Wednesday 30 January 2013

జమలాపురం శ్రీ శ్రీ వేంకటేశ్వరస్వామి


                          

                 Jamalapuram Sri Venkateswara Swamy Darsanmam


                                     జమలాపురం    శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం.
                               
                        
जमलापुरं श्री वेंकटेश्वरस्वामि दर्शनम्.



                                       ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం లో  కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువు గా వెలసి  ఆర్తజన రక్షకుడై ,భక్తుల పాలిట కల్పవృక్షం గా , పూజ లందుకుంటున్నాడు.  ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు ఖమ్మంజిల్లాచినతిరుపతి  గా  సేవించుకుంటారు  ఈ పుణ్యక్షేత్రం  1000  సంవత్సరాలకు పూర్వమే సుదీర్ఘమైన పవిత్ర చరిత్ర కలిగి ఉన్నట్లు  చారిత్రక ఆథారాలు లభిస్తున్నాయి.
  
                                   ఆలయప్రవేశ తోరణ ద్వారం

                    స్థలపురాణం ;;----                 ప్రాచీన కాలం లో జాబాలి మహర్షి ఈ సమీపం లోని సూచీకొండ పై నున్న వైకుంఠ గుహ లో శ్రీవేంకటేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. జాబాలి తపస్సు కి  సంతోషించిన  స్వామి మహర్షి కోరిక మేరకు సాలగ్రామ రూపుడై  ఆ పర్వతం మీద కొలువు తీరాడు. జాబాలి మహర్షి చిరకాలం  ప్రశాంతమైన  ఈ సూచీ పర్వతం పైనే ఉండి,స్వామిని సేవించి తరించాడు.
           
                                 జాబాలి మహర్షి తపస్సు చేసిన సూచీకొండ
   
                    నూట ఎనిమిది తిరుపతులలో  ఒకటి గా జాబాలి ఇచ్చట ఒక పుణ్యతీర్థమును ప్రతిష్టించెననియు, ఆ పుష్కరిణి లో స్నానం సర్వపాప హరణ మనియు చెప్పబడుతోంది. ఆయన కాలం లో ఇచ్చట ఉన్న వైకుంఠ గుహ, కైలాసగుహ ల్లో  ఒక గురుకులాశ్రమం కూడ నిర్వహించ బడి నట్లు జనశృతి.

             
                                   స్వామి సన్నిధికి మెట్ల దారి
               
                ఆయన అనంతరం శ్రీ వేంకటేశ్వర పదపద్మారాధకుడైన పరమభక్తుడు  భారద్వాజ గోత్రీకుడైన శ్రీ ఉప్పల  యజ్ఞ నారాయణ శర్మ   స్వామి అను గ్రహ పాత్రుడై స్వామి సేవ లోనే జీవించి తరించాడు.  వంశానుగతం గా  ఆ సంతతి లోని భారద్వాజ గోత్రీకులే స్వామిని సేవిస్తూ ,తరిస్తున్నారు.  వారిలో  ఆరవ తరం వాడైన అక్కుభట్టు   వారసత్వం గా వస్తున్న అర్చకత్వాన్నే వృత్తి గా స్వీకరించాడు.  కొంత కాలం గడిచింది .వార్థక్యం వలన ఎత్తైన సూచీకొండ ను ఎక్కలేక ఒకరోజు నైవేద్యం తీసుకెళుతూ, వెళుతూనే  మార్గమథ్యం లో పడిపోయాడు.

             
                                              ఆలయ విమానం

               వార్థక్యం వలన నడచుకుంటూ పైకి వెళ్లలేక, ఆకలైనఛో దేవుడే దిగి వచ్చి, నైవేద్యాన్ని, స్వీకరిస్తాడులే అని అక్కడ నుంచే నివేదన  పెట్టాడు. కాని స్వామి చెంతకు వెళ్లి నివేదన అందించ లేకపోయాననే నిరాశ తో, బాధ తో, ఇక నీ గతి అంతే.నా బ్రతుకింతే అనుకొనుచు దుఖము తో వెనుదిరిగి నాడు. ఇంతలో ఆకాశవాణి   గంభీరధ్వని తో ఇలా పలికింది.  నేను నీ వెంట వస్తున్నాను. నీవు వెనక్కు తిరక్కుండా ముందుకు  నడవ వలసిందని స్వామి అక్కుభట్టును ఆదేశించాడు. స్వామి వెంటరాగా అక్కుభట్టు ఆనందం తో గ్రామం వైపు ప్రయాణమయ్యాడు.
                      
                                       శ్రీ స్వామి వారి  పాదముద్ర
           
  కొంతసేపటికి పిడుగుపాటు వంటి ఒక పెద్ద ధ్వని వినబడింది. ఒక్కసారిగా ఆకాశమంతా గొప్పకాంతి తో నిండిపోయింది. ఆ కాంతి చ్ఛట కొండపైకి దిగింది. అక్కుభట్టు వెనక్కితిరిగి చూశాడు. ఆ కాంతి పుంజము  నిలిచిన చోట మహాద్భుతంగా శ్రీ వేంకటేశ్వరుని పాదముద్ర   దర్శనీయమైంది. శ్రీ స్వామి స్వయంభువు గా సాలగ్రామ రూపుడై అక్కడ వెలి శాడు



                                   శ్రీ స్వామి వారి దివ్యమంగళవిగ్రహం


          . అక్కుభట్టు ధన్యుడైనాడు.  ఆనాటి నుండి భక్తులు నిత్య కళ్యాణ  రూపుడైన  ఈ వేంకటేశ్వరుని  దర్శించి, పూజించి, తరిస్తున్నారు. తదాది గా ఉప్పల వంశజు లే స్వామి సేవలో తరిస్తూ అర్చకత్వ,ధర్మకర్తృత్వ బాధ్యతలను ఎంతో నేర్పుగా నిర్వహిస్తున్నారు.

                    
                           స్వామి వారి ద్వారపాలకులు జయ విజయులు
                               
            చారిత్రక ప్రాథాన్యం ;;------             కాకతి ప్రతాప రుద్ర చక్రవర్తి తన జైత్రయాత్రా సందర్బం గా ఓరుగల్లు నుండి ఖమ్మం మీదుగా ప్రయాణిస్తూ, కనిగిరి దుర్గమందు విడిది చేసి, అక్కడ ఒక కోటను,పళ్లెరముల బావిని  శివ కేశవ దేవాలయములను నిర్మింపజేసెను. తదనంరము తిరువూరు మార్గమున జమలవాయి దుర్గమునకు ప్రయాణమై ,మథ్యలో జాబాలి   పుష్కరిణి ని బాగు చేయించి, దేవాలయమును పునరుధ్ధరించి  సదాశివుని గుట్టపై ఈశ్వరుని ప్రతిష్టించి కోటను నిర్మించినట్లు  చారిత్ర కాధారాలు కలవని స్థలపురాణం చెపుతోంది.
              
              
              
                                           ఆలయ దృశ్యం

          అనంతరం రెండువందల సంవత్సరాలకు విజయనగర చక్రవర్తి , సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు  తన జైత్ర యాత్రా సందర్భంగా మార్గ మథ్యం లో జమలాపుర దుర్గాన్ని,   శిథిలమైన ఈ ఆలయాన్ని చూచి  విచారించి పునరుద్ధరణ పనులను చేయించి నట్లుగా శాసనముల వలన తెలియు చున్నది.          
                                            స్ధల పురాణ ఫలకం
             
                      సుమారు ఒక శతాబ్దం క్రితం తాడేపల్లి రాజు గారు దైవదర్శనానికి వచ్చి, శిథిలా వస్థ  కు చేరిన ఆలయాన్ని పునరుద్ధరింప జేశారు. శిఖరప్రతిష్ట చేసి, ఉత్సవాలు జరిపించి, నిత్య నివేదన కు భంగం కలగకుండా భూ వసతి ని కూడ కల్పించారు.  క్రీ.శ. 1964 లో  దేవా దాయశాఖ ఆథ్వర్యం లో  పునరుద్ధరణ పనులు  చేపట్టి  శ్రీ స్వామి వారి  ఆలయము,  శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయాలను పునర్నిర్మించారు.  క్రీ.శ 1975 లో శ్రీశ్రీశ్రీ శృంగేరీ పీఠాథిపతి శ్రీ శంకరాచార్యుల వారి దివ్యాశీస్సులతో,  అప్పటి వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ ఉప్పల కృష్ణమోహన్ శర్మ దంపతులచే మహాసంప్రోక్షణ, విగ్రహప్రతిష్ట ,ధ్వజప్రతిష్ఠాది కార్యక్రమాలు వైభవం గా నిర్వహించబడింది
                  
                           ఉపాలయం లో కొలువు తీరిన వినాయకుడు
              
             ఇప్పటికీ  ఈ ఆలయం  వేంకట ఈశ్వర నిలయం గానే సేవించ బడుతోంది. ఒకే ప్రాంగణం  లో శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తో పాటు  శివాలయం కూడ  మనకు దర్శనమిస్తుంది.  స్వామికి ఎడమవైపునున్న శ్రీ అలమేలు మంగమ్మ కొలువు తీరి ఉంది. ఆలయ  ప్రవేశం లో తోరణ ద్వారానికి రెండు వైపులా రెండు ఉపాలయాలు  ఎదురదురు గా నిర్మించబడ్డాయి. కుడివైపు ఉపాలయం లో విఘ్ననాయకుడైన వినాయకుడు  సాక్షిగణపతి వలే కొలువు తీరి భక్తులను కంటికి రెప్పవలె కాపాడుతుంటాడు.
                  
              
                               ఉపాలయం లో కొలువు తీరిన వీరహనుమాన్                

           ఎడమవైపు ఉపాలయం లో రామబంటు  వీరాంజనేయుడడై ఆర్తజనరక్షకుడై కొలువు తీరి ఉన్నాడు.  దూరం గా అశ్వత్థవృక్షం క్రింద నాగశిల పూజ లందుకుంటోంది. వాహన పూజలు ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆటోలు , కార్లు  ద్విచక్రవాహనాలు ఎప్పుడూ పూజలకు బారులు తీరి ఉంటాయి. 

  
                                    నాగ శిల్పము

               వసతి సౌకర్యాలు ;;-----          తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారం తో యాత్రికుల వసతి కోసం 12 గదుల ధర్మశాల నిర్మించబడింది. కళ్యాణమండపం కనుల పండువగా రూపుదిద్దుకుంది. భక్తుల సౌకర్యార్థం కళ్యాణకట్ట, స్నానాలగదులు నిర్మించబడ్డాయి. కొండకు చేరుకోవడానికి సుందరమైన సోపాన పంక్తి  అమర్చబడ్డాయి .
            
                                పొంగళ్ల మండపము
              
            ప్రతి శనివారం వందలాది భక్తులు స్వామిక పొంగళ్లు సమర్పించుకోవడం ఆనవాయితీ. అందుకు వీలుగా  భక్తుల విరాళాలతో పెద్ద పొంగళ్ల మండపం నిర్మించబడింది. ఆలయం పరిసరాల్లో ఎప్పుడూ తిరునాళ్ళ వాతావరణమే కనిపిస్తుంది. బొమ్మలు,మిఠాయిలు  ప్లాస్టిక్ సామానులు, దేవుని పటాలు, పసుపు ,కుంకుమ ,గాజులు అమ్మే దుకాణాలు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. గిరి ప్రదక్షిణం చేయవచ్చు. అనుకూలంగా రహదారి ఉంటుంది. అలాగే  ప్రధాన ఆలయం వరకు ఘాట్రోడ్డు కూడ ఉంది.
                      

                                     అద్దాలమేడ లో శ్రీ వేంకటేశ్వరుడు

            శ్రీ స్వామివారి పవళింపు సేవకు అందమైన అద్దాల గది భక్తుల విరాళాలతో  మనోహరంగా   తీర్చిదిద్దారు .

                       పొంగళ్లమండపం ముందు శ్రీ కృష్ణ దేవరాయల వారి కాంస్య విగ్రహం

                ప్రత్యేక ఉత్సవాలు ;;----           ప్రతి శనివారము స్వామివారికి ఉత్సవమే. అంతే కాకుండా వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు, చైత్రశుద్ధ సప్తమి రోజున జరిగే కళ్యాణోత్సవము, శరన్నవరాత్రి ఉత్సవాలు ఫ్రత్యేక ఉత్సవాలు. ఈ  ఉత్సవాలు,పూజలు అన్నీ ఋగ్వేద స్మార్తాగమానుసారం గా జరుగుతాయి.  ఈ ఉత్సవాల్లో  భక్తులు వేలాది గా పాల్గొని. స్వామి అనుగ్రహానికి పాత్రులౌతుంటారు.


                        ఆలయ రమణీయ దృశ్యం

              రవాణా సౌకర్యాలు.::------              ఈ పుణ్య క్షేత్రానికి చేరుకోవడానికి మథిర, మైలవరం,తిరువూరు లనుండి ఆర్టీసీ పెక్కు సర్వీసులను నడుపుతోంది . విజయవాడ ,కంచికచర్ల నుండి కూడ ఆర్టీసీ సర్వీసులున్నాయి. కంచికచర్లనుండి సుమారు 35 కి.మీ దూరం లోను.విజయవాడ.ఖమ్మం ల నుండి సుమారు 80 కిమీ దూరంలోను, ఎర్రుపాలెం రైల్వేష్టేషన్ నుండి 5 కి.మీ దూరం లోను ఈ పుణ్యక్షేత్రం ఉంది. స్వంత వాహనం ఉంటే ప్రయాణం సుఖకరం గా ఉంటుంది. కాఫీ, భోజన హోటళ్లు  గ్రామీణతరహా  లోనే ఉంటాయి.
        ఖమ్మం జిల్లా లో భద్రాచలం తరువాత పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రం ఈ జమలాపురం. శ్రీనివాసుడు ఎక్కడ వున్నా శ్రీ  నివాసుడే కదా.!!!
                    
                                  
                                   




                                      श्रिय: कान्ताय कळ्यणनिधये निधये2र्धिनाम् !
                      श्री वेंकटनिवासाय श्रीनिवासाय मन्गळम् !!








*********************************************************************************

No comments:

Post a Comment