Yadagirigutta Sree Lakhminarasimha Swamy
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి
यादगिरिगुट्ट
श्रीलक्ष्मीनरसिंहस्वामि
నల్గొండజిల్లా లోని యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహుని
దివ్యధామం. ఇది హైద్రాబాద్ నగరానికి 60
కి.మీ దూరం లో ఉంది. ఇచ్చట యోగానంద, జ్వాల ,లక్ష్మీనరసింహ
మూర్తులతో స్వామి స్వయంభువు గా దర్శనమిస్తున్నారు. శ్రీ స్వామి అనుగ్రహం ఉంటే
సమస్త గ్రహ బాథలు తొలగిపోతాయని, అనారోగ్య సమస్యలు
మటుమాయమౌతాయని, శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.యాదమహర్షి శ్రీ స్వామినిగూర్చి తపస్సు చేసి,
సాక్షాత్కరింప చేసుకున్న ప్రదేశం కాబట్టి
దీనిని యాద గిరి గుట్ట అని పిలుస్తున్నారు.
ఆలయ రాజ గోపురం
స్థలపురాణం:;--
స్కాంద,బ్రహ్మాండ పురాణాలలో శ్రీ యాదగిరి క్షేత్ర మహాత్మ్యం వర్ణించ బడినట్లు స్థల పురాణం చెపుతోంది. విభాండకుని కుమారుడు
ఋష్యశృంగుడు. ఋష్యశృంగుని కుమారుడు యాద ఋషి. ఈమహర్షి నరసింహోపాసకుడు. శ్రీలక్ష్మీ
నరసింహస్వామిని ప్రత్యక్షంగా దర్శించాలని ఈ మహర్షి కోరిక. అందుకొరకు ముందుగా భక్త
పరాథీనుడైన శ్రీ ఆంజనేయుని ప్రార్థించాడు. ఆంజనేయుడు యాద ఋషి కి కలలో కన్పించి, సమీపం లోని కొండగుహ
లో స్వామిని గూర్చి తపస్సుచేయమని,శ్రీ
స్వామి సాక్షాత్కారం లభించగలదని చెప్పాడు.
అదిగో..అల్లదిగో యాదగిరి
శ్రీలక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనాభిలాషగల మహర్షి ఘోరతపస్సు తో శ్రీస్వామి
వారిని ప్రసన్నుని చేసుకున్నాడు. యాద ఋషి కోరిక మేరకు శ్రీ స్వామి యోగానంద, జ్వాల,
లక్ష్మీనరసింహ రూపాలతో గుహలో కొలువుతీరాడు. ఆమహర్షి పేరుతో ఆ పర్వతము యాదగిరి గా ప్రసిద్ధమైంది. మూడువందల
అడుగుల ఎత్తు మాత్రమే గల కొండ
కాబట్టి ప్రజల వాడుకలో గుట్ట గా పిలవబడుతూ,యాదగిరిగుట్ట గా ప్రసిద్ధి పొందింది.
మెట్లమార్గం ప్రవేశద్వారం
ఆంజనేయుని అనుగ్రహం వల్లనే యాదమహర్షి కి
శ్రీ స్వామి దర్శనం లభించింది
కాబట్టి మహర్షి కోరిక మేరకు శ్రీ ఆంజనేయుడే ఇచ్చట క్షేత్రపాలకుడు గా నిలిచి పూజలందుకుంటున్నాడు శ్రీస్వామి వారి గుహాలయానికి వెలుపలనున్న
ముఖమండపం లో ఆండాళమ్మ సన్నిథికి ఎడమవైపు అంజనీపుత్రుడు వేంచేసియున్నాడు.
పుష్కరిణి
పుష్కరిణి ::-- పుష్కరిణి చెంత శ్రీఆంజనేయునకు ప్రత్యేకం గా ఆలయం నిర్మించ బడింది. పుష్కరిణి లో పవిత్రస్నానం
చేసిన భక్తులు ముందుగా ఈ క్షేత్రపాలకుని దర్శించుకొని, ఆయన అనుమతి తోనే
శ్రీలక్ష్మీనరసింహుని దర్శనానికి బయలుదేరుతారు.
పుష్కరిణి సమీపమందలి శ్రీ ఆంజనేయ ఆలయం
శ్రీస్వామి దర్శనం.:-- ఇచ్చట శ్రీ స్వామివారు గుహలో ఒక వేదికపై కొలువు తీరి ఉంటారు. గర్భాలయం,
అంత్రాలయం అనేవి వేరుగా లేవు. భక్తులు నేరుగా ముఖమండపం నుండి స్వామి సన్నిథికి
నడిపించబడతారు. లోపలికి ప్రవేశించగానే
ఎదురుగా ఉన్న శిలకు యోగపట్టసమాసీనుడైన
యోగనరసింహుని స్వయంభువు రూపం మనకు
దర్శనమిస్తుంది.
యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య మంగళ రూపం
ఆయనకు కొంచెం ఎడమవైపున
జ్వాలా నరసింహుని స్వయంభువ రూపం దక్షిణవైపు శిలకు స్పష్టాస్పష్టంగా కన్పిస్తుంది.
ఇది గుహ లోపలికి ఉండటం వలన సామాన్య భక్తులు దర్శించుకొనే అవకాశం తక్కువ. మనకు దర్శనమిచ్చే
రూపం శ్రీలక్ష్మీ నరసింహస్వామి. ఆనాడు
యాదమహర్షి కి ప్రత్యక్షమైన రీతిలోనే శ్రీస్వామి శ్రీలక్ష్మీ అమ్మవారితో కలసి, నిలిచి, భక్తులను
అనుగ్రహిస్తున్న అర్చామూర్తిగానే మనకు దర్శనమిస్తారు.
ఆలయ విమాన దృశ్యం
చారిత్రకత.::--
భువనగిరి లోని ఏకశిలాపర్వతము పై
కోటను నిర్మించిన త్రిభువన మల్లుడు (క్రీ.శ. 1148) యాదగిరి శ్రీలక్ష్మీనరసింహుని సేవించినట్లు
కొలనుపాక వీర నారాయణస్వామి ఆలయమందలి శాసనము వలన తెలియుచున్నది.
భువనగిరి కోట నిర్మించబడిన ఏకశిలా పర్వతము
ఆలయప్రత్యేకత ::-- శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ని నమ్మి సేవిస్తే ఎటువంటి శారీరక రుగ్మతలైనా తొలగిపోతాయనే విశ్వాసం భక్తుల్లో అపారం గా ఉంది. అందుకనే ఈయననువైద్య
నారసింహుడని భక్తులు భక్తి తో పిలుచుకుంటారు.
ఒక మండలంరోజులు స్వామి చెంతనే ఉండి,
పుష్కరిణి లో స్నానం చేసి, ప్రదక్షిణాలు చేస్తూ సేవించుకుంటే సమస్త బాధలు
నశిస్తాయని విశ్వాసం. కొన్ని నివారణ లేని
వ్యాథులను సైతం శ్రీ స్వామి రాత్రివేళ
కలలోకి వైద్యుని రూపం లో వచ్చి ఆపరేషన్
చేసి నయం చేశాడని, ఆ అనుభూతి పొందిన
భక్తులు చెపుతుంటారు. ఇది ఈ స్వామి
ప్రత్యేకత గా ప్రచారం పొందింది. నమ్మకాన్ని మించిన మందులేదు కదా ! గ్రహబాథలను పారద్రోలుతాడని నరసింహుని యెడల భక్తులకు అపార విశ్వాసం.
జాతీయ రహదారి ప్రక్కన కన్పించే తోరణ ద్వారము
శ్రీ స్వామి వారి సన్నిథి
లో సత్యనారాయణవ్రతం చేసుకోవడం శుభమని భక్తులు భావిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా
వ్రతమండపం కూడ నిర్మించబడింది.
శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం
గోశాల, తులసి వనం
,నిత్యాన్నదానపథకం, ఉచిత ప్రసాద వినియోగం
,మొదలైన పథకాలను ఆలయ యాజమాన్య ఆధ్వర్యం లో సమర్థవంతం గా నిర్వహిస్తున్నారు. ఒక సంస్కృత విద్యాపీఠాన్ని, ఒక అల్లోపతి, ఒక ఆయుర్వేద వైద్యశాలల్ని కూడ ఆలయ ఆధ్వర్యం లో నిర్వహించడం మిక్కిలి ప్రశంసించ దగ్గ విషయం .
ప్రత్యేక ఉత్సవాలు :;--- ప్రతి సంవత్సరము ఫాల్గుణ శుద్ధ విదియ నుండి
ద్వాదశి వరకు వార్షిక బ్రహ్మోత్స వాలు,
శ్రావణ శుద్ధ దశమి నుండి ఏకాదశి వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయి. నరసింహ జయంతి,
ఆండాళ్ తిరునక్షత్రం, రామానుజ తిరునక్షత్రం,ముక్కోటి ఏకాదశి ,ధనుర్మాసం,
శ్రీరామనవమి నవరాత్రులు, శ్రీకృష్ణాష్టమి, మొదలైనవి ప్రత్యేక ఉత్సవాలు .
కళ్యాణ నరసింహుని దివ్య దర్శనం
చైత్రశుద్ధ పౌర్ణమి రోజున తెప్పోత్సవము
,వైశాఖబహుళ దశమి హనుమజ్జయంతిని, నిర్వహిస్తారు .ప్రతి నెలలోను శ్రీస్వామి వారి
జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శతఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు.
తెప్పోత్సవ దృశ్యం
ఆలయ సమయాలు:::-- ఉ.4 .గం.లకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు
తెరుచుకుంటాయి. రాత్రి 9.గం లవరకు వివిథ
దర్శనాలు సమయానుగుణంగా అందుబాటులో ఉంటాయి.
ఘాట్రోడ్డు పై కన్పించే తోరణ ద్వారం
రవాణా
వసతి సౌకర్యాలు :---- హైద్రాబాదు
వివిథ ఆర్టీసీ డిపోలనుండి అథిక సంఖ్య లో సర్వీసులు నడుప బడుతున్నాయి. కొండ
పైకి చేరడానికి మెట్ల మార్గము, ఘాటు రోడ్డు సౌకర్యము రెండు కలవు. ఘాటురోడ్డులో ఆటోల సౌకర్యం ఉంది. కొండపైన ,
క్రింద కూడ దేవస్థానం వారి అద్దె గదుల( ఏ.సి /నాన్ ఏ .సి )
సౌకర్యం ఉంది. భోజనం, కాఫీ,టిఫిన్లు, అందుబాటులో ఉంటాయి..
*********************************************************************************
Thank you
ReplyDeleteThank you
ReplyDelete