Saturday, 29 November 2025

మల్లూరు -శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం.

      శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి  స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం మల్లూరు.  ఈ క్షేత్రం ములుగు జిల్లాలోని మంగంపేట మండలం మల్లూరు గ్రామానికి  నాలుగు కిలోమీటర్ల దూరం లో  ఉంది. గోదావరీ నదీ తీర ప్రాంతంలో ఏటూరు నాగారం - భద్రాచలం ప్రధాన రహదారి ని ఆనుకొని ఈ దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది . హేమాచలక్షేత్రం  దివ్యక్షేత్రం మాత్రమే కాకుండా ప్రకృతి వైద్యానికి ,మూలికలకు కూడా ప్రసిద్ది.  ఆ ప్రభావం కూడ ఈ హేమాచల  నారసింహుడిదే.ఈ క్షేత్రమంతా అర్థచంద్రాకారంలో దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండటం ఒక ప్రత్యేకత.

              భగవద్దర్శనం:-      భగవంతుని లీలలు చిత్రాతిచిత్రంగా ఉంటాయి.ఎక్కడైనా దేవాలయం లో ఉన్న స్వామి మూలవిరాట్టు మానవ శరీరం వలే మెత్తగా ఉండి ఒత్తితే లోపలికి పోవడం విన్నామా.? ఎక్కఢైనా కన్నామా ? కాని ఈ హేమాచల లక్ష్మీ నరసింహుని శరీరం సుతి మెత్తగా ఉండి పూవు పెట్టి అద్దితే ఆ  పూవు శరీరం లోపలే నిలిచి ఉండటం వింత. అంతేకాదు స్వామి విగ్రహం పది అడుగుల ఎత్తున మనిషి నిలబడినట్టే  ఉండి భక్తులను మంత్రముగ్థులనులను చేస్తుంది. స్వామి వస్త్రధారణ కూడ ప్రత్యేకంగా ఉంటుంది. మానవ శరీరం వలే శరీరం మెత్త గా ఉండటమే కాక శరీరం మీద సింహానికి  ఉన్నట్లు పొడవైన రోమాలను మనం చూడవచ్చు. స్వామిని గుర్తించి ,గుహనుండి వెలుపలికి తవ్వి తీసేటప్పుడు ఒక సైనికుని గునపం గుచ్చుకొని  స్వామికి నాభి వద్ద అయిన గాయం, దాని నుండి వచ్చే స్రావము , ఆ గాయానికి  అర్చక స్వాములు అద్దే చందనాది లేపనాల మరకలు ఇప్పటికీ థోవతికి అంటుకొని వింతశోభ ను కల్గిస్తాయి.

       


                  


                                               హేమాచల నారసింహుని దివ్యరూపము

   స్వయంభువు డైన  శ్రీ హేమాచల లక్ష్మీనరసింహుడు జేగురువర్ణ దేహకాంతి తో, నుదుటి మీద నాలుగు వేళ్ల మందాన తీర్చిదిద్దిన ఊర్ద్వపుండ్రాలతో,తీక్షణమైన చూపులతో, గంభీరమైన వదనం తో,విపుల వక్షస్థలం తో, నిండుగా ధరించిన పట్టువస్త్రం తో , పుష్పమాలాలంకృత శోభితుడై  ఆరాధించేవారికి ఆనందాన్ని, కాదనేవారికి భయాన్నికల్గిస్తుంటాడు. స్వామి రూపు ఎంత భయంకరంగా ఉంటే  కొలిచే భక్తులకు అంత సంతోషం గా ఉంటుంది.ఎద పులకించి  ఆనందతాండవం చేస్తుంది.ఎందుకంటే ఇంతటి అపూర్వ పరాక్రమరూపుడు నాకు తోడుగా ఉన్నాడనేది భక్తుని ధైర్యం. అందుకే నృసింహావిర్బావ ఘట్టం లో ప్రహ్లాదుని ముఖం లో వెల్లి విరిసిన ఆనందాన్నిమనం ఆస్వాదించ గలిగితే  మనం కూడ ఆ ఆనందాన్ని పంచుకోగలం.

                          స్వామి ఆవిర్భావం :--   ఆరవ శతాబ్దానికి పూర్వమే  ఈ క్షేత్రం ఉన్నట్టు చరిత్రకారులు ఒప్పుకుంటున్నారు. శాతవాహన ప్రభువైన దిలీపకర్ణి మహారాజు కు స్వామివారు కలలో కన్పించి గుహాంతర్భాగం లో  తానున్నానని, సేవించుకొమ్మని ఆదేశించారు. వెంటనే మహారాజు  75 వేలమంది సైన్యంతో బయలుధేరి, అక్కడకు చేరుకొని,గుహను తొలుస్తుండగా ఒక సైనికుడు వేసిన గునపం స్వామివారి నాభి లో గుచ్చుకొని రక్తం చిందింది.

                        


      స్వామిని బాధించానని,ఆయనకు కోపమొస్తుందేమో నని భయపడిన మహారాజు స్వామిని పలువిధాలుగా వేడుకొని ,గాయానికి రాజవైద్యుల చేత  వివిధ లేపనాలతో చికిత్స చేయించాడు. కాని భగవంతునకు  గాయం అవ్వడమేంటి ?మనం మందు రాయడమేమిటి ? అదొకమాయ .  అదో భ్రాంతి .అంతే.  కాలం  చాలా గడిచిపోయింది.కాని ఇప్పటికీ స్వామి వారి శరీరంలో గాయమైన  నాభి ప్రదేశం నుంచి  రక్తం వంటి ఎఱ్ఱని ద్రవం స్రవిస్తూ ,స్వామివారి థోవతి  పై కూడ మరక  లేర్పడటం మన చూడవచ్చు.. గాయం మానడానికా అన్నట్లు  ప్రతిరోజూ అర్చకస్వాములు చందనాది లేపనాలను ఆ గాయానికి అద్దుతారు. దీన్నే నాభి చందనం  “గా పిలుస్తారు. దీన్ని ప్రసాదం గా సేవిస్తే సంతానప్రాప్తి  కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇదీ అసలు విషయం. అంటే భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడు గాయం చేసుకున్నాడన్నమాట. స్వామి వారికి ప్రతి శనివారం నువ్వులనూనె తో అభిషేకం చేస్తారు. స్వామివారి శరీరమంతా మెత్తగా ఉండటమే కాక శరీరమంతా సింహానికున్నట్లు రోమాలుండటం మరొక ప్రత్యేకత.  స్వామి వారికి ఎడమవైపు మహాలక్ష్మీ మందిర 

ముంది. 60 అడుగుల ధ్వజస్థంభము  ఈ ఆలయ మరో ప్రత్యేకత.












ఆలయ ముఖమండపం విశాలంగా ఉండి , క్యూ లైన్లు ,భక్తులు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ముఖమండప స్థంభాలపై దశావతారమూర్తులు అందంగా కొలువుతీరారు. చౌలోపనయనాది కార్యక్రమాలకు అనువైన మండపాలు, కళ్యాణమండపం  క్రింద అంతస్తులో ఉన్నాయి .

         




   ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయస్వామి ఉంటాడు. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి ,తూర్పు భాగాన కోనేరు ,మెట్ల మార్గం లో నవగ్రహమండపాన్ని చూడవచ్చు. 


                 


                            ఈ ప్రాంగణంలోనే ఆంజనేయస్వామి ,మహాలక్ష్మీ ,గోదాదేవి మందిరాలు కన్పిస్తాయి . ఈ  ఆలయానికి సుమారు రెండు కి.మీ దూరం లో అతిపురాతనమైన శిఖాంజనేయస్వామి మందిరం ఉంది.

       




                           చింతామణి జలపాతం:---   ఈ హేమాచల క్షేతం లోని మరో ప్రత్యేకత చింతామణి జలపాతం.  దట్టమైన అడవుల్లో కొండపై నుంచి   వస్తున్న జలధారను చింతామణి జలపాతం గా పిలుస్తారు. కాకతీయరాణి రుద్రమదేవి ఈ స్వామిని దర్శించుకోవడమే  కాక   ఈ జలపాతానికి చింతామణి  అని  నామకరణం చేసింది కూడా ఆమేనని చరిత్రకారులు చెపుతున్నారు. విశాలమైన కొండపైని ఓషథీ వృక్షాల మీదుగా ప్రవహించడం మూలంగా ఔషధవిలువల గల  ఈ నీరు సమస్త వ్యాధులను నివారిస్తుందని,సర్వరోగనివారిణి  అని,  చర్మరోగాలు తగ్గుతాయనీ ,ప్రజలు గాఢంగా  నమ్ముతారు. గంగాజలం వలే పవిత్రమైనవని ఎంతకాలం ఉన్నా పాడవ్వవని వచ్చిన భక్తులందరూ పెద్ద పెద్ద డ్రమ్ములతో నీటిని పట్టుకెళ్ళడం మేము చూశాము.

                       




                               మేము కూడా ఐదు లీటరు బాటిల్ తో తెచ్చి,మితృలకు పంచి, కాశీ తీర్థం లాగ శివాభిషేకానికి  ఆ నీళ్ళుఅయిపోయే వరకు  సుమారు సంవత్శరకాలం వాడుకున్నాము. ఆ చింతామణి జలధార గొప్పతనం అది.  అక్కధార,చెల్లిధార అని రెండు పెద్ద చిన్న జలపాతాలు దగ్గర దగ్గరగా జాలువారుతుంటాయి. కొంచెం వానలు తక్కువగా ఉంటే చిన్నజలపాతం లో ప్రవాహం సన్నపడుతుంది. కాని అక్కధార జలపాతం మాత్రం  అన్ని ఋతువు ల్లోను  నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటుంది.ఈ చింతామణి జలపాతానికి సమీపంలోనే మహాలక్ష్మీ దేవి  పురాతన మందిరం చూడవచ్చు.

               



                       

                      చారిత్రక నేపథ్యం :----   కాకతీయ రాజుల ఏలుబడి లోనే ఈ హేమాచల క్షేత్రమున్నట్లు ,ఈ పర్వతం ఫైన గోనగన్నారెడ్డి నేతృత్వంలో సైనికస్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు కన్పిస్తాయి.   కాకతీయులు గుట్టశిఖరం ఫైన కోనేరు,అర్థమండపం, గుర్రపు శాలలు ,  రాక్షసగుహలు నిర్మించి శతృరాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడే వ్యూహరచన చెసేవారని,  యుద్ధకాలం లో  రాణీ రుద్రమదేవి  కూడ రక్షణ కోసం  ప్రధానాధికారులతో  సహా   ఈ కోటలోనే విడిది చేసేవారని చెపుతారు. గోదావరికి కేవలం కోసుపెట్టు దూరంలో ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి ఆవలి వైపునుండి కాకతీయరాజ్యం వైపు దూసుకొచ్చే శతృసైన్యాలను గుర్తించడానికి దర్పణం ద్వారా వీక్షించే వారని చెపుతారు.

                               కాకతీయుల పాలన  అంతమైన తర్వాత తురుష్కుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17 వ శతాబ్దం లో గజనీమహమ్మద్ ఈ ఆలయం మీదకు వచ్చాడనీ చరిత్రకారులు చెపుతున్నారు. వేయిస్థంభాలగుడి , రామప్పగుడి,కోటగుళ్ల మొదలైన దేవాలయాలను ధ్వంసం చేసిన మహ్మద్ సైన్యం హేమాచలక్షేత్రాన్ని తాకలేదు సరిగదా పైగా ఆలయానికి బంగారు బిస్కట్లను కానుకగా ఇచ్చినట్లు చెపుతున్నారు.  ఎందుకంటే ముస్లిం లు పవిత్రం గా భావించే అర్థచంద్ర నెలవంక ను ఈ క్షేత్రం  పోలి ఉండటమే అందుకు కారణమట.

                         




                           ఈ విధంగా మనం  ఎన్నిచెప్పుకున్నా ఆథారంగా ఏ ఒక్క శాసనం ఇక్కడ కన్పించడం లేదు. కొండఫైన దుర్గమారణ్యం లో  ఇంకా వెదకవలసి ఉందేమో.?

                                


                   

                                                  స్వామి దివ్యదర్శనం
                 ఈ  ఆలయాన్ని  ప్రతిరోజు సాయంత్ర ఐదు గంటల తరువాత మూసివేస్తారు. దర్శనాలు ఉండవు. కొండమీద ఎవ్వరూ ఉండ కుండ అందరూ కిందకి వచ్చేస్తారట. అందమైన ప్రకృతి ఆహ్వానిస్తున్నా అటవీ ప్రాంతమవడం , జనావాసాలకు దూరంగా ఉండటం మూలంగా అభివృద్ధి  కొంచెం ఆలస్యమౌతోంది. కొండ దిగువ వరకు తారురోడ్డు ఉంది.ఫైకి స్వామిని చేరుకోవడానికి డెభై మెట్లు ఎక్కితే సరిపోతుంది. సాధారణ రోజుల్లో టీ,టిఫిన్లు దొరక్కపోవచ్చు...  

   


                  ఉత్సవాలు
:- శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ కు  బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.నరసింహజయంతి,స్వామి వారి తిరుక్కళ్యాణం, రథోత్సవం ,సదస్యం,తెప్పోత్సవం, వసంతోత్సవం  నిర్వహిస్తారు .        

  



         అన్నదానం :--­  శ్రీ స్వామి కి నివేదన అనంతరం మధ్యాహ్నసమయంలో పరిమిత సంఖ్య లో అన్నదానం జరుగుతుంది. తప్పని సరిగా దర్శించవలసిన దివ్యక్షేత్రం ఈ హేమాచల నారసింహక్షేత్రం.

   ------------------------------ఓం నమో నారసింహాయ------------------క్షేత్రసందర్శనం  2022 నవంబరు------------హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం మల్లూరు @raviprasad muttevi   ద్వారా పూర్తి లఘు చిత్రాన్ని చూడవచ్చు.


Friday, 28 November 2025

ద్వారక శ్రీ కళ్యాణ వేంకటేశ్వరాలయం - గుడిమెట్ట దీపాలదిన్నె (Light House) .

     కళ్యాణ వేంకటేశ్వరాలయం -గుడిమెట్ట

            పది పదిహేను కిలోమీటర్ల పరిథి లో వ్యాపించిన ఈ గుడిమెట్ట గ్రామ పరిథి లో మసీదు దిబ్బ నుండి  తూర్పు గా కొండ కొన మీద ఉస్తేపల్లి వద్ద కన్పించే గుడి నే 'ద్వారక గుడి 'అని స్ధానికులు పిలుస్తున్నారు.   ఈ ప్రదేశం లో నది నీటిమట్టం వేసవి లో కూడ 30 అడుగులకు తగ్గకుండా ఉండటం  ఈ ప్రదేశ ప్రత్యేకత. నది వెడల్పు ఇక్కడ తక్కువగా ఉండి, రెండు కొండల మధ్య కృష్ణమ్మ మెల్లగా ప్రవహిస్తూ ఉంటుంది. నదికి రెండువైపుల ఉన్న రెండు కొండల కొనకొమ్మల మీద రెండు ఆలయాలు నిర్మించబడ్డాయి. కృష్ణానది ముక్త్యాల  నుండి ఉత్తరవాహిని గా ప్రవహిస్తూ, ఈ ప్రాంతానికి రాగానే ఈ రెండు కొండల నడుమ హఠాత్తుగా తూర్పువైపు నకు మలుపు తీసుకొంటుంది. కాబట్టే ఈ ప్రాంతం లో ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి, ఈ రెండు కొండల పైన రెండు ఎత్తైన శిఖరాలతో రెండు ఆలయాలను నిర్మించారు అలనాటి రాజులు.  మొత్తం నల్లరాయి తో నిర్మించబడిన కాకతీయుల శిల్పకౌశలం ఈ ఆలయ ప్రత్యేకం. దేవాలయ ప్రధాన ద్వారబంధం అత్యద్భుత శిల్పసముపేతం. వెలుపలి గోడలపైనా అద్భుత మైన కళాఖండాలు తీర్చబడ్డాయి.  



                                              
                                                    
                                                      నేడు   గర్భాలయంలో  కొలువు తీరిన కళ్యాణ వేంకటేశ్వరుడు.

                                      అతి విలువైన శిల్పసంపద ఇది. వేరువేరు  రాళ్ళ పై చెక్కిన వివిధ కళాఖండాలను ఒక్కటి గా పేర్చి కనువిందు చేసిన కమనీయ శిల్పమిది. వానిలో ఓరుగల్లు ద్వారం వెలుపలి గోడలపై మూడువైపులా స్పష్టం గా  తీర్చి దిద్దబడింది. వాని నడుమ కుడివైపు వెలుపలి గోడపై చెన్నకేశవుడు , వెనుక వైపు గోడపై శ్రీవేంకటేశ్వరుడు , ఎడమవైపు గోడ పై గోపికాకృష్ణుడు కొలువు తీరారు.  ఈ ఆలయం లోని మూలవిరాట్టు వేంకటేశ్వరుడు.గర్భాలయం లోని విగ్రహం, సోమసూత్రం మరికొన్ని పెద్దపెద్ద బండరాళ్ళ తో కలిపి అంత్రాలయం లోకి  విసిరివేయబడ్డాయి. గర్భాలయం లోని బండలు మొత్తం త్రవ్వి వేయబడి అక్కడ పెద్ద అగాథం ఏర్పడింది. అంటే గుప్తనిథుల కోసం ఎంతమంది కలిసి ఎంత పెద్ద ప్రయత్నం చేసుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు అంత ఎత్తున ఉన్న కొండ పైకి అంతంత పెద్ద బండలు ఎక్కడ నుంచి ఎలా మోయించుకొచ్చారో , ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు.
                          
                                       శిథిలాలయం గోడలపై వరంగల్లు తోరణదుర్గం మొదలైనవి చూడవచ్చు 
                          
                   ఈ ఆలయ సింహద్వారం పై కన్పించే ద్వారపాలకులతో కూడిన తోరణ శిల్పవిన్యాసం మనోహరం గా ఉంటుంది.  సింహద్వారం పై    రామపట్టాభిషేకం ,దానికి ఇరువైపులా లతలతో అలంకరించబడింది. 


ద్వారబంధంఫై నున్న శ్రీరామపట్టాభిషేకం,ద్వారబంధాలపై లతలు పునర్నిర్మాణదశలోను చెక్కుచెదరలేదు.చూడండి.
                                 
                     ఈ దేవాలయ నిర్మాణానికి వాడిన నల్లరాయి ఈ పరిసరాల్లో లభించేది కాదు. 5” ,4” 3 ½ ” 2”  ఈ రకంగా పలురకాల సైజుల పొడవు తో, 1” , 1 ½ మందంతో 2” ,3” వెడల్పు నుండి  7” ,9”   వెడల్పు వరకు కప్పుకు పనికొచ్చే రాళ్ళ ను సైతం  అంత ఎత్తుకు చేర్చగల్గడం సామాన్య విషయం కాదు. కృష్ణానది నీటిమట్టం నుండి సుమారు 40 అడుగుల ఎత్తున నిర్మించిన కట్టడమది. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణం లోనే  ఒక ప్రత్యేకత కన్పిస్తుంది. అందుకే నాటి పాలకులు ఎన్నోవ్యయ ప్రయాసలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అదేమిటంటే ------
                       
                                 శిథిలాలయపు పూర్వచిత్రం . .కన్పిస్తున్నది ముష్కరులు తవ్వి వేసిన ఆనాటి గర్భగుడి.

                                   సాధారణం గా దేవాలయాల్లో గర్భగుడి పై భాగం గోపురాకారం గా శిఖరం వరకు లోపలి వైపు ఖాళీగా నిర్మించబడుతుంది. దీనినే ఆగమ శాస్త్రం లో విమానం అంటారు.



    ఇది అలనాడు ముష్కరుల చేత ద్వారక గుడిని తవ్వి బయటపడేసిన  శ్రీ వేంకటేశ్వరుని  విగ్రహం.

                            లోపలి నుంచి పైకి చూస్తే చీకటి గా ఖాళీ ప్రదేశమే కనిపిస్తుంది. కానిఈ ఆలయం లో మాత్రం గర్భాలయం పై కప్పు పెద్దపెద్ద బండలో కప్పబడి, దేవునికి కుడివైపు  పై భాగంలో మనిషి వెళ్లగలిగినంత ఖాళీ ప్రదేశం వదిలి పెట్టబడింది.

              


                                                                  నూతన ఆలయధ్వజస్థంభము

                     ఆ పైన ఒక ఇరవై మంది వరకు విశ్రాంతి గా కూర్చోవడానికి అవకాశం ఉందంటే అతిశయోక్తి కాదు.ఇది పూర్వ
కాలపు  పెంకుటిళ్ల ల్లో కట్టుకునే అటక మాదిరి నిర్మాణం గా ఊహించుకోవచ్చు. ఒక నిచ్చెన వంటి సాధనం ద్వారా పైకి చేరుకోవచ్చు. ఇంత నిర్మాణం ఎందుకో హఠాత్తు గా చూస్తే అర్ధం కాదు. కొంచెం ప్రత్యేకదృష్టి తో ఆలోచిస్తే ఇది దీపాల దిన్నె”  లేక దీపాల గృహం గా మనం భావించవచ్చు. ఆనాడు నౌకాయానం చేసేవారికి ఇది మార్గనిర్దేశం కోసం నిర్మించ బడింది. దీన్నే మనం ఈనాడు Light House గా వ్యవహరిస్తున్నాం. 


   
                                  ప్రాచీన విమాన గోపురాన్ని,   కృష్ణానదిని ,దూరంగా వేదాద్రి ఆలయాలను చూడవచ్చు.
                     
                         ఈ గుడి ముఖద్వారం గుడిమెట్ట నగరం వైపు తిరిగి ఉంటుంది. ఈ గుడి పై నిలబడితే వేదాద్రి వద్ద ఉన్న పడవను సైతం స్పష్టం గా చూడవచ్చు. కృష్ణానది ఈ ప్రాంతానికి వచ్చే సరికి అంత పెద్దమలుపు తీసుకుంటుంది. దూరంగా  వేదాద్రి ఆలయాన్ని చూడవచ్చు. కృష్ణానది లో వేగం గా ప్రయాణించే నౌకలు, రాత్రివేళ ల్లో వేగంగా వచ్చే పడవలు ఈ ప్రాంతానికి చేరేసరికి హఠాత్తు గా మలుపు తీసుకున్న నదీగమనం లో వేగం గా వచ్చే పడవలు మలుపులో కొండచరియను గుద్దుకునే ప్రమాదం ఉంది.  ఊహిస్తే ప్రమాదాలు జరిగి ఉంటాయి. వాటిని నివారించడానికే ఈ ఆలయం పై వెలుగుతూ ఉండే దీపం  నావికులను హెచ్చరించేది. వేగాన్ని నియంత్రించుకోవడానికి ఆ హెచ్చరిక ఉపయోగపడేది. ఈ ఆలోచన ,అవసరాలే ఈ ప్రదేశం లోని రెండు కొండల కొన కొమ్మల మీద రెండు ఆలయాలను నిర్మించి ,వాటి నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడి ఉంటాయనడం లో  ఎటువంటి సందేహము లేదు. ఇంత పెద్ద ప్రయోజనం ఉంది కాబట్టే నది కి నలభై అడుగుల ఎత్తు లో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. రెండు కొండల మీద కన్పించే దీపాల నడుమ ఈ నదిలో మెల్లగా ప్రయాణం , నదీ గమనాన్ని గుర్తించి  ప్రయాణించడం సాధ్యమయ్యేది. ఇలా కట్టిన ఈ కట్టడాన్నివిగ్రహప్రతిష్టాపన తో ఆలయం గా మార్చారు. అది మన సంస్కృతికి సంకేతం.ఈ ఆలయాన్ని కేంద్రం గా చేసుకొని నాలుగైదు కిలోమీటర్ల పరిధి లో కొండపైనే ఒక గ్రామం విలసిల్లినట్లు గా శిథిలాలు చెపుతున్నాయి. అడుగడుగునా పునాదులు ,మొండిగోడలు , పెద్దపెద్ద రాతిరోళ్లు, నల్లరాతి బండలు ఈ ప్రాంతమంతా కన్పిస్తాయి.  ఈ నిర్మాణం

                                                

    
               దేవాలయరూపాన్ని సంతరించుకున్న దీపపు దిన్నెఅని చెప్పడమే సమంజసం. కాబట్టి అనంతర కాలం లో రాజులు మారినా , రాజ్యాలు కూలినా, రాజులు ఎవరొచ్చినా ఈ అవసరాన్ని గుర్తించి , దీన్ని పడగొట్టడం గాని, నష్టపరచడం గాని చేయలేదు.ఎవ్వరి కైనా  నౌకాయాన సమయం లో దీని అవసరం తప్పని సరి కాబట్టి ఈ గుడి , దీనికెదురు గా నది కి  ఆవలి ఒడ్డున ఉన్న గుడి ఇప్పటికీ అలాగే నిల్చి ఉన్నాయి. ఆనాటి నిర్మాణ దారుఢ్యం అంత గొప్పది. ఆలయం లోని మూలవిరాట్టు మాత్రం  పెకలించబడింది. ఈ నిర్మాణం లో అడుగడుగునా కాకతీయ శిల్పం ఉట్టిపడుతూ ఉంటుంది. సింహద్వారం పై కన్పించే చిత్రాలు , వెలుపలి గోడలపై కన్పించే ఓరుగల్లు ద్వారాలే ఇందుకు ప్రత్యక్షసాక్ష్యాలు.  ఈ గోడలపై , శిఖరం పై  రావి ,జువ్వి, వంటి మొక్కలు పెరిగి , ఈ పురాతన కట్టడాన్ని పడవేయడానికి ప్రయత్నిస్తున్నాయి. శిథిలమౌతున్న ఇటువంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయుని పైన ఉంది.

                                    





                                 
                                             కళ్యాణ వేంకటేశ్వర స్వామి
                             
                            కాని ఇదంతా  ఆనాటి మాట. వాడిన పూలు వికసించినట్లుగా, ఎండినమోడు చిగిర్చి ఫలించినట్లుగా  ముష్కరుల దండయాత్లల్లో కాకతీయరాజ్యపతనానంతరంమరి కొంత కాలానికి చాగిరాజ్యం  కూడా అంతరించింది .గుడిమెట్ట సామ్రాజ్యం మట్టిలో కలిసిపోయింది .  ్త ఇప్పుడు  ఈ ప్రాంతాన్ని  స్థానిక ప్రజలు  మసీదుదిబ్బ  అని వ్యవహరిస్తుంటారు. ఈ ప్రాంతమంతా ఛిద్రమైన వివిథ శిల్పాల తోటి , విరిగిపోయిన రాతి స్థంభాల తోను దర్శనమిస్తోంది.
                                             



                                             స్వామి వారి కళ్యాణ ఘట్టం


          ఇటువంటి ప్రదేశం లో  ఉన్న  ద్వారకగుడి  పడి లేచిన కడలి తరంగం లాగ  తుఫానుకు నేలకూలిన మాను లేచి నిలిచి ఫలించినట్లు  పునరుద్ధరణ, పునర్నిర్మాణ కార్యక్రమాలు చేసుకొని కలియుగ దైవమైన  శ్రీ వేంకటేశ్వరుని ప్రతిష్టించుకొంది. భక్తులు,దాతలు నడుంకట్టారు. శ్రీనివాసుడు తలుచుకుంటే కానిదేముంటుది. సిరి వచ్చి చెంత నిలుస్తుంది .మనం పై ఫోటోలో చూసిన శిథిలాలయమే ఇప్పుడు దేదీప్యమానంగా విద్యుత్కాంతులతో వెలిగిపోతూ ఉత్సవాలు చేసుకుంటోంది.   







         భగవంతుడు తలచుకుంటే సాథ్యం కానిది లేదు కదా.మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిం. అన్నారు పెద్దలు.భగవంతుడు ఆదేశించాడు. భక్తుడు ఆచరించాడు.తప్పనిసరిగా చూడవలసిన దివ్యాలయం  శ్రీదేవీ ,భూదేవీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుని దేవాలయం.




                                                                               స్వామి వారి కళ్యాణ మూర్తులు


        --------------------------------------------    ఓం నమో వేంకటేశాయ-------------------------------------------------------------------



















Thursday, 27 November 2025

చందిప్ప - మరకతశివలింగం

 చందిప్ప- మరకతశివలింగము. శంకరపల్లి మండలము – రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్.                    

                                తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం లో చందిప్ప అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం లోని మరకతశివలింగం ఈ గ్రామం పేరు ను వెలుగులోకి తెచ్చింది. ఊరి బయట పొలాల్లో ఒక చిన్నగుడి లో బ్రహ్మసూత్రంతో కూడిన మరకతశివలింగం ఉందని మితృల వలన విని చూడ్డానికి వెళ్లిన నేను ఆశ్చర్యపోయాను. బ్రహ్మసూత్రంతో కూడిన అంత మరకతశివలింగం ఆలనా పాలనా లేకుండా ఒక కాపలా దారుని రక్షణ లో ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. మాకు మేమే స్వ హస్తాలతో స్వామికి అభిషేకం చేసుకొని ,కొబ్బరికాయ కొట్టుకొని , హారతి ఇచ్చుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని , వెనుదిరిగాము .ఇది ఆనాటి మాట . మఱి నేను చేసిన పూజాఫలమో ఏమో గాని ఇప్పుడు ఆ గుడి భక్తుల తాకిడితో కళకళ లాడుతోందని చూసి ఆశ్చర్య పోవడం మళ్ళీ నావంతే అయ్యింది . అతి తక్కువ కాలం లో అతి ఎక్కువ మార్పు. అది ఈ మరకతశివలింగ ప్రభావం .
                                                మరకతశివలింగం - అమ్మవారు 

 ఇంతకీ ఈ ఆలయం హైదరాబాద్ కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని శంకరపల్లి ప్రక్కనే ఉన్న చందిప్ప అనే గ్రామం లో ఉంది. ఈ మరకతశివలింగం క్రీ.శ1076-1120 మథ్య కాలం లో ఆంథ్రదేశాన్ని పాలించిన పశ్చిమచాళుక్యరాజులలో ప్రసిద్ధుడైన ఆఱవ విక్రమాదిత్యునిచే ప్రతిష్టించబడినట్లు శాసనాద్యాధారాల ద్వారా తెలుస్తోంది.
                                                       ఆఱవ విక్రమాదిత్యుని శాసనము.
                            
                                        ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు గా ఉన్నాడు. లింగానికి వెనుకవైపున అమ్మ వారి విగ్రహం కన్పిస్తోంది. ఆలయప్రాంగణం లో చెట్టు క్రింద కాలభైరవుడు ,మరి కొన్ని శిథిలవిగ్రహాలు ఉన్నాయి. వాని కెదురుగా కన్పిస్తున్న శాసన స్థంభము 11 వ శతాబ్ధం లో ఈ ఆలయ నిర్మాణసమయం లో 6వ విక్రమాదిత్యుడు వేయించిన శాసనంగా చెప్పబడుతోంది. ఆ ప్రక్కనే కుడి చెవ్వు కొట్టివేయబడిన ఒక నంది విగ్రహం కన్పిస్తోంది . ఇదే ఈ ఆలయచరిత్ర ను మనకు చెపుతోంది. అదేమిటంటే .....
                                                             చెవ్వు విరిగిన నందీశ్వరుడు 

                                     నేను ఈ వ్యాసం లో ఇంతకుముందు చెప్పినట్లు ఇంతటి ఉన్నత విలువలుగల ఈ మరకతశివలింగం విదేశీదాడులను తట్టుకొని చెక్కుచెదరకుండా ఉందంటే ఆశ్చర్యం గానే ఉంటుంది .కాని స్థానికులు చెప్పుకునే కథనం ప్రకారం విదేశీయుల దండయాత్ర సమయం లో ఆ ముష్కరులు గుడి పై దాడి చేసి ముందుగా నందీశ్వరుని పై సమ్మెటతో ఒక్కవేటు వేశారని,వెంటనే ఒక భయంకరమైన ఆబోతు రంకె , ఆ వెనువెంటనే శివలింగం నుండి ఒక్కసారిగా భగ్గుమని మంటలు వచ్చాయని, అది చూసి భయపడిన సైన్యమంతా పారిపోయిందని చెపుతున్నారు. ఆ సమయం లోనే నందీశ్వరుని కుడిచెవ్వు దెబ్బ తింది మరకతశివలింగం మాత్రం ధ్వంసం కాకుండా ఉందని చెప్పుకుంటారు. ఇది సహజం. ఆ భగవంతున పై నమ్మకం తో ఇటువంటి కథనాలు చాల ఆలయాల విషయం లో మనకు విన్పడుతూనే ఉన్నాయి. ఏమైనా మరకతశివలింగం చెక్కుచెదరకుండా ఇప్పటికీ పూజలందుకోవడం విశేషం గానే చెప్పుకోవాలి. ఇదే ఆలయప్రాంగణం లో మరొక శివలింగం కూడ మరకతశివలింగానికి ఎదురుగా నవగ్రహ మండప సమీపం లో ప్రతిష్ఠించి,పూజిస్తున్నారు. ఈ శివలింగం కూడా ఈ ఆలయపరిసరాల్లో తవ్వకాల్లో లభించింది.దీనికి కూడ బ్రహ్మసూత్రం ఉంది. అంటే ఈ ఆవరణ లోనే రెండు బ్రహ్మసూత్రం గల శివలింగాలు పర్వదినాల్లో అభిషేకాలు చేసుకోవాడానికి భక్తులకు అందుబాటులోకి ఉండటం నిజంగా భక్తుల అదృష్టంగానే భావించాలి. ఎంతో పుణ్యం చేసుకుంటెనే గాని బ్రహ్మసూత్రం ఉన్న శివలింగ దర్శనభాగ్యం లభించదని పెద్దల మాట.

                                                              మరకత శివలింగం 


                       అనంతర కాలంలో చెవ్వు విరిగిన నంది విగ్రహాన్ని చెట్టుక్రిందకు చేర్చి ,మరోవిగ్రహాన్ని గుడి లో ప్రతిష్టించారు. గర్భాలయం లోకి చూస్తే మరకతలింగానికి ప్రత్యేకం గా పానపట్టం కన్పించదు. అభిషేకజలం పోవడానికి సన్నని గట్టు కన్పిస్తుంది.ఇది కూడ ఈ ఆలయ ప్రాచీనత్వానికి ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు.ఎందుకంటే మన దేశంలో గుప్తుల పరిపాలనా కాలం లోనే శివలింగాలకు ప్రత్యేకం గా పానపట్టాలు నిర్మించడం, ప్రకృతి,పురుషుడు అనే పరిపూర్ణ భావం తో పూజించడం ప్రారంభమైనట్లు పరిశోధకులు ధృవీకరించారని మనం గుడిమల్లం - పరశురామేశ్వర ఆలయాన్ని గురించి వ్రాసేటప్పుడు ప్రస్తావించుకున్నాం.( చూ.గుడిమల్లం- పరశురామేశ్వరాలయం .mutteviraviprasad.blogspot.com)
                                                    ఆలయప్రాంగణం లోని రెండవ శివలింగం. 

              ఈ మరకత శివలింగానికి వెనుకవైపుగా అమ్మవారి విగ్రహం ఉందని చెప్పుకున్నాం కదా. ఆ వెనుక పడమర గోడకు ఆనించి ప్రతిష్టించిన వినాయకుడు మరికొన్ని విగ్రహాలు కూడ తర్వాత కాలం లో భక్తులు,దాతల సహకారం తో ఆలయపునర్నిర్మాణ సమయం లో పెట్టినవి గా కన్పిస్తున్నాయి. అలాగే బయట ఆలయం గోడకు ఆనుకొని వీరఫలకంగా చెప్పబడే బల్లెం పట్టుకున్న వీరుని ఫలకం , అటుగా గుడికి కొంచెం ఆగ్నేయం గా ఒక పెద్ద పాడుబడిన బావిని కూడ మనం చూడవచ్చు.
                                                                         వీరఫలకం                                                        ఆలయ సమీపం లోని పాడుబడ్డ బావి

                                                                ప్రతి పున్నమి నాడు చందమామ అందంగా మరకత శివలింగం లో ప్రతిబింబించే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుందట. అలాగే కొన్ని ఋతువులలో సూర్యోదయం కూడా మరకతలింగం లో అందం గా ప్రతి ఫలిస్తుందని ఇక్కడి వారు చెపుతున్నారు. నవగ్రహమండపాన్ని ,ధ్వజస్థంబాన్ని కూడ మనం ఆలయప్రాగణం లో చూడవచ్చు.
                                                  ఈ మరకతశివలింగాన్ని పూజిస్తే అష్టదరిద్రాలు నశించి,సంపదలు చేకూరుతాయని ,కోరుకున్నకోరికలు నెరవేరుతాయని,ఆయురారోగ్యాలు శక్తి ,యుక్తి లభిస్తాయని చెప్పబడుతోంది. అంతేకాకుండా ఈ మరకత శివలింగం భారత దేశంలోనే రెండవ అతి పెద్ద శివలింగమని, శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ఈ మరకత శివలింగాన్ని పూజించాడని ఇలా కొన్ని కథనాలు కొల్లలుగా సోషల్ మీడియా లో ఈ శివలింగాన్ని కన్పిస్తున్నాయి. మంచిదే కాని ఆధారాలు కావాలి కదా అన్నది ప్రశ్న. ఏమైనా తప్పని సరిగా ఒకసారి చూడవలసిన దివ్యక్షేత్రం గా చందిప్ప మరకతశివలింగాన్ని గూర్చి చెప్పవచ్చు.
                                                                 మరకత శివలింగం 

                                                 ఈ మథ్య కాలం లో కార్తీకమాస ఉత్సవాలు ,నవరాత్రులు,శివరాత్రి ఉత్సవాలు వంటివి కూడ నిర్వహిస్తున్నారు. ప్రతి పౌర్ణమి నాడు దాతల సహకారం తో ఈ ఆలయం వద్ద అన్నదానం కూడ చేయబడుతోంది. కాలక్రమేణ ఇంకా మార్పులు చెందుతూ ఆలయం దినదినాభివృద్ధి చెందాలని భక్తులు మనసారా కోరుకుంటున్నారు. ---------------------------------------------------------------------------------------------------------

Sunday, 23 November 2025

గుడిమెట్ట కాండ్రపాడు - శ్రీ మహా పంచముఖేశ్వర ఆలయం.

                                       ఉమ్మడి కృష్ణాజిల్లా నందిగామ మండలం లోని కాండ్రపాడు అనే గ్రామం చారిత్రక ప్రాథాన్యం గల గుడిమెట్ట రాజ్యానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. నందిగామ కు10 కిలోమీటర్ల దూరం గా ఉన్న కోనాయపాలెం కు సమీపగ్రామం ఇది. 



                         
మూలవిరాట్టు పంచముఖేశ్వరుడు

                                    మన జీవన గమనం లో కలిసి పోయి,నూతనత్వాన్ని ఆవిష్కరించిన ప్రాచీనసంస్కృతుల ప్రభావానికి ప్రత్యక్షనిదర్శనం ఈ కాండ్రపాడు గ్రామం లో లభించిన పంచముఖ శివలింగం.నాలుగున్నర అడుగుల ఎత్తు , మూడున్నర అడుగుల చుట్టుకొలత కల్గి లింగం పైన పైనుండి ఒక అడుగు దిగువగా లింగం చుట్టూ ఐదు మానవముఖాలు ఉండటం ఈ లింగం ప్రత్యేకత . ఆ ముఖాలు కూడా వేరు వేరు పోలికలతో ఒక ముఖానికి మరో ముఖానికి పోలికే ఉండక పోవడం మరొక ప్రత్యేకత. పంచముఖశివలింగం అంటే ఐదుముఖాలు గల్గిన శివలింగం కాదు..శివలింగం మీద ఐదు ముఖాలు కలిగి ఉండటమన్నమాట . ఇది అత్యంత అరుదైన విషయం..
శ్రీ పంచముఖేశ్వరస్వామి
                                                 మనం ఇంతకు ముందు గుడిమల్లం శివలింగం మీద మానవాకృతిని గూర్చి చెప్పుకున్నాం. ఇప్పుడు గుడిమెట్ట శివలింగం మీద ఐదు మానవ ముఖాలను మనం దర్శిస్తున్నాము. లోలోతుల్లోకి వెళ్లి ఆలోచిస్తే..... అసలు శివలింగం మీద ముఖాలు ఉండటమనేది ఎక్కడా లేనిది.చూడనిది కూడా. ఆలోచిస్తే తదనంతర కాలంలో కృష్ణదేవరాయల వంటి సార్వభౌములు తాము ఓడించిన రాజుల బొమ్మలను గండపెండరములపై వేయించుకొని కాలికి ధరించడం అనే సంప్రదాయం ఉన్నట్లే , మన ఇష్టదైవం ఉన్న లాకెట్ మనం హారానికి బిగించి మెడలో వేసుకున్నట్లు గానే ఈ పంచముఖేశ్వరుని తమ కులదైవంగా ఆరాధించిన ఈ త్యాగిరాజులు తమ,తమతండ్రులు,తాతలు పరమేశ్వరుని చెంతనే ఉన్నారనే పరిపూర్ణానుభూతి చెందడానికి ఇలా తమ,తమ వారి ముఖ చిత్రాలను శివలింగంమీద చెక్కించారేమో ? ఈ సంప్రదాయం ఎక్కడన్నా ఉన్నదా అనే దాన్ని పరిశోథించాలి. ఎందుకంటే మరెక్కడా ఇటువంటి శివలింగం లభించలేదు కాబట్టి. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే .అదే నిజమైతే ఈ లింగం యొక్క కాలనిర్ణయం కూడా ఇంకా ప్రాచీనత ను పొంది 5,6 శతాబ్దాలకో వెళ్ళే అవకాశం ఉంది.
 
                              
                                                గుడిమల్లం శ్రీపరశురామేశ్వరస్వామి
                                     
                           ఇక్కడ మనం మర్చిపోకూడని మరోవిషయం పంచముఖేశ్వరుని శివలింగం మీద కన్పిస్తున్న ఐదు ముఖాలు ఒకే రకంగా లేకపోవడమే కాదు వాళ్ళందరి ముఖాల మీద కుంకుమ బొట్లు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఒకముఖం మీద అయితే అడ్డబొట్టు(విభూతి) మీద పెట్టిన కుంకుమబొట్టును కూడ గమనించవచ్చు. మరొక ముఖ్యవిషయం ఏమిటంటే అందరి తలల మీద పట్టు టోపీలు ,వాటికి చెవుల వరకు వ్రేలాడు కుచ్చీలను కూడ గమనించవచ్చు. ఇవి ఆధునిక కాలం లో మైసూరు,పూరీ మహారాజులు దైవకార్యాలలో పాల్గొనే పవిత్రసమయం లో ధరించే పట్టు ఉష్ణీషాలను గుర్తు చేస్తున్నాయి.
                                       చారిత్రక నేపథ్యం - ఆనాడు ...... అంటే షుమారు ఎనబై,తొంభై సంవత్సరాలకు పూర్వం కాండ్రపాడు గ్రామంలో పాటిమన్నుతవ్వుతుంటే ఈ పంచముఖేశ్వర శివలింగం బయటపడిందని వృద్ధులైన గ్రామస్థులు చెపుతుంటారు. ఊరునిండ పాటిదిబ్బలే. చుట్టుప్రక్కల నాలుగైదు గ్రామాల వారు పాటిమన్ను ను ఈ ప్రాంతం నుండే త్రవ్వుకెడుతుండేవారు. పాటిమన్ను దిబ్బలను ఇంటి నిర్మాణ అవసరాలకు తవ్వుకుంటూ ఉండటం ,వాటిలో వారి అదృష్టాన్నిబట్టి ఏవేవో దొరుకుతూ ఉండటం పల్లెల్లో పరిపాటి. అటువంటి సమయంలో రకరకాల నాణాలు, వెండివస్తువులు, దీపపుసెమ్మెలు, గింజలపాతర్లు ,కుండపెంకులు మొదలైన ఫ్రాచీన అవశేషాలు లభిస్తుండేవని ఇక్కడి ప్రజలు చెపుతారు.
                          కాని ఈ ప్రాంత ప్రజల అదృష్టమేంటంటే. పంచముఖ శివలింగం వీరికి దొరికింది.ఈ అపురూప శివలింగం బయల్పడిన ప్రదేశంలోనే మరికొంత తవ్విచూడగా మరి నాలుగు చిన్నశివలింగాలు,ఒక చతురస్రపు రాతి ఫలకం,ముగురక్కల శిల్పం మరికొన్ని చిన్నచిన్నశిల్పాలు లభించాయి. అయితే ప్రధాన శివలింగానికి పానవట్టం లేదు కాని చుట్టు లభించిన చిన్నలింగాలకు మాత్రం పానవట్టాలు ఉన్నాయి. దొరికిన చతురస్రాకారపు రాతి ఫలకం మీద నాలుగు మూలల నాలుగు,మథ్యలో ఒకటి మొత్తం ఐదు వృత్తాకారాలు చెక్కబడి ఉన్నాయి. దానికి అటు ఇటు రెండు పూర్ణకుంభాలు , మరి రెండు దిక్కులలొఒక వైపు మీనముల జంట, రెండవ వైపు శంఖము చెక్కబడిఉన్నాయి. పూర్ణ కలశం అమరావతీస్థూపం లోని కలశాన్ని పోలి ఉంది.ఇది దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన సమయం లో వాడే యంత్రం గా ఉంచబడిందా అనే సందేహం కలుగుతోంది. రెండు మీనములు, శంఖము . పూర్ణకలశం మొదలైనవి ఉన్నది “శాంతి యంత్ర” మని, “మత్స్యయంత్ర” మని కూడ పిలుస్తుంటారు.
          
      చతురస్రాకారపు ఫలకం మీద  ఐదు వృత్తాలు,మీనముల జంట,అమరావతీ కలశము,శంఖము చూడవచ్చు. 
               
                         ప్రధాన లింగానికి పానవట్టం లేకపోవడం తో గ్రామస్తులు స్థానికంగా దొరికే ఒక రాయిని పానమట్టం గా చేయించి,లింగాన్ని దానిలో దిగేసి, చుట్టూ నాలుగు లింగాలను ఉంచి , యంత్రమేమో నని మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఫలకాన్ని కూడ అ ప్రధాన లింగం ప్రక్కనే ఉంచి పూజా పునస్కారాలను జరిపించేవారు. షట్కోణాకృతిలో గుడిని నిర్మించి , ఆ గుడికి పడమర వైపు రెండు కిటికీలను బిగించడం వలన స్వామి వారి పైనున్నఐదుముఖాలను దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం ఉండేది. కాలం తో పాటు ఆలయం రూపురేఖలు కూడ మారాయి . మనం పైన చెప్పుకున్న ఆలయ వృత్తాంతం సుమారు ఇరవై ముప్పై సంవత్సరాలకు పూర్వపుది. అనంతరం “నీ చెంతకు నీవే రప్పించుకో ఆపదమొక్కులు మాతో ఇప్పించుకో” అని కదా భక్తుని సంప్రార్ధన. ఈ ప్రాంత ప్రజల ప్రార్థన ఫలించింది.
                                         శ్రీ పంచముఖేశ్వరుని దివ్యరూపము

                అందుకే పంచముఖేశ్వరుడు భక్తులను అనుగ్రహించాడు . ఒక దివ్య భవ్యమైన సుందర ఆలయాన్నినిర్మింప చేసుకున్నాడు .భక్తులు నడుంకట్టారు. దాతలు ముందుకొచ్చారు. ఇప్పుడు మన కనులముందు అద్భుతమైన ఆలయం భాసిల్లుతోంది. ఆనాడు షట్కోణాకృతి గదిలో పంచముఖేశ్వరుని చూసిన మావంటి వారికి పరమాశ్చర్యము, అపరిమితానందము కలిగేటట్లుగా ఆలయనిర్మాణము,పూజాకైంకర్యాలు జరుగుతున్నాయి. సంతోషం.

                                                  ఆలయదర్శనం

సాంఘీక రాజకీయ నేపథ్యం -. గతం మర్చిపోతే భవిష్యత్తు చిన్నబోతుంది. అందుకే ఈ ఆలయ చరిత్ర తో పాటు ఈ ఆలయానికి ముడివడియున్ననాటి సాంఘీక,రాజకీయ చారిత్రక నేపథ్యాన్ని కూడ ఒక్కసారి పరిశీలిస్తే పంచముఖేశ్వరుని ప్రాశస్త్యం మరింత ఇనుమడిస్తుంది. ఈ శివలింగాన్నిచూడగానే మనకు జైనశిల్పం గుర్తుకొస్తుంది.. లింగానికి చుట్టూ ఉన్న ఐదు ముఖాలతో పాటు ముందు భాగం లో పొడవైన కత్తిమొన వంటి గుర్తు కూడ మనకు కన్పిస్తోంది.అంతేకాదు పాడు అనే పేరు జైనగ్రామాలకు చివర ఉంటుందని పరిశోధకుల తీర్మానం . ఈ ప్రాంతం లో ఉన్నగ్రామాల పేర్లు కాండ్రపాడు,లింగాలపాడు ,తక్కెళ్ళపాడు, బొబ్బిళ్ళపాడు,చింతలపాడు,చందర్లపాడు,అనిగండ్లపాడు ముండ్లపాడు , మొదలైనవే. ఇవి ఈ ప్రాంతం లోని జైన మతప్రాబల్యాన్ని గుర్తుచేస్తున్నాయి.
                                                   శ్రీ రాజరాజేశ్వరీ దివ్యదర్శనం
                 
       అంతేకాకుండా బౌద్దమత ప్రభావం కూడా ఈ ప్రాంతంలో ప్రముఖంగా ఉందనడానికి మునగచర్ల,రామిరెడ్డిపల్లి ,జగ్గయ్యపేట గ్రామాలయందలి చరిత్ర ప్రసిద్ది కెక్కిన బౌద్దస్థూపాలే ఇందుకు తార్కాణాలు. ఈ కాండ్రపాడు కు దగ్గర లోని గుడిమెట్ట ను చాగి వంశపురాజులు పాలించినట్లు క్రీ.శ 1155 నాటి గుడిమెట్ట శాసనాల మూలంగా తెలుస్తోంది. ఈ ప్రాంతాన్నికాకతీయ,రెడ్డిరాజులు సైతం పాలించినట్లు శాసనాథారాలు లభిస్తున్నాయి.
                                               ఆలయదృశ్యం

తిట్టుకవి గా పేరుపొందిన వేములవాడ భీమకవి పద్యం – అప్పకవి తన అప్పకవీయంలో ఉదాహరించిన “ హయమది సీత,పోతవసుధాధిపుడారయ రావణుండు “, అను పద్యం లోని “గుడిమెట్ట లంక” అన్నపదం లోని “గుడిమెట్ట”ఇదే నని , అ పోతవసుధాధిపుడు త్యాగి పోతరాజే నని సుప్రసిద్ధ పరిశోధకులు ఆరుద్ర అంగీకరించగా , ఆ చాగి పోతరాజు ఈ పంచముఖేశ్వరుని ప్రతిరోజు పూజించుకొని వెడుతుండేవాడని, తిట్టుకవి భీమన చెప్పిన పద్యం లోని శాపం తగిలి, ఈ రెండు గ్రామాలకు మథ్య నున్న వాగు వద్ద గుఱ్ఱంపై వెడుతుండగా శత్రువులు చేసిన దాడి లో మరణించాడని ఈ ప్రాంతంలోని వృద్ధులు అనూచానంగా వస్తున్న ఈ కథను తమ తరువాత తరానికి చెపుతుంటారు. ఈ కథ మాత్రం ఈ ప్రాంతం లో బాగా ప్రసిద్ది ని పొందింది. వేములవాడ భీమకవి కాలం కూడ క్రీ.శ1150-70 ప్రాంతమని పరిశోధకులు అంగీకరిస్తూ ఉండటం తో ఈ వాదన లో కొంత సత్యం కూడ మనకు కన్పిస్తోంది.
 

                                                                      సంజె వెలుగులో ఆలయ శోభ

ముఖ్యంగా త్యాగి వారు, కాకతీయ, రెడ్డిరాజులు సైతం శైవమతాన్ని ఎక్కువగా ఆదరించినవారే కనుక ఈ పంచముఖేశ్వరుని చరిత్ర కూడ చాల పురాతనమైందిగానే కన్పిస్తోంది. జైన,బౌద్ధ,శైవ సంస్కృతుల సమ్మేళన శిల్పమే ఈ పంచముఖేశ్వరునిలో ద్యోతకమౌతోంది. తప్పని సరిగా దర్శించవలసిన దివ్యక్షేత్రం ఈ పంచముఖేశ్వర క్షేత్రం. ---------------------------------------------------------------------------------------------------