Wednesday 13 February 2013

వాడపల్లి - శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

                              VADAPALLI  -SREE LAKHMI NARASIMHASWAMI Aalayam.
                         
                     वाडपल्लि श्रीलक्ष्मीनरसिंहस्वामि आलयम्.

                                           వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.
                
              నల్గొండ జిల్లా లో  దామెరచర్ల మండలం లో విష్ణుపురానికి దగ్గర గా కృష్ణా – మూసీ సంగమ క్షేత్రం లో వెలసిన పుణ్యక్షేత్రమే వాడపల్లి. ఇది ఒక ప్రాచీన మహా నగరము. అందుకు నిదర్శనం గా ఈ ఆలయానికి ఎడమ వైపు,  ఊరిమథ్యలోను, శిథిలమైన కోట  గోడలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి.  ఇది 11,12 శతాబ్దాలలో గొప్ప ఓడరేవు గా ఉండేదని,వోడపల్లి కాలక్రమంగా వాడపల్లి గా, వజీరాబాద్ గా మారిందని చరిత్ర కారులు  భావిస్తున్నారు.
                       
                                 ఆలయప్రవేశ ద్వారం

                స్థలపురాణం ::::                ఇక్కడ కొలువైన దైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి.  ఈ స్వామి అగస్త్యప్రతిష్ట గా స్థలపురాణం చెపుతోంది.  ఈ ప్రాంతాన్ని పూర్వం బదరికారణ్యం గా పిలిచినట్లు  శాసనాధారాలు లభిస్తున్నాయి. ఆరువేల సంవత్సరాలకు పూర్వం   అగస్త్యమహర్షి  తన ధర్మపత్ని లోపాముద్ర తో శివకేశవులను తన పూజా కావిడి లో ఉంచుకొని ,  వారిని ప్రతిష్టించే పవిత్ర ప్రదేశం కొఱకు ముల్లోకాలు తిరుగుతూ,  భూలోకం చేరాడు. ఉత్తర కాశీకి వెళ్లే క్రమం లో ఈ  బదరికాశ్రమ ప్రాంతానికి చేరాడు ఈ పవిత్ర కృష్ణా, మూసీ సంగమ ప్రదేశం లోకి రాగానే   శ్రీలక్ష్మీ నరసింహస్వామి  ఈ ప్రదేశం లోనే ఉండదలచినట్లు ఆకాశవాణి విన్పించింది.  ఈ ప్రదేశం లోని పవిత్రతకు పులకించిన అగస్త్యుడు  శ్రీలక్ష్మీ సమేతుని గా నరసింహుని ప్రతిష్ఠించి.  ఈ సంగమ క్షేత్రం యొక్క పవిత్రతను ఇనుమడింప జేశాడని స్థలపురాణం.  
             
         
                     
                                           శ్రీ స్వామి   వారి      ఆలయ శిఖరం

                               మరాక కథనాన్ని అనుసరించి శ్రీ వ్యాస భగవానుడు ఈ బదరికావన ప్రశాంతత కు ఆకర్షించబడి, ఈప్రదేశ పవిత్ర ప్రభావం చేత శ్రీనరసింహుని ఉపాసిస్తూ దీర్ఘకాలం తపస్సు లో ఉండి పోయాడు. ఆనాడు హిరణ్య కశిపుని సంహరించి, ప్రహ్లాదుని రక్షించిన  శ్రీ మహావిష్ణువు యొక్క రౌద్ర మనోహరమైన నారసింహుని ఉగ్ర రూపాన్ని  దర్శించాలనే కోరిక  వ్యాస భగవానుని లో అంతకంతకు ఇనుమడించింది. మహర్షి  తపస్సు లోని తపనను ఎఱింగిన భక్తజనావనుడైన శ్రీహరి  ఆనాడు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత చెంచులక్ష్మి చెంతచేరినా, ఆపుకోలోని కోపం తో, ఉచ్ఛ్వాస నిశ్వాసలు  విడుస్తూ, ఉగ్రనరసింహుడై  మహర్షి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ ఆనందమయ కనులార దర్శించి. పులకించిన వ్యాసమహర్షి  ఆ రూపం తోనే ఈ బదరికాశ్రమం లో కొలువు తీర వలసింది గా నరసింహుని ప్రార్ధించాడు. మహర్షి కోరికను మన్నించి. శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీ నరసింహుడై కొలువు తీరి,భక్తులను ఆశీర్వదిస్తూ, కొలిచిన వారికి కొంగు బంగారమై ఆరోగ్య, సౌభాగ్యాలను ప్రసాదిస్తున్నాడు.
   
                             ఆలయ  ముఖమండపం                            

          ఆలయ ప్రత్యేకత ;;--     వాడపల్లి లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దక్షిణముఖం గా ఉంటుంది.  అంటే పూర్తి గా ఊరికి వెలుపల  మూసీనది ఒడ్డున ఊరివైపు నకు తిరిగి ఉంటుంది. ఆలయానికి గాలిగోపురం లేదు .  కారణం తెలియదు.చూడటానిక గుడి చిన్నదిగా కన్పించినా  ఏదో ఉన్నట్టుగా భావన కలుగుతుంది.  విశిష్ట వాస్తునిర్మాణం ఈ ఆలయ ప్రత్యేకత  గా విమర్శకులు వ్రాస్తున్నారు. గర్భగృహం లో శ్రీ లక్ష్మీ నరసింహుని దివ్యమంగళ విగ్రహం నయనమనోహరం గా దర్శనమిస్తుంది. ఐదున్నర అడుగుల అందమైన  శిల్పం లో మలచిన శ్రీలక్ష్మీనరసింహుని మూర్తి నిరాభరణుడైనా చిరునవ్వులు చిందిస్తూ,అత్యంత తేజస్వంతుడై భాసించడం భక్తులకు నయనానందకరం గా ఉంటుంది. మూర్తిని ఎంతసేపు చూసినా ఇంకా చూడాలని  అనిపించే అందమైన రూపం ఈ లక్ష్మీ నరసింహునిది.
                          
     

                  
                                శ్రీ లక్ష్మీ నరసింహస్వామి  దివ్య మంగళ విగ్రహం

               ఈ స్వామి వారికి ఎడమ వైపు ఒక దీప స్థంభం ఉంటుంది . దానిపై అర్చక స్వాములు రెండు దీపాలను వెలిగిస్తారు. ఒకటి స్వామి వారి   అభయహస్తం ఎత్తు లో ఉంటుంది. రెండవది  శ్రీ స్వామి వారి ముఖం కన్పించేటట్లు ముఖం ఎత్తులో వెలిగిస్తారు.  ఇక్కడ గమమనించవలసిన విషయమేమిటంటే, స్వామివారి ముఖం ఎత్తులో వెలిగించిన దీపం స్వామి వారి ఉచ్ఛ్వాస,నిశ్వాసల కనుగుణంగా  వెనక్కి, ముందుకు కదులుతూ ఉంటుంది. క్రింది వైపు వెలిగించిన దీపం కదలకుండా నిశ్చలం గా ఉంటుంది.  పైన వెలిగించిన దీపం  వ్యాసభగవానుని కోరిక మేరకు ఉగ్ర నరసింహుని లోని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అలాగే కొనసాగుతున్నాయని ,అందువల్లనే స్వామి నాసికాపుటాలకు ఎదురుగా ఉన్న దీపం లో సంచలనాలు కన్పిస్తున్నాయని.క్రింద దీపం లో కదలికలు లేవని అర్చకులు చెపుతారు. ఆయన చెప్పడమే కాదు మనము వెళ్లి అక్కడనిలబడి ఎంతసేపు చూసినా  అలాగే పై  దీపం కదులుతూ, క్రింద దీపం  కదలకుండా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇది ఈ ఆలయం లోని ప్రత్యేకత గా ఎన్నో సంవత్సరాల నుండి ఎందరో చూస్తూ, వ్రాస్తూ.చెప్పుకుంటూ వస్తున్నారు.  దేవాలయాన్ని ఎటునుంచి మూసినా ఈ దీప కదలిక ఆగదు. వినడానికి,చూడటానికి కూడ ఇది ఒక అద్భుతమే.
             

                      స్వామి వారి ఎడమ వైపు కదులుతున్న జ్యోతి ని స్పష్టం గా చూడవచ్చు  

                        అంత్రాలయం లో ఉత్సవ మూర్తులు కొలువు తీరి ఉన్నారు.  ముఖమండపాన్ని దాటి ఎడమవైపుకు మరలితే అక్కడ స్వామి కి అభిముఖం గా ఏడడుగుల దాసాంజనేయ రూపం దర్శనమిస్తుంది, అక్కడే కొన్ని శాసన శిథిలాలు కూడ మనకు కన్పిస్తూ, ఆలయ ప్రాచీనత మనకు గుర్తుచేస్తాయి. ఆలయానికి కుడివైపు గరుత్మంతుడు, నాగశిలలు కన్పిస్తాయి.
                
                                       ధ్వజస్థంభం వద్ద ఆంజనేయుడు
                    
          ఆలయ నిర్మాణ వైశిష్ట్యము ;;--            ఆలయ ముఖమండపం, రంగమండపం, అంత్రాలయం, గర్భాలయం కూడ ఒక  విశిష్ట వాస్తు శైలి తో నిర్మించినట్లు ఆలయ నిర్మాణాన్ని  నిశితం గా పరిశీలిస్తే మనకు అర్థమౌతుంది.ముఖ మండపానికి అంత్రాలయానికి మధ్యనున్న గోడ రెండు గా నిర్మించబడటాన్ని మనం గమనించవచ్చు.అంటే  రెండుగోడలు సమాంతరం గా నిర్మించి, మధ్య లో మనిషి నడిచి వెళ్లగలిగేటంత ఖాళీ కన్పిస్తుంది .
               
                                          ఆలయ దృశ్యం
           
              ముఖమండపం లో ద్వారపాలకులైన జయ,విజయుల ప్రక్కనే ఈ నిర్మాణం మనం గమనించవచ్చు. అలాగే ముఖమండపం  ,అంత్రాలయం మధ్య కూడ ఇదే విధం గా గోడలను సమాంతరం గా  మధ్య లో మనిషి  నడిచేటంత ఖాళీతో నే  నిర్మాణం జరిగింది. ఈ  విధమైన వాస్తు నిర్మాణం దేవాలయ ప్రత్యేకతను పరిరక్షిస్తోందని భావించవచ్చు.
           

             
                            ఆలయ ప్రాగణం లోని దాసాంజనేయుడు

                      చారిత్రక నేపథ్యం. ::---        శాతవాహనులు ,ఇక్ష్వాకులు ,విష్ణుకుండినులు,చాళుక్యులు,  కుందూరు చోళులు,రేచర్ల పద్మ నాయకులు, రెడ్డి రాజులు, ఈ ప్రాంతాన్ని పాలించినట్లు శాసనాధారాలు లభించాయి.  శిథిలమైన ఆలయాన్ని 13 వ  శతాబ్దంలో  అనవేమారెడ్డి పునర్నిర్మాణం చేసి, వసతులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.  ఎరయ తొండయ చోళుడు క్రీ.శ 1050-1065 మధ్య అద్భుతమైన వాస్తు శాస్త్ర పరిజ్ఞానం తో వాడపల్లి దుర్గాన్ని దృఢ పరచి, అభివృద్ధి చేసినట్లు శాసనాలు లభించాయి. కాకతీయుల నిర్మాణం గా చెపుతారు. 12 వశతాబ్దం లో రెడ్డి రాజులు ఈ ప్రదేశం లో పట్టణ నిర్మాణానికై, తవ్వకాలు జరపు తుండగా శ్రీ స్వామి వారి విగ్రహం బయట పడిందని, అచ్చటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, క్రీ.శ.1377  లో  ఆలయ నిర్మాణం గావించినట్లు శాసనాలు తెలుపుతున్నాయని ఆలయం లో వ్రాయబడి ఉంది.                            
                

                                      ఆలయ ప్రాగణం లోని శాసన స్థంభాలు
                      
                         శక వత్సరం 1528 (క్రీ,శ1606) ప్లవంగ ఫాల్గుణ బహుళ పంచమి గురువారం నాడు  
వాడపల్లి కోమటి పెండ్లిండ్లకు వచ్చిన దేవర కొండ, కొండవీడు,నల్లగొండ--- ఉండ్రుకొండ, కొండపల్లి,  ఓరుగల్లు, అనంతగిరి  ------- కారంపూడి, కేతవరం ,పేరూరు, దేవులపల్లి,గోగులపాడు మున్నగు ప్రాంతాలబట్లు కోమటి ఇళ్ల ల్లో వివాహానికి వచ్చిన కట్టడి ద్రవ్యాన్ని, శ్రీలక్ష్మీనరసింహుని సమర్పించి నట్లు గా ఈ ఆలయ ప్రాంగణం లోని శాసనం వలన తెలుస్తోంది.  ధీని రచయిత ఇందుపులపాటి మాదిరాజు నర్సయ్య.. వోడపల్లి గొప్పవనదుర్గం గా ప్రసిధ్ధి.
         

                                             స్థల పురాణం వ్రాసిన  ప్రదేశము
            
              రవాణా సౌకర్యాలు ::         ఈ శివకేశవ క్షేత్రం నల్గొండ జిల్లాలో  మిర్యాలగూడ కు 24 కి.మీ దూరం లో ఉంది.   దీనినే వజీరాబాద్ అని కూడ పిలుస్తారు.ఆంధ్రదేశం లో ఎక్కడ నుంచైనా  రవాణా సౌకర్యం ఉంది. అయితే నల్గొండ వాడపల్లి అని అడగండి.( తూ .గో .జి లో మరొకటి ఉంది )   అక్కడ మాత్రం ఉండటానికి ఎటువంటి వసతులు ఉండవు.  కనీసం టీ, కాఫీలకు కూడ ప్రయత్నించవద్దు.   ఇక్కడ కు ప్రయాణానికి  స్వంతవాహనం ఉంటే మంచిది. ఒక మార్గం లో  మేము మా కారును  బల్లకట్టు ఎక్కించి సత్తెన పల్లి, పిడుగు రాళ్ల,  దాచేపల్లి మీదు గా  ప్రయాణం చేశాము. అందుకని అంతగా చెపుతున్నాను.
   
      
                               బల్లకట్టు పై కారు ప్రయాణం
            
            ఆలయం తెరచి ఉంచు వేళలు::-----        ఆలయం మథ్యాహ్నం 12.30 దాకా.తిరిగి  4.గం.లనుండి 7.గం.వరకు తెరచి ఉంటుంది. తప్పని సరి గా చూడవలసిన ప్రదేశం.


                     ఈ ఆలయ సంపూర్ణ దృశ్యాలను you tube  లో చూడవచ్చు
         
                 



  https://www.youtube.com/watch?v=IWHIgvdPNWk&feature=c4-overview&list=UUrNtnyJK1VL3MFXOAv6YdgQ






******************************************************************************************************************************************************************

No comments:

Post a Comment