Friday, 19 July 2013

బుగ్గ రామేశ్వరం -శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయం


           Bugga Rameswaram    Sri Buggarameswara Swamy  Aalayam
           
               బుగ్గరామేశ్వరం  శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయం.
      
         बुग्गारामेश्वरम्  श्री बुग्गारामेश्वरस्वामि आलयम्
                      

                కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి కొలిచిన భక్తుల కొంగుబంగారమై పూజలందుకుంటున్నాడు. పరశురాముని చే ప్రతిష్ఠించ బడుటచే ఈ స్వామి శ్రీ రామేశ్వరస్వామి గా పూజలందుకుంటున్నాడు.
              
               

            
                               ఆలయ రాజగోపురం

                    పరశురాముడు  మాతృహనన పాతక  నివృత్తి కోసం (తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టు కోవడం కోసం) పలు తీర్థాల్లో స్నానాలు చేస్తూ , పలు ఋష్యాశ్రమాలను సందర్శిస్తూ, పలు దేవతా మూర్తులను ఆరాథిస్తూ,దేశ సంచారం చేస్తూ , ఈ ప్రదేశానికి వచ్చాడు. ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత,పావనత్వాలకు ముగ్థుడై, ఇక్కడ పంచ శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు,తరించినట్లు స్థలపురాణం చెపుతోంది.
                 

            

                
                                ఆలయ ప్రవేశ ద్వారం           

               అలంపురం లో జమదగ్ని ఆశ్రమం ఉండేది.  రేణుకాదేవి జమదగ్ని దంపతుల ఐదవసంతానం పరశురాముడు. రేణుకాదేవి ప్రతిరోజు నదికి స్నానానికి వెళ్లి, అక్కడ ఇసుక తో కుండను చేసి  దానితో  నీళ్లు ముంచుకొని ఆశ్రమానికి వచ్చేది.



                                     ఆలయ తోరణ ద్వారం

   ఒకరోజు  ఒక మహారాజు తన భార్యలతో జలక్రీడ లాడుతుండగా ఆ దృశ్యాన్ని చూసిన రేణుకాదేవి ఆ రాజు వైభవాన్ని, అతని భార్యల అదృష్టాన్ని ఎంతగానో మెచ్చుకొంది.  మనోవికారం తో  ఆరోజు ఇసుక తో కుండచేయడం కూడ సాథ్యం కాలేదు రేణుకాదేవి కి.
         
    

              
                              ప్రశాంతమైన  ఆలయ ప్రాంగణం
            
                       ఆలస్యం గా  వచ్చి కూడ నీళ్లు తీసుకు రాకుండా వచ్చిన ఇల్లాలిని చూశాడు జమదగ్ని. దివ్యదృష్టి తో విషయాన్ని తెలుసుకొన్నాడు.పంకిలమైన మనస్సు కలిగిన ఇల్లాలిని  అసహ్యించుకున్నాడు. తల్లిని సంహరించవలసిందిగా  కుమారులను ఆదేశించాడు.
          


                                 పంచముఖేశ్వర ఆలయం
                  
              పెద్దవాళ్లు నలుగురు అందుకు ఒప్పుకోక  తండ్రి కోపానికి,శాపానికి బలయ్యారు. కాని తండ్రి యొక్క తపశ్శక్తి  తెలిసిన పరశురాముడు తండ్రి ఆజ్ఞ ను పాలించాడు. తల్లిని సంహరించి ,తండ్రికి సంతోషాన్ని కలిగించాడు.
                       

 ఆలయవిమానందృశ్యం                                                  థ్వజస్థంభం
              
              పరశురాముని యొక్క థైర్య సాహసాలకు, విథేయతకు ముగ్థుడైన జమదగ్ని కుమారుని  ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. తన తల్లిని పునరు జ్జీవితురాల్ని చేసి , సోదరులకు శాప విమోచనాన్ని కలిగించమని, తనకు ఎల్లవేళల జయము కలిగేటట్లు  చేయమని కోరుకున్నాడు పరశురాముడు.
                     

     
                                            మెట్ల పుష్కరిణి
                   
                  అనంతరము  తండ్రి వద్ద అనుజ్ఞ తీసుకొని మానసిక ప్రశాంతత కోసం తన పితామహుడైన ఋచీకుని ఆశ్రమం లో కొంతకాలముండి అక్కడకూడ ఉండలేక దేశసంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి  ఇచ్చట బుగ్గ రామేశ్వరుని ప్రతిష్ఠించి చిరకాలం ఈప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయినట్లు  జనశృతి. ఇది  కూడ ఆలయం లో అర్చకులు, వృద్ధులు చెపుతున్న  స్థల పురాణమే.
             

              

                           

                         కోనేటి లో ఒకవైపున కన్పిస్తున్న వైష్ణవ శిల్పం

                   ఆలయం ప్రశాంత వాతావరణం లో విలసిల్లుతోంది. ముఖమండపం, అంత్రాలయం గర్భాలయం అనే మూడుభాగాలుగా  నిర్మించ బడింది. ప్రాచీన నిర్మాణాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.  గర్భగుడి లో రామలింగేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. శ్రీ స్వామి వారి ఎడమవైపు  ఉపాలయం లో శ్రీ భవానీ మాత నిండైన మూర్తి తో భక్తులను కరుణిస్తూ దర్శనమిస్తుంది.  ప్రాకారమండపాలున్నాయి.
                   

               అక్కడి నుంచి వెలుపలికి వస్తే కోనేటి మథ్యలో ప్రక్కనే ఉన్న బుగ్గ రామేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. అందంగా నిర్మించిన మెట్ల కోనేటి మథ్యలో శివలింగం, ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఉబికి వచ్చే నీటిధారను ను మనం స్పష్టం గా చూడవచ్చు. ఇది అద్బుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.
                

               
                           స్వచ్ఛమైన కోనేటి  మథ్యలో బుగ్గ రామేశ్వరుడు


                      నీరు నిర్మలంగా ఉండి.  రామేశ్వరుని శిరస్సు నుండి బుగ్గ వెలుపలికి ప్రవహించడం  దర్శనీయమైన రమణీయదృశ్యమే. గర్బగుడిలో శ్రీ స్వామివారి పై నీటి బిందువులు పడతాయని చెపుతారు.  కోనేటిలో  అన్నికాలాల్లోను శివలింగం నుండి నీరు వస్తూనే ఉంటుందట. కాని కోనేటి లోని నీటి మట్టం మాత్రం పెరక్కుండా  ఏర్పాట్లు చేయబడ్డాయి.ఇదే విధానం మహానంది లోను, యాగంటి లోను కూడ మనం చూడవచ్చు.
                       
                   
           
                            ప్రథాన ఆలయానికి వెలుపల  కన్పించే అమ్మవారు
                     
                  ఈ ఆలయ ప్రాంగణం లోనే  మరి మూడు శివాలయాలను కూడ మనం దర్శించుకోవచ్చు.ఇచ్చట  పంచముఖేశ్వరుని  విశ్వేశ్వరుని సేవించుకోవచ్చు . మహా శివరాత్రి  నుండి మాస శివరాత్రి ఎన్నో ఉత్సవాలు శ్రీ స్వామి కి అంగరంగ వైభవం గా నిర్వహిస్తున్నారు.   ఆలయం లో నిత్యాన్నదాన పథకం నిర్వహించబడుతోంది.
                 
             

           
                                              శ్రీ స్వామివారి రథం
           
                 రాళ్లు తప్పితే నీళ్లు కన్పించని ఈ ప్ర్రాంత లో వెలసిన శ్రీ బుగ్గరామేశ్వరుడు నిజంగా భక్తుల పాలిట గంగాధరుడే కదా!

 



    


**************** ****** వందే శివం శంకరమ్ ******************* ******          

No comments:

Post a Comment