Saturday, 9 February 2013

శ్రీ సోమారామం- గునుపూడి పంచారామక్షేత్రం


                         
                                        Sree  Somaramam - Gunupudi (Bhimavaram)


                                              श्री सोमारामम् -गुनुपूडि (भीमवरं)
                                                          
                           శ్రీ సోమారామం   - గునుపూడి( (భీమవరం
                                  

                            ఆంధ్రదేశంలోని పంచారామ క్షేత్రాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పాతనగరం లోని గునుపూడి లో వెలసిన సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం ఒకటి. ఈ ప్రాంతం  ఇక్ష్వాకుల, తూర్పు చాళుక్యుల,గజపతుల,  విష్ణుకుండినుల, రెడ్డిరాజుల, శాలంకాయనుల వంటి రాజుల ఏలుబడి లో మహోన్నత సంస్కృతి ని సంతరించుకున్నది.
  

                                    శ్రీ స్వామి వారి ఆలయ రాజగోపురం

             స్థలపురాణం  ::-----        తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు. ఈ తారకుని మెడలోని అమృతలింగం అతనికి ప్రాణరక్ష గా  ఉండేది. ఆ గర్వం తో ఆ రాక్షసుడు  ముల్లోకాలను అతలాకుతలం చేయసాగాడు. ఆ రాక్షసుని బాధలను తాళలేక దేవతలు వాని బారి నుండి కాపాడమని బ్రహ్మదేవుని ప్రార్ధించారు. అప్పుడు  బ్రహ్మదేవుడు శివభక్తుడైన    అతనిని సంహరించాడానికి శంకరుడే సమర్దుడని చెప్పి, అతన్ని ప్రసన్నం చేసుకోవలసిందిగా దేవతలను పంపించాడు.   దేవతల ప్రార్దన ను మన్నించి  తారకుని ఎదుర్కోవడానికి కుమారస్వామి ని   సేనాథిపతి గా నియమించి,యుద్ధానికి పంపించాడు శంకరుడు.       తారకాసురుని తో జరిగిన యుద్దం లో కుమారస్వామి తన ఆయుధం తో తారకాసురుని కంఠమాలలో ఉన్న అమృతలింగాన్ని ఛేదించాడు. ఆ ఉపాసనాలింగం ఐదుముక్కలై ఆంధ్రదేశం లోని ఐదుప్రదేశాల్లో పడింది. వాటినే పంచారామ క్షేత్రాలు గా  పిలుస్తున్నాం. అవి వరుసగా ఒకటి గునుపూడిలోని సోమారామం, రెండు పాలకొల్లు లోని క్షీరారామం , మూడు అమరావతి లోని అమరారామం , నాలుగు ద్రాక్షారామం లోని భీమారామం ,ఐదు సామర్లకోట లోని కుమారారామం గా  సేవించబడుతున్నాయి .
                  
        
                              ఆలయం లోపల నుండి రాజగోపుర రమణీయ దృశ్యం
            
                 తారకాసురుని వథానంతరం  గునుపూడి లో ఒక అమృతలింగ శకలం పడింది. స్వయంవృద్ధి లక్షణం కల్గిన ఆ శకలాన్ని అప్పటికే గురుపత్నీ అనుగమనదోషం తో పీడించబడుతున్న చంద్రుడు  వెంటనే ఆలింగాన్ని గునుపూడి లో ప్రతిష్ఠించి, లింగం యొక్క పెరుగుదలను నిరోధించి  పూజాదికాలు నిర్వహించాడు. చంద్రునిచేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు కావున ఈయన సోమేశ్వరుడు గాను, ఈ ఆరామము  సోమారామము గాను కీర్తించబడుతున్నాయి.

                           శ్రీ సూర్య భగవానుని దివ్యమంగళ విగ్రహం

               ఆలయప్రత్యేకత ;;___   చంద్రుడు ప్రతిష్ఠించడం వలన ఈ సోమేశ్వరుడు అమావాస్య రోజున గోధుమ వర్ణం లోను ,పౌర్ణమి రోజున శుద్ధస్పటిక వర్ణం గాను రంగులు మారుతుంటాడు. ఇది ఒక అద్భుతమైనవిషయం.
             
         
                                          శ్రీ సోమేశ్వర స్వామి వారు
              
                 మరొకప్రత్యేకత ఏమిటంటే దేశం లో ఎక్కడాలేని విధంగా సోమేశ్వరలింగం  గర్భాలయం పైన నిర్మించబడిన రెండవఅంతస్తులో ఖచ్చితం గా స్వామివారి తలపై భాగాన అన్నపూర్ణాదేవి విగ్రహం ప్రతిష్ఠించబడిఉంది. పైకి వెళ్లడానికి చక్కగామెట్లు, పైన విశాలమైన ముఖమండపము నిర్మించబడ్డాయి. ఇది ఈ సోమారామం యొక్కప్రత్యేక విశిష్టత గా  పండితులు చెపుతున్నారు. ఈశ్వరుని శిరస్సుపై  గంగను ధరించాడనటానికి ఇది ప్రతీకయని భక్తులు భావిస్తున్నారు.
          
                           శ్రీ అన్నపూర్ణాదేవి దివ్యమంగళ రూపం

                 మరొక ప్రత్యేకత ఏమిటంటే దేవాలయానికి ఎదురుగా 15 అడుగుల ధ్వజస్థంభం ప్రతిష్ఠించబడిఉంది.ధానిపై నందీశ్వరుడు ఆసీనుడై భక్తలకు ఆనంద, ఆశ్చర్యాలను కల్గిస్తుంటాడు. అంత ఎత్తులో నంది ఉండటం ఈ ఆలయం లోనే మనకు కన్పిస్తుంది. అన్నపూర్ణాదేవి పై అంతస్తులో ఉన్న  కారణం గానే నంది ద్వజస్థంభం ఎక్కి కూర్చున్నాడని జనశృతి.
              

                                          శ్రీ పార్వతీ దేవి అమ్మవారు

  ఈ సోమారామానికి క్షేత్రపాలకుడు శ్రీ జనార్ధనస్వామి. అందువలనే ఇచ్చట ప్రతి ఏటా ఎన్నోవివాహాలు జరుగుతుంటాయి. ఇక్కడ వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో ఆనందంగా , శుభమయం గా సాగిపోతుందనే నమ్మకం ఈ ప్రాంతం లో బలంగా ఉంది.
                       
                             శ్రీ  అన్నపూర్ణాదేవి కొలువు తీరిన రెండవ  అంతస్తు
  
                     స్వామి వారి ఆలయానిక తూర్పు వైపు 7 అంతస్తుల గాలి గోపురం ఉంది స్వామివారికి ఎడమవైపు ఉత్తరముఖం గా పార్వతీదేవి,  ఈశాన్యం లో నవగ్రహాలయం, ఎడమవైపు ఉపాలయం లో జనార్ధనస్వామి , ప్రక్కనే ఉన్న ఉపాలయం లో ఆదిలక్ష్మి, దర్శనమిస్తారు. గాలిగోపురానికి ఇరువైపులా స్వామి వారికి అభిముఖం గా కుడివైపు  సూర్యభగవానుడు, ఎడమవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువు తీరారు .ఈ ఆలయానికి తూర్పువైపున చంద్రపుష్కరిణి అనే తటాకం ఉంది. దీనినే సోమగుండం అని కూడ పిలుస్తారు. దీనిలో స్నానం చేయడం సర్వపాపహరమని భక్తుల నమ్మకం.

           
                                                      పురావస్తు శాఖ గుర్తింపుకు సంకేతం

                 చారిత్రక నేపథ్యం.::::------                         ఈ ఆలయాన్ని గురించి బ్రహ్మాండపురాణం, శ్రీనాథుని భీమఖండాల్లో  ప్రస్తావించబడింది.  శ్రీనాథుని కాశీఖండం లో అగస్త్యమహర్షి గోదావరీ పరీవాహ ప్రాంతం లో సంచారం చేస్తూ క్షీరారామం,సోమారామాలను దర్శించినట్లు వర్ణించబడింది. తూర్పు చాళుక్య రాజులలో ప్రసిద్ధుడైన చాళుక్యభీముడు (  క్రీ.శ .882-922) ఈ సోమారామ, క్షీరారామాలను నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది.తూర్పు చాళుక్యుల తరవాత వెలనాటి చోళులు,కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు కూడ మన సంస్కృతీ పరిరక్షణ లో ప్రథానభూమిక ను పోషించారు.
       
    
                                   ఆలయం ఎదురుగా స్ధంభం పై గంభీరం గా కూర్చున్న నందీశ్వరుడు

  
               క్రీ.శ 10 వశతాబ్ధం లోతూర్పుచాళుక్యల కాలం లో సోమేశ్వర,భీమేశ్వర దేవాలయాలు వర్థిల్లాయి. వీరిలో భీమ నామథేయులు చాలామంది ఉన్నారు.మొదటి చాళుక్య భీముడు భీమప్రతాప బిరుదాంకితుడు. భీమ,ముమ్మడిభీమ ,బిరుదులు ధరించిన చాళుక్యరాజు లలో విమలాదిత్యుడు ప్రముఖుడు. అట్టి వీరి పేర ఆలయాలు, గ్రామాలు వెలిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, భీమవరం లోని భీమేశ్వరాలయం  వీరికాలం లోనిర్మించబడినవే.జటాచోళ భీమునిఫాలన లో ఆ పేరు  స్ధిరపడినట్లు గునుపూడి శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీ.శ.1434  లో దేవకుమారుడు శింగన్న  అనే భక్తుడు ఎన్నో బహు మానా లిచ్చినట్లు ఆలయానికి ఎదురుగా మండపస్థంభం మీద నున్నశాసన పద్యం వలన తెలుస్తోంది.

                
ప్రత్యేక ఉత్సవాలు:::----     మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులు శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతినిత్యము మహన్యాస  పూర్వక అభిషేకము,కుంకుమ పూజలు జరుగుతుంటాయి.  పర్వదినాలలో శ్రీ సోమేశ్వర స్వామికి లక్షబిల్వార్చనలు, అన్నపూర్ణాదేవి కి కుంకుమార్చనలు,జరుగుతాయి. పుణ్యదినాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమము  ఉంటుంది.
        

                                            విద్యుత్కాంతుల్లో శ్రీ స్వామివారి కళ్యాణ మండపము

              రవాణాసౌకర్యాలు.::-----             పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్టణం భీమవరం. ఈ భీమవరం పట్టణం  లో రెండు రైల్వేష్టేషన్లు ఉన్నాయి. సర్కార్  ఎక్స్ ప్రెస్ ఈ పట్టణం గుండానే వెళుతుంది.  రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి ఈ పట్టణానికి రవాణాసౌకర్యం ఉంది.  భోజన వసతి సౌకర్యాలు బాగానే ఉంటాయి.


 ***************************************************************************************************************************************************************

No comments:

Post a Comment