Showing posts with label bhadrakali. Show all posts
Showing posts with label bhadrakali. Show all posts

Saturday, 1 February 2014

బొంతపల్లి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం

           

  Bontapalli Sri Bhadrakali sameta VeerabhadraSwamy Aalayam.


 बॊंतपल्लि श्री भद्रकाळी समेत वीरभद्रस्वामि आलयम्.


                            బొంతపల్లి   శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం
                

                         మెదక్ జిల్లా  జిన్నారం మండలం లోని బొంతపల్లి లో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువు తీరి ఉన్నాడు   హైదరాబాద్ నుండి 40 కి.మీ దూరం లోను, మెదక్ నుండి 68 కి.మీ దూరం లోను ఈ క్షేత్రం అలరారుతోంది. ఆధునిక కాలం లో  ఈ ఆలయానికి  సాధారణ భక్తులు విరివిగా వస్తున్నప్పటికీ  తొలినాళ్ల  లో మాత్రం వీరశైవులు, లింగథారులు, అనంతరం ఆర్య వైశ్యులు  ఈ వీరభద్రుని పరదైవతంగా కొలిచి,తరించినట్లు, వారి పాలిట ఈ క్షేత్రం  పుణ్య ధామం గా విలసిల్లినట్లు  తెలుస్తోంది. ఆలయ ప్రధానద్వారం ముందు దర్శనమిచ్చే నిప్పులగుండం ఇక్కడ జరిగే వీరాచార సాంప్రదాయానికి ప్రతీక గా కన్పిస్తోంది.
              
                                          దీపపు కాంతి లో తోరణద్వారం
                                             
                      స్థలపురాణం :-                                   పూర్వకాలం లో ఈ ఆలయం  చాల చిన్నది గా ఉండేదట. ఒక రాత్రి సమయం లో ఓ గొఱ్ఱెలకాపరి గొంగళి భుజాన సర్దుకుంటూ  ఆలయం ముందు నుంచి వెడుతున్నాడు. ఇంతలో ఎవరో తనను పిలిచినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు గొఱ్ఱెల కాపరి. ఎదురుగా వీరభద్రస్వామి దివ్యమూర్తి. భయపడిపోయాడు కాపరి. నెమ్మదిగా పల్కరించాడు స్వామి. అతని లోని భయాన్ని పోగొట్టాడు.  మాటల్లోకి దించాడు. నాకు ఇక్కడ నచ్చలేదు. వేరేచోటుకు వెళ్ళాలనుకుంటున్నాను .కాబట్టి నన్ను    నీ భుజాలమీద ఎక్కించుకొని నువ్వు అలసిపోయినంతదూరం తీసుకెళ్లి అక్కడ దించమని అడిగాడట వీరభద్రుడు.. అది ఆ కాపరి చేసుకున్న పుణ్యఫలం అనుకోవాలి.


                                                                  ఆలయ రాజ గోపురం                     
                       
                    ఆ గొఱ్ఱెల కాపరి   వీరభద్రస్వామి చెప్పినట్లే స్వామిని భుజాలమీద ఎక్కించుకొని కొన్ని మైళ్లు నడిచి ఇప్పుడు ఆలయమున్నప్రదేశానికి వచ్చేసరికి అలసిపోయి వీరభద్రుని క్రిందకు దించాడు.  ఆ విధంగా ఆ కాపరిని అనుగ్రహించారు వీరభద్రస్వామి.  

                                 తనను భూమి మీదకు దించి, సొక్కుతీర్చుకుంటున్న కాపరి తో వీరభద్రస్వామి  ఇక నీవు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లు.  వెనక్కి తిరిగితే  శిల గా మారిపోతావని చెప్పాడు.( కోటప్పకొండ స్థలపురాణం లో  ఆనందవల్లి (గొల్లభామ ) వృత్తాంతం లో కూడ ఇదే మాట అన్నాడు  ఈశ్వరుడు). పురాణాలలో ముఖ్యం గా స్థల పురాణాలలో ఇటువంటి గాథలు కోకొల్లలు గా విన్పిస్తాయి.             
                                           
                                                 ఆలయం ఎదురు గా శంకరుడు
                 
                                   లోతుగా ఆలోచిస్తే ఇక్కడొక చిద్రహస్యం దాగి ఉందని పిస్తుంది. ఎందుకంటే  ఆ  ఈశ్వరుని సుందర మనోహరము , పరమాద్భుతమైన రూపాన్ని చూసిన తర్వాత ఇక ఐహిక వాంఛల మీద మక్కువ ఉండదు. ఇంకొక రూపాన్ని చూడాలనే ఆతృత ఉండదు. ఒక్కమాట లో చెప్పాలంటే ఆ  స్వామి దివ్యరూపాన్ని దర్శించిన తరువాత మరొక ఆలోచనే ఉండదు. ఆ స్థితి లో  మహనీయుల సంగతి వేరు గాని సామాన్యుడు మాత్రం సామాన్యం గా మనజాలడు. మతిభ్రమణం తో  పిచ్చివాడన్నా అయిపోతాడు. మ్రాన్పడి పోయి స్థాణువు గా ( శిల )నన్నా  మారిపోతాడు.

                     నిండుసభలో శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దర్శించిన జాత్యంథుడైన ధృతరాష్ట్రుడు భగవానుని దివ్యదర్శనానంతరం  తిరిగి అంథత్వాన్నే కోరుకున్నాడంటే కనులతో త్రాగి మది లో నింపుకున్న ఆ రూపాన్ని ఎంత భద్రంగా పదిల పరుచు కోవాలని ఆయన కోరుకున్నాడో   అర్ధం చేసుకోవచ్చు.  యోగులు, మహర్షులు,   సంయమీంద్రులు మాత్రమే ఆ  మహాద్భుత రూపాన్ని దర్శించి . మనసులో బంధించి,  పున : పున : దర్శిస్తూ అమందానందసందోహ కందళిత స్వాంతులై, అనిర్వచనీయానంద సాగరం లో తేలియాడగలరు.  అందుకే భీష్మ పితామహుడు  చిన్మయరూపుడు శ్రీకృష్ణుని  విశ్వరూపాన్ని దర్శించి,  సేవించి, తలంచి, వేచి తరించాడు.

శ్రీ వీరభద్రుని  దివ్యదర్శనం
                                 
తన కన్నయ్య నోటిలో సమస్త విశ్వంభరా వలయాన్ని సందర్శించిన యశోదామాత స్పృహ కోల్పోయింది. కలయో ! వైష్ణవ మాయయో ! ఇతర సంకల్పార్ధమో !  సత్యమో ? ఎరుగన్నేరక ఉన్న దానను నే యశోదాదేవి కానో  ?” అనే విచికిత్స కు లోనైంది. అనంతరం విష్ణుమాయ తో అంతా సర్దుకుపోయింది. కురుక్షేత్ర రణక్షేత్రం  లో  శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం  చేసిన అర్జునుని మన: స్థితి ఎలా ఉందో భగవద్గీత  మనకు చెపుతుంది.. మహాయోగి పుంగవుడు, గురువులకే గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస ప్రతిరోజు కాళీమాత ను దర్శిస్తూ ఆవిడ తో సంభాషిస్తూ, ఆ ధ్యాస లోనే,  ఆ ధ్యానం లో ఉండిపోయేవాడు. ఆయనను పిచ్చివాడని  ఆనాటి జనం పిలిచేవారట.

                              ఆలయదృశ్యాలను you tube  లో కూడ చూడవచ్చు.

                   ఉపాసనలు, అనుష్ఠానాలు అంటూ హరిద్వార్, హృషీకేశ్ వెళ్లిన కొంతమంది తమలో సంభవించే తరంగ సంచలనాలను, తట్టుకోలేక కవులు గా మిగిలిపోయిన వారు,  మతిభ్రష్టులైన వారు  ఉన్నారని చెపుతుంటారు..

                                         శాస్త్రేషు హీనాశ్చ కవయో భవంతి
                                          కవిత్వ హీనాశ్చ పురాణభట్టా :
                                          పురాణ హీనాశ్చ కృషీవలా స్యు :
                                            భ్రష్టారథా  భాగవతా భవన్తి

                             అనేది ప్రాచీనోక్తి. పురాణేతిహాసాల్లోకి చూస్తే ఇటువంటి గాథలు మనకు కొల్లలు గా కనిపిస్తాయి. ఆ భగవానుని దివ్యసుందర విగ్రహాన్ని  దర్శించిన   కన్ను లతో   మరల ఈ   లోకాన్ని చూడటానికి ఇష్టపడక పోవడమే అన్నింటికీ మూలకారణం.

                                   ఆలయ పురోభాగ దృశ్యం        

                             శ్రీ వీరభద్రుని ఆజ్ఞానుసారం తన ఇంటికి బయలుదేరిన  గొఱ్ఱెలకాపరి  కొంతదూరం వెళ్ళి మానవ సంబంధమైన లక్షణం తో ఉత్సుకత ను ఆపుకోలేక వెనక్కి తిరిగి చూశాడు.  వెంటనే శిల గా మారిపోయాడట.

                                                                     ఆలయ ప్రదక్షిణమార్గం

                    అనంతరం శ్రీ వీరభద్ర స్వామి  ఒక అర్చకునకు కలలో కన్పించాడు. ఆయన గ్రామపెద్దలకు ఆ విషయాన్ని విన్నవించాడు. పెద్దలు పూనుకున్నారు. బొంతపల్లి లో వీరభద్ర స్వామి కి అందమైన ఆలయ నిర్మాణం జరిగింది. అనంతరం శ్రీ స్వామి వారి ఆలయానికి వెనుకభాగం లో భద్రకాళీమాత ఆలయనిర్మాణం చేశారు . శ్రీ స్వామివారి ఆలయం ఇరవైనాలుగుస్థంభాలు గల ముఖమండపం తో  విశాలం గా  నిర్మించబడింది.  ఈ ఆలయం కాకతీయుల కాలం లో నిర్మించబడిందని జనశృతి. కాని అందుకు సాక్ష్యం గాఎటువంటి శాసనాద్యాధారాలు లభించడం లేదు.

                                                             ఆలయవిమాన దర్శనం

                  ఇంకొక గాథ ననుసరించి శివాగ్రహం జటలు విదిలించింది.  వీరభద్రుని ప్రాదుర్భావం , దక్షయజ్ఞ విధ్వంసం పూర్తయ్యింది. ఆ సమయం లో  ఆ దక్ష ప్రజాపతి అనుచరులు  ప్రాణాలు అఱచేత  పెట్టుకొని ,భయం తో పారిపోయి వచ్చి, భూలోకం లోని దండకారణ్యప్రాంతంలో మంజీర, ముచికుంద (మూసీనది )  నదుల  మధ్యభాగం లోకి వచ్చి స్థిరపడ్డారు. ఆ విధం గా స్థిరపడిన వారు అక్కడ స్థానికం గా ఉన్న శివభక్తులను హింసించ సాగారు . వారి ఆక్రందనలను విని వారిని రక్షించడానికి  మరల  అక్కడకు  చేరుకున్నాడు  వీరభద్రుడు.  దుష్టశిక్షణ పూర్తయ్యింది.   అనంతరం  బొంతవలే దట్టంగా పెరిగిన బిల్వవృక్ష సమూహాలతో శోభాయమానం గా ఉన్న ఆ ప్రదేశం తనకు నచ్చడం మూలంగా అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నాడట వీరభద్రుడు . కాకతీయుల కాలం నాటికే ఈ ఆలయం     ప్రసిధ్ది లో ఉన్నట్లు తెలుస్తోంది .  ఈ స్వామిని అగస్త్యుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి.

                                             ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం
      
                                ఉత్సవాలు :-       ఫాల్గుణ  శుద్ధ దశమి నాడు  భద్రకాళీ వీరభద్రుల కళ్యాణోత్సవం అంగరంగవైభవం గా నిర్వహిస్తారు. మరునాడు రధోత్సవం కనులపండువు గా జరుగుతుంది. వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవం లో పాల్గొంటారు. శ్రావణ మాసం లో ప్రతిరోజు శ్రీ స్వామివారి కి  లక్షబిల్వార్చన చేస్తారు.     

                                         


      









                                                           శ్రీ వారి రథం
శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం                                                 

                                           

                                           బొంతపల్లి   లో అనేక పరిశ్రమలు   నెలకొల్పబడ్డాయి. ప్రతి ఆదివారం  ఇక్కడ జరిగే సంత  ఒక ప్రత్యేక ఆకర్షణ .





                                                             
***************************************************** ****************************  

Monday, 1 July 2013

వరంగల్లు (హనుమకొండ) శ్రీ భద్రకాళీ మాత ఆలయం

           
    वरंगल्लु ( हनुमकॊंड ) श्री भद्रकाळीमात  आलयम् .          
       
                  వరంగల్లు   ( హనుమకొండ )  శ్రీ భద్రకాళీ మాత  ఆలయం.
      
             Warangal (Hanumakonda) Sree Bhadrakaali mata Temple .   
                 
            ఆంధ్రదేశం లో  నేడు వరంగల్లు అని పిలువబడే నాటి ఓరుగల్లుకు దేశ చరిత్ర లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది.  ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం ఆంధ్ర దేశాన్ని ఏకఛత్రాథిపత్యంగా పరిపాలించిన కాకతీయులకు  ఇది రాజథాని. ఏకశిలానగరంగా  కాకతీయుల శాసనాల్లోను,సమకాలీన సాహిత్యంలోను  పిలువబడిన నగరమే ఆంథ్రీకరణం చెంది ఈ ఓరుగల్లు గా, వరంగల్లు గా పరిణామం చెందింది.
                            
              వరంగల్లు,  హనుమకొండ, కలిసున్నా చారిత్రక ప్రాథాన్యం తో హనుమకొండ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటాము. కాకతీయుల ఆలయాలలో ప్రసిద్ధమైన  వేయిస్థంభాల గుడి,భధ్రకాళీ ఆలయం. హనుమకొండ లోనివే. ఆనాడు కాకతీయ విశాల సామ్రాజ్యంలో ఈ రెండు నగరాలు అవిభాజ్యంగానే ప్రస్తావించబడ్డాయి. అలాగే ఉన్నాయి కూడ.
                         

             
  
             కాకతీయ చరిత్రకు ప్రామాణికంగా లభించే గ్రంథాల్లో ప్రథానమైనవి మూడు.  మొదటిది ప్రతాపరుద్రచక్రవర్తి ఆస్థానకవి విద్యానాథుడు  రచించిన ప్రతాప రుద్రీయమ్ ( క్రీ.శ.1300) . రెండవది ఏకామ్రనాథుని ప్రతాపరుద్రచరిత్రము ( క్రీ.శ.1550-1600) .కాసె సర్వప్ప వ్రాసిన సిద్ధేశ్వర చరిత్రము (క్రీ.శ1600) మూడవది.
                    
        
                       అందమైన ఆలయ ముందు భాగం
                
           ఈ హనుమకొండ నే  కాకతీయుల కాలంలో హనుమద్గిరి అని  పిలిచేవారు.వరంగల్లు ప్రజలకు ఇలవేల్పువిరాజిల్లుతూ, పూజలందుకుంటున్నశ్రీ భద్రకాళీ మాత దేవాలయం కాకతీయుల కాలం నాటికే ప్రాభవ వైభవాలను సంతరించుకున్నట్లు  చారిత్రక ఆథారాలున్నాయి. ప్రతాపరుద్ర చరిత్ర లోను(1వ పేజి) సిద్ధేశ్వరచరిత్రలోను( 158 వ పేజి ) భధ్రకాళీమాత ప్రస్తావన కనబడుతుంది. సిద్ధేశ్వర చరిత్రలో(24 వ పేజి ) భద్రేశ్వరి  అని కూడ ప్రస్తావించబడింది.
                       

                                   
                                      భద్రకాళి చెఱువు
                                       
         హిడింబాశ్రమము( నేటి మెట్టగుట్ట) కు ఈశాన్యభాగం లో హనుమద్గిరి ఉన్నదని, దానికి పూర్వభాగం లో భద్రకాళీ దేవి కొలువు తీరి ఉన్నదని పై గ్రంథాల్లో చెప్పబడింది. ప్రతాపరుద్రచక్రవర్తి దిగ్విజయ యాత్రకు బయలుదేరబోయే ముందు తమకు అభిమాన దేవతయైన దుర్గాదేవిని పూజించి, హనుమద్గిరి వెలుపలనున్న తోటలో సైన్యాన్ని విడిది చేయించి నట్లు ప్రతాపరుద్రీయం లో వ్రాయబడింది. (ఆంధ్ర ప్రతాపరుద్ర యశో భూషణము ,237 వ పేజి )

                            
                         

              
                        ఆలయ ప్రవేశం దగ్గర ఆశీర్వదిస్తున్నట్లున్న శ్రీ అమ్మవారి వివిథ రూపాలు
                      
        శ్రీ భద్రకాళీ ఆలయం క్రీ.శ  625 నాటికే ఉన్నట్లు స్థానికులు కొందరు చెపుతారు. పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి  వేంగీ చాళుక్యుల పైన విజయం సాథించడానికి  ఈ ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించి, అర్థ సిద్ధి నందినట్లు జనశృతి. దీనికి ఆధారం గా  శ్రీ భద్రకాళీ విగ్రహం ఏకాండ శిలమీద  చెక్కబడి ఉండటాన్ని  కారణం గా  చూపిస్తున్నారు.     
                     

            
                              కొండ పై కొలువుదీరిన ఆది దంపతులు
                
          అయితే కొల్లేటి కోట లోని పెద్దింట్లమ్మ ను, భీమవరం మావుళ్లమ్మ ను చూసిన వారికి ఆ నిర్మాణ పోలికలు   శ్రీ భద్రకాళీమాత విగ్రహం లో స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి. రెండు విగ్రహాలు 9X9 ఉంటాయి. రెండు ఏకాండశిలపై చెక్కినవే. అంతే కాకుండా రెండువిగ్రహాలు పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి కాలం నాటివి గానే భావించబడుతున్నాయి. ఇలా చెక్కడం చాళుక్య సంప్రదాయం గా చెప్పబడుతోంది.   అంటే శ్రీ భద్రకాళీమాత చాళుక్యల కాలం నుండే పూజలందుకుంటున్నట్లు మనం అంగీకరించవచ్చు. ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్థంభాలు చతురస్రాకారంగా ఉండటం కూడ చాళుక్య నిర్మాణ  శైలి గా తద్విజ్ఞులు వ్రాస్తున్నారు.
                               
   

        
                                  ఆలయ తోరణ ద్వారము
            
                ఆం.ప్ర. పురాతత్త్వశాఖ వారు ప్రచురించిన వరంగల్లు జిల్లా శాసనాలలో 307 వ పేజి లో  శ్రీ భధ్రకాళి గుడి లో అంతరాళ స్థంభాలపై ఉన్న రెండు శాసనాలను ప్రకటించారు.
                     మహేశశ్చారు సంధత్తే మార్గణం కనకాచలే
                     మంత్రి విఠన ఎఱ్ఱస్తు మార్గణే కనకాచలే” !!
 కొద్ది తేడాతో మరొక శ్లోకం  వేరొకస్థంభం మీద కన్పిస్తోంది. వీటిని సమన్వయించి చూస్తే  10 వ  శతాబ్దం నాటికే ఈ ఆలయనిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.
                            

                                                                                                                                                    
                                      అమ్మ ఆలయ శిఖరం
   
             ప్రతాపరుద్రుని కాలానికే శ్రీభద్రకాళీమాత భక్తులను అనుగ్రహించిన లీలలు కథలు,కథలు గా ప్రచారం లోఉన్నాయి.- అందులో ఒకటి. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు వందమంది విద్వాంసులు  తనను అనుసరించు చుండగా అంబారీపై ఊరేగుతూ, ప్రతాప రుద్ర చక్రవర్తి ఆస్థానానికి వచ్చి, అచ్చటి విద్వాంసులను తనతో శాస్త్ర చర్చకు రావలసింది గా ఆహ్వానించాడట. కాని ప్రతాపరుద్రుని ఆస్థాన విద్వాంసులు అతనిని అవమానించి పంపించారట.
               


                                శ్రీ భద్రేశ్వరుని ఆలయ ప్రవేశద్వారం
          
                    అహం దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ విద్వాంసులను  ఏదోవిథం గా  ఓడించాలనే ఉద్దేశ్యం తో – ఈ రోజు కృష్ణ చతుర్థశి.రేపు అమావాస్య .మీరు కాదంటారా”?.అని ప్రశ్నించాడట.  ఆస్థాన విద్వాంసులు ఇరకాటం లో పడ్డారు. ఔనంటే సుదర్శనమిత్రుని వాదాన్ని అంగీకరించినట్లవుతుంది. కాదంటేనే అతన్ని ఓడించినట్లు అవుతుంది – అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని  వాదించారట.   విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సిఉంది. ఈ సంకటస్థితి నుండి తమను కాపాడమని మల్లిఖార్జునభట్టు ఆ రాత్రి భద్రకాళీ ఆలయానికి వెళ్లి   ఆ అమ్మను పూజించి, పరిపరి విథాల ప్రార్థించి, పదకొండు శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై  నీమాటలనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండుపున్నమి లాగా  వెలుగొందిన చంద్రుని చూచి, సుదర్శనగుప్తుడు విద్వాంసులను క్షమాపణ వేడుకున్నాడట. ఇది నిజంగా దైవీశక్తి గాని,మానుషశక్తి కాదని అంగీకరించి వెళ్లిపోయాడట.
                   


            
                                               ఆలయ ఆవరణ లోని శంకరుడు




                                                                      ఆది శంకరుడు

                     ఈ వృత్తాంతంలో ప్రస్తావించబడిన శాఖవెల్లి మల్లిఖార్జునభట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడు.  కాబట్టి ప్రతాపరుద్రుని కాలం నాటికే శ్రీ భద్రకాళీమాత ప్రసిద్ధమై ఉన్నట్లు, భక్తలపాలిట కల్పవల్లియై ఆదుకొంటున్నట్లు మనకు అర్థమౌతోంది.  
                        
              
                  


                                                        ఆలయం వద్ద ప్రకృతి దృశ్యం          
                 
         శ్రీ భద్రకాళీ ఆలయం ఓరుగల్లు నగర ప్రధాన రహదారికి  ఒక కిలోమీటరు దూరం లో జలాశయం ప్రక్కన, కొండల నడుమ ప్రశాంతమైన వాతావరణం  లో అలరారుతోంది. భధ్రకాళీదేవి  విగ్రహం  సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు, తొమ్మిది అడుగుల వెడల్పు  కలిగి భయద గంభీరం గా భక్తులను కటాక్షిస్తూ, కన్పిస్తుంది.
                   
                     

                                   శ్రీ భద్రకాళీమాత దివ్యరూపం
               
            అమ్మవారు అష్టబాహువులతో,ప్రేతాసీనయై ఉంటుంది. కుడివైపున ఉన్ననాలుగు చేతులలో వరుసగా-ఖడ్గము,ఛురిక, జపమాల,డమరుకమును, ఎడమవైపున ఉన్న నాలుగుచేతులలో –ఘంట, త్రిశూలము, ఛిన్నమస్తకము,(నరికిన తల ) పానపాత్ర  ఉన్నాయి.ఈ తల్లి పశ్చిమాభిముఖం గా ఉంటుంది.
           
                       https://www.youtube.com/watch?v=tfH30Ug_124
             
        ఆలయ ముఖమండపము ఆథునిక నిర్మాణము.  దీనిలో ధ్వజస్థంభము, సింహవాహనము,బలిపీఠము, ఉంటాయి.  ముఖమండపం లో ఆంజనేయ, సుబ్రమణ్యేశ్వర, నవగ్రహప్రతిష్టలున్నాయి. మహామండంపం లో దక్షిణవైపున భద్రేశ్వర  ఆలయ మున్నది.ఇందులో  లింగము వెనుక పార్వతీపరమేశ్వరుల ప్రతిమలు ఏకశిలపై చెక్కిఉండటాన్ని మనము గమనించవచ్చు. శ్రీ వల్లభ గణపతి ఆలయాన్ని పతిత్రపరిక్రమ ను నూతనం గా నిర్మించారు.       
                     

              
                                                          జ్వలిస్తున్న   పవిత్ర పరిక్రమ
                   

                        క్రీ. శ 1323 లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కొంత,విజయనగర రాజ్య పతనానంతరం పూర్తిగాను, ఈ ఆలయప్రాభవం కోల్పోయినట్లు చరిత్ర చెపుతోంది. క్రీ.శ 1950 లో  ఆలయాన్నితిరిగి పునరుద్ధరణ చేయడానికి   ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేశ్ శాస్త్రి, శ్రీ వైష్ణవపండితులు శ్రీమాన్ ముడుంబై రామానుజా చార్యులవారు సంకల్పించి, అందుకు సహకరించవలసిందిగా  నగరం లో ప్రముఖవ్యాపారిగా నున్న శ్రీ మగన్ లాల్ సమేజా  వద్దకు మరునాడు ఉదయం వెళ్లాలని నిర్ణయించుకున్నారట. కాని అదే రోజు రాత్రి శ్రీ మగన్లాల్ సమేజా గారి  కలలో శ్రీ అమ్మవారు కనిపించి, రేపు నీదగ్గరకు ఇద్దరు వ్యక్తులు వస్తారు. వారితో పాటు నీవు నాఆలయానికివచ్చి నన్ను సేవించు అని ఆదేశించిందట.
                          
              
           
                                           అమ్మవారి ఆలయం ప్రక్కనే ఉన్న ఆది శంకరుని ఆలయం
          
                     మరునాడు తన ఇంటికి వచ్చిన  ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా నమ్మిన ఆ ప్రముఖుడు, వారి వెంట ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి,  నా కుమార్తె కు పడిపోయిన మాట తిరిగొస్తే  ఆలయ పునరుద్ధరణకు సహకరిస్తానని శ్రీ గణేశ శాస్త్రి తో అనడం, శ్రీ శాస్త్రి గారు నెలరోజులవాటు ప్రతిరోజు శ్రీ అమ్మవారి అభిషేక జలాన్ని, శ్రీ మగన్ లాల్ గారి కుమార్తె కు తీర్థం గా ఇవ్వడం, ఆమెకు మాట రావడం వెంట వెంటనే జరిగిపోయాయి. అమ్మవారి మహిమకు ముగ్థుడైన శ్రీ మగన్ లాల్ సమేజా ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నారు.  
      

                                                                         స్థల పురాణం

                                    ఆ యనంతరం ఎందరో మహానుభావుల సహాయ సహకారాలతో 29.7 1950 న మహాసంప్రోక్షణ కార్యక్రమాలతో  ఆలయం పునరుద్ధరించబడి, దిన దిన ప్రవర్థమాన మౌతోంది.
                       
  
                                                          ఆలయ ప్రవేశ మార్గం
          ఆ సమయం లోనే వ్రేలాడతున్న నాలుక తో రౌద్రరూపిణి గా ఉన్న శ్రీ అమ్మవారి  నాలుక పై అమృత బీజాలను వ్రాసి,యంత్రాన్ని ప్రతిష్టించి,  భీకరం గా ఉన్న ముఖాన్ని ప్రసన్నంగా మార్చారని, దక్షిణాచార సంప్రదాయం లో పూజించబడే మూర్తి శాంతరూపిణి గా ఉండాలనేది శాస్త్రవిథి యని స్థల పురాణం లో వ్రాయబడింది. అంతేకాక అమ్మవారి ఆలయం లో చండీ యంత్రాన్ని  ప్రతిష్టించి, ప్రతిసంవత్సరము శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులను నిర్వహిస్తూ, నిత్యధూప దీప నైవేద్యాలను ఆచరిస్తున్నారు. జంతుబలులను పూర్తిగా నిషేధించారు.

                                              శ్రీ శాకంభరీ దేవి గా భద్రకాళీమాత
            
                         శ్రీ భద్రకాళీ అమ్మవారికి ఆశ్వయుజ మాసం లో శరన్నవరాత్రులు, చైత్రమాసం లో వసంత రాత్రులు వైభవం గా నిర్వహిస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజున శ్రీ అమ్మవారిని శాకంభరీదేవి గా అలంకరిస్తారు.
            పూర్వకాలం లో హిరణ్యాక్షుని వంశం లో దుర్గముడనే వాడు,పుట్టి తపస్సుతో బ్రహ్మను మెప్పించి, బ్రాహ్మణుల వద్ద నున్న వేదాలు, మంత్రాలు తనకు కావాలని, దేవతలు అపజయం కలగాలని , వరం కోరుకున్నాడు. బ్రహ్మ సరేనన్నాడు. దానితో బ్రాహ్మణులు  వేదాథ్యయనము,జపహోమాదులు  వదిలివేశారు. దానివలన దేవతలకు అందవలసిన హవిర్భాగము లందక వారు శక్తిహీనులయ్యారు. యజ్ఞాలు  జపతపాలు లేక ప్కృతి లో ధర్మం నశించింది. అనావృష్టి వలన మనుష్యులు, పశుపక్ష్యాదులు పెద్దఎత్తున మరణించసాగారు.  భూమండలమంతా మృతకళేబరాలతో నిండిపోయింది. ఆసమయం లో బ్రాహ్మణుల హిమాలయాలకు వెళ్లి పరాశక్తి ని ప్రార్థించారు. అమ్మవారు కటాక్షించి తొలకరి మబ్బువంటి శరీరఛాయ, నూరు కన్నులు,కోటిసూర్యుల తేజస్సు తో లోకోత్తర లావణ్య రూపిణియై ఆవిర్భవించింది. ఆ తల్లి చేతులలో మథుర రస భరితములైన పండ్లు,ఫలాలు,  రకరకాల భక్ష్యభోజ్య పదార్థాలను ధరించి ఉంది. ఆమె నేత్రాలు పూర్ణకుంభాల్లాగ నిండుగా ఉన్నాయి. ఆ కండ్లనుండి తొమ్మిది రోజులపాటు ఏకథాటిగా కారిన నీటితో ఓషథులన్నీ జీవకళతో ప్రకాశించాయి. నదీనదాలు,చెఱువులు జలసమృధ్ధి తో కళకళలాడి జగత్తు చల్లబడింది. ఆమె శరీరమునుండి ఫలశాక సమూహాలు, అన్నపాన అమృతాలు అవిర్భవించి లోకంలోని  కరువు రూపు మాపబడింది. కావున ఆమె శాకంభరి అయ్యింది. ( - శ్రీదేవీభాగవతం – సప్తమ స్కంథము   )
            
           

            
         శ్రీకృష్ణాష్టమి రోజు రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపం లో అలంకరించబడి సేవించబడుతోంది. వైశాఖ శుద్ధ పంచమి శంకరజయంతి రోజున శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణోత్సవాలు(బ్రహ్మోత్సవాలు) కన్నుల పండువు గా జరుగుతాయి.
                        



 శ్రీ  పెద్దింట్లమ్మ                                                   శ్రీ భద్రకాళీ మాత                                        శ్రీ మావుళ్ళమ్మ                              
                                    
                                            ముగురమ్మలు
                 
                 



                
                    నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ: !
                             నమ: ప్రకృత్యై భద్రాయై నియతా:ప్రణతాస్మ్యహం !!





   ******************************************************************************