Monday, 10 June 2013

కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వరస్వామి క్షేత్రం

     Kolanupaka sri chandee sameta someswaraswamy Temple.
                       
              కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామిక్షేత్రం                                     कॊलनुपाक श्री चंडी समेत सोमेश्वरस्वामि क्षेत्रम्.          
                         
              నల్గొండజిల్లా ఆలేరు మండలం లోని   కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమతస్థాపకుడు గా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య  ఇచ్చటనే లింగోద్భవము పొంది  వేయి సంవత్సరాలు భూమండలం మీద  శైవ మతప్రచారము చేసి,  మరల ఇచ్చటనే లింగైక్యమందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి వుందని స్థలపురాణం.. దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి.  దేవాలయ ప్రాంగణాన్ని , ప్రాకార మండపాలనే మ్యూజియం గా ఏర్పాటుచేశారు పురావస్తు శాఖ వారు.

                           ఈ ఆలయం క్రీ.శ 1070 -  1126 మథ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని  చరిత్ర కారులు భావిస్తున్నారు.
      

             
                                    శ్రీ రేవణ సిద్ధేశ్వరుడు
                పూర్వచరిత్ర. :----          ఈ కొలనుపాక నే పూర్వం దక్షిణ కాశి,బింబావతి పట్నం, పంచకోశ నగరం గా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక, కల్లియపాక, కుల్యపాక,  కొల్లిపాకేయ మొదలైన పేర్ల తో పిలిచే వారట.  ఇప్పడు కొలనుపాక, కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు.
                     

       
                                     ఆలయ ప్రవేశ ద్వారం

                         ఇచ్చట సోమేశ్వర లింగాన్ని పుట్టులింగం, లేక స్వయంభూలింగం గా చెపుతున్నారు.  ఈ లింగం నాలుగు యుగాలనాడే వెలసింది. కృతయుగం లో స్వర్ణలింగం  గాను, త్రేతాయుగం లో రజితలింగం గాను, ద్వాపరయుగం లో  తామ్రలింగం గాను, పూజలంది కలియుగం లో శిలాలింగం గా దర్శనమిస్తున్నట్లు స్థలపురాణం.

                       
                                              
                                                                 ప్రవేశ ద్వారం ఎదురుగా వినాయకుడు

                        లింగమే రెండు గా  చీలి, దానిలో నుండి ఆది జగద్గురువు రేణుకాచార్య ఆవిర్భవించి,1000 సం.రాలు భూమిపై  వీరశైవ మతప్రచారం చేసి, మరల తిరిగి ఇదే లింగం లో లీనమైనట్లు చెప్పబడుతోంది. ఈయనకే రేణుకుడు, రేవణ, నేవణ, నేవణ సిద్ధేశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి.
                                  శ్రీమత్ రేవణ సిద్దస్య కుల్యపాక పురోత్తమే !
                                  సోమేశ లింగ జననం  నివాసే కదళీ పురీ !!
అని  రేణుకాచార్య  స్తుతి.
పంచపీఠాలు :        ఈ సోమేశ్వర లింగం పంచ పీఠాలలో మొదటిది గా వీరశైవులు పూజిస్తారు.               
                 1. సోమేశ్వరస్వామి కొలనుపాక             2. సిద్దేశ్వర స్వామి - ఉజ్జయిని
                       3.భీమనాథస్వామి - కేదారనాథ్               4. మల్లిఖార్జున స్వామి శ్రీశైలమ్
                                                   5. విశ్వేశ్వరస్వామి కాశి
                   

                                                         మ్యూజియం లోని గజలక్ష్మి
            
                         అతి పురాతనమైన  ఈ ఆలయప్రాగణం లోకి ప్రవేశించిన భక్తులకు అనిర్వచ నీయమైన భక్తితో పాటు ఏదో ఒక ఆవేశంవంటిది కలుగుతుంది. దీనినే వీరశైవం లో భక్త్యావేశం అని పిలిచేవారేమో అనిపిస్తుంది. అక్కడ కన్పించే భక్తులు కూడ ఎక్కువగా కర్నాటకనుండి వచ్చినవారే ఎక్కువగా కన్పిస్తారు. తలస్నానాలు చేసి, జుట్టు ఆరబోసుకొని, ముఖంమీద బండారు, కుంకుమ, విభూతులను దట్టంగా అలంకరించుకున్న ఆడవారిలో అక్కడ చండీమాతే  కన్పిస్తుంది.
                     

                
                                   మ్యూజియం లోని ఒక శిథిల శిల్పం
                
                     ఆలయప్రవేశం తోరణ ద్వారంతో  చాలాఎత్తుగా కన్పిస్తుంది.  తోరణ ద్వారానికి అటునిటు ద్వారపాలకులు,  ఎడమ వైపు నలుచదరపు కందకంలో నంది శివలింగాలు. ఆ పైన దూరంగా కొన్ని శాసనాలు   దర్శనమిస్తాయి. తోరణ ద్వారానికి కుడి వైపు కొంచెం దూరం లో నేల లోపలికి నలభై,ఏభై   మెట్ల తో మెలికలు తిరిగిన నేలమాళిగ ఉంటుంది. ఆ మార్గాన్ని   మూసివేయడం జరిగింది.
     

                                         కోష్ట పంజరం లో శ్రీ పార్వతీ పరమేశ్వరులు
                  ప్రథానాలయం. ;----            మ్యూజియం ను, వీరభద్ర మండపాన్ని దాటి వెళితే  ప్రథానాలయాన్ని చేరుకుంటాం. ఈ నడుమ ప్రమాణ మండపం లో నందీశ్వరుడు మనల్ని పల్కరిస్తున్నట్లు గా కన్పిస్తున్నాడు.    ప్రథానాలయం ప్రాకార మండపాలనుండి వేరుగా నిర్మించబడింది. ముఖమండపం లో మనకు  పంచముఖేశ్వరుడు దర్శనమిస్తాడు.

        
                     ఆయనంతరం గర్భాలయంలో స్వయంభువుడైన సోమేశ్వరుని  లింగరూపం, ఆ వెనుక లింగోద్భవమూర్తిగా రేణుకాచార్య విగ్రహం దర్శన మిస్తాయి. 
                             

                     స్వయంభువు డైన సోమేశ్వరుడు , వెనుక ఆదిజగద్గురు రేణుకాచార్య ఆవిర్భావ దృశ్యం
                     
                         చంద్రుడు ఈయన అనుగ్రహాన్ని పొంది తరించినట్లు, అందువలన ఈ స్వామి సోమేశ్వరుడుగా పిలువబడబతున్నట్లు స్థలపురాణం.
   
             చండీమాత .:--                            ఎడమవైపు ఉపాలయంలో మల్లిఖార్జునుడు ఆ ప్రక్కనే నాలుగుమెట్లు ఎ క్కి కుడువైపుకు తిరిగితే ఉపాలయం లో చండీమాత  కొలువు తీరి ఉంది.
       

                                                 
                                                 శ్రీ చండీమాత           
        
                    ఆ ఆలయానికి ఎడమవైపు కుందమాంబ  దివ్యమంగళవిగ్రహం కన్పిస్తుంది.. చండీమాత భక్తులు ముడుపులు కట్టి, కోరికలు తీరిన తరువాత మొక్కులు చెల్లించుకుంటారు.



     అందుకే చండీమాత ముఖమండపం పైకప్పంతా ఈ ముడుపుల మూటలతో నిండి   ఉండటాన్ని మనం గమనించవచ్చు.
  


                                                                                    చండీమాత ఆలయ ద్వారం వద్ద ఉన్న వినాయకుడు

          కోటిలింగేశ్వరాలయం:;---.                    ఎడమవైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే నైరుతి లో కన్పిస్తుంది కోటిలింగేశ్వరాలయం.  పంచకోసు నగరం గా పిలువబడే ఈక్షేత్రం లో  కోటిలింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యిలింగాలు  తక్కువ అవడం తో ఒకే రాయి పై  వేయిలింగాలను చెక్కి ప్రథిష్టించారట. అదే ఈ కోటిలింగేశ్వరాలయం గా ప్రసిద్ధి  కెక్కింది.
     

 సూర్యగంగ.:--             ప్రథానాలయ ముఖమండపము యొక్క కుడివైపు  ద్వారం  నుండి వెలుపలి కొస్తే కన్పించేది సూర్యగంగ గా పిలువబడే అత్యంత లోతైన కోనేరు.


         ********** ఈ ఆలయ పూర్తి దృశ్యాలను You tube ల నాచే ఉంచబడిన  kolanupaka sree chandeemaata sameta someswara darsanam part -1,part -2  ద్వారా చూడవచ్చు.
     ps://www.youtube.com/watch?v=DoyDyY0idpY
    https://www.youtube.com/watch?v=yrd6R9UtMIM  
                     ఏకాదశ రుద్రులు. :---         టునుంచి తిరిగి పడమరకు తిరిగి నాలుగు మెట్లెక్కితే ఏకాదశరుద్రుల సాక్షాత్కారం లభిస్తుంది. ప్రక్కనే కొంచెందూరం లో ఉత్తరాభిముఖుడై  విఘ్నరాజు కొలువు తీరి ఉన్నాడు. 

            
            ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వస్తే  కాకతీయ కళాసంప్రదాయం తో నిర్మితమైన మరో శిథిల శివాలయం మన కంటపడుతుంది. సోమేశ్వర ఆలయమంతా చాళుక్య, హోయసల  నిర్మాణ సంప్రదాయం  కన్పిస్తే,  ఈ ఆలయం  నిర్మాణం లో కాకతీయ  శైలి ప్రతిబింబిస్తోంది.  దీనలో శివలింగం, ముఖమండపం లో నంది మిగిలున్నాయి, ఆ ప్రక్కనే కేతేశ్వర స్వామి ఆలయం నూతన నిర్మాణం  గా కన్పిస్తోంది.
            


              అలాగే కనుచూపుమేర వరకు శిథిలమైన ఒరిగిపోయిన  ఆలయ సముదాయాలే  ఇక్కడ  మనకు గోచరమౌతాయి. ఉపాలయాల్లో  కాలభైరవుడు, వీరభద్రుడు, కుమారస్వామి  రూపాలతో పాటు, ఒక మండపం లో ఆంజనేయుడు కూడ కొలువు తీరి ఉన్నాడు.
            

       ఇక్కడే కాదు. ప్రథాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉన్న నంది స్థంభం దగ్గర కూడ మనకు చాలా ఎత్తైన ఆంజనేయ విగ్రహం వినాయక ,కార్తికేయులతో కలసి కన్పిస్తుంది.
        

           వీరశైవ క్షేత్రాల్లో ఆంజ నేయుడు కన్పడటం ఆంజనేయుడు శివాంశ సంభూతుడు గా పూజించ బడటమే కారణమై ఉండవచ్చు.   ఇంకా ఎక్కువ సమాచారం చెప్పడానికి, మనం తెలుసుకోవడానికి అక్కడ సరైన  గైడ్ కాని, ముద్రిత సమాచారం కాని  లేకపోవడం కొంచెం బాధ కల్గిస్తుంది.
                            

         
                 మ్యూజియం లోని అపురూపమైన కోదండరాముని విగ్రహం

  సుదూర ప్రాంతాలనుంచి అంటే ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడ కొచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. యాత్రికుల వసతి సముదాయం ఇటువంటి వారికోసం అందుబాటులో ఉంది.

            శ్రీ మహాలక్ష్మీ సమేత వీరనారాయణ స్వామి :;-- .  ఈ సోమేశ్వరాలయానికి  దక్షిణం గా కొద్దిదూరం లో ఉన్నమరొక ప్రాచీన ప్రసిద్ధ ఆలయం   శ్రీ వీరనారాయణ స్వామి ఆలయం.
   


               పురాణం:--               కొన్ని వందల  సం.రాల క్రితం ఒక వీరుడు  శతృవులను ఓడించి తన విజయానికి కారకుడైన నారాయణుని స్మరిస్తూ నూరుమెట్ల పెద్దకొలనును తవ్వించి  ,దాని లో స్నానంచేసి. ఒక్కోక్క మెట్టుకు ఒక్క పద్యం చెప్పుకుంటూ పైకి వచ్చి, ఆకొలను ఒడ్డున పాక ను నిర్మించుకొని తపస్సు చేసి,  తరించాడు. తనకు సాక్షాత్కరించిన నారాయణుని మహాలక్ష్మీ సమేతం గా అచ్చటనే ప్రతిష్ఠించి  , ముక్తిని పొందాడట.  కొలను గట్టున పాక వేసుకున్న వీరుని తప: ఫలితం గా ఈ గ్రామం కొలనుపాక అయ్యిందట. ఆ వీరుడు ప్రతిష్ఠించిన నారాయణుడే  ఈ వీరనారయణుడై, మహాలక్ష్మీ సమేతం గా పూజలందుకుంటున్నాడు.
                           
       

                               వీరనారాయణ స్వామి ఆలయ శిఖరం
                   చాళుక్య సంప్రదాయశైలిలో నిర్మితమైన ప్రాచీన దేవాలయం ఇది. శ్రీ వీరనారాయణ స్వామి, ప్రక్కనే   స్వామికి ఎడమవైపులక్ష్మీ దేవి ఒకే పీఠం పై నిలుచుని కన్పిస్తారు.  చాలా అందమైన విగ్రహాలు. అయితే పైన కథలో చెప్పినట్లు ఇక్కడ వందమెట్ల కోనేరు మాత్రం లేదు. ఆలయానికి ప్రాకారం  కూడలేని స్థితిలో వీరనారాయణుడున్నాడు. దీని వెనుకనే  నూతనంగా రేణుకామాత ఆలయం, ఆ ప్రక్కనే షిర్డీ సాయి ఆలయం నిర్మించబడ్డాయి.
   

                         
                                                              రేణుకా మాత దివ్యవిగ్రహం
     
              జైన మందిరం. :---                      కొలనుపాక అనగానే  వినిపించే  మరొక ఆలయం జైన దేవాలయం.  రాజస్థాన్, మహారాష్ట్ర భక్తుల ప్రభావంతోనే కొలనుపాక గూగుల్ మ్యాప్ లో కుల్ పాక్ గా మారిపోయిందేమో. 2000 సం.రాల చరిత్ర ఉందని చెప్పుకుంటున్న జైనభక్తులు వందసంవత్సరాల క్రితం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం  ప్రారంభించారు. గత ఇరవై ఏళ్ల లో చాలా అందమైన ఆలయాన్ని నిర్మించారు. యాత్రిక వసతి ఏర్పాటు ఉంది. వర్థమాన మహావీరుని విగ్రహాలు  సోమేశ్వర ఆలయ మ్యూజియం లో  కూడ మనకు కన్పిస్తాయి.
             

             
           కొలనుపాక  హైదరాబాద్ వరంగల్లు మార్గంలో ఆలేరు నుండి బచ్చన్నపేటకు వెళ్లే దారిలో 8 కి.మీ దూరం లో ఉంది. హైదరాబాదు నుండి సుమారు 80 కి.మీ  దూరం లో ఉంది.


**************************************************** *****************************

  

Tuesday, 4 June 2013

కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దివ్యక్షేత్రము


                 kaleswaram   sree kaleswara mukteswara swamy
     
                                కాళేశ్వరం  శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి  దివ్యక్షేత్రము
                      
                      काळेश्वरं   श्री  काळेश्वर मुक्तीश्वर स्वामि दिव्यक्षेत्रम्



           
                
                     కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం లో  కాళేశ్వర మహాక్షేత్రం లో గోదావరి, ప్రాణహిత  నదులు అంతర్వాహిని గా సరస్వతీ నది ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ ప్రదేశం లో స్వయంభువుగా వెలసిన స్వామి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి. కాశీలో మరణిస్తే కైలాసప్రాప్రి కలుగుతుందని చెపుతారు. కాని  ఈ క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శిస్తేనే కైలాస ప్రాప్తి కలుగుతుందని  స్థలపురాణం చెపుతోంది.
                      



                

                                       ఆలయ రాజగోపురం
                 
                  ఇది అత్యంత పురాతన మైన పుణ్య స్థలం గా ప్రసిధ్ధి కెక్కింది. దేశంలో ఎక్కడా లేని విథంగా ఈ ఆలయం లో ఒకే పానమట్టం పై రెండు శివలింగాలను మనం దర్శించవచ్చు. ఆంధ్రదేశానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణ మైన మూడు లింగాలలో ఇది ఒకటి. మిగినవి రెండు ద్రాక్షారామ భీమేశ్వరుడు, శ్ర్రీశైల మల్లిఖార్జుడు. ఈ మూడులింగాల మథ్య నున్న ప్రదేశాన్ని త్రిలింగదేశమని, ఇందు నివసించే వారిని తెలుంగులు అని వ్యవహరించబడతున్నారని    కాకతి ప్రతాపరుద్రుని ఆస్థాన విద్వాంసుడగు విద్యానాథుని  శాసనాన్నిఉటంకిస్తూ, పండితులు వ్రాశారు.

                                      
                                                 గోపుర దృశ్యం
                   
                                 యద్దేశస్త్రిభిరేష యాతి మహతాం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా!
                     .......................................................................
                    ……………………………………………        శ్రీశైల కాళేశ్వర
                    ద్రాక్షారామ నివాసిన:  ప్రతిదినం త్వచ్ఛ్రేయసే జాగ్రతు !!    
స్థలపురాణం.  :;----           ఒక పర్యాయము యమధర్మరాజు తన లోకమునకు పాపులెవ్వరు రాకపోవుట, యమభటులందరు పనిలేక కూర్చుండుటను చూచి కోపించి, కారణమేమని ప్రశ్నించాడు. ఓ యమధర్మరాజా ! భూలోకమందు జనులందరు కాళేశ్వరమునకు వెళ్లి, త్రివేణీ సంగమం లో స్నానమాచరించి, ముక్తీశ్వరుని దర్శించి ముక్తులగుచున్నారు. అందుచే పాపాత్ములే లేని కారణం చేత మాకు పని లేకుండా పోయినదని విన్నవించారు యమభటులు. అదే సమయంలో అక్కడకొచ్చిన నారదునితో ఈ విషయాన్ని ప్రస్తావించాడు యమధర్మరాజు. ఆ మాటలు విన్న నారదమహర్షి ఆ ముక్తీశ్వరుడే  నీకు మార్గం చూపగలడు అని చెప్పి వెళ్లి పోయాడు.
              

             
                               ప్రధాన ద్వారం ప్రక్కనే దర్శనమిచ్చే లింగరూపం

                           తన ఆధిపత్యానికి భంగమేర్పడుతోందని భయపడిన యముడు, బ్రహ్మ లోకానికి  వెళ్లి,విషయాన్నివివరించి, ఆయనతో కలసి కైలాసానికి వెళ్లి శంకరుని తో తన గోడు వెళ్ల బోసుకున్నాడు. మందస్మిత వదనుడైన మహాదేవుడు ఓ యమధర్మరాజా. నీవు దేవతలతో కూడి వెళ్లి, కాళేశ్వరములోని నే నున్న పానమట్టము నందే  నీ స్వహస్తాలతో కాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చెయ్యి. నీ చే ప్రతిష్ఠించబడిన కాళేశ్వర లింగము సర్వజనులను మోహపరవశులను చేయును. అంతే కాకుండా –
                      కాళేశ్వరం తిరస్కృత్య మమపూజాం కరోతి య: !
                      తే సర్వే నరకం యాంతి సందేహోనాస్తి నిశ్చయం !!
               శివలింగాలన్నీ ఒకటే కదా యని మాయామోహగ్రస్తులైన ప్రజలు ముందుగా కాళేశ్వరుని పూజింపక, ముక్తీశ్వరుని పూజింతురో వారందరు నీ లోకమునకు వచ్చెదరని  వరమిచ్చెను. అందువలన ఈ క్షేత్రములో  ఒకే పానమట్టము మీద రెండు లింగములు  దర్శవమిచ్చు చున్నవి.ముందుగా కాళేశ్వరుని పూజించి, ఆ తరువాత ముక్తీశ్వరుని పూజించవలయును. లింగము పైభాగములో రెండు రంధ్రములతో నున్నలింగము ముక్తీశ్వరుడు గా మనము ఎఱుక కలిగి ఉండాలి.
                       

      
                                 మండపంలో కొలువుదీరిన నందీశ్వరుడు

                       ఒకపర్యాయము యమధర్మరాజు కార్యార్ధియై స్వర్గలోకానికి వెళ్లాడు.ఇంద్రలోకములోని వైభవాలను చూచి, జనమంతా ఇక్కడి భోగాలను అనుభవిం చడానికే యమలోకానికి రావడానికి ఇష్టపడక స్వర్గం కోసం ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. నా యమలోకము, మరియు  స్వర్గలోకమును మించిన మరొకలోకాన్ని నిర్మించాలనే సంకల్పం తో యమధర్మరాజు విశ్వకర్మ ను కలసి, స్వామీ ! స్వర్గలోకాన్ని మించి సర్వసౌఖ్యములు కలిగిన ఒక సుందర నగరాన్ని  నిర్మించమని ప్రార్థించాడు.
                

                                                                   యాగశాల

                                       ****  పూర్తి వీడియో నాచేత you tube  లో పొందుపరచ బడిన sri saraswatheenadi pushkaralu at kaleswaram   ద్వారా చూడవచ్చు.***********

                       అంతట విశ్వకర్మయమధర్మరాజు కోరిక మేరకు కల్పవృక్షములతోడను, శోభాయమాన మైన మణిమయప్రాకారములు కలిగిన రత్నమయ సౌథములతోడను, గోదావరిప్రాణహిత సంగమ ప్రదేశమున దక్షిణముగా ఒక సుందర పట్టణమును నిర్మించి, ఇచ్చెను. కాలుని కొరకు నిర్మాణము చేయబడిన,ఈశ్వరుడు వెలసిన క్షేత్రము  గనుక దీనికి కాళేశ్వరమను పేరు వచ్చినది.  ఈ క్షేత్రమునకు నైరుతి యందు దిశ యందు యమగుండ మను తీర్థరాజమును కూడ విశ్వకర్మ నిర్మించి  ఇచ్చెను.
             

                     
                                            ఆలయ విమానం దృశ్యం
                                                                   
              విశ్వకర్మ చే నిర్మించి ఇవ్వబడిన కాళేశ్వర క్షేత్రమును,యమగుండమును చూచి మిక్కిలి ఆనందించిన యమధర్మరాజు. ఈ గుండమునందు స్నానమాడిన వారికి మణికర్ణికా ఘట్టము నందు స్నానమాడిన ఫలము కలుగుటకు గాను శివుని గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడు ఈ గుండము రెండవ మణి కర్ణిక గా పిలువబడి, ఇందులో స్నానము  చేసిన వారి  పాపములు నశించి పుత్రపౌత్రులు కల్గి వర్థిల్లుదురని వరమిచ్చెను
క్షేత్ర ప్రాశస్త్యము.:------       కాళేశ్వరము నందు నివసించినను, స్మరించినను, దర్శించినను, జ్ఞానాజ్ఞాన జనితములు , మనోవాక్కాయజములైన సర్వపాపములు నశించి, దీర్ఘాయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్రాభివృద్ధి కల్గి దేహాంతమున ముక్తీశ్వరస్వామి కృపవలన ముక్తి కలుగునని కాళేశ్వర యాత్రాఫలమున చెప్పబడినది.
                   తస్య దర్శన మాత్రేణ  భవేన్ముక్తిర్న సంశయ:!
                   ముక్తీశ: పరమోదేవ: పార్వత్యా సహితో విభు : !!
                      కాళేశ్వరేపి వసతాం ముక్తి దద్యాన్మహేశ్వర:!
                      


                  
                                                                  విజయ గణపతి

          దర్శనమాత్రం చేతనే శుభానందాసహిత ముక్తీశ్వరుడు సర్వజీవులకు మోక్షమునిచ్చును. కాశీనగరము నందు మరణించిననే కాశీవిశ్వేశ్వరుడు ముక్తినిచ్చును కాని కాళేశ్వరమున నివసించు సర్వ ప్రాణులకు ముక్తి లభించును. కావున కాశీక్షేత్రము కన్న  కాళేశ్వరము  వరిముల్లు వాసి ఎక్కువని ప్రతీతి.

  


      దివ్యదర్శనం  :----                      ఈ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ఒకే పానమట్టం మీద రెండు లింగాలు ఉండటమే కాక ముక్తీశ్వర స్వామి కి  రెండు నాసికా రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రములలో అభిషేక జలము ఎన్ని పోసినను ఒక్కచుక్క కూడ బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి, సరస్వతీ నది రూపం లో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలియుచున్నది.
    

               
                                   స్వామి వారి దివ్యదర్శనం

                   ఈ విషయమును నమ్మని భోంస్లే మహారాజు(నాగపూర్ )  ఈ వింతను పరీక్షించడానికి తన పరివారముతో పరిసరగ్రామాలనుండి వేలకొలది బిందెల పాలను తెప్పించి శ్రీ స్వామివారి నాసికా రంధ్రములలో పోయించెనట. ఆ విధంగా పోసిన పాలన్నియు  కానరాకుండా పోయి నందుకు  ఆశ్చర్య పోయిన మహారాజు గ్రామస్తులతో కలిసి గోదావరికి వెళ్లి చూడగా  ఆ పాలు ప్రణీత, గోదావరి సంగమములో కలియుటను గమనించి, తప్పును  అంగీకరించి,శ్రీ స్వామిని  క్షమాపణ వేడుకున్నాడట.                      
  ఉపాలయాలు:-----------    ఇచ్చట శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారల ప్రధాన ఆలయముతో పాటు శుభానందాదేవి (పార్వతీ దేవి ), మహాసరస్వతి,కోదండరామాలయము, ఆది ముక్తీశ్వర స్వామి, సంగమేశ్వర, దత్తాత్రేయ , సూర్యదేవాలయాలు కలవు.


                              
                                                              శుభానందాదేవి దివ్యరూపం
      
                 ఆలయ ప్రత్యేకతలు.:;---          ప్రసిద్ధ సరస్వతీ ఆలయాలు మూడు.  (1) కాళేశ్వరం లోని మహాసరస్వతి (ప్రౌఢ సరస్వతి) (2)బాసర లోని జ్ఞానసరస్వతి.(3)  కాశ్మీర్ లోని బాలసరస్వతి.

                                                       ప్రౌఢ సరస్వతీ దేవి మంగళకర రూపం
        
  సూర్యనారాయణ స్వామి ఆలయాలు మూడు. (1) కాళేశ్వరము (2) కోణార్క  (3) అరసవెల్లి


                                               


                                 
                               







                                                                           
 
                                                                           కాళేశ్వరం


  శ్రీ సూర్యనారాయణ స్వామి   గుడిమల్లం

                   గర్భాలయమునకు నాలుగు ద్వారాలున్న ఆలయములు మూడు.                                     
              
   (1) కాళేశ్వరము     (2) కాశీ   (3)  నేపాల్ లోని పశుపతినాథ అలయము       
           
     ప్రధాన ఆలయము చుట్టు  ప్రాకార దేవతలు, నవగ్రహాలు ఉన్నాయి. వీరిని దర్శించుకొనిన తరువాత ప్రధాన ఆలయంలోనికి ప్రవేశిస్తారు.
        

అన్నపూర్ణదేవి                                                                             సర్వాకర్షణ భైరవ


                                      గ్రహదోషములున్నవారు కాళేశ్వరములో నవగ్రహపూజలు చేయించుకొంటారు. ముఖ్యంగా శనిత్రయోదశి, శనివారం రోజున ఈ పూజలు చేయించుకుంటే విశేష ఫలితముంటుదని  పండితులు చెప్పుచున్నారు.

                   
                                         శ్రీ ఆంజనేయుడు
           ప్రథాన ఆలయము  నాలుగు ద్వారముల వద్ద  మండపాల్లో నందీశ్వరుల విగ్రహములున్నాయి. కాళేశ్వర క్షేత్రములో ఆది ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంతం లో త్రవ్వితే  పాషాణ పేటికా విభూతి  ఇప్పటకి కూడ లభిస్తోంది.                  
     ఆది ముక్తీశ్వర స్వామి :;---.   ప్రథానాలయానికి ఒక కిలోమీటరు దూరములో శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి ఆలయము  ఉంది.  ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో ఎచ్చట త్రవ్విన కూడ ఎర్రని రంగు గల మట్టిరాళ్లు దొరుకుతాయి. ఈ రాళ్ళను పగులగొడితే దానిలో పరిమళ భరితమైన మెత్తని భస్మము ఉంటుంది.
    
        
                                        శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి
                 
                  ఈ రాళ్లను విభూతి రాళ్లు అంటారు. ఇవి శ్రావణ మాసం లో ఎక్కువగా లభిస్తాయి.  మట్టిరాళ్లల్లో విభూతి దొరకటం ప్రపంచంలో ఎక్కడా లేని వింతగా చెప్పకుంటారు.  ఎర్రగా ఉండే ఈ విభూతిని ధరించిన వారు యోగీశ్వరులు  పొందిన ఫలమును, నిత్యాగ్ని హోత్రి ఫలమును  పొందుతారని చెప్పబడుతోంది.
సంగమేశ్వరుడు.:;-----   గౌతమి తపస్సు కు మెచ్చి శివుడు ఆమె కోరిక మేరకు త్రివేణీ సంగమ తీరాన సర్వతీర్థాథిపతి గా సంగమేశ్వరుని  గా వెలిశాడు.  త్రివేణీ సంగమంలో స్నానం చేసి ప్రతి  సోమవారం  సంగమేశ్వరునకు  నేయి తో అభిషేకము చేసి. మూడు ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా సంవత్సర కాలం చేసి , పత్నితో కూడి  సమారాధన చేసి, యధాశక్తి దక్షిణ లిచ్చి, అభిషేకము చేసిన నెయ్యిని భార్యతో కలసి సేవించిన యెడల ఉదర బాధలు నశించి, సంతానప్రాప్తి కలుగు నని క్షేత్రమహత్మ్యము చెపుతోంది.            
  
                                
                                   శ్రీ సంగమేశ్వర స్వామి
      అష్ట తీర్థములు:;---            ఈ దివ్య క్షేత్రమున అష్ట తీర్థము లున్నవి.      (1).బ్రహ్మ  (2) చిత్సుఖ (3) జ్ఞాన (4) పక్షి (5) సంగమ (6) నృసింహ (7) హనుమ (8) వ్యాస   తీర్థములు.
         యమకోణం  :----    ప్రధానాలయ ఆవరణ లో యమకోణము కలదు.ఇచ్చట కూర్చొని యముడు తపస్సు చేసినట్లు చెపుతున్నారు. గూడు వంటి దీనిలోనుండి  దూరిన మానవులకు యమ బాధలుండవని, ముక్తి కలుగు తుందని  ఐతిహ్యం. దానిలో నుండి దూరటానికి టిక్కెట్టు  10/ రూపాయలు.


                                                                       యమకోణం
       చారిత్రక నేపథ్యం.----     కాళేశ్వరాలయ ప్రాచీనతకు సంబంధించి 4 శాసనాలను 1965 లో పురావస్తు శాఖ ప్రకటించింది. వానిలో రెండు మాత్రమే కాళేశ్వర  ఆలయ చరిత్ర కు సంబంధించినవి.ఒకటి కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందినది. రెండవదివిజయనగర మొదటి రాయలు కాలానికి చెందినది.
                     
                                               
                                                                                                                     
                                    అతి ప్రాచీన మైన ఏకశిలా మత్స్యం

         క్రీ.శ 1171 నాటి కాకతి రుద్రదేవుని మంత్రి వెల్లకి గంగాధరుడు  వేయించిన శాసనములో  కాకతీయ రుద్రదేవ మహారాజు తన పేర కాళేశ్వర మహాక్షేత్రంలో రుద్రదేవుని ప్రతిష్ఠించె ననియు, దానిప్రక్కన గంగాధర మంత్రి మరొక లింగమును, విష్ణువును ప్రతిష్ఠించి,  ధూప,దీప,నైవేద్యములను  ఏర్పాటు చేయించెననియు చెప్పబడింది.  క్రీ.శ 1250 నాటి శాసనములో  శ్రీ గణపతిదేవుని గురువగు  విఘ్నేశ్వర శివాచార్యులు  కాళేశ్వరాలయ మండపమున విమలేశ్వరుడను పేరుతో శివలింగమును ప్రతిష్ఠించినట్లు చెప్పబడింది. క్రీ.శ 1397 ఫిబ్రవరి 28, బుధవారం నాడు మొదటిరాయలు కాళేశ్వరుని  ఆరాథించి, మొక్కులు తీర్చుకున్నట్లు రెండవ శాసనం చెపుతోంది.
               అరణ్యం మథ్యలో ఉన్న ఈ క్షేత్రానికి 1976 వరకు రోడ్డు మార్గం కూడ లేదట.                                              1976-82 మథ్య జీర్ణోద్ధరణ పనులు జరిగినాయి. ఇప్పడు రవాణా వసతి సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి.
   

    
                                  తోరణ ద్వారము
ఆలయ సమయాలు.:; ----                  ఉ. 7.గం ల నుండి మ. 12.30  వరకు,మరల మ.3.30 నుండి  సా .6.గం ల వరకు దర్శనం లభిస్తుంది. ప్రత్యేక రుసుము చెల్లించి  ఇచ్చట భక్తులు స్వయంగా  స్వామి వారికి అభిషేకము చేసుకోవచ్చు.

                                                 శ్రీ స్వామి వారి  కళ్యాణ మండపము

          రవాణా వసతి సౌకర్యాలు. :---  ఈ దివ్య క్షేత్రం కరీంనగర్ కు 130 కి.మీ దూరంలోను, మంథనికి 65 కి. మీ దూరంలోను, వరంగల్లుకు 110 కి.మీ దూరంలోను. హైద్రాబాద్ 280 కి.మీ దూరంలోను ఉంది. రాష్ట్రంలోని  అన్ని ప్రథాన ష్టేషన్ల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.  ఈ క్షేత్రంలో వి.ఐ.పి గదుల నుండి ధర్మశాలల వరకు వివిధమైన వసతి గృహాలున్నాయి. జూన్ 11-2013 వరకు సరస్వతీ పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం రద్దీ ఉండవచ్చు. భోజనం, ఫలహారాలు ,టీ.దొరుకుతాయి. తప్పని సరిగా చూడవలసిన దివ్యక్షేత్రం కాళేశ్వరం.
                    కాళేశ్వర మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం
                   కాళేశ్వరో మహాదేవో భుక్తిం ముక్తిం ప్రదాస్యతి. !!




***********************************************************************