BRAHMAM gari MATHAM-
KANDIMALLAYAPALLI
బ్రహ్మం గారి మఠం – కందిమల్లయ పల్లి
కడప జిల్లాలోని కందిమల్లయ పల్లి శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాథి చెందిన పవిత్ర ప్రదేశము. సిద్దయోగి యై కాలజ్ఞానాన్ని లోకానికి అందించిన మహాపురుషుడు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. వీరు వ్రాసిన కాలజ్ఞానం భవిష్యపురాణం వంటిది. వీరి రచన కాళికాంబా సప్తశతి ఒక విశిష్ట రచనగా పండిత ప్రశంస లందుకొంది.
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
వీరు విశ్వకర్మ వంశమందు ఫ్రకృతాంబ,
పరిపూర్ణాచార్యులు దంపతులకు దైవానుగ్రహం తో జన్మించిన పుత్రుడు. “ వీరంభొట్లయ్య “వీరి జన్మ నామము.
“వీరప్పయాచార్యులు,” “వీరబ్రహ్మం” అని కూడ పిలిచేవారు. అనంతర కాలమందు పాపఘ్ని మఠానికి అధ్యక్షులు గా ఉన్న వీరభోజయాచార్య , వీరి ధర్మపత్ని వీరపాపమాంబ
దంపతులకు దేవుడిచ్చిన పుత్రునిగా వారికి లభించి, బాల్యం లోనే ఎన్నో మహత్తులను
ప్రదర్శిస్తూ పెరిగి పెద్దవాడయాడు. వీరభోజయాచార్యుల మరణానంతరం పాపఘ్ని మఠ నిర్వహణ
బాధ్యతలను స్వీకరించాడు.
కందిమల్లయపల్లి లోని శ్రీ బ్రహ్మం గారి మఠం
కాలజ్ఞాన రచన ::-- అనంతర కాలం లో తీర్థ యాత్రలు చేస్తూ
ఆనందభైరవయోగికి దివ్యమంత్రో పదేశాన్ని
చేశారు. ఈయన విష్ణ్వాంశ సంభూతునిగా భక్తులు
చెప్పు కుంటారు. బనగాన పల్లె లో సుజ్ఞాని” గరిమిరెడ్డి అచ్చమ్మ” గారి ఆశ్రయాన్ని పొంది, ఆవులకాపరి గా జీవితాన్ని కొనసాగించారు. రవ్వలకొండ వద్ద నున్న ఒక గుహలో కూర్చొని
కాలజ్ఞానాన్ని వ్రాయడం పూర్తిచేశారు. శ్రీ అచ్చమ్మ కు కాలజ్ఞానాన్ని బోధించి
అనుగ్రహించారు. వీరు మాట్లాడుకున్న ఆ ప్రదేశాన్నే
“ ముచ్చట్ల కొండ” ని పిలుస్తారు.
ముచ్చట్ల కొండ, శ్రీ అచ్చమ్మ గారి విగ్రహం
కాలజ్ఞానం వ్రాసిన తాళపత్రాలన్నింటినీ శ్రీ అచ్చమ్మ
గారి ఇంటి వద్ద నున్న పాతర లో వేసి బండతో మూసివేశారు. దానిపై ఒక చింతచెట్టు
మొలిచింది. అది ఎంతో మహిమ కలదని ఇప్పటికీ భక్తులు చెప్పుకుంటూ, పూజలు
చేస్తూనే ఉన్నారు.
పోలేరమ్మ
తో నిప్పు తెప్పించుట.::____ కొంతకాలం
తర్వాత శ్రీ వీరబ్రహ్మం గారు
కందిమల్లయపల్లె చేరుకొని వడ్రంగి వృత్తి చేయసాగారు. ఆ కందిమల్లయపల్లి గ్రామదేవత పోలేరమ్మ. అందుకని పోలేరమ్మ కు జాతర
చేయడానికి ఊళ్లో వాళ్లందరూ చందాలు వేసుకుంటూ, శ్రీ వీరబ్రహ్మం గారిని కూడ అడిగారు.
తాను పేదవాడినని ,చందా ఇవ్వలేనన్నాడు బ్రహ్మం గారు. ఇవ్వాల్సిం దేనని ఒత్తిడి చేశారు .
“సరే అమ్మవారి దర్శనం చేసుకొని రచ్చబండ దగ్గరే
చందా ఇస్తానని “అందరితో కలసి రచ్చబండ వద్దకు వచ్చాడు బ్రహ్మంగారు. అక్కడే చుట్ట కాల్చు కోవడానికి నిప్పు
కావాలని చుట్టు ఉన్నవారిని అడిగారు. వారు
లేదనడం తో” పోలేరమ్మా చుట్టకాల్చుకోవాలి నిప్పుతీసుకురా!” అని పెద్దగా కేకపెట్టి అడిగారట శ్రీ బ్రహ్మం
గారు. వెంటనే అదృశ్యం గా కణకణ మండే ఒక
నిప్పు కర్ర స్వామి చెంతకు వచ్చింది. శ్రీ స్వామి వారు చుట్ట కాల్చుకొని” ఇక చాలు తల్లి తీసుకు పో “ అనగానే పోలేరమ్మ గుడిలోకి వెళ్లి పోయిందట.
దీనికి సాక్ష్యం గా ఇప్పటికీ కందిమల్లయ పల్లి లో శ్రీ బ్రహ్మం గారి ఇంటిప్రక్కనే ఒక రచ్చబండ, ప్రక్కనే పోలేరమ్మ
గుడి, ఈ సంగతిని తెలిపే ఒక బోర్డు వెళ్లిన
యాత్రికులకు కన్పిస్తుంటాయి. ఇటువంటి
ప్రస్తావనలు శ్రీ బ్రహ్మంగారి
చరిత్ర గ్రంథాలలో ఎన్నో ఉన్నాయి.
రచ్చబండ
రాజయోగి.::-----
పెదకొర్లపాడు గ్రామానికి చెందిన శ్రీ శివకోటయ్య కుమార్తె యైన గోవింద మాంబ
ను వివాహం చేసుకొని స్వామి రాజయోగి గా
మారాడు. ఊరివారందరు కలసి కందిమల్లయపల్లి లో ఒక మఠాన్ని నిర్మించి శ్రీ
స్వామివారికి సమర్పించారు. వీరికి ఆరుగురు సంతానం. సిద్దలింగయ్య, గోవిందయ్య, శివరామయ్య ,పోతులూరయ్య, ఓంకారయ్య, మగపిల్లలు
కాగా, ఆడపిల్ల పేరు వీరనారాయణమ్మ. సిద్దయ్య వీరి
ప్రి యశిష్యుడు. శ్రీ వీరబ్రహ్మం గారు తన యనంతరము
చేతిబెత్తము,శిఖాముద్రిక, సింహపాదుకలు, యోగదండము
సిద్దయ్య కే కానుకగా అందజేశారు.
శ్రీ ఈశ్వరమ్మ గారు శ్రీ
బ్రహ్మంగారి కుమారుడైన గోవిందయ్య కుమార్తె. ఈమె పుట్టు బ్రహ్మజ్ఞాని గా
కొనియాడబడింది. ఈమె సమాధి కూడ మనకు
కందిమల్లయపల్లె లో దర్సనమిస్తుంది.
శ్రీ బ్రహ్మం గారు నివసించిన ఇల్లు కందిమల్లయపల్లి
మహా మంత్రము ;;--- “ఓం హ్రీం
క్లీం శ్రీం శివాయ శ్రీ
వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ: “అనేది వీరు బోధించిన మహామంత్రము.
ఎంతోకాలం ( 175 సంవత్వరాలు ? ) తన బోధలతో
ప్రజలను, జ్ఞానవంతులను,
సంస్కార వంతులను చేసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు క్రీ.శ 1694 శ్రీముఖనామ సంవత్సర వైశాఖ శుద్ద దశమి ఆది వారం
నాడు జీవసమాధి లోకి ప్రవేశించి నట్లు
చెప్పబడుతోంది. ( సం. జీ. చ.
రచయిత. శ్రీ తా. వెం. ల . నరసింహారావు,జె.పి .పబ్లికేషన్స్, విజయవాడ)
స్థల ప్రాథాన్యం --
ఏమైనా కందిమల్లయపల్లె లో తిరుగ తుంటే ఒక వింత
అనుభూతి కలుగు తుంది. అక్కడ తిరిగే భక్తులందరూ
తల స్నానాలు చేసి జుట్టు లు వదిలేసి,
ముఖాన ఇంత పెద్ద బండారు బొట్టు పెట్టుకొని ఏదో ఒక తాదాత్య్మం లో ఉన్నట్లు
కన్పిస్తారు. ఈ 16 – 17 శతాబ్దాల్లో జీవసమాధి లోకి వెళ్లే సంస్కృతి , సిద్ధయోగుల
ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కన్పిస్తోంది.
కటారు పల్లె లో వేమన, కందిమల్లయపల్లిలో శ్రీ బ్రహ్మం గారు, ఆయన శిష్యులు, మనవరాలు,
మంత్రాలయం లో శ్రీ రాఘవేంద్ర స్వామి ,
వీరందరు జీవసమాథి పొందినవారే కదా.!
శ్రీ బ్రహ్మం గారు తన ఇంటి ఆవరణ లో ఒక రాత్రి లో త్రవ్వినట్లు చెప్పబడుతున్న బావి
ఒక మహాయోగి, చారిత్రక వ్యక్తి, కాలజ్ఞానకర్త, సిధ్ధపురుషుడు,
సంఘసంస్కర్త అయిన
శ్రీ శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పవిత్ర సంచారం తో, పవిత్రబోధలతో ప్రసిద్దమైన ఈ
కందిమల్లయ పల్లి దర్శనం సర్వపాపహరణం
గా భక్తులు భావిస్తారు.
ప్రత్యేక
ఉత్సవాలు.;;--- ప్రతి మహా శివరాత్రి కి శ్రీ
వీరబ్రహ్మం గారి దంపతులకు రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. వైశాఖ శుద్ద దశమి రోజున జరిగే శ్రీ స్వామి వారి ఆరాథనోత్సవాలకు వేలాదిగా భక్తులు హాజరవుతారు.
మహా శివరాత్రి నాటి రథోత్సవ దృశ్యం
వసతి
సౌకర్యాలు:----- ఊరిలో అన్నదాన సత్రాలున్నాయి.
కాఫీ, టీ, భోజన హోటళ్లు విరివిగానే
ఉన్నాయి. భక్తులు విశాలమైన మఠం మండపాల్లోనే నిద్రలు చేస్తుంటారు.
*******************************************************************************************************************************************************************
No comments:
Post a Comment