Sunday, 23 November 2025

గుడిమెట్ట కాండ్రపాడు - పంచముఖేశ్వర ఆలయం.

                                       ఉమ్మడి కృష్ణాజిల్లా నందిగామ మండలం లోని కాండ్రపాడు అనే గ్రామం చారిత్రక ప్రాథాన్యం గల గుడిమెట్ట రాజ్యానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. నందిగామ కు10 కిలోమీటర్ల దూరం గా ఉన్న కోనాయపాలెం కు సమీపగ్రామం ఇది. 



                         
మూలవిరాట్టు పంచముఖేశ్వరుడు

మన జీవన గమనం లో కలిసి పోయి,నూతనత్వాన్ని ఆవిష్కరించిన ప్రాచీనసంస్కృతుల ప్రభావానికి ప్రత్యక్షనిదర్శనం ఈ కాండ్రపాడు గ్రామం లో లభించిన పంచముఖ శివలింగం.నాలుగున్నర అడుగుల ఎత్తు , మూడున్నర అడుగుల చుట్టుకొలత కల్గి లింగం పైన పైనుండి ఒక అడుగు దిగువగా లింగం చుట్టూ ఐదు మానవముఖాలు ఉండటం ఈ లింగం ప్రత్యేకత . ఆ ముఖాలు కూడా వేరు వేరు పోలికలతో ఒక ముఖానికి మరో ముఖానికి పోలికే ఉండక పోవడం మరొక ప్రత్యేకత. పంచముఖశివలింగం అంటే ఐదుముఖాలు గల్గిన శివలింగం కాదు..శివలింగం మీద ఐదు ముఖాలు కలిగి ఉండటమన్నమాట . ఇది అత్యంత అరుదైన విషయం..
శ్రీ పంచముఖేశ్వరస్వామి
                                                 మనం ఇంతకు ముందు గుడిమల్లం శివలింగం మీద మానవాకృతిని గూర్చి చెప్పుకున్నాం. ఇప్పుడు గుడిమెట్ట శివలింగం మీద ఐదు మానవ ముఖాలను మనం దర్శిస్తున్నాము. లోలోతుల్లోకి వెళ్లి ఆలోచిస్తే..... అసలు శివలింగం మీద ముఖాలు ఉండటమనేది ఎక్కడా లేనిది.చూడనిది కూడా. ఆలోచిస్తే తదనంతర కాలంలో కృష్ణదేవరాయల వంటి సార్వభౌములు తాము ఓడించిన రాజుల బొమ్మలను గండపెండరములపై వేయించుకొని కాలికి ధరించడం అనే సంప్రదాయం ఉన్నట్లే , మన ఇష్టదైవం ఉన్న లాకెట్ మనం హారానికి బిగించి మెడలో వేసుకున్నట్లు గానే ఈ పంచముఖేశ్వరుని తమ కులదైవంగా ఆరాధించిన ఈ త్యాగిరాజులు తమ,తమతండ్రులు,తాతలు పరమేశ్వరుని చెంతనే ఉన్నారనే పరిపూర్ణానుభూతి చెందడానికి ఇలా తమ,తమ వారి ముఖ చిత్రాలను శివలింగంమీద చెక్కించారేమో ? ఈ సంప్రదాయం ఎక్కడన్నా ఉన్నదా అనే దాన్ని పరిశోథించాలి. ఎందుకంటే మరెక్కడా ఇటువంటి శివలింగం లభించలేదు కాబట్టి. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే .అదే నిజమైతే ఈ లింగం యొక్క కాలనిర్ణయం కూడా ఇంకా ప్రాచీనత ను పొంది 5,6 శతాబ్దాలకో వెళ్ళే అవకాశం ఉంది.
 
                              
                                                గుడిమల్లం శ్రీపరశురామేశ్వరస్వామి
                                     
                           ఇక్కడ మనం మర్చిపోకూడని మరోవిషయం పంచముఖేశ్వరుని శివలింగం మీద కన్పిస్తున్న ఐదు ముఖాలు ఒకే రకంగా లేకపోవడమే కాదు వాళ్ళందరి ముఖాల మీద కుంకుమ బొట్లు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఒకముఖం మీద అయితే అడ్డబొట్టు(విభూతి) మీద పెట్టిన కుంకుమబొట్టును కూడ గమనించవచ్చు. మరొక ముఖ్యవిషయం ఏమిటంటే అందరి తలల మీద పట్టు టోపీలు ,వాటికి చెవుల వరకు వ్రేలాడు కుచ్చీలను కూడ గమనించవచ్చు. ఇవి ఆధునిక కాలం లో మైసూరు,పూరీ మహారాజులు దైవకార్యాలలో పాల్గొనే పవిత్రసమయం లో ధరించే పట్టు ఉష్ణీషాలను గుర్తు చేస్తున్నాయి.
                                       చారిత్రక నేపథ్యం - ఆనాడు ...... అంటే షుమారు ఎనబై,తొంభై సంవత్సరాలకు పూర్వం కాండ్రపాడు గ్రామంలో పాటిమన్నుతవ్వుతుంటే ఈ పంచముఖేశ్వర శివలింగం బయటపడిందని వృద్ధులైన గ్రామస్థులు చెపుతుంటారు. ఊరునిండ పాటిదిబ్బలే. చుట్టుప్రక్కల నాలుగైదు గ్రామాల వారు పాటిమన్ను ను ఈ ప్రాంతం నుండే త్రవ్వుకెడుతుండేవారు. పాటిమన్ను దిబ్బలను ఇంటి నిర్మాణ అవసరాలకు తవ్వుకుంటూ ఉండటం ,వాటిలో వారి అదృష్టాన్నిబట్టి ఏవేవో దొరుకుతూ ఉండటం పల్లెల్లో పరిపాటి. అటువంటి సమయంలో రకరకాల నాణాలు, వెండివస్తువులు, దీపపుసెమ్మెలు, గింజలపాతర్లు ,కుండపెంకులు మొదలైన ఫ్రాచీన అవశేషాలు లభిస్తుండేవని ఇక్కడి ప్రజలు చెపుతారు.
                          కాని ఈ ప్రాంత ప్రజల అదృష్టమేంటంటే. పంచముఖ శివలింగం వీరికి దొరికింది.ఈ అపురూప శివలింగం బయల్పడిన ప్రదేశంలోనే మరికొంత తవ్విచూడగా మరి నాలుగు చిన్నశివలింగాలు,ఒక చతురస్రపు రాతి ఫలకం,ముగురక్కల శిల్పం మరికొన్ని చిన్నచిన్నశిల్పాలు లభించాయి. అయితే ప్రధాన శివలింగానికి పానమట్టం లేదు కాని చుట్టు లభించిన చిన్నలింగాలకు మాత్రం పానమట్టాలు ఉన్నాయి. దొరికిన చతురస్రాకారపు రాతి ఫలకం మీద నాలుగు మూలల నాలుగు,మథ్యలో ఒకటి మొత్తం ఐదు వృత్తాకారాలు చెక్కబడి ఉన్నాయి. దానికి అటు ఇటు రెండు పూర్ణకుంభాలు , మరి రెండు దిక్కులలొఒక వైపు మీనముల జంట, రెండవ వైపు శంఖము చెక్కబడిఉన్నాయి. పూర్ణ కలశం అమరావతీస్థూపం లోని కలశాన్ని పోలి ఉంది.ఇది దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన సమయం లో వాడే యంత్రం గా ఉంచబడిందా అనే సందేహం కలుగుతోంది. రెండు మీనములు, శంఖము . పూర్ణకలశం మొదలైనవి ఉన్నది “శాంతి యంత్ర” మని, “మత్స్యయంత్ర” మని కూడ పిలుస్తుంటారు.
          
      చతురస్రాకారపు ఫలకం మీద  ఐదు వృత్తాలు,మీనముల జంట,అమరావతీ కలశము,శంఖము చూడవచ్చు. 
               
                         ప్రధాన లింగానికి పానమట్టం లేకపోవడం తో గ్రామస్తులు స్థానికంగా దొరికే ఒక రాయిని పానమట్టం గా చేయించి,లింగాన్ని దానిలో దిగేసి, చుట్టూ నాలుగు లింగాలను ఉంచి , యంత్రమేమో నని మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఫలకాన్ని కూడ అ ప్రధాన లింగం ప్రక్కనే ఉంచి పూజా పునస్కారాలను జరిపించేవారు. షట్కోణాకృతిలో గుడిని నిర్మించి , ఆ గుడికి పడమర వైపు రెండు కిటికీలను బిగించడం వలన స్వామి వారి పైనున్నఐదుముఖాలను దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం ఉండేది. కాలం తో పాటు ఆలయం రూపురేఖలు కూడ మారాయి . మనం పైన చెప్పుకున్న ఆలయ వృత్తాంతం సుమారు ఇరవై ముప్పై సంవత్సరాలకు పూర్వపుది. అనంతరం “నీ చెంతకు నీవే రప్పించుకో ఆపదమొక్కులు మాతో ఇప్పించుకో” అని కదా భక్తుని సంప్రార్ధన. ఈ ప్రాంత ప్రజల ప్రార్థన ఫలించింది.
                                         శ్రీ పంచముఖేశ్వరుని దివ్యరూపము

                అందుకే పంచముఖేశ్వరుడు భక్తులను అనుగ్రహించాడు . ఒక దివ్య భవ్యమైన సుందర ఆలయాన్నినిర్మింప చేసుకున్నాడు .భక్తులు నడుంకట్టారు. దాతలు ముందుకొచ్చారు. ఇప్పుడు మన కనులముందు అద్భుతమైన ఆలయం భాసిల్లుతోంది. ఆనాడు షట్కోణాకృతి గదిలో పంచముఖేశ్వరుని చూసిన మావంటి వారికి పరమాశ్చర్యము, అపరిమితానందము కలిగేటట్లుగా ఆలయనిర్మాణము,పూజాకైంకర్యాలు జరుగుతున్నాయి. సంతోషం.

                                                  ఆలయదర్శనం

సాంఘీక రాజకీయ నేపథ్యం -. గతం మర్చిపోతే భవిష్యత్తు చిన్నబోతుంది. అందుకే ఈ ఆలయ చరిత్ర తో పాటు ఈ ఆలయానికి ముడివడియున్ననాటి సాంఘీక,రాజకీయ చారిత్రక నేపథ్యాన్ని కూడ ఒక్కసారి పరిశీలిస్తే పంచముఖేశ్వరుని ప్రాశస్త్యం మరింత ఇనుమడిస్తుంది. ఈ శివలింగాన్నిచూడగానే మనకు జైనశిల్పం గుర్తుకొస్తుంది.. లింగానికి చుట్టూ ఉన్న ఐదు ముఖాలతో పాటు ముందు భాగం లో పొడవైన కత్తిమొన వంటి గుర్తు కూడ మనకు కన్పిస్తోంది.అంతేకాదు పాడు అనే పేరు జైనగ్రామాలకు చివర ఉంటుందని పరిశోధకుల తీర్మానం . ఈ ప్రాంతం లో ఉన్నగ్రామాల పేర్లు కాండ్రపాడు,లింగాలపాడు ,తక్కెళ్ళపాడు, బొబ్బిళ్ళపాడు,చింతలపాడు,చందర్లపాడు,అనిగండ్లపాడు ముండ్లపాడు , మొదలైనవే. ఇవి ఈ ప్రాంతం లోని జైన మతప్రాబల్యాన్ని గుర్తుచేస్తున్నాయి.
                                                   శ్రీ రాజరాజేశ్వరీ దివ్యదర్శనం
                 
       అంతేకాకుండా బౌద్దమత ప్రభావం కూడా ఈ ప్రాంతంలో ప్రముఖంగా ఉందనడానికి మునగచర్ల,రామిరెడ్డిపల్లి ,జగ్గయ్యపేట గ్రామాలయందలి చరిత్ర ప్రసిద్ది కెక్కిన బౌద్దస్థూపాలే ఇందుకు తార్కాణాలు. ఈ కాండ్రపాడు కు దగ్గర లోని గుడిమెట్ట ను చాగి వంశపురాజులు పాలించినట్లు క్రీ.శ 1155 నాటి గుడిమెట్ట శాసనాల మూలంగా తెలుస్తోంది. ఈ ప్రాంతాన్నికాకతీయ,రెడ్డిరాజులు సైతం పాలించినట్లు శాసనాథారాలు లభిస్తున్నాయి.
                                               ఆలయదృశ్యం

తిట్టుకవి గా పేరుపొందిన వేములవాడ భీమకవి పద్యం – అప్పకవి తన అప్పకవీయంలో ఉదాహరించిన “ హయమది సీత,పోతవసుధాధిపుడారయ రావణుండు “, అను పద్యం లోని “గుడిమెట్ట లంక” అన్నపదం లోని “గుడిమెట్ట”ఇదే నని , అ పోతవసుధాధిపుడు త్యాగి పోతరాజే నని సుప్రసిద్ధ పరిశోధకులు ఆరుద్ర అంగీకరించగా , ఆ చాగి పోతరాజు ఈ పంచముఖేశ్వరుని ప్రతిరోజు పూజించుకొని వెడుతుండేవాడని, తిట్టుకవి భీమన చెప్పిన పద్యం లోని శాపం తగిలి, ఈ రెండు గ్రామాలకు మథ్య నున్న వాగు వద్ద గుఱ్ఱంపై వెడుతుండగా శత్రువులు చేసిన దాడి లో మరణించాడని ఈ ప్రాంతంలోని వృద్ధులు అనూచానంగా వస్తున్న ఈ కథను తమ తరువాత తరానికి చెపుతుంటారు. ఈ కథ మాత్రం ఈ ప్రాంతం లో బాగా ప్రసిద్ది ని పొందింది. వేములవాడ భీమకవి కాలం కూడ క్రీ.శ1150-70 ప్రాంతమని పరిశోధకులు అంగీకరిస్తూ ఉండటం తో ఈ వాదన లో కొంత సత్యం కూడ మనకు కన్పిస్తోంది.
 

                                                                      సంజె వెలుగులో ఆలయ శోభ

ముఖ్యంగా త్యాగి వారు, కాకతీయ, రెడ్డిరాజులు సైతం శైవమతాన్ని ఎక్కువగా ఆదరించినవారే కనుక ఈ పంచముఖేశ్వరుని చరిత్ర కూడ చాల పురాతనమైందిగానే కన్పిస్తోంది. జైన,బౌద్ధ,శైవ సంస్కృతుల సమ్మేళన శిల్పమే ఈ పంచముఖేశ్వరునిలో ద్యోతకమౌతోంది. తప్పని సరిగా దర్శించవలసిన దివ్యక్షేత్రం ఈ పంచముఖేశ్వర క్షేత్రం. ---------------------------------------------------------------------------------------------------