Muktyala Sri Bhavani Mukteswara Swamy.
ముక్త్యాల శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి.
मुक्त्याल श्री भवानी मक्तेश्वरस्वामि आलयम्.
కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహించే పవిత్ర పుణ్యతీర్ధం ముక్త్యాల.కృష్ణాజిల్లా జగ్గయ్యపేటనుండి దక్షిణం గా కృష్ణాతీరాన వెలసిన అతి ప్రాచీన పుణ్య తీర్ధ మిది. క్రీ.శ 12 వశతాబ్దపు నాటి శాసనాలు శ్రీ భవానీముక్తేశ్వరస్వామి దేవాలయ ధ్వజస్ధంభం ప్రక్కన, కళ్యాణ మండపం స్థంభం మీద కన్పిస్తున్నాయి. రెండువేల నాటి” శాలివాహన సప్తశతి “లో ఈ ముక్త్యాల ప్రాంతాన్ని గూర్చిన గాథలున్నట్లు విమర్శకులు భావించారు.
కృష్ణానది ముక్త్యాల వద్ద ఉత్తరవాహిని గా మారుతుంది.ఉత్తరవాహినిలో స్నానం చేయడం సకల కల్మష హర మని భక్తులు భావిస్తారు. కృష్ణానది ఉత్తరవాహిని యైన ఈ ప్రదేశంలోనే నదీగర్భంలో ఒక శివాలయము ఉంది. చిత్రంలో మనకు ముఖమండపము పై కప్పు, నందీశ్వరుని మూపురంమాత్రమే మనకు కన్పిస్తున్నాయి. ఇది నడి వేసవి లోని స్ధితి. ఇంక వరదలు సంభవించే వర్షాకాలంలో ఆలయమే కన్పించదు.
నది లోని శివాలయం ,
సంవత్సరం లో అధికకాలం నీటిలోనే మునిగి ఉండే ఈ మహాదేవునకు ఆరునెలలు దేవతాపూజ, ఆరునెలలు మానవపూజ అని ప్రాంతీయులు ఛెప్పుకుంటారు. ఈ ముక్తేశ్వరునికి ఎదురుగా నందీశ్వరుడు కూడ తన స్వామితో పాటు నీటిలో “మోర “ఎగపట్టి కన్పిస్తాడు. ఒక నంది విగ్రహం శిధిలం కాగా వేరొకనంది ని ప్రతిష్టించారు.అందుకే చిత్రంలో మనకు రెండు నందులు కన్పిస్తున్నాయి. వర్ష సాంద్రత తగ్గి ,బరాజు నిర్మాణం జరిగిన ఈరోజుల్లోనే ఈవిధంగా ముక్తేశ్వరుడు నీటిలో ఉంటే , ఆనాడు నదీగర్భంలోనే మూడువందల అరవై రోజులు ఉండేవాడేమో ననిపిస్తోంది. శ్రీ ముక్తేశ్వరుడు ఎల్లవేళలా ఙలధరేశ్వరుడి గానే దర్శనమిచ్చే వాడన్నమాట.
నీటిలో జంట నందులు.
స్ధలపురాణం.:------ ఈ ముక్తేశ్వరస్వామి బలిచక్రవర్తి ప్రతిష్టగా స్ధలపురాణం చెపుతోంది. పూర్వం నైమిశారణ్యంలో బాణాసురుని తండ్రియైన బలిచక్రవర్తి కైలాసవాసుడైన చంద్రశేఖరునిగూర్చి తపస్సు చేసాడు. అతని తపోజ్వాలలుల ఎల్లలోకాలను దహించివేయసాగాయి. దేవతలందరు భయపడి,పరమేశ్వరుని చేరుకొని రక్షించమని ప్రార్ధించారు. కరుణాహృదయుడైన పశుపతి దేవతల కభయమిచ్చి, తన భక్తుని భక్తికి మెచ్చి బలిచక్రవర్తికి ప్రత్యక్షమయ్యాడు. బలిచక్రవర్తి ప్రత్యక్షమైన పరమేశ్వరుని పలురీతులుగా స్తుతించి ,దేవా! నీవు కాశీక్షేత్రం లో విశ్వేశ్వరుడను పేరుతో వెలసి సమస్త జీవజాలాన్ని కాపాడుతూ ముక్తిని ప్రసాదిస్తున్నావు. అదేవిధంగా దక్షిణకాశి గా పేరొందిన ముక్త్యాల క్షేత్రంలో “ముక్తేశ్వరుడ” ను పేరుతో “శక్తి” తో గూడి భక్తులకు ముక్తిని ప్రసాదించమని ప్రార్ధించగా పరమేశ్వరుడు అందుల కంగీకరించి ముక్తేశ్వరుడుగా ముక్త్యాలలో వెలిశాడు. నదీ గర్భంలో స్వర్ణాలయం ఉందని, దానిని విశ్వకర్మ సృష్ఠించాడని బలిచక్రవర్తి ఈ ఆలయంలో స్పటికలింగాన్ని ప్రతిష్టించి పూజించాడని స్ధలపురాణం.
చాగి పోతరాజు శాసనం
చారిత్రక నేపథ్యం : ----- నదీగర్భంలోని ఈ ఆలయం కాక నదీతీరంలో మరొక భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం కన్పిస్తుంది.ఇది మహామండలేశ్వరులు”,నరసింహవర్ధన” బిరుదాంకితుడైన చాగి పోతరాజు నిర్మాణం.తన విజయ రాజ్యము యొక్క ఆచంద్రతారార్క అభివృద్ధి కొరకు, తన ప్రజల సుఖశాంతుల కోసం చాగి పోతరాజు వేయించిన దానశాసనం శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్ధంభానికి వెనుక గా నున్న నాగశిలపై కన్పిస్తుంది. ఈ శాసనంలో” నరసింహవర్ధన” పోతరాజు చేసిన అనేక పుణ్యకార్యాలు ప్రస్తావించబడ్డాయి.
“ చాగిపోతరాజు ముక్తేశ్వర
మహాదేవరకు ఆలయ నిర్మాణాన్నిచేయించాడు. త్రిపురాంతక కాశ్మీర మల్లేశ్వర విశ్వనాథ చోడనారాయణ దేవరలకు కనకకలశాలను
ఎత్తించాడు. సింహాచల నారసింహునకు ” చాగి సముద్రము “అనే చెఱువు ను తవ్వించాడు. శ్రీశైలం లో మల్లిఖార్జునునకు
ఎదురుగా నందికేశ్వరుని ప్రతిష్టించి, దేవ భోగములకొరకు, కంభంపాడు,
ముచ్చింతాల,బోదపాడు మొదలగు గ్రామాలను దానం చేశాడు. నతవాడి సీమను బెజవాడనుండి పరిపాలించిన
రాజనీతిజ్ఞుడీయన. ఈ శాసనం మీద
సంవత్సరం ఛిద్రమైంది . కొంత భాగం లభించక శాసనం అసంపూర్తిగా ఉంది. { ఆర్కే/301/1924}
బలిచక్రవర్తిచే
నిర్మింపజేయబడి, విశ్వకర్మసృష్టిగా
చెప్పబడుతున్న దేవాలయం నదీగర్భంలో అధికకాలం ఉండిపోయి, సామాన్యప్రజలకు ఉత్తరవాహినిలో శివపూజకు అవకాశం లభించడంలేదనే
ప్రజల అభ్యర్ధన మేరకు రెండవపోతరాజు ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు. ఈతని కాలం క్రీ.శ 1230 ప్రాంతం . కుఱుకుర్రు స్వయంభూదేవరకు దానం చేసిన
నవాబు పేట శాసనం లో వీని ప్రస్తావన కనబడుతోంది. ఆ శాసనకాలం శా.శ. 1152 గా
వ్రాయబడింది. నరసింహవర్ధనపోతరాజు బెజవాడ రాజధాని గా నతవాడి
సీమను పరిపాలించాడు.ముక్త్యాల దేవాలయంలోని శాసనం వంటిదే విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి
వారి ఆలయంలో కూడ కన్పిస్తోంది. ముక్త్యాలలోని ముక్తేశ్వర
ఆలయంలోని కళ్యాణమండపంలో శా.శ.1129 {క్రీ.శ. 1207 } నాటి ,ఈవని కండ్రవాట్యధిపతి కేశవోర్వీపతి వేయించిన
శాసనం ఒకటి కన్పిస్తోంది. కేశవోర్వీపతి ముక్తేశ్వర దేవరకు 25 ఆవులను “విమలాఖండ ప్రదీపశ్రీ “{ అఖండ దీపారాధన} నిమిత్తం దానం చేసినట్లు
వ్రాయబడింది . { ఆర్కె/302/1924 }
చాగి వంశములోని రెండవపోతరాజు
భార్య ముక్తాంబ యని , ఆమె పేరు మీద ముక్త్యాల నిర్మాణం జరిగి ఉండవచ్చని,
ముక్తేశ్వర దేవరకు ఈ ముక్తాంబకు ఏమైనా సంబంధముందేమో యోచించాలని సందేహించారు కొందరు
విమర్శకులు. { భారతి.-ఫిభ్రవరి—1933-
273 పే.}
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతమ్మతో కలిసి
వచ్చినప్పుడు స్వర్ణాలయంలోని ముక్తేశ్వరుని సేవించాడని,ద్వాపరయుగంలో ధర్మరాజు
సోదరసమేతుడై ఈ మహాదేవరను పూజించినట్లు, కలియుగంలో విక్రమార్కాది మహారాజులందరో ఈ
దేవుని దర్శించి తరించినట్లు తాతంభట్టు గురుమూర్తి శాస్ర్తిగారు” కృష్ణా మహాత్మ్యము” అనే గ్రంధములో వ్రాశారు.ముక్త్యాల
లోని మరియొక ఆలయం చెన్నకేశవాలయం.
ప్రాచీనచరిత్ర :-------- చరిత్ర లోకి తొంగిచూస్తే----- ముక్త్యాల అతి ప్రాచీన చరిత్ర గల్గి నట్లుగా కన్పిస్తోంది. రెండువేల సంవత్సరాలనాటి “శాలివాహన సప్తశతి” లో ఈ ముక్త్యాల ప్రాంతాన్ని గూర్చిన గాథలున్నట్లు విమర్శకులు భావించారు.{ బుద్ధజయంతి మహోత్సవ సంచిక. 13వ పేజి .} బేతవోలు నుండి జగ్గయ్యపేట ముక్త్యాల చేరేటప్పుడు ఎడమవైపు కొండమీద బౌద్ధస్ధూపం కన్పిస్తుంది. అక్కడనుండి ముక్త్యాలకు చేరేవరకు రోడ్డు కిరువైపులా దట్టంగా మోదుగు చెట్లు వ్యాపించి ఉండేవి. ధీని ఆథారంగా ” సూరన్న” అనే కవి ఒక గాథను సంథానించాడు. భౌద్దస్థూపానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న బౌద్ధసన్యాసులను, రోడ్డు కిరువైపుల రాలిన మోదుగు పూవులను కవి ఇందు లో ప్రస్తావించి కథ ను రచించాడు.
“ కీరముహ సచ్చ హే హింరే హయి
ననుహపలాస
కుసుమేహిం
బుద్ధ స్సచలన
వందన
పడియే హివ
భిక్షు సంఘే హిం.”
“జీబుగా నేలపైరాలె
జిల్కముక్కు
లట్లు పూవులు
మోదుగు చెట్ల క్రింద
బుద్ధ
పాదాంబుజములకుపుడమి వ్రాలి
వందవము చేయు భిక్షుక
వర్గ మనగ “
{ బుద్ధజయంతి మహోత్సవసంచిక. 15పే}
{ బుద్ధజయంతి మహోత్సవసంచిక. 15పే}
ఈ ప్రాంతానికి దగ్గరలోనే “ భోగాలపాడు “అనే ఒక ప్రాచీన గ్రామముంది. ప్రాచీన శిథిలాలకు నెలవైన ఈ ప్రదేశం పరిశోధకులను
ఆకర్షించింది.కవి పండిత విమర్శకులైన శ్రీ వేటూరి ప్రబాకర శాస్ర్తి గారు ఈప్రాంతంలో
పర్యటించి పరిశోధనలు నిర్వహించి కొంత సమాచారాన్ని సేకరించారు. ఆయన యనంతరం
1953మార్చి 9నుండి 15 వరకు వేటూరి శంకరశాస్ర్తి గారి ఆధ్వర్యలో కొన్ని త్రవ్వకాలు
జరిగాయి.
ఈ తవ్వకాలలో అనేకమైన కుండలు, శాసనపురాళ్లు,ఎముకలు పూసలు,
ఆభరణాలు గాజులు, ఇటుకలు లభించాయి.వీటి మీద లిపి ని బట్టి ఇవి ఇక్ష్వాకుల నాటివిగా
గుర్తించబడ్డాయి. శిథిలావశేషాలను, నిర్మాణ విధానాన్ని విశ్లేషించగా,
ఇక్ష్వాకులనాటి బౌద్ధభిక్షువులు ఈ
ప్రాంతంలో విహారాన్ని నిర్మించుకొని, బౌద్ధధర్మప్రచారకులుగా ఉండినట్లు
భావించబడింది. { బుద్ధ.జ.సం.19పేజి}
ఈ విధమైన
ప్రాచీనచరిత్ర గల్గిన ఈనేల పైన రెండవ పోతరాజు నదీతీరంలో ముక్తేశ్వరుని
ప్రతిష్ఠించి, చరిత్రలో నిలిచిపోయాడు.
అనంతర కాలంలోవాసిరెడ్డి వారి వంగడంలో ముక్త్యాల సంస్ధానం రూపుదిద్దుకుంది. మహాకవులు శ్రీ చెళ్లపిళ్ల,
విశ్వనాథ వంటివారు దర్శించిన సంస్ధానమిది. ముక్త్యాల రాజా పేరెన్నిక గన్న రాజకీయవేత్త. అది ఆధునిక చరిత్ర. ఇచ్చటి ముక్త్యాల కోట చాల ప్రసిద్ధమైంది.
ప్రత్యేకఉత్సవాలు..... ఈ భవానీ ముక్తేశ్వరస్వామి
కి మాఘ బహుళ చతుర్ధశి మహాశివరాత్రి నాడు
కళ్యాణోత్సవం జరుగుతుంది. కార్తీకమాసంలో విశేషపూజ లుంటాయి. పర్వదినాల్లోను, పుష్కర
సమయాల్లోను ఇచ్చట కృష్ణవేణి ఉత్తరవాహిని లో స్నానం చేసి తరించడానికి
దూరప్రాంతీయులు కూడ తరలివస్తారు.
రవాణా
సౌకర్యాలు.. జగ్గయ్యపేట నుండి ఆర్టీసి బస్సులు
నడుస్తుంటాయి . ఆటోలు కూడ బాగానే తిరుగుతుంటాయి. తేనీరు , ఫలహారాల వరకు హోటళ్లు
ఉంటాయి .
**********వందే శంభు ముమాపతిం సురగురం వందే జగత్కారణం *******************************