Tuesday, 25 June 2013

పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం

                     Palakurthy Sri Someswara LakshminarasimhaSwamy Aalayam
            పాలకుర్తి   శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం .       
                      पालकुर्ति श्री सोमेश्वर लक्ष्मीनरसिंहस्वामि आलयम्     
                   

              వరంగల్లు జిల్లా పాలకుర్తి శివకేశవులు ఇరువురు స్వయంభువు లుగా ఒకే కొండపై  వెలసిన దివ్యక్షేత్రం. దట్టమైన చెట్ల మధ్య కొండ పై భాగాన రెండు గుహలు. ఒక గుహలో సోమేశ్వరుడు, ప్రక్కనే వేరొక గుహలో లక్ష్మీనరసింహుడు కొలువు తీరి  కొలిచిన భక్తులకు కొంగు బంగారమై నీరాజనాలందుకుంటున్నారు.

     క్షేత్ర మహత్మ్యం :---         ఈ కొండరాళ్లకు ,చెట్లకొమ్మలకు పదుల కొద్ది తేనెపట్టు లుంటాయి. శుభ్రత పాటించకుండా ఆలయానికి కొస్తే తేనెటీగలు శిక్షణ భటులుగా వారిని వెంబడించి స్నానంచేసేవరకు వారిని వదలవట. స్వామికి మొక్కులు మొక్కి, ఆపదలు తీరిన తరువాత మర్చిపోతే స్వామి వారికి వెంటనే గుర్తు చేస్తుంటారట.
                           

          
                       ఎత్తైన కొండ రెండు గా చీలి, ప్రదక్షిణ మార్గానికి దారి ఏర్పడటం చూపరులకు ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.ఒక భక్తురాలి కోరిక మేరకు కొండ రెండుగా చీలి ప్రదక్షిణ మార్ ఏర్పడినట్లు భక్తులు చెప్పుకుంటారు. అది సహజసిద్ధంగా ఏర్పడినా ఒక సహజ ప్రకృతి రమణీయ ప్రదేశంగా గుర్తించ దగ్గది.  కొండపై నున్న  శిఖరదర్శనం చేసుకోవడానికి పెద్దపెద్ద రాళ్ళ మథ్యనుండి పైకి మెట్ల మార్గం ఉంది.

 
          

       గండదీపం




 గండదీపం. :--         ఇక్కడే గండదీపం మిద్దె ఉంటుంది. ఈ మార్గం ద్వారా భక్తులు పైకి వచ్చి గండదీపం వెలిగించి  తమ మొక్కులను తీర్చుకుంటారు. కొంచె బరువైన శరీరం కలిగిన వాళ్ళు, చీకటికి భయపడేవారు, ఆథునికంగా నిర్మించిన వేరే మెట్ల దారి ద్వారా పైకి చేరుకొని గండదీపం వెలిగించుకుంటారు.  అయితే శిఖర ప్రదక్షిణం చేయాలంటే మాత్రం  రాళ్ళమథ్య, నిలువుమెట్ల పై ప్రయాణం చేయాల్సిందే.


                                                 ప్రదక్షిణ మెట్లమార్గం

   క్షేత్ర ప్రాథాన్యం .:       ఈ మెట్ల మార్గం శ్రీ స్వామి రెండు గుహలకు  కొంచెం దక్షిణంగా ఉంటుంది. ఈ మెట్ల మార్గానికి ఆనుకొని కొండ లోపలికి క సొరంగ మార్గం ఉంది. దీనిని నేలబొయ్యారం ని పిలుస్తారు. ఇప్పుడు దీనిని మూసివేశారు. చిత్రంలో చూడవచ్చు. ఇది జన సంచారం పెరిగే మొన్న మొన్నటి కాలం వరకు మహర్షులు తపస్సుకు, యజ్ఞ యాగాదులకు ఎంచుకున్న ఏకాంత పుణ్య రహస్య స్థలంగా భావించబడుతోంది.  ఇప్పటికీ ఈ కొండలో నుండి రాత్రి వేళల్లో ఓంకారం వినిపించడం, శివలింగానికి నాగుపాము ప్రదక్షిణలు జరపడం విశేషంగా భక్తులు చెపుతుంటారు.
                    
                
             

                                        నేలబొయ్యారం

   చాలాకాలం క్రితం  నేలబొయ్యారం లోని విశేషం తెలుసుకుందామని భావించిన అర్చకులు, కొందరు గ్రామ పెద్దలు కలిసి సొరంగం లోకి కొంతదూరం ప్రయాణం చేసి, ఇరుకైన, గాలి రాని, గబ్బిలాల వాసనతో నిండిన దారిలో ముందుకు సాగ లేక వెనక్కి వచ్చేశారని స్థలపురాణం చెపుతోంది.
                                                                                                                                             
                                                                                                                                                   ఈ గుహకు ప్రక్కనుంచి  పై నున్న  వీరాంజనేయస్వామి  ఆలయానికి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు కూడ నిలువుగా పెద్ద కొండ రాళ్ళమథ్య నుంచి సాగిపోతాయి. ఈ ఆంజనేయుని దర్శనానికి వేకువజామునే సుదూర ప్రాంతాలనుండిభక్తులు వచ్చి ఉప్పురాశి గా పోసి ,దాని పై  ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి, ప్రదక్షిణలు చేస్తారు.   ఎటువంటి భూత , ప్రేత,పిశాచాది బాధలున్నా తొలగిపోతాయని, సంతానం లేనివారు సంతానం పొందుతారని  భక్తుల నమ్మకం.


                     రెండుగా చీలి ప్రదక్షిణ మార్గాన్నిచ్చినకొండ
  
పాలేరు>పాలకురికి>పాలకుర్తి   :--. వేల సంవత్సరాల చరిత్ర గల  ఈ కొండ గుహల నుండి పాల లాంటి నీరు ప్రవహించేదట. ఆ నీరు చెరువులో కలసి పాలేరు గా ప్రవహించి, గోదావరి లో కలుస్తుంది.  అందువలన  పాలేరు కు జన్మనిచ్చిన ఈ మహాక్షేత్రమే పాలకుర్తి గా ప్రసిద్ధిపొందింది. పాలకురికి గ్రామమే క్రమంగా పాలకుర్తి అయ్యింది. దీనినే పండితులు క్షీరగిరి అని కూడ పిలుస్తారు.


   
                               మెట్లమార్గం లో రెండవ మలుపు

శ్రీ సోమేశ్వర, లక్ష్మీనరసింహ దర్శనం.:---    ఎత్తైన కొండ మీద రెండు ద్వారాలు గల ఒకే గుహలో దక్షిణంగా సోమేశ్వర స్వామి, దానిలో నుండి  స్వామికి ఎడమవైపుకు ఉన్న మార్గం ద్వారా నరసింహుని గుహలోనికి దారి ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తరస్థానం లో కూర్చొని సోమేశ్వరుని చూస్తున్నట్లుగా ఉంటుంది.
                      

                                శ్రీ సోమేశ్మవర స్వామి వారి దివ్యరూపం

  శ్రీ సోమేశ్వరుడు గుహలోపలికి ఎత్తైన తిన్నె పై స్వచ్ఛధవళ కాంతులనీనుతూ సుమారు అడుగున్నర ప్రమాణం లో పానమట్టం పై వెలసి, భక్తులకు దర్శన మిస్తున్నాడు.ఆర్జితసేవ లో భక్తులకు స్వయంగా స్వామికి అభిషేకం చేసే అవకాశం ఉంది.
                  

                                          శ్రీ  పార్వతీ మాత       

శ్రీ నరసింహుడు లక్ష్మీ సమేతుడై  ఎత్తైన తిన్నెపై సుమారు మూడడుగుల విగ్రహం లో కొలువు తీరి చిరునవ్వులు చిందిస్తుంటాడు. ఆర్తత్రాణ పరాయణుడు ఆశ్రిత జనరక్షకుడు నై భక్తమందారుడు గా భక్త జనుల పూజలనందుకుంటున్నాడు. మానసిక రోగాలు,శారీరక బాథలు శ్రీ స్వామిని దర్శిస్తే నశిస్తాయని భక్తులనమ్మకం.  అందుకేనేమో.! స్వామిని దర్శించిన ప్రతి భక్తుని,అర్చకులవారు,  స్వామి పాదాల చెంత నున్న చిన్న బెత్తాన్ని తీసుకొని,   భక్తుని వీపు పై నెమ్మదిగా తాటించడం ఈ ఆలయం లో కన్పిస్తుంది.
                       
           



                               శ్రీలక్ష్మీనరసింహుని దివ్య గంభీర రూపం
            
     ఈ ఆలయానికి ముఖమండపము, లోపలికి వెడితే గుహ లో తిన్నెపై స్వామి దర్శనము తప్పితే అంత్రాలయము ,గర్భాలయము వంటివి వేరు గా కన్పించవు. ఆ స్వామి దర్శనమే భక్తులకు పరమానందాన్ని కల్గిస్తోంది.
      ******   ఈ ఆలయ పూర్తి చిత్రాన్ని YOU TUBE  లో "  Palakurthy sri someswara lakshminarasimha swamy darsanam "     ద్వారా చూడవచ్చు.******                
     
                 https://www.youtube.com/watch?v=h9ls7TCSoO4
                    
                     ఈ పుణ్యభూమి లోనే 12 వ శతాబ్దానికి  చెందిన వీరశైవ కావ్య నిర్మాణ థౌరేయుడు, బసవ పురాణ కావ్యకర్త,  మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు జన్మించాడు. శ్రీ విష్ణురామిదేవుడు, శ్రియా దేవమ్మ దంపతులకు  శ్రీ సోమేశ్వర స్వామి వరప్రసాదం గా ఆమహానుభావుడు జన్మించాడు. అందుకే తల్లిదండ్రులు ఆయనకు  సోమనాథుడని పేరు పెట్టుకున్నారు. శ్రీ సోమనాథుడు ఈ సోమేశ్వరుని  స్తుతిస్తూ సోమనాథుని స్వవాలు వ్రాశాడని చెపుతారు.             అనుభవసారము,బసవపురాణము,పండితారాథ్యచరిత్ర, చతుర్వేద సారము  మొదలైన అనేక గ్రంథాలను, ఎన్నో లఘుకృతులను సోమనాథుడు రచించాడు. ఈ గ్రామం లో సోమనాథుని స్మృతి చిహ్నం గా నిర్మించిన శివాలయం ఉంది.
                      


           
                                                  శ్రీ వినాయకుడు
          
               శ్రీ  ఆంథ్ర  మహాభాగవత మందార మకరందాన్ని తెలుగు వారి కందించిన భక్తకవి పోతన నివాస గ్రామం బమ్మెర ఈ పాలకురికి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు  ఈ సోమేశ్వరుని, లక్ష్మీ నర సింహు ని దర్శనానికి వచ్చి వెడుతుండే వాడనడానికి గ్రంథాల్లో  ఆథారాలున్నాయని స్థలపురాణం లో వ్రాశారు.
                       
  


                                    విహంగవీక్షణం
             
            వాల్మీకి మహర్షి  కూడ పాలకుర్తి కి ఐదు కిలోమీటర్ల దూరం లోగల వల్మిడి(వాల్మీకి పురం) లో గల కొండల్లో నివసించే వాడని ప్రతీతి.
                     
              ఇక్కడికొచ్చే భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తారు. కొబ్బరికాయలు కొట్టడం, గండదీపాలు వెలిగించడం, అన్నదానం, తలనీలాలుసమర్పించడం,కోడెలను కట్టివేయడం వంటి మొక్కులు తీర్చుకుంటారు. పెళ్లి కాని వారు మొక్కుకొని పెళ్లయిన తర్వాత స్వామి వారి కళ్యాణం చేయిస్తారు. స్వామివారికి పల్లకీ సేవ ప్రత్యేకం.

                         
                                       శ్రీ సోమేశ్వర గుహ ముఖద్వారం
           
         సంతానం లేని వారు మొదట కొబ్బరి కాయలు కడతారు. సంతానం కలిగాక తొట్టెలు కట్టి డోలారోహణ చేస్తారు. ల్లు కడితే బంగారు,వెండి, కర్ర ఇల్లు చేయించి       శ్రీ స్వామి వారికి సమర్పిస్తారు.అనారోగ్యం తో బాధపడేవారు  అవయవాలను వెండితో చేయించి  తెచ్చి సమర్పించడం  కూడ ఈ ఆలయం లో కన్పిస్తుంది.   
     


                                     నందీశ్వరుడు

 ఉత్సవాలు : ---            మహాశివరాత్రి కి శ్రీ సోమేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి,జాతర కు  రాష్ట్రం నలుమూలలనుండే కాక కర్నాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలనుండి కూడ లక్షలాది గా భక్తులు  తరలివస్తారు.ఉత్సవాలలో భాగం గా యజ్ఞ యాగాదులతో పాటు,  దివ్యరథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.కొండచుట్టు ప్రభలు కట్టిన ఎడ్లబండ్లు పరుగులు తీస్తాయి. చివరి రోజున అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది.
                    
    
                శ్రావణ మాసం లో శత చండీ హవనం, రుద్రహవనం,లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలు జరుగుతాయి. కార్తీక దీపోత్సవం, మార్గశిర మాసం లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మార్గళి ప్రాత: కాలార్చనలు,నైవేద్యాలు, ప్రసాదవినియోగం ఉంటాయి. శ్రీ సోమనాథ మహాకవి శివైక్యం పొందిన    ఫాల్గుణ మాసం లో ప్రత్యేక ఉత్సవాలుంటాయి. ప్రతి మాస శివరాత్రికి  శ్రీ  స్వామివారి కళ్యాణం నిర్వహించ  బడుతుంది.

                      
                                      కొండ దిగువన ఉత్సవ మండపం     
  
         శివ కేశవ అభేదానికి ప్రతీకగా కన్పించే ఈ ఆలయం లో  శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయం లో శైవాచార్యులే ( శివారాథకులు) అర్చకులు గా ఉండటం నిజంగా అభినందించ దగ్గ విషయం.
                   
         జిల్లా కేంద్రమైన వరంగల్లు కు 60 కి .మీ. దూరం లో ఈ పాలకుర్తి పుణ్యక్షేత్రం ఉంది.   కొండపైకి చక్కని ఘాటురోడ్డు సౌకర్యం ఉంది. యాత్రీకులకు కనీస వసతులు ఉన్నాయి. హైద్రాబాద్ , హన్మకొండ. వరంగల్, ష్టేషన్ ఘనాపూర్, జనగామ, తొర్రూరుల నుండి రవాణా సౌకర్యాలున్నాయి.
                      
                      ఒక్కసారైనా తప్పక చూడవలసిన ప్రాచీన దివ్యక్షేత్రం పాలకుర్తి.







****** క్షీరాద్రి శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే ***** ****************************************    

No comments:

Post a Comment