Tuesday, 2 December 2025

నందిగామ -శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం.



 నందిగామ -శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం.

                                                     ఆంథ్రదేశం లో  ఉమ్మడి కృష్ణాజిల్లా లో  ముఖ్యంగా పశ్చిమ కృష్ణా లో చారిత్రక రాజకీయరంగాలలో  చైతన్యవంతమైన ప్రాంతం  నందిగామ సీమ.కాకతీయుల కాలంలో ఈ ప్రాంతాన్ని నతవాడి సీమగా పిలిచేవారు. ఇటు మునగాల రైతు పోరాట ఉద్యమాన్ని,అటు పరిటాల స్వతంత్ర రిపబ్లిక్ పోరాటాన్ని తట్టుకొని  నిలిచి ఎదిగిన ప్రాంతమిది. హైదరాబాద్  -విజయవాడ జాతీయరహదారి కి  సమాంతరంగా ఉన్న నందిగామ నియోజకవర్గం ఎంతోమంది నాయకులను తయారు చేసింది .  

                


                       చారిత్రకంగా నందిగామ అతి ప్రాచీన  పట్టణమే. 10 వ శతాబ్దం లో గుడిమెట్ట రాజధాని గా ఈ ప్రాంతాన్ని పాలించిన   త్యాగి రాజుల ఏలుబడి లో నందిగామ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ అత్యంత   ప్రాచీన ప్రసిద్దమైన గ్రామాలుగా  శాసనాల్లో కన్పిస్తున్నాయి. తూర్పున ఉన్నమాగల్లు లోను,పడమర ఉన్నముప్పాళ్ళ, అడవిరావులపాడు మీదుగా గుడిమెట్ట వరకు,దక్షిణాన విజయవాడ నుండి హంసలదీవి  సముద్రతీరం వరకు, ఉత్తరాన  నవాబు పేట కొనకంచి, పెనుగంచిప్రోలు మీదుగా  వేదాద్రి, ముక్త్యాల వరకు వివిధ రాజులు, వారి మంత్రులు ,సైన్యాధికారులు వేయించిన శాసనాలు  లభిస్తుంటే నందిగామ లో ప్రాచీన శాసనం ఒక్కటి కూడ లభించక పోవడానికి  కారణం  అన్వేషించవలసిన విషయమే. తూర్పున ప్రవహిస్తున్న మునేటి వరదల వలన ప్రాచీన ప్రాంతం మునకకు లోనై ఉంటుందని కొందరు వాదిస్తుంటే,అందుకే  ఊరు పడమర,దక్షిణాలు గా పెరిగిందనీ, అంటారు.  పాత ఊరు వరదలకు గురై ఉంటుదనే ఆలోచనకు  బలాన్నిస్తూ ఈ మథ్యనే ఊరు కి తూర్పు వైపు మునేటి ఒడ్డున బయటపడిన శిథిలాలయాన్ని సాక్ష్యం గా కొందరు  చూపుతున్నారు. ఇలా ఎన్నో సమాధానాలు లభించని ప్రశ్నలు, సాక్ష్యాలు లేని సిద్ధాంతాలు నందిగామ చరిత్ర లో మిగిలిపోతున్నాయి.

           నగర విస్తరణలో భాగంగా ,జాతీయ రహదారి విస్తరణ లో  భాగంగా కొన్ని ప్రాచీన ఆధారాలు నలిగి నాశనమై పోయుండవచ్చు.ఉదాహరణకు ముఫై నలభై ఏళ్ళ క్రితం  నందిగామ ఊరిబయట ఉండే లక్ష్మీ టాకిస్.తరవాత రవి ధీయెటర్ గా పిలువబడ్డ సినిమా హాలు కు కొద్ది దూరం లో    ఎడమవైపున  జాతీయరహదారికి ప్రక్కగా ఒక చిన్నకొండ  {ఎతైన బండ],దానికి  ప్రక్కగా ఒక వీర ఫలకము ఉండేవి.  వీర ఫలకమంటే యుధ్ధరంగం లో మరణించిన వీరుని స్మృతి చిహ్నం గా అతనిని పాతిపెట్టిన చోట  ఈ ఫలకాన్ని వేస్తారని  చరిత్ర చెపుతోంది  నా మితృడు ,నేను సినిమా కు వెళ్లి ,సినిమా వెయ్యడానికి  ఇంకా టైముంటే ఆ కొండ బండ మీద  కూర్చొని, బల్లెం పట్టుకొని ఉన్న వీరుడి బొమ్మ  రాతి పలకాన్ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటుండేవాళ్ళం. తరువాత జాతీయరహదారి  విస్తరణ లో ఆ రాయి ,ప్రక్కనున్న కొండ కూడా రోడ్డు లో కలిసిపోయాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే . ఇప్పుడు డెభై  వయసు పైబడిన వారికి చాలామందికి ఈ విషయం తెలుసు.మనకు తెలియనివి ఇటువంటివి ఇంకా ఎన్నిపోయినాయో ? ఏమో?.

                         మనకు తెలిసినంతవరకు  శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించిన మన నందిగామ శివాలయం లో గాలిగోపురం ప్రక్కనే ఒక శాసనముండేది. కొంతకాలం పాటు స్వామి కళ్యాణ సమయంలో గుడికి సున్నం కొట్టినప్పుడల్లా దీనికి కూడ పనిలో పనిగా కాస్త  తగిలించేవాళ్లు ఆ రంగులేసేవాళ్లు. తరువాత  క్రమంగా అది కనుమరుగై పోయి,గాలిగోపురం లో కల్సిపోయింది  . ఇలా మనకు అందకుండా కొంత చరిత్ర చాలా  కాలగర్భంలో కలిసిపోయుంటుందనుకోవచ్చా ? సరే. ప్రస్తుతానికి వద్దాం.

                                నందిగామ లో ప్రాచీనమైన ప్రసిద్ధ ఆలయాలు శ్రీ రామాలయం, శివాలయం చెన్నకేశవాలయం ,ఆంజనేయస్వామి అలయం, మరిడి మహాలక్ష్మీ ఆలయాలు గా చెప్పుకోవచ్చు. శివాలయం లోని అతి పెద్ద నంది వలనే నందిగామకు  ఆ పేరు వచ్చిందని కొందరు చెపుతుంటారు.

                                     


                              శ్రీ,భూ సమేత  శ్రీ చెన్న కేశవస్వామి

                 నందిగామ లోని  అతిప్రాచీనమైన ఆలయాలలో  చెన్నకేశవాలయం కూడ ఒకటి. కాకతీయుల కాలం నాటికే ఈ ఆలయం ఉన్నదని  ఈ ఆలయం లోని పెద్దగంట కాకతీయ ప్రతాపరుద్రుని కాలం లోని దని ఐతిహ్యం. ముఖ్యంగా ఈ చెన్నకేశవ సంప్రదాయం  10 వ శతాబ్దం లోజరిగిన పల్నాటి యుద్ధకాలం నుండి ప్రబలంగా ప్రచారమైనట్లు చెప్పవచ్చు. గుడిమెట్ట ను ఏలిన త్యాగి పోతరాజు పల్నాటి యుద్ధం లో పాల్గొన్నట్లు గా కవిసార్వభౌముడు శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్ర  లో  వ్రాశాడు.  ఎందుకంటే పల్నాటి యుద్దం జరిగిందే శైవ వైష్ణవమతాల సంఘర్షణ కారణంగా. వీరశైవం లో చెన్నమల్లయ్య లు, చెన్నబసవయ్య లు  త్రిశూలధారులై  వీరంగం వేస్తున్నరోజులవి.

                            

                                   అసలు చెన్ను అనే పదానికి అందమైన అని అర్థం.  అందమైన ఈశ్వరుడు ,అందమైన బసవుడు ఉన్నప్పుడు  అందమైన కేశవుడు  మాత్రం ఎందుకుండడు.  ఈ ఆలోచనల్లో నించి ఆవిర్భవించినదే మాచర్ల చెన్నకేశవ దేవాలయం .  అసలు కేశవుడే జగన్మోహనరూపుడు. ఇంకా చెన్నకేశవుడైతే  ఇంకెంత ఎంత అందంగా ఉంటాడో !.  బేలూరు చెన్నకేశవాలయం, అందలి దైవమైన చెన్నకేశవుడు ఎంత అందంగా  ఉంటాడో చూసినవారికి తెలిసిన విషయమే.

                     సాధారణంగా  శ్రీ మహావిష్ణువు చేతిలో శంఖ చక్రాలు కుడిఎడమ చేతుల్లో ఉంటే  శ్రీ చెన్నకేశవుని చేతి లో  మాత్రం శంఖ చక్రాలు తారుమారుగా ఉంటాయి. భక్తరక్షణ పరాధీనుడైన  ఆ పరంధాముడు గజేంద్రుని మొసలి  బారి నుండి రక్షించే  అంటే గజేంద్రమోక్షఘట్టం లో హడావుడిలో శంఖచక్రాలను కుడిఎడమలు గా  ధరించాడట .  శ్రీ స్వామి వారి భక్తపరాథీనతకు  తార్కాణంగా దీన్ని భక్తులు చెప్పుకుంటున్నారు. కాని ఆంథ్రమహాభాగవతం లో  మహాకవి పోతనైతే అసలు ఆయుధాలు లేకుండానే శ్రీ హరి  బయలు దేరి నట్లు చెప్పాడు.సిరికిం చెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు అనే పద్యం మనకు గుర్తుంది కదా. 

                         



                                                        శ్రీ భావనారాయణస్వామి

                 అదిగో   చెన్నకేశవుడు .నందిగామ చెన్నకేశవాలయంలో దర్శనమిస్తున్న స్వామిని  మనం చూడవచ్చు.  కుడిచేతిలో శంఖాన్ని,ఎడమచేతిలో చక్రాన్ని ధరించి , మరో కుడి చేయి అభయముద్రలో ఉండి, ఎడమచేతిలో గదను ధరించి ఉంటాడు. ప్రక్కన ఇరువైపుల  దేవేరులు శ్రీదేవి,భూదేవి కొలువు తీరి ఉన్నారు.అంతేకాకుండా మూలవిరాట్టు లోనే ఇరువైపుల దేవేరులు ఉండటం కూడా ఒక సంప్రదాయంగా కన్పిస్తోంది.

           

           అంత్రాలయంలో ఎడమవైపున చెన్నకేశవ ఉత్సవమూర్తులు ఉండగా కుడి వైపు ఉన్న పెద్ద విగ్రహం భావనారాయణ స్వామి విగ్రహం గా చెపుతున్నారు. ఈ మూర్తి కూడా చెన్నకేశవుని వలెనే ఉన్నా చేతుల్లో శంఖచక్రాలు సాధారణంగా అంటే కుడి చేతిలో చక్రం, ఎడమచేతి లో శంఖం ఉన్నాయి . మరో రెండు చేతుల్లోకుడి చేతిలో కమలాన్ని, ఎడమ చేతి లో గదను ధరించి ఉన్నాడు. ఈ విగ్రహం ఇక్కడెందుకుందో , ఎక్కడినుంచి వచ్చిందో నాలుగు తరాలుగా స్వామిసేవలో తరిస్తున్న దీవి వారి కుటుంబానికే  తెలియదంటేనే ఆలయ ప్రాచీనతతో పాటు అందని చరిత్ర ఏదో ఉందనిపిస్తోంది.

                            అంత్రాలయంలో ఉన్న పెద్దగంట కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నాటిదనీ, ఒకసారి మోగిస్తే అనేకమార్లు ఓంకారథ్వని వినిపిస్తుందని చెపుతారు.

                           



ప్రతాపరుద్రుని కాలం నాటి ఘంట

 ముఖమండపం లో కుడివైపున చూడికుడుత్తి నాచ్చియార్ గా పేరొందిన గోదాదేవి ఉపాలయం దర్శనమిస్తుంది.ఈమెనే ఆండాళ్
  అంటారు .

           

  
 గోదాదేవి

             వెలుపలి మండపంలోకి వస్తే థ్వజస్థంభం చెంత చిన్నమందిరంలో గరుడాళ్వారు, ప్రక్కనే సూచీముఖ రాతిపై  దాసాంజనేయస్వామి  కన్పిస్తున్నారు.ఆలయ పునరుద్దరణ సమయంలో  ఈ ఆంజనేయుడు తవ్వకాలలో దొరికాడని ,ఆయనను అలాగే సేవిస్తున్నామని అర్చకస్వామి చెప్పారు.  ఈ విగ్రహం లో ఏదో  ఒక ప్రత్యేకత ఉంది . ఆ ముకుళిత హస్తాలు  కొంచెం ప్రత్యేకంగా కన్పిస్తున్నాయి.



                                    గరుడాళ్వారు ,తవ్వకాల్లో లభించిన ఆంజనేయస్వామి

                  ఈ ఆలయం అనేకమార్లు పునరుద్దరణ , పునర్నిర్మాణ కార్యక్రమాలకు లోనైంది .ఈమథ్య కాలం లో శ్రీ శ్రీ స్వామి పరిపూర్ణానంద స్వామి  వారి చేతుల మీదగా మహాశిఖర సంప్రోక్షణ  కూడా జరిగింది . 

                                           

                                                      మహా శిఖర దర్శనము

             దేవాదాయశాఖ , మరికొంతమంది వదాన్యులు మహాసంప్రోక్షణ కార్యక్రమానికి  ఆర్థికంగా సహకరించినట్లు గా ముఖమండప వెలుపలి గోడలపై శిలాఫలకాలున్నాయి. గర్భాలయం వెలుపలి గోడలపై దశావతారాలు సుందరం గా కొలువుతీరాయి.

      


                  ముక్కోటి మహామండపము
:-         ఈ ఆలయానికి అనుబంధంగా ముక్కోటి మహామండపం లో గత మూడు తరాలుగా వీరి  కుటుంబమే ముక్కోటి ఉత్సవాలను 125 సంవత్సరాలుగా నిరాఘాటంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీవి  రాఘవాచార్యుల వారి కాలం లో పందిట్లో మొదలైన ఈ  ఉత్సవాలు  క్రమంగా  మహామండప స్థాయికి పెరిగాయి . 

                                                   తొలిరోజుల్లో ముక్కోటి పందిరి

             కేవలం భక్తులిచ్చే విరాళాల మీదే కార్యక్రమాలునిర్వహిస్తారు. అన్ని రకాల ఆంథ్ర కళలకు ఇక్కడ అవకాశం ఉంటుంది. అంటే హరికథలు ,బుర్రకథలు,  భరతనాట్యాలు ,సంగీత కచేరీలు ,ఆథ్యాత్మికోపన్యాసాలు,భక్తి భరిత నాటకాలు అష్ఠావధాన ,శతావధానాలు కూడా నిర్వహించబడతాయి.  ఎందరో ప్రముఖులు, మహనీయులు,  మహానుభావులు ఈ వేదిక నుండి తమ అనుగ్రహభాషణాలతో  భక్తులను అనుగ్రహిస్తున్నారు  .

                                         

                                           ఇప్పుటి ముక్కోటి మహామండపము

                       ఇది ఈ చెన్నకేశవుడు కొలువు తీరిన ఈ స్థలమహాత్య్మమే ననడం లో  ఎటువంటి అతిశయోక్తి లేదు . ఈ స్థల పవిత్రత అంతపని చేయిస్తోంది .



                                 అనుగ్రహభాషణం చేస్తున్నజగద్గురు శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి

                లేకపోతే 125 సం. లుగా ఒకే ప్రాంతం లో ఇటువంటి ఆథ్యాత్మిక  కార్యక్రమం ఒకే కుటుంబం చేతుల మీదుగా నిర్వహించబడటం దైవసంకల్పమే కాని వేరుకాదు. ఎంత మానవ ప్రయత్నమున్నా దైవం అనుగ్రహించాలి కదా.  


                                           అనుగ్రహభాషణం చేస్తున్న శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

                            ఈ కార్యక్రమానికి రమ్మనమని  అభ్యర్థిస్తే కాదన్న జగద్గురువులు గాని, మహాపీఠాధిపతులు గాని , మహామహోపాధ్యాయులు గాని, మహానటీనటులు గాని, సంగీత విద్వాంసులు కాని, సాహిత్యసామ్రాట్టులు కాని లేరంటే నమ్మశక్యం కాదు కాని ఇది నిజం .

     

ఆథ్యాత్మిక ప్రసంగానంతరం సత్కారం స్వీకరిస్తున్న శ్రీ సామవేదం

                   అందుకే  వీరి కృషికి గుర్తింపుగా  2001సంవత్సరంలో Limca book of records  లో ముక్కోటి మహామండపానికి స్థానం లభించింది ,

                                                         లిమ్కా బుక్ ఆఫ్ రికార్ఢ్సు2001

                            ఈ విథంగా నందిగామ  పేరు చరిత్ర లో  చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ  గొప్పతనం కూడా  ఆ  చెన్నకేశవుని ఆశీ: ప్రభావమే ననడంలో కించిత్సందేహం కూడ లేదు. 



                            నాట్య ప్రదర్శనానంతరం సత్కారం అందుకుంటున్న పద్మశ్రీ శోభానాయుడు

                         ఇంట్లో  వంటకు సంభారాలన్నీ ఉన్నా పాచకుడు లేకపోతే   పస్తులుండటమే కదా. అలాగే  మహానుభావుడు దీవి రాఘవాచార్యులు గారు ప్రారంభించిన ముక్కోటి ఉత్సవాలనే ఈ దివ్యయఙ్నాన్ని వారి కుమారులు అథోక్షజాచార్యులు,అనంతరం వారి కుమారులు మంగనాథాచార్యులు వారి అనంతరం వారి కుమారులు రత్నమాచార్యులు ఇలా  నిర్వహించడం అంటే సామాన్య విషయం  కాదు.


                                        

                                  సత్కారం అందుకుటున్న శ్రీమతి గురు కొండవీటి జ్యోతిర్మయి.

 ఏదో ఒక అదృశ్యశక్తి వారిని నడిపిస్తోందన్పిస్తోంది . పురుషకారం ఎంత బలంగా ఉన్నా దానికి దైవబలం తోడుకావాలి కదా. అదే ఇక్కడ జరుగుతోంది.  



                                                    శ్రీమల్లాది చంద్రశేఖర శాస్త్రి

                                    లిమ్కా రికార్డు కాదు  చరిత్ర ను పరిశీలిస్తే  ఇంకా పెద్ద  రికార్డులే రావాలి. అందుకు ఆ దైవం అనుగ్రహించాలని ,మరి  పదికాలాల పాటు ఈ ముక్కోటి ఉత్సవాలు అవిచ్ఛిన్నంగా కొనసాగాలనీ,అందుకు ఆ భగవంతుణ్ణి ముఖ్యంగా ,శ్రీ ,భూ సమేత చెన్నకేశవుని  వేడుకొందాం  హిందూధర్మం నలుదిక్కులా  విస్తరించాలనీ, ప్రజల హృదయాల్లో ఆథ్యాత్మిక  పరిమళాలు గుబాళించి ప్రశాంతజీవనం లభించాలనీ మనసారా కోరుకుందాం.

   -- ----------- --------  ----       జై చెన్నకేశవ   --------------------------------------------

  

No comments:

Post a Comment