Kongara Mallayya Gattu –Sarvai Papadu
కొంగర
మల్లయ్య గట్టు - సర్వాయి పాపడు
విజయవాడ –హైదరాబాద్ జాతీయరహదారి పై విజయవాడ నుండి హైదరాబాద్
కు వెళ్లే మార్గం లో చిల్లకల్లు వద్ద
నున్న గట్టు భీమవరం” టోల్గేట్ “వద్ద ఆగి ఎడమవైపుకు
ఒక్కసారి చూస్తే -- అతి ఎత్తైన కొండ. దాని
మీద ఒక పెద్ద టవరు , దాని ప్రక్కనే ఒక చిన్నగుడి మనకు కన్పిస్తాయి . సుమారు
రెండు,మూడు కిలోమీటర్ల దూరం నుండే ఈ కొండ,
దీనిమీదనున్న టవరు, గుడి అటుగా వెళ్లే ప్రతి ప్రయాణీకుని చూపును ఆకర్షిస్తాయి. దీన్నే” కొంగర మల్లయ్య గట్టు “అని ప్రజలు వ్యవహారం లో పిల్చుకుంటారు.
ఆలయశిఖరం
కాని దీనిపై నున్న స్వామి అసలు
పేరు కోనగిరి మల్లేశ్వరస్వామి. “ గిరి యొక్క కొన పై నున్న మల్లన్న”
కాలక్రమేణ కొనగిరిమల్లన్న > కొంగర మల్లన్న గా మారిపోయింది. ఇది అతి ప్రాచీన ఆలయమని ఆలయం లోని స్వామిని, నందీశ్వరుణ్ణి దర్శిస్తే
మనకు అర్థమౌతుంది.
లింగ దర్శనం :: --
ఇక్కడ గుడిలో పానమట్టం మీద
అడుగున్నర ఎత్తు లో ధవళ కాంతులీనుతూ,వింత శోభతో శివలింగం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయనకు ఎదురుగా అంత్రాలయం లో నందీశ్వరుడు కొలువు
దీరి ఉంటాడు. ముఖమండపం అతి చిన్నది గా ఉండి,పదిమంది భక్తులు
కూర్చోవడానికి మాత్రమే సరి పోతుంది. సుమారు పన్నెండు నుండి పదిహేనువందల అడుగుల ఎత్తు లో కొలువుతీరిన ఈ స్వామికి నిత్యార్చన, ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేటట్లు భక్తులు ఏర్పాటు చేసుకున్నారంటే
నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. మేము
సాయంత్రం 5.20 కి వెళ్లే సరికే స్వామి
వారి సన్నిథిలో దీపం వెలుగు తోందంటే ఆలయ నిర్వహణ ఎంత సక్రమంగా ఉందో మనకర్థమౌతుంది.
శ్రీ మల్లన్న స్వామి దివ్యలింగం
ప్రత్యేక ఉత్సవాలు.::---- ప్రతి మహా శివరాత్రి కి ఈ స్వామికి జరిగే
ఉత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ట్రాక్టర్లు.కార్లు వేసుకొని ,మెట్ల మార్గం లో నడుచుకుంటూ వేలాది మంది
భక్తులు హాజరవుతారు .
నందీశ్వరుడు
రవాణా
సౌకర్యాలు.:::------ కొండ మీదకు చేరు కోవడానికి అతి
పురాతనమైన రాతి కట్టుబడి గల మెట్ల మార్గం
ఉంది. ఘాటురోడ్డు ను ఈ మధ్యనే కచ్చా పచ్చా గా వేశారు. రెండు,నాలుగు చక్రాల
వాహన గమనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉత్సవ సమయాల్లో మంచినీటి
సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. కాని మామూలు
రోజుల్లో మంచినీరు వెంట తీసుకెళ్లాలి. కొండ పైన బ్రిటీషు కాలంలో కట్టినవి గా రెండు, మూడు భవనాలు శిథిలావస్థలో కన్పిస్తాయి.
ఆలయ ముఖమండపం
చారిత్రక ప్రాథాన్యం :--- ఈ
కొంగర మల్లయ్య గట్టు కు మరొక చారిత్రక
ప్రాశస్త్యం ఉంది. అదే బందిపోటు దొంగ గా,దోపిడీముఠా నాయకుడు గా, ఆంగ్లేయుల చేత
చిత్రీకరించబడిన వాడు, జానపద కథానాయకుడు గా, తెలుగువీరుడు గా, ఏడు ఘడియల పాటు
గోల్కొండ ను ఏలినవాడు గా జానపద
గేయాల్లో కీర్తించబడిన సర్వాయి పాపడు తన కార్యకలాపాలను ఈ కొండ మీద నుండే విస్తరింప
చేశాడనేది చరిత్ర చెపుతున్న సత్యం.
కొండ పై నుండి విజయవాడ-హైదరాబద్ జాతీయరహదారి దృశ్యం
సర్వాయి పాపడు ::--- సర్వా (యి) పాపడు నందిగామ సమీపం లోని ఒక చిన్నగ్రామంలో నివసిస్తుండేవాడు. ( This man ,an obscure villager of the toddy-drawer’s caste who lived near
Nandigama, -Kistna District Manual, p.40) కల్లుగీత వృత్తిగా ఉన్న కుటుంబం వీరిది, తల్లి పేరు సర్వమ్మ.
కులవృత్తి చేయమని తల్లి ఇతన్ని వేడుకొనేది. కాని పాపనికి ఆ మాటలు రుచించేవి
కాదు.
“ ఇంటి ఆవుల
మేపమంటాది సర్వమ్మతల్లి
ఈత చెట్టు గీయమంటాది సర్వమ్మతల్లి
తాటికల్లే కట్టమంటాది,అంచకల్లే
కట్టమంటాది”
అందుకే తల్లి
మాటను పెడచెవిని పెట్టాడు పాపడు. పాళెగాడనిపించుకోవాలని పాపని చిర కాల కోరిక. ఒక పర్యాయం సర్వాయి పాపడు ఆవులు
కాయడానికి వెళ్లి అడవిలో నిద్రపోతుంటే, “పన్నెండు శిరసుల
నాగసర్పం పడగ లెత్తి గొడుగు పట్టిందట”. రామేశ్వరం పోయే
బ్రాహ్మణులది చూచి, గోలుకొండ ఏలడానికి,యేడు గడియలు యేలడానికి పాపనికి పంతముందని
చెప్పారట. అప్పటి నుండి సర్వాయి పాపడు డబ్బు సంపాదనే ధ్యేయం గా పని చేయసాగాడు.
లండన్ విక్టోరియా మ్యూజియం లోని సర్వాయి పాపని చిత్రం.
(తె.జా.గేయసాహిత్యము. పు.249)
తల్లిని,
వెధవరాలైన అక్కను హింసించి వారు దాచుకున్న సొమ్మును తీసుకు పోయి దండును ఏర్పాటు
చేశాడు. మొదట తన మిత్రులను, బంధువులను
కలుపుకొని దారి దోపిడీలు ప్రారంభించాడు. అలా దోచిన సొమ్ముతో ఒక ముఠాను తయారు
చేసుకున్నాడు. కర్ణాటక తుపాకులను (Matchlocks)
సమకూర్చుకొని తన
పరిథిని నల్లగొండ వరకు విస్తరించాడు. తరువాత అతని ప్రయత్నం ఒక బలమైన కోటను నిర్మించి హైదరాబాదు నుండి కోస్తా ,ఉత్తరసర్కారులకు రాకపోకలను నియంత్రించి, రుసుము వసూలు చేయడం ప్రారంభించాడు.
ఇదే సమయం లో కొండపల్లి పరిథి
లోని కొందరు జమీందార్లు ఆనాటి
మహమ్మదీయరాజ్యానికి కట్టవలసిన చెల్లింపులను
మాని వేసి స్వతంత్రతను ప్రకటించుకున్నారు.
వీరిలో కొంతమందికి సర్వాయి పాపడు అండగా ఉన్నాడు. ఈ ఆగడాలన్నింటిని గమనించిన వైశ్రాయి మోబ్రిజ్ ఖాన్ వీటిని అణచివేసే ఉద్దేశ్యంతో తనకు తానుగా ఢిల్లీనుంచి హైదరాబాదు వచ్చి, పరిస్థితిని చక్క బెట్టాడు. సర్వాయి
పాపని మీదకు సైన్యాన్ని పంపించాడు . ఎదురు కాల్పుల్లో అబిద్ ఖాన్ అనే సిర్దార్
చేతిలో సర్వాయి పాపడు మరణించాడు. అతని
తోపాటే మరికొంతమంది తిరుగు బాటు జమీందార్లను కూడ తుద ముట్టించి రక్తపాతం
సృష్టించిన మోబిజ్ ఖాన్ సైన్యం హైదరాబాదు
రహదారిని పునరుద్ధరించి రాకపోకలకు సిద్ధం చేసింది. (కృష్ణా . మా. -40 వపేజి ). ఇది కొంగర మల్లయ్య గట్టు
చరిత్ర.
కొండ పై నున్న పురాతన కట్టడాలు
ఇదంతా క్రీ.శ 1723-24 మధ్యకాలంలో
జరిగినట్లుగా చరిత్ర వ్రాస్తోంది. ఇది
సరిగ్గా ఔరంగజేబు కుమారుడు కాంబక్షు రాజ్యాధికారాన్ని పొందిన కాలమని
చరిత్రకారులు భావిస్తున్నారు. “సామ్రాజ్యాధికారముల మార్పు కాలమున అల్లరులు లేపినట్టి పాపడు మరియు
ఇతర విద్రోహుల నరికట్టుటకై, హైదరాబాదును, పరిసరప్రాంతాలను పటిష్టము,మరియు
సర్వసౌకర్య యుతముగా నొనర్చి, హైదరాబాదు రక్షణ కై యూసుఫ్ ఖాన్ ను నిలిపి, అతని
కట్టివారి నణచుటకై నొక్కి చెప్పి షాహఆలం
ఢిల్లీకి వెడలి పోయెను” అని వ్రాసిన ఒక చరిత్ర కారుని మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి.( తె.జా. గేయసాహిత్యము, శ్రీ.బి
రామరాజు ,పు.250)
స్వామివారి ఆలయ దృశ్యం
కాని జానపదులు మాత్రం సర్వాయి పాపని గొప్పధైర్య శాలి గా , పట్టుదలకు
ప్రతిరూపమైన వ్యక్తి గా,ఒక తెలుగు వీరుని గా
కీర్తించారు. ఈ సర్వాయి పాపని పేరు
చేపితే ......
“ ఊర పిచ్చుక ఊరు చేరదు
పొట్టి పిచ్చుక పొలము చేరదు
కౌజులు కారాడుతుండు
నక్కలు నాట్యము దొక్కును
పందికొక్కు డోలు కొడ్తాదో
వాడేటంటే
దొంతి కుండలు గంతు లేస్తాయి “
పసిబిడ్డలు పాలు
తాగారూ
ఇలా సర్వాయి పాపని పరాక్రమాన్ని తనవితీర వర్ణించుకున్నారు. పన్నెండువేల
దండు రాణువను సిద్ధం చేసుకొని గోల్కొండ నవాబు పై దండు వెడలాడు పాపడు. ఏడు గడియల
పాటు యుద్ధం జరిగింది. పాపనికి తాత్కాలిక విజయాన్నిచ్చిన నవాబు సర్వాయి పాపని గద్దె నెక్కించాడు. అనంతరం దొంగ
దెబ్బ తీశాడు ఆ నవాబు. జానపదుల దృష్టిలో ఆ
నవాబు చేతిలో మరణించడానికి ఇష్టపడని అభిమానధనుడు
మన సర్వాయి పాపడు. అందుకే బాకు పైకి విసిరేసి రొమ్ము ఒగ్గి నిలిచాడట.
“ గరగరమంటా బాకు డిగ్గినాది,
రామా రామా అంటా ప్రాణమిడిచాడు.”
అంటూ ఒక అభిమాన
వంతుడైన మహా వీరునిగా కీర్తించారు
జానపదులు.
కొండ పైనుండి జాతీయరహదారి మనోహర దృశ్యం
కాని ఈ ప్రాంతం లో మాత్రం సర్వాయి పాపని గూర్చి ఒక కథ బహుళ ప్రచారం లో ఉంది. అది కొంగరమల్లయ్య గట్టుమీద మహమ్మదీయ సైన్యం జరిపిన
దాడి లో పాపని రెండు కాళ్లు పోయాయట. కాని
ఆ విషయం తెలియనివ్వకుండా సర్వాయి పాపడు
కొంగరమల్లయ్య గట్టు మీద చాలకాలం ఒక బండ చాటున కూర్చొని వచ్చేపోయే వాళ్లని తుపాకీ తో బెదిరించి వసూళ్ల కు పాల్పడేవాడట. ఎవరైనా ఇవ్వక పోతే ” నేను లేస్తే మనిషిని కాదని” బెదిరించేవాడట. అయితే కొంతకాలానికి అసలు విషయం బైటపడటం తో పాపం (?) పాపడు ఈ ప్రాంతం వదిలి పెట్టి వెళ్లి పోయాడని చెప్పుకుంటారు.
ఇది
సర్వాయిపాపడికి – కొంగర మల్లయ్య గట్టు కు ఉన్న సంబంధం. దీన్నే “ తీగ లాగితే డొంక కదలడం” అంటారేమో. ఈ ఒక ఆంగ్ల అథికారి సామర్లకోట నుండి హైదరాబాద్ వరకు పల్లకీలో తన ప్రయాణాన్ని గురించి
వ్రాస్తూ “The road passes Kongara malla, a locality which
long bore a bad reputation a the resort of
highway robbers” “(K.D.M. p.261 ) అంటూ” కొంగరమల్ల “ను ప్రస్తావించాడు.
అయితే ఇప్పటికీ ఈ ప్రాంతం లో కొంతమంది “బందిపోటు దొంగ” పేరే “కొంగర మల్లన్న “అని , అతని పేరు మీదే ఈ గట్టు” కొంగరమల్లయ్య
గట్టు “గా పిలవబడుతోందని చెప్పుకొనేవారున్నారు. ఇది కొస
మెరుపు .
******************************************************************* ************** ************ *********************************************************************