ఐలూరు శ్రీ రామేశ్వరస్వామి
కృష్ణాతీరం లోని లోని శైవక్షేత్రా ల్లో దక్షిణకాశీ గా ప్రసిద్ది
పొందిన మరో క్షేత్రం ఐలూరు. ఉభయరామేశ్వర క్షేత్రంగా బ్రహ్మోత్తరపురాణం పేర్కొంది.
ఆలయముఖద్వారం
స్థలపురాణం. :----- త్రేతాయుగం లో
రైభ్యుడు అను మహాముని కృష్ణానదీ తీరం లో శివుని గూర్చి దీర్ఘకాలం తపస్సు
చేశాడు. ఆయన ప్రతిరోజు కృష్ణానది లో స్నానం చేసి, తీరం లో ఇసుక తో శివలింగాన్ని చేసి దాన్ని,కృష్ణాజలాల
తో అభిషేకం చేస్తూ ,ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. ప్రత్యక్షమైన శంకరుడు కావలసిన వరం
కోరుకొమ్మన్నాడు. రైభ్యమహాముని చేతులు జోడించి, “మహానుభావా! నిత్యము నేను పూజిస్తున్న ఈ సైకతలింగరూపం లో
నీవిచ్చట స్థిరం గా వెలసి నిను సేవించిన భక్తుల, కోర్కెల నెరవేరునట్లు
అనుగ్రహించమని ప్రార్ధించెను. అంత పరమశివుడు నీ కోరిక కాలాంతరమందు సిద్ధించగలదని
చెప్పి, అంతర్ధాన మయ్యెను.
రావణ సంహారానంతరం
శ్రీ రామచంద్రుడు సీతా సమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు.పుష్పకవిమానం కృష్ణానది
లో ఈ ప్రాంతానికి వచ్చేసరికి హఠాత్తు గా
ఆగిపోయి నెమ్మది గా క్రిందకు ధిగింది ఈ హఠాత్పరి ణా మానికి ఆశ్చర్యపోయి , అందరూ
క్రిందకు దిగి పరిసరాలను పరిశీలించసాగారు.
ఇంతలో కొంతమంది మునులు రామునిచేరి స్తుతించి,రైభ్యుని వృత్తాంతాన్ని వివరించారు.
శివసంకల్పము అనుల్లంఘనీయము కావున ఇచ్చట
శివలింగప్రతిష్ఠ గావించవలసినదిగాను, ఆ శివుడు రామలింగేశ్వరుడని పిలువ బడుచు,
రైభ్యమహర్షి కిచ్చిన వరము ననుసరించి, తన్నుసేవించిన వారికి భుక్తి ముక్తులను ప్ర సాదించగలడని చెప్పి,
నాలుగు ఘడియలలో దివ్యమైన లగ్నమున్నదని
పల్కిరి.
ఆ మాటలు
విన్న శ్రీరాముడు మిక్కిలి సంతోషించి, అప్పటికే బ్రహ్మహత్యాపాతక పరిహారంగా
కోటిలింగాల ప్రతిష్టా కార్యక్రమంలో ఉండటం వలన వెంటనే కైలాసానికి వెళ్లి శివుని
మెప్పించి శివలింగాన్ని తీసుకురావలసందని,
స్వల్పవ్యవధి మాత్రమే ఉన్నదని చెప్పి
హనుమంతుని పంపించెను.
హనుమంతుడు
వచ్చులోపల సీతారాములు కృష్ణాజలాలో మంగళ
స్నానము లాచరించి ఇసుకలో కూర్చొని
ఆంజనేయుని రాకకోసం ఎదురు చూస్తూ గడిచిన రోజుల గూర్చి ముచ్చట లాడు కొను
చుండిరి.సీతాదేవి మాటలు చెపుతూ ప్రోగు చేసిన ఇసుకంతయు లింగాకారము గా తయారైనది.
ఇంతలో ముహూర్తము సమీపించినదని ముని సంఘము తొందర జేయుటయు ఆంజనేయుని రాక ఆలస్యమగుటయు
జరిగిపోయాయి. ఇటు చూడ రైభ్యుడు నిత్యము ఏ
ప్రదేశం లో ఐతే సైకతలింగాన్ని చేసి
పూజించాడో, అదే ప్రదేశం లో సీతమ్మతల్లి ప్రోగు చేసిన ఇసుక శివలింగాకృతిని పొంది ఉండటం చూశారు మునీశ్వరులు. కాకతాళీయమో, ధైవసంకల్పమో
గాని రైభ్యుడు పూజించిన ప్రదేశంలో నే సైకతలింగాన్ని చూచి దాన్నే ప్రతిష్టించమని మునులు చెప్పగా, శ్రీ
రాముడు ఆ సైకతలింగాన్నే ప్రతిష్టించి
,పూజించి శంకరుని స్తుతించాడు.
శ్రీ రాముడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శివుడు ప్ర త్యక్షమై “ ఓ రామా! నీవు ప్రతిష్టించిన ఈ
లింగమును చూచిన మాత్రముననే మానవులు చేసిన పాపములు నశించును. కృష్ణాజలములచే ఈ
లింగమును అభిషేకించినవారు మహాపాతకముల నుండి విముక్తి పొంది అంత్యమున
మోక్షమును పొందుదు” రని చెప్పి అదృశ్యమయ్యెను.
తరువాత కొంతసేపటికి వచ్చిన ఆంజనేయుడు దివ్యతేజస్సు తో ప్రకాశిస్తున్న సైకతలింగాన్ని చూచి,విషయం తెలుసుకొని,తన శ్రమ
వృధాయైనదని విచారించి, తనతోకతో చుట్టి ఆ సైకత లింగమును
పెకలించుటకు ప్రయత్నించెను. కుడి చేతి తో తాను తెచ్చిన లింగమును పట్టుకొని, బలమంతా ఉపయోగించి ఆకాశమున కెగిరి లాగుటకు
యత్నించగా, పరమేశ్వరుడు అతని గర్వమును అణచ దలచి
లింగమునకు చుట్టిన తోకను సడలించాడు
. దానితో ఆంజనేయుడు తూలి ఒక క్రోసుదూరమున పడి మూర్ఛపోయాడు. శ్రీరాముడు వానరులతో
కూడి అక్కడకు వెళ్లి హనుమ శరీరమును
చేతులతో నిమిరెను. అప్పటికి తెప్పరిల్లిన
హనుమ సీతారాములకు ప్రణమిల్లగా ,శ్రీ రామచంద్రుడు
అతనిని ఓదార్చి, పరమేశ్వరుని సంకల్పము
అమోఘమని పల్కి, ఆంజనేయుడు తెచ్చిన శివలింగము నేలపై బడిన ప్రదేశం లోనే
ప్రతిష్టించెను. అట్లు ప్రతిష్టించిన స్థలమే ఐలూరు. శ్రీ రాముని చేత
ప్రతిష్టించబడటం వలన ఈస్వామి ని
రామేశ్వరుడని పిలుస్తున్నారు, శ్రీ రాముడు ప్రతిష్టించిన రెండు లింగాలు కృష్ణానది
కి ఇరువైపుల ఉండటం వలన దీనిని ఉభయ రామేశ్వర క్షేత్ర మని కూడ పిలుస్తున్నారు.
ఆలయ ప్రత్యేకత. :_____ ఈ శివాలయం లో నందీశ్వరుడు లేకపోవడం ప్రత్యేకత. ఫ్రతిశివాలయం లోను కన్పించే నంది విగ్రహం ఈ ఆలయం లో కన్పడదు . అంతే కాకుండా గర్భాలయంలో ఉన్న శివలింగాని కన్న అతిపెద్ద శివలింగం ఒకటి అంత్రాలయం లో కన్పిస్తోంది. ఈ శివలింగం కృష్ణ లో కొట్టుకొస్తే ఇక్కడ ప్రతిష్టించామని, మహమ్మదీయుల దండయాత్రల సమయం లో గర్భాలయాన్ని మూసేసి ఈ విగ్రహాన్నే ఉంచారని పూర్వీకులు చెప్పినట్లుగా అర్చక స్వాములు చెప్పారు.
మరొక ప్రత్యేకత
ఏమిటంటే ఈ ఆలయం పడమర ముఖంగా తిరిగి
ఉంటుంది. కాని పానమట్టం ఉత్తరంవైపు నకు
అనగా స్వామివారి కుడివైపు కుంటుంది.
జీవనది వైపు పానమట్టం ఉంటుందని అర్చకులన్నారు.
ప్రత్యేక
ఉత్సవాలు.:----- దక్షిణ కాశీ గా పేరుపొందిన ఐలూరు
క్షేత్రానికి మహాశివరాత్రి పర్వదినం రోజున
వేలాది మంది భక్తులు కృష్ణానది లో స్నానం చేసి రామేశ్వరుని దర్శించుకోవడం ఈ
ప్రాంతంలో ఆచారం గా ఉంది. అదే రోజు
రామేశ్వరస్వామి వారి కళ్యాణం
కూడ మిక్కిలి వైభవంగా జరుగుతుంది.
ఈ ఆలయానికి ప్రక్కనే
శ్రీ రఘునాథస్వామి ఆలయం ఉంది. శ్రీ రాముడు
ప్రతిష్టించిన ఈశ్వరుని ప్రక్కనే
సీతాలక్ష్మణ హనూమత్సమేత రామచంద్రుని ఆలయం
నిర్మించారు. ఇదికూడ ప్రాచీనఆలయమే కాని చారిత్రక ఆధారాలు లభించడం లేదు.
శాసనం ఒకవైపు
రామేశ్వర స్వామి ఆలయ ఆవరణ లో 12 వ శతాబ్దానివి
గా భావించబడుతున్న రెండు శాసనాలు లోతుగా పాతి పెట్టబడి కన్పిస్తున్నాయి. ఆలయానికి
వెనుక అమ్మవారి విగ్రహం ఒకటి చెట్టుక్రింద నిలపెట్టబడి ఉంది. అమ్మ వారి విగ్రహాన్ని తెచ్చి
,ప్రతిష్టిద్దామని ప్రయత్నిస్తే ఏవో
అవాంతరాలు వచ్చాయని అందువలన అక్కడ పడేశారని గ్రామస్తులు చెప్పారు.
రవాణాసౌకర్యాలు :------ . ఈ పుణ్యక్షేత్రం కృష్ణాజిల్లా మేడూరు కి 10
కి.మీ లో ఉంది. గుడివాడ నుండి మేడూరు కు ఆర్టీసి సర్వీసు లు పరిమితసంఖ్య లో ఉన్నాయి.స్వంతవాహనం ఉంటే విజయవాడ కరకట్ట మీద ప్రయాణం సౌకర్యం గా
ఉంటుంది.
*********************************************************
one of ubaya ramalingeswara temple is at chilumuru near tenali.
ReplyDelete