Friday 5 April 2013

పెదకాకాని శ్రీభ్రమరాంబా మల్లేశ్వరస్వామి


       Pedakakani    Sree    BrahmarambaMalleswara Swamy       
                  పెదకాకాని   శ్రీ  భ్రమరాంబా మల్లేశ్వర స్వామి
           पॆदकाकानि श्री भ्रमरांबामल्लेश्वर स्वामि        

                       గుంటూరుజిల్లా లోని పెదకాకాని  శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి వారు వెలసిన దివ్యక్షేత్రము. ఈ క్షేత్రము    బారసాల,  నామకరణము అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు, చెవులుకుట్టుట వంటి బాల్య సంస్కార ప్రక్రియలకు ప్రసిద్ది చెందింది. శివాలయమైన కూడ వివాహ,ఉపనయనాది శుభకార్యాలను ఈ ఆలయం లో చేసుకోవడం ఒక ప్రత్యేకత. కొత్త దంపతులు కొంగుముడి వేసుకొని శ్రీ స్వామివారిని దర్శించుకొని, ఆవరణ లోనున్న శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వరుని, శ్రీ వినాయకుని  సేవించు కుంటారు. నాగదేవతలకు, నవగ్రహాలకు  పూజలు చేస్తారు.

              
                               ఆలయ గోపుర దర్శనం

                  ఆ సమయం లో  ఆ కొత్త దంపతుల మనసులో ఉన్న మధుర మైన కోరిక ఏమిటో ఆ  మల్లేశ్వరునకు,ఇద్దరు బిడ్డల ముద్దులతల్లి యైన  ఆ భ్రమరాంబికాదేవికి తెలుసు.  అందుకే ఆ నవ దంపతులు అనతి కాలం లోనే అమ్మానాన్న లై ,   తమ  ఇంటిదీపం కంటివెలుగు  అయిన  ఆ పసిపాప ను  చంకనేసుకొని మళ్లీ కాకాని మల్లన్న దర్శనానికి వస్తారు.   ఈ మల్లన్న సన్నిథిలోనే తమ బిడ్డకు నామకరణాది  సంస్కారాలను వైదికోత్తముల  ఆధ్వర్యంలో మంత్రోచ్చారణల నడుమ వేడుక గా జరుపుకుంటారు. ఇది ఈ క్షేత్ర  మరో ప్రత్యేకత.
                         
           
                     
     
                              కాకాని ఆలయ తోరణ ద్వారం  

             ఎందువలనంటే సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీ శ్రీకృష్ణదేవరాయలు ఈ స్వామిని దర్శించుకుని, సేవించిన అనుగ్రహం తోనే సంతాన వంతుడయ్యాడని,  అందువల్లనే తన కుమారునకు సదాశివరాయలు అని పేరుపెట్టుకున్నాడని, స్థలపురాణం లో వ్రాయబడి ఉంది.                                       

                  స్థలపురాణం.:__----                       శ్రీశైల స్థలపురాణానుబంధము నందు అంగక్షేత్రసంక్షిప్త చరిత్ర “    భాగములో శ్రీమల్లిఖార్జునదేవుని అంశావతారములు, మల్లిఖార్జునదేవుని శ్రీశైల సమాగమము అను పంచమ ప్రకరణము లో కాకాని ప్రశస్తి ని గూర్చి ప్రస్తావించబడినది.   
           ఇచ్చట వెలసిన  శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమల్లేశ్వర స్వామి వారు శ్రీశైలక్షేత్రం లో వెలసిన  అష్టాదశ శక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబా దేవి, ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకరైన శ్రీ మల్లిఖార్జునస్వామి వారి ప్రధానాంశాలైనందున ఈ క్షేత్రదర్శనం చేసిన వారికి  శ్రీ శైల క్షేత్రదర్శనం చేసిన పుణ్యం లభిస్తుందట.
            

                      
                                 ఆలయ  రాజ గోపురం
                    
               ఒక పర్యాయం   శ్రీశైలవాసి యైన శంకరుడు కొంతమంది మునీశ్వరులు వెంటరాగా భూలోక విహారం చేస్తూ,  మంగళాద్రి, గర్తపురి(గుంటూరు ) మధ్యలో నున్న  ఒక సుందర మైన వనాన్ని  చూసి   ఆకర్షితుడై కొంత  కాలం అక్కడే నిలిచిపోయాడట.  మహర్షులు, సిధ్ధులు స్వామిని సేవించుచుండగా,  స్వామి కూడ వారి సేవలను స్వీకరిస్తూ, వారిని అనుగ్రహిస్తూ  అక్కడే ఉండిపోయారు. అక్కడ ఒక సిద్దసమాజము ఏర్పడి, బిల్వపత్రార్ఛ నలతో, నృత్యగీతాలతో శ్రీ స్వామిని సేవించుకుంటున్నారు. కాని  శ్రీశైలము నందు  పరమేశ్వరి యైన భ్రమరాంబికాదేవి శంకరుని ఆగమనం  ఆలస్యమగుటకు విచారించి, వారి కొఱకు చెలికత్తెలైన జయ విజయ లను పంపించింది. వారివురు కాకాని యందలి సుందరోద్యానమున భక్తుల మథ్య పరవశుడై యున్న భోళాశంకరుని  దర్శించి, అమ్మ ఆనతి ని విన్నవించారు. ప్రియా వృత్తాంతమును విన్నశంకరుడు ఆమె కు బాధ కల్గించినందులకు నొచ్చుకొని,  శ్రీశైలాన్ని చేరాడు. కాని కాకాని క్షేత్రమునందలి ప్రీతితో  శ్రీ స్వామి ఇచ్చట శ్రీ భ్రమరాంబా  సమేతము గా స్వయంభువు గా వెలసి, భక్తులను కాపాడు చున్నాడు.   
                  

      
                              ఆలయ ప్రాగణం లో గణ నాయకుడు
         
              శ్రీ భరద్వాజమహర్షి  సర్వతీర్థ సందర్శన చేస్తూ ఈ కాకాని క్షేత్రానికి వచ్చారు. శ్రీ స్వామి ని అభిషేకిస్తున్న సమయం లో శివానుగ్రహం వలన యజ్ఞ సంకల్పం కలిగింది మహర్షికి. సమస్త  సంభారాలను సమకూర్చి, ఎందరో మహర్షుల నాహ్వానించి, యజ్ఞాన్ని ప్రారంభించారు. దేవతలకు ఆహుతులను అందించే సమయం లో ఒక కాకి వచ్చి వాటిని తిన సాగింది.యజ్ఞం అపవిత్ర మౌతోందని దానిని వారించబోయాడు. కాని ఆ కాకి మనుష్య భాష లో తాను కాకాసురుడనే రాక్షసుడినని, బ్రహ్మదేవుని వరం వలన తనకు  హవిర్భాగాలను స్వీకరించే అర్హత దక్కిందని, నీ యజ్ఞం సఫలం కావాలంటే  యజ్ఞజలం తో నన్ను అభిషేకించు. నా కున్నశాపము  తీరుతుంది. నీ యజ్ఞము సుసంపన్నమౌతుందని పలికింది.  
                            

                   
                      ఆలయప్రాకారం లోపల ఉత్తరంగా దర్శనమిచ్చే శివపార్వతులు

              ఆ మాటలు విన్న భరద్వాజమహర్షి యజ్ఞాన్ని పూర్తి చేసి, అభిషేకజలాన్ని ఆ కాకి పై చల్లగానే   ఆ కాకి తన నల్లని రూపాన్ని వదిలి శ్వేతవర్ణాన్ని పొంది, మహర్షిని స్తుతించి, శ్రీమల్లేశ్వరుని మల్లికా కుసుమాలతో పూజించి,  మానస సరోవర తీరం లోని,మహా అశ్వత్థ వృక్షపు తొర్రలో గల తన నివాసానికి చేరుకుంది. ఆ పక్షిరాజు మానస సరోవరం నుండి  ఆకాశమార్గం  లో  దక్షిణ భారతదేశ లోని చెంగల్పట్టు వద్ద గల పక్షితీర్థానికి వెళ్లి, సర్వేశ్వరుని దర్శించి, బలిని స్వీకరించి, తిరిగి వెళుతూ, శ్రీ కాకాని మల్లేశ్వరుని దర్శించుకొని వెళుతూ ఉంటుందని స్థలపురాణం లో వివరించారు .

          స్వామి దర్శనం::-----       గర్భ గుడి లో శ్రీ మల్లేశ్వర స్వామి పానమట్టంపై  అతిచిన్న లింగరూపం లో ధవళ వర్ణ కాంతి తో ప్రకాశిస్తూ, మల్లికా కుసుమ సదృశమైన చిరునవ్వులతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు దర్శనమిస్తాడు.
                        

        
                                 శ్రీ కాకాని మల్లేశ్వరుని దివ్యరూపం
                 
                  శ్రీ స్వామికి ఎడమ వైపున  ఉన్న ఉపాలయం లో జగన్మాత శ్రీభ్రమరాంబాదేవి దివ్యమంగళ విగ్రహం  ప్రసన్నవదనం తో చిద్విలాసరూపిణియై అభయముద్రతో   భక్తులను   అనుగ్రహిస్తూ కొలువు తీరి ఉంటుంది.
                   

       
                            శ్రీ భ్రమరాంబా దేవి దివ్యమంగళ విగ్రహం
           
                 అంత్రాలయం లో ఒక చిన్న నందీశ్వరుడు, ముఖమండపం లో పెద్ద నందీశ్వరుడు  వేంచేసి ఉన్నారు.  ఆలయప్రాగణం లో ఈశాన్యం లో కళ్యాణ మండపము, దానిముందుగా రావి వేపచెట్ల పూజావేదిక, వాని చుట్టు భక్తులచే ప్రతిష్ఠించబడిన నాగశిలలు దర్శనమిస్తాయి.  వాని చేరువలోనే నవగ్రహమండపాన్ని మనం చూడవచ్చు.
                   
            
             

                              ముఖమండపం లోని నందీశ్వరుడు

                ఆలయానికి ఉత్తరం గా శివపార్వతులు, వెనుక వైపు శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి, ఎడమ వైపు రాహుకేతు మండపానికి తూర్పు గా వినాయకుడు కొలువు తీరి ఉన్నారు.        
       యజ్ఞాల బావి.::------           ఈ ఆలయానికి తూర్పుగా భరద్వాజ మహర్షి చే నిర్మించబడినది గా చెప్పబడుతున్న ఒకబావి ఉంది. సమస్త తీర్థ జలాలను,యజ్ఞ జలాన్నిభరద్వాజ మహర్షి దీనిలో  ఉంచారని  చెపుతారు. అందువల్లనే పసిపాపలు, బాలింతలు, వ్యాధిగ్రస్తులు ఈ జలాల్ని సేవిస్తే ఆరోగ్యం  చేకూరుతుందని భక్తుల విశ్వాసం.  ఈ బావి లోని నీరు ఎల్లకాలాలలోను నిర్మలం గాను, సమృద్ధి గాను ఉంటాయి. అందుకే దీనిని యజ్ఞాల బావి అని పిలుస్తారు.

                             
                              ఆలయానికి తూర్పు గా ఉన్న యజ్ఞాల బావి
                 
            కాకాసురుని వథానంతరం శ్రీ రామచంద్రుడు  ఈ మల్లేశ్వరుని దర్శించి, కోటిబిల్వార్చన చేసినట్లుగా చెప్పబడుతోంది. మహర్షి అగస్త్యుడు శ్రీ స్వామిని పూజించి ,ధ్యానం లో ఉండగా శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి దర్శనమైందని, ఆనందం తో మహర్షి శ్రీ స్వామిని పరిపరి విధాల స్తుతించారని ప్రతీతి.   అందు వల్లనే నేమో ఇక్కడ నాగప్రతిష్ఠ ఒక సంప్రదాయం గా వస్తోంది. భక్తులు తమ కోరికలు నెరవేరితే ఇక్కడ  నాగప్రతిష్ఠ  చేయించడం, తమ పిల్లలకు శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వద్ద చెవిపోగులు కుట్టించడం  అలవాటు గా ఉంది.
       
      శ్రీ కృష్ణదేవరాయలు::------             శ్రీకృష్ణదేవరాయలు  జైత్రయాత్రా సందర్భంలో అనగా  శా.శ.1440 ప్రాంతములో ఇంద్రకీలాద్రి, శ్రీకాకుళం,  అమరారమం, మంగళాద్రి  దైవాలను దర్శించుకొని గర్తపురి వైపు  పయనించుచుండగా, ఆయన మంత్రి గా ఉన్న కాకాని వాస్తవ్యుడైన రెంటూరి చిట్టరుసు మంత్రి కాకానిమల్లన్న ను గురించి, ప్రస్తావించడం జరిగింది. కాకాని ప్రాశస్త్యాన్ని విన్న  శ్రీకృష్ణదేవరాయలు  తన మంత్రి చిట్టరుసుకు కాకాని ఆలయ పునర్ని ర్మాణానికి  అనుమతి ని నివ్వడం జరిగింది. అంతే కాకుండా శ్రీ రాయల వారు మనసులో, తనకు పుత్ర సంతానం కలిగితే  నీపేరు పెట్టుకుంటానని  మొక్కుకున్నారట. అదే ప్రకారం  మంత్రి చిట్టరుసు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి , శ్రీ స్వామి వారిని పున: ప్రతిష్ఠ చేశాడు. శ్రీస్వామి ఆశీస్సుల తో శ్రీకృష్ణదేవరాయలు కు కుమారుడు కలడు. ఆయనకు సదాశివ రాయలు అని పేరు పెట్టుకోవడం జరిగింది.
                         

                  
                         రెంటూరి చిట్టరుసు మంత్రి వేయించిన శాసనం
        
           ఈ విషయమంతా  శ్రీకృష్ణదేవరాయల వారి కుమార్తె మోహనాంగి  చే రచించబడి, శ్రీ కృష్ణరాయల వారికే అంకితమివ్వబడిన మారీచీపరిణయము అనే కావ్యం లో  చతుర్థాశ్వాస ప్రారంభం లోని వచనం లో ప్రస్తావించబడింది.
                        

            
                          ఆలయ ముఖమండప దృశ్యం
    
              అదేవిధంగా  రెంటూరి చిట్టరుసు మంత్రి వేయించిన శాసనం కళ్యాణ మండపం ప్రక్కనే లభిస్తోంది. (ఆర్కి-251/1895. కాకాని శాసనము, vol.iv ) . క్రీ.శ 1911 లో జీర్ణావస్థ పొందిన ఈ ఆలయాన్ని కాకాని వాస్తవ్యులైన శ్రీ కొల్లిపర వెంకటరత్నం   ఆలయ పునర్నిర్మాణ, లింగ పున ప్రతిష్ఠాకార్యక్రమాలను నిర్వహించినట్టు  కళ్యాణమండప  సమీపం లోని శాసనం వలన తెలుస్తోంది.
        ప్రదక్షిణలు  ::------          సంతానార్థులైన దంపతులు ఈ క్షేత్రం లో మండల దీక్ష తో రోజుకు 108 చొప్పున 40 రోజులు ప్రదక్షిణలు చేసినచో సంతావంతులగుదురనే దృఢమైన విశ్వాసం భక్తులలో నెలకొని ఉంది.అనారోగ్యులు ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యవంతులైన నిదర్శనములున్నవట.

            రావి వేప   వేదిక ,  భక్తులు ప్రతిష్ఠించిన నాగశిలలు
     
            పాలపొంగలి   ::-----          శ్రీ స్వామి వారికి పాలపొంగలి నివేదనలు ఇక్కడ ప్రత్యేకత.  శివ క్షేత్ర మైన ప్పటికీ  వివాహాలు, సత్యన్నారాయణ వ్రతాలు,ఉపనయనాలు జరుపుకుంటారు. ముఖ్యంగా వాహనపూజకు ఇక్కడ అదిక ప్రాధన్యం ఉంది. వాహన యజమానులు క్రొత్త వాహనాలను  కొన్నప్పుడు శ్రీస్వామి వారి సన్నిథి లో పూజచేయించుకోవడం శుభకరం గా భావిస్తారు.

                 ఆలయం వెనుకవైపు   కొలువు దీరిన శ్రీ సుబ్రమణ్యేశ్వరుడు

          రాహుకేతుపూజలు ::-----    ఎవరి జాతకం లోనైనా కాలసర్పదోషం టే రాహుకేతు పూజలు చేయించుకోవాలని శాస్త్రం చెపుతోంది. అటువంటి వారి కోసం ఈ ఆలయ ప్రాగణం లో నైరుతి దిక్కున రాహుకేతు మండపాన్ని నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించారు.పర్వదినాల్లో యాత్రీకుల రద్దీని తట్టుకొనేందుకు ప్రత్యేకం గా అభిషేకమండపాన్ని కూడ  నిర్మించారు.

 ప్రత్యేక ఉత్సవాలు::-----        ప్రతి  సంవత్సరాది పండుగ రోజున శ్రీ స్వామి వారి పేరిట పంచాగాన్ని ప్రకటించి,  శ్రీ స్వామి సమక్షం లో పంచాంగ శ్రవణం జరిపి, వచ్చిన భక్తులకు ఉచితం గా దేవస్థానం వారు  పంచాగాలను పంచి పెడతారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం లో గణపతి నవరాత్రోత్సవాలు. ఆశ్వయుజ మాసం లో శ్రీదేవీ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవం గా జరుగుతాయి. ప్రతి సంవత్సరంమాఘ బహుళ ఏకాదశి నుండి  ఫాల్గుణశుక్ల పాడ్యమి వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి కూడ ప్రభలు కట్టుకొని, నృత్య వాద్యాలతో ఊరేగింపు గా వచ్చి ఈ ఉత్సవాల్లో భాగస్వాములౌతారు. 

           దంపతులచే నామకరణోత్సవం చేయిస్తున్న వైదికోత్తములు 
             
             రవాణా వసతి సౌకర్యాలు ::---        ఈ పెదకాకాని పుణ్యక్షేత్రం గుంటూరు-విజయవాడ రహదారిపై ఉండటంతో  ప్రయాణం అత్యంత సౌకర్యం గా ఉంటుంది. ఆలయ నిర్వహణ లో శ్రీ మల్లేశ్వర సదనం, శివసదనం అనే పేర్ల తో వసతి గదులు అన్ని సౌకర్యాలతో నిర్మించబడ్డాయి. ఆం.ప్ర . టూ. కార్పోరేషన్ రెండు సూట్ల తో అతిథి గృహాన్ని నిర్మించింది.   ఆలయం లో భక్తుల విరాళాలతో 1977 నుండి నిత్య అన్న దాన, శాశ్వత నిత్యప్రసాద వినియోగ పథకాలు నిర్వహించబడుతున్నాయి.   ఊరిలో  కాఫీ,టిఫిన్ ,భోజనాలకు ఇబ్బంది ఉండదు. గుంటూరు నుండి 9 కి. మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది.



*******************************************************************

1 comment:

  1. చక్కని సమాచారాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదములు

    ReplyDelete