Mangalagiri Sree Panakala
Lakhminarasiamha Swamy
మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి
मंगळगिरि श्री पानकाल लक्ष्मीनरसिंहस्वामि
విజయవాడ- గుంటూరు రహదారి
లో విజయవాడ కు 15 కి.మీ దూరం లో గుంటూరు జిల్లా మంగళగిరిలోని మంగళాద్రి పై
“శ్రీ పానకాల నరసింహస్వామి” కొలువు తీరి ఉన్నాడు,. కొండ దిగువున “శ్రీ లక్ష్మీనరసింహస్వామి “గా భక్తులను ఏలుకుంటున్నాడు. కొండ ఎగువన శ్రీ “గండాలయ్య” గా శ్రీ స్వామి
భక్తుల గండాలను కాచి ఆదుకుంటున్నాడు.
మంగళగిరి రాజగోపురం
ఆలయ ప్రాగణం నుండి రాజగోపురం
ఈ
మంగళగిరి నే మంగళాద్రి అని,తోతాద్రి అని, దివ్యాద్రి అని , ముక్త్యాద్రి లేక ముక్తి పర్వతము అని ,
స్తోతాద్రి అని వివిథ నామాలతో యుగయుగాలుగా
భక్తులు సేవించుకుంటున్నారు. శ్రీ మహాలక్ష్మిదేవి ఉగ్ర నరసింహుని శాంతింప జేయడానికి
ఈ కొండపై తపస్సు చేసింది. ఉగ్రమూర్తిని శాంతస్వరూపునిగా మార్చి సరసన కొలువుదీరింది.
శ్రీ నరసింహ స్వామిని శ్రీ లక్ష్మీనరసింహుని చేసి, భక్తులను కాపాడుతున్న కలుముల జవరాలి
చల్లని చూపుల వలన ఈ కొండకు మంగళాద్రి అని
(శుభములను కల్గించే కొండ) పేరు వచ్చింది.
స్థలపురాణం ;------ ఈ మంగళాద్రి
స్థలపురాణం బ్రహ్మవైవర్తపురాణం లో భవానీశంకర
గీతారూపం గా వర్ణించబడింది. ఈ మంగళ గిరి
ని ఎటు వైపు నుండి చూచినా ఏనుగు ఆకారం లో కన్పిస్తుంది. సమీపం నుండి చూస్తే
ముడుచుకొని పడుకున్న మదపుటేనుగువలె కనువిందు చేస్తుంది.ఇలా ఉండటానికి కారణం గా ఒక
ఐతిహ్యం ప్రచారం లో ఉంది.
ఏనుగు ఆకారం లో మంగళాద్రి
పారియాత్రుడు,
సుశీల అనే రాజ దంపతులకు హ్రస్వశృంగి అను
పేరు గల అంగవైకల్యుడైన కుమారుడుండేవాడు.
అతను సామాన్య రూపాన్ని పొందడానికి పుణ్య
తీర్థాల్లో గ్రుంకు లిడుతూ,పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ,మంగళాద్రి చేరుకున్నాడు. ఈ
దివ్యప్రదేశం లో శ్రీమహా విష్ణువుని గూర్చి తపస్సు చేస్తున్న హ్రస్వశృంగికి దేవతలు
ప్రత్యక్షమై కార్యసిద్ధికై మంగళాద్రి పై నే తపస్సు కొనసాగించమని సలహా
ఇచ్చారు. ఇదే సమయం లో కుమారుని
తీసుకెళ్లడానికి పారియాత్రుడు మంగళాద్రి
కి చేరుకున్నాడు. కాని ఈ ప్రదేశం వదిలి వెళ్ళడం ఇష్టం లేని హ్రస్వశృంగి తండ్రి రాకను గమనించి, శ్రీమహావిష్ణువుని
ప్రార్థించి ,పర్వత రూపాన్ని పొంది, శ్రీస్వామిని తనపై కొలువుండమని ప్రార్థించాడు.
ఎగువ సన్నిథి నుండి దిగువ సన్నిథి దృశ్యం
ఇదే సమయంలో “నముచి ‘అనే రాక్షసుడు బ్రహ్మ దేవుని చే వరాన్ని పొంది,
వరగర్వంతో లోకాలను పీడించసాగాడు.
శ్రీమహావిష్ణువు ఆశీస్సులతో నముచి
పై యుద్ధాన్ని ప్రకటించాడు దేవేంద్రుడు. నముచి ప్రాణభయం తో పారిపోయి, సూక్ష్మరూపం
తో మంగళాద్రి గుహలో దూరి దాక్కున్నాడు.
కిం కర్తవ్యతాశూన్యుడైన దేవేంద్రుడు
శ్రీ హరిని శరణుజొచ్చాడు. దనుజవైరి యైన
శ్రీ మన్నారాయణుడు కోపోద్రిక్తుడై సుదర్శనాన్ని ప్రయోగించి, సుదర్శన మధ్యస్థితుడై,
కోపాగ్నిజ్వాలలను వెదజల్లుతూ, మంగళాద్రి గుహలో దాగున్న నముచి ప్రాణవాయువుని హరించి ప్రళయకాలానల
భీకరోగ్రజ్వాలానలుడై ప్రజ్వలించసాగాడు.
సుదర్శన మధ్యస్థితుడై ప్రచండ తేజస్సు తో
ప్రజ్వరిల్లుతున్నఆ ఉగ్ర నరసింహుని దివ్యరూపాన్ని చూడలేక దేవతలు కూడ
గడగడలాడిపోయారు. ఆ సమయం లో దేవతలు అమృత భాండాలను సమర్పించి స్వామిని శాంతపరిచారు. ఆ అమృతాన్ని
సగం స్వీకరించిన స్వామి, మిగిలిన సగం ప్రసాదం గా అమరుల కందించాడు. అది కృతయుగము.
అనంతరం త్రేతాయుగం లో ఆవునెయ్యి ని, ద్వాపర యుగం లో ఆవుపాలను, నేటి కలియుగం
లో పానకాన్ని స్వీకరిస్తూ స్వామి భక్తులను కాపాడుతున్నాడు.
శ్రీ పానకాలస్వామి వారి ఆలయశిఖరం
త్రేతాయుగం లో పుణ్య కార్యాలుచేసి, స్వర్గలోక ప్రాప్తిని పొందిన అనేకులు
మరల భూలోకానికి వెళ్లడానికి అయిష్టత కన్పరచడంతో, ఇది చూసిన ఇంద్రుడు కొంతకాలం
భూమండలం లో స్వర్గతుల్యమైన మంగళాద్రి పై
ఉండి, మరల స్వర్గానికి రావలసింది గా సలహా ఇచ్చాడట. కృతయుగం లో కూడ పాపులు తక్కువగా
ఉండటం వలన వారిని భూలోకానికి వెళ్లి, మంగళాద్రి పై పాపాలను కడుక్కోవలసిందిగా
యమధర్మరాజు పంపించేవాడట.కృతయుగం లో అంజనాద్రి
అని, త్రేతాయుగం లో తోతాద్రి అని, ద్వాపరయుగం లో మంగళాద్రి లేక
ముక్త్యాద్రి అని పిలిచేవారట. కలియుగం లో దీనినే మనం మంగళగిరి అని పిలుస్తున్నాము.
అమ్మవారి ఆలయం ప్రక్కనే కొలువు తీరిన ఆంజనేయుడు
శ్రీ రామచంద్రమూర్తి తన అవతార పరిసమాప్తి చేసుకొని వైకుంఠానికి
వెళ్లే సమయం లో తనతో కూడ బయలుదేరిన శ్రీ ఆంజనేయుని మంగళ గిరి పై నిలిచి భక్తులను ఆదుకోవలసిందిగా
ఆజ్ఞాపించాడట. అందువల్లనే శ్రీ ఆంజనేయుడు ఇక్కడ
కొండ పై భాగం లో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారి ఆలయ సమీపం లో వేంచేసి,
క్షేత్రపాలకుడు గా భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు.
స్వామి దర్శనం. :---- శ్రీ
వేదాద్రి,మట్టపల్లి, వాడపల్లి లో వెలసిన నారసింహమూర్తులను వరుసగా స్నానాలయ్య,
అన్నాలయ్య, దీపాలయ్య అని భక్తులు ఆర్తితో పిలుకుంటున్నట్లుగానే ఈ స్వామిని పానకాలయ్య అని
నోరారా పిలుచుకుంటారు.
మంగళగిరి
కొండపై గుహలో ఎటువంటి రూపము మనకు
కన్పించదు. 15 సెంటీమీటర్ల గహ్వరం మాత్రమే
భక్తులకు దర్శనమిస్తుంది. గహ్వరానికి రెండు వైపుల కొండపై సహజసిద్ధం గా వెలసిన శంఖ
చక్రాలు కన్పిస్తాయి. గహ్వరానికి శ్రీ స్వామి ముఖముద్ర గల కవచాన్ని అమరుస్తారు. శ్రీ స్వామికి భక్తులు చేయించిన బెల్లపు పానకాన్ని శంఖం తో
అర్చకస్వామి శ్రీ స్వామి వారికి
అందిస్తారు. శ్రీ స్వామి పానకం తాగినంత సేపు గుటగుట మన్న శబ్దం విన వస్తుంది .
శ్రీ స్వామి స్వీకరించడం ఆపివేయగానే శబ్దం ఆగిపోతుంది. మిగిలిన పానకాన్ని
ప్రసాదంగా ఇస్తారు. ఇది ఒకసారి కాదు
రోజంతా ఇలానే జరుగు తుంటుంది. భక్తులు చేయించిన పానకం గుండిగ అయితే అరగుండిగ,
బిందె అయితే అర బిందె మిగలడం ఇక్కడ ప్రత్యేకం.
శ్రీ పానకాల నరసింహస్వామి వారి దివ్య రూపం
మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇంత పానకాన్ని, దాని కొరకు బెల్లాన్ని ఎంత పెద్దమొత్తం లో వాడుతున్నా ఇక్కడెక్కడా ఒక్క ఈగ కాని, ఒక్క చీమ
కాని కనిపించదు.
కలియుగం లో పాపం
పెరిగినప్పుడే ఇక్కడ కు చీమలు వస్తాయని
భక్తులు చెప్పుకుంటారు.
శ్రీ
రాజ్యలక్ష్మీ దేవి. ::-------- శ్రీ స్వామి వారి ఆలయానికి ఎడమ
వైపుగా ఎగువుకు మెట్ల మార్గం ద్వారా వెళితే ఓ చిన్న గుహ వంటి ఆలయం లో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారి దివ్యమంగళ
రూపం కొండ లో నుండి స్వయంవ్యక్త
మూర్తి గా మనకు దర్శనమిస్తుంది. ఈ విగ్రహం
అత్యంత రమణీయం గా ఉంటుంది. శ్రీమహాలక్ష్మీదేవి ఈ కొండపై తపస్సు చేసి, శ్రీ
స్వామిని ప్రసన్నుని చేసుకున్న వృత్తాంతానికి
నిదర్శనం గా శ్రీ
మన్మథుని కన్నతల్లి శ్రీ మహాలక్ష్మీదేవి యై ఇచ్చట కొలువు తీరింది.
అమ్మవారి ఆలయం ప్రక్కనే ఉన్న గుహ ముఖద్వారం
ఈ ఆలయానికి కుడివైపున ఉన్న ఒక చిన్నగుహామందిరం లో శ్రీ రంగనాయకస్వామి వారు కొలువు తీరి
ఉన్నారు.
ఈ రెండు ఆలయాలకు
మథ్య లో కొంచెం లోపలగా ఒక గుహ మనకు కన్పిస్తుంది. ఈ గుహలో నుండి ఉండవల్లి
గుహాలయాల లోని శ్రీ అనంతపద్మనాభస్వామి
వారి సన్నిథి కి మార్గముందని ,ప్రతిరోజు మునులు ఇక్కడనుండి వెళ్లి కృష్ణానది లో
స్నానం చేసి వచ్చేవారని చెపుతున్నారు.
ఇప్పుడు మాత్రం ఈ గుహామార్గం రాళ్లు పడి, మూసుకు
పోయి, చీకటిగా ఉంటుంది. ఇది ఆదికాలపు
స్భుటమయ” క్రిష్టలైన్” శిల గా పరిశోధకులు
భావిస్తున్నారు.
శ్రీ గండాలయ్య :- - కొండకు పైభాగం లో గండాలయ్యను భక్తులు
సేవించుకుంటారు. ఇక్కడ ఎటువంటి రూపం ఉండదు. భక్తులు తమ గండాలను పొగొట్టమని శ్రీ నరసింహస్వామిని
ప్రార్థిస్తూ, ఇక్కడ ఉన్న ఇనుప ప్రమిదలో నువ్వులనూనె పోసి సాయంత్రం సమయాల్లో దీపాన్ని వెలిగిస్తారు. దీని వలన తమ కష్టాలు
గట్టెక్కుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దీపం చుట్టుప్రక్కల చాల గ్రామాలకు
కన్పిస్తుంది.
ఎగువసన్నిథి లో థ్వజ స్థంభం చెంత దీపాలు వెలిగిస్తున్న భక్తులు
ఈ మంగళగిరి కొండ ఎత్తు
875 అడుగులు. కొండ దిగువ నుండి 485 మెట్లు ఉన్నాయి. ఈ కొండ” ఖోండలైట్స్” అనే ఆదియుగపు
కాలం నాటి రాతి సమూహానికి చెందినదిగా సంబంథిత శాస్తవేత్తలు భావిస్తున్నారు. ఈ కొండ
పైకి మెట్ల మార్గాన్ని శ్రీ చెన్నాప్రగడ బాలరామదాసు నిర్మింప చేసినట్లు తెలుస్తోంది.
ఎగువ సన్నిథిలో శ్రీ పానకాల
స్వామి వారి దర్శనం ప్రతిరోజు ఉదయం 7.30 గం.లనుండి మథ్యాహ్నం 4 గం.ల.వరకు
మాత్రమే లభిస్తుంది. ఆ తరువాత శ్రీ
స్వామిని దేవతలు పూజించు కునేందుకు వీలుగా మానవ దర్శనం ఆపి వేయబడుతుంది.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి. ::---- కొండ దిగువున కొలువు తీరిన భక్తజనమందారుడు శ్రీ
లక్ష్మీనరసింహస్వామి. శ్రీ స్వామి పాండవాగ్రజుడైన
ధర్మజుని ప్రతిష్ఠ గా చెప్పబడుతోంది.
ఇంద్రకీలాద్రి పై అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసే సమయం లో
పాండవులు మంగళాద్రి సమీప ఆశ్రమంలో
ఉండేవారట. ఆ సమయం లోనే ధర్మరాజు భీమసేనుని చేత గండకీశిలను తెప్పించి,
ప్రముఖ శిల్పుల చేత శ్రీ లక్ష్మీనరసింహుని రూపొందించి, ప్రతిష్ఠించి, సేవించి,
తరించాడని స్థలపురాణం.
ఆలయ ప్రత్యేకత ::----- శ్రీ లక్ష్మీనరసింహుని దివ్యమంగళ విగ్రహం సాలగ్రామశిల లో కాంతుల నీనుతూ నయన మనోహరంగా
ఉంటుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి
దివ్యాభరణాలలో అష్టోత్తర శత సాలగ్రామమాల కు ఒక ప్రత్యేకత ఉంది. అలాగే
శ్రీకృష్ణుడు మహాభారత సంగ్రామ సమయం లో వినియోగించినది గా చెప్పబడుతున్న
బంగారు తొడుగు వేసిన దక్షిణావృత శంఖం ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. తంజావూరు మహారాజు శ్రీ సర్ఫోజీ 20.11 1820 న దీనిని శ్రీ స్వామి వారికి సమర్పించారు. దీని
ద్వారా పోసిన తీర్థాన్ని సేవిస్తే సకల
రోగాలు నశిస్తాయని, సర్వపాపాలు హరిస్తాయని
భక్తుల నమ్మకం. ఈ మహద్భాగ్యం వైకుంఠ
ఏకాదశి రోజున మాత్రమే భక్తులకు ఈ స్వామి సన్నిథి లో లభిస్తోంది. ఆ రోజున లక్షలాది
మంది భక్తులు ఈ దక్షిణావృత శంఖ తీర్థాన్ని
సేవించి, ధన్యులౌతున్నారు. ఇదొక ప్రత్యేకత.
దిగువసన్నిథి లో వేంచేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి
శ్రీ స్వామి వారి రథం చాల అందంగా మలచబడింది. ఈఆలయ ప్రాకార, మండప, గోపురాలను
నిర్మించి ఆలయాభి వృద్ధికి ఎంతో కృషి
చేసిన విజయ నగర సామ్రాజ్య సైన్యాధిపతి తిమ్మరాజు దేవరాజు ఈ రథాన్ని కూడ నిర్మింప
చేసినట్లు తెలుస్తోంది. దీనిపై భారత.భాగవత, రామాయణ గాథలు దారుశిల్పం లో ఎంతో రమణీయం గా మలచబడ్డాయి.
శ్రీ నరసింహస్వామి
ఆలయానికి ఎడమవైపున శ్రీరాజ్యలక్ష్మీదేవి ఆలయం, కుడివైపు కొద్దిదూరం లో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత రామాలయం,శ్రీ స్వామి కి ఎదురుగా థ్వజస్థంభము చెంత గరుడాళ్వారు కొలువు తీరి
ఉన్నారు.
శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారి దివ్యమంగళ విగ్రహం
ఇరువది నాలుగు స్థంభాల ముఖమండపం విజయనగర రాజుల కాలం లో
నిర్మింపబడినట్లు చారిత్రక ఆధారాల
వలన తెలుస్తోంది. ఈ ఆలయం ద్రావిడశైలి కి చెందినది గా తద్విజ్ఞులు చెపుతున్నారు.
రాజగోపురం ::-----
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తూర్పు రాజగోపురం అత్యంత ప్రసిద్ధమైనది. 153
అడుగుల ఎత్తు, 49 అడుగుల పొడవు, 16 అడుగుల
వెడల్పు కలిగి. 11 అంతస్తులతో అలరారే ఈ రాజగోపురం
దక్షిణ భారతదేశం లోనే అతి ఎత్తయిన గాలి గోపురం గాను, ఈ విధమైన నిర్మాణాలలో
ఇదే ఉత్తమ మైనది గాను చెప్పబడుతోంది.
దీనిని శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు దాదాపు రెండు వందల సంవత్సరాలకు పూర్వం
కట్టించాడు. దీని నిర్మాణం 1807 లో
ప్రారంభమై, 1809 లో పూర్తి చేయబడింది. ఎంతమంది శిల్పులు,పనివారు పనిచేస్తే, ఎంతమంది సకాలం లో వారి చేత పని చేయించగలిగితే ఇంత అపురూప కట్టడం తెలుగువారికి దక్కిందా అనిపిస్తుంది. ఇటువంటి నిర్మాణాన్ని పూర్తి చేయించిన ఆ మహాభక్తుని కార్యదీక్షకు,
దైవభక్తి కి జోహార్లు అర్పించ వలసిందే.
చీకటి కోనేరు ::--- గోపుర నిర్మాణమంతా పూర్తయిన
తరువాత అది పడమర వైపుకు ఒఱగటం
ప్రారంభించింది. వెంటనే కాంచీ పురానికి చెందిన
ఒక వాస్తుశిల్పి సలహా మేరకు ఈ గోపురానకి ఎదురుగా ఒక పెద్దకోనేరు ను
త్రవ్వించారు. దానితో గోపురం సరిగా
నిలబడింది. ఆ కోనేటి నే నేడు” చీకటి కోనేరు” అని పిలుస్తున్నారు. దేవాలయానికి ఎదురుగా
ఇప్పటకీ ఈ కోనేరు కన్పిస్తుంది.
గాలిగోపురం ఎంత ఎత్తు ఉందో ఈ కోనేరు అంత లోతు ఉందని స్థానికులు చెపుతారు.
చీకటి కోనేట్లో నీటి అలలు
ఉత్తర గాలి గోపురాన్ని రంగాపురం జమీందారు రాజా మాడపాటి వేంకటేశ్వరరావు 1911
లో నిర్మింప చేశారు. దక్షిణ వైపు గాలిగోపురం 1992 లో కృష్ణాపుష్కరాల
సందర్భంగా ఆనాటి
దేవాలయాధికారి శ్రీ నూతక్కి కోటయ్య పర్యవేక్షణ లో పునరుద్ధ రించబడింది.
ఉత్తర గాలి గోపురం, దీనిచెంతనే పాలచెట్టు ఉంది
కాని పడమర గాలిగోపురం మాత్రం నిర్మాణ సమయం లో మాటి మాటి కి ఏవేవో ఇబ్బందులు, అవాంతరాలు
ఎదురవ్వడం తో ఇప్పటికీ అసంపూర్తి గానే మిగిలి పోయింది.
చారిత్రక నేపథ్యం.---- శ్రీకృష్ణదేవరాయల వారి జైత్రయాత్రా కాలం లో
కొండవీడు విజయానంతరం విజయచిహ్నం గా మహామంత్రి
తిమ్మరుసు క్రీ.శ 1515 లో వేయించిన జయస్థంభం ఒకటి కొండదిగువన మెట్ల వద్ద మనకు
కన్పిస్తుంది. దీనిలో శ్రీ కృష్ణరాయల వారి మహామంత్రి తిమ్మరుసు శ్రీ
లక్ష్మీనరసింహస్వామిని దర్శించి, భూదాన మిచ్చినట్లు వ్రాయబడింది.
అలాగే ఆలయప్రాగణం లో గరుడాలయానికి ఉత్తరం గా ఉన్న క్రీ.శ 1558 నాటి శాసనం
వలన ఒరిస్సారాజు మంగళగిరి ,మరో28
గ్రామాలలో 200 కుంచాల పొలం శ్రీలక్ష్మీనరసింహదేవర కు సమర్పించినట్లు
తెలుస్తోంది. (10 కుంచాలు అంటే ఎకరం)
క్షీరవృక్షము ::----- ఈ
ఆలయప్రాకారం లోపల ఉత్తర గాలి గోపురానికి
ప్రక్కగా క్షీరవృక్షము (పాలచెట్టు) ఒకటి
కన్పిస్తుంది. మంగళ గిరి ఆలయం లోని ఈ క్షీరవృక్షం సంతానార్ధులైన మహిళల పాలిట కల్పవృక్షం గా
చెప్పబడబతోంది. ఈ వృక్షాన్ని పూజిస్తే సౌభాగ్యం,
సంతానం,సంపత్తి, సర్వపాపహరణం తో పాటు
ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్మి సేవిస్తున్నారు.
ప్రత్యేక
ఉత్సవాలు ::----- శ్రీ
పానకాలస్వామి వారి ప్రత్యేక ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలు అతి ప్రధానమైనవి. శ్రీకృష్ణుని సలహా మేరకు ధర్మరాజు ఈ ఉత్సవాలను ప్రారంభించి నట్లు చెప్పబడు తోంది.
తొలినాళ్ల లో ఫాల్గుణ శుద్ధ సప్తమి నుండి
ఏడు రోజులు ఈ ఉత్సవాలను నిర్వహించేవారు. ఇప్పుడు
ఈ ఉత్సవాలు 11 రోజులు జరుగుతున్నాయి.ఫాల్గుణ శుద్ధ షష్టి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ,బహుళ పాడ్యమి
నాడు చక్రస్నానం తో ముగుస్తాయి. భారతదేశమంతా “హోళీ పండుగ” జరుపుకొనే రోజు శ్రీ శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ
నరసింహుని కి కళ్యాణం , రథోత్సవము
జరుగుతాయి. ఆరోజు లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవం లో పాల్గొని “ తిరునాల, తిరునాల “చేసేస్తారు. అందుకే దీనికి” మంగళగిరి తిరునాళ” అనే
ప్రసిద్ధి వచ్చింది.
శ్రీ స్వామి వారి రథం
శ్రీ రామనవమి , హనుమజ్జయంతి,నృసింహజయంతి, వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో
కూడ శ్రీ స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు
జరుగు తాయి.
గరుడవాహన సేవ
ఆలయ వేళలు : ----- ఎగువసన్నిథి లో ఆలయం ఉ. 7.గం లకు తెఱచి మథ్యాహ్నం 4 గం .లకు మూసివేస్తారు.
తూర్పు రాజగోపురం లోకన్పించే రాజా వాసిరెడ్డి వారి ఛాయాచిత్రం
దిగువ సన్నిథి లో ఆలయం ఉ.5.గం.లకు తెఱచి మథ్యాహ్నం 12.30 ని.లకు మూసివేసి, మరల 4.00 గ.లకు తెఱచి రాత్రి 8.30
ని.లకు మూసివేస్తారు.
రవాణా సౌకర్యాలు ::------ విజయవాడ నుండి మంగళగిరి కి రోడ్డుమార్గం అత్యంత సౌకర్యంగా ఉంటుంది. విజయ
వాడ ఆర్టీసీ సిటీ టెర్మనల్ నుండి ఎన్నో
సర్వీసులున్నాయి. కొండ మీదకు మెట్ల
మార్గము, ఘాటురోడ్ సౌకర్య కూడ ఉంది. ఊరిలో మంచి వసతి, భోజన, కాఫీ, టీ ,ఫలహారాలు
లభిస్తాయి . దిగువ సన్నిథి ఆలయ ఆవరణ లో
ఆగ్నేయం గా నిత్యాన్నదానసత్రం ఉంది .
********************************************************************************* ********************************************************* **********************
No comments:
Post a Comment