Sunday, 3 March 2013

యనమలకుదురు -శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి


Yenamalakuduru -- sree parvatee sameta Ramalingeswara swamy

      యనమలకుదురు– శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
                    
                   కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామం లోని మునిగిరి పై స్వయంభువు గా వెలసిన  మహాదేవుడు శ్రీ రామలింగేశ్వరుడు. త్రేతాయుగం లో శ్రీ రామచంద్రమూర్తి సీతా సమేతుడై ఈ స్వామిని దర్శించి, సేవించినట్లు స్థలపురాణం చెపుతోంది.

                                    ఆలయప్రవేశ గోపురం

                స్థలపురాణం ::-----                 ఆనాడు  కృష్ణవేణీ మాత తన ప్రయాణాన్ని  విజయవాటిక సమీపం నుండి కొనసాగించడానికి  మార్గమీయ వలసిందిగా అటు సీతానగరం, ఇటు ఇంద్రకీలాద్రి పై నున్నదేవతలను అడిగిందట.కాని వారిరువురు  ఏమాత్రం ప్రతి స్పందించ లేదు. అంతలో మథ్యలో నున్నఈ రామలింగేశ్వరుడు భోళాశంకరుడు  కావున కృష్ణమ్మ  అభ్యర్ధనను మన్నించి , తానున్న కొండ కుదురు కుదురును జరుపుకొని యెడమవైపుకు వచ్చేశాడట.   ఆమథ్య లో నుండి కృష్ణమ్మ ప్రశాంతంగా కదిలి  సముద్రుని చెంతకు చేరిపోయింది. కుదురుగా యెడమవైపు కు కదిలిన మల  (కొండ )  కాబట్టి దీనికి  యెడ మల కుదురు  అని పేరువచ్చింది. కాలక్రమంగా అది యనమలకుదురు గా మారిందని ఒక ఐతిహ్యం వినబడుతోంది.
                 
                                                      ఆలయ శిఖరం

                              అలా వెలసిన  రామలింగేశ్వరుడు  కాలక్రమంలో  పుట్టలతోను, చెట్లతోను కప్పి వేయబడి, అ  దర్శనీయుడుగా  చాలా ఉండిపోయాడు.అనంతర కాలంలో శ్రీ పరశురాముడు తన  దక్షిణ  దేశ పర్యటనలో లో భాగం గా, కృష్ణా పరీవాహప్రాంత లోని స్వయంభువులైన మూర్తులను  సేవిస్తూ, ఈ  స్వామిని దర్శించి సేవించాడు.అంతే కాకుండా వల్మీకాంతర్గతుడైన ఈ స్వామిని పున: ప్రతిష్ఠితుని చేసి ముని జన బృందాలకు సేవించుకొనే మహదవకాశాన్ని కల్పించాడట పరశురాముడు. పరశురాముని చేత  ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు కావున ఈయన రామ లింగేశ్వరుడయ్యడేమో.?  
                              

                         వివిధ శిల్పరమణీయమైన   ఆలయశిఖరం    
                
                      మరొక గాథను అనుసరించి ఈ పర్వతాన్ని మునిగిరి అని పిలిచేవారట. కారణం ఈ పర్వతం ప్రశాంతతకు మారురూపు గాఉండేది. అందువలన పూర్వకాలం లో వేలాది మంది మునులు  ఈ కొండ పై తపస్సు కొనే వారు.  వేలమంది మునులు తపస్సు చేసుకున్న  ప్రదేశము కాబట్టి ఇది వేయి మునుల కుదురు > యనమలకుదురుగా మారిందని స్థలపురాణం చెపుతోంది.  ఆ వేలాదిమంది మునులకు రామలింగేశ్వరుని సేవించుకొను భాగ్యాన్ని స్వామిని పున: ప్రతిష్ఠించడం  ద్వారా పరశురాముడు కల్పించాడని చెప్పబడుతోంది.కొండ నుండి కృష్ణానది వరకు 101 శివలింగాలను పరశురాముడు ప్రతిష్టించాడని, అవి అనంతర కాలంలో నదీ గర్భంలో కలిసి పోయాయని చెపుతారు.  ఈ కొండపై నాగకన్యలు సంచరిచేవారని ప్రతీతి. ఇప్పుడు కూడ  చాలమంది భక్తులకు నాగేంద్రస్వామి దర్శనమిస్తాడట. ఈ స్థలప్రభావం వలనే  ఏకాగ్రత కుదిరి, ప్రశాంతత లభించి, వేలమంది మునుల తపస్సు ఫలించిందని   స్థల పురాణం .

                    ఆలయ అంతర ప్రాకారం పై  శివపార్వతుల శిల్పం

                   లింగ దర్శనం.::-----              శ్రీ శ్రీ రామలింగేశ్వరుడు వాయులింగాకారం లో  అష్టముఖ పానుమట్టం మీద దర్శనమివ్వడం ఇక్కడ ఒక ప్రత్యేకత గా చెప్పబడుతోంది.
               

                    
                       
                                               శ్రీ  స్వామి వారి దివ్యదర్శనం 

                           శ్రీ స్వామి వారికి ఎడమవైపున ఉన్న ఉపాలయం లో శ్రీ పార్వతీ దేవి  కొలువు తీరి ఉంటుంది. ఆలయప్రాగణం లో ని మరొక  ఉపాలయం లో  బొజ్జ గణపయ్య సుందరరూపుడై, భక్తులను అనుగ్రహిస్తున్నాడు . ఈ స్వామిని తప్పని సరిగా  దర్శించు కొని , తమ కోరికలను చెప్పుకుంటే అవి తప్పక తీరుతాయని భక్తుల విశ్వాసం.మరొక ఉపాలయం లో వీరభద్రుని కూడ మనం దర్శించవచ్చు. ఆలయ  అంతర్భాగ ప్రాకారమంతా వివిధ దేవతామూర్తుల రమణీయశిల్పాలతో    ఆథ్యాత్మిక వాతావరణం పరిమళిస్తుంది.
                             
                                                    శ్రీ పార్వతీ అమ్మవారు

                       క్రీ.శ .1983సంవత్సరం లో ఆనాటి ధర్మకర్తలైన శ్రీ ధనేకుల శివన్నారాయణ గారి ఆధ్వర్యంలో శృంగేరీ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతీతీర్థ స్వామి వారి పవిత్ర హస్తాలతో శ్రీ స్వామి వారి  ఆలయ శిఖర ప్రతిష్ఠ కావించబడింది. అనంతర కాలం లో  స్వామి తన పరమభక్తుడైన శ్రీ సంగెం నరసింహారావు  గారికి స్వప్నంలో సాక్షాత్కరించి తన ఆలయాన్ని పున రుద్ధరించవలసిందిగా ఆజ్ఞాపించాడట.
                         
        
                                             శ్రీ వినాయకుడు

                   ఆనాటి నుండి ఆ పరమ భక్తుడు స్వామివారి సేవలో తరిస్తూ, విశాఖ శారదా పీఠాథి పతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి  వారి ప్రత్యక్ష పర్యవేక్షణ లో వారి దివ్యాశీస్సులతో ఆలయాన్ని సర్వాగసుందరంగా తీర్ఛిదిద్దారు.
                         
                                                నాగదేవతల శిల్పాలు
                   
                           ఇక్కడ ఆలయ ప్రాగణం లో  లక్ష్మీ నారాయణ రూపులైన వేప ,రావిచెట్లు  కలసి పెరిగిన వేదిక ఉంది. ఈవేదిక పై   నాగశిలలు దర్శనమిస్తాయి. సంతానార్థులైన సుమంగళులు తమ మొక్కులను తీర్చుకుంటూ కన్పిస్తారు.
  
                 స్వామి ఆజ్ఞ కై ఎదురు చూస్తున్నట్లున్న   నందీశ్వరుడు
              
                              ప్రత్యేక ఉత్సవాలు.::---     యనమలకుదురు శివాలయం శివరాత్రమహోత్సవాలకు ప్రసిద్ధి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు,కళ్యాణోత్సవం,వసంతోత్సవం.ప్రభోత్సవం,గ్రామోత్సవం,ఇక్కడ వైభవంగా జరుగుతాయి.  


                           గర్భాలయ వెలుపలి గోడలపై కొలువు తీరిన నాట్యగణపతి
                
                 కళ్యాణోత్సవాలలో మూడవరోజు ఉదయం జరిగే వసంతోత్సవం కన్నులపండువుగా జరుగుతుంది. సాయంత్రం ధ్వజావరోహణ సమయంలో స్వామివారికి నివేదించిన నంది ముద్దలు అత్యంత మహిమాన్వితమైనవిగా  భక్తులు భావిస్తారు. ఇక్కడ స్వామి వారికి జరిగే ప్రభోత్సవానికి ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది.  ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
           
     
                                              కుడ్యశిల్పం లింగోద్భవమూర్తి

                      మహాశివరాత్రి రోజున భక్తులు  తమ గండాలను  తొలగ ద్రోసి, కష్టాలనుపోగొట్టి, తమ  కోరికలను తీర్చమని వేడుకుంటూ శ్రీ స్వామి వారికి గండదీపాలను వెలిగించి,తమ మొక్కులను  సమర్పించుకోవడం ఇక్కడొక సంప్రదాయం గా వస్తోంది.కార్తీక మాసం లో శ్రీ స్వామి వారి జన్మనక్షత్ర మైన ఆరుద్ర నక్షత్రం రోజున మహన్యాస పూర్వక కుంభాభి షేకం  నిర్వహిస్తారు. ఆ రోజు అన్నదానం  కూడ జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రి కి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
                       
                          ఆంజనేయుని దివ్యమంగళ విగ్రహం

                      రవాణాసౌకర్యాలు:----    విజయవాడ బస్టాండు నుండి సిటీ సర్వీసులు చాలా ఉంటాయి. సుమారు 612 అడుగుల ఎత్తుగల ఈ మునిగిరి పైకి  చక్కని ఘాటురోడ్డు సౌకర్యం ఉంది. 


                   ఘాటురోడ్డు ప్రారంభం లో రమణీయమైన తోరణ ద్వారము భక్తులకు ఆహ్వానం పలుకుతూ కన్పిస్తుంది. ఘాటురోడ్డు చివర లో అంజనీ సుతుడైన ఆంజనేయుడు  భక్తులను అనుగ్రహిస్తూ  దర్శనమిస్తాడు.


*********************************************************************************

1 comment:

  1. శృంగేరి జగద్గురువులు ఇక్కడకు 13, ఫిబ్రవరి 2013 నాడు సందర్శించి నాగేంద్ర స్వామీ విగ్రహ ప్రతిష్ట చేసిఉన్నారు. స్థల పురాణం చుస్తే అద్భుతమైన క్షేత్రం అని తెలుస్తోంది. ధన్యవాదములు.

    ReplyDelete