Sree Ksheeraramam -Pancharama Kshetram
श्री क्षीरारामम्- पंचारामक्षेत्रम्
శ్రీ క్షీరారామం – పాలకొల్లు పంచారామ క్షేత్రం
श्री क्षीरारामम्- पंचारामक्षेत्रम्
శ్రీ క్షీరారామం – పాలకొల్లు పంచారామ క్షేత్రం
విశ్వరూపుడు, పార్వతీ
మనోహరుడు, నాగాభరణుడు, సూర్యచంద్రాగ్ని లోచనుడు, ముకుంద
ప్రియుడు భక్తజనమందారుడైన పరమేశ్వరుడు ఆశ్రితజన వరదుడు. తన భక్తుడు ఏ వరాన్ని
అడిగినా కాదనకుండా ఇచ్చే
కరుణార్ధ్రహృదయుడు మన భోళాశంకరుడు . అందుకే ఆసేతు
హిమాచల పర్యంతం ఆ పార్వతీ నాథుణ్ణి ద్వాదశ జ్యోతిర్లింగాల లోను, కాశీ రామేశ్వరాది
మహాపుణ్య క్షేత్రాల్లోను, పంచారామ క్షేత్రాల్లోను
కనులార దర్శించి, చేతులారా పూజించి, భక్తులు ముక్తసంగులౌతున్నారు.
ఆలయ రాజగోపురం
అటువంటి పంచారామ క్షేత్రాల్లో
శ్రీమహావిష్ణువు చే ప్రతిష్టితమై
ప్రసిధ్ధమైన దివ్యారామం శ్రీ క్షీరారామం..పార్వతీ సమేతుడైన శ్రీ
క్షీరారామలింగేశ్వరుడు బ్రహ్మాది సకలదేవతలతో కొలువు దీరిన పుణ్యక్షేత్రం పశ్చిమ
గోదావరి జిల్లా పాలకొల్లు యందలి
శ్రీక్షీరారామలింగేశ్వర క్షేత్రం.
విద్యుత్కాంతుల వెలుగుల్లో రాజగోపుర దృశ్యం
స్థల
పురాణం . ;;---
పూర్వం వజ్రాంగుని కుమారు డైన తారకాసురుడు శివుణ్ణి గురించి ఘోరతపస్సు
చేశాడు. శివుని అనుగ్రహం పొంది, శివుని
కుమారుని చేత మాత్రమే మరణం సంభవించేటట్లు గా వరం పొంది, తన రాజథానియైన శోణిత పురానికి
చేరాడు. అనంతరం క్షీరసాగర మథన సమయం
లో ఆ పాల సముద్రం నుండి ఆవిర్భవించిన
అమృతలింగాన్ని హస్తగతం చేసుకొని,వర గర్వితుడై, ఇంద్రాది దేవతలను బాధించసాగాడు. అప్పుడు
ఇంద్రాది దేవతలు బ్రహ్మను ప్రార్ధించగా,
శివ పార్వతులకు జన్మించే కుమారస్వామి వలననే
తారకాసుర సంహారం సాథ్యమని చెప్పాడు. నంతరం దక్షయజ్ఞధ్వంసం, సతీదేవి మరణం,
పార్వతీ జననం, శివుని గూర్చి పార్వతి
తపస్సు, అనంతరం లోకకళ్యాణ కారకంగా శివపార్వతుల కళ్యాణం, అంగరంగవైభవంగా జరిగింది. ఆ
ఆది దంపతులకు దివ్యతేజస్సంపన్నుడైన షణ్ముఖుడు జన్మించాడు.
ఆలయప్రవేశద్వారం
అనంతర కాలం లో కుమారస్వామి తారకాసురుని తో జరిగిన యుద్ధం లోథన దివ్యశక్తి ఆయుథం తో తారకుని కంఠహారం లోని అమృతలింగాన్ని
భేదించాడు. అది ఐదు పంచఖండాలై, దివ్యకాంతుల తో ఓంకారనాదం చేస్తూ, ఐదు ఆరామ
స్థలాల్లో పడ్డాయి.శివుని పంచముఖ స్వరూపాలే నేటి ఈ పంచారామ క్షేత్రాలు.
ఈ ఐదు అమృతలింగ
ఖండాలను ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు ఏక కాలం లో-దివ్య ముహూర్తం లొ వరుసగా – ఇంద్ర,
సూర్య, కుమార, చంద్ర, విష్ణువులు విశ్వ కళ్యాణార్థమై ప్రతిష్ఠించి,పంచామృతాలతో
అభిషేకించినట్లు పురాణాలు చెపు తున్నాయి. ఈ
తారకాసుర సంహార ఘట్టాన్ని స్కాంద, శివ పురాణాలు విశేషంగా
వర్ణించాయి.
పంచారామ ప్రాథాన్యాలు
1. అమరావతి
( అమరేశ్వరుడు) దేవేంద్ర ప్రతిష్ఠ
(అఘోర స్వరూపం )— అమరావతి
2. దక్షారామం (భీమేశ్వరుడు ) సూర్య ప్రతిష్ఠ (తత్పురుష రూపం )--ద్రాక్షారామం
3. కుమారారామం ( కుమార భీమేశ్వరుడు )
కుమారస్వామి ప్రతిష్ఠ (వామదేవరూపం ) సామర్లకోట.
4. సోమారామం ( సోమేశ్వరుడు ) చంద్ర ప్రతిష్ఠ (సద్యోజాత రూపం) గునుపూడి,బీమవరం.
5. క్షీరారామం (శ్రీ క్షీరా రామలింగేశ్వరుడు ) శ్రీ మహావిష్ణు ప్రతిష్ఠ (ఈశాన రూపం) పాలకొల్లు
.
కుమారస్వామి చేత
భేదించబడిన అమృతలింగ శిరోభాగాన్ని వశిష్ట గోదావరీ తీరానికి పశ్చిమం గాబ్రహ్మాది
దేవతలు వెంటరాగా శ్రీమహావిష్ణువు శ్రీక్షీరా రామలింగేశ్వరుని, త్రిపుర సుందరీ సమేతం గా ప్రతిష్ఠించి, శివుని కోర్కె మేరకు
శ్రీమహావిష్ణువు క్షేత్రపాలకుడిగా శ్రీలక్ష్మీసమేతుడై జనార్ధనస్వామి రూపం తో శంఖ,చక్ర,గదా,
పద్మ ధారియై .ఈ క్షీరారామం లో కొలువు
తీరాడు.
రాజగోపుర రాజసం
లింగదర్శనం ;;---- ఈ లింగము 18 అంగుళాల ఎత్తు కలిగిన క్షీరవర్ణం లో మెరిసి పోయే స్వయంభువు.స్వామికి వెనుకభాగమున జటల వలె మూడు చారలు ఉంటాయి. లింగము పైభాగం లో జటామకుటముంటుంది.దీనిని పట్టి ఇది తారకాసురుడు పూజించిన అమృతలింగ శిరోభాగమని భక్తులు భావిస్తున్నారు. శివలింగం పై గల నొక్కులు కుమార స్వామి అమృతలింగాన్ని భేదించినప్పుడు తగిలిన ఆయుధపు దెబ్బలని పౌరాణికోక్తి. శివలింగం మొనదేలి ఉండుటచే, అది శివుని జటామకుటాన్ని- అంటే కొప్పు ను సూచిస్తోందని పెద్దలు చెపుతున్నారు. అంతేకాకుండా శాసనాల్లో కూడ ఈ స్వామి కొప్పు లింగేశ్వరుడు గానే చెప్పబడ్డాడు.
లింగదర్శనం ;;---- ఈ లింగము 18 అంగుళాల ఎత్తు కలిగిన క్షీరవర్ణం లో మెరిసి పోయే స్వయంభువు.స్వామికి వెనుకభాగమున జటల వలె మూడు చారలు ఉంటాయి. లింగము పైభాగం లో జటామకుటముంటుంది.దీనిని పట్టి ఇది తారకాసురుడు పూజించిన అమృతలింగ శిరోభాగమని భక్తులు భావిస్తున్నారు. శివలింగం పై గల నొక్కులు కుమార స్వామి అమృతలింగాన్ని భేదించినప్పుడు తగిలిన ఆయుధపు దెబ్బలని పౌరాణికోక్తి. శివలింగం మొనదేలి ఉండుటచే, అది శివుని జటామకుటాన్ని- అంటే కొప్పు ను సూచిస్తోందని పెద్దలు చెపుతున్నారు. అంతేకాకుండా శాసనాల్లో కూడ ఈ స్వామి కొప్పు లింగేశ్వరుడు గానే చెప్పబడ్డాడు.
శ్రీ క్షీరారామ లింగే్శ్వరుని దివ్యమంగళ రూపం
ఈ మథ్యనే స్థానిక పండితుడు
ఒకరు ఒక ప్రముఖ టి,వి ఛానల్లో మాట్లాడు తూ
శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి లింగం మీద” శ్రీ లక్ష్మీగణపతి ముద్ర “ఉందని ,అది జాగ్రత్త గా స్వామి వారి దర్శిస్తే కన్పిస్తుందని, అందుకే
ఇక్కడ జరిపే శ్రీ లక్ష్మీ గణపతి హోమానికి ప్రాథాన్యత ఉందని ప్రకటించడం గమనించ దగ్గ
విషయం.
పార్వతీమాత దివ్య రూపం
ప్రథాన ఆలయం లోనే
పశ్చిమ ముఖం గా” ఋణహర గణపతి “కొలువు
తీరి ఉంటాడు. ఋణగ్రస్తులైన వారు ఈ గణపతి ని పూజిస్తే ఋణవిముక్తులౌతారని
చెప్పబడుతోంది.
కళ్యాణ మూర్తులు
క్షేత్రప్రాశస్త్యము.;;--- ఈ ఆలయం లో శ్రీ లక్ష్మీ
జనార్ధనులు, బ్రహ్మ సరస్వతులు ,విఘ్నేశ్వర, సుబ్రమణ్యేశ్వర, ఆంజనేయ, నవగ్రహ,
వీరభద్రాది సకల దేవతలతో,మహర్షులతో శ్రీ క్షీరా రామేశ్వరుడు కొలువుతీరి ఉండటం తో ఈ
క్షేత్రాన్ని పరమ పుణ్యధామం గా మన
పురాణాలు ప్రస్తావించాయి. శ్రీశైలం లో
నూరు పక్షాలు, గయ లో 80 గడియలు, కేదారేశ్వరం లో వంద సంవత్సరాలు , వారణాసి లో ఒక
సంవత్సరం ,రామేశ్వరం లో వెయ్యేళ్లు, హరిద్వార్ 8 సంవత్సరాలు భక్తి తో నివసిస్తే
కలిగే ఫలం –ఈ క్షీరారామం లో ఒక నిద్ర తో లభిస్తుంది. శ్రీ క్షీరారామ లింగేశ్వరుని
దర్శనం తో బ్రహ్మహత్యాది సమస్తపాపాలు పోతాయని- శ్రీ మహావిష్ణువు ఈ శ్రీ
క్షీరారామలింగేశ్వరుని ప్రతిష్ఠిస్తూ ఈ క్షేత్ర ప్రాధాన్యాన్ని గురించి తెలిపాడు.
అంతేకాకుండా విష్ణుమూర్తి ఈ సందర్భం లోనే తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి
సకలపాపహారిణియైన “రామగుండం” పుష్కరిణి ని సృష్ఠించాడు.
కళ్యాణమండపం లో కనువిందు చేసే శ్రీజనార్ధనస్వామి, శ్రీలక్ష్మీదేవి
నామ
సార్ధకత.::----- క్షీరారామం అనగా పాల కొలను అని అర్ధం చెపుతున్నారు. పూర్వము కౌశికుడనే ఋషి
కుమారుడు ఉపమన్యువు అను పేరుగల బాలభక్తుడు శంకరుని ఆర్తి తో పాలకై ప్రార్ధించగా దయాళువైన పరమేశ్వరుడు తన
త్రిశూలముతో ఒక సరోవరమును నిర్మించి,క్షీరసాగరమునుండి పాల నాకర్షించి యా తటాకమును
నింపెనట.(త్రిశూలమును నేలపై గ్రుచ్చగా, అందుండి పాలు ఆవిర్భవించెనని ఒక కథనము)
అందుచే ఈ ప్రాంతాన్ని పాలకొలను , పాలకొల్లు , క్షీరపురం, ఆ బాలభక్తుని పేరు తో
ఉపమన్యుపురం అని పిలుస్తన్నారని స్ధలపురాణం. శాసనాల్లో, కావ్యాల్లో కూడ క్షీరపురి ఉపమన్యుపురం , పాలకొలను, దుగ్ధోపవనపురం, మొదలైన
పేర్ల తోనే ఈ పాలకొల్లు ప్రస్తావించబడింది.
ప్రథాన ద్వారం వద్ద గంగాధరుని దివ్య మంగళ రూపం
ఆలయ
సౌందర్యము;;--- . ఈ ఆలయ రాజ గోపురము 9
అంతస్తుల తో 120 అడుగులఎత్తు కలిగి తెలుగు
వారి కీర్తికి జయపతాక గా నయన మనోహరం గా కన్పిస్తుంది. ఈఆలయ నిర్మాణం చాళుక్యబీముని కాలం లో జరిగింది. ఇతని కాలం క్రీ. శ 892-922. ఆలయ రాజ
గోపురనిర్మాణాన్ని 14.4.1777 లో శ్రీ
బచ్చుఅమ్మయ్య నే భక్తశేఖరుడు ఛేయించినట్టు
తెలుస్తోంది. ఈ గోపురమంతా అపురూప శిల్పసంపద తో
అలరారుతుంటుంది. తపోనిష్ఠ లో ఉన్న
చంద్రశేఖరుడు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, పంచముఖ ఈశ్వరుడు, నాట్యగణపతి, లక్ష్మీ
గణపతి, సరస్వతి, గజలక్ష్మి. కాళీయమర్ధనం మొదలైన కృష్ణలీలలు, ఎన్నెన్నోదేవతా శిల్పాలు అపూర్వ కళాశోభితాలై కనువిందు ఛేస్తాయి . ఆ
సౌందర్యాన్ని కనులారా చూడవలసిందే కాని
మాటల తో వర్ణించనలవికానిది. ఈ గోపురం రెడ్డి రాజుల కాలం లో నిర్మిచబడిందనే వాదన
కూడ ఉంది. ఈ గోపురాన్ని నిర్మించడానికే
దక్షిణంగా రామగుండం చెరువు త్రవ్వారనే వాదన కూడ
ఉంది.
ప్రాకార మండపం లో కొలువుతీరిన శ్రీ లలితా త్రిపుర సుందరి
మరొక
విశేషమేమిటంటే—ప్రతి సంవత్సరము ఉత్తరాయణ,దక్షిణాయన కాలాల్లో , సూర్యోదయ సమయం లో
సూర్యుని కిరణాలు రాజగోపురం రెండవ అంతస్తు
నుండి క్రమం గా ప్రాకారాల మథ్యనుండి శ్రీ స్వామి వారిపై ప్రసరించడం విశేషమని
చెప్పబడుతోంది.
కళ్యాణ మండపం
ఉపాలయాలు ;;;-- శ్రీ
క్షీరారామలింగేశ్వరుని ఆలయం లోకి అడుగుపెడితేనే వేరే ఏదో ఒక దేవతాలోకం లోకి ప్రవేశించిన అనుభూతి
కలుగుతుంది. దానికి కారణం ఆలయం నిండా
ఎందరో దేవీ, దేవతామూర్తుల ఉపాలయాలు,ఆలయస్థంభాలపై అందంగా చెక్కిన పురాణ గాథా
శిల్పాలు , ఆలయ ప్రాకారమండపం లో చిత్రించిన వివిథ దేవతామూర్తుల వర్ణ చిత్రాలు మనల్ని మంత్రముగ్దుల్ని
చేస్తాయి.
ప్రాకారమండపంలో క్రమంగా సూర్యుడు, కాశీవిశ్వేశ్వరుడు, నగరేశ్వరుడు ,వినాయకుడు, బ్రహ్మ, సప్తమాతృకలు, దుర్గాదేవి, సరస్వతి, కుమారస్వామి, కార్తికేయుడు, మహిషాసుర మర్ధని, నాగేంద్రుడు, సుందరోపసుందరులు , నటరాజు, దత్తాత్రేయుడు , కాలభైరవుడు , ఆది శంకరులు , శనీశ్వరుడు ,రాథాకృష్ణులు మొదలైన దేవతామూర్తులు కొలువుతీరి కన్పిస్తారు. ఇక్కడ నగరేశ్వరుని అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు చెపుతారు. రావణ వథానంతరం శ్రీరామచంద్రుడుబ్రహ్మ హత్యాదోషనివారణకై రామేశ్వరలింగం తో పాటు ఇక్కడ కాశీనుండి తెచ్చిన 106 వ శివలింగాన్ని కాశీవిశ్వేశ్వరుడు గా ప్రతిష్టించారని తెలుస్తోంది. కనుకనే ఈ క్షేత్రం లోని కాశీవిశ్వేశ్వరుని దర్శిస్తే కాశీలోని విశ్వేశ్వరుని దర్శించి నట్లే నని భక్తులు భావిస్తారు.
రాజగోపురం పై రాజసం తో కన్పించే కుడ్య శిల్పాలు
ఆలయం లోకి ప్రవేశిస్తుండగానే ధ్వజ స్థంభానికి ముందుభాగం లో తపోనిష్ట లో నున్నగంగాధరుడు
పద్మాసనస్ధుడై దర్సనమిస్తాడు. ఆంజనేయ, వీరభద్ర స్వామి ఆలయాలు ప్రవేశమార్గంలోనే మనకు దర్శనమిస్తాయి.
చారిత్రక నేపథ్యం ;;;------ ఈ దేవాలయం లో
46 శాసనాలవరకు ఆలయ స్థంభాలపై మనకు కన్పిస్తాయి .ఇదినిజం గా చరిత్ర
పరిశోధకులకు ఆనందాన్ని కల్గించే విషయం..క్రీ. శ 918 ప్రాంతం లో మొదటి చాళుక్య భీముడు ఈ పంచారామ క్షేత్రాలను
కట్టించాడని,వానిలో ఒకటైన ఈ క్షీరారామానికి కూడ వెయ్యేళ్ల చరిత్ర ఉందని పరిశోధకుల
అభిప్రాయం. చాళుక్యులు, రెడ్డిరాజులు, కాకతీయులు మొదలైనవారు ఈ ఆలయ అభివృద్ధికి
ఎన్నో దానాలు, నిర్మాణకార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపే శాసనాలు
(క్రీ.శ.1136-నుండి1640 ) మధ్యకాలానివి
ఇక్కడ లభిస్తున్నాయి.
ధ్వజస్ధంభం వద్ద నంది, దీని పీఠం పై శాసనం చెక్కబడి ఉంది
ప్రత్యేక ఉత్సవాలు.;;;---- ఈ క్షేత్రము సర్వదేవతానిలయము. శివకేశవాద్వైతమునకు ప్రతీక .కావున సంవత్సరము పొడవునా నిత్యకళ్యాణము పచ్చతోరణమై ప్రతినెలలోను ప్రతిరోజు ఏవో ఉత్సవాలు జరుగుతూనే ఉండటం విశేషం గా చెప్పవచ్చు.
ప్రవేశద్వారం
ఉగాది, చైత్ర శుద్ధ దశమి నాడు స్వామి వార్ల
కళ్యాణాలు, చైత్రశుద్ధ ఏకాదశి నాడు
రథోత్సవము,వినాయకచవితి, శరన్నవరాత్రి ఉత్సవాలు,మహాశివరాత్రి కార్తీక మాస
అభిషేకాలు, జ్వాలాతోరణం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, ముక్కోటి, లక్ష కుంకుమ, లక్ష
బిల్వార్చనలు, కోటిబిల్వార్చనలు,
సహస్రఘటాభిషేకాలు --- ఇవికాక ఆయా సందర్భాలలో విశేషపూజలు, ఉత్సవాలు జరుగుతాయి.
ఈమధ్య కాలం లో ఆలయం లోకి
ప్రవేశిస్తే సమయం తెలియకుండా ఉండిపోయిన
ఆలయం శ్రీ క్షీరారామలింగేశ్వరాలమంటే అతిశయోక్తి లేదు .
***********************************************************************************************************************************
బాగుంది. దర్శనం చేసుకున్నాము గానీ రాత్రి పూట వెళ్ళడంతో ఆలయ విశేషాలు చూడలేకపోయాము.
ReplyDelete