Thursday 6 December 2012

ఆగిరిపల్లి శ్రీ వ్యాఘ్రలక్ష్మీ నరసింహస్వామి

                                   Aagiripalli 
  
 Sri  Sobhanachala Vyghra Lakshmi Narasimha  Swamy Aalayam.
                       
           ఆగిరిపల్లి శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయం.
                                 आगिरिपल्लि 
श्री शोभनाचल व्याघ्रलक्ष्मी नरसिंहस्वामि आलयम्.
              
                  కృష్ణాజిల్లా లోని ఆగిరిపల్లి దక్షిణ సింహాచలం గా ప్రసిద్ధి పొందిన వ్యాఘ్ర నారసింహ క్షేత్రం. దీనినే ఆకిరిపల్లి అని కూడ పిలుస్తారు. కిరి అంటే వరాహము .  ఇచ్చట ఆది వరాహ రూపు డైన శ్రీ మహావిష్ణువు సృష్టించిన పుష్కరిణి వరాహ పుష్కరిణి గా పిలువబడుతోంది. వరాహ రూపుని చేత  సృజించబడిన పుష్కరిణి గల  ఆ  గ్రామం ఆ కిరి పల్లి.   గిరి అంటే కొండ .శుభప్రదమైన కొండ గల్గిన ఆ ఊరు ఆ  గిరి పల్లి.   అనే అక్షరాన్ని తెలుగు వాళ్లు ఒక అందమైన దాన్ని లేక తెలియనిదాన్ని  అదిగో! అని చూపించే టప్పుడు వాడతారు.     అలా వచ్చిన పేర్లే ఈ రెండూను ఆ కిరి పల్లి. ఆ గిరి పల్లి.      
                          ఈ రెండు పేర్లు  ఇక్కడ  శోభనాచలం మీద వెలసిన       శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ప్రభావం తో వచ్చినవే.
    
                    
                           ఆలయ రాజ గోపురం   
            
        స్థలపురాణం:----                            ఈ ఆలయం  4000 సంవత్సరాల చరిత్ర గల్లిన అత్యంత ప్రాచీన మైన ఆలయంగా గా బ్రహ్మాండ పురాణం చెపుతోంది. స్వామి వెలసిన ఈ శోభనాద్రి  కృతయుగం  లో  కళ్యాణాద్రి యని, త్రేతాయుగం లో  శోభా చల మని,    ద్వాపరయుగం   లో    స్వప్న శైల మని,కలియుగం  లో శోభనాద్రి అని పిలువ బడుతున్నట్లు స్థలపురాణం చెపుతోంది.
                 శుభవ్రతుడనే మహారాజు సనత్కుమారుని వలన నారసింహ మంత్రాన్ని పొంది, రాజ్యాన్ని కుమారుల కప్పగించి, తపస్సు చేసు కోవడానికి బయలుదేరాడు. ప్రశాంత ప్రదేశం కోసం వెతుకుతూ వస్తున్న ఆ రాజుకు దట్టమైన అడవి,ఫలవృక్షాలతో కూడిన ఈ ప్రాంతానికి  వచ్చేసరికి ఏదో  తెలియని ఆనందం, మానసిక ప్రశాంతత లభించడం తో, తన తపస్సుకు ఇదే సరైన ప్రదేశంగా నిర్ణయించుకొని, శ్రీ మహావిష్ణువు ని  గూర్చి దీర్ఘకాలం తపస్సు చేసి స్వామిని సాక్షాత్కరింప చేసుకున్నాడు.
                        


                
                    రాజ్యలక్ష్మీ సమేత వ్యాఘ్ర నరసింహస్వామి       

           ప్రత్యక్షమైన శ్రీ హరి ని శుభవ్రతుడు నీ యిల్లాలైన రాజ్యలక్ష్మీ దేవి తో కూడి  నీవు ఈ కొండపై కొలువు తీరవలసిందని, నిత్యము నిన్ను దర్శించే భాగ్యాన్ని తనకు కలిగించ వలసిందని  ప్రార్ధించాడు. భక్తున కోరికను మన్నించిన శ్రీమన్నారాయణుడు వ్యాఘ్ర ముఖుడై లక్ష్మీసమేతంగా కొలువు తీరాడు. కొండమీద మీద స్వయంభువు ఐన స్వామి వ్యాఘ్రరూపుడు గానే దర్శనమిస్తాడు. కొండ క్రింద ఆలయం లో లక్ష్మీ సమేతంగా కొలువు తీరి ఉంటాడు. క్షేత్రపాలకుడు గా   పర్వత శిఖరాగ్రం పై మల్లేశ్వరస్వామి  పూజ లందుకొంటున్నాడు.
                         మరొక కథ ననుసరించి  --- శివ కేశవు లిరువురు సాయంకాలపు వాహ్యాళికి బయలుదేరారు.  ఈ ప్రదేశానికి వచ్చేసరికి సంధ్యాసమయం అవ్వడంతో సాయం సంధ్యావందనానికి అనువైన తావును చూడవలసింది గా విష్ణువు శంకరుణ్ణి కోరాడు. శంకరుడు వెతుకుతూ కొండ పై భాగానికి వెళ్లి,  ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడే ఉండి పోయాడు. ఎంతసేపయినా శివుడు రాక పోవడం తో వెతుకుతూ వెళ్లిన విష్ణువు ప్రశాంతంగా కూర్చున్న శివుని చూచి కోపంగా అక్కణ్ణుంచి రెండడగులు క్రిందకు దూకి, అక్కడ వెలిశాడని, అందుకు సాక్ష్యంగా ఇప్పటికి కూడ శివాలయం వద్ద విష్ణువు పాదముద్ర లున్నా యని, అచ్చటి రాతి పై నున్న పాదచిహ్నాలను చూపిస్తున్నారు. ఈ కథ  భక్తజనం లో బాగా ప్రచారం లో ఉంది.
                        
          
                
                      స్వామి వారి దిగువ ఆలయ దృశ్యం

                           దూరంగా కొండమీద ఆలయాలను చూడవచ్చు

                ఇది కాక  -వైష్ణవ గ్రంథాలలో మరొక కథ విన్పిస్తోంది. ఈ పుణ్య ప్రదేశానికి దగ్గర్లో గోపాలాచార్యులు అనే వైష్ణవ భక్తుడుండేవాడు. ఆయనకు ఒకనాటి రాత్రి స్వామి కలలో కన్పించి, తాను శోభనాచలం మీద  ఉన్నానని తనని సేవించి తరించవలసిందని ఆజ్ఞాపించాడు. మేల్కొన్న ఆచార్యులవారు ఊరి ప్రజలను తీసుకొని శోభనాద్రి పైన కొండగుహల్లో వెతికారు.ఎక్కడ చూచినా పెద్దపులి గాండ్రింపులు,అస్పష్టంగా చెట్ల చాటున వ్యాఘ్రరూపము దర్శన మిచ్చాయి. దాన్నివెంటాడిన వెళ్లిన గోపాలాచార్యులవారికి గుహలో వ్యాఘ్రరూప నారసింహ దర్శనమైంది. ఆయన సేవలోనే తన శేష జీవితాన్నిగడిపిన గోపాలాచార్యుల వారు చివరి రోజుల్లో  నారసింహమంత్రం తో పాటు స్వామిసేవ ను కూడ తన కుమారుడైన శోభనాచార్యుల కప్పగించాడు .
                                  
                 శోభనాచార్యుల వారు గొప్ప పండితులు. వీరు శోభనాచల శతకాన్ని వ్రాశారు. వీరు ఒక పర్యాయం దేవాలయ అభివృద్ధి నిధుల కోసం హైదరాబాదు నవాబు దగ్గరకు సహాయం కోసం వెళ్లారు.నవాబు గారు దేవుణ్ణి చూపించు.సహాయంచేస్తాను అన్నారు.వెంటనే శోభనాచార్యుల వారు కొద్దిగా పంచదార,మజ్జిగ తెప్పించి, మజ్జిగ లో పంచదార కలిపి తీసుకోవలసిందిగా స్వామిని పిలిచారట.  అందరు చూస్తుండ గానే వ్యాఘ్రరూపంలో  ఉన్న ఒక చేయి  వచ్చి ఆ పాత్రను తీసుకున్నదట. ఇటువంటి వృత్తాంతాలు స్వామి వారి ప్రభావాన్ని తెలియజేస్తుంటాయి. ఈ వివరణ నరసింహదర్శనమ్ 88   అనే బ్లాగు లో ఒక  జీయరు స్వామి చే ప్రస్తావించబడింది.
   



                            కొండమీదకు మెట్లమార్గం
         
            ఆలయప్రత్యేకత.:-----                  ఈ ఆలయానికి అత్యంత అరుదుగా కన్పించే  పొడవాటి, వెడల్పయిన 750 మెట్లు కొండపై నున్న మూలవిరాట్టు వరకు ఉండాయి.  ఎన్నో వందలసంవత్సరాలు గా చెక్కు చెదరని వాటి నిర్మాణ పటిమకు జోహార్లు చెప్పక తప్పదు. క్రీ.శ 1561 లో   పుష్కరిణి మెట్లను, కొండపైకి మెట్లను నిర్మించారని కొందరు వ్రాశారు కాని సాక్ష్యాలు లభించడం లేదు.
                             ఇక్కడ అర్చకస్వాములు ప్రతిరోజు  ఉదయం, సాయంత్రం 750మెట్లు ఎక్కి పూజ,నివేదనలు చేసి వస్తారు.ప్రతిరోజు స్వామివారి నివేదన లోవ్యంజనంగా ఎండుమిరపకాయలు తిరగమోతలో వేసిన చింతపండు బండ పచ్చడి తప్పనిసరిగా ఉండాలి. చక్రపొంగలి,పులిహోర భోగాలు ఉంటూనే ఉంటాయి
                  
         

దిగువ సన్నిథి

                ప్రతి సాయంత్రం కొండమీద ఉన్న గుడిపై ప్రత్యేకంగా  అమరిక చేసిన గూట్లో దీపాన్ని పెట్టడం ఇక్కడ అనాది గా వస్తున్న ఆచారం. ఆ జ్యోతి విజయవాడ ఊరిబయటకు కన్పించేదనట, ఆ  కొండమీద దీపం కొండెక్కితే  ఏదో అనర్థం జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తారు.ప్రతి రోజూ కొండమీద స్వామి కి సాయంత్రం పూట నివేదనగా  ఇతర భోగాలు ఉన్నా లేకపోయినా  సతాయించిన(తాలింపు పెట్టిన)   శనగలు మాత్రం తప్పని సరిగా ఉంటాయి.
           ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వీడియో దృశ్యాలను  You tube లో      
చూడవచ్చు.

            https://www.youtube.com/watch?v=9NzjdiQX0MY   

             కొండ  పైకి వెళ్లే మెట్ల మార్గం లో ఐదు అనుబంధ ఆలయాలు  మనకు కన్పిస్తాయి. ఇవి   రాజ్యలక్ష్మీఆలయం,ఆళ్వార్, సీతాకోదండరామ, వేంకటరమణమూర్తి, వేణుగోపాలస్వామి ఆలయాలు.
          శోభనాచల  బ్యానరు మీద 1949 లో రాజా మీర్జాపురం జమీందారు గారు డైరెక్టరు  మరియు నిర్మాత గా    కీలుగుఱ్ఱం ్   అనే తెలుగు చలనచిత్రాన్ని నిర్మించారు. దీనికి ఘంటసాల సంగీతం. ్అంజలీ, నాగేశ్వరరావు నాయికా నాయకులు.


     ఆలయం ప్రాంగణం లోని శ్రీ రాజా నారయ్య అప్పారాయణిం గారి విగ్రహం

               ప్రత్యేక ఉత్సవాలు.:--    ఈ స్వామి వారి ఉత్సవాల్లో ప్రథానంగా చెప్పుకొనేదికార్తీక దీపోత్సవం. జమీందారుల కాలంలో కొండపై నుండి క్రిందకు మెట్టుమెట్టుకి వెలిగించిన నేతిదీపాలు ఆకాశాన్ని నేలతో కలుపుతున్నట్లు గా  ప్రకాశిస్తూ నారసింహ భక్తులకు మరపురాని అనుభూతిని, ఆనందాన్ని  మిగిల్చేవి.చుట్టుప్రక్కల గ్రామాలనుండి కూడ వేలాదిమంది భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకునే వారు.
                    
                            
            పచ్చని ప్రకృతి మథ్య కొండ పైకి మెట్ల మార్గము

      మాఘమాసంలో జరిగే రథసప్తమి నాటి రథోత్సవము, కళ్యాణోత్సవాలను కనులారా  తనివి తీర చూడవలసిందే కాని  వర్ణించ నలవి కాదు.  ధనుర్మాస ఉత్సవాలు, గోదా కళ్యాణం ప్రత్యేకంగా చెప్పవచ్చు. కళ్యాణ ఉత్సవాల్లో పెట్టే ప్రసాదాలు వంట చేసుకొని, తిని చదువుకొనే విద్యార్థులకు రాత్రి వంట చేసుకొనే పనిని తప్పించేవి. ఆగిరిపల్లి లోని శ్రీ మార్కండేయ సంస్కృత కళాశాల పూర్వవిద్యార్ధి గా  నాకు  ఇవన్నీ  మరువ లేని జ్ఞాపకాలు గా మిగిలిపోయాయి.                               .
              ప్రత్యేకపూజలు.----  స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమపూజ, ప్రతిశుక్రవారం పవళింపు సేవ, అష్టోత్తర, సహస్రనామ పూజలు  ప్రత్యేకం.
                          
                                    
         వరాహ పుష్కరిణి     దీనినే కృతయుగం లో అనంత సరస్సు అనే వారట                                      
                                                                                            ప్ర తి శనివారం గిరి ప్రదక్షణం చేస్తూ  భక్తులు కన్పిస్తారు. ఇక్కడ గిరి ప్రదక్షణం పుణ్యం తో పాటు పచ్చని చెట్ల మధ్య ఎఱ్ఱని మట్టిమీద సాయంకాలపు ఎండలో ఆహ్లాదకరమైన వాతావరణం లో  నడక ఆరోగ్యాన్ని కూడ కలిగిస్తుందని,అందువలన గిరి ప్రదక్షణం పుణ్యం,పురుషార్ధం కూడ నని చెపుతుంటారు..
                  
                  కుజదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్నవాళ్లు స్వామి వారి కళ్యాణం చేయిస్తే వివాహమౌతుందని భక్తుల నమ్మకం.
                       ఊరికి నాలుగు వైపుల కళ్యాణ మండపాలు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఊరి మథ్యలో కొఠాయి అనే పేరు తో పెద్ద కళ్యాణమండపం ఉంది.  స్వామి వారి కళ్యాణోత్సవాలు ఇక్కడే జరుగుతాయి.
         
            
                     ఆలయ ముఖద్వారం

         ఆలయం వేళలు :----            ఉ.8.గం.ల నుండి 12.30 వరకు  సా.5.30 నుండి   7.30  వరకు ఆలయం తెరచి ఉంటుంది.కొద్దిగా  తేడా లుండవచ్చు.
  రవాణా సౌకర్యాలు.:----          విజయవాడ నుండి నూజివీడు వెళ్లే మూర్గంలో విజయవాడ కు 25 కి.మీ దూరం లో ఈ పుణ్యక్షేత్రం ఉంది. విజయవాడ నుండి వయా  ఆగిరిపల్లి మీదు గా ఆర్టీసీ బస్సులు చాలా ఉన్నాయి.



***************  శ్రీ లక్ష్మీనృసింహాయ నమ : **** *****************************************                      

No comments:

Post a Comment