Friday, 5 July 2013

పాలంపేట లోని రామప్పగుడి ఆలయ సోయగాలు

            పాలంపేట  లోని  రామప్పగుడి ఆలయసోయగాలు
                    
               ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్లు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట  గ్రామం పేరు రామప్పగుడి  మూలంగానే ప్రపంచానికి  తెలిసింది. కాని అసలు రామప్ప ఎవరు. ?  రామప్ప శిల్పి అనుకుంటే అతని పేర  ఇంత గొప్పఆలయం   ఎవరు నిర్మించారు ? ఆలయం ఎందుకు నిర్మించబడింది.? ఇది స్మృతి చిహ్నం కాదు గదా.! ఈ ఆలయం పూర్తిచేయడానికి, పదమూడు సంవత్సరాలు పట్టిందని ఒకరు వ్రాస్తుంటే, నలభై సంవత్సరాలని మరొకరు వ్రాశారు.
                                        


      ఆలయం లో ఉన్న దేవుడు రామలింగేశ్వరుడని. ఆయన పేరుతో రామప్ప గుడి అయ్యిందనుకుందామా.? అంటే కాదు. ఆలయం లోని దేవుడు రుద్రేశ్వరుడని, రేచర్ల రుద్రయ్య ఈ ఆలయాన్ని కట్టించాడని చారిత్రకాథారాలు, శాసనాలు  లభిస్తున్నాయి.  మరి అయితే మధ్యలో ఱాళ్లలో రమణీమణులను తీర్చిదిద్దిన  ఈ ఱామప్ప ఎవరు?  గత ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇది సమాధానం దొరకని ప్రశ్న గానే మిగిలిపోయిందా.?
                       

             
                 రామప్పగుడిలోని అందాలను చూస్తున్నంత సేపు ఎప్పుడో ముఫై ఐదు సంవత్సరాల క్రితం భారతి మాసపత్రిక (?) లో చదివిన ఒక కథ  నా మనసులో కదులుతూనే ఉంది.
         
                      

                       

                  ఒకరోజున కాకతి గణపతిదేవ చక్రవర్తి ఆస్థానానికి మార్కొపొలో అనే విదేశీ యాత్రికుడు సందర్శనార్థం వచ్చాడు. సందర్శకులలో కూర్చున్న మార్కోపోలో యువరాజ సింహసనం పై కూర్చొని ఉన్న రుద్రదేవుని చూసి యువరాజు స్త్రీ రూపం లో ఉంటే అచ్చం రామప్ప గుడి లోని శిల్పాకృతి గా ఉంటారు అన్నాడట. ఆ మాటలు మహామంత్రి శివ(మహ)దేవయ్య కు చేరాయి. వెంటనే మహామంత్రి పాలంపేట చేరుకున్నారు. అచ్చటి శిల్పాలను చూసి ఆగ్రహోదగ్రుడయ్యాడు.  వెంటనే శిల్పి రామప్ప ను పిలిపించాడు. ఈ శిల్పాల నిర్మాణానికి ప్రేరణ ఎవరు? ఏమిటినువ్వు చేసిన పని?  అని నిలదీశాడు.


          

            
                  
             మహామంత్రి కోపానికి కారణం తెలియని శిల్పి రామప్పజరిగిన విషయం చెప్పాడు. కొన్ని రోజుల క్రితం అడవిలా ఉండే ఆ ప్రాంతం లోకి మేకలను తోలుకుంటూ కొందరు యువతులు వచ్చారని , వారిలో ఉన్న ఒక సామాన్య యువతి రూపురేఖావిలాస, లావణ్యాలు అపురూపం గా కన్పించి ఆశ్చర్యపరిచాయని, అనుకోకుండానే అదే రూపం తన చిత్రాల్లో చోటు చేసుకుంటోందేమోనని  సవినయం గా విన్నవించాడు రామప్ప.  మహామంత్రి కొద్దిసేపు మౌనం గా ఉండిపోయాడు.
                             


            
                      పుట్టిననాటి నుండి పురుషుడు గానే పెంచబడుతూ, వేషథారణ కూడ  పురుషోచితం గానే థరిస్తున్న రుద్రమదేవి కోటలో ఉన్నంత కాలం  రుద్రదేవుడు గనే వ్యవహరించబడుతుండేది. ఎప్పుడన్నా అంతరంగికులతో కలసి ఏ వాహ్యాళికో వెళ్లినప్పుడు  స్త్రీ సహజమైన కోరికతో యువతీ వస్త్ర థారణ తో కొంత సేపు విహరించి, ఆనందించేది యువరాజు గా ఉన్న రోజుల్లో రుద్రమదేవి. ఈ విషయం మహామంత్రి కి తెలిసి కూడ, అలంకారప్రియత్వం  స్త్రీ సహజ లక్షణమని , పెద్దయితే  బాథ్యత తెలుసుకుంటుదని, పదహారేళ్ళ ప్రాయం లోని యువతుల భావాలు తెలిసిన ఒక కన్నతండ్రి మనసుతో,  మమకారం తో  ఆమెను గట్టిగా నిరోథించలేకపోయాడు.
        

            
 అదే ఈనాడు ఇంతటి ఉపద్రవాన్ని తెచ్చిపెట్టింది. దీర్ఘంగా ఆలోచించిన మహామంత్రి , అసలు విషయాన్ని శిల్పి రామప్ప కు చెప్పి , సమస్యను వెంటనే ముగించమని ఆజ్ఞాపించారు. విషయం విని మొదలు నరికిన మహావృక్షం లాగ  ప్రక్కకు ఒరిగిపోయాడు ఆ మహాశిల్పి. పిడుగుపడిన ఆలయశిఖరం లాగ వాలిపోయాడు. తానేదో ఘోరమైన పాపం చేసిన భావన అతనిలో ప్రవేశించి నిలువునా దహించి వేయసాగింది. తన ప్రమేయం లేకుండానే తాను చేసిన   పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే నిర్మాణం లో ఉన్న ఆలయం శిఖరం  పైకి ఎక్కేసి, ప్రక్కనే ఉన్న కొలను లోకి దూకేసి ప్రాణత్యాగం  చేసుకున్నాడు.  శిఖర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ పొరపాటున  కాలు జారిపడ్డాడని అందరూ చెప్పుకున్నారు. పాపం రామప్ప జారిపడ్డాడని చెప్పుకుంటూ చక్కని గుడి కట్టాడని ,జాలిగా,.... బాధ గా ..... అలా... అలా... చెప్పుకుంటూ చివరకు అది రామప్ప గుడి అయిపోయింది.  ప్రపంచంలో మరెక్కడా కూడ శిల్పి పేరుతో ప్రసిద్దమైన మరొక ఆలయం లేదని ఎక్కడో చదివినట్లు గుర్తు.
                          


             ఈ విషయం   మహామంత్రి శివదేవయ్యకు, మహాశిల్పి రామప్ప కు తప్పితే మూడో వ్యక్తికి తెలియదు.  రుద్రమదేవి కి కూడ  తెలిసే అవకాశం లేదు. ఇది కథో, కాదో తెలియదు కాని ఒక మహాశిల్పికి నివాళి గా మాత్రం ఈ కథ నా మనసులో నిలిచిపోయింది. కాల నిర్ణయాన్ని పట్టి చూస్తే కలవని కథ యిది. ఎక్కడో ఏదో అడ్డం వస్తోంది.



                                  నంది మండపం
      (కాకతీయ చరిత్ర  ఆథారం గా రుద్రమదేవి సింహాసనం అథిష్టించిన కాలం. క్రీ.శ.1262. మరణించిన తేది క్రీ.శ.1289 నవంబరు 12 వ తేది. గణపతిదేవచక్రవర్తి పరిపాలనాకాలం. క్రీ.శ .1199 -1261 ( రామప్పగుడి -34 వ పేజి)
          

                   
                                       శాసనమండపం

                       రేచర్ల రుద్రయ్య  ఈ ఆలయం లో వేయించిన శాసనం లో  ఈ ఆలయాన్ని రుద్రేశ్వర  స్వామి ఆలయమనే అన్నాడు. ఈ ఆలయనిర్మాణం శా.శ 1135 వ సం. నకు సరియగు శ్రీముఖ నామ సంవత్సరం చైత్ర, శుద్ద అష్టమి ఆదివారం 31.3 1213 పూర్తి అయినట్లు వ్రాయబడింది. ఈ రుద్రయ్య తాతలే పిల్లలమఱ్ఱి లోని ఎరకేశ్వర,నామేశ్వర ఆలయ నిర్మాతలు.
         


   ఈ ఆలయ సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. కేమెరా పట్టుకొని గుడి చుట్టూ తిరగటం తప్పితే ఎక్కడనుంచి మొదలు పెట్టాలో అర్థం కాని పరిస్థితి.ఈ ఆలయ సౌందర్యాన్ని వర్ణించాలంటే శిల్పశాస్త్రము, నాట్యశాస్త్రం తోపాటు భవన నిర్మాణ, గణిత వాస్తు శాస్త్రాల పరిజ్ఞానం కూడ కావాలి.  జాయప సేనాని వ్రాసిన నృత్యరత్నావళి ఆథారం గా ఈ గుడి లోని శిల్పాలు మలచబడ్డాయని తద్విజ్ఞులు వ్రాస్తున్నారు. ఎందరో పురా పురుషుల కార్యదీక్ష,కళాదక్షత,కఠోరపరిశ్రమ, ప్రాణత్యాగాలు కలిసి  ఈ అపూర్వ కళాసౌథము తెలుగు వారికి మిగిలింది.
      


               
      ( ఈ ఆలయ సమగ్ర చిత్రాల్ని you tube లో నాచే చేర్చబడిన  “ The Beauteous Of  Ramappa Temple, palampet, part -1 & 2   ద్వారా చూడవచ్చు.  )            
        


          పునాదిలో ఇసుక, దాని పైన పీఠము, దాని పై ఉప పీఠము,  ఆ ఉపపీఠము పైన ఆలయ నిర్మాణము జరిగాయి. ఉత్తర, దక్షిణ సంప్రదాయ మేలు కలయికగా ఎరుపు,సల్లని రాళ్లు   నిర్మాణం లో వాడబడ్డాయి. ఈ ఆలయ శిఖరం నీటి పై తేలునట్టి, గట్టి ఇటుకలతో నిర్మించబడింది.
                       


                                          ఆలయ ముఖద్వారం

                రామప్పగుడి లోని ప్రథాన ఆలయమునందలి మూర్తి రుద్రేశ్వరుడు . ఈ స్వామి తూర్పుముఖం గా ఉంటాడు. ఎదురుగా నంది మండపం,దానిలో  కాకతీయ శిల్పకళా శోభితుడైన   నందీశ్వరుడు దర్శనమిస్తాడు.  ఈ నంది మండపం శిథిలమై, మరల పునర్నిర్మాణదశ లో ఉంది.
               
             


                               ఈ గుడికి తూర్పు,ఉత్తర,దక్షిణదిక్కులలో ప్రవేశద్వారాలున్నాయి. ప్రతిద్వారం పైన చూరుల్లో  ఏటవాలుగా కుడి ఎడమల్లో రెండుచొప్పున మదనికలు అనబడే సాలభంజికలు  నిలపెట్ట బడ్డాయి. వీటినే నాసికాస్థంభ ప్రతిమలు అంటారు. ఇవే ప్రథానం గా రామప్పగుడి కి ఆకర్షణలు. ఇవి నల్లరాతిలో మలచబడిన అద్భుత శిల్పాలు. 
  

                ఎనిమిది వందల సంవత్సరాల తరువాత కూడ ఇవి సజీవ సుందరుల వలే చూపరుల మనసును దోచుకుంటున్నాయంటే, ఆనాడు ఇంకా ఎంత రమణీయం గా ఉండేవో నని పిస్తుంది.  వీనిలో ఒక్క విగ్రహం తప్ప మిగిలినవన్నీ ముష్కరుల సమ్మెట ప్రహారాలకు భిన్నమైనవే.
                  

                
                 రంగమండపమునందలి స్థంభాలు, పైకప్పు, సమస్తము శిల్ప సంభరితమే. క్షీరసాగరమథనం నుండి పార్వతీకళ్యాణం వరకు  పురాణ గాథలన్నీ ఇక్కడ  కనువిందు చేస్తాయి.రంగమండపము చుట్టు గోడల నానుకొని ఉపవేదిక పైన ఉన్న మందిరాల్లో వినాయకుడు, విష్ణువు, మహిషాసురమర్థిని మున్నగు దేవతామూర్తులు కన్పిస్తారు.
                  


                        అంతరాళ ద్వారం పైన ,గర్భాలయ ద్వారం పైన మరెన్నెన్నో శిల్పాలు.   అంతరాళ ద్వారానికి అటునిటు కిటికీలుగా అమర్చబడిన రెండు దీర్ఘచతురస్ర శిలాఫలకాలు లున్నాయి. వీనిపైన నాట్యమృదంగ వాద్యకారులైన స్త్రీ,పురుషుల శిల్పాలు అనేకము వివిథభంగిమలలో మలచబడ్డాయి. ఇవి పేరిణి తాండవానికి సంబంధించినవిగా భావించబడుతున్నాయి.పద్మశ్రీ నటరాజరామకృష్ణ  చేసిన పేరిణి తాండవ ఉద్ధరణకు ఇవే ఆథారభూత శిల్పాలుగా చెపుతున్నారు.
                  
                                 రంగమండపం లోని స్థంభ శిల్పాలు                      

         
          ఇంకా ఎంత వ్రాసినా తీపిని గురించి వర్ణించినట్లే ఉంటుంది. పంచదారను నాలుకపై వేసుకుంటే  రుచి తెలుస్తుంది కాని వర్ణిస్తే కాదుగదా.  అదేవిథంగ రామప్ప శిల్ప సౌందర్యాన్ని దర్శించవలసినదే కాని వర్ణింపనలవికాదు.
                   
                                     రంగమండప స్థంభ శిల్పాలు
   
           ఈ ఆలయానికి కుడిఎడమలుగా మరి రెండు ఆలయాలున్నాయి. ఒకటి పూర్తిగా శిథిలమై పోగా మరొకటి అర్థ శిథిలావస్థలో ఉంది. వీటిని కాటేశ్వర. కామేశ్వర ఆలయాలుగా చెపుతున్నారు.










** వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం****************




                                   

1 comment:

  1. రామప్ప గుడి దర్శించిన బావన కలుగుతుంది.

    ReplyDelete