Kolanupaka sri chandee
sameta
someswaraswamy Temple.
కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామిక్షేత్రం कॊलनुपाक श्री चंडी समेत सोमेश्वरस्वामि क्षेत्रम्.
నల్గొండజిల్లా ఆలేరు మండలం లోని కొలనుపాక వీరశైవ సిద్ధ
క్షేత్రం. శైవమతస్థాపకుడు గా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య ఇచ్చటనే లింగోద్భవము
పొంది వేయి సంవత్సరాలు భూమండలం మీద శైవ మతప్రచారము చేసి, మరల ఇచ్చటనే లింగైక్యమందినట్టు సిద్ధాంత శిఖామణి
అనే గ్రంథంలో వ్రాయబడి వుందని స్థలపురాణం.. దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన
శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి.
దేవాలయ ప్రాంగణాన్ని , ప్రాకార మండపాలనే మ్యూజియం గా ఏర్పాటుచేశారు
పురావస్తు శాఖ వారు.
ఈ ఆలయం క్రీ.శ 1070
- 1126 మథ్య నిర్మాణం జరిగినట్లు
భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని చరిత్ర కారులు భావిస్తున్నారు.
శ్రీ రేవణ సిద్ధేశ్వరుడు
పూర్వచరిత్ర. :---- ఈ కొలనుపాక నే పూర్వం దక్షిణ
కాశి,బింబావతి పట్నం, పంచకోశ నగరం గా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక,
కల్లియపాక, కుల్యపాక, కొల్లిపాకేయ మొదలైన
పేర్ల తో పిలిచే వారట. ఇప్పడు కొలనుపాక,
కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు.
ఆలయ ప్రవేశ ద్వారం
ఇచ్చట సోమేశ్వర లింగాన్ని పుట్టులింగం, లేక స్వయంభూలింగం గా చెపుతున్నారు. ఈ లింగం నాలుగు యుగాలనాడే వెలసింది. కృతయుగం లో
స్వర్ణలింగం గాను, త్రేతాయుగం లో
రజితలింగం గాను, ద్వాపరయుగం లో తామ్రలింగం
గాను, పూజలంది కలియుగం లో శిలాలింగం గా దర్శనమిస్తున్నట్లు స్థలపురాణం.
ప్రవేశ ద్వారం ఎదురుగా వినాయకుడు
ఈ లింగమే రెండు గా చీలి, దానిలో నుండి ఆది జగద్గురువు రేణుకాచార్య
ఆవిర్భవించి,1000 సం.రాలు భూమిపై వీరశైవ
మతప్రచారం చేసి, మరల తిరిగి ఇదే లింగం లో లీనమైనట్లు చెప్పబడుతోంది. ఈయనకే
రేణుకుడు, రేవణ, నేవణ, నేవణ సిద్ధేశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి.
శ్రీమత్ రేవణ సిద్దస్య కుల్యపాక
పురోత్తమే !
సోమేశ లింగ జననం నివాసే కదళీ పురీ !!
అని
రేణుకాచార్య స్తుతి.
పంచపీఠాలు : ఈ సోమేశ్వర లింగం పంచ పీఠాలలో మొదటిది గా
వీరశైవులు పూజిస్తారు.
1. సోమేశ్వరస్వామి – కొలనుపాక 2. సిద్దేశ్వర స్వామి - ఉజ్జయిని
3.భీమనాథస్వామి - కేదారనాథ్ 4. మల్లిఖార్జున స్వామి – శ్రీశైలమ్
5. విశ్వేశ్వరస్వామి – కాశి
మ్యూజియం లోని గజలక్ష్మి
అతి పురాతనమైన ఈ ఆలయప్రాగణం లోకి ప్రవేశించిన భక్తులకు అనిర్వచ నీయమైన భక్తితో పాటు ఏదో ఒక ఆవేశంవంటిది కలుగుతుంది. దీనినే వీరశైవం లో భక్త్యావేశం అని పిలిచేవారేమో అనిపిస్తుంది. అక్కడ కన్పించే భక్తులు కూడ ఎక్కువగా కర్నాటకనుండి వచ్చినవారే ఎక్కువగా కన్పిస్తారు. తలస్నానాలు చేసి, జుట్టు ఆరబోసుకొని, ముఖంమీద బండారు, కుంకుమ, విభూతులను దట్టంగా అలంకరించుకున్న ఆడవారిలో అక్కడ చండీమాతే కన్పిస్తుంది.
మ్యూజియం లోని ఒక శిథిల శిల్పం
ఆలయప్రవేశం తోరణ ద్వారంతో చాలాఎత్తుగా
కన్పిస్తుంది. తోరణ ద్వారానికి అటునిటు
ద్వారపాలకులు, ఎడమ వైపు నలుచదరపు కందకంలో
నంది శివలింగాలు. ఆ పైన దూరంగా కొన్ని శాసనాలు
దర్శనమిస్తాయి. తోరణ ద్వారానికి కుడి వైపు కొంచెం దూరం లో నేల లోపలికి
నలభై,ఏభై మెట్ల తో మెలికలు తిరిగిన
నేలమాళిగ ఉంటుంది. ఆ మార్గాన్ని మూసివేయడం జరిగింది.
కోష్ట పంజరం లో శ్రీ పార్వతీ పరమేశ్వరులు
ప్రథానాలయం. ;---- మ్యూజియం ను, వీరభద్ర మండపాన్ని దాటి వెళితే ప్రథానాలయాన్ని చేరుకుంటాం. ఈ నడుమ ప్రమాణ మండపం లో నందీశ్వరుడు మనల్ని పల్కరిస్తున్నట్లు గా కన్పిస్తున్నాడు. ప్రథానాలయం ప్రాకార మండపాలనుండి వేరుగా నిర్మించబడింది. ముఖమండపం లో మనకు పంచముఖేశ్వరుడు దర్శనమిస్తాడు.
ప్రథానాలయం. ;---- మ్యూజియం ను, వీరభద్ర మండపాన్ని దాటి వెళితే ప్రథానాలయాన్ని చేరుకుంటాం. ఈ నడుమ ప్రమాణ మండపం లో నందీశ్వరుడు మనల్ని పల్కరిస్తున్నట్లు గా కన్పిస్తున్నాడు. ప్రథానాలయం ప్రాకార మండపాలనుండి వేరుగా నిర్మించబడింది. ముఖమండపం లో మనకు పంచముఖేశ్వరుడు దర్శనమిస్తాడు.
ఆయనంతరం గర్భాలయంలో
స్వయంభువుడైన సోమేశ్వరుని లింగరూపం, ఆ
వెనుక లింగోద్భవమూర్తిగా రేణుకాచార్య విగ్రహం దర్శన మిస్తాయి.
స్వయంభువు డైన సోమేశ్వరుడు , వెనుక ఆదిజగద్గురు రేణుకాచార్య ఆవిర్భావ దృశ్యం
చంద్రుడు ఈయన అనుగ్రహాన్ని పొంది తరించినట్లు, అందువలన ఈ స్వామి సోమేశ్వరుడుగా పిలువబడబతున్నట్లు స్థలపురాణం.
చండీమాత .:-- ఎడమవైపు ఉపాలయంలో మల్లిఖార్జునుడు ఆ ప్రక్కనే నాలుగుమెట్లు ఎ క్కి కుడువైపుకు తిరిగితే ఉపాలయం లో చండీమాత కొలువు తీరి ఉంది.
శ్రీ చండీమాత
ఆ ఆలయానికి ఎడమవైపు
కుందమాంబ దివ్యమంగళవిగ్రహం కన్పిస్తుంది..
చండీమాత భక్తులు ముడుపులు కట్టి, కోరికలు తీరిన తరువాత మొక్కులు చెల్లించుకుంటారు.
చండీమాత ఆలయ ద్వారం వద్ద ఉన్న వినాయకుడు
కోటిలింగేశ్వరాలయం:;---. ఎడమవైపు ద్వారం నుండి
వెలుపలికి వస్తే నైరుతి లో కన్పిస్తుంది కోటిలింగేశ్వరాలయం. పంచకోసు నగరం గా పిలువబడే ఈక్షేత్రం లో కోటిలింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యిలింగాలు
తక్కువ అవడం తో ఒకే రాయి పై వేయిలింగాలను చెక్కి ప్రథిష్టించారట. అదే ఈ
కోటిలింగేశ్వరాలయం గా ప్రసిద్ధి
కెక్కింది.
సూర్యగంగ.:-- ప్రథానాలయ ముఖమండపము యొక్క కుడివైపు ద్వారం
నుండి వెలుపలి కొస్తే కన్పించేది సూర్యగంగ గా పిలువబడే అత్యంత లోతైన
కోనేరు.
********** ఈ ఆలయ పూర్తి
దృశ్యాలను You tube ల నాచే ఉంచబడిన kolanupaka sree chandeemaata sameta someswara
darsanam part -1,part -2
ద్వారా చూడవచ్చు.
ps://www.youtube.com/watch?v=DoyDyY0idpY
https://www.youtube.com/watch?v=yrd6R9UtMIM
ఏకాదశ రుద్రులు. :--- అటునుంచి తిరిగి పడమరకు తిరిగి నాలుగు మెట్లెక్కితే ఏకాదశరుద్రుల సాక్షాత్కారం లభిస్తుంది. ప్రక్కనే కొంచెందూరం లో ఉత్తరాభిముఖుడై విఘ్నరాజు కొలువు తీరి ఉన్నాడు.
ఏకాదశ రుద్రులు. :--- అటునుంచి తిరిగి పడమరకు తిరిగి నాలుగు మెట్లెక్కితే ఏకాదశరుద్రుల సాక్షాత్కారం లభిస్తుంది. ప్రక్కనే కొంచెందూరం లో ఉత్తరాభిముఖుడై విఘ్నరాజు కొలువు తీరి ఉన్నాడు.
ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వస్తే కాకతీయ
కళాసంప్రదాయం తో నిర్మితమైన మరో శిథిల శివాలయం మన కంటపడుతుంది. సోమేశ్వర ఆలయమంతా
చాళుక్య, హోయసల నిర్మాణ సంప్రదాయం కన్పిస్తే,
ఈ ఆలయం నిర్మాణం లో కాకతీయ శైలి ప్రతిబింబిస్తోంది. దీనలో శివలింగం, ముఖమండపం లో నంది మిగిలున్నాయి,
ఆ ప్రక్కనే కేతేశ్వర స్వామి ఆలయం నూతన నిర్మాణం
గా కన్పిస్తోంది.
అలాగే కనుచూపుమేర వరకు
శిథిలమైన ఒరిగిపోయిన ఆలయ సముదాయాలే ఇక్కడ మనకు గోచరమౌతాయి. ఉపాలయాల్లో కాలభైరవుడు, వీరభద్రుడు, కుమారస్వామి రూపాలతో పాటు, ఒక మండపం లో ఆంజనేయుడు కూడ
కొలువు తీరి ఉన్నాడు.
ఇక్కడే కాదు. ప్రథాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉన్న నంది స్థంభం దగ్గర కూడ మనకు
చాలా ఎత్తైన ఆంజనేయ విగ్రహం వినాయక ,కార్తికేయులతో కలసి కన్పిస్తుంది.
వీరశైవ క్షేత్రాల్లో ఆంజ నేయుడు కన్పడటం ఆంజనేయుడు శివాంశ సంభూతుడు గా పూజించ బడటమే కారణమై ఉండవచ్చు. ఇంకా ఎక్కువ సమాచారం చెప్పడానికి, మనం తెలుసుకోవడానికి అక్కడ సరైన గైడ్ కాని, ముద్రిత సమాచారం కాని లేకపోవడం కొంచెం బాధ కల్గిస్తుంది.
వీరశైవ క్షేత్రాల్లో ఆంజ నేయుడు కన్పడటం ఆంజనేయుడు శివాంశ సంభూతుడు గా పూజించ బడటమే కారణమై ఉండవచ్చు. ఇంకా ఎక్కువ సమాచారం చెప్పడానికి, మనం తెలుసుకోవడానికి అక్కడ సరైన గైడ్ కాని, ముద్రిత సమాచారం కాని లేకపోవడం కొంచెం బాధ కల్గిస్తుంది.
మ్యూజియం లోని అపురూపమైన కోదండరాముని విగ్రహం
సుదూర ప్రాంతాలనుంచి అంటే ఇతర
రాష్ట్రాలనుంచి ఇక్కడ కొచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. యాత్రికుల వసతి సముదాయం
ఇటువంటి వారికోసం అందుబాటులో ఉంది.
శ్రీ మహాలక్ష్మీ సమేత వీరనారాయణ
స్వామి :;-- . ఈ సోమేశ్వరాలయానికి దక్షిణం గా కొద్దిదూరం లో ఉన్నమరొక ప్రాచీన
ప్రసిద్ధ ఆలయం శ్రీ వీరనారాయణ స్వామి ఆలయం.
పురాణం:-- కొన్ని వందల సం.రాల క్రితం ఒక వీరుడు శతృవులను ఓడించి తన విజయానికి కారకుడైన
నారాయణుని స్మరిస్తూ నూరుమెట్ల పెద్దకొలనును తవ్వించి ,దాని లో స్నానంచేసి. ఒక్కోక్క మెట్టుకు ఒక్క
పద్యం చెప్పుకుంటూ పైకి వచ్చి, ఆకొలను ఒడ్డున పాక ను నిర్మించుకొని తపస్సు చేసి, తరించాడు. తనకు సాక్షాత్కరించిన నారాయణుని
మహాలక్ష్మీ సమేతం గా అచ్చటనే ప్రతిష్ఠించి
, ముక్తిని పొందాడట. కొలను గట్టున
పాక వేసుకున్న వీరుని తప: ఫలితం గా ఈ గ్రామం
కొలనుపాక అయ్యిందట. ఆ వీరుడు ప్రతిష్ఠించిన నారాయణుడే ఈ వీరనారయణుడై, మహాలక్ష్మీ సమేతం గా పూజలందుకుంటున్నాడు.
వీరనారాయణ స్వామి ఆలయ శిఖరం
చాళుక్య సంప్రదాయశైలిలో
నిర్మితమైన ప్రాచీన దేవాలయం ఇది. శ్రీ వీరనారాయణ స్వామి, ప్రక్కనే స్వామికి ఎడమవైపులక్ష్మీ దేవి ఒకే పీఠం పై
నిలుచుని కన్పిస్తారు. చాలా అందమైన విగ్రహాలు. అయితే
పైన కథలో చెప్పినట్లు ఇక్కడ వందమెట్ల కోనేరు మాత్రం లేదు. ఆలయానికి ప్రాకారం కూడలేని స్థితిలో వీరనారాయణుడున్నాడు. దీని వెనుకనే నూతనంగా రేణుకామాత ఆలయం, ఆ ప్రక్కనే షిర్డీ
సాయి ఆలయం నిర్మించబడ్డాయి.
రేణుకా మాత దివ్యవిగ్రహం
జైన మందిరం. :---
కొలనుపాక అనగానే వినిపించే మరొక ఆలయం జైన దేవాలయం. రాజస్థాన్, మహారాష్ట్ర భక్తుల ప్రభావంతోనే
కొలనుపాక గూగుల్ మ్యాప్ లో కుల్ పాక్ గా మారిపోయిందేమో. 2000 సం.రాల చరిత్ర ఉందని
చెప్పుకుంటున్న జైనభక్తులు వందసంవత్సరాల క్రితం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించారు. గత ఇరవై ఏళ్ల లో చాలా అందమైన
ఆలయాన్ని నిర్మించారు. యాత్రిక వసతి ఏర్పాటు ఉంది. వర్థమాన మహావీరుని
విగ్రహాలు సోమేశ్వర ఆలయ మ్యూజియం లో కూడ మనకు కన్పిస్తాయి.
కొలనుపాక హైదరాబాద్ వరంగల్లు మార్గంలో ఆలేరు
నుండి బచ్చన్నపేటకు వెళ్లే దారిలో 8 కి.మీ దూరం లో ఉంది. హైదరాబాదు నుండి సుమారు
80 కి.మీ దూరం లో ఉంది.
**************************************************** *****************************
No comments:
Post a Comment