Wednesday, 17 October 2012

పెనుగంచిప్రోలు శ్రీశ్రీశ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం


          

      Penuganchiprolu Sri Lakshmi Tirupatamma Talli Aalayam.  

                   పెనుగంచిప్రోలు శ్రీ శ్రీ శ్రీ  లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం.

           पॆनुगंचिप्रोलु श्री श्री श्री  लक्ष्मी तिरुपतम्मतल्लि आलयम्.

                                    పెనుగంచిప్రోలు ఒకపురాతన నగరము   మున్నానది గా పిలువ బడే మునేటి ఒడ్డున విలసిల్లిన  బృహత్కాంచీపురమే ఈ పెనుగంచిప్రోలు. 11వ శతాబ్దంలో గుడిమెట్ట ను  పాలించిన చాగి వంశీయులకు రెండవరాజథాని గా పేరొందిన నగరమిది . వీరు రెండు శతాబ్దాల కాలం కాకతీయరాజులకు  విథేయులుగా ఉంటూనే  స్వతంత్ర ప్రతిపత్తి గల మాండలిక రాజ్యంగానే కొనసాగినట్లు చరిత్ర చెపుతోంది. ఇచ్చట నూటొక్క దేవాలయాలున్నట్లు అవన్నీ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినట్లు స్ధానికులు చెపుతుంటారు.
                            
                           అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అంటాడు అల్లసాని పెద్దన. అలాగే ఈ పెనుగంచిప్రోలు లో  ఎక్కడ తవ్వినా శిధిలశిల్పాలు కళాఖండాలే లభిస్తాయి. ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తున్నా, ఎక్కడ కొత్త నిర్మాణానికి గోతులు తవ్వుతున్నా  ఏదో ఒక పురాతన అవశేషాలు  బయట పడుతూనే ఉంటాయి. ఒక ప్రదేశానికి అంత మహత్తు  కలగటం ఆ స్థలమహత్యమని  పెద్దలు చెపుతారు .
       అటువంటి పవిత్ర ప్రదేశంలో తిరుపతమ్మ తల్లి పేరంటాలై  కొలువు తీరింది. కొలిచిన భక్తులకు     కొంగుబంగారమై, కోర్కెల తీర్చెడి కల్పవల్లి శ్రీ తిరుపతమ్మ తల్లి.
                                          
                                                           

                                           శ్రీశ్రీశ్రీ తిరుపతమ్మ గోపయ్యలదివ్యమూర్తులు    

స్థలపురాణం:--------  శ్రీ తిరుపతమ్మ తల్లి వృత్తాంతం క్రీ.శ 1695 లో జరిగినట్లు గా చెప్పబడుతోంది.  శ్రీ తిరుపతి  వేంకటేశ్వరుని అనుగ్రహంతో పుట్టిన  బిడ్ఢ కావున ఆమెకు తిరుపతమ్మ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. కృష్ణాజిల్లా అనిగండ్లపాడు  గ్రామానికి చెందిన కొల్లాశివరామయ్య, రంగమాంబ లు ఆదర్శదంపతులు. భగవంతుని యందు అపారభక్తి విశ్వాసములుకలిగి,పేదసాదలను ఆదుకొంటూ కీర్తిప్రతిష్టలు గడించిన కుటుంబం వారిది.ధనధాన్య పశు బంధుమిత్రాదులను కొల్లలుగా ఇచ్చిన ఆ భగవంతుడు ఆ కొల్లా వారి కుటుంబానికి సంతానయోగం లేకుండా చేశాడు.సంతానార్ధులై తిరుమలయాత్ర చేసిన ఆదంపతులకు తిరుమలేశుని అనుగ్రహంతో ఆడశిశువు జన్మించింది. 
                                      శ్రీ తిరుమల వాసుని  దివ్య ఆశీస్సులతో పుట్టిన బిడ్డకు తిరుపతమ్మ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచు కొనసాగిరి.  ఆ బిడ్డ పుట్టిన  వేళావిశేషమో, ఏమో గాని ఆయింట ధన ధాన్య పశుసంమృధ్ది   ఇబ్బడి ముబ్బడిగా పెరిగి  ఆ యిల్లే కాక ఆ గ్రామమంతయు పాడిపంటలతో కళకళలాడుచుండెను. పూవు పుట్టగనే పరిమళించునన్నట్లు చిన్ననాటినుండియు శ్రీ తిరుపతమ్మ భగవంతుని యందు భక్తి విశ్వాసాలను, పెద్దలయందు వినయవిధేయతలను , బీదలయందు దయాదాక్షిణ్యాలను ప్రదర్శిస్తూ  అందరికి తలలో నాల్క వలే మెలగు చుండెడిది.

                                                          ఆలయ రాజగోపుర దృశ్యం


                                          ఇదే సమయంలో  ప్రక్కనే ఉన్న పెనుగంచిప్రోలు లో  తిరుపతమ్మ  కు తల్లియైన రంగమాంబ గారి అన్నగారి కుటుంబం నివసిస్తుండేది. కాకాని రామయ్య  గారి కుటుంబం  పెనుగంచిప్రోలు  లో కీర్తి  ప్రతిష్ఠలు గల్గిన వ్యవసాయ కుటుంబం . వీరి తమ్ముడు కృష్ణయ్య.  అన్నదమ్ములిద్దరు  బలరామకృష్ణులవలె    ఒకే మాట  ఒకే బాట గా  వ్యవహరించెడి వారు.  రామయ్య గారి భార్య పుత్ర సంతానాన్ని కని కాలం చేయడం , మరికొంతకాలానికి రామయ్య కూడ మరణించడంతో ఆ పసివాని ఆలనా పాలనా కృష్ణయ్య  దంపతుల మీద పడింది. అతని పేరే మల్లయ్య. అన్నయ్య బిడ్డను అల్లారుముద్దుగా   పెంచుకుంటున్న కృష్ణయ్య దంపతులను చూసి ఇరుగు  పొరుగు వారు ఆశ్చర్య పోయేవారు.కొంతకాలానికి కృష్ణయ్య-వెంగమాంబా దంపతులకు మగపిల్లవాడు జన్మించాడు .  అతనికి గోపయ్య  అని   నామకరణం చేశారు. కృష్ణయ్య కు వ్యవసాయ  పనుల్లో సహాయం చేస్తూ  మల్లయ్య ,గోపయ్య లు పెరిగి పెద్ధ వాళ్లు అయ్యారు. యుక్త వయస్కుడైన  మల్లయ్యకు అనిగండ్లపాడుకే చెందిన కన్నేటి వారి ఆడబడుచు      చంద్రమ్మ నిచ్చి వివాహం చేశారు.


       దేవాలయ ఉత్తర ద్వార గోపురము

                        శ్రీ తిరుపతమ్మ ను  గోపయ్యకు ఇచ్చి వివాహం చేయడానికి  పెద్దలు సంప్రదించుకొని తాంబూలాలు పుచ్చుకున్నారు.ముహూర్తసమయానికి అంగరంగవైభవంగా గోపయ్య తిరుపతమ్మల కళ్యాణం జరిగింది.రెండు గ్రామాల్లోను పండుగ వాతావరణం వెల్లివిరిసింది.తిరుపతమ్మ అత్త వారింట  అడుగు పెట్టింది. ఆడపడుచు ను  అత్తవారింటికి పంపిస్తూ  సమస్త గృహోపకరణాలతోపాటు ఒక గోవు ను కూడ అరణం గా పంపించాడు స్ధితిమంతుడైన శివరామయ్య.
            కొత్తకోడలు రాకతో కాకాని వారింటికి కొత్త కళవచ్చింది.  పాడిపంటలు సిరిసంపదలు వృద్ధిచెందాయి. లక్ష్మీదేవి వచ్చిన వేళావిశేషమని నలుగురు చెప్పుకోసాగారు. క్రమక్రమంగా తోడికోడలు చంద్రమ్మ మనసులో  ఈర్ష్యాసూయలు బయలు దేరినాయి. అత్తగారైన  వెంకమ్మ మనసును కూడ మార్చి వేసింది. సూటిపోటిమాటలతో తిరుపతమ్మ ను వేధించసాగినారు.
                    ఈ ఆలయానికి సంబంథించిన వీడియో ను  you tube  ద్వారా చూడవచ్చు.




                      ఇదేసమయంలో ముదిరాజు వంశజురాలైన పాపమ్మ వచ్చి, తిరుపతమ్మతో పరిచయంచేసుకొని, ఆవిడకు అన్ని రకాల చేదోడు వాదోడు గా వుంటుండేది. తీరికసమయాలలో భారత,భాగవత,రామాయణాదులతో సద్గ్రంథ కాలక్షేపం చేస్తుండేవారు.
                        కాలం ఎప్పుడూ ఒకేరీతిగా ఉండదు కదా కృష్ణాజిల్లాలో వర్షాబావ పరిస్ధితులేర్పడ్డాయి. కరువుకాటకాలతో జనం వలసలు వెడుతున్నారు. గొడ్లకు మేతదొరకడం గగనమై పోయింది.   ఆలమంద ను  ఉత్తర ప్రాంత భూముల కు  మేత కోసం తోలుకుపోవడానికి నిర్ణయించుకొని ఊరంతా నిర్ణయించుకొంది.ఇంటికి ఒకరు చొప్పున మంద వెనక వెళ్లాలని తీర్మానం.కృష్ణయ్య  గారి ఇంటి నుండి గోపయ్య బయలుదేరాడు. భర్త వెళ్లడం తిరపతమ్మకు ఇష్టం లేకపోయినా సందర్భం కాదని మాట్లాడకుండా ఉండిపోయింది.           
                   గోపయ్య అడవి వెళ్లినదగ్గరనుండి తిరుపతమ్మ కు అత్త తోడికోడలు పెట్టే ఆరళ్లు కూడ ఎక్కువైనాయి.ఇంతలో తిరుపతమ్మకు కుష్టువ్యాధి సోకటంతో ఆమెను గొడ్లసావిట్లో పడేశారు.ఇన్ని బాధలు పడుతున్నాతిరుపతమ్మ పుట్టింటికి ఒక్కకబురు కూడ చేయలేదు. అన్ని వేళలా పాపమ్మె ఆమెకు చేదోడు వాదోడు గా  ఉండేది. ఇంతలో ఆలమందల వద్ద నున్న గోపయ్యకు తిరుపతమ్మ ను గూర్చి ఏవేవో  చెడు కలలు రాలడంతో ,తన ఆవులను తోటివారి కప్పగించి పెనుగంచిప్రోలు వచ్చేశాడు. ఇంట్లో తిరుపతమ్మ కనపడలేదు. అమ్మ వదినలు  తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లిందని అబద్దమాడారు. మునేటి ఒడ్డున అమ్మలక్కల మాటల్లో  తిరుపతమ్మ కొచ్చిన కష్టాన్ని విన్న గోపయ్య పరుగు పరుగన గొడ్లసావిడికి చేరుకొన్నాడు.


                     కుళ్లి కృశించి నీరసించిన శరీరంతో గోశాల లోపడివున్న ఇల్లాలును చూచి  విహ్వలుడై, ఆమెను పట్టుకొని బోరుబోరు న విలపించాడు గోపయ్య. వెంటనే వెళ్లి అలమందను తోలుకొచ్చేసి  ,తిరుపతమ్మ దగ్గరే వుండి   ఆరోగ్యాన్ని చూసుకంటానన్నాడు.    తిరుపతమ్మవద్దంటున్నా వినక మందను తోలుకు రావడానికి అడవికి వెళ్లిపోయాడు గోపయ్య .అక్కడ కు వెళ్లేసరికి పరిస్థితంతా అస్తవ్యస్దంగా ఉంది. తిరుపతమ్మ పుట్టింటినుండి  అరణంగా తెచ్చుకున్నఆవు ను పెద్దపులి  నోట కరుచుకు పోయిందని చెప్పారు తోటిస్నేహితులు. అసలే  బాధలో వున్న గోపయ్య  ఆవేశంతో గండ్రగొడ్డలి పట్టుకొని  పులి గుహలోకి ప్రవేశించాడు. విథివక్రించింది . గోపయ్య నేలకొరిగాడు. ఆవిషయం తన యోగశక్తి తో తెలుసుకున్న తిరుపతమ్మ యోగాగ్ని తో మరణించడానికి సిద్దపడి, గ్రామపెద్దయైన శ్రీశైలపతి గార్కి పాపమ్మ ద్వారా కబురు చేసింది.చర్చోపచర్చల  తరువాత గ్రామపెద్దల అంగీకారం జరిగింది. వెంకమ్మ, చంద్రమ్మలు తమ తప్పు తెలుసు కొని తిరుపతమ్మను శరణువేడారు. పాపమాంబ  వంశము ఆచంద్ర తారార్కము  అభివృధ్ధి చెందుతూ,నిత్యనైవేద్య దీపధూప అర్చనహారతులు  తిరుపతమ్మకు పాపమ్మవంశము వారినుండే లభించేటట్లు   ఆదేశించిన తిరుపతమ్మ పసుపు కుంకుమలతో కూడిన పూజాపళ్లాన్ని పాపమ్మకు అందించింది . పాపమ్మ కడసారిగా కన్నీటితో తిరుపతమ్మకు పాదాభిషేకం చేసింది .   
                                                                                                                                          
                           సాయంసంథ్యావేళలొ , బాజాభజంత్రీలుమారుమ్రోగుతుంటే, దిక్కులు పిక్కటిల్లేలా జనసందోహం జయజయథ్వానాలు చేస్తుంటే తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశం చేసింది.  ఆప్రదేశంలో  తిరుపతమ్మ తల్లి చెప్పిన ప్రకారం మంగళసూత్రము కుంకుమ భరిణె దేదీపేయమానంగా ప్రకాశించే గోపయ్య తిరువతమ్మ ల విగ్రహాలు  లభించాయి. గ్రామపెద్దలైన శ్రీశైలపతి గారు  ఆప్రదేశంలోనే  దివ్యయంత్రాలతో ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయాన్ని నిర్మించారు. తమ్ముడి మరణం మరదలు యోగాగ్ని ప్రవేశంతో దిగులు పడి  మంచం పట్టి మరణించాడు మల్లయ్య.  తన  తప్పులు తెలుసుకున్న  చంద్రమ్మ  పసిపాపతో సహా సతీసహగమనం చేసింది.  శ్రీశైలపతి గార్కి తిరుపతమ్మ కలలో కన్పించి చెప్పడంతో,  చంద్రమ్మ మల్లయ్యలకు కూడ అమ్మవారి ఆలయానికి  దక్షిణంగా గుడి కట్టించారు. ముందుగా చంద్రమ్మ  దంపతులను దర్శించిన తరువాతే అమ్మవారిని దర్శిచాలనేది నియమం. ఆనాటి  నుండి తిరుపతమ్మ పేరంటాలు   భక్తుల పాలిట  కామధేనువై  కోరిన కోరికలను తీరుస్తూ, భక్తులమొక్కులను అందుకుంటూ కాపాడుతోంది.




చారిత్రకత.         పెనుగంచిప్రోలు  చారిత్రక నగరమని ఇంతకు ముందే  ప్రస్తావించాను. 11, 12 శతాబ్దాల్లో  

గుడిమెట్ల రాజ్యాన్నిపరిపాలించిన చాగి పోతరాజు కుమారులు  దోరపరాజు  గణపతిరాజు మనమ గణపతి రాజు వేయించిన శాసనాలు పెనుగంచప్రోలు,  వేదాద్రి ,కొనకంచి నవాబుపేట, ముక్త్యాల, ముప్పాళ్ల, మాగల్లు  జుజ్జూరు మొదలైన ప్రాంతాల్లో లభించాయి. కాకతీయ శిల్పశిథిలాలు ఇప్పటికీ తవ్వకాల్లో బయటపడుతూనే ఉన్నాయి. ఉంటాయి కూడ. మునేటికి వరద వచ్చి తీసేసి నప్పుడల్లా   ఏట్లో  ఏవేవో కట్టడాలు ,నిర్మాణాలు బయటపడటం సాథారణమై పోయింది.
                            

                                                                           శాసనము
                             
                                 ఆనాడు నందిగామ తహశీల్దారుగా  ఉన్న మహమ్మద్ మొయినుద్దీన్ గారు తిరుపతమ్మ మహిమను తెలుసుకొని  , అమ్మ వారిఆలయనిర్మాణనిమిత్తం రెండు ఎకరాలస్థలాన్ని వ్రాసి యిచ్చిన శాసనం ఇప్పటికి ఆలయంలో మనకు కన్పిస్తోంది.


ఆలయ ప్రత్యేకత :------             సంతానార్థులైన దంపతులు మునేట్లో మునిగి, తడిబట్టలతో ఆలయప్రదక్షణం  చేసి, ప్రాణాచారం పడినట్లయితే అమ్మ పసిపాప రూపంలోనో, పెద్దముత్తైదువు రూపంలోనో వచ్చి ఆశీర్వదిస్తుందని భక్తులనమ్మకం. కోరిక తీరిన భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించు కుంటుంటారు.  పెళ్లిజరగటంలో జాప్యం జరుగుతున్నా, కాపురంలో కలతలు రేగినా  వారి తల్లిదండ్రులుగాని  అత్తమామలు గాని వచ్చి అమ్మవారి కళ్యాణం  జరిపించి పసుపు కుంకుమ అక్షతలను స్వీకరిస్తే  కలతలు తీరతాయని విశ్వాసం.

  ఆదిపరాశక్తి అంకమ్మ.:--------                    ఈమె పెనుగంచిప్రోలు గ్రామదేవత.ఈమె కూడ ఈ ఆలయంలోనే కొలువు తీరి ఉంది.కోరికలు నెరవేరిన తరువాత భక్తులు ఈమె కొరకే చిన్నతీర్థం{ కోడి} పెద్దతీర్థం{ మేక} పూజ చేస్తారు. ఈమెను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు నిమ్మకాయ పూజలు చేస్తారు. అంకమ్మవారి వద్ద నిమ్మకాయ పూజ జరిపిన భక్తులకు నరఘోష పీడానివారణ, వాహనవృద్ది, గృహశాంతి, ధనవృద్ది జరుగుతాయని  ప్రగాఢనమ్మకం.



మద్దిరావమ్మ అమ్మవారు.:--------                ఇదే ఆలయంలో కొలువు తీరిన అమ్మ్మవారు. మంచిరాలపురం మంచిర్యాల  పాలించే రెడ్డిరాజు  మహమ్మదీయులతో జరిగిన యుద్దంలో వీరమరణం పొందాడు. ఆవిషయం తెలిసిన ఆయన ఇల్లాలు మద్దిరావమ్మ  యుద్ధరంగానికి వెళ్ల సేనాపతిని సహాయంతో శత్రురాజులను సంహరించి  విజయం సాథించి,  తన ప్రజలచేత విజయలక్ష్మి  గా మన్ననలనందుకొంది. ఆమె ఈ క్షేత్రానికి వచ్చి  ప్రణవంతో హృదయ స్పందనను నిరోధించి , తిరుపతాంబ ఆశీ: బలంతో ఇక్కడ అమ్మవారై వెలసింది. మద్దిరావమ్మ అమ్మవారి అర్చకస్వాములచే  ధరింపజేయు విజయలక్ష్మీ కంకణం  కోరిన కోర్కెలను తీరుస్తుందని విశ్వాసం. ఇది ఈ ఆలయంలో ప్రత్యేకం.



శ్రీ జ్యేష్టాదేవి అమ్మవారు.:-----        గోపయ్యస్వామి ని  భౌతికంగా కడతేర్చిన పులి   పెద్దమ్మ తిరుపతమ్మ  యోగాగ్ని ప్రవేశం చేసిన మూడోరోజున   ఆ పుణ్యస్థలికి   అనగా ఇపుడు ఆలయం ఉన్నప్రాంతానికి వచ్చి మూడుసార్లు  ప్రదక్షిణం చేసి ప్రక్కనే ఉన్న మఱ్ఱిచెట్టు వద్దకు వెళ్లి  తిరుపతమ్మ తల్లి కి నమస్కరిస్తూ  తుది శ్వాస విడిచింది. దాన్ని సమాథి చేయడానికి  గొయ్యి త్రవ్వగా దానిలో శార్ధూలవాహిని యైన పెద్దమ్మవిగ్రహం లభించింది. అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టించారు శ్రీశైలపతిగారు. మనుష్యులను కష్టపెట్టి ,అనేకపరీక్షల నిచ్చి మనిషిలోని శక్తి సామర్థ్యాలను ప్రతిభను బయటపెట్టేదే పెద్దమ్మ అని ప్రజలు నమ్మకం.




                                                      అమ్మవారి  ప్రభోత్సవము జరిగే ప్రభ

                     ప్రత్యేక ఉత్సవాలు.:- తిరుపతమ్మతల్లి  కి ప్రతియేటా  రెండు తిరునాళ్లు జరుగుతాయి. మొదటి తిరునాళ్లు మాఘపౌర్ణమి నాడు ప్రారంభమయి ఐదు రోజులు జరుగుతాయి. మాఘఫౌర్ణమి రోజున నిథి మహోత్సవము. ఆరోజున ఆరుబయట  శ్రీ తిరుపతమ్మ గోపయ్యస్వాముల కళ్యాణం జరుగుతుంది. అదేరోజున అప్పటికి  41 రోజులముందు ఇరు ముళ్లు కట్టించుకున్న  తిరుపతమ్మ మండల దీక్ష తీసుకున్న స్వాములందరు  తిరుపతమ్మ గోపయ్యస్వాముల  కళ్యాణాన్ని దర్శించి తిరుముళ్లు సమర్పిస్తారు. రెండవరోజు జలబిందెల మహోత్సవము  .మూడోరోజు అంకమ్మవారికి అంకసేవ, నాల్గవరోజు పొంగలి నివేదన, అ దేరోజున అర్థరాత్రి 12గంటల తర్వాత ఐదవరోజు  అమ్మవారిదీవెనగా బండారును భక్తులకు పంపిణీ చేస్తారు.
                             రెండవ తిరునాళ్లు  ఫాల్గుణ పౌర్ణమి నాడు ప్రారంభమయి ఐదు రోజులు జరుగు తుంది. దీన్ని  చిన్నతిరునాళ్లు అంటారు.మొదటి రేజు అఖండస్థాపన,రెండోరోజు రథోత్సవము, మూడోరోజు ప్రభోత్సవము, శుక్ర, మంగళ వారాలు కాని రోజులు చూచి నాల్గవరోజు  పుట్టింటి పసుపు కుంకుమను అనిగండ్లపాడు నుండి తెచ్చుమహోత్సవం జరుగుతుంది. ఐదోరోజు బోనాలపండుగ.
                 ఇవిగాక రెండు సంవత్సరాలకొకసారి మేడారం సమ్మక్క సారక్కజాత జరుగు సమయంలోనే          గర్భాలయంలోని అమ్మవారి విగ్రహాలకు సహదేవతా విగ్రహాలకు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తీసుకెళ్లి రంగులు వేయించడాన్ని  రంగులోత్సవమని పిలుస్తున్నారు.పుష్యమాసం కృష్ణపక్షఏకాదశినాడు రంగులోత్సవానికి  బయలుదేరిన అమ్మవారు మాఘశుద్ధ ద్వాదశి నాటిరాత్రికి తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తారు. విగ్రహాలన్నీ దారువుతో చేసినవి అవడం మూలంగా ఈ ఉత్సవం ఏర్పడింది. ప్రతి శుక్రవారం ఉ,.7.30-8.30  అమ్మవారికి అబిషేకం  విశేష కార్యక్రమంగా జరుగుతుంది.ప్రతిరోజు  ఉదయం 10. గం నుండి 12.30 ని.వరకు    శ్రీ తిరుపతమ్మ  గోపయ్య స్వాముల నిత్యకళ్యాణోత్సవం జరుగుతుంది.ప్రతి శ్రీరామ నవమి కి సీతారామకళ్యాణం నిర్వహిస్తారు.   ప్రతి వైకుంఠఏకాదశి కి ్అమ్మవారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది.

                                                              అమ్మవారి రధము
                 ఆలయము తెఱచి ఉంచు వేళలు.:-------   ఫ్రభాతకాలం లో గం.4.30ని.లకు మేలుకొలుపు తో ఆలయం  తలుపులు తెరుచుకుంటాయి .రాత్రి గం.8 .30 ని.లకు కవాటబందనము.  ఉ.5.30 ని.లకు సర్వదర్శనం ప్రారంభం. మ.3.00 నుండి రా. 8.00 వరకు సర్వదర్సనం కొనసాగుతుంది. మిగిలిన సమయాల్లో  వీలుని బట్టి ప్రత్యేక దర్శనం ఉంటుంది.
రవాణాసౌకర్యాలు.:----- నందిగామ, విజయవాడ, జగ్గయ్యపేట, నుండి ఆర్టీసీ  సర్వీసులు ఉన్నాయి. ప్రత్యేక ఉత్సవాలప్పుడు  రాష్టంలోని ప్రదాన కూడళ్లనుండి ప్రత్యేక సర్వీసులు నడప బడుతున్నాయి.
సంప్రదించవలసిననెంబరు.:------ 08678-283204


*********************************************************************************



2 comments:

  1. చాలా బాగుంది బాబాయ్ గారు.
    నేను కూడా తమ్మర తాతగారైన గోపాలాచార్యులుగారు రచించిన పెనుగంచిప్రోలు శ్రీ ధర్మపురి యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వారి చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా http://panilkumar78.blogspot.in/ లో టైప్ చేసి ఉంచాను. మీకు వీలయినచో చదవగలరని మనవి.
    ఇట్లు
    మీ పట్టాభి రామ చక్రవర్తి, సూర్యాపేట.

    ReplyDelete
  2. చక్కగా వివరించారు
    🙏

    ReplyDelete