Wednesday, 15 May 2013

కర్మన్ ఘాట్ శ్రీ థ్యానాంజనేయస్వామి వారి ఆలయం


                            Karmanghat Sri Dhyananjaneyaswamy Temple.
         
                             కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయస్వామి వారి ఆలయం.
          
                             कर्मन् घाट् श्री ध्यानांजनेयस्वामि  आलयम्.
             
                             కర్మన్ ఘాట్  శ్రీ థ్యానాంజనేయస్వామి వారి ఆలయం రంగారెడ్డి జిల్లా  లోని  సరూర్ నగర్  మండలం లో ఉంది. ఇది హైదరాబాద్ గల అతి ప్రాచీన  ఆలయాల్లో ఒకటి గా చెప్పబడుతోంది.   క్రీ.శ  1143  ప్రాంతం లో గోల్గొండ నేలిన రెండవ ప్రతాపరుద్రుడు  ఈ ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆథారాల ద్వారా తెలుస్తోంది.  అతి పురాతన కట్టడంగా భాసించే  ఈ ఆలయనిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం పెల్లుబుకుతుంది. అతిసుందర,సువిశాలమైన ఆలయ ఆవరణ  లో వివిథ దేవీ దేవతా మూర్తుల ఉపాలయాలు కూడ కొలువు తీరి ఉన్నాయి. ఈ ఆలయ స్థలపురాణం శ్రవణ మనోహరం గా ఉంటుంది.

                        
                                                          ఆలయ రాజగోపురం

         స్థలపురాణం. ;;;------          క్రీ. శ 1143 లో గోల్గొండ ను పరిపాలించిన  కాకతీయప్రభువైన రెండవప్రతాపరుద్రునకు వేట ఒక అలవాటు గా ఉండేది . ఈనాడు మనం హైదరాబాదు అని పిలిచే  ఈ ప్రాంతమంతా  ఆ రోజుల్లో  లక్ష్మీపురమనే పేరుతో పిలువబడుతూ అడవిగా ఉండేది. ఒకరోజు రాజైన ప్రతాపరుద్రుడు ఈలక్ష్మీపుర ప్రాంతానికి వేటకువచ్చాడు.,మథ్యాహ్నమవడంతో ఒక చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు రాజు .
                        
                         
                                 
                                        ఆలయ విమాన దృశ్యం

                 ఇంతలో దగ్గరలోని పొద లో నుండి పులి గాండ్రింపు వినబడింది.వెంటనే రాజు ఆ దిక్కుగా బయలుదేరాడు. ఆ పులి గాండ్రింపు చాలాదూరం రాజును తీసుకెళ్లి, మాయమై పోయింది. అలసిపోయిన మహారాజు, ఇదేదో మాయ లాగుందని భావిస్తూ, ఒక చెట్టునీడలో కూర్చుండి పోయాడు. అంతలో సమీపంలోని పొదలో నుంచి శ్రీరామ్, శ్రీరామ్, శ్రీరామ్ అనే తారక మంత్రం మంద్రంగా  రాజుకి వినిపించసాగింది. ఆశ్చర్యపోయిన రాజు తటాలున లేచి, ఆ పొద చెంతకు వెళ్లి,  తీగలను, ఆకులను ,తొలగించి చూడగా, థ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుని విగ్రహం దృశ్యమానమైంది. దాన్ని చూచి, భక్తితో చేతులు జోడించి, ప్రణతులర్పించి, కోటకు చేరాడు మహారాజు.
                


             
                                           ఆలయప్రాగణం
                        
                ఆ రాత్రి  రాజుకు కలలో  ప్రత్యక్షమైన శ్రీ ఆంజనేయుడు తనను చూచిన చోటే తనకు ఆలయ నిర్మాణం చేయమని, అందువలన నీకు సకల శుభాలు కలుగుతాయని, సకలైశ్వర్యాలు సంభవిస్తాయని, రాజును ఆదేశించాడు. ఆ ఆజ్ఞను శిరసావహించి రెండవప్రతాపరుద్రుడు  ఆలయ నిర్మాణం  పూర్తి గావించి,  క్రీ.శ 1143 హనుమజ్జయంతి రోజున తనతండ్రియైన రెండవప్రోలరాజు తో కలసి, ఆలయం లో స్వామికి పూజలు  నిర్వహించి, అర్చకుల ను  నియమించి.  రాజథానికి వెళ్లిపోయాడు.. ఆయన అనంతరం వచ్చిన కాకతీయ రాజులు కూడ స్వామిని సేవిస్తూ, ఆలయప్రాంగణం లో తమ ఇష్టదైవాలను ప్రతిష్ఠిస్తూ, ఆలయాభివృద్ధికి, ఎంతగానో  సహకరిస్తూ వచ్చారు.
  
       స్వామి దర్శనం  (కరో –మన్ –ఘాట్)   ::.              అనంతర కాలం లో 400సంవత్సరాల తర్వాత 17వ శతాబ్దం లో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించుకొని దేశం లోని నలుమూలలలకు తన సైన్యాన్ని పంపి హిందువులను,హిందూదేవాలయాలను నాశనంచేయమని ఆజ్ఞాపించాడు. ఆ సమయం లో ఈ ఆలయం లోకి తురుష్కసైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి, ఆలయప్రాకారం వరకు కూడ రాలేకపోయిందట. ఆ విషయాన్ని సైనికాథికారి ఔరంగజేబు కు తెలియజేశాడు.
        
                   

          
                                          దూరంగా శ్రీ స్వామి వారి ఆలయ ముఖద్వారం
               
                       ఆ వృత్తాంతాన్ని విన్న ఔరంగజీబు క్రుద్దుడై,  ఆలయాన్ని నేలమట్టం చేయడానికి పెద్ద (crowbar) బండలను తొలగించే సాధనం తో ఆలయముఖద్వారం  వద్దకు చేరుకున్నాడట. అతడు ప్రధానద్వారం  యొక్క గుమ్మం దగ్గరకు రాగానే  ఒక్కసారిగా మిరుమిట్లుగొలిపే కాంతితో, పిడుగుపాటువంటి భయంకర మైన శబ్దం విన్పించిందట.వెంటనే. అతని చేతుల్లోని crowbar ఆయుధం జారిపోగా, ఔరంగజీబు భయంతో వణికిపోయాడు.ఇంతలో ఆకాశంనుండి. मंदिर तोडना है तो राजन, पहले तुम करो मन घाट  అనే మాటలు విన్పించాయట.  (.if you want to break down the temple o king, strengthen  your heart first” ) .  ఆ మాటలు విన్న ఔరంగజేబు ధైర్యాన్ని కూడదీసుకొని నీవు నిజమైతే నాకు కన్పించు అన్నాడట.మహమ్మదీయ చక్రవర్తి అదృష్టం పండింది.
                                  

   
                                     శ్రీ స్వామి   వారి దివ్యదర్శనం
                    
        అంతే ఒక్కసారి గా ఆ ప్రాంతమంతా కాంతి ప్రవాహం లో మునిగిపోగా, ఆ కాంతిలో నుండి ఆకాశాన్ని తాకుతున్న అద్భుతము,సుందరమునైన    ధ్యానాంజనేయుని దివ్యరూపం ఒక్కసారి గా ప్రత్యక్షమై,అదృశ్యమైంది. ఆ పరిస్థితులను ఆకళించుకోలేని ఔరంగజీబు తనను తాను సంబాళించుకొని ఆ ప్రాంతం నుంచి జారుకున్నాడు.. ఆనాటి నుంచి ఈ ప్రాంతానికి కర్ -మన్ –ఘాట్ అనే పేరు శాశ్వతమై పోయింది.

                
                              ఆలయ ప్రాకారం

                    ****** (ఆలయ పూర్తి దృశ్యాన్ని you tube లో   నాచే పొందుపరచబడిన " karrmanghat sri dhyananjaneya swamy temple,saroornagar (md) Hyd " ద్వారా చూడవచ్చు)

 ఆలయ ప్రత్యేకత .  ;;---  ఈ ఆలయంలో స్వామిని మండలం రోజులు  ప్రదక్షిణలతో సేవిస్తే నిస్సంతువులు బిడ్డతల్లులయిన ఉదంతాలు ఈ ఆలయ చరిత్రలో కోకొల్లలని భక్తులు  చెప్పుకుంటుంటారు. వైద్యశాస్తానికి  లొంగని అనేకవ్యాథులు ఈ స్వామి సన్నిథిలో మటుమాయమైన ఘటనలున్నాయట.  గాలి.థూలి లాంటివి  స్వామిని సేవిస్తే పలాయనం చిత్తగిస్తాయి. వాహనపూజలు ప్రతిరోజు సర్వసాథారణం.
                  
                               శ్రీ స్వామి వారి సుందర రూపం
                      
               ఉపాలయాలు   ::---------      ఆలయ ఆవరణ లో శ్రీ  కోదండ రామస్వామి,, శ్రీవిశ్వనాథ,  శ్రీనాగేశ్వర ,  శ్రీ గణపతి , శ్రీ సంతోషీమాత,  శ్రీ సరస్వతీదేవి, శ్రీ దుర్గాదేవి, శ్రీ వేణుగోపాలస్వామి,  శ్రీ జగన్నాథ స్వామి  వార్లకు వేరు వేరు ఉపాలయాలున్నాయి.

                                         ఉపాలయాలు
  
                 ప్రత్యేక ఉత్సవాలు ::--------.      ఈ ఆలయం లో ఉగాది. శ్రీరామనవమి, హనుమజ్జయంతి, వాల్మీకిజయంతి, నాగ పంచమి, శ్రీగణేశచతుర్థి, విజయదశమి, కార్తీకపూర్ణిమ, మహాశివరాత్రి, ప్రత్యేక ఉత్సవాలు. ముఖ్యంగా హనుమజ్జయంతి ఈ ఆలయం లో ప్రముఖఉత్సవంగా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవానికి జంటనగర వాసులే కాక చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడ వేల సంఖ్య లో హాజరవుతారు, నిత్యాన్నదానం నిరాటంకంగా కొనసాగుతోంది.  ఆలయం సువిశాలంగా ఉండటం వలన భక్తులకు వసతి సౌకర్యాలు సమకూరుతున్నాయి.

                               శ్రీ కోదండ రామ స్వామి దివ్య మూర్తులు
 ఆలయ సమయాలు :: -------              ప్రతిరోజు ఉ.6 గం. ల  నుండి మ. 12 గం.ల వరకు, సా. 4. గం.ల నుండి  8 గం. ల వరకు. అయితే మంగళవారం, శనివారాల్లో మాత్రం ఉ.5.30. లనుండి  1 గం .వరకు, సా 4 గం ల నుండి రా. 9.గం ల వరకు ఆలయము తెరచి ఉంచబడును.

                  
                                 ఆలయ రమణీయ దృశ్యం
  
 రవాణా సౌకర్యాలు. :: -------               రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లోని కర్మన్ఘాట్ ఆలయం నాంపల్లి రైల్వేస్టేషన్ కు 15 కి.మీ  దూరం లోను, ఇమ్లీబన్ బస్టేషన్ కు 12 కి.మీ. దూరం లోను  
నాగార్జునసాగర్ కు వెళ్ళే మార్గం లో ఉంది.



***************************************************************************************************************************************************************

No comments:

Post a Comment