంగీశ్వరుని చేశాడు.  తొలిసారి పార్వతీమాత ను పెద్దమ్మ గా కొలిచిన చక్రవర్తి ఈయనే.    
             

                                   అమ్మవారి ఆలయ శిఖరం

                    పిఠాపురం శాసనాన్ని బట్టి అగస్త్యుడు సముద్రాన్ని ఇంకించినట్లు,  కొల్లేటి నీటి తోడించి,తోడించి, వంతెన వేయించి కొల్లేటి మథ్య లో ఒక అభేధ్యమైన జలదుర్గాన్ని నిర్మంచి నట్లు తెలుస్తోంది. ఈ దుర్గం   చుట్టూ 150 రాజహస్తాల  వెడల్పు, 7 నిలువుల లోతు,3 కోశాల చుట్టుకొలత గల అగడ్త ఉండేదని  చరిత్ర కారులు వ్రాశారు. ( కోసు అనగా - రెండువేల విండ్లపట్టు – అని అర్థము ). ఈ కొల్లేటి సరస్సు లో ఇప్పుడు కన్పించే దిబ్బలే శిథిలమైన కోటకు ఆనవాళ్ల ని చారిత్రకుల అభిప్రాయం. దీనినే ప్రస్తుతం  కొల్లేటి కోట గా పిలుస్తున్నాము.
                
      
                     
                                    కొల్లేరు దృశ్యం
             
              చైనా యాత్రికుడు హ్యుయన్ సాంగ్ ఈ కొల్లేటి సరస్సును ఒక గొప్ప మంచినీటి సరస్సు గా వర్ణించాడు. దండి మహాకవి తన దశకుమారచరిత్ర లో కొల్లేటిసరస్సుని గురించి, భుజ బలవీరుడైన  తెలుగు భీముని గురించి  చాల గొప్పగా అభివర్ణించాడు. ఈ కొల్లేటి సరస్సు కు ప్రాచీన కాలం లో  కునాళసరస్సు అని పేరున్నట్లు తెలుస్తోంది. ప్రాచీన కాలం లో ఇక్కడున్న  సౌధాలు ,మేడలు, మిద్దెలు  కాలగర్భం లో కలసి పోయినా. అమ్మవారి ఆలయం మాత్రం ఆటుపోటులకు తట్టుకొని నిలబడింది.
               
                                    ఆలయం లో భక్తుల ప్రదక్షిణాలు
             
                 విజయనగర రాజులకు మహమ్మదీయులకు జరిగిన పోరులో విజయనగర సామ్రాజ్య సైన్యాధ్యక్షుడు  విజయాన్ని ఆకాంక్షిస్తూ, తన కన్న కూతురును కొల్లేటిఒడ్డున బలి యిచ్చి,విజయాన్ని పొందాడని ,అప్పటినుండి ఆ ఒడ్డుకు పేరంటాలు కనుమ అని పేరు వచ్చిందని ఐతిహ్యం.  జంతుబలి పై నిషేధం ఉన్నప్పటికీ  ఇప్పటికి కూడ ఇక్కడ  కోళ్లు, గొఱ్ఱెలు మొదలైన  వాటిని బలి ఇవ్వడం సాథారణం గానే జరిగిపోతుంది. కోడిని అమ్మవారికి చూపించి తీసుకెళితే 1.00 రూ, గొర్రె, మేకను చూపించి తీసుకెళితే 10.రూ10 .యలు దేవస్థానానికి చెల్లించాలి. విశ్వాసాల ముందు చట్టాలు పని చేయవు కదా!


                      ఆలయగోపుర రమణీయ దృశ్యం
         
              కొల్లేటి అందాలు.:----  కొల్లేరు   వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం అభయారణ్యం గా ప్రకటించ బడింది. ప్రతి సంవత్సరం  సెప్టెంబరు , అక్టోబరు నెలలలో ఆష్ట్రేలియా, నైజీరియా ఫిజీ దీవులనుండి గూడకొంగలు వలస వస్తాయి .పరజపిట్టలు, నీటిబాతులు,మొదలైన అనేక అరుదైన పక్షిజాతులు  ఈ సమయం లో కొల్లేరు ని ఒక విహారకేంద్రం గా,  సందర్శనీయ స్థలం గా మార్ఛేస్తాయి. 
                 
                                 కొల్లేట్లో  అందమైన పక్షుల విహారాలు

                ఈరమణీయ దృశ్యాలను చూడటానికి,తమ కెమేరాల్లో బంధించుకోవడానికి  ఆ నెలల్లో విదేశీ సందర్శకులు కొల్లలు గా కొల్లేటి సందర్శనకు వస్తారంటే ఆ దృశ్యాలు  ఎంత నయన మనోహరాలో మనం అర్థం  చేసుకోవచ్చు. బుర్రదోనె లో కూర్చొని చేపలు వేటాడే  జాలరి దంపతుల తో పాటు,అప్పుడప్పుడు విదేశీ యులు కూడ ఆ దోనెల్లో కన్పిస్తుండటం  చూడటానికి ముచ్చట గా ఉంటుంది.

  
                        కనువిందు చేస్తున్న విహంగాలు
     

             రవాణా సౌకర్యాలు.::-----   పెద్దింటి  అమ్మ ను దర్శించుకోవడానికి  రెండు  రవాణామార్గాలు ఉన్నాయి. ప్రయాణాన్ని మక్కువగా ఆస్వాదించ దలచిన వారు  ఆకివీడు నుండి కొల్లేటిఒడ్డు వరకు సొంత వాహనం లో గాని, ఆర్టీసీ బస్సు లో గాని ప్రయాణించి అక్కడ నుండి కర్రలవంతెన మీదు గా నడుచుకుంటూ  కొల్లేటి పాయను ( ఆనాటి అగడ్త ను ) దాటి అక్కడనుండి  ఆటోలో 3.5 కి.మీ  కచ్చా రోడ్డుమీద దుమ్ము తో  కలిసి పోతూ ప్రయాణం చేసి అమ్మవారి ఆలయాన్ని చేరు కోవచ్చు. ఈ కర్రల వంతెన మీద ప్రయాణం ఒకవింత అనుభూతి. కర్రల వంతెన దాటి నందుకు తలకు మూడు రూపాయలు  టోల్గేటు దగ్గర చెల్లించవలసిరావడం ఈ ప్రయాణం లో  కొసమెరుపు. ఆటోకి పదిరూపాయల నుండి వసూలు చేస్తారు. ఇదికాక కొల్లేటి అందాలను దర్శిస్తూ, లాంచీలో ప్రయాణం చేసి ఆలయానికి చేరుకోవచ్చు.
                    
                                     కర్రల వంతెన పై ప్రయాణం
             
               ఇదే కాకుండా సుఖప్రయాణం కోరుకునే వారు  కైకలూరు, ఆలపాడు, ఏలూరు మీదు గా రోడ్డు మార్గం లో  ప్రయాణించి అమ్మవారిని దర్శించు కొవచ్చు.
       
                               అంగడుల వద్ద భక్తుల సందడి 

       ప్రత్యేక ఉత్సవాలు. ;;---     పెద్దింటమ్మ అమ్మవారి జాతర ఈ ప్రాంత ప్రజలకు గొప్పపండుగ.  కొల్లేటి పరిసర ప్రాంతపు  కార్మికులు, కర్షకులు కష్టాన్ని మరచి అధికోత్సాహం తో అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొని, ఆనందాన్నిపంచుకుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ద పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అమ్మవారి( తీర్థం ) జాతర మహోత్సవాలు జరుగుతాయి. 

                                             శ్రీ  గోకర్ణేశ్వర  స్వామి వారు
            
             ఈ ఉత్సవం లో భాగం గానే ఇక్కడ కు 2.5 కి మీ దూరం లో ఉన్న గోకర్ణేశ్వర స్వామి వారిని మేళ తాళాల తో గ్రామోత్సవం  చేస్తూ తీసుకొని వచ్చి  జలదుర్గా గోకర్ణేశ్వర స్వామి వార్ల  కళ్యాణాన్ని    వైభవోపేతం గా నిర్వహిస్తారు .  కళ్యాణానంతరం రథోత్సవం కనుల పండువు గా జరుగుతుంది.
          
                                                  రథోత్సవ దృశ్యం
                    
             పుణ్యాన్ని పురు షార్థాన్ని పొందడానికి ఇటువంటి తీర్థాలను తప్పని సరి గా దర్శించాలని పెద్దలు చెపుతారు .ఆథ్యాత్మిక  ప్రదేశం గానే కాక విహారయాత్రా స్థలం  గా  కూడ ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది.


*********************************************************************************

No comments:

Post a Comment