Monday, 26 November 2012

ఘంటశాల జలథీశ్వరస్వామి


                        ఘంటశాల     జలథీశ్వరస్వామి
           
               

                కృష్ణాతీరం లో వెలసిన  తీర్దక్షేత్రాల్లో ఘంటశాల ఒకటి.ఆంద్రదేశం లోనే కాకుండా భారతదేశం లోనే ఎక్కడా లేని విధంగా  శివపార్వతులిద్దరూ ఒకే పానమట్టం పై దర్శనమిచ్చే ఏకైక క్షేత్ర మిది. జలథీశ్వరస్వామి గా స్వామి సేవలందుకుంటుంటే, బాలపార్వతి గా అమ్మవారు భక్తులను తన కరుణాకటాక్ష వీక్షణాలతో కాపాడుతూ వస్తోంది . ఇది తరతరాలనాటి మాట.


                     
                    బాలపార్వతీ  సమేత  జలథీశ్వర స్వామి వారి దివ్యదర్శనం

                       ఎందుకంటే ఈ ఆలయం రెండవశతాబ్ది కంటే పూర్వపు దని చరిత్రకారులు శాసనాద్యాధారాతో నిర్ధారించారు. ఒకే పీఠం మీద ఆదిదంపతులు కొలువు తీరిన రమణీయ దృశ్యం భక్తులను పరవశులను చేస్తుంది.పెద్దముతైదువ పెనిమిటి తో కలసి ఏకపీఠం మీద దర్సనమివ్వడం  అపురూప దృశ్యం కదా. ఇటువంటి మూలవిరాట్ సందర్శనం సకలశుభాలను, సుఖాలను,సంపదలను , కీర్తిప్రతిష్టలను కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

                       ఆలయముఖమండపం
        స్థలపురాణం:------.           హిమవంతుని కుమార్తె గా జన్మించిన పార్వతీదేవి పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి, శంకరుని మెప్పించింది. సప్తఋషులు పెళ్లి పెద్దలుగా వెళ్లి   వివాహాన్ని నిశ్చయం చేశారు. కమనీయమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుకను కనులారా గాంచడానికి సమస్త ప్రాణికోటి  ఉత్తరాపథానికి బయలుదేరింది.  జీవకోటి భారంతో  ఉత్తరాపథం కృంగి పోయే ప్రమాదం సంభవించింది.

           
                          అగస్త్యుడు ప్రతిష్ట చేస్తున్న  ఊహా చిత్రం

                 ఆ సమయంలో పరమేశ్వరుడు స్వయంగా అగస్త్యమహర్షిని పిలిపించి, తక్షణమే దక్షిణాపథానికి వెళ్లి ఒక పవిత్ర ప్రదేశంలో శివపార్వతులను ప్రతిష్ఠించి, పూజలు జరిపితే  తమ కల్యాణం చూచిన ఫలం లభిస్తుందని, వెంటనే ఆ పని చేయవలసిందని ఆజ్ఞాపించాడు. మహేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి, మహా తప స్సంపన్నుడైన అగస్త్యుడు దక్షిణాపథానికి విచ్చేసి, ఘంటసాల ను పవిత్ర ప్రదేశంగా ఎన్నుకొని పానమట్టంమిద శివపార్వతులను ప్రతిష్ఠించి, ఏకాగ్రతతో పూజాదికాలు నిర్వహించి శ్రీస్వామివారి  సాక్షాత్ కళ్యాణమహోత్సవసందర్శన భాగ్యాన్ని పొందాడు. ఆనాటి నుండి దక్షిణకైలాసం గా  ఈ క్షేత్రం విరాజిల్లుతోంది.

            
                                కళామండపం            

        అప్పటికి ఈ గ్రామం  సముద్రం,  కృష్ణానది కలిసే నదీ ముఖ ద్వార ప్రదేశంగా ఉండేది.  జలథి అంటే సముద్రం. సముద్రం లో నౌకాయానానికి బయలుదేరేముందు నావికులు   గంగానాథుడైన ఈ స్వామిని పూజించి , బయలుదేరేవారని,  తిరిగి వచ్చిన తరువాత మళ్లీ స్వామిని దర్శించుకొనే ఇళ్లకు వెళ్లేవారు. దుకే ఈ స్వామి జలథీశ్వరుడయ్యాడు. 1,2 శతాబ్ధాలలోకంటకశ్శిల అనేపేరు గల ఘంటశాల ప్రముఖ నౌకా కేంద్రంగా  విలసిల్లినట్లు  చారిత్రక ఆధారాలున్నాయి.



                           సుబ్రమణ్యేశ్వరుని  ధ్వజస్థంభం

 ఆలయప్రత్యేకత. :------                శివపార్వతులిద్దరు ఒకే పానమట్టం మీద దర్శనమివ్వడం ఈ ఆలయప్రత్యేకత.ఈ పానమట్టం ఏకఱాతిశిల.  దీని నాలుగుమూలలా నాలుగు కాళ్లు ఉండి  దానిపై పైనమట్టం నిలిచి ఉంటుంది.పానమట్టం భూమిని తాకక పోవడం  ఒక ప్రత్యేకత.
                  ఈ ఆలయ గోపురం గజపృష్టాకార గోపురం గా పిలవబడుతోంది. అంటే సాధారణ ఆలయాల గోపురం వలే కాకుండా ఇది మూడు శిఖరాలను కలిగిఉంటుంది. తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం మాత్రమే ఇటువంటి ఆకృతిని కలిగి ఉంది విమాన శిఖరం ఎత్తు కూడ 45 అడుగులవరకు ఉంటుంది. ఈ విమానగోపురం పాటిమట్టి తో నిర్మించబడి తరువాత కాలంలో సిమెంటు ప్లాస్టింగ్  చేయబడింది.
                   మహామేరు శ్రీ చక్రం ఈ ఆలయంలో అమ్మవారి ముందు అర్చించ బడుతోంది.32కిలోలబరువు తో,9అంగళాల ఎత్తు కలిగి పంచలోహాలతో చేయబడిన ఈ శ్రీ చక్రాన్ని కంచి పీఠాథిపతుల అనుగ్రహంతో  కంచి పీఠంనుండి తెచ్చి ప్రతిష్టించడం జరిగింది . పూజ్యశ్రీ రామేశ్వరానందగిరి స్వామి వారిచే ఆలయములో అమ్మవారి పాదముల చెంత ఉంచబడి పూజించబడుతోంది.
             కంచిపీఠాథిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు జయేంద్రసరస్వతీ స్వామి వారు ఈ ఆలయంలోని పీఠాన్ని అర్థనారీశ్వర  పీఠంగా నిర్థారించారు.

   నవగ్రహమండపం.:------            ఏకపీఠంపై వెలసిన సివపార్వతుల వలెనే  నవగ్రహాలకు చెందిన దేవతామూర్తులు కూడ సతీసమేతులై ఈ ఆలయము నందలి  నవగ్రహమండపం లో కొలువు తీరి ఉండటం మరొక ప్రత్యేకత.ఇటువంటి నిర్మాణం చాలా అరుదుగా దర్శనమిస్తుంది. ఏలినాటిశని నుండి అన్నిరకాల శనిదోష నివారణకు, రాహుకేతు పూజలకు ఈ మందిరం అత్యంత ప్రసిద్ది.

 శ్రీసుబ్రమణ్యేశ్వర ఆలయం.:-----       ఈ ఆలయ  ఆవరణ లోనే 200 సంవత్సరాల నాటి వల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రమణ్యేశ్వర ఆలయం ఉంది. మార్గశిర మాసంలో షష్టి ఉత్సవాలు  తిరునాళ్లను తలపిస్తూ అత్యంతవైభవంగా జరుగుతాయి. సంతానాకాంక్షులయిన దంపతులు స్వామివారికి పూజలు చేయించి  మందిరానికి వెనుకనున్న నాగేంద్రస్వామి పుట్టలో పాలు పోయడం, అనంతర కాలంలో తల్లిదండ్రులై మరలా వచ్చి స్వామికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతోందని భక్తుల విశ్వాసం.

                                   నాగేంద్రస్వామి


          దేవాలయఆవరణ లో నైఋతిభాగంలో  శ్రీవిఘ్నేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది.పూర్ణిమ తరువాత వచ్చే చవితికి ఈ ఆలయంలో విశేషపూజలు జరుగుతాయి. జలథీశ్వరుని అభిషేకజలం  ఆరోగ్యప్రదాయిని .  ఈ అర్దనారీశ్వరుని అభిషేకజలం సర్వరోగనివారిణి యని   జనశ్రుతి.
                    అంత్రాలయ ద్వారానికి పైన ఆది శంకరుల విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఎడమ వైపు కాలభైరవుడు, కుడివైపు నరసింహస్వామి ద్వారపాలకులు గా దర్శనమిస్తారు. దీనిని శివ కేశవాభేదానికి ప్రతీకగా భక్తులు చెప్పుకుంటారు.ఈ రెండు పాలరాతి విగ్రహాలు  క్రీ,శ, 2 వ శతాబ్దానికి చెందినవి గా పురావస్తు శాఖ వారు నిర్దారించారు. 

                      రెండవ శతాబ్దం నాటి నరసింహ విగ్రహం 

    చారిత్రకత. :-----                       ఇది అత్యంత ప్రాచినమైన శైవక్షేత్రం. ఇక్కడ  లభించిన సరస్వతీ దేవి, రతీదేవి విగ్రహాలు క్రీ.పూ. 6000  సంవత్సరాలనాటి హరప్పా ,మొహంజొదారో శిల్పకళ కు చెందినవి గా చరిత్ర పరిశోధకులు గుర్తించారు.
              క్రీ.శ.1 వ శతాబ్దం లో ఘంటశాల ను కంటకశైల గా ఫ్రెంచి చరిత్రకారుడు డూబ్రెయిల్ తన డక్కను పూర్వచరిత్ర లో పేర్కొన్నాడు.టోలమీ మొదలగు చరిత్రకారులు  ఈ రేవు పట్టణాన్ని సందర్శించారు. చోళుల కాలం లో చోళపట్టణం గా, పాండ్యులకాలం లో పాండ్యపురంగా తరువాత ఘంటశాల గా పిలువబడుతోంది. రోమనుల కాలం నాటికే ఈ పట్టణం ప్రసిద్ద ఓడరేవు  గా ఉన్నట్లు  చారిత్రకాధారాలున్నాయి.
                   సుమారు ఏడు శాసనాలు ధేవాలయ ఉత్తర గోడమిద,   బావి త్రవ్వేటప్పుడు బయటపడ్డాయి.ఇవన్నీ దాన   శాసనాలే
.
రవాణాసౌకర్యాలు.:-----    విజయవాడ,గుడివాడ,మచిలీపట్నం, రేపల్లె ల నుండి  ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. బారసాల,అక్షరాభ్యాసం,గ్రహశాంతులు, జరిపించుకోవడానికి వచ్చే దూర ప్రాంత భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కలదు.స్వంతవాహనం ఉన్నట్లయితే విజయవాడ నుండి కఱకట్ట మీదుగా       52 కి.మీ లో  శ్రీకాకుళం,కొడాలి మీదుగా ఘంటశాల కు చేరుకోవచ్చు.



 ***********ఓం నమశ్శివాయ ********************************************************

No comments:

Post a Comment