kaleswaram sree kaleswara mukteswara swamy
కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దివ్యక్షేత్రము
काळेश्वरं श्री काळेश्वर मुक्तीश्वर स्वामि दिव्यक्षेत्रम्
కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం లో
కాళేశ్వర మహాక్షేత్రం లో గోదావరి, ప్రాణహిత నదులు అంతర్వాహిని గా సరస్వతీ నది ప్రవహిస్తున్న
త్రివేణీ సంగమ ప్రదేశం లో స్వయంభువుగా వెలసిన స్వామి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర
స్వామి. కాశీలో మరణిస్తే కైలాసప్రాప్రి కలుగుతుందని చెపుతారు. కాని ఈ క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుని
దర్శిస్తేనే కైలాస ప్రాప్తి కలుగుతుందని
స్థలపురాణం చెపుతోంది.
ఆలయ రాజగోపురం
ఇది అత్యంత పురాతన మైన పుణ్య స్థలం గా ప్రసిధ్ధి కెక్కింది. దేశంలో ఎక్కడా
లేని విథంగా ఈ ఆలయం లో ఒకే పానమట్టం పై రెండు శివలింగాలను మనం దర్శించవచ్చు.
ఆంధ్రదేశానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణ మైన మూడు లింగాలలో ఇది ఒకటి. మిగినవి
రెండు ద్రాక్షారామ భీమేశ్వరుడు, శ్ర్రీశైల మల్లిఖార్జుడు. ఈ మూడులింగాల మథ్య నున్న
ప్రదేశాన్ని త్రిలింగదేశమని, ఇందు నివసించే వారిని తెలుంగులు అని
వ్యవహరించబడతున్నారని కాకతి
ప్రతాపరుద్రుని ఆస్థాన విద్వాంసుడగు విద్యానాథుని
శాసనాన్నిఉటంకిస్తూ, పండితులు వ్రాశారు.
గోపుర దృశ్యం
యద్దేశస్త్రిభిరేష యాతి మహతాం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా!
.......................................................................
…………………………………………… శ్రీశైల కాళేశ్వర
ద్రాక్షారామ నివాసిన:
ప్రతిదినం త్వచ్ఛ్రేయసే జాగ్రతు !!
స్థలపురాణం. :;----
ఒక పర్యాయము
యమధర్మరాజు తన లోకమునకు పాపులెవ్వరు రాకపోవుట, యమభటులందరు పనిలేక కూర్చుండుటను చూచి
కోపించి, కారణమేమని ప్రశ్నించాడు. “ ఓ యమధర్మరాజా ! భూలోకమందు జనులందరు కాళేశ్వరమునకు వెళ్లి,
త్రివేణీ సంగమం లో స్నానమాచరించి, ముక్తీశ్వరుని దర్శించి ముక్తులగుచున్నారు.
అందుచే పాపాత్ములే లేని కారణం చేత మాకు పని లేకుండా పోయినదని విన్నవించారు” యమభటులు. అదే సమయంలో అక్కడకొచ్చిన నారదునితో ఈ
విషయాన్ని ప్రస్తావించాడు యమధర్మరాజు. ఆ మాటలు విన్న నారదమహర్షి” ఆ ముక్తీశ్వరుడే నీకు మార్గం చూపగలడు” అని చెప్పి వెళ్లి పోయాడు.
ప్రధాన ద్వారం ప్రక్కనే దర్శనమిచ్చే లింగరూపం
తన
ఆధిపత్యానికి భంగమేర్పడుతోందని భయపడిన యముడు, బ్రహ్మ లోకానికి వెళ్లి,విషయాన్నివివరించి, ఆయనతో కలసి
కైలాసానికి వెళ్లి శంకరుని తో తన గోడు వెళ్ల బోసుకున్నాడు. మందస్మిత వదనుడైన మహాదేవుడు” ఓ యమధర్మరాజా. నీవు దేవతలతో కూడి వెళ్లి,
కాళేశ్వరములోని నే నున్న పానమట్టము నందే నీ స్వహస్తాలతో కాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ
చెయ్యి. నీ చే ప్రతిష్ఠించబడిన కాళేశ్వర లింగము సర్వజనులను మోహపరవశులను చేయును.
అంతే కాకుండా –
కాళేశ్వరం తిరస్కృత్య మమపూజాం కరోతి య: !
తే సర్వే నరకం యాంతి సందేహోనాస్తి నిశ్చయం !!
శివలింగాలన్నీ ఒకటే కదా యని
మాయామోహగ్రస్తులైన ప్రజలు ముందుగా కాళేశ్వరుని పూజింపక, ముక్తీశ్వరుని పూజింతురో
వారందరు నీ లోకమునకు వచ్చెదరని” వరమిచ్చెను. అందువలన ఈ క్షేత్రములో ఒకే పానమట్టము మీద రెండు లింగములు దర్శవమిచ్చు చున్నవి.ముందుగా కాళేశ్వరుని
పూజించి, ఆ తరువాత ముక్తీశ్వరుని పూజించవలయును. లింగము పైభాగములో రెండు రంధ్రములతో
నున్నలింగము ముక్తీశ్వరుడు గా మనము ఎఱుక కలిగి ఉండాలి.
మండపంలో కొలువుదీరిన నందీశ్వరుడు
ఒకపర్యాయము యమధర్మరాజు కార్యార్ధియై స్వర్గలోకానికి వెళ్లాడు.ఇంద్రలోకములోని
వైభవాలను చూచి, జనమంతా ఇక్కడి భోగాలను అనుభవిం చడానికే యమలోకానికి రావడానికి
ఇష్టపడక స్వర్గం కోసం ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. నా యమలోకము, మరియు స్వర్గలోకమును మించిన మరొకలోకాన్ని
నిర్మించాలనే సంకల్పం తో యమధర్మరాజు విశ్వకర్మ ను కలసి,” స్వామీ ! స్వర్గలోకాన్ని
మించి సర్వసౌఖ్యములు కలిగిన ఒక సుందర నగరాన్ని నిర్మించమని” ప్రార్థించాడు.
యాగశాల
**** పూర్తి వీడియో నాచేత you tube లో పొందుపరచ బడిన sri saraswatheenadi pushkaralu at kaleswaram ద్వారా చూడవచ్చు.***********
అంతట విశ్వకర్మయమధర్మరాజు కోరిక మేరకు కల్పవృక్షములతోడను, శోభాయమాన మైన మణిమయప్రాకారములు కలిగిన రత్నమయ సౌథములతోడను, గోదావరిప్రాణహిత సంగమ ప్రదేశమున దక్షిణముగా ఒక సుందర పట్టణమును నిర్మించి, ఇచ్చెను. కాలుని కొరకు నిర్మాణము చేయబడిన,ఈశ్వరుడు వెలసిన క్షేత్రము గనుక దీనికి కాళేశ్వరమను పేరు వచ్చినది. ఈ క్షేత్రమునకు నైరుతి యందు దిశ యందు యమగుండ మను తీర్థరాజమును కూడ విశ్వకర్మ నిర్మించి ఇచ్చెను.
అంతట విశ్వకర్మయమధర్మరాజు కోరిక మేరకు కల్పవృక్షములతోడను, శోభాయమాన మైన మణిమయప్రాకారములు కలిగిన రత్నమయ సౌథములతోడను, గోదావరిప్రాణహిత సంగమ ప్రదేశమున దక్షిణముగా ఒక సుందర పట్టణమును నిర్మించి, ఇచ్చెను. కాలుని కొరకు నిర్మాణము చేయబడిన,ఈశ్వరుడు వెలసిన క్షేత్రము గనుక దీనికి కాళేశ్వరమను పేరు వచ్చినది. ఈ క్షేత్రమునకు నైరుతి యందు దిశ యందు యమగుండ మను తీర్థరాజమును కూడ విశ్వకర్మ నిర్మించి ఇచ్చెను.
ఆలయ విమానం దృశ్యం
విశ్వకర్మ చే నిర్మించి ఇవ్వబడిన కాళేశ్వర క్షేత్రమును,యమగుండమును చూచి
మిక్కిలి ఆనందించిన యమధర్మరాజు. ఈ గుండమునందు స్నానమాడిన వారికి మణికర్ణికా ఘట్టము
నందు స్నానమాడిన ఫలము కలుగుటకు గాను శివుని గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన
శివుడు “ఈ గుండము రెండవ మణి కర్ణిక గా పిలువబడి, ఇందులో
స్నానము చేసిన వారి పాపములు నశించి పుత్రపౌత్రులు కల్గి
వర్థిల్లుదురని” వరమిచ్చెను
క్షేత్ర ప్రాశస్త్యము.:------ కాళేశ్వరము నందు నివసించినను, స్మరించినను,
దర్శించినను, జ్ఞానాజ్ఞాన జనితములు , మనోవాక్కాయజములైన సర్వపాపములు నశించి,
దీర్ఘాయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్రాభివృద్ధి కల్గి దేహాంతమున ముక్తీశ్వరస్వామి
కృపవలన ముక్తి కలుగునని కాళేశ్వర యాత్రాఫలమున చెప్పబడినది.
తస్య దర్శన మాత్రేణ భవేన్ముక్తిర్న
సంశయ:!
ముక్తీశ: పరమోదేవ: పార్వత్యా సహితో
విభు : !!
కాళేశ్వరేపి వసతాం ముక్తి దద్యాన్మహేశ్వర:!
విజయ గణపతి
దర్శనమాత్రం చేతనే శుభానందాసహిత ముక్తీశ్వరుడు సర్వజీవులకు
మోక్షమునిచ్చును. కాశీనగరము నందు మరణించిననే కాశీవిశ్వేశ్వరుడు ముక్తినిచ్చును కాని
కాళేశ్వరమున నివసించు సర్వ ప్రాణులకు ముక్తి లభించును. కావున కాశీక్షేత్రము కన్న కాళేశ్వరము వరిముల్లు వాసి ఎక్కువని ప్రతీతి.
దివ్యదర్శనం :---- ఈ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ఒకే పానమట్టం
మీద రెండు లింగాలు ఉండటమే కాక ముక్తీశ్వర స్వామి కి రెండు నాసికా రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రములలో
అభిషేక జలము ఎన్ని పోసినను ఒక్కచుక్క కూడ బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి,
సరస్వతీ నది రూపం లో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలియుచున్నది.
స్వామి వారి దివ్యదర్శనం
ఈ విషయమును
నమ్మని భోంస్లే మహారాజు(నాగపూర్ ) ఈ
వింతను పరీక్షించడానికి తన పరివారముతో పరిసరగ్రామాలనుండి వేలకొలది బిందెల పాలను
తెప్పించి శ్రీ స్వామివారి నాసికా రంధ్రములలో పోయించెనట. ఆ విధంగా పోసిన పాలన్నియు
కానరాకుండా పోయి నందుకు ఆశ్చర్య పోయిన మహారాజు గ్రామస్తులతో కలిసి
గోదావరికి వెళ్లి చూడగా ఆ పాలు ప్రణీత,
గోదావరి సంగమములో కలియుటను గమనించి, తప్పును
అంగీకరించి,శ్రీ స్వామిని క్షమాపణ
వేడుకున్నాడట.
శుభానందాదేవి దివ్యరూపం
ఆలయ ప్రత్యేకతలు.:;--- ప్రసిద్ధ సరస్వతీ ఆలయాలు మూడు. (1) కాళేశ్వరం లోని మహాసరస్వతి (ప్రౌఢ సరస్వతి) (2)బాసర లోని జ్ఞానసరస్వతి.(3) కాశ్మీర్ లోని బాలసరస్వతి.
ప్రౌఢ సరస్వతీ దేవి మంగళకర రూపం
సూర్యనారాయణ స్వామి ఆలయాలు మూడు. (1) కాళేశ్వరము (2) కోణార్క (3) అరసవెల్లి
కాళేశ్వరం
శ్రీ సూర్యనారాయణ స్వామి గుడిమల్లం
గర్భాలయమునకు నాలుగు ద్వారాలున్న ఆలయములు మూడు.
(1) కాళేశ్వరము (2) కాశీ (3) నేపాల్ లోని పశుపతినాథ అలయము
ప్రధాన ఆలయము చుట్టు ప్రాకార దేవతలు, నవగ్రహాలు ఉన్నాయి. వీరిని
దర్శించుకొనిన తరువాత ప్రధాన ఆలయంలోనికి ప్రవేశిస్తారు.
అన్నపూర్ణదేవి సర్వాకర్షణ భైరవ
గ్రహదోషములున్నవారు కాళేశ్వరములో నవగ్రహపూజలు చేయించుకొంటారు. ముఖ్యంగా
శనిత్రయోదశి, శనివారం రోజున ఈ పూజలు చేయించుకుంటే విశేష ఫలితముంటుదని పండితులు చెప్పుచున్నారు.
శ్రీ ఆంజనేయుడు
ప్రథాన ఆలయము నాలుగు ద్వారముల వద్ద
మండపాల్లో నందీశ్వరుల విగ్రహములున్నాయి.
కాళేశ్వర క్షేత్రములో ఆది ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంతం లో త్రవ్వితే పాషాణ పేటికా విభూతి ఇప్పటకి కూడ లభిస్తోంది.
ఆది
ముక్తీశ్వర స్వామి :;---. ప్రథానాలయానికి ఒక కిలోమీటరు దూరములో శ్రీ ఆది
ముక్తీశ్వర స్వామి ఆలయము ఉంది. ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో ఎచ్చట త్రవ్విన కూడ
ఎర్రని రంగు గల మట్టిరాళ్లు దొరుకుతాయి. ఈ రాళ్ళను పగులగొడితే దానిలో పరిమళ
భరితమైన మెత్తని భస్మము ఉంటుంది.
శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి
ఈ రాళ్లను విభూతి రాళ్లు అంటారు. ఇవి శ్రావణ మాసం లో ఎక్కువగా లభిస్తాయి. మట్టిరాళ్లల్లో విభూతి దొరకటం ప్రపంచంలో ఎక్కడా లేని వింతగా చెప్పకుంటారు. ఎర్రగా ఉండే ఈ విభూతిని ధరించిన వారు యోగీశ్వరులు పొందిన ఫలమును, నిత్యాగ్ని హోత్రి ఫలమును పొందుతారని చెప్పబడుతోంది.
సంగమేశ్వరుడు.:;----- గౌతమి తపస్సు కు మెచ్చి శివుడు ఆమె కోరిక
మేరకు త్రివేణీ సంగమ తీరాన సర్వతీర్థాథిపతి గా సంగమేశ్వరుని గా వెలిశాడు.
త్రివేణీ సంగమంలో స్నానం చేసి ప్రతి
సోమవారం సంగమేశ్వరునకు నేయి తో అభిషేకము చేసి. మూడు ప్రదక్షిణలు
చేయాలి. ఈ విధంగా సంవత్సర కాలం చేసి , పత్నితో కూడి సమారాధన చేసి, యధాశక్తి దక్షిణ లిచ్చి,
అభిషేకము చేసిన నెయ్యిని భార్యతో కలసి సేవించిన యెడల ఉదర బాధలు నశించి,
సంతానప్రాప్తి కలుగు నని క్షేత్రమహత్మ్యము చెపుతోంది.
శ్రీ సంగమేశ్వర స్వామి
అష్ట తీర్థములు:;--- ఈ దివ్య క్షేత్రమున అష్ట తీర్థము లున్నవి. (1).బ్రహ్మ (2) చిత్సుఖ (3) జ్ఞాన (4) పక్షి (5) సంగమ (6)
నృసింహ (7) హనుమ (8) వ్యాస తీర్థములు.
యమకోణం :---- ప్రధానాలయ ఆవరణ లో యమకోణము కలదు.ఇచ్చట కూర్చొని
యముడు తపస్సు చేసినట్లు చెపుతున్నారు. గూడు వంటి దీనిలోనుండి దూరిన మానవులకు యమ బాధలుండవని, ముక్తి కలుగు
తుందని ఐతిహ్యం. దానిలో నుండి దూరటానికి
టిక్కెట్టు 10/ రూపాయలు.
యమకోణం
చారిత్రక
నేపథ్యం.---- కాళేశ్వరాలయ
ప్రాచీనతకు సంబంధించి 4 శాసనాలను 1965 లో పురావస్తు శాఖ ప్రకటించింది. వానిలో
రెండు మాత్రమే కాళేశ్వర ఆలయ చరిత్ర కు
సంబంధించినవి.ఒకటి కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందినది. రెండవదివిజయనగర మొదటి
రాయలు కాలానికి చెందినది.
అతి ప్రాచీన మైన ఏకశిలా మత్స్యం
క్రీ.శ 1171 నాటి కాకతి
రుద్రదేవుని మంత్రి వెల్లకి గంగాధరుడు
వేయించిన శాసనములో కాకతీయ రుద్రదేవ
మహారాజు తన పేర కాళేశ్వర మహాక్షేత్రంలో రుద్రదేవుని ప్రతిష్ఠించె ననియు,
దానిప్రక్కన గంగాధర మంత్రి మరొక లింగమును, విష్ణువును ప్రతిష్ఠించి, ధూప,దీప,నైవేద్యములను ఏర్పాటు చేయించెననియు చెప్పబడింది. క్రీ.శ 1250 నాటి శాసనములో శ్రీ గణపతిదేవుని గురువగు విఘ్నేశ్వర శివాచార్యులు కాళేశ్వరాలయ మండపమున విమలేశ్వరుడను పేరుతో
శివలింగమును ప్రతిష్ఠించినట్లు చెప్పబడింది. క్రీ.శ 1397 ఫిబ్రవరి 28, బుధవారం
నాడు మొదటిరాయలు కాళేశ్వరుని ఆరాథించి,
మొక్కులు తీర్చుకున్నట్లు రెండవ శాసనం చెపుతోంది.
అరణ్యం మథ్యలో ఉన్న ఈ క్షేత్రానికి 1976 వరకు రోడ్డు మార్గం కూడ లేదట. 1976-82
మథ్య జీర్ణోద్ధరణ పనులు జరిగినాయి. ఇప్పడు రవాణా వసతి సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి.
తోరణ ద్వారము
ఆలయ సమయాలు.:; ---- ఉ. 7.గం ల నుండి మ. 12.30 వరకు,మరల మ.3.30 నుండి సా .6.గం ల వరకు దర్శనం లభిస్తుంది. ప్రత్యేక రుసుము చెల్లించి ఇచ్చట భక్తులు స్వయంగా స్వామి వారికి అభిషేకము చేసుకోవచ్చు.
శ్రీ స్వామి వారి కళ్యాణ మండపము
రవాణా వసతి సౌకర్యాలు. :--- ఈ దివ్య క్షేత్రం కరీంనగర్ కు 130 కి.మీ దూరంలోను, మంథనికి 65 కి. మీ దూరంలోను, వరంగల్లుకు 110 కి.మీ దూరంలోను. హైద్రాబాద్ 280 కి.మీ దూరంలోను ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రథాన ష్టేషన్ల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఈ క్షేత్రంలో వి.ఐ.పి గదుల నుండి ధర్మశాలల వరకు వివిధమైన వసతి గృహాలున్నాయి. జూన్ 11-2013 వరకు సరస్వతీ పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం రద్దీ ఉండవచ్చు. భోజనం, ఫలహారాలు ,టీ.దొరుకుతాయి. తప్పని సరిగా చూడవలసిన దివ్యక్షేత్రం కాళేశ్వరం.
రవాణా వసతి సౌకర్యాలు. :--- ఈ దివ్య క్షేత్రం కరీంనగర్ కు 130 కి.మీ దూరంలోను, మంథనికి 65 కి. మీ దూరంలోను, వరంగల్లుకు 110 కి.మీ దూరంలోను. హైద్రాబాద్ 280 కి.మీ దూరంలోను ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రథాన ష్టేషన్ల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఈ క్షేత్రంలో వి.ఐ.పి గదుల నుండి ధర్మశాలల వరకు వివిధమైన వసతి గృహాలున్నాయి. జూన్ 11-2013 వరకు సరస్వతీ పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం రద్దీ ఉండవచ్చు. భోజనం, ఫలహారాలు ,టీ.దొరుకుతాయి. తప్పని సరిగా చూడవలసిన దివ్యక్షేత్రం కాళేశ్వరం.
కాళేశ్వర మహాక్షేత్రం ముక్తీశ్వర
సమన్వితం
కాళేశ్వరో మహాదేవో భుక్తిం
ముక్తిం ప్రదాస్యతి. !!
No comments:
Post a Comment