Showing posts with label Temple's history. Show all posts
Showing posts with label Temple's history. Show all posts

Monday, 15 July 2013

బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం


           Beechupalli Sri Anjaneya Swamy Temple.
        
                          బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం.
               
                  बीचुपल्लि श्री आंजनेयस्वामि आलयम्   
         
             
           మహబూబ్ నగర్ జిల్లా  ఇటిక్యాల మండలం లో కృష్ణానదీ తీరాన వెలసిన ఆంజనేయ క్షేత్రం బీచుపల్లి.    రాష్ట్రం లోని అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ దేవాలయాలలో   ఒకటి గా ప్రఖ్యాతి గాంచిన ఆలయం  ఈ బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం.
                        
               
           
 
                                ఆలయ మార్గ తోరణ ద్వారము
            
                ఈ ఆంజనేయస్వామిని శ్రీకృష్ణదేవరాయల వారి గురువైన శ్రీ వ్యాస రాయలు ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెపుతోంది. 16వ శతాబ్దం నుండి ప్రసిద్ధమైన ఈ స్వామిని అనంతర కాలం లో వచ్చిన రాజులు, సంస్థానాథీశులు సేవించి తరించినట్లు చారిత్రక ఆథారాల ద్వారా తెలుస్తోంది. గద్వాల సంస్థానాథీశులు ప్రతిరోజు శ్రీ స్వామిని దర్శించుకొనేవారని  చరిత్ర చెపుతోంది.
                       

                  
                      ఆలయ మార్గ  నిర్గమన తోరణ ద్వారము
             
              శ్రీ కృష్ణదేవరాయల వారి గురువు గారైన శ్రీ వ్యాసరాయల వారికి ఒక పవిత్రమైన నియమం ఉండేదట.  అదేమిటంటే వీరు ప్రతిరోజు ఒక ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ చేయక పోతే   నిదురించే వారు కాదట. అంతే కాదు .వీరు ప్రతిష్ఠించే   ప్రతి ఆంజనేయ విగ్రహానికి ఇరువైపుల శంఖ చక్రాలు ఉండటం ఒక ప్రత్యేక లక్షణ మని చరిత్రకారులు గుర్తించారు. ఆంజనేయ విగ్రహానికి  కుడు ఎడమల శంఖ చక్రాలుండటం శ్రీ వ్యాసరాయల ప్రతిష్ఠ గా  గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ స్వామి 16వ శతాబ్దం లోని ప్రతిష్ఠ గా గుర్తించబడింది.
                
  

   
                         ఆలయము ముందున్న రాతి థ్వజస్థంభము
  
                ఒక రోజు  శ్రీ స్వామి వారిని ప్రతిష్ఠించి , అక్కడే నిద్రకు ఉపక్రమించిన   శ్రీ వ్యాసరాయల వారికి శ్రీ స్వామి  కలలో కన్పించి రేపు ఉదయం నన్ను దర్శించుకోవడానికి ముందుగా ఎవరు వస్తారో  వారినే  నాకు ప్రతిరోజు పూజలు చేయడానికి నియమించమని ఆదేశించారు. మరుసటి రోజు  ఉదయము ముందుగా దర్శనానికి  ఒక పశువుల కాపరి పశువులను మేపుతూ అటువచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాడు. శ్రీ స్వామి ఆదేశం మేరకు శ్రీ వ్యాసరాయలు అతనినే ఫూజారి గా నియమించారు.
                       

             
                            ఆలయ ప్రవేశ ద్వారము
                 అతడు బోయ కులస్తుడు. అతని పేరు బీచుపల్లి. అదే సంప్రదాయం ప్పటికీ కొనసాగుతోంది అందువల్లనే  క్రమంగా ఈ ఆలయం లోని ఆంజనేయునకు బీచుపల్లి రాయుడు అనే పేరు వచ్చింది. అంతేకాదు .ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి చాల మందికి బీచుపల్లి అని పేర్లు ఉంటాయట.
                         

           

                                ఆలయ మండప ముందు దృశ్యం
           ఆలయం లోని ముఖమండపం లో శ్రీ స్వామివారికి కుడివైపున ఉన్న చిన్నవేదిక మీద శ్రీ భవానీమాత, శివలింగం, విఘ్నేశ్వరుడు కొలువు తీరి ఉంటారు. కుడివైపున  ఉన్న చిన్నవేదిక మీద శ్రీ స్వామివారి పాదుకలు దర్శనమిస్తాయి.
            

     
                               శ్రీస్వామివారి పాదుకలు
    
       ఆలయానికి  ప్రథాన గాలి గోపురం నిర్మాణం లో ఉన్నట్లుంది. ధానికి  ఆలయానికి మథ్యలో  రాతి థ్వజస్థంభము, దానిపై అందమైన ఆంజనేయరూపం గంగ సింథూరం పూత తో కాంతులీనుతుంటాయి.

   
                                శ్రీ స్వామి వారి దివ్యరూపం
              
     ఇది కాక ఆలయ ప్రథాన ద్వారానికి ఎదురుగా ప్రతిష్ఠించబడిన దారు థ్వజస్థంభము దేవతలకు ఆహ్వానం పలుకుతూ, భక్తులను ఆశీర్వదిస్తూ , ఉన్నతంగా దర్శనమిస్తుంది. థ్వజస్థంభానికి కుడివైపు కూడ శ్రీ స్వామివారి పాదుకలు దర్శనమిస్తాయి.
                       

     
                                   ఆలయ ముఖమండప ప్రవేశం
         
              ఈ ఆలయానికి  కృష్ణానది కూత వేటు దూరం లో ఉండటం తో భక్తులు పర్వదినాల్లో, పుష్కర సమయాల్లోను,  కార్తీక మాసం లోను స్నానాలకు విరివిగా వస్తారు. నదిలోకి పుష్కర స్నానఘట్టాలు భద్రంగా నిర్మించబడ్డాయి.  ఇక్కడొక శివాలయం కూడ ఉంది కృష్ణానది కి  నిండుగా  నీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నశివలింగం మీద నుండి నీరు ప్రవహిస్తూ ఉంటుంది .  ఇచ్చట  1992 ప్రాంతంలో ఒక రామాలయం కూడ నిర్మించబడింది.
                        

         



                                
         











 శ్రీస్వామి వారి రథము                                      ఉత్సవమండపము

               హైదరాబాదు – బెంగుళూరు   జాతీయరహదారి కి ప్రక్కగా ఉండటం వలన భక్తులు చేరుకోవడానికి కూడ సౌకర్యం గా ఉంటుంది. హైదరాబాద్ నుండి సుమారు 170 కి.మీ దూరం లోను, జూరాల ప్రాజక్టు నుండి 30 కి.మీ దూరం లోను ఈ బీచుపల్లి క్షేత్రం ఉంది .   









******  జయ హనుమాన జ్ఞానగుణ సాగర******************

Wednesday, 26 June 2013

కొడవటంచ శ్రీశ్రీశ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం

   

                                    Kodavatancha   
  
         Sree Sree  Sree Lakshmi nrusimha swamy   Aalayam       
              

                                కొడవటంచ  శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం.
       कॊडवटंच श्री श्री श्री लक्ष्मीनृसिंहस्वामि आलयम्.
                     
            వరంగల్లు జిల్లా రేగొండ మండలం లోని కొడవటంచ గ్రామం శ్రీ లక్ష్మీ నృసింహుని దివ్యథామం.  రేగొండ మండల కేంద్రానికి 9కి.మీ. దూరం లో కొడవటంచ లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి స్వయంభువు గా వెలసి, భక్తులను కరుణిస్తున్న దివ్యక్షేత్రమిది.
                   
            శ్రీ స్వామి వారు యోగముద్ర లో నుండగా వామాంకముపై నిత్యానపాయిని యైన లక్ష్మీదేవి   వెలసియుండుట  ఈ క్షేత్ర విశిష్టత గా చెప్పబడుతోంది.
                     

            
                                                           ఆలయ రాజగోపురం

             హిరణ్యకశ్యపుని  వథానంతరం ఉగ్రరూపుడైన శ్రీ నృసింహుని శాంతపరచ డానికి కాదు గదా   ఆయనను  సమీపించడానికి కూడ ఎవ్వరు సాహసించలేక పోయారు. ఆ సమయం లో   ఆయన వక్షస్థలం పై నిత్యం విలసిల్లే  శ్రీ లక్ష్మీదేవి కూడ శ్రీ స్వామి  వారి ఉగ్ర రూపాన్ని చూచి, కొంచెం జంకి దూరంగానే నిలబడిపోయిందట.
                 అప్పుడు సనకసనందనాది మహర్షులు,దేవతాగణము కలిసి పరమ భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదకుమారుని వేడుకొనగా, ప్రహ్లాదుడు శ్రీ స్వామి చెంతకు వెళ్లి వివిథస్తోత్రాలతో ఆయనను శాంతపరచాడు. శాంత స్వరూపుడై, యోగముద్రలో నున్న శ్రీ స్వామి వారి వామాంకమున కలుములజవరాలు  శ్రీ లక్ష్మీదేవి ఆసీనురాలైంది.శ్రీ స్వామి అదే రూపంతో  అర్చావతారుడై ఈక్షేత్రం లో వెలసి  భక్తజనులను కటాక్షిస్తున్నారు.
                  

         
                                                                            ధ్వజస్థంభం
             
            మాంథాత కాలం నాటికే ఈ క్షేత్రము ఉన్నదనడానికి నిదర్శనంగా ఈ ఆలయానికి కొంచెం దూరములో మాంథాత బండ అని పిలువబడే ఒక శిల నేటికి కన్పిస్తుంది.
                       (మాంథాత భాగవత శేఖరుడైన అంబరీషుని యొక్క తండ్రి .  మాంథాత తండ్రి యువనాశ్వుడు. యువనాశ్వుడు సంతానం కోస పుత్రకామేష్టి యాగం చేశాడు. భగీరథుడు యువనాశ్వుని భార్యలకోసం యాగ జలాన్ని భద్రపరుచగా, ఆ విషయం తెలియని యువనాశ్వుడు ఆ నీటిని త్రాగి వేయడం తో అతను గర్భం ధరించాడు.అతని కడుపు చీల్చుకొని మాంథాత  బైట కొచ్చాడు.) (భాగవతం)
                       కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల వంశీకుడైన శ్రీమాన్  తూపురాణి రంగాచార్యులు గారు ఒకరోజు  ఇప్పుడు ఆలయ ప్రాంగణము నందు గల  బావిలో నుండి నీరు తోడుచుండగా చేద (దీనినే కొన్ని ప్రాంతాల్లో బక్కెట అంటారు) లో అంగుష్ట ప్రమాణంలో ఉన్న శ్రీ స్వామి వారి ప్రతిమ ఒకటి  వచ్చింది.  పరమనిష్టాగరిష్ఠుడు,అకుంఠిత నృసింహదీక్షాతత్పరుడునైన శ్రీ ఆచార్యుల వారు ఆ ప్రతిమను చూచి, మిక్కిలి ఆశ్చర్యానందాలకు లోనైన వారై, తన పూజామందిరములో ఆ ప్రతిమ ను ఉంచి పూజించుచుండిరి. కాని ఆచార్యులవారికి ఏదో ఒక అసంతృప్తి. ఆ స్వామి దర్శనం అందరికీ కల్గింప చేయాలనే తపన.  అందుకే శ్రీ స్వామి వారిని అర్చాస్వరూపముతో వెలసి,భక్తుల పూజలందుకొని తనను కృతార్థుని చేయవలసింది గా ప్రతిరోజు అనుష్టానసమయం లో శ్రీ స్వామివారిని  వేడుకొనసాగారు ఆచార్యులవారు.
                          

    
                                        ధ్వజస్థంభ  పూర్వదృశ్యం
           
                ఆచార్యులవారి కోరిక తీరే సమయమాసన్నమైంది.ఒకరోజు శ్రీ రంగాచార్యుల వారికి శ్రీ నృసింహస్వామి  స్వప్నము నందు సాక్షాత్కరించి  చిన్నప్రతిమ లభించిన బావికి సమీపం లో తాను అర్చారూపంగా వెలసినట్లు చెప్పి అంతర్థానమయ్యారు.  శ్రీ ఆచార్యుల వారు మేల్కొని, ఆ ప్రాంతమంతయు ఎంతవెతికినను   శ్రీ స్వామి వారి విగ్రహము ఆచూకి లభించలేదు. అలసిపోయి, నిరాశ తో కొద్దిగా విశ్రమించిన ఆచార్యుల వారికి స్వప్నములో మరల స్వామి ప్రత్యక్షమైనారు. తన అర్చారూపము గల ప్రదేశమునకు ఆనవాలు గా ఇటుక ఆకారమున్న శిలపై శ్రీ ఆంజనేయుని విగ్రహము కన్పించగలదని చెప్పారట. మరల ఆ ప్రదేశమున వెతగ్గా శ్రీ ఆంజనేయవిగ్రహము, దాని సమీపం లో ఒక మట్టి దిబ్బ కనిపించాయి. అప్పుడు ఆచార్యుల వారు తన చేతిలో నున్న కొడవలి  తో ఆ మట్టి దిబ్బ ను పెళ్ళగించగా, శ్రీ స్వామివారి పరమాద్భుత విగ్రహం వెలుగు చూసింది. కొడవలి వంచిన శ్రీ స్వామివారి పేర ఈ క్షేత్రం కొడవటి వంచ  అయి, క్రమంగా ప్రజల వాడుకలో కొడవటంచ  గా పిలువబడుతోంది.
             
           ప్రస్తుతం పరిసర గ్రామాల ప్రజలు దీన్ని  కొడంచ  అనే పిలుస్తున్నారు. మేము యాత్రలో భాగం గా గణపూర్ దగ్గర కొడవటంచ అని అడిగితే, వాళ్లు కొడంచ అనడం మాకు మొదట్లో ఆశ్చర్యాన్ని కల్గించింది. కాని పరకాల రోడ్డు మలుపులో మార్గసూచిక గా కొడంచ అనే బోర్డు కన్పించడం తో  మారిన ఊరు పేరు మాకు అప్పుడు అర్థమైంది.
                       

               
                                                    ముఖమండపం లో కొలువుతీరిన ఆంజనేయుడు

              ఆనాడు బావి చేదలో దొరికిన చిన్నప్రతిమ ఈనాటికి సాలగ్రామాల మథ్య  ఆలయం లో పూజించబడుతోంది. ఆనాడు స్వామి విగ్రహము వెలసిన ప్రదేశమందే ఆలయ నిర్మాణం జరిగి,దిన దిన ప్రవర్థమానమౌతోంది.

                        
                    ఆలయం ముఖమండపం,అంత్రాలయం,గర్భాలయం గా మూడుభాగాలుగా నిర్మించచబడింది. ముఖమండపం లో ఉత్తరాభిముఖుడుగా ఉన్న ఆంజనేయుడు భక్తుల మొఱలను స్వామికి నివేదిస్తున్నట్లు స్వామి వైపుకు ముకుళిత హస్తుడై దర్శనమిస్తాడు. అంత్రాలయానికి రెండువైపులా జయవిజయులు కొలువుతీరిఉన్నారు. శ్రీ స్వామి వారికి ఎదురుగా ముఖమండపం లో గరుడాళ్వరు వేంచేసియున్నాడు.
                                   


                         
                            
                            శ్రీలక్ష్మీ నృసింహుని దివ్యరూపం        
                        
                   గర్భాలయం లో శ్రీ నృసింహుడు  వామాంకస్థిత లక్ష్మీ  యుతుడై దర్శనమిస్తున్నారు. వారి చుట్టు ఆళ్వారులు పరివేష్టించి ఉన్నారు. శ్రీ రామానుజుల వారి దివ్య విగ్రహం  ప్రత్యేకంగా  ఉత్సవమూర్తుల చెంత దృశ్యమానమౌతోంది. 

                                   ఆలయ శిఖర దర్శనం
                  ఆదివారం,పర్వదినాల్లో ఇక్కడకు భక్తులు అధికసంఖ్య లో వస్తారు.ఆలయానికి ముందు ఉన్న విశాలమైన ఖాళీస్థలం లో, చెట్ల క్రింద వంటలు చేసుకొని, దేవునికి చూపించి,  అయినవారితో పాటు అక్కడికొచ్చిన వారికి కూడ వడ్డించి ఆత్మతృప్తి తో తిరిగి వెడుతుంటారు.
                       
            
                                                 శ్రీ స్వామి వారి వాహనశాల
                            
     ఈ క్షేత్రం లో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని మానసికరోగము లను నివారించే పరమాద్భుతమూర్తి గా భక్తులు విశ్వసిస్తారు.  తీవ్రమైన మానసిక  వ్యాధు లతో బాధపడుతూ,గొలుసులతో బంధింపబడి,ఈ క్షేత్త్రానికి తీసుకురాబడిన వ్యాధిగ్రస్తులు అనేకమంది ప్రతిరోజు  ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా శ్రీ స్వామి వారికి ప్రదక్షిణలు శ్రీ స్వామి తీర్థాన్ని సేవించి, సాంబ్రాణి పొగ వేసుకుంటూ మండలం రోజులు సేవిస్తే  వారు ఆరోగ్యవంతులైన నిదర్శనాలు కొల్లలుగా ఉన్నాయట.   దారిద్య్ర,ఋణబాధలు  స్వామి  వారి దర్శన మాత్రముననే దూరమౌతాయని భక్తుల దృఢవిశ్వాసం. సంతానం లేని వారు మండలం రోజులు ఆలయ ప్రదక్షిణ చేస్తే సంతాన వంతు లౌతారని నమ్మకం.
                          

          
                                         గుడి ముందు విశాలమైన ప్రదేశంలో కళ్యాణ మండపం

                 ఈ ఆలయం లో పాంచరాత్రాగమ సంప్రదాయానుసారముగా  పూజలు నిర్వహించ బడుతున్నాయి.ప్రతి సంవత్సరం వృషభసంక్రమణ మాసం లో  శ్రీ నృసింహుని జయంత్యుత్సవాలు,ఫాల్గుణ మాసం లో పాంచాహ్నిక దీక్ష తో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ పౌర్ణమి రోజున శ్రీ స్వామి వారి శకటోత్సవం జరుగుతుంది. ఆ రోజున ఆలయం చుట్టు వివిధ రకాల ప్రభలతో అలంకరించిన బోనాలు, ఎడ్లబండ్లు తిరగటం విశేష ఆకర్షణ. ఈ సందర్భంగా దాదాపు రెండు లక్షలమంది యాత్రికులు శ్రీస్వామి వారిని దర్శించుకుంటారు.
                            
             

                                                       ఆలయ ఉత్తర ద్వారం   

          శ్రీ స్వామివారికి  ఉగాది, శ్రీరామనవమి, తొలిఏకాదశి,ఆండాళ్ తిరునక్షత్రం, శ్రీకృష్ణ     జన్మాష్టమి,దసరా, దీపావళి, కార్తీకపౌర్ణమి, ధనుర్మాసము లో అధ్యయనోత్సవం, మొదలైన పర్వదినాల సందర్భంగా విశేషపూజలు,సేవలు జరుగుతాయి.
           
              “  కరవీర సుమాభూషా చక్షురానందమూర్తయే !
              కొడవటంచ నివాసాయ  శ్రీ నృసింహాయ మంగళమ్ !!”



*************************************************************** *****************