Showing posts with label historical back ground. Show all posts
Showing posts with label historical back ground. Show all posts

Friday, 29 August 2014

కొండవీడు సింగనసానిపేట శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి ఆలయం



  

  Kondaveed Sri Navaneeta Balakrishnaswamy Aalayam.



  कॊंडवीडु सिंगनसानिपेट श्री नवनीतबालकृष्णस्वामि आलयम्.

                           
                                   కొండవీడు  సింగనసాని పేట

                    శ్రీ నవనీత బాలకృష్ణస్వామి ఆలయం.
                           

                                    భారతదేశం లోనే అపూర్వము ,అపురూపమునైన శ్రీ బాలకృష్ణస్వామి అర్చావతారమూర్తి గా కొలువు దీరిన  దివ్యాలయం శ్రీ గోపీనాథ స్వామి ఆలయం .ఇది గుంటూరు జిల్లా  కొండవీడు లోని సింగనసాని పేట లో విరాజిల్లుతోంది. ఇచ్చట మూలవిరాట్టు బాలకృష్ణుడు. దీన్నే నవనీత బాలకష్ణ దేవాలయం గా పిలుస్తున్నారు.  ఈ విగ్రహం శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఇక్కడికి  చేరుకొందని చరిత్ర చెపుతోంది. ఏ తద్విశిష్ట విలక్షణ లక్షణాంకితమూర్తి మరెచ్చటా లేదనేది తద్విజ్ఞుల భావన.
  



                                       కొండవీడు కోట ప్రవేశాన్ని సూచిస్తున్న ఆధునిక నిర్మాణం

           
                            మూలవిరాట్టు ప్రత్యేకత.                 మైసూరు మహారాజ భవనమందు ఒక అడుగు బాలకృష్ణ విగ్రహమున్నట్లు చెప్పబడుతోంది కాని ఈ  గోపీనాథస్వామి సమున్నత విగ్రహము . సుమారు  2.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల పొడవు కలిగి  కుడిచేతి లో వెన్నముద్ద , ఎడమచేతిలో వెన్నగిన్నెకుడికాలును  వెనుకకు చాపి , ఎడమ మోకాలును నేలకు ఆనించి   ఆలీఢ కుంచిత పాదముతో దోగాడుతున్న సుందర సుకుమార  మూర్తి ఈ స్వామి. మెడలో పులిగోరు , ముత్యాలహారాలు వ్రేలాడు విశాల వక్షస్థలము,  మొలకు మువ్వల మొలత్రాడు , ఒత్తైన పిరుదలతో చేతులకు మురుగులు, కాళ్ళకు కడియాలతో, దిశిమొలతో పారాడుచున్న ఏడాది లోపు పండంటి మగ బిడ్డ మన కళ్ళముందు ప్రత్యక్షమై మనలను మై మరపింప చేస్తాడు. పాలుగారు నున్నని చెక్కిళ్ళు , కొనదేరిన గడ్డము , కోటేరు లాంటి ముక్కు , విశాలమైన నేత్రాలతో . అందంగా వంగిన ధనురాకార కనుబొమ్మలతో , నుదటిన కస్తూరి తిలకం తో  , ఉంగరాల జుట్టుతో    సమస్త లోకాలను తన బొజ్జ లో నింపుకొని  అమాయకం గా చూస్తున్న  ఈ నందాంగనా ఢింభకుని చూడటానికి నిజంగా రెండు కళ్లు చాలవు. వేయికళ్లున్న ఇంద్రుడు కూడ ఈ సౌందర్యథాముని తనివి తీరా చూడలేడేమో అనిపించేటంతటి అద్భుత సౌందర్యం ఈ నవనీత బాలకృష్ణునిది. ఇరుభుజాలపై  శంఖచక్రాలు , బ్రహ్మసూత్రము  , శిరస్సు పై అథోముఖ పద్మము తో దిగంబరం గా దర్శన మిచ్చే  ఇంతటి అందమైన రూపాన్ని శిలపై చెక్కడమనేది సాథ్యమేనా అనిపిస్తుంది.
                

                                నవనీత బాలకృష్ణ స్వామి దివ్యమంగళ విగ్రహం


                   
                      చారిత్రక ప్రాధాన్యం  :---          సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయలు ఈ విగ్రహావిర్భావానికి మూలకారకుడుగా కొనియాడ బడుతున్నాడు. విజయనగర సామ్రాజ్యాధీశుడైన ఆ తెలుగురాయలు ఒకనాడు తన భువనవిజయ సభ లో సాహిత్యగోష్ఠి లో నుండగా ఒక కవి సందర్భవశంగా ఈ క్రింది శ్లోకాన్ని  పఠించాడు.

బాలాయ నీలవపుషే నవకింకిణీ
జాలాభిరామ జఘనాయ ! దిగంబరాయ!
శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ!
నందాత్మజాయ! నవనీతముషే ! నమస్తే !!             
         
         నీలమేఘ శ్యాముడై, దిశిమొలతో నడుము చుట్టు మొలనూలుతో  , మెడలో పులిగోరు తో అలంకరించబడి వెన్నను తినుచున్న నందాంగనాతనూజుడైన బాలకృష్ణునకు నమస్కరించుచున్నాను . అని ఆ కవి  వర్ణించిన బాలకృష్ణుని  సుందరరూపము శ్రీకృష్ణరాయల వారి మనోఫలకముపై బలంగా ముద్రించబడింది.  ఆ రాత్రి అదే ధ్యాస లో నిద్రించిన శ్రీ రాయల వారికి ఆ బాలకృష్ణమూర్తియే స్వప్నం లో సాక్షాత్కరించాడు.

                        ఆ సుందర సుకుమార ముగ్థమోహనమూర్తిని కనులార గాంచిన  శ్రీకృష్ణ రాయలవారి ఆనందానికి అవథులు లేవు. అసలే శ్రీ వైష్ణవుడు. అందునా  శ్రీకృష్ణ నామథేయుడు . ఇంకేముంది. తెల్లవారుతూనే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన శిల్పులను రప్పించి ,శ్రీ బాలకృష్ణుని దివ్యరూపాన్ని వారికి  వివరించి ,అటువంటి మూర్తిని  ఆగమ శిల్పశాస్త్ర సమ్మతంగా నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించాడు.

               శ్రీ రాయల వారి ఆజ్ఞను శిరసావహించిన శిల్పులు శిలాన్వేషణ కై బయలుదేరి అనేక పర్వతాలలో వెదుకుతూ ఉదయగిరి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ శిలాన్వేషణ లో నున్న ఆ ఆస్థాన శిల్పులకు  స్వయంవ్వక్తమయిన నవనీతబాలకృష్ణుని విగ్రహం  దృశ్యమానమైంది.  ఆశ్చర్యం తో పాటు అమితానందాన్ని పొందిన శిల్పులు  రాయలవారికి ఆ విగ్రహలభ్యతను గూర్చి తెలియజేయడం ,  ఆ మహారాజు స్వయంగా పర్వత ప్రాంతానికి వెళ్లి , స్వయంవ్యక్త బాలకృష్ణుని దివ్యవిగ్రహాన్ని చూసి ముగ్థుడై , దాన్ని వెంటనే రాజధాని యైన హంపీ నగరానికి తరలించమని ఆజ్ఞాపించడం జరిగిపోయాయి.

                         ఇంతలో రాజకీయ పరిస్థితులు మారాయి. తూర్పు దిగ్విజయ యాత్ర కు శ్రీకృష్ణదేవరాయలు బయలుదేరవలసి వచ్చింది. ఈ దిగ్విజయయాత్ర లో శ్రీ రాయలు అద్దంకి , కొండవీడు ,కొండపల్లి ,పొట్నూరు, వడ్డాది ని  జయించి కటకం వరకు తన జైత్రయాత్రను కొనసాగించి సార్వభౌముడయ్యాడు. తన విజయచిహ్నం గా పొట్నూరు వద్ద ఒక విజయ స్థంభాన్ని ,కొండవీడు వద్ద మరొక విజయస్థంభాన్ని ప్రతిష్ఠించాడు. ఇది అరవై అడుగుల ఎత్తు జయస్థంభము.

           కొండవీటి విజయానంతరం శ్రీకృష్ణదేవరాయలు వేయించిన కొండవీటి జయస్థంభం       
                
                           ఈ జైత్రయాత్ర లో ఒక్క కొండవీటి గిరి దుర్గాన్ని జయించడానికి శ్రీ రాయలవారికి తిమ్మరుసు నేతృత్వం లోనే నాలుగు నెలల పై చిలుకు సమయం పట్టినట్టు చెప్పబడుతోంది .కొండవీడు విజయానంతరం వీరభద్రగజపతి ని బంధించి ,  కొండవీటి దుర్గానికి తిరుమల రాయలు ను దుర్గాధిపతి గా నియమించాడు.

                       



                                      కోట ఆంజనేయస్వామి
                         

                               దిగ్విజయానంతరం  రాజథానికి చేరుకున్న శ్రీకృష్ణ దేవరాయలు ను నవనీత బాలకృష్ణుని  మధురజ్ఞాపకాలు మళ్లీ అల్లు కున్నాయి. స్వప్నసాక్షాత్కారము , తదనంతర పరిణామాలు  గుర్తు కొచ్చి, ఆ స్వామి అనుగ్రహం వలననే తన జైత్రయాత్ర దిగ్విజయమైందని భావించి ,  ఆ గోపీనాథుని కొండవీడు లో ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. ఆ విషయాన్ని కొండవీడు దుర్గాధిపతియైన తిరుమలరాయలకు వర్తమానం పంపాడు.

              


                                       తిరుమల రాయల శాసనము
                    

                                      శ్రీకృష్ణరాయల వారి ఆజ్ఞానుసారం తిరుమలరాయలు కొండవీడు నందు  శ్రీకృష్ణదేవరాయలు స్థాపించిన కొండవీడు జయస్తంభానికి పడమర గా. ఇంతకు ముందు రెడ్డిరాజులు నిర్మించిన శివాలయానికి ఉత్తరంగా విజయనగర శిల్పకళారీతులు ఉట్టిపడేటట్లు గా శ్రీ గోపీనాథస్వామి ఆలయాన్ని నిర్మింపజేసి , నవనీత బాలకృష్ణుని ప్రతిష్ఠించాడు. ఆనాడు శ్రీ తిరుమల రాయలు వేయించిన దాన శాసనం మరి కొన్ని శాసనాలతో కలిసి  ఈ ఆలయ ఉత్తర ద్వారానికి ఇరువైపుల నేటికీ దర్శనమిస్తోంది.

    

                             ఉత్తర ద్వారం వద్ద నున్న   రెండవ శాసనం

                               

               చీకటి రోజులు  :------         శ్రీకృష్ణదేవరాయల అనంతరం విజయనగర సామ్రాజ్యం బలహీనమైంది.  అదను కోసం కాసుక్కూర్చున్న శతృరాజులు కొండవీడును  ముట్టడించారు.. గోల్కొండ నవాబు మల్కిబరాం చేతుల్లోకి కొండవీడు వెళ్లిపోతోందని గ్రహించిన ఆలయ సేవకులు , భక్తులు శ్రీ గోపీనాథస్వామి మూలమూర్తిని , ఉత్సవిగ్రహాలను ఆ గుడి నుండి తొలగించి భూమి లో భద్రపరచి  తమ వంతు బాథ్యత ను  దైవకార్యం గా  పూర్తిచేశారు..   

    
                               
                                                                 ఉత్తరం వైపు ఆలయదృశ్యం

               కాలం మారింది :----                ముస్లిం పాలన ముగిసింది. ఈస్టిండియా  పాలన ప్రారంభమై , క్రమంగా జమీందారీ పాలన కు దారితీసింది. ఈ కొండవీడు ప్రాంతం  చిలకలూరిపేట జమీందారుల ఏలుబడిలోకి వెళ్ళింది. జమీందారుల ఏలుబడి లో  కొండవీడు తన పూర్వప్రాభవాన్ని కోల్పోయి ,చిన్న చిన్నగ్రామాలుగా విడిపోయింది. ఇప్పుడు గోపీనాథ శిథిలాలయమున్న ఈ ప్రాంతాన్ని కోట గ్రామం గా పిలుస్తున్నారు. ఈ ఆలయం చుట్టూ ఉన్నభూములు వ్యవసాయభూములు గా మారిపోయాయి.

                                      దక్షిణం వైపు ఆలయ శిల్పం
              
                       షుమారు రెండు శతాబ్దాలకు పూర్వం ఒక రైతు ఈ ఆలయప్రాంతంలో  పొలం పని చేసుకుంటూ నీటి కాలువలను త్రవ్వుతుంటే అతని భాగ్య ఫలంగా శ్రీ నవనీత బాలకృష్ణుడు , ఉత్సవ విగ్రహాలు బయటపడ్డాయి..  ఆ విషయం వెంటనే చిలకలూరిపేట జమీందారులకు  తెలియ చేయబడింది.

       

              
                                       శ్రీ గోపీనాథస్వామి శిథిలాలయం ,కొండవీడు.
                            

                 

                       శ్రీ గోపీనాథస్వామి ఆలయ ముందు భాగం

                    అప్పటి చిలకలూరిపేట జమీందారుగారైన శ్రీ రాజా మానూరు వేంకట కృష్ణరాయణం గారు స్వయంగా కోట గ్రామానికి వచ్చి , ఆ విగ్రహాలను వెలికి తీయించి వాని సౌందర్యానికి ముగ్థులై , వానిని తీసుకెళ్ళి తమ రాజథాని యైన చిలకలూరి పేట లో ఆలయాన్ని నిర్మించి, అక్కడ  ప్రతిష్టించాలని సంకల్పించుకున్నారు. చెక్కపని వారిని పిలిపించి విగ్రహాలను తరలించడానికి బండిని తయారు చేయించి చిలకలూరిపేట బయలుదేర తీశారు.



                                  ప్రవేశించడానికి కూడ వీలులేనంత గా శిథిలమైన నృసింహాలయం.

              సింగనసాని పేట :-----         కాని దైవ నిర్ణయం వేరుగా ఉంది. శ్రీ నవనీత బాలకృష్ణుని ఎక్కించుకున్న  ఆ బండి ఒక కిలోమీటరు మాత్రం ప్రయాణించి , సింగనసానిపేట చేరగానే బండి ఇరుసు విరిగి పోయింది.( ఈ సింగనసాని పేట రెడ్డిరాజుల ఆస్థానం లోని మామిడి సింగన, మంత్రి గా ఉన్న మరొక సింగన లలో ఎవరో ఒకరి పేరున ఏర్పడి ఉండవచ్చునని భావించబడుతోంది . ఆ సింగనసాని పేట కాలక్రమంగా సింగిస్కాన్పేట అయి , ఇప్పుడు 
చంఘిజ్ఖాన్ పేట గా పిలవబడుతోంది.)

                     బండిని అనుసరించి వస్తున్న జమీందారు గారు ఈ జరిగిన ఆటంకానికి విచారించి  , వెంటనే బండిని బాగుచేయవలసిందిగా వడ్రంగులను ఆజ్ఞాపించి , గ్రామస్తులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి , కొంతసేపు సింగిస్కాన్పేట లోనే విశ్రమించారు. కలత నిద్ర లోకి జారుకున్న జమీందారు వారికి  బాలకృష్ణస్వామి స్వప్నం లో సాక్షాత్కరించి తనను ఇక్కడ నుండి తరలించవద్దని ఆజ్ఞాపించాడట. అందుకు ప్రత్యమ్నాయంగా చిలకలూరిపేటలోని జమీందారుగారి తోటలో పున్నాగచెట్టు క్రింద ఉన్న మట్టిదిబ్బ ను తవ్విస్తే శ్రీ లక్ష్మీనరసింహస్వామి  విగ్రహం లభిస్తుందని ,దానిని చిలుకలూరిపేట లో ప్రతిష్ఠించుకొమ్మని ఆదేశించారట శ్రీ బాలకృష్ణ స్వామి .

                                  

                
                     సింగనసాని పేట శ్రీ బాలకృష్ణస్వామి ఆలయం

                            శ్రీ వారి ఆదేశానుసారం  చిలకలూరిపేట జమీందారుగారైన శ్రీ రాజా మానూరు వెంకటకృష్ణ రాయణిం బహద్దూరు గారు, వారి సోదరులు చిన్న కృష్ణమ్మా రావు గారు సంప్రదించుకొని ఆనాటికే సింగనసానిపేట లో నున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి , ఆ ఆలయం లోనే శ్రీ నవనీతబాలకృష్ణుని ప్రతిష్ఠించినట్లు  , ఆలయ నిర్వహణకు   500 ఎకరాల భూమిని సమర్పించినట్లు స్థలపురాణం వలన తెలుస్తోంది.

                          ఈ నవనీత బాల కృష్ణుని మొదట కలలో దర్శించి ,అనంతరం స్వయంవ్యక్త  విగ్రహాన్ని వీక్షించి , కొండవీడు లో ఆలయ నిర్మాణం చేయించి ప్రతిష్ఠింపచేసింది శ్రీ కృష్ణ దేవరాయలు. శ్రీ స్వామిని పునర్దర్శించి , పున: ప్రతిష్ఠ చేసింది  శ్రీ రాజా మానూరు వెంకట కృష్ణరాయణం గారు. ఇక్కడ శ్రీ స్వామి  వారు ,  శ్రీ స్వామి సమారాధకులు   ఇద్దరు కృష్ణ నామథేయులే అవ్వడం యాదృచ్ఛికమేనా ?

           బాలకృష్ణ మూర్తి -  ఆగమశాస్త్రం  : ----               దేవాలయల్లోని ఏ అర్చామూర్తికైనా శిల్పం లోనే వస్త్రము ధరించినట్టు  మలచబడుతుంది. అది శాస్త్రము. కాని ఈ గోపీనాథస్వామి విగ్రహం మాత్రం దిగంబరం గా దర్శనమిస్తోంది. ఇది శాస్త్ర సమ్మతమా.? అనేది ధర్మ సందేహం.
        
                ఈ నవనీత గోపాలకృష్ణ స్వామి విగ్రహం స్వయంవ్యక్తం . అయినా  కూడ వైఖానసాగమ శ్రీ శాస్త్రం  లో చెప్పబడిన ప్రకారం  ఈ నవనీతకృష్ణుని రూపం  దర్శనమివ్వడం    చెప్పుకోదగిన విషయం.

                      భృగుమహర్షి విరచిత ఖిలాధికారం , ప్రకీర్ణాధికార గ్రంథాలలో బాలకృష్ణస్వామి అర్చావతారమూర్తిని  గురించి చేసిన వర్ణన ఈ నవనీత గోపీనాథస్వామి కి చక్కగా సరిపోతోంది. ప్రకీర్ణాధికారం లో  బాలగోపాల అర్చామూర్తి వర్ణన ఇలా ఉంది.


      వామే జానుం సమాకుంచ్య దీర్ఘమన్యం ప్రసారిత: !
      ఆకుంచితాన్య పాదేన చాసన స్థితి శోభినా !
       అన్యహస్తేన సంధార్య నవనీతమ్ నవం నవమ్ !!
            ఏవం కృష్ణం ప్రకుర్వీత బాలగోపాల విగ్రహం . !! “

                     ( నవనీత బాలకృష్ణమూర్తి ఉత్సవ మూర్తి. ఖిలాధికారం 19 -194 వ పేజి)
     
         పద్మపీఠో పరిగత మాకుంచ్యేకం పదం విభుమ్

        సంధార్య దక్షిణే హస్తే నవనీతం తథే తరత్ !!
        వామే పాదం సమాకుంచ్య చోత్తానీకృత్య దక్షిణమ్ !
        దక్షిణం చాభయహస్తం నవనీతయుతం తథా !!
        సాంబరం ప్రకుర్వీత విగతాంబర మేవ వా !
           ఏవం విధినా కుర్యాన్నవనీత విభుం  బుధ :  !!

                     ( దిగంబరమూర్తి –ప్రకీర్ణాధికారం 16/42- 45 )

                     ఆగమశాస్త్ర విషయాలను సమగ్రంగా  పరిశీలిస్తే  నవనీత బాలకృష్ణ స్వామి అర్చామూర్తి  శాస్త్ర పరిథి లోనే ఉందని  అర్థ మౌతోంది. నవనీత నాథుని రూపాన్ని  వస్త్ర సహితం గానైనా , వస్త్ర రహితం గానైనా నిర్మించవచ్చు నని చెప్పబడుతోంది. కాబట్టి దిశమొల తో నున్న బాలగోపాలరూపం కూడ అర్చాయోగ్యం గా  అంగీకరించబడింది.

      
గోపీనాథ ఆలయ శిల్పసంపద :------        ఆనాటి కొండవీడు నేడు కోట గ్రామం గా మారిపోయింది. ఈ గ్రామం లో  శ్రీ గోపీనాథస్వామి ఆలయం  శిథిలావస్థ లో ఉంది.  దీనిని చీకటి కోనేరు అని , కత్తుల బావి  అని స్థానికులు పిలుస్తున్నారు. కొందరైతే కస్తూర్భాయ్ ఆలయ మంటారు. ఏదైనా మిగిలిన ఈ ఆలయం లో శిల్పసంపద సందర్శకులకు  విలువైన సమాచారాన్నిస్తోంది.  శ్రీకృష్ణదేవరాయలు వేయించిన కొండవీడు జయస్థంభానికి పడమర గా ఈ ఆలయం నిర్మించబడిందని ముందే చెప్పుకున్నాం.

                     



గర్భాలయం  ఉత్తరం వైపు గోడ పై కాళీయమర్దనుడు





                        గర్భాలయం లో ఉత్తరం వైపు గోడపై కన్పించే బుద్దభగవానుడు
                      

                          ఈ   ఆలయం పూర్తి గా విజయనగర శిల్పరీతి లో నిర్మించ బడింది.  విశాలమైన ముఖమండపము . దానిని ఆనుకొని రంగమండపము ,  అంత్రాలయము , గర్భాలయం మనకు కన్పిస్తాయి.  కాని ఇవన్నీ కూలి పోవడానికి సిద్ధం గా ఉన్నాయి. గర్భాలయం ముష్కరులచేత  పూర్తి గా  తవ్వివేయబడింది. గబ్బిలాల వాసన తో ప్రవేశించడానికి కూడ వీలులేనంత చీకటిమయం గా ఉంది.  కాని శ్రమించి లోపలికి వెడితే  ,  గర్భాలయం ఉత్తరం గోడ మీద మధ్య లో బుద్ధభగవానుడు చిన్మయముద్ర లో దర్శనమిచ్చాడు. ఆయన కు తూర్పు గా ఈశాన్యం లో కాళీయ మర్దనుని దివ్యరూపం కన్పిస్తుంది. గర్భాలయం లో వాయవ్యం లో పడమర గోడ అందమైన నాగబంధం గోచరిస్తుంది. ఇవన్నీ సెల్ టార్చి తో గుర్తించి ,  కెమెరా ఫ్లాష్ తో తీసుకోవడం జరిగింది.

                                                        చెన్నకేశవుని కుడ్య శిల్పం





                                            వాయునందనుడు

                                   రంగమండపం ప్రవేశద్వారానికి కుడివైపు  గోపీనాథస్వామి  కుడ్యశిల్పాన్ని దర్శించవచ్చు.  ఈ మండపం లో ఈశాన్యభాగం లో గోడమీద శ్రీ రామచంద్రస్వామి .  దానికి కొంచెం దిగువగా   శ్రీ వేంకటేశ్వరస్వామి , వీరికి కొంచెం దూరం లో ముకులిత హస్తుడై ఆంజనేయుడు కన్పిస్తారు.  అంత్రాలయం  గోడపైన చెన్నకేశవుని  చూడవచ్చు. ఆలయ పురోభాగం లో శిథిలమైన నంది , వినాయకుని విగ్రహాలు ,  బోర్లాపడి ఎవరో తెలియని ఒక అమ్మవారి విగ్రహం కన్పిస్తాయి. ఇవి  ఆనాడు రెడ్డి రాజులు నిర్మించారని చెప్పబడుతున్న శివాలయ అవశేషాలై ఉంటాయనిపిస్తోంది.  

           


                                        శ్రీ గోపీనాథస్వామి కుడ్యశిల్పం
                    

                                      రంగమండపం లో కొలువుదీరిన  శ్రీరాముడు ,  శ్రీ వేంకటేశ్వరుడు 
                           

                                  ఛిద్రమైన వినాయక శిల్ఫం


                        సింగనసాని పేట ఆలయం :----           ఈ ఆలయానికి ఒక కిలోమీటరు దూరం లో  నవనీత బాలకృష్ణ ఆలయం ఉంది. ఇది మొదట వేణుగోపాలస్వామి ఆలయం . దీని లోనే  చిలకలూరి పేట జమీందారు గారు శ్రీ స్వామి కోరిక మేరకు బాలకృష్ణస్వామిని ఇచ్చట ప్రతిష్ఠించారని చెప్పుకున్నాం.  ఇది  చిన్న ఆలయం. ఆలయానికి విమానం గాని, శిఖరం గాని లేవు. ముఖమండపం ,అంత్రాలయం ,గర్భాలయం ఉన్నాయి.  ఆలయం లో తూర్పుముఖం గా  నవనీత బాలకృష్ణ స్వామి ,   ఉత్తరం వైపు ఉపాలయం లో శ్రీ వేణుగోపాలస్వామి , ఆయనకు అభిముఖం గా దక్షిణం వైపు ఉపాలయం లో శ్రీ రాజ్యలక్ష్మీఅమ్మవారు కొలువు దీరి ఉంటారు.
                       
                           
                           


                                         ఆలయ ధ్వజస్ధంభం

                   


సీతారామలక్ష్మణులు   కుడ్యశిల్పం




                             మండపం లో కొలువుదీరిన  నీలవర్ణ హనుమంతుడు

                             
                        ఆలయానికి ఎదురు గా ఉన్న మండపం లో ఆంజనేయుడు ఉన్నాడు . అయితే ఈ ఆంజనేయుడు మాత్రం మిగతా ఆలయాల్లో  ఆంజనేయుని వలే  గంగసింధూరం కాకుండా ఒంటికి  నీలపురంగు పులుముకొని ఉండటం మనం గమనించవచ్చు. తన ప్రభువైన  నవనీత బాలకృష్ణుడు  నీలమేఘశ్యాముడు కాబట్టి తాను కూడ  ఆ రంగునే అలముకున్నాడేమో ననిపిస్తుంది. ఆలయప్రాగణం లో అక్కడక్కడ శిథిల శిల్పాలు కొన్ని కన్పిస్తాయి.


                       

ఈ ఆలయాన్ని గూర్చి తీసిన  లఘుచిత్రాన్ని youtube  ద్వారా ఇప్పుడు చూడవచ్చు.






                        
                




                      సింగన సానిపేట ఆలయ ప్రాంగణం లోని కొన్ని శిథిల శిల్పాలు

                       సాధారణ రోజుల్లో కంటే కృష్ణాష్టమి రోజున  ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ఈ క్షేత్ర స్థలపురాణాన్ని సంకలనం చేసి , ముద్రించిన  శ్రీ స్వామి వారి ఆనువంశిక అర్చకస్వాములు  డా. పరుచూరు వెంకట నరసింహాచార్యులు గారు చెప్పారు.
     
                         

                           ఆలయ ప్రాగణం లో వినాయకుడు.

                     కోట గ్రామం లోనే ఇస్కాన్ సంస్థ నిర్వహణ లో రూపుదిద్దుకుంటన్న   శ్రీకృష్ణ మందిర సముదాయం మనకు కన్పిస్తుంది.  ఇవిగో ఆ దృశ్యాలు.




         



                          ఇప్పడు   ఈ ప్రదేశం లో స్వర్ణాలయ నిర్మాణానికి ఇస్కాన్ ప్రయత్నిస్తున్నట్లు గా వార్తలొస్తున్నాయి. ఆ నవనీత కృష్ణుని అనుగ్రహం అందరియెడల ఉండాలని కోరుకుందాం.



**********  బాలం ముకుందం మనసా స్మరామి*****************************

Friday, 5 July 2013

పాలంపేట లోని రామప్పగుడి ఆలయ సోయగాలు

            పాలంపేట  లోని  రామప్పగుడి ఆలయసోయగాలు
                    
               ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్లు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట  గ్రామం పేరు రామప్పగుడి  మూలంగానే ప్రపంచానికి  తెలిసింది. కాని అసలు రామప్ప ఎవరు. ?  రామప్ప శిల్పి అనుకుంటే అతని పేర  ఇంత గొప్పఆలయం   ఎవరు నిర్మించారు ? ఆలయం ఎందుకు నిర్మించబడింది.? ఇది స్మృతి చిహ్నం కాదు గదా.! ఈ ఆలయం పూర్తిచేయడానికి, పదమూడు సంవత్సరాలు పట్టిందని ఒకరు వ్రాస్తుంటే, నలభై సంవత్సరాలని మరొకరు వ్రాశారు.
                                        


      ఆలయం లో ఉన్న దేవుడు రామలింగేశ్వరుడని. ఆయన పేరుతో రామప్ప గుడి అయ్యిందనుకుందామా.? అంటే కాదు. ఆలయం లోని దేవుడు రుద్రేశ్వరుడని, రేచర్ల రుద్రయ్య ఈ ఆలయాన్ని కట్టించాడని చారిత్రకాథారాలు, శాసనాలు  లభిస్తున్నాయి.  మరి అయితే మధ్యలో ఱాళ్లలో రమణీమణులను తీర్చిదిద్దిన  ఈ ఱామప్ప ఎవరు?  గత ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇది సమాధానం దొరకని ప్రశ్న గానే మిగిలిపోయిందా.?
                       

             
                 రామప్పగుడిలోని అందాలను చూస్తున్నంత సేపు ఎప్పుడో ముఫై ఐదు సంవత్సరాల క్రితం భారతి మాసపత్రిక (?) లో చదివిన ఒక కథ  నా మనసులో కదులుతూనే ఉంది.
         
                      

                       

                  ఒకరోజున కాకతి గణపతిదేవ చక్రవర్తి ఆస్థానానికి మార్కొపొలో అనే విదేశీ యాత్రికుడు సందర్శనార్థం వచ్చాడు. సందర్శకులలో కూర్చున్న మార్కోపోలో యువరాజ సింహసనం పై కూర్చొని ఉన్న రుద్రదేవుని చూసి యువరాజు స్త్రీ రూపం లో ఉంటే అచ్చం రామప్ప గుడి లోని శిల్పాకృతి గా ఉంటారు అన్నాడట. ఆ మాటలు మహామంత్రి శివ(మహ)దేవయ్య కు చేరాయి. వెంటనే మహామంత్రి పాలంపేట చేరుకున్నారు. అచ్చటి శిల్పాలను చూసి ఆగ్రహోదగ్రుడయ్యాడు.  వెంటనే శిల్పి రామప్ప ను పిలిపించాడు. ఈ శిల్పాల నిర్మాణానికి ప్రేరణ ఎవరు? ఏమిటినువ్వు చేసిన పని?  అని నిలదీశాడు.


          

            
                  
             మహామంత్రి కోపానికి కారణం తెలియని శిల్పి రామప్పజరిగిన విషయం చెప్పాడు. కొన్ని రోజుల క్రితం అడవిలా ఉండే ఆ ప్రాంతం లోకి మేకలను తోలుకుంటూ కొందరు యువతులు వచ్చారని , వారిలో ఉన్న ఒక సామాన్య యువతి రూపురేఖావిలాస, లావణ్యాలు అపురూపం గా కన్పించి ఆశ్చర్యపరిచాయని, అనుకోకుండానే అదే రూపం తన చిత్రాల్లో చోటు చేసుకుంటోందేమోనని  సవినయం గా విన్నవించాడు రామప్ప.  మహామంత్రి కొద్దిసేపు మౌనం గా ఉండిపోయాడు.
                             


            
                      పుట్టిననాటి నుండి పురుషుడు గానే పెంచబడుతూ, వేషథారణ కూడ  పురుషోచితం గానే థరిస్తున్న రుద్రమదేవి కోటలో ఉన్నంత కాలం  రుద్రదేవుడు గనే వ్యవహరించబడుతుండేది. ఎప్పుడన్నా అంతరంగికులతో కలసి ఏ వాహ్యాళికో వెళ్లినప్పుడు  స్త్రీ సహజమైన కోరికతో యువతీ వస్త్ర థారణ తో కొంత సేపు విహరించి, ఆనందించేది యువరాజు గా ఉన్న రోజుల్లో రుద్రమదేవి. ఈ విషయం మహామంత్రి కి తెలిసి కూడ, అలంకారప్రియత్వం  స్త్రీ సహజ లక్షణమని , పెద్దయితే  బాథ్యత తెలుసుకుంటుదని, పదహారేళ్ళ ప్రాయం లోని యువతుల భావాలు తెలిసిన ఒక కన్నతండ్రి మనసుతో,  మమకారం తో  ఆమెను గట్టిగా నిరోథించలేకపోయాడు.
        

            
 అదే ఈనాడు ఇంతటి ఉపద్రవాన్ని తెచ్చిపెట్టింది. దీర్ఘంగా ఆలోచించిన మహామంత్రి , అసలు విషయాన్ని శిల్పి రామప్ప కు చెప్పి , సమస్యను వెంటనే ముగించమని ఆజ్ఞాపించారు. విషయం విని మొదలు నరికిన మహావృక్షం లాగ  ప్రక్కకు ఒరిగిపోయాడు ఆ మహాశిల్పి. పిడుగుపడిన ఆలయశిఖరం లాగ వాలిపోయాడు. తానేదో ఘోరమైన పాపం చేసిన భావన అతనిలో ప్రవేశించి నిలువునా దహించి వేయసాగింది. తన ప్రమేయం లేకుండానే తాను చేసిన   పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే నిర్మాణం లో ఉన్న ఆలయం శిఖరం  పైకి ఎక్కేసి, ప్రక్కనే ఉన్న కొలను లోకి దూకేసి ప్రాణత్యాగం  చేసుకున్నాడు.  శిఖర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ పొరపాటున  కాలు జారిపడ్డాడని అందరూ చెప్పుకున్నారు. పాపం రామప్ప జారిపడ్డాడని చెప్పుకుంటూ చక్కని గుడి కట్టాడని ,జాలిగా,.... బాధ గా ..... అలా... అలా... చెప్పుకుంటూ చివరకు అది రామప్ప గుడి అయిపోయింది.  ప్రపంచంలో మరెక్కడా కూడ శిల్పి పేరుతో ప్రసిద్దమైన మరొక ఆలయం లేదని ఎక్కడో చదివినట్లు గుర్తు.
                          


             ఈ విషయం   మహామంత్రి శివదేవయ్యకు, మహాశిల్పి రామప్ప కు తప్పితే మూడో వ్యక్తికి తెలియదు.  రుద్రమదేవి కి కూడ  తెలిసే అవకాశం లేదు. ఇది కథో, కాదో తెలియదు కాని ఒక మహాశిల్పికి నివాళి గా మాత్రం ఈ కథ నా మనసులో నిలిచిపోయింది. కాల నిర్ణయాన్ని పట్టి చూస్తే కలవని కథ యిది. ఎక్కడో ఏదో అడ్డం వస్తోంది.



                                  నంది మండపం
      (కాకతీయ చరిత్ర  ఆథారం గా రుద్రమదేవి సింహాసనం అథిష్టించిన కాలం. క్రీ.శ.1262. మరణించిన తేది క్రీ.శ.1289 నవంబరు 12 వ తేది. గణపతిదేవచక్రవర్తి పరిపాలనాకాలం. క్రీ.శ .1199 -1261 ( రామప్పగుడి -34 వ పేజి)
          

                   
                                       శాసనమండపం

                       రేచర్ల రుద్రయ్య  ఈ ఆలయం లో వేయించిన శాసనం లో  ఈ ఆలయాన్ని రుద్రేశ్వర  స్వామి ఆలయమనే అన్నాడు. ఈ ఆలయనిర్మాణం శా.శ 1135 వ సం. నకు సరియగు శ్రీముఖ నామ సంవత్సరం చైత్ర, శుద్ద అష్టమి ఆదివారం 31.3 1213 పూర్తి అయినట్లు వ్రాయబడింది. ఈ రుద్రయ్య తాతలే పిల్లలమఱ్ఱి లోని ఎరకేశ్వర,నామేశ్వర ఆలయ నిర్మాతలు.
         


   ఈ ఆలయ సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. కేమెరా పట్టుకొని గుడి చుట్టూ తిరగటం తప్పితే ఎక్కడనుంచి మొదలు పెట్టాలో అర్థం కాని పరిస్థితి.ఈ ఆలయ సౌందర్యాన్ని వర్ణించాలంటే శిల్పశాస్త్రము, నాట్యశాస్త్రం తోపాటు భవన నిర్మాణ, గణిత వాస్తు శాస్త్రాల పరిజ్ఞానం కూడ కావాలి.  జాయప సేనాని వ్రాసిన నృత్యరత్నావళి ఆథారం గా ఈ గుడి లోని శిల్పాలు మలచబడ్డాయని తద్విజ్ఞులు వ్రాస్తున్నారు. ఎందరో పురా పురుషుల కార్యదీక్ష,కళాదక్షత,కఠోరపరిశ్రమ, ప్రాణత్యాగాలు కలిసి  ఈ అపూర్వ కళాసౌథము తెలుగు వారికి మిగిలింది.
      


               
      ( ఈ ఆలయ సమగ్ర చిత్రాల్ని you tube లో నాచే చేర్చబడిన  “ The Beauteous Of  Ramappa Temple, palampet, part -1 & 2   ద్వారా చూడవచ్చు.  )            
        


          పునాదిలో ఇసుక, దాని పైన పీఠము, దాని పై ఉప పీఠము,  ఆ ఉపపీఠము పైన ఆలయ నిర్మాణము జరిగాయి. ఉత్తర, దక్షిణ సంప్రదాయ మేలు కలయికగా ఎరుపు,సల్లని రాళ్లు   నిర్మాణం లో వాడబడ్డాయి. ఈ ఆలయ శిఖరం నీటి పై తేలునట్టి, గట్టి ఇటుకలతో నిర్మించబడింది.
                       


                                          ఆలయ ముఖద్వారం

                రామప్పగుడి లోని ప్రథాన ఆలయమునందలి మూర్తి రుద్రేశ్వరుడు . ఈ స్వామి తూర్పుముఖం గా ఉంటాడు. ఎదురుగా నంది మండపం,దానిలో  కాకతీయ శిల్పకళా శోభితుడైన   నందీశ్వరుడు దర్శనమిస్తాడు.  ఈ నంది మండపం శిథిలమై, మరల పునర్నిర్మాణదశ లో ఉంది.
               
             


                               ఈ గుడికి తూర్పు,ఉత్తర,దక్షిణదిక్కులలో ప్రవేశద్వారాలున్నాయి. ప్రతిద్వారం పైన చూరుల్లో  ఏటవాలుగా కుడి ఎడమల్లో రెండుచొప్పున మదనికలు అనబడే సాలభంజికలు  నిలపెట్ట బడ్డాయి. వీటినే నాసికాస్థంభ ప్రతిమలు అంటారు. ఇవే ప్రథానం గా రామప్పగుడి కి ఆకర్షణలు. ఇవి నల్లరాతిలో మలచబడిన అద్భుత శిల్పాలు. 
  

                ఎనిమిది వందల సంవత్సరాల తరువాత కూడ ఇవి సజీవ సుందరుల వలే చూపరుల మనసును దోచుకుంటున్నాయంటే, ఆనాడు ఇంకా ఎంత రమణీయం గా ఉండేవో నని పిస్తుంది.  వీనిలో ఒక్క విగ్రహం తప్ప మిగిలినవన్నీ ముష్కరుల సమ్మెట ప్రహారాలకు భిన్నమైనవే.
                  

                
                 రంగమండపమునందలి స్థంభాలు, పైకప్పు, సమస్తము శిల్ప సంభరితమే. క్షీరసాగరమథనం నుండి పార్వతీకళ్యాణం వరకు  పురాణ గాథలన్నీ ఇక్కడ  కనువిందు చేస్తాయి.రంగమండపము చుట్టు గోడల నానుకొని ఉపవేదిక పైన ఉన్న మందిరాల్లో వినాయకుడు, విష్ణువు, మహిషాసురమర్థిని మున్నగు దేవతామూర్తులు కన్పిస్తారు.
                  


                        అంతరాళ ద్వారం పైన ,గర్భాలయ ద్వారం పైన మరెన్నెన్నో శిల్పాలు.   అంతరాళ ద్వారానికి అటునిటు కిటికీలుగా అమర్చబడిన రెండు దీర్ఘచతురస్ర శిలాఫలకాలు లున్నాయి. వీనిపైన నాట్యమృదంగ వాద్యకారులైన స్త్రీ,పురుషుల శిల్పాలు అనేకము వివిథభంగిమలలో మలచబడ్డాయి. ఇవి పేరిణి తాండవానికి సంబంధించినవిగా భావించబడుతున్నాయి.పద్మశ్రీ నటరాజరామకృష్ణ  చేసిన పేరిణి తాండవ ఉద్ధరణకు ఇవే ఆథారభూత శిల్పాలుగా చెపుతున్నారు.
                  
                                 రంగమండపం లోని స్థంభ శిల్పాలు                      

         
          ఇంకా ఎంత వ్రాసినా తీపిని గురించి వర్ణించినట్లే ఉంటుంది. పంచదారను నాలుకపై వేసుకుంటే  రుచి తెలుస్తుంది కాని వర్ణిస్తే కాదుగదా.  అదేవిథంగ రామప్ప శిల్ప సౌందర్యాన్ని దర్శించవలసినదే కాని వర్ణింపనలవికాదు.
                   
                                     రంగమండప స్థంభ శిల్పాలు
   
           ఈ ఆలయానికి కుడిఎడమలుగా మరి రెండు ఆలయాలున్నాయి. ఒకటి పూర్తిగా శిథిలమై పోగా మరొకటి అర్థ శిథిలావస్థలో ఉంది. వీటిని కాటేశ్వర. కామేశ్వర ఆలయాలుగా చెపుతున్నారు.










** వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం****************