Saturday, 15 December 2012

గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర ఆలయం


                        గుడిమల్లం    శ్రీ     పరశురామేశ్వర       ఆలయం.
                     
       Gudimallan Sri Parasurameswara Aalayam.

                                  
              गुडिमल्लं श्री परशुरामेश्वर आलयम्.
                     
               

                                   చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి మండలం లోని గుడిమల్లం  గ్రామ మందలి  శ్రీ పరశురామేశ్వరాలయం లోని శివలింగం  ఇప్పటివరకు లభించిన శివలింగాల్లో అతి ప్రాచీనమైంది గా భారతీయపురాతత్త్వ శాఖ నిర్ణయించింది.
                  పరశు రామేశ్వరుడుగా పిలువ బడుతున్న ఈ శివలింగానికి అనేక ప్రత్యేకత లున్నాయి.ఈ శివలింగం  1, 2 శతాబ్దాల నాటిది గా చరిత్రకారులు నిర్ధారించారు.


                    
                                శ్రీ పరశురామేశ్వరుడు
       
        
        ఎన్నో శాసనాలు గుడి గోడల మీద ,ఆలయప్రాంగణం లోను మనకు కన్పిస్తాయి. కాని దీన్ని నిర్మించిందెవరో ఒక్క శాసనం లోను ప్రస్తావించబడలేదు. కాని స్వామి వారికి నిత్య ధూప దీప నైవేద్యాల కోసం  ధనాన్ని,  భూములను, అఖండ దీపారాధనకు ఆవులను కొల్లలుగా దానం చేసినట్లు శాసనాద్యాధారాలు లభిస్తున్నాయి.
            
             భా.పు. శాఖ . క్రీ,శ. 1973 లో జరిగిన త్రవ్వకాలలో  ఈ ఆలయాన్ని జాతీయసంపద గా గుర్తించింది. ఈ ఆలయనిర్మాణానికి వాడిన రాతి ఇటుకలు   42+21+6  సెంటీమీటర్ల సైజులో  ఉండటం వలన దీన్ని ఆంధ్ర శాతవాహనుల కాలం లోని   అనగా 1,2 శతాబ్దాల నాటి నిర్మాణం గా గుర్తించడం జరిగింది.
  
  శాసన ఆధారాలు.:-----      దేవాలయ గోడలమీద పల్లవ ,గంగపల్లవ. బాణ ,చోళ రాజుల శాసనాలు కన్పిస్తున్నాయి. ఇవి ఎక్కువగా తమిళ భాషలో ఉన్నట్లు శాసన పరిశోధకులు గుర్తించారు. అందరూ స్వామికి విశేష దానాలు  సమర్పించిన వాళ్లే. వానిలో  అర్వాచీనమైనది క్రీ.శ 802 లో  పల్లవరాజు నందివర్మ వ్రాయించిన శాసనం .కాని ఇన్ని శాసనాల్లో వేటి లోను గుడిమల్లం పేరు ప్రస్తావించబడలేదు. ఈ గ్రామం పేరు ను విప్రపిట( బ్రాహ్మణ అగ్రహారం) అని మాత్రమే  శాసనాల్లో పేర్కొనడం జరిగింది.
  
  
                  నమూనా శిల్పం 

           లింగ దర్శనం.:-----        ముఖమండప,అంత్రాలయాల కంటే గర్భగుడి ఐదడుగులు లోతు గా ఉంటుంది.  ఈ గర్భగుడి లో పరశురామేశ్వర   లింగము  ముదురు ఎరుపు, నలుపు రంగు కలసిన కాఫీరంగు లో ప్రకాశించే దృఢమైన రాతిపై చెక్కబడి ఉంటుంది. ఈ లింగము ఎత్తు ఐదడుగులు,అడుగు మందము కలిగి ఉంది. లింగము ముందు భాగము లో శివుడు స్ధానక ఆకృతి లో, అపస్మార పురుషుని భుజాలపై ఎక్కి నిలబడి ఉన్నాడు. ఈ శివుని  కుడిచేతి లో  వెనక కాళ్లు పట్టుకోవడం వలన తలక్రిందు గా వ్రేలాడు తున్న గొఱ్ఱె ,ఎడమ చేతిలో పానపాత్ర,   ఉంది. ఎడమభుజానికి పరశుగొడ్డలి వ్రేలాడుతోంది. చెవులకు  ఏడు అంచెలు గలిగిన రింగు లు వ్రేలాడుతున్నాయి. జడలు ముడివేసి  తలచుట్టు చక్రాకారంగా ముడివేయబడి ఉన్నాయి. మెడలో కంఠహారం ప్రకాశిస్తోంది.మోకాళ్ల పైకి  ధోవతీ ని  గోచీ పెట్టి  బిగించి ,  నడుము చుట్టు వస్త్రమేఖల ను  కట్టి అంచులను  వదిలి పెట్టాడు. వస్త్రాన్ని ధరించినా శరీరం లోని లోపలి భాగాలు స్పష్టంగా కన్పిస్తూనే ఉన్నాయి. ఈ రూపాన్ని సమష్టి గా చూస్తుంటే శివుని వలే కాకుండా  ఒక మహావీరుడైన వేటగాని వలె కన్పిస్తున్నాడు.  ఇతనికి యజ్ఞోపవీతం లేకపోవడం గమనించవలసిన ప్రత్యేకత.   ఈ శివలింగానికి పానమట్టం లేదు.
                    
                      గజపృష్ట విమానం

        ఉజ్జయిని లో 3వ శతాబ్దం లో లభించిన కొన్ని రాగి నాణేలపై ఈలింగాన్ని పోలిన చిత్రం ఉన్నట్లు చరిత్ర చెపుతోంది. మధుర మ్యూజియం లో     1 వ శతాబ్దానికి చెందిన ఒక శిల్పం గుడిమల్లం  శిల్పాన్ని పోలి వుంది. ఛంద్రగిరి రాజమహల్ లోని మ్యూజియం లో ఈ లింగానికి ప్రతి కృతి ఉంచబడింది.
                         
                                 
                                        ఆలయశిఖరం లో ఒకభాగం


                శివునకు పానమట్టం తొలినాళ్ల లో ఉండేది కాదని, స్త్రీ పురుష అవయవాలను వేరు వేరు గా పూజించడం గుప్తుల ముందు యుగం లో ఉండేదని, రిలిజియన్  ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ అనే  పుస్తకం లో ఆర్.కే. బెనర్జీ వ్రాశారు. ఈ ఆలయశిల్ప నిర్మాణం బౌద్ధ, జైన శిల్పకళకు దగ్గరగా ఉంటుంది.


            
                            ఆలయ ధ్వజస్ధంభం          
       స్ధలపురాణం :-------        పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి ని సంహరించాడు. మళ్లీ తండ్రి ఇచ్చిన వరం తో తల్లి ని బ్రతికించుకున్నాడు. కాని  తల్లి ని చంపిన నందుకు అవమానభారంతో తో బాధపడుతూ ప్రాయశ్చిత్తం కోసం  , ఋషుల సలహా ననుసరించి శివుణ్ణి ఆరాధించడానికి బయలుదేరాడు. అత్యంతప్రయాస తో అడవి మధ్యలోని ఈ శివలింగాన్ని  దర్శించాడు. ఈ ప్రాంతంలోనే  ఒక సరోవరాన్ని నిర్మించుకొని, దాని ఒడ్డునే  తపస్సు ప్రారంభించాడు. ఆ సరోవరం లో ప్రతిరోజూ ఒక్క పుష్పమే పూసేది . దాన్ని శంకరునికి పూజాసమయం లో సమర్పించేవాడు పరశురాముడు
                                  అడవి జంతువులనుండి ఆ సరోవర పుష్పాన్ని కాపాడడానికి చిత్రసేనుడనే  ఒక యక్షుని కాపలాగా నియమించాడు పరశురాముడు.దానికి బదులు గా ఆ  యక్షునకు ప్రతిరోజు ఒక జంతువును,కొంత పానీయాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.
                         
           
                          ఆలయప్రవేశ ద్వారం

          ఒకరోజు బ్రహ్మదేవుని ఉపాసకుడైన ఆ యక్షుడు, పరశురాముడు రాకముందే ఆపూవు తో శంకరుని పూజించాడు. అందుకు కోపగించిన పరశురాముడు యక్షునితో పోరాటానికి దిగాడు. వారిద్దరిమధ్య యుద్ధం  14 సంవత్సరాలు జరిగింది. విజయం నిర్ణయం కాక పోవడం తో శివుడు ప్రత్యక్షమై ఆ ఇరువురిని తనలో కలుపుకున్నాడు.  అందుకే  శివలింగంపై నున్న పరశురాముని చేతుల్లో  గొఱ్ఱె. పానపాత్ర, పరశువు కన్పిస్తున్నాయి.  ఆ యుద్ధం జరిగిన ప్రదేశం పల్లమై ఐదు అడుగుల గొయ్యి ఏర్పడింది.  అదే గుడి పల్లమై   గుడిమల్లం గా మారింది.అక్కడే శివుడు పరశురామేశ్వరుడై పూజలందు కుంటున్నాడు.
                    చిత్రసేనుడే బ్రహ్మ యని, పరశురాముడే విష్ణువని, పైన శంకరుడని, భావించిన భక్తులు ఈ శివ లింగాన్ని బ్రహ్మ, విష్ణు, శివాత్మకంగా పూజిస్తున్నారు.
 ఆలయ ప్రత్యేకత:-----.                 ఆలయం  ప్రవేశ గోపురం పడమటి వైపుకు ఉంటుంది. స్వామి ఆలయం లో తూర్పు కు తిరిగి ఉంటారు. కాని ఆలయం లోకి భక్తులు దక్షిణ ద్వారం గుండా ఉత్తర ముఖంగా ప్రవేశిస్తారు.
                        దేవాలయ నిర్మాణంలో తూర్పు వైపున  ఉంచిన కిటికీ లోనుంచి  సంవత్సరానికి రెండు సార్లు  ఉత్తరాయణ , దక్షిణాయనాల్లో, సూర్యకిరణాలు సూటిగా వచ్చి స్వామి  నుదుటమీద ప్రసరిస్తాయి.
                              మరొక  ప్రత్యేకత  ---- ఏమిటంటే, ఆలయ గర్భగుడి లో ఒక చిన్న నీటి తొట్టి ఉంది. ప్రతి 60 సంవత్సరాలకొక సారి ఆ నీటి తొట్టి లోనికి హఠాత్తుగా ఎక్కణ్ణుంచో నీళ్లు వస్తాయట. ఆ నీళ్లు  ఐదు అడుగుల స్వామి శిరస్సు వరకు పెరిగి నాలుగ్గంటల్లో మాయమై పోతాయట. ఈ నీటి రాక, పోక కూడ  ఎక్కణ్ణుంచో ఎవరికీ తెలియదు. ఈమధ్య 2005 డిశంబరు 4 వ తేది ఆలయం నీటితో నిండినట్లు  భా.పు. శా. అటెండరు రిజిష్టరు లో నమోదు చేశాడు. ఈ దృశ్యాన్ని1945 లో తాను చూచినట్లు 80 సంవత్సరాలు దాటిన గ్రామస్తులు చెపుతున్నారు. ఈ అవసరాన్ని అంటే 60 సంవత్సరాల కొకసారి వచ్చే ఈ అభిషేక జలాన్ని నింపడానికే గర్భగుడిని ఐదు అడుగులు పల్లం గా నిర్మించారేమో ననే అనుమానం కలుగుతోంది. ఏమో మరి.
             
           ఆలయం లో స్వామి వారి నగలు  భద్రపరచడానికి  గోడ లోపల తయారు చేసిన లాకరు నిర్మాణం చూస్తే ఆనాటి  శిల్పుల నిర్మాణ కౌశలం  మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  ఆలయనిర్మాణానికి వాడిన 42+ 21+6 రాతిపలకల్లో ఒకదానిని  ఒక నిర్ధిష్ట ప్రదేశం లో తొలగిస్తే  లోపల విశాలమైన వేదిక  నగలు భద్రపరచే లాకరుగా  ఉపయోగపడుతుంది. అక్కడున్న అటెండరు ఆ రాయిని తొలగించి లాకరుని చూపిస్తుంటే ఆశ్చర్యపోవడం మా వంతయ్యింది.
                             ఆలయ విమానం గజపృష్ట ఆకృతి లో నిర్మించబడి, అది యధాతథం గా గర్భగుడి లోనికి దించబడింది. అంటే గర్బగుడి కూడ గజపృష్టాకారం లో నిర్మించబడటం ఈ ఆలయ ప్రధాన ప్రత్యేకత.
                                   ఆలయవిమానం గజపృష్టాకారం లో నిర్మించబడటం పైన మూడు గోపురాలుండటం   1,2 శతాబ్దాల సంప్రదాయమని, ఘంటశాల అగస్త్యేశ్వరాలయాన్ని గురించి  వ్రాస్తూ చెప్పుకున్నాం.ఒక్క తంజావూరు బృహదీశ్వరాలయ గోపురమే రెండవదని చెప్పాం. కాని ఆ వరుస లో మొదటిది ఈ గుడిమల్లం ఆలయగోపురం గా గుర్తించవలసి వస్తోంది.
                           ఈ త్రవ్వకాలను పర్యవేక్షించిన భారతీయ పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్  డా.ఐ. కె శర్మ గారు ఈ విగ్రహము అగ్నిరుద్ర శివుడని, పరశురాముడు కాదని , స్వామి కళ్లు ఆయన నుదుటి పైకి కేంద్రీకరించబడి ఉండటం వలన  ఈయనను విరూపాక్షు డని కాని, యోగ దక్షిణామూర్తి యని గాని చెప్పవచ్చని అభిప్రాయ పడ్డారు.
               ఆలయ ప్రాంగణం లో  పార్వతీదేవి, వల్లీ ,దేవసేనా సమేత సుబ్రమణ్యస్వామి, సూర్యభగవానుని ఉపాలయాలు ఉన్నాయి. ఈ సూర్యదేవాలయం  ప్రధాన దేవాలయానికి  ఈశాన్యం గా, పరశురామేశ్వరునికి అభిముఖం గా నిర్మించబడింది.
                             

                               శ్రీ సూర్యనారాయణ స్వామి దివ్య మూర్తి.
  

     ఏమైనా  తప్పనిసరిగా చూడవలసిన  ఒక అద్భుత, అపురూప ఆలయం ఇది.*********************************************************************************

No comments:

Post a Comment