Saturday 9 February 2013

భీమవరం -మహిషాసురమర్ధనీ సమేత భీమేశ్వర స్వామి


          
Bhimavaram -Mahishasursmardhini sameta Bhimeswara Swamy.


          भीमवरं - महिषासुरमर्थनि समेत भीमेश्वरस्वामि.


    భీమవరం –   మహిషాసుర మర్థనీ  సమేత భీమేశ్వర స్వామి
     

                 భీమవరం ఆంధ్రదేశం లో ప్రసిద్ధి పొందిన పట్టణాల్లో ఒకటి.  భీమవరానికి ఆ పేరు రావడానికి కారణభూతమైన దైవం ఈ భీమేశ్వరుడు. ఈ స్వామి ఇచ్చట మహిషాసుర మర్థనీ సమేత భీమేశ్వరుడు గా  తెలుగు భీముడు గా కొనియాడబడుతున్న చాళుక్య భీముని చేత ప్రతిష్ఠించబడి, పూజలందుకుంటున్నాడు.
        
   
                                  ఆలయ రాజగోపురం
             
               చారిత్రక నేపథ్యం :;---       పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇతి హాస కాలం లో దండకారణ్యం గా ఉండేదని, మౌర్యుల కాలం లో  ఈ ప్రాంతాన్ని మానవ నివాసయోగ్యం గా తీర్చిదిద్దారని చరిత్రకారులు భావిస్తున్నారువారి పరిపాలనాకాలం లోనే బౌద్దమతం ఈప్రాంతం లో వ్యాప్తి చెందింది. మౌర్యసామ్రాజ్య పతనానంతరం ఈప్రాంతం వారి సామంతులగు ఆంధ్ర శాతవాహనుల ఏలుబడిలోకి  వచ్చింది.
                
                                                                                  శ్రీ బ్రహ్మ
        
                శాతవాహనుల సామ్రాజ్యం క్షీణించిన తరువాత బృహల్పలాయనులవంశస్థులు శాలంకాయనులు  అథికారం లోకి వచ్చారు. ప్రస్తుతము ఏలూరు వద్ద నున్న దెందులూరు రైల్వేష్టేషన్ సమీపంలోని పెదవేగి, చినవేగి  ప్రాంతాలను కలిపి వేంగీపురం గా మార్చి ,దానిని రాజథాని గా చేసుకొని  పాలన కొనసాగించారు. ఆ కారణం గానే ఈ గోదావరి కృష్ణానదుల మథ్య  ప్రాంతానికి వేంగీమండలం అనే పేరు వచ్చింది. ఆ వేంగీమండలం లోనే ఈ భీమవరం  ఉండేది. శాలంకాయనుల తర్వాత విష్ణుకుండినులు ఈ ప్రాంతాన్ని పాలించారు.  7 వ శతాబ్ధి  ప్రారంభం లో రెండవ పులకేశి విష్ణుకుండినులను ఓడించి,   వేంగీమండలాన్ని వశపర్చు కున్నాడు. ఈ గోదావరీ ప్రాంతాన్నికైవసం చేసుకొని,పిఠాపురం ను రాజధాని గా  ప్రకటించి, తన సోదరుడు కుబ్జవిష్ణువర్ధనుని తూర్పుప్రాంతానికి రాజప్రతినిథి  గా ప్రకటించినట్లు చరిత్ర చెపుతోంది.
          
                    
                                                                          శ్రీ దత్తాత్రేయుడు

                     రెండవపులకేశి మరణానంతరం కుబ్జవిష్ణువర్దనుడు స్వతంత్రుడై ,తూర్పు చాళుక్య రాజ్యాన్నిస్థాపించాడు.  ఈ తూర్పు చాళుక్యులు 7 వ శతాబ్దం నుండి సుమారు పన్నెండు వందల సంవత్సరాలు  ఆంధ్ర దేశాన్ని పాలించారు. ఈ రాజులు  పిఠాపురం నుండి వేంగి అక్కడ నుండి రాజమహేంద్ర వరానికి రాజధానులను మార్చి పరిపాలనను విస్తరింపజేశారు. వీరిలో 9 వ శతాబ్దం లోపాలించిన చాళుక్య భీముడు మహావీరుడు.  కళాపోషకుడు. హిందూమతాభిమాని యైన ఈ రాజు  ఆంధ్రదేశం లో ఎన్నో దేవాలయాలను నిర్మించాడు. భీమేశ్వరుడు వీరి ఇలవేల్పు. వీరి బిరుద నామాలు కూడ" ముమ్మడి భీముడు," "బిరుదాంకభీముడు" అని  ఉండేవి.
    

                                                                      ఆలయ గోపురం               

            శ్రీ భీమేశ్వర దర్శనం :;---         ఈ చాళుక్య భీముడు నిర్మించిన నగరమే నేటి భీమవరం. ఈయన కట్టించిన ఆలయమే ఈ భీమేశ్వరాలయం గా చరిత్రకారులు చెపుతున్నారు. ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ 890-918 మథ్య కాలం లో నిర్మించబడి  ఉండవచ్చునని చారిత్రక అంచనా. ఈ దేవాలయ ప్రాంగణం లో లభించిన  శిలా సాక్ష్యాలను బట్టి ఈ ఆలయం చాళుక్యుల కాలం నాటి నిర్మాణమని పురావస్తుశాఖ వారు  ధృవపర్చారు.
              
                
                                      శ్రీ భీమేశ్వరస్వామి వారి దివ్య విగ్రహం

                    ఈ ఆలయం లో  స్వామి  శ్రీ భీమేశ్వరుని మూలవిరాట్ 5 అడుగుల ఎత్తు 
ఉంటుంది. స్వామి కి ఎడమవైపున ఉన్న ఉపాలయం లో  మహిషాసురమర్ధని చతుర్భుజాలతో  వైష్ణవ రూపిణి గా దర్శనమిస్తుంది.  ఈ అమ్మవారిలోని ప్రత్యేకత ఎడమ కుడి హస్తాలలో   చక్ర,శంఖాలను  ధరించి ఉండటం. విష్ణువు శంఖ చక్రాలను ధరిస్తాడు. అది కూడ కుడి చేతి లో  చక్రాన్ని, ఎడమచేతిలో శంఖాన్ని ధరిస్తాడు. చెన్నకేశవుడు మాత్రమే శంఖ చక్రాలను తారుమారు గా ధరిస్తాడు. ఇక్కడ అమ్మవారి చేతి లో శంఖ చక్రాలు ఉండటం, అవికూడ తారుమారు గా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత గా  చెపుతారు. ఈ విథమైన మూర్తి  మరి ఎక్కడా ఉండకపోవచ్చు. అందుకే అమ్మవారిని శక్తిస్వరూపిణి గా  పూజిస్తారు. ఆలయ ప్రాంగణం లోనే  శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ రాధాకృష్ణ ఆలయం ,శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలున్నాయి. గాలిగోపురానికి లోపలి వైపు భీమేశ్వరునికి అభిముఖం గా,   బ్రహ్మ,దత్తాత్రేయుడు దర్శనమిస్తారు.
     
                                మహిషాసుర మర్ధనీ అమ్మవారు

         ప్రత్యేక ఉత్సవాలు ::----     మహాశివరాత్రి కి శ్రీ భీమేశ్వర,మహిషాసురమర్ధని అమ్మవార్ల  కళ్యాణోత్సవాలు  అంగరంగ వైభవం గా, పాంచాహ్నిక దీక్ష తో  ఐదు రోజులు మహావైభవం గా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో రథోత్సవం, తెప్పోత్సవం  రోజుల్లో భక్తుల రద్దీ అధికం గా ఉంటుంది. కార్తీక మాసం లోను ,ధనుర్మాసం లోను స్వామివారికి గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
        


            
                                                         కళ్యాణ మండపం   

                      ఈ భీమేశ్వరాలయం ప్రాచీన ఆలయం అవడం,  ఈ ప్రాంగణం లోనే మరి రెండు ఆలయాలుండటం తో దేవాలయ ప్రాంగణం నిత్యం భక్తుల తో కళకళ లాడుతూనే ఉంటుంది.


                  *************************************************************

No comments:

Post a Comment