Wednesday, 28 November 2012

పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి


               పెదకళ్లేపల్లి       శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి
                     
                      
                         
                                      రాజగోపురం
      
              కృష్ణానదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలలో దక్షిణకాశీ గా పిలువబడుతున్న పుణ్యక్షేత్రం పెదకళ్లేపల్లి. బౌద్ధుల కాలం లో ఈ క్షేత్రాన్ని కడలిపల్లి గా పిలిచేవారు. ఇచ్చట స్వయంభువు గా కొలువుతీరిన మూర్తి శ్రీ  దుర్గా నాగేశ్వర స్వామి.

    స్ధలపురాణం.:::--      యత్ర నాగేశ్వరో దేవ: కృష్ణాచోత్తర వాహినీ,
                                 తత్ర స్నాత్వా చ పీత్వా చ పునర్జన్మ నవిద్యతే.!!”

                
                                నాగేశ్వరస్వామి

                 “ ఎక్కడ నాగేశ్వరుడు దైవంగా నిలిచి, కృష్ణ ఉత్తర వాహిని గా ప్రవహిస్తోందో, అక్కడ స్నానం చేసినా, ఆ నీరు త్రాగినా వారికి పునర్జన్మ  ఉండద ని స్కాంద పురాణోక్తి.  
        
              
                
                                   అంత్రాలయ ప్రవేశద్వారం
    
                 
                 పెదకళ్ళేపల్లి క్షేత్రమహిమ ను గూర్చి స్కాంద పురాణం  లో  వివరంగా ప్రస్తావించ బడింది. ఈ క్షేత్రమహాత్మ్యం గురించి అగస్త్యుడు శ్రీరామునికి చెప్పినట్లు పద్మపురాణం లో కనపడుతోంది. అనేకమైన సమాన ధర్మాలు ఉత్తరాన ఉన్నకాశీ క్షేత్రానికి దక్షిణాన ఉన్న పెదకళ్ళేపల్లి కి  ఉన్నట్లు చెపుతున్నారు.


కాశీలో విశ్వేశ్వరస్వామి ----కళ్ళేపల్లి లో నాగేశ్వరస్వామి
క్షేత్రజ్ఞుడు కాలభైరవుడు   ---- క్షేత్రజ్ఞుడు కాలబైరవుడు
క్షేత్ర పాలకుడు బిందుమాధవస్వామి  ------ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి
 ఆనంద వనం ---- కదళీవనం
 మణికర్ణికా ఘట్టం ------ పరికర్ణికా ఘట్టం.
గంగానదీ తీరం ------కృష్ణానదీ తీరం.
 అందుకే దీన్ని దక్షిణ కాశి గా పిలుస్తున్నారని స్ధలపురాణం.
                         
                  బదరిక,కేదార,నైమిశ,దారుక,ఉత్సల,పుష్కల, ఆనంద, సైంధవ, గుహా, మహాదండక, బృందకామిక, చంప, వింధ్య , వీక్ష మొదలైన అరణ్యాలతో పాటు 18 వ అరణ్యంగా కదళికారణ్యం ఉన్నట్లు పురాణాల్లో చెప్పబడింది.ఆ కదళీకారణ్య మే ఈ కదళీపుర క్షేత్రమని అంటారు.
                              జనమేజయుడు సర్పయాగం చేసిన స్ధలం  కూడ ఇదే నని  పురాణాలు పేర్కొన్నాయి. ఈ క్షేత్రానికి కదళీపురమనే పేరు రావడానికి మరో కథ కూడ ఉన్నట్లు పెద్దలు చెపుతారు.
                      

నాగసరస్సు                                                          

                            ఈ క్షేత్రం లో పూర్వం కశ్యప ప్రజాపతి పుత్రులైన కర్కోటక,వాసుకి,తక్షక,శంఖచూడ,ధృతరాష్ట్ర ,శంఖపాల, ధనుంజయ, హింగళు లన పేరు గల అష్టఫణి రాజుల తల్లి కద్రువ. కద్రువ శాపవిముక్తి కై ఒకవేదిక ను నిర్మించి , ఆచ్ఛాదనకై నాలుగువైపులా కదళీతరువుల నెలకొల్పి, ఈశాన్య భాగం లో గోముఖాకారంలో ఒక తటాకాన్ని త్రవ్వి, దానిలో స్నాన మాచరిస్తూ  నియమ నిష్టలతో పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది. ఒకరోజున ఆమె పూజలో ఉండగా ప్రక్క నున్నకదళీ తరువులు ఒక్కసారి గా ఫెళ ఫెళార్భాటాలతో విరిగి పడ్డాయి. అందులో నుండి దుర్గా సమేత నాగేశ్వర స్వామి లింగరూపం లో దర్శనమిచ్చారు. అంతట వారు  కంగారు గా కదళీ,! కదళీ!’ అని  కేకలు వేయడం తో  పరమేశ్వరుడు ప్రత్యక్షమై, వారితో భోగులారా!  నేను ఉద్భవించే సమయాన మీరు వేసిన కేకలు ఆచంద్రతారార్కం  నిలిచి ఉండునట్లు గా,  ఈ ప్రాంతం కదళీపురం గా పిలువ బడుతుందని వరమిచ్చాడు . ఆ కదళీపురమే కాలక్రమేణ పెదకళ్లేపల్లి గా రూపాంతరం చెందింది.

    పరికర్ణికా ఘట్టం.:-----     ఈఆలయానికి ఈశాన్యం లో నాగకుండం అనే సరస్సు ఉంది. దీనినే నాగహ్రద మని, నాగ సరోవరమని  పిలుస్తారు. ఉత్తమ తీర్ధాలన్నీ దీనిలో సంగమించడం వలన దీనిని పరికర్ణికా”” తీర్ధమని పిలుస్తున్నారు. ఇక్కడ నాగ,రుద్ర,బ్రహ్మ, బైరవ ,కుముద్వతి, అంబిక శారద మొదలైన పేర్ల తో కుండాలున్నాయి. ఇక్కడ శకు తీర్ధము, చంద్రకుండము కూడ ప్రసిద్ధి చెందినవే.



                       
                             సత్యస్ధంభం పై నాగరాజు

           ఆలయప్రత్యేకత. :------                 ఈ క్షేత్రం లోని లింగము కర్కోటకము అనే సర్పరూపమున స్పటికలింగముగా దర్శనమిస్తుంది.  ఇక్కడ స్వామి వారు స్వయంభువు.
                    
                                      సత్యస్ధంభం
         
         ఆలయప్రదక్షిణ మార్గం లో  సత్యస్ధంభం ఉంది. ఇది పాలరాతి స్ధంభం. బౌద్ధ చిహ్నాలతో అస్పష్టంగా కన్పించే బ్రాహ్మీలిపి తో ఉన్న ఈ స్ధంభం ధగ్గర ప్రమాణం  సత్యమైందిగా నమ్మకం. ప్రమాణం సమయంలో అబద్ధం చెప్పిన వ్యక్తి పై స్ధంభం విరగిపడటంతో ఆవ్యక్తి మరణించాడు. నేటికీ ఈ స్ధంభం లో సగం మాత్రమే కన్పిస్తూ ఉంటుంది. యాత్రీకులు ముందుగా ఈ సత్యస్ధంభాన్ని దర్శించిన తరువాతే స్వామివారిని సేవిస్తారు.
           
                                  
                      
                                   పంచముఖ గణపతి
       
            ఆలయ  గోడలమీద వివిధ దేవతా కృతులు కొలువు తీరి ఉన్నాయి. వీనిలో పంచముఖ గణపతి  సింహాసనారూఢుడై  దర్శనమిస్తాడు. ది చాలా అరుదైన విగ్రహం.
                     
         ఆలయప్రాంగణం లో వాయవ్య దిశ లో సుబ్రమణ్యేశ్వర ఆలయం,  ఉత్తర దిశ లో ధక్షిణాభిముఖం గా కాలభైరవాలయం ఉన్నాయి. ధక్షిణ భాగ ఉపాలయం లో వీరభద్రుడు,భద్రకాళి, ఉత్తరంగా ఉన్నఉపాలయం లో దుర్గామాత కొలువుతీరియున్నారు. ఈశాన్య దిశ లో 16స్ధంభాల కళ్యాణమండపం  నిర్మించబడింది.
          
          
                           
                          కళ్యాణ మండపం

       ప్రాచీనత   :------             క్రీ.శ 1292 లో కాకతీయ రాజగురువు  సోమశివాచార్యులు ఈ ఆలయాన్ని తొలిసారి ఉద్ధరించినట్లు తెలుస్తోంది. ఆలయ విగ్రహం దక్షిణవైపు గోడ లో ఇప్పటికీ ఉంది. తరువాత దేవరకొండ సంస్ధానాధీశులు 13 వ జమీందారు కోదండరామన్న గారు 1782 లో పునర్నిర్మాణ కార్యక్రమాలు చేశారు.1795  లో 15 వ జమీందారైన  నాగేశ్వర నాయుడు గారు గాలిగోపుర నిర్మాణం  గావించారు. 


 ఫ్రత్యేక ఉత్సవాలు.:-------                 శ్రీ దుర్గానాగేశ్వరస్వామి వారి ఆలయం లో ఉగాది పర్వదినం, శ్రావణపూర్ణిమ రోజున లక్ష కుంకుమార్చన, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆశ్వీయుజమాసం లో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు, కార్తీకమాసం లో అఖండ దీపారాధన, ఆరుద్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు స్వామి వారి కళ్యాణోత్సవం, రథోత్సవం, కన్నులపండువు గా జరుగుతుంది.
     
                              ఆలయదృశ్యం
          క్షేత్రపాలకుడు.:-------              పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాలస్వామి. రుక్మిణీ సత్యభామాసమేతుడైన వేణుగోపాలుడు ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తున్నాడు.ఈ వేణుగోపాలస్వామి ని విశ్వామిత్రుడు ప్రతిష్టించి నట్లు పద్మపురాణం చెపుతోంది.




                         రాజగోపురం లోని శాసనం
      
  రవాణా సౌకర్యాలు. :------         ఈ క్షేత్రం  మచిలీపట్టణానికి 35 కి మీ. దూరం లోను, మోపిదేవి, చల్లపల్లి కి 10 కి మీ.దూరం లోను, విజయవాడ కు 75 కి.మీ,రేపల్లె కు 20 కి.మీ .దూరం లోను ఉంది. ఆర్టీసీ మచిలీపట్నం, విజయవాడ,చల్లపల్లి, అవనిగడ్డ ల నుండి పరిమిత సంఖ్య లో సర్వీసులను నడుపుతున్నారు. అందువలన ఇక్కడకు  చేరుకోవాలంటే స్వంతవాహనం ఏర్పాటు మంచిది. శ్రమ, సమయము ,రెండూ కలిసివస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే కాఫీ ఫలహారాలు మాత్రం లభిస్తాయి. నివాసానికి  ఎటువంటి సౌకర్యాలు లేవు. తప్పక చూడవలసిన శైవ క్షేత్రాల్లో పెదకళ్లేపల్లి ఒకటి.


*********************************************************************************

No comments:

Post a Comment