Friday, 27 September 2013

సింహపురి (నెల్లూరు ) శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం


     Simhapuri   ( Nellore ) Sri Talpagiri Ranganadha Swamy Aalayam.
        


                    సింహపురి (నెల్లూరు ) శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం.

 सिंहपुरि (नॆल्लूरु ) श्री  तल्पगिरि रंगनाथस्वामि आलयम् .          
               
                  సింహపురి గా ప్రసిద్ది కెక్కిన  నెల్లూరు పట్టణం లో పెన్నానదీ తీరం లో వెలసిన ప్రాచీన ఆలయం      శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవాలయం. పెన్నానది శ్రీ రంగనాథస్వామివారి పాదాలు కడుగుతున్నట్లుగా   ఆలయాన్ని ఆనుకొని ప్రవహించే సుందర దృశ్యం భక్తులకు నయనానందకరం గా ఉంటుంది. 1946 లో అయితే ( 16.12 1946 ) పెన్నమ్మ తల్లి భక్త్యావేశాన్ని ఆపుకోలేక ఎగసివచ్చి శ్రీ రంగనాథస్వామి వారి పాదాలను  స్పృశించి, తరించిందని  చెప్పబడుతోంది.
                

                             
                                 శ్రీ రంగనాథ   ఆలయ రాజగోపురం

                    తమిళభాషలో నెల్లి అంటే బియ్యం అని, ఊరు  అంటే గ్రామమని  అందుకే నెల్లూరు మొలకొలుకులు పండే ఈ బంగారు భూమిని నెల్లూరు గా పిలుస్తున్నారని చెపుతారు.
                                 
                    
                       

                         
                                  ఆలయ మహామండప ప్రవేశ దృశ్యం.

                               
                    ఈ  సింహపురి లో వెలసిన తల్పగిరి రంగనాథస్వామిని గూర్చి స్కాందపురాణం లో వ్రాయబడినట్లు గా స్థలపురాణం చెపుతోంది.. ఆదినారాయణుడు శ్రీదేవితో కలిసి భూలోక విహారము చేయ సంకల్పించిన వాడై, ఆదిశేషుని భూలోకం లో క్రీడాపర్వతముగా ఏర్పడమని ఆజ్ఞాపించాడు. 


     
                     ఆలయ ప్రవేశ మండపం పై  శ్రీ సీతారామచంద్రస్వామి
                   
                        శ్రీమన్నారాయణుని  ఆజ్ఞానుసారం ఆదిశేషుడు పినాకినీనదీ తీరంలో పర్వతం  గా రూపుదాల్చి,  సత్యలోకం దాక వ్యాపించాడు. దానితో మానవులు  యజ్ఞయాగాదులు చేయకుండానే నేరుగా సత్యలోకాన్ని చేరుకోసాగారట. దానితో దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ఆ పర్వతాన్ని తన పాదముతో స్పృశించాడు. అంత ఆదిశేషుడు తన ఇల్లాలితో  కదిలి వచ్చి, ఆదినారాయణుని పలువిథాలుగా స్తుతించాడు.
                                 


                                                     ఆలయ ప్రవేశ ద్వారం
                                                         
                 
                    ఆ దంపతుల ప్రార్థనలకు సంతుష్టుడైన  శ్రీ మహావిష్ణువు   ఓ ఫణిరాజా ! ఈ గిరి నీ పేరున సమస్త అనియు,  “పద్మనాభ మనియు,తల్పగిరి యనియు ప్రసిద్ధి నొందగలదనియు అనుగ్రహించెను.
                   
  


                                  రాజగోపురం పై కొలువుతీరిన దేవతామూర్తులు


                   కొంతకాలం తరువాత కశ్యపమహర్షి శ్రీరంగాద్యనేక పుణ్యక్షేత్రాలను సేవిస్తూ వచ్చి ఇక్కడ పౌండరీకయాగము చేయుచుండగా ఏకాదశదినమున వపా హోమ సమయమున భగవంతుడావిర్భవించి ఆ వప ను పరిగ్రహించెను. అంతట కశ్యపుడు ఈ క్షేత్రమున శేషశాయివై వెలసి, శ్రీ రంగాది క్షేత్రములందు ఎట్లున్నదో అట్లే ప్రీతి ననుగ్రహించమని కోరాడు..
                              


                                  వైకుంఠద్వారము

            కశ్యపమహర్షి కోరిక మేరకు క్షీరసాగర శయన నారాయణుడు శ్రీ రంగనాథస్వామి గా ఇచ్చట వెలిశాడు. ఆనాటి నుండి ఈ క్షేత్రము ఉత్తర శ్రీరంగముగా  పిలవబడుతోంది.
                                           

         
                       పూర్వము పెన్నానది రెండు పాయలుగా చీలి  అంతర్వేది ఏర్పడినది. కొంతకాలానికి దక్షిణపుపాయ పూడిపోయి, వృద్ధపినాకిని  అనే నామాంతరాన్ని పొందింది. శ్రీరంగం (తమిళనాడు ) ,  శ్రీరంగపట్నం ( మైసూరు) లలో  వెలసిన శయనమూర్తులు కూడ కావేరీనది అంతర్వేదులందే ఆరాథింప బడతుండటం మన గమనించవచ్చు.
                       

              
                                              ఆలయ ప్రవేశ ప్రథాన ద్వారం

                                      ఈ ఆలయ గర్భగుడిలో శ్రీ రంగనాథస్వామి ఆదిశేషువు పై శయనించి, పాదాల చెంత శ్రీదేవి,భూదేవి సేవించుచుండగా,కుడిచేతిని తొడ పై ఉంచుకొని, వామహస్తాన్ని తల క్రింద పెట్టుకొని,శయనరూపుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శ్రీరంగనాథుని నాభి కమలము నందు ఉద్భవించిన కమలాసనుడు చతుర్ముఖుడై  సృష్టి నిర్మాణ బాథ్యతలను నిర్వహిస్తుండగా, భూభార వహన సమర్ధుడైన ఆదిశేషుడు తన పడగల నీడలో శ్రీ రంగనాథుని సేవిస్తూ తరిస్తున్నాడు. శంఖ , చక్రాలు శ్రీ  శయన నారాయణుని దివ్యసుందర రూపాన్ని దర్శించి తన్మయమౌతున్నట్లుగా బ్రహ్మదేవునికి కుడి ఎడమలుగా కొలువు తీరి ఉన్నాయి.
                                   
   
                           శ్రీ రంగనాథుని దివ్యమంగళ రూపం

                        ఆలయానికి కుడివైపున ఉన్న ఉపాలయం లో శ్రీ మహాలక్ష్మీదేవి  దివ్యమంగళ విగ్రహం  శ్రీ రంగనాయకుని పట్టమహిషియైన శ్రీ రంగనాయకీదేవి భక్తుల  పూజలందుకుంటోంది.  ఎడమ  వైపున ఉన్న ఉపాలయం లో చూడు కుడిత్తునాచ్చియార్ గా భక్తులచే కొలవబడుతున్న శ్రీ గోదాదేవి కొలువు తీరి ఉంది. పన్నిద్దరాళ్వారులను,  శ్రీ ఆంజనేయుని ఆలయం లో మనం దర్శించుకోవచ్చు. అద్దాల మండపం చూడదగ్గది.
                           
               
             

                            
                          శ్రీ స్వామి వారి దివ్య చరణాలు
                 
                          25.4 2003 లో   ఆలయజీర్ణోద్ధరణ,మూలవరుల మహాసంఫ్రోక్షణ కార్యక్రమం జరిగినట్లు ఒక శిలాఫలకం ద్వారా మనకు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని  ఆగమాచార్య శ్రీ సంపత్కుమారభట్టర్, మేల్కోటే వారి ఆథ్వర్యంలో నిర్వహించబడినట్లు ఇందులో  వ్రాయబడింది.
                        


                         
                           క్రీ.శ. 7,8 శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవ రాజులు  ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతోంది. 12 వ శతాబ్దం లోని రాజరాజనరేంద్రుడు, ఉభయ కుళోత్తుంగ ఛోళుడు గోదావరి, కావేరీ నదుల మధ్యభాగాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయ గర్భగృహ, ప్రాకారాదులను నిర్మింపచేశారు.
                            

                               శ్రీ రంగనాయకీ దేవి ఆలయ ముఖమండప దృశ్యం
               
                  13 వ శతాబ్దంలో జటావర్మసుందరపాండ్యుడు మనుమసిద్ధి ని జయించి, ఈ ఆలయం లో వీరాభిషేకము చేయించుకొని, ఈ స్వామికి మడిమాన్యాదులను ఇచ్చినట్లు క్షేత్రచరిత్ర లో వ్రాయబడింది.
                            


                               


                              శ్రీ రంగనాయకీదేవి ఆలయ విమాన దృశ్యం

                         క్రీ.శ 1879 వ సంవత్సరం లో శ్రీ యెరగడిపాటి వెంకటాచలం పంతులుగారు  ఈ ఆలయ తూర్పు రాజగోపురాన్ని నిర్మింపచేశారు.  సుమారు  100 సంత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు  శ్రీ స్వామివారికి బంగారం తాపడం చేసిన గరుడ వాహనాన్ని, అద్దాలమండపాన్ని  బహూకరించారు.
                        
                   
             
                                    రాజగోపురం లో  ఆహ్వానం  పలుకుతున్న రమణీమణి శిల్పం



               తొలిరోజుల్లో ఈ ఆలయ ప్రాంతానికి చిత్తరమేళవిణగళ్ ( శ్రీ వైకుంఠం ) అని , పళ్ళి కొండ పెరుమాళ్ ( శయన నారాయణుడు )  అనే పేర్లు ఉండేవట. 17, 18 శతాబ్ధాల్లో తల్పగిరి రంగనాథుడు గా ప్రసిద్ధమైనట్లు క్షేత్రచరిత్ర చెపుతోంది.  మనుమసిద్ధి ఏలిన నేల,  కవిబ్రహ్మ తిక్కన సోమయాజి నడయాడిన భూమి గా, తల్పగిరి రంగనాథుని దివ్యథామంగా  తెలుగువారికి ఈ సింహపురి  అత్యంత  అభిమాన పాత్రమైన ప్రదేశం.

       Visit  www.youtube.com /user/raviprasadmuttevi for more information




******************************************************************************

1 comment: