Showing posts with label sri Ranganayaka swamy. Show all posts
Showing posts with label sri Ranganayaka swamy. Show all posts

Saturday, 20 July 2013

శ్రీ రంగాపురం శ్రీరంగనాయకస్వామి ఆలయం


             Sri Rangapuram Sri Ranganayaka Swamy Aalayam.
                
                                    శ్రీ రంగాపురం  శ్రీ రంగనాయక స్వామి ఆలయం.
                          
                    श्री रंगापुरं  श्री रंगनायकस्वामि आलयम्.
                     
                         మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీ రంగాపురం శ్రీ రంగనాయక స్వామి కొలువుతీరిన దివ్యక్షేత్రం.  క్రీ.శ 17 వశతాబ్దంలో వనపర్తి సంస్థానాథీశులచే నిర్మించ బడిన శ్రీ శ్రీ రంగనాథుని దివ్యధామ మిది.  చుట్టూ అడవితో అలముకొని ఉన్నఈ గ్రామాన్ని  తొలిరోజుల్లో కొఱవిపాడు  అని పిలిచేవారట.
      
          

                                                   
          
                                                              ఆలయ రాజగోపురం
                      
                                   తమిళనాడు లోని  శ్రీరంగ క్షేత్రాన్నిదర్శించి, గర్భగుడి లో శ్రీరంగనాథుని దివ్యమంగళ విగ్రహాన్ని కనులార వీక్షించి, అటువంటి ఆలయం తన రాజ్యం లోను నిర్మించాలనే సంకల్పించారు వనపర్తి సంస్థానాథీశులు  రాజా గోపాలరావు గారు.  క్రీ.శ 1657 నుండి 1675 వరకు పరిపాలన సాగించిన వీరు క్రీ.శ 1670 లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం  వలన తెలుస్తోంది.
                

                    
                                             గోపురం  గోడల మీద  కన్పించే రామకథ లో శ్రీరాముడు                                

                          క్రీ.శ. 1662 సం.లో  దక్షిణ దేశ యాత్రలకు వెళ్లి, శ్రీరంగనాథుని దర్శించి, అటువంటి ఆలయాన్ని తన సంస్థానం లో  నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఆ రాత్రి నిద్రించిన  రాజా వారికి  కలలో శ్రీ రంగనాథుని దర్శనమైంది. నేను మీప్రాంతం లో గరుడరూపాన దర్శనమిస్తాను. ఆ రూపం ఎక్కడ అదృశ్యమైతే అక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు.
                 

               
                                         ఆలయ దృశ్యం
                        
                          తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన శ్రీ గోపాలరావు  సపరివారంగా తనకు కలలో కన్పించిన ప్రదేశాన్ని వెతుకుతూ బయలుదేరాడు. రంగంపేట ప్రాంతంలో ఒక పుట్ట మీద  గరుడపక్షి ఎగురుతూ కన్పించింది.  రాజావారు కడవల కొద్ది నీటిని ఆ పుట్ట పై పోయించారు. పుట్టమన్ను కరిగిపోయింది. ఆ మట్టి పెళ్లల చాటున  శేష శయనుడైన  శ్రీరంగనాథుడు   శ్రీ, భూ సమేతుడై, నాభి కమలము నందు చతుర్ముఖుడు అలరారుచున్న ఐదడుగుల దివ్యమంగళ విగ్రహం వెలుగుచూసింది.
                   

                

                                                      దసరామండపం
                      
                         ఆ విగ్రహాన్ని అతి జాగ్రత్తగా బండి కెత్తించి, గరుడుని రూపం లో శ్రీ స్వామి వారు మార్గనిర్దేశం చేస్తుండగా  దాని వెనుక బయలుదేరారు. ఆ గరుడుడు ఇప్పుడు ఆలయమున్న ప్రాంతానికి వచ్చి మాయమయ్యాడు. ఇంతకుముందు ఈ ప్రాంతాన్ని పలుగురాళ్ల గుట్ట అనేవారు. అదే ఇప్పుడు గరుడాద్రి గా పిలువబడుతోంది. ఈ ప్రాంతలోనే క్రీ.శ 1670 లో ఆలయ నిర్మాణం జరిగింది.
                


               
                                                                        కొఠాయి మండపం
            
                   క్రీ.శ 1670 లో ఆలయనిర్మాణం జరిగినా  అభివృద్ధి మాత్రం రాణీ శంకరమ్మ గారి కాలం లోనే జరిగింది.  శ్రీ రంగనాయక స్వామి ఆలయ విమానగోపురాన్ని, రాజగోపురాన్ని  నిర్మింపచేసింది. ఇది 1804 లో పూర్తయ్యింది. అరవై  అడుగుల ఎత్తు,ఏడు అంతస్తులు, ఇరవై అడుగుల ఎత్తైన ప్రవేశ ద్వారము గల ఈ రాజగోపురం నిజంగానే రాజసం ఉట్టిపడతూ ఉంటుంది.  మొదటి అంతస్తు వెలుపలి గోడలపై రామాయణ వృత్తాంతం రమణీయం గా చెక్కబడింది.    గోపురం నాలుగు వైపులా వివిధ దేవతామూర్తుల రూపాలు అందంగా మలచబడ్డాయి.
                        


                ఆలయం గోపురం లో రెండవగడప దాటిన తరువాత  మనకు ఎడమవైపు నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఒక పురుష శిల్పం కన్పిస్తుంది. అది ఈ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించిన శిల్పి  శ్రీ కోయంబత్తూరు సుబ్బారావు ది.
                       

    
                  ఈ గోపురం లోనే కుడివైపు శ్రీ సీతారామ పట్టాభిషేకం,ధానికెదురుగా  ఎడమవైపు చేతులు జోడించి నమస్కరిస్తున్న ముగ్గురు రెడ్డిరాజుల విగ్రహాలు ఉన్నాయి.

             

               
             కొంచెం ముందుకు వెళితే కుడివైపు  గోడ పై శ్రీ రంగనాయకుని దివ్యమంగళ విగ్రహం ధర్శనమిస్తుంది. ఈ విగ్రహం లో శ్రీదేవి, భూదేవి తో పాటు పాదాలచంత ముకుళిత హస్తులై విభీషణుడు, గరుత్మంతుడు కన్పిస్తున్నారు.
                      

            
              ఆలయం చుట్టూ ఉన్నచెరువును రంగసముద్రం అని పిలుస్తారు. ఈ చెరువు మథ్య లో కృష్ణ విలాస్ ఒక అందమైన భవనం  రాణీ శంకరమ్మ గారి కాలం లోనే నిర్మించబడింది.  అది ఇప్పుడు శిథిలావస్థ లో ఉంది.
                       
      

   
                             రంగసముద్రం, మథ్య లో కృష్ణ విలాస్ భవనం
             
                 ప్రధాన ఆలయానికి కొద్ది దూరం లో  గోదాదేవి ఆలయాన్ని కూడ ఈమె కాలం లోనే నిర్మించారు.


                 
                                           ఆండాళ్  సన్నిథి     

                    ఈఆలయానికి అనుబంధం గా నిర్మించబడిన పుష్కరిణి అత్యంత రమణీయం గా ఉండి, చెక్కుచెదరకుండా నిలిచి ఉంది. ద్వాదశ కోణాలతో నక్షత్రాకారం లో నిర్మించబడిన  ఈ కోనేరు ఏనాడు ఎండిపోలేదని స్థానికులు చెపుతున్నారు. ఎందుకో దీన్ని చూడగానే ఒక్కసారిగా హంపీ శిథిలాలు గుర్తుకొచ్చాయి.
                  


          రాణీ శంకరమ్మ గారి తరువాత  ఆమె కుమారుడు శ్రీ రెండవ రామేశ్వరరావు ఆలయ నిర్మాణం లో శ్రద్ద కన్పరచారు. ప్రథాన ఆలయం లో శ్రీ రంగనాయకస్వామి ఆలయానికి  ఎడమవైపు శ్రీ చతుర్భుజ తాయారు పేరుతో లక్ష్మీదేవి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ మండపం అద్భుతమైన శిల్పసంపద తో  నయన మనోహరం గా  ఉంటుంది.
      

                                 
                                   శ్రీ చతుర్భుజ తాయారు

   


         http://divyakshetralu.blogspot.in/ లోని దివ్యక్షేత్రాల సంపూర్ణ       దృశ్యాలను ఇప్పుడు సజీవ చిత్రాలుగా www.youtube./raviprasadmuttevi   ద్వారా చూడవచ్చు.
   

                                   


                                      శ్రీరంగనాథుని దివ్యరూపం
                   
                            ప్రథాన ఆలయానికి ముందు  శుకనాసికామండపం   నిర్మించబడింది. అంత్రాలయ ద్వారానికి రెండువైపుల కుడివైపున మదన గోపాలుడు, ఎడమవైపు విష్వక్సేనుడు కొలువు తీరి ఉన్నారు. గర్భాలయం లో శ్రీరంగనాయకస్వామి శ్రీ ,భూ, సమేతుడై శేష పాన్పుపై శయనించి దర్శనమిస్తాడు. 
                 

                                       శ్రీ కస్తూరి రంగనాథుడు

                      ప్రదక్షిణ మార్గం లో శ్రీ కస్తూరి రంగనాయకస్వామి ఆలయం కన్పిస్తుంది. శ్రీరంగనాయకస్వామి   ఆలయ నిర్మాణానికి ముందే ఈ కస్తూరి రంగనాథుడు ప్రతిష్ఠితమై ఉన్నాడని, ముష్కరుల దండయాత్రలో శ్రీ స్వామి వారి విగ్రహం  శిథిలమవగా పున ప్రతిష్టించారని చెపుతారు. ఇక్కడ ఆలయ ప్రాకారం లోపల కన్పించే దసరా మండపం, కొఠాయి మండపం కూడ అందమైన నిర్మాణాలే.
                

                
                                    ఆలయ ప్రవేశ గోపురం
             
                 పన్నిద్దరాళ్వార్లు, భాష్యకార సన్నిథి, శ్రీరామానుజాచార్యుల వారి రూపాలను కూడ దర్శించుకోవచ్చు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఆథునిక నిర్మాణం. ప్రతి సంవత్సరం   శ్రీరామనవమి కి  శ్రీరాముల వారికి కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేకం నిర్వహిస్తారు.
             

             
                              మహామండప దృశ్యం

            శ్రీ రంగనాయకస్వామి కి  ప్రతి సంవత్సరం  ఫాల్గుణ శుద్దసప్తమి నుండి బహుళ విదియ వరకు  బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంవత్సరాది, కృష్ణాష్టమి, దేవీనవరాత్రులు, విజయదశమి, గోదాకళ్యాణం, ధనుర్మాసం, అథ్యయన ఉత్సవాలు మొదలైనవి  శ్రీ రంగనాథునికి జరిగే  ప్రత్యేక ఉత్సవాలు.          

           
                శ్రీరంగాపురం మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి కి 25 కి.మీ దూరం లోను. జాతీయరహదారి పై  పెబ్బేరుకు 11 కి.మీ  దూరం లోను ఉంది.                    






  




   **********  జయ రంగనాథ  *********************************************