శ్రీకాకుళ దివ్యక్షేత్రం ఆంథ్రరాష్ట్రం లో కృష్ణాజిల్లా లోని ఘంటశాల మండలం దివిసీమ లో కృష్ణానదీ తీరాన ఉంది. ఇక్కడ కొలువు దీరిన దైవమే శ్రీకాకుళ ఆంథ్ర మహావిష్ణువు. శంఖ చక్రాలను తారుమారుగా ధరించి, ఎడమచేతి యందు గదను, కుడిచేతిలో అభయముద్ర తో ఏడడుగుల ఆజానుబాహువై ఆర్తులను ఆదుకునే ఆంథ్రదేవుడై , ఆంథ్రనాయకుని గా కొలువు తీరి యున్నాడు.
.jpg)
శ్రీ ఆంథ్రమహావిష్ణు దివ్య సుందరరూపం
ఆంథ్ర మహావిష్ణువు. ఆంథ్రదేవుడు. ఎంత అందమైన పేరు. హృదయావర్జకమైన ఆ పేరు క్రీ.శ రెండు మూడు శతాబ్దాలకు పూర్వమే ప్రసిద్ధమైనదన్న విషయం తెలుగు హృదయాల్లో అంతులేని వింత పులకింత ను కల్గిస్తోంది. శాతవాహనులకు పూర్వమే ఆంధ్ర విష్ణువు తెలుగు సామ్ర్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధి పత్యం గా పాలించిన మహావీరుడని చరిత్ర చెపుతోంది. శాతవాహనసామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు (క్రీ .పూ.230-205 ) ఈ శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించి నట్లు చెప్పబడుతోంది. ఇక్కడ కొలువైన దేవుడు ఆంథ్ర మహావిష్ణువు > ఆంథ్రదేవుడు > ఆంథ్ర వల్లభుడు > తెలుగు వల్లభుడు.
.jpg)
ఆలయరాజగోపురము
“ఆంథ్రత్వ మాంధ్రభాషా చ నాన్యస్య దుర్లభా” అన్నాడు మహా పండితుడు అప్పయ్య దీక్షితులు. అటువంటిది ఆంథ్ర భాష ,ఆంధ్ర జాతి పేరు మీద ఒక దేవుడు వెలిశాడంటే ఆనాటి ఆజాతి ఆ దైవాన్ని ఎంతగా ప్రేమించి, సేవించి , పూజించి, తరించిందో మనకు అర్ధమౌతుంది.
శ్రీ రాజ్యలక్ష్మీ దేవి
108 దివ్యదేశాల్లో ఈ శ్రీకాకుళ దివ్యక్షేత్రం యాభై ఏడవది గా చెప్పబడుతోంది. కలియుగ ప్రారంభం లోనే శ్రీమహావిష్ణువు బ్రహ్మ ప్రార్థన నంగీకరించి భూమిపై మానవ రూపంలో ఆంథ్రమహావిష్ణువుగా అవతరించినట్లు బ్రహ్మాండపురాణం లోని నారద సంహిత లో వ్రాయబడింది. శ్రీ స్వామి వారి గర్భాలయానికి కుడివైపు ఉపాలయంలో శ్రీ రాజ్యలక్మీ దేవి కొలువు తీరి ఉంటుంది .ఈమె తరువాత కాలంలో చాళుక్యుల చేత ప్రతిష్ఠంచబడి నట్లు చెప్పబడతోంది.
శాతవాహనులకు పూర్వమే సుచంద్రుని కుమారుడైన విష్ణువు అనే మహా వీరుడు ఆంథ్ర సామ్రాజ్యాన్ని స్ధాపించి, మహేంద్రగిరి తో శ్రీశైలం, కాళేశ్వరం,భీమేశ్వరాలను కలుపుతూ గొప్పకోటను నిర్మించి. దానికి శివుని మూడు నేత్రాలకు ప్రతీకలు గా మూడు ద్వారాలను నిర్మించి, ఆంథ్ర దేశాన్ని పాలించాడు. అతని కాలం లో ప్రజాకంటకుడిగా ఉన్న నిషుంభుడనే దుర్మార్గుని చిరకాల యుద్ధం లో ఓడించి సువిశాల ఆంథ్ర సామ్రాజ్యాన్ని గోదావరి వరకు విస్తరింప చేసి , ప్రజారంజకుడి గా పాలన కొనసాగించాడు. ఆయనను శ్రీ మహావిష్ణువు అంశ గా ఆరాథించిన ఆనాటి ప్రజానీకం ఆయన అనంతరం ఆయనకు ఆలయాన్ని నిర్మించి , పూజించసాగారు. అదే శ్రీకాకుళ ఆంథ్ర మహావిష్ణువు దేవాలయం.ఇప్పుడు శ్రీకాకుళ ఆంథ్ర మహావిష్ణువు కొలువు తీరిన గర్భగుడి అత్యంత ప్రాచీన నిర్మాణం గా భారతదేశం లోనే అత్యంత పురాతన కట్టడాలలో ఒకటి గా భావించ బడుతోంది. శాతవాహనుల కాలం నాటికే అనగా రెండు లేక మూడవ శతాబ్దాల్లో ప్రధాన ఆలయనిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది అంటే దేశం లోని ప్రాచీన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. లభిస్తున్న ఆధారాలను బట్టి శాతవాహనులకు పూర్వం ఆంథ్రమహావిష్ణువు పరిపాలించినట్లు చరిత్ర చెపుతోంది.
శ్రీ భాగ్యలక్ష్మీ దేవి
శ్రీ స్వామి వారి అంత్రాలయంలో కుడివైపు గోడలో ఒక చిన్న గూడు లో శ్రీ భాగ్యలక్ష్మీ దేవి దర్శనమిస్తుంది.ఈమె 10 వ శతాబ్దంలోనే స్వామి కొలువు తీరినప్పుడే ఉన్నట్లు చెప్పబడుతోంది. ఈ దేవీమూర్తి కి ఎదురుగా ఉన్న మరో అరలో ముకుళిత హస్తాలతో ఆంజనేయ విగ్రహం ఉంటుంది. ఇది కూడా అలనాటి రూపమే.
అంత్రాలయంలో ఉన్న ఆంజనేయస్వామి
శ్రీ ఎ.డి కాంపెల్ (A.D.Campbell ) వ్రాసిన ఆంథ్రకౌముది లో ఎన్నో చారిత్రకాంశాలు ప్రస్తావించబడ్డాయి.
.jpg)
శ్రీ కృష్ణదేవరాయలు వేయించిన శాసనాలు
ఈ ఆలయ గోడల మీద కృష్ణరాయలు వేయించిన శాసనం తో పాటు 32 శాసనాలు లభిస్తూ ఈ ఆలయ ప్రాచీనతకు, ప్రసిద్ధి కి అద్దం పడుతున్నాయి. క్రీ.శ 1010 లో అనంతచోడ భూపాలుని చేత ఆలయం పునరుద్ధరించబడి , రాజగోపురం నిర్మించబడినట్లు శాసనాల వలన మనకు తెలుస్తోంది.
ఈ ఆంథ్రమహావిష్ణువు వృత్తాంతం తెలుగువల్లభుడైన కృష్ణరాయలవృత్తానం తో ముడిపడటం యాదృచ్ఛికం కాదు దైవనిర్ణయం అనుకోవాలి. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్రా సమయం లో విజయవాటిక లో విడిది చేసిన వేళ ఈ ఆంథ్ర మహావిష్ణువు ను గూర్చి విని , ఆయనను దర్శించడానికి కృష్ణా తీరం వెంబడి ప్రయాణించి, శ్రీకాకుళం చేరుకొని అక్కడ ఆలయ మండపం లో ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు.

ఆనాటి వేకువ జామున ఆంథ్ర మహావిష్ణువు శ్రీ రాయల వారికి కలలో కన్పించి ఆముక్తమాల్యదా వృత్తాంతాన్ని తెలుగు లో కావ్యం గా వ్రాయమని ఆజ్ఞాపించాడు. తెలుగదేల? తెలుగులోనే ఎందుకు వ్రాయాలి అని ప్రశ్నించిన రాయలకు ఆంథ్రమహావిష్ణువు ఇలా బదులిచ్చాడు.
‘తెలుగదేల యన్న దేశంబు తెలుగు
ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎఱుగవే బాసాడి
దేశభాషలందుఁ దెలుగు లెస్స.’
“ దేశం తెలుగుదేశం. తాను తెలుగు వల్లభుడు. మరేమో తెనుగు భాష కలకండ వలె తియ్యనైన భాష. అయినా ఆంథ్ర, కన్నడ కవులతో పాటు అన్ని భాషలను ఆదరిస్తున్న భువన విజయానికి అధినాయకుడవైన నీకు తెలియదా? దేశ భాషలన్నింటి లోను తెలుగుభాషే గొప్పది” అన్నాడు ఆంథ్రనాయకుడు. ఆంథ్రవల్లభుని మాటలను అంగీకరించి, అక్కడికక్కడే అప్పుడే ఆముక్తమాల్యదా కావ్యానికి శ్రీకారం చుట్టాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీ కృష్ణదేవరాయలు. ఆ ప్రదేశమే ఈనాడు ఈ శ్రీకాకుళ ఆలయం లో ఆముక్తమాల్యదా మండపం గా వాసి కెక్కింది.
.jpg)
ఆముక్తమాల్యదా మండపము
హరివాసరం లో శ్రీ రాయల వారికి ఆంథ్ర మహావిష్ణువు దర్శనం లభించింది. హరివాసరం అంటే ఏకాదశి లో చివరినాలుగు ముహూర్తాలు , ద్వాదశి లో మొదటి నాలుగు ముహూర్తాలు అనగా 6.24 నిమిషాలని కార్తాంతికుల చేత లెక్కకట్టబడింది. ఈ వృత్తాంతం శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదా కావ్యం లో కన్పిస్తుంది. అంతేకాకుండా క్రీ.శ. 1515 లో శ్రీ కృష్ణ దేవరాయలు వేయించిన అహోబిల శాసనం లోను, 30 మార్చి 1515 లోని సింహాచలం శాసనం లోను ప్రస్తావించబడ్డాయి.

ఆముక్తమాల్యదా మండపంలో ఉన్న శ్రీ కృష్ణదేవరాయల కాంస్యవిగ్రహం
ఆలయం చుట్టూ వెలుపలి గోడలకు అనేకమైన కుడ్యశిల్పాలు ప్రత్యేకంగా నిర్మించిన అరలలో అమర్చబడ్డాయి. వీటితో పాటే 33 శాసనాలు కూడ మనకు కన్పిస్తాయి .

ఈ శ్రీకాకుళ గ్రామం తొలి రోజుల్లో కృష్ణాతీరం లో “సిరికొలను” అనే పేరుతో ఒక లంకలాగ ఉండేదనీ, క్రమక్రమంగా ఒడ్డుకు జరిగి, సిరికొలను > శ్రీకాకుళం గా మారిందని చెపుతారు.
శ్రీ స్వామివారికి వైశాఖమాసం లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11 న శ్రీకృష్ణ దేవరాయలు ఆలయానికి వచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఎంతవారికైనా కాలం కలిసి రాకపోతే ఎదురు దెబ్బలు తప్పవు కదా. ఎందరెందఱో మహారాజులు ,సార్వభౌములతో సేవలందుకున్న స్వామికి నైజాం పాలనలో ధూపదీపనైవేద్యాలకు కూడ కటకట ఏర్పడింది. ఇదే సమయం లో శ్రీ కాసుల పురుషోత్తమకవి “చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ” “హతవిమతజీవ శ్రీ కాకుళాంథ్ర దేవ” అనే మకుటం తో నిందాస్తుతి తో సీసపద్యశతకాన్ని వ్రాసి, స్వామికి నివేదనకు కూడా గింజలేని పరిస్థితిని విస్తారంగా ప్రచారం చేయడం తో దేవరకొండ ప్రభువైన యార్లగడ్డ కోదండరామన్న దొర గారు సహకరించి , స్వామికి దిట్టం ఏర్పాటు చేశారనీ ఇప్పటికీ కూడ చల్లపల్లి ప్రభువులే ధర్మకర్తలుగా కొనసాగు తున్నారని తెలుస్తోంది.

శ్రీ కాసుల పురుషోత్తమకవి
శ్రీ కాసుల పురుషోత్తమకవి రచించిన “ఆంథ్రనాయక శతకము” తెలుగు శతక సాహిత్యం లో ప్రత్యేక స్థానాన్ని పొందింది . “mutteviraviprasad.blogspot.com” లో తేజస్వినీ వ్యాఖ్య తో ఈ శతకాన్ని చదువవచ్చు.
శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుకు నిత్య నైవేద్యాలు , ఉత్సవాలు నిరాటంకంగా జరగడానికి కొండపల్లి సీమ , దేవరకోట లోని యార్లగడ్డ ,మేడూరి స్ధలం లోని లంకపల్లి ,కంబాలదొడ్డి , కొండవీటి సీమ లోని పెదగాడి పట్టు , వినుకొండ సీమ లోని కారుమంచి సమర్పించినట్లు శాసనప్రమామం . ఈ శాసనం ఆలయ తూర్పుగోడ కు అమర్చబడి ఉంది. (South Indian Inscriptions – 4th Vol

ఆంథ్రమహావిష్ణువు దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం గా భక్తులు భావిస్తారు. విజయవాడ నుండి కొడాలి మీదుగా శ్రీకాకుళానికి బస్సులున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల్లోను నిత్యాగ్ని హోత్రం వెలిగే ఏకైకఆలయం గా చెప్పేవారు. ఇప్పుడేమైనా కొత్తఆలయాల్లో ప్రారంభించారేమో తెలియదు. ఈ అలయం రోడ్డు ఆవలి వైపు క్షేత్రపాలకుడైన ఏకరాత్ర ప్రసన్న మల్లిఖార్జున దేవాలయముంది.
-----------------------------------------------------------------------------------------------------------------------------

.jpg)


No comments:
Post a Comment