Thursday 25 October 2012

తిరుమలగిరి స్వయంభూశ్రీ వేంకటేశ్వరస్వామి


              Tirumalagiri Swayambhu Sri Venkateswara Swamy.


                                      తిరుమలగిరి  స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి
                          
            
           तिरुमलगिरि स्वयंभू श्री वेंकटेश्वरस्वामि.



                                      తిరుమలగిరి  కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆపదమొక్కులవాడు ,ఆర్తత్రాణ పరాయణుడు నైన ఆ ఏడు కొండల వాడు భక్త పరాధీనుడు కావున తన భక్తులను ఆదుకోవడానికి భక్తులు ఎక్కడికి ఏ రూపం లో రమ్మని అడిగితే అక్కడ ఆ రూపంలో వెలిసే భక్తానుకంపుడు ఆ శ్రీనివాసుడు. వివిధ రూపాలలో తన అర్చారూపాన్ని  భక్తులకు ప్రదర్శించి వారిని అనుగ్రహించడమే కాక  వివిద రీతులలో తన అర్చా రూపాన్ని తానే దర్శించుకొని మురిసి పోవడం ఆ లీలారూపునకు ఒక క్రీడ. లేకపోతే ఇన్ని అవతారాలు, ఇంతమంది అర్చామూర్తులు  ఎందుకుంటారు.  తనను తానే సృజించుకునే అజుడు. అవ్యయుడు. అప్రమేయుడు  ఆది మథ్యాంత రహితుడు  ఆ నారాయణుడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు  పెంజీకటి కవ్వల వెలిగెడి కాంతిధార ఆయన.

                                             
                                               వల్మీకం.    ముందు స్వామి వారి ఊహాచిత్రం 

               అటువంటి కరుణాధాముడు,కారుణ్య రస సింధువు నైన శ్రీమన్నారాయణుడు కలౌ వేంకటనాయక:” అని కలియుగంలో వేంకటేశ్వరుడై భక్తులను కాపాడుచున్నాడు. అటువంటి వేంకటేశ్వరుడు  భరద్వాజముని తప ఫలితంగా  ఈ  తిరుమలగిరి పై వల్మీకాంతర్గతుడై  మహిమానురూప దివ్యదర్శనంతో  శ్రీనివాసుడై స్వయంవ్యక్తుడైనాడు.

                                         

                                                ఆలయానికి మెట్ల మార్గం             

   స్థలపురాణం  :-----         తిరుమలగిరి కృష్ణాజిల్లా  జగ్గయ్యపేట మండలంలో చిల్లకల్లునుండి 3.కిమీ దూరంలో ఉంది.  కృష్ణానది  ఉత్తరవాహిని గా ప్రవహించే పవిత్ర ప్రదేశంలో  ఆశ్రమాన్నినిర్మించుకొని, దీర్ఘకాలం  తపస్సు చేసిన   భరద్వాజమహర్షి  ప్రార్ధన ను మన్నించి  తిరుమలగిరి పై  వల్మీక రూపంలో వేంకటేశ్వరుడుగా అవతరించాడు.  ఆయన పానుపైన ఆదిశేషువు కూడ ఆయనను అనుసరించాడు. తిరుమలగిరి వేంకటేశ్వరుడు  వల్మీకంలో నుండే పూజలందుకుంటున్నాడు. అందుకనే సూర్యాస్తమయం తర్వాత  దేవాలయాన్ని మూసేస్తే మరల సూర్యోదయం తర్వాతే తెరుస్తారు. అంతేకాదు. ఆలయం మూసేసిన తరువాత ఆలయ పరిసరాల్లోగాని , కొండమీద గాని  అర్చక,పాచక,పరిచారకులతో సహా ఎవ్వరూ ఉండరు. రాత్రిపూట స్వామిని సేవించడానికి   ఆదిశేషువు ఇతర నాగులు వస్తారని , వారి రాకను తెలియజేస్తూ , ఆలయము, దాని పరిసరాలు రాత్రివేళల్లో  అద్భుత సువాసనలు వెదజల్లుతుంటాయని ఒక జనశృతి ప్రబలంగా ఉంది. రాత్రి వేళల్లో పెద్ద పెద్ద నాగులు  స్వామి సన్నిథిలో తిరుగాడటం చూసిన సిబ్బంది ఉన్నారు . ఈ కారణంగానే   సాయంత్రం 6 గం.లకు కవాటబంధనం చేస్తే  మరుసటి రోజు   ఉదయం 6గం.కు తిరిగి తలుపులు  తెరవడం  సంప్రదాయంగా వస్తోంది. స్వామి వారు  తిరుమలగిరి పై వెలిసేటప్పుడు తన వామపాదాన్ని  బండశిలలపై తాకించగానే  గంగ పొంగి అక్కడ పుష్కరిణి ఏర్పడింది . దానినే శ్రీపాద పుష్కరిణిగా పిలుస్తున్నారు.   స్వామి ఆలయం ప్రక్కనే కుడివైపు వరాహమూర్తి కొలువుతీరి ఉన్నాడు.  స్వామి వారి ఆలయప్రదక్షిణ సమయంలో  భక్తులు వరాహమూర్తిని   దర్శించి ,స్పృశించి, నమస్కరించి పరవశులౌతుంటారు.
                

                                   
                                             ఆలయ ప్రాంగణం


         భ్రమరాంబా సమేత మల్లేశ్వర  స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడుగా పూజలందుకుంటున్నాడు. తిరుమలగిరి చుట్టూ తొమ్మిది ఆంజనేయమూర్తులను నవాంజనేయ ప్రతిష్ఠ గా భరద్వాజమహర్షి ప్రతిష్ఠించినట్లు ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. కాని ప్రస్తుతం ఐదు రూపాలే దర్శనమిస్తున్నాయని స్థలపురాణం చెపుతోంది.

                                                   శ్రీ వరాహస్వామి 

             క్షేత్ర ప్రాథాన్యత :-------   గిరి ప్రదక్షిణం ఇచ్చట ప్రత్యేక ప్రాథాన్యాన్ని పొందింది. ప్రతి ఉగాదికి చుట్టుప్రక్కల జిల్లాలనుండి కూడ వేలాదిమంది  భక్తులు ఎడ్లబండ్లకు ప్రభలు కట్టుకొని  మేళ తాళాలతో వచ్చి స్వామిని దర్శించుకుంటారు.దర్శనానికి వచ్చిన భక్తులందరూ పాలు, పెరుగు, నెయ్యి , కొత్తధాన్యం, కొత్త పెసరపప్పు, గుమ్మడి కాయలు  తీసుకు వచ్చి స్వామికి సమర్పించుకుంటారు. రైతులు తమ పాడి గేదెలను ఆవులను, కోడెదూడలను సర్వాంగసుందరంగా  అలంకరించి  ప్రతి ఉగాదికి కొండచుట్టు ప్రదక్షిణం చేయించడం  ఆనవాయితీ. ఈ  ప్రదక్షిణం తో పశువులకు ఆయురారోగ్యాలు కలిగి పశుసంపద అబివృద్ధి చెందుతుందని రైతులనమ్మకం.    ఆవులను  గిరి ప్రదక్షిణం చేయిస్తే కోడెదూడలు  పుడతాయనే నమ్మకం  ఈప్రాంతపు రైతుల్లో బలంగా ఉంది.
            


                                     
                                                     శ్రీపాద పుష్కరిణి

                    ఈ క్షేత్రానికి  క్షేత్రపాలకుడుగా నున్న శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి వారి ఆలయానికి ఉత్తరభాగంలో ఒకబిల్వవృక్షం ఉంది. దీనిని సంతాన బిల్వవృక్షమని పిలుస్తుంటారు. సంతానార్ధులైన దంపతులు యీబిల్వవృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి , భార్య తన చీర చెంగు చింపి ఈ చెట్టుకు కట్టి తన కోరిక తెలుపుకుంటే ఏడాది తిరిగే సరికి పండంటి బిడ్డతో వచ్చి స్వామిని దర్శించుకుంటారని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

                 శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి ఆలయం.   వెనుకగా సంతాన బిల్వవృక్షం

                  అలాగే స్వంత యిల్లులేని  గృహస్థులు స్వామి పట్ల విశ్వాసంతో   మల్లేశ్వరస్వామికి దక్షిణభాగంలో ఉన్న రాళ్లల్లో రాయిపైన రాయి ఐదు రాళ్లను ఎత్తుగా పేర్చి  దంపతులు తనకోరికను స్వామితో చెప్పుకుంటే ఇల్లు సమకూరుతుందని  భక్తులు నమ్ముతున్నారు. ప్రతి ఉగాది ఎడ్లబండ్లు కట్టుకొని   చుట్టుప్రక్కలనుండే కాక ఇతరజిల్లాల నుండి వచ్చేవారిలో కూడ  దంపతులు,నవదంపతులే ఎక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. కలియుగ నాథుడైన శ్రీవేంకటేశ్వరుని  శనివారం నాడు దర్శించడం,అభిషేకం చేయించుకోవడం,  అష్టోత్తర ,శతనామాలతో పూజించుకోవడం వలన శని దోషనివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం.


                                   
                                               అందమైన ఆలయ దృశ్యం

ప్రత్యేక ఉత్సవాలు:------    ప్రతి శనివారం జరిగే విశేషపూజలే కాకుండా ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి కి ఫ్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు.ప్రతి దసరాకు శమీపూజ,ప్రత్యేక సేవలు ఉంటాయి.ప్రతి వైకుంఠ ఏకాదశి కి ఉత్తర ద్వార దర్శనం,గ్రామోత్సవం నిర్వహిస్తారు. చైత్రఫౌర్ణమి కి స్వామి వారి కళ్యాణం పాంచాహ్నిక దీక్షతో వైఖానసాగమం ప్రకారం నిర్వహిస్తారు.పౌర్ణమి రోజున స్వామి వారి కళ్యాణం, రెండవరోజు రధోత్సవం, మూడవరోజు సప్తర్షుల పూజ, సదశ్యము, నాల్గవరోజు వసంతోత్సము , ఐదవరోజు చోరసంవాదము , పుష్పయాగము  అతి ఘనంగా జరుగుతాయి.ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు శ్రీ స్వామి వారిని దర్సిస్తారు
.
                                 
                                                      శ్రీ వారి పాదాలు


                 స్వామివారి సన్నిధిలో నామకరణోత్సవాలు, అన్నప్రాసనలు,ఉపనయనాలు,   వివాహాలు చెవులు కుట్టించుకోవడం వంటి శుభకార్యాలను భక్తులు వేడుకగా  జరుపుకొని మ్రొక్కుబడులు సమర్పించుకుంటారు.ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో రైతులు ఆ యేడాది తాము పండించిన పంటను, పాలు, నెయ్యిని స్వామివారికి అర్పించుకోవడం  ఒక ఆనవాయితీ గా వస్తోంది.

                  చైత్ర శుద్ధ పౌర్ణమి నాటికి  41 రోజులు పూర్తయ్యే విధంగా  వేంకటేశ్వర మాల థారణ చేయడం ఇక్కడొక  సంప్రదాయంగా వస్తోంది.



                                                ఆలయ ముఖద్వారం

రవాణా వసతి సౌకర్యాలు :-------    చిల్లకల్లు, జగ్గయ్యపేట ల నుండి ఆర్టీసీ, ఆటో సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. కొండపైకి ప్రస్తుతము కచ్చా రోడ్డు వేయబడింది.చిల్లకల్లు నుండి  3 కి.మీ దూరమే కాబట్టి   ప్రయాణము   భారము కాదు. పరిమిత సంఖ్య లో గదులు వసతి సౌకర్యాలు లభిస్తాయి.  పరిమితంగా నిత్యాన్నదానపథకం కొనసాగుతోంది.


                                                  గరుడాళ్వారు దివ్య దర్శనం

ఆలయము తెఱచి ఉంచు వేళలు :----   ఉ .6 .గం.ల నుండి సా.6.గం.వరకు వివిథ దర్శనాలు  అందుబాటులో ఉంటాయి.  అబిషేకం చేయించుకోదలచిన భక్తులు  ఉదయం 7గం.లకు ముందే ఆలయానికి చేరుకోవాలి.ప్రతిరోజు ఉ.7.గం.లకు స్వామి వారికి అభిషేకం జరుగుతుంది.

 ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు.:-----     8654-200288  ,200579
        తిరుమలగిరి క్షేత్ర వైభవము అనుపేరు తో స్థలపురాణం కౌంటరు లో 10రూ/ లభ్యమౌతుంది. స్వామి వారి సేవలు ,  పూజా వివరాలు  స్థలపురాణం లో చూడవచ్చు.

 ***************      శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం       *********************

No comments:

Post a Comment