Tuesday, 9 April 2013

పిల్లలమర్రి శ్రీ ఎరకేశ్వర,నామేశ్వరాలయాలు


           Pillalamarri   Sree  Erakeswara,Nameswaraalayalu
                 
                పిల్లలమర్రి    శ్రీ ఎరకేశ్వర, నామేశ్వరాలయాలు
                    
                                 पिल्ललमऱ्ऱि  श्री ऎरकेश्वर, नामेश्वरालयालु
                        

                                 నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం లోని పిల్లలమఱ్ఱి ఈనాడు ఒక చిన్న గ్రామం.  కాని 11 వ శతాబ్దము నుండి భారత దేశానికి స్వాతంత్ర్యము వచ్చే వరకు దేశ రాజకీయాల్లో ప్రతి పరిణామము యొక్క ఫలితాన్ని ప్రత్యక్షం గానో, పరోక్షంగానో అనుభవిస్తూ, దేశ స్వాతంత్య్ర సంపాదన, సంరక్షణ,  సాంస్కృతిక పునరుజ్జీవన  పోరాటాల్లో  తనకంటూ  కొన్ని చరిత్ర పుటలను పదిలపరచుకున్న విశిష్ఠ చరిత్ర ఈ గ్రామానిది. ఈ ఊరిలో అతి ప్రాచీనమైన శివాలయాలు రెండు ఉన్నాయి. ఒకటి ఎఱకేశ్వ రాలయము.రెండవది నామేశ్వరాలయము.
          

               
                        జాతీయ రహదారి ప్రక్కన కన్పించే పిల్లలమఱ్ఱి ఆలయ తోరణద్వారము
                   
                         చారిత్రక నేపథ్యం::----                కాకతీయుల చరిత్ర  కు మొగలాయి చరిత్ర తో ఎంత సంబంథ ముందో పిల్లలమఱ్ఱి చరిత్రకు కాకతీయుల చరిత్ర తో అంత అనుబంథముంది.  ఈ గ్రామం   కాకతి రుద్రదేవుని  సైన్యము లో దండనాయకునిగా పనిచేసి, ఎన్నో యుద్ధాల్లో రాజు విజయానికి కారకుడైన రేచెర్ల బేతిరెడ్డి చేత  క్రీ.శ 1170 ప్రాతం లో నిర్మించబడినట్లు  చెప్పబడుతోంది. వాడపల్లి మరియు పిల్లలమఱ్ఱి శాసనాల్లో ఇతన్ని’’ పిల్లలమఱ్ఱి బేతిరెడ్డి’’ అని ప్రశంసించడం జరిగింది. ఇతని భార్య ఎఱకసానమ్మ.  ఈమె  కాకతి రుద్రదేవుని  చేత నిర్జించబడిన  కందూరి ఉదయచోడుని  యొక్క దండనాయకులలో ఒకరైన కొమరె నాయకుని కుమార్తె.  ఈమె పిల్లలమఱ్ఱి గ్రామం లోని  ఎఱకేశ్వర ఆలయ నిర్మాత.  ఈ ఆలయం పాలంపేట రామప్ప దేవాలయానికి రూపకం గా చెప్పబడుతోంది. 


           శ్రీ ఎఱకేశ్వరాలయము.::------   కాకతి దండనాయకుల్లో ప్రముఖుడైన రేచర్ల బేతిరెడ్డి ఇల్లాలు ఎఱకసానమ్మ.  ఈమె చే  నిర్మింప జేయబడిన శివాలయం కాబట్టి ఈ ఆలయం లోని స్వామి  ఎఱకేశ్వరుడనే పేరున  ప్రతిష్ఠించబడినాడు. ఈ ఆలయం చాల ఎత్తుగా ఉంటుంది.  దీని గోపురం చాల దూరం కన్పిస్తుంది.   ఇంటిని చూసి, ఇల్లాలిని చూడమన్నట్లు ఈ ఆలయాల శిల్పకళ  చూస్తుంటే శ్రీ స్వామి దర్శనం కొంచెం ఆలస్యమౌతోందేమో ననిపిస్తుంది .ఈ గ్రామం లోని రెండవ ఆలయం నామేశ్వరాలయం లో అదే జరిగింది. మేము ఆశ్చర్యం తో ఆలయ శిల్పాన్ని  చూస్తుండగానే గర్భగుడి లో పూజారి గారు హారతి వెలిగించేసి గంట కొట్టడం ప్రారంభించారు.
   
      
               

                 శ్రీఎఱకేశ్వరాలయ దృశ్యం
         
           స్వామి దర్శనం ::-----              ఎఱకసానమ్మ ఈ ఆలయాన్ని నిర్మింప జేసి  శా.శ 1130 విభవ నామ సంవత్సరం  జ్యేష్ట శుద్ధ తదియ సోమవారం క్రీ.శ1230  న శ్రీ ఎఱకేశ్వర దేవరను ప్రతిష్ఠించినట్లు  శాసనం లో వ్రాయబడింది.   ఈ ఆలయ  ద్వారబంధాలు, రంగమండపము, స్థంభాలు, అంత్రాలయ ద్వారబంధము.  గర్భాలయ ద్వారశిల్పము , ఒకటేమిటి అడుగడుగునా ఈ ఆలయ శిల్ప సంపద యాత్రీక భక్తుల్ని  సమ్మోహితుల్ని చేస్తుంది. ఆలయ ద్వారబంధాలన్నీ  శిలానిర్మితాలే. గుమ్మం దాటాలంటే సామాన్యుల అంగ చాలదు. మూడు అడుగుల వెడల్పు,  రెండడుగుల ఎత్తు మండిగాలే ఉన్నాయంటే ఇక ఆలయ నిర్మాణం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. . ఇక్కడి ఆలయాల్లో ఎక్కడ చూచినా కాకతీయ శిల్పకళే దృశ్యమానమౌతోంది.
                     


                                             ఆలయ రంగమండపం
             
               ఆలయం భిన్నం  కాక ముందు ఇంకాఎంత సుందరం గా ఉండేదో  అనేది ఊహకందనిదై పోతోంది. తూర్పు, ఉత్తర ,దక్షిణ ద్వారాలకు ఎత్తైన మెట్లు , బాహ్యమండపాలు ఉండాలి. అవి పతనమై పోయి, వచ్చిన ప్రేక్షకుల్ని తెల్లబోయి చూస్తున్నట్టుంటాయి.  ఈ ఆలయానికి శిఖరం  లేదు.

              

                     

                                  ఆలయస్థంభాలపై నాట్యగత్తె  విన్యాసం

                                      గర్భగుడి లో శ్రీ ఎఱకేశ్వరుడు  పానుమట్టం తో సహా ఎడమ వైపు నేలలోకి ఒరిగి పోయుంటాడు. భూకంపము వచ్చినప్పుడు అలా ఒరిగి పోయాడని పూజారి గారు చెప్పారు.  మూడున్నర నాలుగడుగుల కైవారం కల్గిన  సుమారు రెండడుగుల ఎత్తు గల  నల్లని సాలగ్రామ శిలలో  కాంతులీనుతుంటాడు శ్రీ ఎఱకేశ్వర స్వామి. చక్కనమ్మ చిక్కినా అందమే నన్నట్లు ఈ దశ లో ఉన్నా  స్వామి వారు  భక్తుల చేత ఇప్పటికీ  ఆరాథనీయుడు గానే పూజ లందు కుంటున్నాడు .  
                      

                                                                                                                                   

                               
                   
                       శ్రీ ఎఱకేశ్వరస్వామి దివ్యమంగళ విగ్రహం

              ఆలయప్రాగణంలోని ఈశాన్యం  లో వందల సంవత్సరాలనాటిది గా చెప్పబడే  బావి ఒకటి కన్పిస్తుంది. ఆలయ ఆగ్నేయం లో ఒక తిన్నెమీద  శాసన స్థంభాన్నిప్రతిష్ఠించారు. ఆలయ ప్రాకారానికి వెలుపల కళ్యాణ మండపం  ఉంది.
     

            
                               ఆంత్రాలయ ద్వారబంథం మీద శిల్పం

         ఈ ఆలయాల్లో ఎక్కడా అమ్మవారి ఉపాలయాలు లేవు. శ్రీ ఎఱకేశ్వరాలయ అంత్రాలయం మాత్రం  పసుపుతో అలంకరించబడిన ఒక  చిత్రఫలకం ఉంది.



                    ఆవిడ అమ్మవారని, ఆమె కే నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని  పూజారి చెప్పారు. ఈ ఆలయం లో  నందీశ్వరుడు లేడు.  ఒక బుల్లి నంది అంత్రాలయం లో  స్వామికి కుడివైపుగా ఒక శివలింగానికి ఎదురుగా ఉంచబడి, కన్పిస్తుంది.
                


                          ఈ ఆలయం  ఒక పర్యాయం  ముష్కరుల  దాడిలో భిన్నమై పోతే కాపయనాయకుని ఇష్టభృత్యుడైన  ఎఱపోతులెంక క్రీ.శ 1357 లో శ్రీ ఎఱకేశ్వర దేవర ను  పున: ప్రతిష్ఠించినట్లు పిల్లలమఱ్ఱి శాసనం  లో వ్రాయబడింది.
  

                    
                    ఒక అపురూప కుడ్యశిల్ఫం      
               
               శ్రీ నామేశ్వరాలయం.::-----          పిల్లలమఱ్ఱి ఊళ్ళోకి ప్రవేశిస్తుండగా కన్పించే మొదటి ఆలయం ఎఱకేశ్వరాలయం అయినా మొదటి ప్రతిష్ఠ జరిగిన ఆలయం మాత్రం నామేశ్వరాలయం.  ఈ ఆలయం బేతిరెడ్డి సోదరుడు నామిరెడ్డి చేత నిర్మింపచేయబడినది.
      
   


                                      అందువలన ఈ స్వామి నామేశ్వరు డయ్యాడు. క్రీ.శ 1110- 1158 వరకు కాకతీయ రాజ్యాన్ని  పాలించిన రెండవ ప్రోలరాజు  వద్ద కామిరెడ్డి సైన్యాథిపతి గా పనిచేశాడు. అతనికి ముగ్గురు కొడుకులు.   పెద్దవాడు కాట్రెడ్డి. రెండవ వాడు బేతిరెడ్డి. మూడవవాడు నామిరెడ్డి.  వీరు కూడ తండ్రి లాగానే కాకతీయ సైన్యం లో దండనాయకులు గా  పని చేశారు.
                 
                    

                              
                                             నామేశ్వరాలయ ముఖ ద్వారం
             
                           నామిరెడ్డి ఈ ఆలయము లో శా.శ 1124 లకు సరియైన దుందుభి  నామ సం.ర చైత్ర శుక్ల చతుర్ధశి ( శనివారం. క్రీ,శ 1208 )  నాడు నామేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం లో చెక్కబడిన ప్రతి శిల్పము అత్యద్భుతమే.
                

                                   
                                      ముఖమండప స్థంభాలపై అల్లుకున్నశిల్పకళ
                          
                        ద్వారబంధాలు,ముఖమండప స్థంభాలు, ప్రవేశ ద్వారాలు,  పైకప్పు ఒకటేమిటి అన్నిచోట్ల  లతలు,పుష్పాలు,  వివిధభంగిమలలో నాట్య గత్తెల రూపాలు, వాద్యకారులు, దేవతాముర్తులు, సూక్ష్మాతి సూక్ష్మ  విన్యాసం తో  శిల్పుల చేతుల్లో మైనపు ముద్దల వలె  ఒదిగిపోయి  రమణీయ శిల్పాలై రమ్యం గా కొలువు తీరి కన్పిస్తాయి.
                  
                   
                 
                            శివపార్వతుల పరిణయఘట్టాలు, పేరిణి తాండవ భంగిమలు  వంటి వివిధ శిల్పాలు మనకు  ఇక్కడ కన్పించడానికి ప్రయత్నిస్తాయి.కాని  పూర్తిగా కన్పించవు. కారణం ముష్కరుల ఇనుప గుదియల, సమ్మెటల దెబ్బలకు  ఛిన్నాభిన్నమై  కళాకాంతులను కోల్పోయి, మొహాలను చాటు చేస్తున్నాయి .  ముఖ్యంగా ముఖమండప స్థంభాలపై   వివిధ నాట్యభంగిమలలో హొయలొలికించే  మూరెడు ఎత్తున్నముఫై రెండు అందమైన శిల్పాలు కాళ్ళు చేతులు విరిగి, ముఖము, వక్షస్థలము, నడుము పగుల కొట్టబడి, ఆనాటి ముష్కరుల దౌష్ట్యానికి  సాక్ష్యాలుగా చరిత్ర లో మిగిలిపోయాయి.
       
                 

                      శ్రీ  నామేశ్వరుని దివ్యరూపం, ఉత్సవ విగ్రహాలను కూడ చూడవచ్చు

                   గర్భగుడి లో  శ్రీ నామేశ్వరస్వామి కొలువుతీరున్నాడు, పానమట్టం మీద రెండడుగుల ఎత్తు, సుమారు మూడడుగుల కైవారం తో  లింగరూపుడై భక్తులకు దర్శనమిస్తున్నాడు. అంత్రాలయ , గర్భాలయ. ద్వారబంధాలు, పైకప్పుకూడ శిల్పసంపద తో నిండిపోయినా అవన్నీ కూడ పగలగొట్టబడ్డాయి.
                          
                 
                               
                                                శిఖరంపైన నందిని చూడవచ్చు

                      ఈ ఆలయానికి కూడ శిఖరం లేదు గాని శిఖరం మీద ఒక నంది  మాత్రం ఉంది.   ఇది ప్రధానద్వారం వైపు చూస్తున్నట్లు ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయం లో కూడ లోపల నందీశ్వరుడు లేడు. ధ్వజస్థంభము ఉంది. నామేశ్వర, పార్వతీ దేవుల ఉత్సవ మూర్తులు అంత్రాలయం లో కన్పిస్తాయి. 
           
              

                            
                                    నామేశ్వరాలయ దృశ్యం

                   త్రికూటాలయం.::------         శ్రీ నామేశ్వర  ఆలయ ఆవరణ లోనే నామేశ్వరాలయానికి  ఎడమవైపు త్రికూటేశ్వరాలయం ఉంది . ఇచ్చట మూడు ఆలయాలలో  మూడు శివలింగాలు ప్రతిష్ఠించబడి  ఉన్నాయి. మూడు ఆలయాలకు మథ్యనున్న ముఖమండపం లో  త్రిలింగాలను చూస్తున్నట్లు గా నందీశ్వరుడు ప్రతిష్ఠించబడ్డాడు. ఈ విగ్రహం చాల అందంగా ఉంటుంది.
                      

                        

                                      త్రికూటాలయం ముఖమండపం లోని నందీశ్వరుడు






                                                                   తూర్పు ముఖం


      
     


                                                                   మూడు లింగాలు




ఉత్తర   ముఖం                                                                     దక్షిణముఖం                                                                                                                   

          ఈ త్రికూటాలయాన్ని  నామేశ్వరాలయాని కంటే ముందే నామిరెడ్డి నిర్మింపజేసినట్లు శాసనాధారాలు లభిస్తున్నాయి. శా.శ  1117 సరియగు రాక్షస నామ సం.ర వైశాఖ శుక్ల త్రయోదశి ఆదివారం ( క్రీ.శ 1195) నాడు నామిరెడ్డి  ఈ త్రికూటాలయ ప్రతిష్ఠ చేశాడు. ఈ ఆలయం కూడ నల్లరాతి  నిర్మాణ మే కాని ఆ రెండు ఆలయాలతో పోలిస్తే  శిల్పం కొంచెం తక్కువ అనిపిస్తుంది.  ఈ ఆలయాలు మందిరాలుగా  నిర్మించబడ్డాయి.  కాని  విమాన, శిఖర నిర్మాణాల వంటివి లేవు.  శివలింగాలు మాత్రం  ధవళ వర్ణం  తో ప్రకాశిస్తున్నాయి.
               ఈ రెండు ఆలయాలకు మథ్యలో లోపలికి  పడమర గా బండలతో కప్పిన ఒక చిన్నమందిరం కన్పిస్తుంది.  దీనిలో  బ్రహ్మ సరస్వతులు  హంస వాహనారూఢులై  యున్న ఒక రాతి ఫలకం ఉంది. దీన్ని బ్రహ్మాలయం గా  స్థానికులు చెపుతారు. 
              

                                                శ్రీ  బ్రహ్మ ఆలయం

                     ఈ నామేశ్వరాలయం  చుట్టూ ఎత్తైన  ఱాతి ప్రాకారాలు, దక్షిణ ద్వారం పై  శిథిలమైన బురుజు,  గడిచిన  పోరాట కాలానికి  చెరగని చిహ్నాలు గా మిగిలి పోయాయి.
        

           
                               శ్రీ    త్రికూటాలయ దృశ్యం, చెంతనే ముందుకు ఒరిగిన శాసనం ఉన్న తిన్నె

                         ఈ  గ్రామం  లోని శివాలయాలు   రెండింటికి  ఆలయ శిఖరాలు లేకపోవడానికి కారణం  పిడుగు పాటుకు ఆలయ శిఖరాలు ఒరిగి పోయాయని జనం చెప్పకుంటుంటారు. పిల్లలమఱ్ఱి గ్రామ సమీపం నుండి దండుబాట వెడుతూ ఉండటంతో ఏ సైన్యం అటుగా వెళ్ళినా, ఆ ప్రభావం గ్రామం మీద,ప్రజల మీద ఉండేది. పంటపొలాలు ఆశ్విక దళాలకు  ఆహారమై పోయేవి. మూలిగే నక్క మాద తాటికాయ పడ్డట్టు,  భూకంపానికేమో శ్రీ ఎఱకేశ్వరస్వామి ఎడమవైపు నేలలోకి క్రుంగి పోతే, శ్రీ నామేశ్వరస్వామి ఆలయం లోని శాసన స్థంభం తూర్పు వైపుకు వాలి నిలబడింది.  పిడుగపడి శిఖరాలు ఒరిగి పోయాయి .రాజకీయ ప్రకంపనాలే కాక ప్రకృతి ప్రకంపనాలు కూడ  ఈ గ్రామాన్ని వదిలి పెట్టలేదు. ఉరిమురిమి మంగలం మీదపడ్డట్టు అంటే ఇదేనేమో!
        
                   


                           శ్రీ నామేశ్వరుని సుందరరూపం

                    ప్రముఖకవి పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు ఈ ప్రాంతం వాడు గానే చెప్పబడుతున్నారు . ఇంకా ఎందరో కవిపండితులకు  ఇది ఆవాస క్షేత్రం గా   ఉండి ఉండవచ్చు.

           ఈ  ఆలయ సంపూర్ణ దృశ్యాలను  you tube   లో  సందర్శించవచ్చు.
          

  శ్రీ చెన్నకేశవాలయం.::--------- ఈ గ్రామం లో ప్రాచీన కాలంలోనే  చెన్నకేశవాలయం ఉన్నట్లు ప్రసిద్ధి.  ఇది శివకేశవాభేదానికి ప్రతీకగా గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. ఆంధ్రదేశంలో  కాకతీయుల కాలం లోనే ఎక్కువగా శివాలయాల తో పాటు చెన్నకేశవాలయాలు కూడ వెలిశాయి. చెన్నబసవుడు, చెన్నమల్లేశుడు   వంటి పదాల ప్రేరణే చెన్నకేశవ  ప్రాదుర్భావం. (చూ.  చెన్నకేశవుడంటే .... Mutteviraviprasad.blogspot.com). అటువంటి ఈ చెన్నకేశవుడికి  ముష్కరుల తాకిడి అధికమై, ఆలయాన్ని థ్వంసం చేయడమే కాక ఆయన్నితీసుకెళ్లి ఊరిబయట బసవదరి అనే దిగుడు బావి లో పడేశారు.
               

                      
                                                         శ్రీ చెన్నకేశవాలయం

              క్రీ.శ 1899 లో దిగుడు బావి పూడిక తీస్తుంటే  ఈ చెన్నకేశవుని  విగ్రహం బయటపడింది. శ్రీ ఉమ్మెత్తల చక్రయ్య అనే హరిభక్తుడు  ఆ విగ్రహాన్ని,మేళతాళాలతో తీసుకొచ్చి  హనుమదాలయం లో భద్రపరిచాడు. కాని  ఆ స్వామికి ఆలయ నిర్మాణం చేయాలనే దృఢ సంకల్పం తో,  శ్రీ చక్రయ్య గారు కాలినడకన దేశసంచారం చేసి,జమీందారుల నుండి చిన్నరైతు వరకు అందరి సహాయ సహకారాలను తీసుకొని,ఆలయ ప్రాకారాదుల నిర్మించి శా.శ  1826 సరియైన క్రోథి నామ సం.ర వైశాఖ బహుళ తదియ ఇందువాసరం నాడు( క్రీ.శ1504 )   శ్రీ చెన్నకేశవుని పున: ప్రతిష్ఠించారు.  ఆనాటి నుండి నిర్విఘ్నంగా శ్రీ  చెన్నకేశవునకు నిత్యపూజా కైంకర్యాలు జరుగుతున్నాయి . శ్రీ స్వామి వారి కి కొంత భూమిని కూడ వీరు సమకూర్చి పెట్టారట. 
                 

               
                        శ్రీ చెన్నకేశవాలయం లో థ్వజస్థంభం చెంతనున్న శ్రీ ఆంజనేయుడు

                      ఈ వృత్తాంతమంతా  శ్రీ చక్రయ్య గారి నాల్గవ కుమారుడయిన శ్రీ వేదాంతరావు వ్రాసిన  పిల్లలమఱ్ఱి గ్రామ చరిత్ర లో విస్తారం గా ప్రస్తావించబడింది.   ఆనాటి సాంఘీక, రాజకీయ పరిస్థితుల అవగాహనకు ఈ గ్రంథం  చక్కగా ఉపయోగపడుతుంది.
 ప్రత్యేక ఉత్సవాలు. ::------           ప్రతి సంవత్సరము ఫాల్గుణ మాసం లో  శ్రీ ఎఱకేశ్వర, శ్రీ నామేశ్వర స్వామి వార్లకు కళ్యాణోత్సవాలు వైభవం గా జరుగుతాయి. శ్రీ స్వామి వార్ల సేవముందు వీరంగాలు వేయడం,  అగ్నిగుండాలు దూకడం మొదలైన వేడుకలు యథావిథిగా వీరముష్టివాళ్ల చే ఇప్పటికీ నిర్వహించబడుతున్నాయి.
                
                
                 
         
                                     శ్రీ నామేశ్వరుని  రథము

                 శ్రీ చెన్నకేశవస్వామి కి  ప్రతి సంవత్సరము కాముని పున్నమి రోజున రథోత్సవం గొప్పగా జరుగుతుంది. చుట్టు ప్రక్కల గ్రామాల  నుండి కూడ వేల సంఖ్య లోవచ్చి ప్రజలు  ఈ ఉత్సవం లో పాల్గొంటారు.

                                            ఒక శిథిల శిల్పము
                రవాణాసౌకర్యాలు.::-----  సూర్యాపేట నుండి 5 కి.మీ దూరం లో ఈ గ్రామం ఉంది.   హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నుండి 2.5 కి.మీ లోపలికి వెళ్ళాలి. ఆటో సౌకర్యం ఉంటుంది.



 ************************************************************************** **************************************************************** **********************            

  

No comments:

Post a Comment