శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం మల్లూరు. ఈ క్షేత్రం ములుగు జిల్లాలోని మంగంపేట మండలం మల్లూరు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరం లో ఉంది. గోదావరీ నదీ తీర ప్రాంతంలో ఏటూరు నాగారం - భద్రాచలం ప్రధాన రహదారి ని ఆనుకొని ఈ దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది . హేమాచలక్షేత్రం దివ్యక్షేత్రం మాత్రమే కాకుండా ప్రకృతి వైద్యానికి ,మూలికలకు కూడా ప్రసిద్ది. ఆ ప్రభావం కూడ ఈ హేమాచల నారసింహుడిదే.ఈ క్షేత్రమంతా అర్థచంద్రాకారంలో దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండటం ఒక ప్రత్యేకత.
భగవద్దర్శనం:- భగవంతుని లీలలు చిత్రాతిచిత్రంగా
ఉంటాయి.ఎక్కడైనా దేవాలయం లో ఉన్న స్వామి మూలవిరాట్టు మానవ శరీరం వలే మెత్తగా ఉండి
ఒత్తితే లోపలికి పోవడం విన్నామా.? ఎక్కఢైనా కన్నామా ? కాని
ఈ హేమాచల లక్ష్మీ నరసింహుని శరీరం సుతి మెత్తగా ఉండి పూవు పెట్టి అద్దితే ఆ పూవు శరీరం లోపలే నిలిచి ఉండటం వింత. అంతేకాదు
స్వామి విగ్రహం పది అడుగుల ఎత్తున మనిషి నిలబడినట్టే ఉండి భక్తులను మంత్రముగ్థులనులను చేస్తుంది.
స్వామి వస్త్రధారణ కూడ ప్రత్యేకంగా ఉంటుంది. మానవ శరీరం వలే శరీరం మెత్త గా ఉండటమే
కాక శరీరం మీద సింహానికి ఉన్నట్లు పొడవైన
రోమాలను మనం చూడవచ్చు. స్వామిని గుర్తించి ,గుహనుండి వెలుపలికి తవ్వి తీసేటప్పుడు
ఒక సైనికుని గునపం గుచ్చుకొని స్వామికి
నాభి వద్ద అయిన గాయం, దాని నుండి వచ్చే స్రావము , ఆ గాయానికి అర్చక స్వాములు అద్దే చందనాది లేపనాల మరకలు ఇప్పటికీ
థోవతికి అంటుకొని వింతశోభ ను కల్గిస్తాయి.
హేమాచల నారసింహుని దివ్యరూపము
స్వయంభువు డైన శ్రీ హేమాచల లక్ష్మీనరసింహుడు జేగురువర్ణ దేహకాంతి తో, నుదుటి మీద నాలుగు వేళ్ల మందాన తీర్చిదిద్దిన ఊర్ద్వపుండ్రాలతో,తీక్షణమైన చూపులతో, గంభీరమైన వదనం తో,విపుల వక్షస్థలం తో, నిండుగా ధరించిన పట్టువస్త్రం తో , పుష్పమాలాలంకృత శోభితుడై ఆరాధించేవారికి ఆనందాన్ని, కాదనేవారికి భయాన్నికల్గిస్తుంటాడు. స్వామి రూపు ఎంత భయంకరంగా ఉంటే కొలిచే భక్తులకు అంత సంతోషం గా ఉంటుంది.ఎద పులకించి ఆనందతాండవం చేస్తుంది.ఎందుకంటే ఇంతటి అపూర్వ పరాక్రమరూపుడు నాకు తోడుగా ఉన్నాడనేది భక్తుని ధైర్యం. అందుకే నృసింహావిర్బావ ఘట్టం లో ప్రహ్లాదుని ముఖం లో వెల్లి విరిసిన ఆనందాన్నిమనం ఆస్వాదించ గలిగితే మనం కూడ ఆ ఆనందాన్ని పంచుకోగలం.
స్వామి ఆవిర్భావం :-- ఆరవ శతాబ్దానికి
పూర్వమే ఈ క్షేత్రం ఉన్నట్టు చరిత్రకారులు
ఒప్పుకుంటున్నారు. శాతవాహన ప్రభువైన దిలీపకర్ణి మహారాజు కు స్వామివారు కలలో కన్పించి
గుహాంతర్భాగం లో తానున్నానని,
సేవించుకొమ్మని ఆదేశించారు. వెంటనే మహారాజు
75 వేలమంది సైన్యంతో బయలుధేరి, అక్కడకు చేరుకొని,గుహను తొలుస్తుండగా ఒక
సైనికుడు వేసిన గునపం స్వామివారి నాభి లో గుచ్చుకొని రక్తం చిందింది.
స్వామిని బాధించానని,ఆయనకు కోపమొస్తుందేమో నని భయపడిన మహారాజు స్వామిని పలువిధాలుగా వేడుకొని ,గాయానికి రాజవైద్యుల చేత వివిధ లేపనాలతో చికిత్స చేయించాడు. కాని భగవంతునకు గాయం అవ్వడమేంటి ?మనం మందు రాయడమేమిటి ? అదొకమాయ . అదో భ్రాంతి .అంతే. కాలం చాలా గడిచిపోయింది.కాని ఇప్పటికీ స్వామి వారి శరీరంలో గాయమైన నాభి ప్రదేశం నుంచి రక్తం వంటి ఎఱ్ఱని ద్రవం స్రవిస్తూ ,స్వామివారి థోవతి పై కూడ మరక లేర్పడటం మన చూడవచ్చు.. గాయం మానడానికా అన్నట్లు ప్రతిరోజూ అర్చకస్వాములు చందనాది లేపనాలను ఆ గాయానికి అద్దుతారు. దీన్నే” నాభి చందనం “గా పిలుస్తారు. దీన్ని ప్రసాదం గా సేవిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇదీ అసలు విషయం. అంటే భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడు గాయం చేసుకున్నాడన్నమాట. స్వామి వారికి ప్రతి శనివారం నువ్వులనూనె తో అభిషేకం చేస్తారు. స్వామివారి శరీరమంతా మెత్తగా ఉండటమే కాక శరీరమంతా సింహానికున్నట్లు రోమాలుండటం మరొక ప్రత్యేకత. స్వామి వారికి ఎడమవైపు మహాలక్ష్మీ మందిర
ముంది. 60 అడుగుల ధ్వజస్థంభము ఈ ఆలయ మరో ప్రత్యేకత.
ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయస్వామి ఉంటాడు. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి ,తూర్పు భాగాన కోనేరు ,మెట్ల మార్గం లో నవగ్రహమండపాన్ని చూడవచ్చు.
ఈ
ప్రాంగణంలోనే ఆంజనేయస్వామి ,మహాలక్ష్మీ ,గోదాదేవి మందిరాలు కన్పిస్తాయి . ఈ ఆలయానికి సుమారు రెండు కి.మీ దూరం లో
అతిపురాతనమైన శిఖాంజనేయస్వామి మందిరం ఉంది.
చింతామణి
జలపాతం:--- ఈ హేమాచల
క్షేతం లోని మరో ప్రత్యేకత చింతామణి జలపాతం.
దట్టమైన అడవుల్లో కొండపై నుంచి వస్తున్న జలధారను “
చింతామణి” జలపాతం గా పిలుస్తారు. కాకతీయరాణి రుద్రమదేవి ఈ
స్వామిని దర్శించుకోవడమే కాక ఈ జలపాతానికి
“చింతామణి”
అని నామకరణం చేసింది కూడా ఆమేనని
చరిత్రకారులు చెపుతున్నారు. విశాలమైన కొండపైని ఓషథీ వృక్షాల మీదుగా
ప్రవహించడం మూలంగా ఔషధవిలువల గల ఈ నీరు
సమస్త వ్యాధులను నివారిస్తుందని,సర్వరోగనివారిణి
అని,
చర్మరోగాలు తగ్గుతాయనీ ,ప్రజలు గాఢంగా
నమ్ముతారు. గంగాజలం వలే పవిత్రమైనవని ఎంతకాలం ఉన్నా పాడవ్వవని వచ్చిన
భక్తులందరూ పెద్ద పెద్ద డ్రమ్ములతో నీటిని పట్టుకెళ్ళడం మేము చూశాము.
మేము కూడా ఐదు లీటరు
బాటిల్ తో తెచ్చి,మితృలకు పంచి, కాశీ తీర్థం లాగ శివాభిషేకానికి ఆ నీళ్ళుఅయిపోయే వరకు సుమారు సంవత్శరకాలం వాడుకున్నాము. ఆ చింతామణి
జలధార గొప్పతనం అది. అక్కధార,చెల్లిధార
అని రెండు పెద్ద చిన్న జలపాతాలు దగ్గర దగ్గరగా జాలువారుతుంటాయి. కొంచెం వానలు
తక్కువగా ఉంటే చిన్నజలపాతం లో ప్రవాహం సన్నపడుతుంది. కాని అక్కధార జలపాతం
మాత్రం అన్ని ఋతువు ల్లోను నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటుంది.ఈ చింతామణి
జలపాతానికి సమీపంలోనే మహాలక్ష్మీ దేవి
పురాతన మందిరం చూడవచ్చు.
చారిత్రక నేపథ్యం :----
కాకతీయ రాజుల ఏలుబడి లోనే ఈ హేమాచల క్షేత్రమున్నట్లు ,ఈ పర్వతం ఫైన
గోనగన్నారెడ్డి నేతృత్వంలో సైనికస్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు కన్పిస్తాయి. కాకతీయులు గుట్టశిఖరం ఫైన కోనేరు,అర్థమండపం,
గుర్రపు శాలలు , రాక్షసగుహలు నిర్మించి
శతృరాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడే వ్యూహరచన చెసేవారని, యుద్ధకాలం లో
రాణీ రుద్రమదేవి కూడ రక్షణ కోసం ప్రధానాధికారులతో సహా ఈ కోటలోనే విడిది చేసేవారని చెపుతారు. గోదావరికి
కేవలం కోసుపెట్టు దూరంలో ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి ఆవలి వైపునుండి
కాకతీయరాజ్యం వైపు దూసుకొచ్చే శతృసైన్యాలను గుర్తించడానికి దర్పణం ద్వారా
వీక్షించే వారని చెపుతారు.
కాకతీయుల పాలన
అంతమైన తర్వాత తురుష్కుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17 వ శతాబ్దం లో
గజనీమహమ్మద్ ఈ ఆలయం మీదకు వచ్చాడనీ చరిత్రకారులు చెపుతున్నారు. వేయిస్థంభాలగుడి , రామప్పగుడి,కోటగుళ్ల
మొదలైన దేవాలయాలను ధ్వంసం చేసిన మహ్మద్ సైన్యం హేమాచలక్షేత్రాన్ని తాకలేదు సరిగదా
పైగా ఆలయానికి బంగారు బిస్కట్లను కానుకగా ఇచ్చినట్లు చెపుతున్నారు. ఎందుకంటే ముస్లిం లు పవిత్రం గా భావించే
అర్థచంద్ర నెలవంక ను ఈ క్షేత్రం పోలి
ఉండటమే అందుకు కారణమట.
ఈ విధంగా మనం
ఎన్నిచెప్పుకున్నా ఆథారంగా ఏ ఒక్క శాసనం ఇక్కడ కన్పించడం లేదు. కొండఫైన
దుర్గమారణ్యం లో ఇంకా వెదకవలసి ఉందేమో.?
స్వామి దివ్యదర్శనం
ఈ ఆలయాన్ని ప్రతిరోజు సాయంత్ర ఐదు గంటల తరువాత మూసివేస్తారు. దర్శనాలు ఉండవు. కొండమీద ఎవ్వరూ ఉండ కుండ అందరూ కిందకి వచ్చేస్తారట. అందమైన ప్రకృతి ఆహ్వానిస్తున్నా అటవీ ప్రాంతమవడం , జనావాసాలకు దూరంగా ఉండటం మూలంగా అభివృద్ధి కొంచెం ఆలస్యమౌతోంది. కొండ దిగువ వరకు తారురోడ్డు ఉంది.ఫైకి స్వామిని చేరుకోవడానికి డెభై మెట్లు ఎక్కితే సరిపోతుంది. సాధారణ రోజుల్లో టీ,టిఫిన్లు దొరక్కపోవచ్చు...
అన్నదానం :-- శ్రీ స్వామి కి నివేదన అనంతరం మధ్యాహ్నసమయంలో
పరిమిత సంఖ్య లో అన్నదానం జరుగుతుంది. తప్పని సరిగా దర్శించవలసిన దివ్యక్షేత్రం ఈ
హేమాచల నారసింహక్షేత్రం.














No comments:
Post a Comment