Monday 15 July 2013

బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం


           Beechupalli Sri Anjaneya Swamy Temple.
        
                          బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం.
               
                  बीचुपल्लि श्री आंजनेयस्वामि आलयम्   
         
             
           మహబూబ్ నగర్ జిల్లా  ఇటిక్యాల మండలం లో కృష్ణానదీ తీరాన వెలసిన ఆంజనేయ క్షేత్రం బీచుపల్లి.    రాష్ట్రం లోని అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ దేవాలయాలలో   ఒకటి గా ప్రఖ్యాతి గాంచిన ఆలయం  ఈ బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం.
                        
               
           
 
                                ఆలయ మార్గ తోరణ ద్వారము
            
                ఈ ఆంజనేయస్వామిని శ్రీకృష్ణదేవరాయల వారి గురువైన శ్రీ వ్యాస రాయలు ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెపుతోంది. 16వ శతాబ్దం నుండి ప్రసిద్ధమైన ఈ స్వామిని అనంతర కాలం లో వచ్చిన రాజులు, సంస్థానాథీశులు సేవించి తరించినట్లు చారిత్రక ఆథారాల ద్వారా తెలుస్తోంది. గద్వాల సంస్థానాథీశులు ప్రతిరోజు శ్రీ స్వామిని దర్శించుకొనేవారని  చరిత్ర చెపుతోంది.
                       

                  
                      ఆలయ మార్గ  నిర్గమన తోరణ ద్వారము
             
              శ్రీ కృష్ణదేవరాయల వారి గురువు గారైన శ్రీ వ్యాసరాయల వారికి ఒక పవిత్రమైన నియమం ఉండేదట.  అదేమిటంటే వీరు ప్రతిరోజు ఒక ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ చేయక పోతే   నిదురించే వారు కాదట. అంతే కాదు .వీరు ప్రతిష్ఠించే   ప్రతి ఆంజనేయ విగ్రహానికి ఇరువైపుల శంఖ చక్రాలు ఉండటం ఒక ప్రత్యేక లక్షణ మని చరిత్రకారులు గుర్తించారు. ఆంజనేయ విగ్రహానికి  కుడు ఎడమల శంఖ చక్రాలుండటం శ్రీ వ్యాసరాయల ప్రతిష్ఠ గా  గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ స్వామి 16వ శతాబ్దం లోని ప్రతిష్ఠ గా గుర్తించబడింది.
                
  

   
                         ఆలయము ముందున్న రాతి థ్వజస్థంభము
  
                ఒక రోజు  శ్రీ స్వామి వారిని ప్రతిష్ఠించి , అక్కడే నిద్రకు ఉపక్రమించిన   శ్రీ వ్యాసరాయల వారికి శ్రీ స్వామి  కలలో కన్పించి రేపు ఉదయం నన్ను దర్శించుకోవడానికి ముందుగా ఎవరు వస్తారో  వారినే  నాకు ప్రతిరోజు పూజలు చేయడానికి నియమించమని ఆదేశించారు. మరుసటి రోజు  ఉదయము ముందుగా దర్శనానికి  ఒక పశువుల కాపరి పశువులను మేపుతూ అటువచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాడు. శ్రీ స్వామి ఆదేశం మేరకు శ్రీ వ్యాసరాయలు అతనినే ఫూజారి గా నియమించారు.
                       

             
                            ఆలయ ప్రవేశ ద్వారము
                 అతడు బోయ కులస్తుడు. అతని పేరు బీచుపల్లి. అదే సంప్రదాయం ప్పటికీ కొనసాగుతోంది అందువల్లనే  క్రమంగా ఈ ఆలయం లోని ఆంజనేయునకు బీచుపల్లి రాయుడు అనే పేరు వచ్చింది. అంతేకాదు .ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి చాల మందికి బీచుపల్లి అని పేర్లు ఉంటాయట.
                         

           

                                ఆలయ మండప ముందు దృశ్యం
           ఆలయం లోని ముఖమండపం లో శ్రీ స్వామివారికి కుడివైపున ఉన్న చిన్నవేదిక మీద శ్రీ భవానీమాత, శివలింగం, విఘ్నేశ్వరుడు కొలువు తీరి ఉంటారు. కుడివైపున  ఉన్న చిన్నవేదిక మీద శ్రీ స్వామివారి పాదుకలు దర్శనమిస్తాయి.
            

     
                               శ్రీస్వామివారి పాదుకలు
    
       ఆలయానికి  ప్రథాన గాలి గోపురం నిర్మాణం లో ఉన్నట్లుంది. ధానికి  ఆలయానికి మథ్యలో  రాతి థ్వజస్థంభము, దానిపై అందమైన ఆంజనేయరూపం గంగ సింథూరం పూత తో కాంతులీనుతుంటాయి.

   
                                శ్రీ స్వామి వారి దివ్యరూపం
              
     ఇది కాక ఆలయ ప్రథాన ద్వారానికి ఎదురుగా ప్రతిష్ఠించబడిన దారు థ్వజస్థంభము దేవతలకు ఆహ్వానం పలుకుతూ, భక్తులను ఆశీర్వదిస్తూ , ఉన్నతంగా దర్శనమిస్తుంది. థ్వజస్థంభానికి కుడివైపు కూడ శ్రీ స్వామివారి పాదుకలు దర్శనమిస్తాయి.
                       

     
                                   ఆలయ ముఖమండప ప్రవేశం
         
              ఈ ఆలయానికి  కృష్ణానది కూత వేటు దూరం లో ఉండటం తో భక్తులు పర్వదినాల్లో, పుష్కర సమయాల్లోను,  కార్తీక మాసం లోను స్నానాలకు విరివిగా వస్తారు. నదిలోకి పుష్కర స్నానఘట్టాలు భద్రంగా నిర్మించబడ్డాయి.  ఇక్కడొక శివాలయం కూడ ఉంది కృష్ణానది కి  నిండుగా  నీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నశివలింగం మీద నుండి నీరు ప్రవహిస్తూ ఉంటుంది .  ఇచ్చట  1992 ప్రాంతంలో ఒక రామాలయం కూడ నిర్మించబడింది.
                        

         



                                
         











 శ్రీస్వామి వారి రథము                                      ఉత్సవమండపము

               హైదరాబాదు – బెంగుళూరు   జాతీయరహదారి కి ప్రక్కగా ఉండటం వలన భక్తులు చేరుకోవడానికి కూడ సౌకర్యం గా ఉంటుంది. హైదరాబాద్ నుండి సుమారు 170 కి.మీ దూరం లోను, జూరాల ప్రాజక్టు నుండి 30 కి.మీ దూరం లోను ఈ బీచుపల్లి క్షేత్రం ఉంది .   









******  జయ హనుమాన జ్ఞానగుణ సాగర******************

1 comment: