Saturday 13 July 2013

సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం

   

                        Singotam  Sri Lakshminarasimha Swamy Aalayam.
                     
                                 సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం.
                    
                    सिंगोटं श्रीलक्ष्मीनरसिंहस्वामि आलयम् .      
                  
                 మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం లోని సింగోటం గ్రామం శ్రీ లక్ష్మీనరసింహస్వామి  లింగరూపం లో వెలసిన దివ్యక్షేత్రం. ఈ ఆలయంలో ప్రత్యక్షమైన స్వామి, ఆలయాన్నినిర్మించిన ప్రభువు ఇద్దరు నరసింగదేవులే అవడం తో ఈ ఊరు  నరసింగపట్నం >  సింగపట్నం >  సింగవటం > సింగోటం అయ్యింది.  
            

        
                                ఆలయ రాజగోపురం
         
          ఇక్కడ  ప్రతి సంవత్సరం జనవరి నెలలో మొదలై నెలరోజులపాటు జరిగే జాతర  మహబూబ్ నగర్ జిల్లా లోనే అతి పెద్ద జాతర గా చెపుతారు. ఎడ్లబండి పందాలు,   బండిలాగుడు పందాలు మొదలైన వాటి నుండి కబాడీ పోటీల వరకు రకరకాల పందాల్లో ప్రజలు ఉత్సాహం గా పాల్గొంటారు. రాష్ట్రం నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి కూడ వేలాది మంది భక్తులు ఈ జాతర్లో భాగస్వాములౌతారు.
                               


                                పొంగళ్లశాల నుండి ఆలయదృశ్యం
                 
               ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యవిషయం ఏమిటంటే శ్రీ లక్ష్మీనరసింహుని  దివ్యరూపాలను వివిథ భంగిమలలో దర్శించి తరించే భక్త కోటికి  ఈ  సింగోటం ఆలయం లో శ్రీ లక్ష్మీనరసింహుడు లింగ రూపం లో స్వయంభువు గా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.  ఇదే ఈ క్షేత్ర ప్రశస్తి కి ప్రథాన కారణమైంది.
                         
               

                  
                             శ్రీ స్వామి వారి దివ్య రూపం
                    
             ఆలయం లోకి ప్రవేశించిన భక్తులు కొత్తవాళ్లైతే నరసింహస్వామి ఎక్కడ ఉన్నాడో నని వెతుక్కుంటారు.  ఎదురుగా దివ్యమైన లింగరూపం లో ఉన్నస్వామి ని చూడగానే ముందు ఆశ్చర్యాన్ని,తరువాత ఆనందాన్ని పొందుతారు. అడుగు,అడుగున్నర ఎత్తున ఉన్న  లింగరూపం లో ఊర్థ్వపుండ్రాలు, త్రి పుండ్రాలు ధరించి ( పంగనామాలు, విభూతిరేఖలు) చక్కగా వెనుకకు మెలితిప్పిన మీసాల తో థీర గంభీరం గా ఉన్న స్వామిని చూడగానే ఆర్తుడై వచ్చిన భక్తునకు కొండంత థైర్యం వచ్చేస్తుంది. మీకు నేనున్నానని స్వామి అభయమిస్తున్నట్టుగానే భక్తుడు  ఆనందిస్తాడు.
                    
             
                     
                        శ్రీ లక్ష్మీగణపతి మందిరం
         
             ఈ ఆలయాన్ని  క్రీ.శ 13 వ శతాబ్దంలో  ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సురభి  శ్రీ నరసింగభూపాలుడు నిర్మించినట్లు  చెపుతున్నారు. ఆ గాథ ఈ విథంగా ఉంది. కాని  ఈ గాథలో  కొంచెం స్పష్టత  తగ్గినట్టుంది.   రాబోయేకాలం ఆ కొరతను తీర్చవచ్చు.
                          


                                                             శ్రీ లక్ష్మీ గణపతి దివ్యరూపం
                        
                       ఈ ప్రాంతాన్ని సురభి శ్రీ నరసింగ భూపాలుడు పరిపాలించే రోజులవి. ఒక రైతు ఇప్పుడున్న ఆలయానికి ఎడమవైపున ( అప్పుడు చెరువు ఏర్పడలేదట)  ఉన్న పొలంలో నాగలితో పొలం దున్ను తున్నాడు.  హఠాత్తుగా నాగేటి కర్రు కి  రాయిలాంటిది అడ్డం పడింది. దాన్ని తీసి గట్టు పైకి విసిరేసి, మళ్లీ దున్నడం కొనసాగించాడు. కాని మళ్లీ అదే  పరిస్థితి. తీసి బయటకు విసిరేశాడు.కాని  ఆ రాయి మళ్లీ అడ్డం పడేది.కొన్నిరోజులు అలాగే జరిగింది. ఆ రైతుకు విసుగు తోపాటు భయం కూడ వేసింది.
                                 
                 

           
                                   శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం
              
                 శ్రీ మన్నారాయణుని భక్తుడైన ఆ రైతు ఏమి చేయాలో తెలియక పగలు, రాత్రి ,మనసులో ఆ భగవంతుని వేడుకుంటూనే ఉన్నాడు. కరుణించిన ఆ దైవం  ఒకనాటి రాత్రి  శ్రీ నరసింగ భూపాలునికి కలలో కన్పించి , పాపం  తన వలన ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడని, తాను అక్కడే ఉండ దలచాను,  కాబట్టి అందుకు కావలసిన నిర్మాణం చేపట్టి నీ జన్మను చరితార్ధం చేసుకోవలసిందని  రాజుని ఆజ్ఞాపించాడు. సహజ సిద్ధం గానే  దైవభక్తుడైన శ్రీ నరసింగ భూపాలుడు   వెంటనే ఆలయ నిర్మాణం చేసి, స్వామిని సేవించి కృతార్థుడైనాడు.
                  

                            ఆలయం వైపు నుండి కళ్యాణ మండప దృశ్యం
             
             ఈ నృసింహాలయం లో  అర్చకులుగా స్మార్తులను  ఆ కాలంలోనే నియమించారు.  అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అంటే శ్రీ లక్ష్మీనరసింహస్వామి విష్ణు రూపుడైనా శైవులు పూజారులుగా ఉంటూ ఆనాటినుండి శివకేశవాద్వైతాన్ని పరిరక్షిస్తున్నామని  ఆలయ పూజారి గారు చెప్పారు.  అనంతర కాలంలో  శ్రీ నరసింహస్వామి కి కుడి వైపు ఉపాలయం లో శివలింగాన్ని కూడ ప్రతిష్టించారు. కావున ఇది శివకేశవాలయం గా  కూడ ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయ చరిత్ర అర్చకులవారు చెప్పిందే కాని లిఖిత పూర్వకంగా ఎక్కడా లభించక పోవడం  భక్తులకు నిరాశ  కల్గిస్తుంది.
       
      

                                          శ్రీ  స్వామి వారి కళ్యాణ మూర్తులు

                  ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక కి.మీ. దూరంగా ఉన్న కొండమీద  శ్రీ రత్నలక్ష్మీ ఆలయం ఉంది. క్రీ.శ 1875ప్రాంతం లో రాణీ రత్నమాంబా దేవి ఈ ఆలయాన్నినిర్మింపజేసి, చెన్నపట్నం  నుండి  లక్ష్మీదేవి విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతోంది.  శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి కుడి వైపు రాజా వారి విడిది భవనం కన్పిస్తుంది.
                     

                               
                             పుష్కరిణి లోకి మెట్లమార్గం
           
                 ఆలయం అంత్రాలయం, ముఖమండపం మాత్రమే  నిర్మించబడ్డాయి.  ప్రక్కనే వివాహాది కార్యక్రమాల కొఱకు గదులు నిర్మించబడ్డాయి. దానిముందే శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం ఉంది. వివాహ,చౌల,ఉపనయనాది వేడుకల నుండి వాహన పూజల వరకు  భక్తులు తమ తమ మొక్కులను యథాశక్తి సమర్పించుకుంటూ కన్పిస్తారు. సింగోటం అని పేరున్నవారు కూడ  ఈ ప్రాంతం లో  ఎక్కువమందే ఉన్నారు.
           

             
                                     రామకోటి స్థంభం
            
                 థ్వజస్థంభానికి  ప్రథాన ద్వారానికి నడుమ శ్రీ రామకోటి స్థంభం ప్రతిష్ఠించబడింది.                     
                      

              
                                                     శ్రీ రాజావారి భవనం
                 
                    ఆలయానికి ఎడమ వైపు నృసింహసముద్రం అనే  పెద్దచెరువు,కుడి వైపు రత్న పుష్కరిణి అనే కోనేరు ఉన్నాయి. కోనేట్లోకి మెట్లమార్గం ఉంది.  చెఱువు నుండి అలుగు ద్వారా పుష్కరిణి లోకి నీరు వస్తూ ఉంటాయి.   ఆలయ ముందుభాగం లో  శ్రీ లక్ష్మీ గణపతి మందిరం, నవగ్రహమండపం. ఉట్లస్థంభం, కొంచెం దూరంలో పొంగళ్ల శాలలు దర్శనమిస్తాయి.
            
     

           
                                      నవగ్రహ మండపం


                      కొల్లాపూర్ నుండి తొమ్మిది కి.మీ. దూరంలో ఈ పుణ్యక్షేత్రం విలసిల్లుతోంది.               

             ప్రశాంతమైన పచ్చని ప్రకృతి నడుమ అలరారే ఈ నృసింహ నిలయం భక్తుల పాలిట కొంగుబంగారమై విలసిల్లుతోంది .

  








***** *** **** శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమ్************



No comments:

Post a Comment