Nacharamgutta Sri LakshmiNarasimha Swamy Aalayam.
नाचारंगुट्टा श्रीलक्ष्मीनरसिंहस्वामि आलयम् .
నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.
మెదక్ జిల్లా లో
కొలువు తీరిన మరొక నారసింహక్షేత్రం నాచారం గుట్ట. హైదరాబాద్ నుండి సుమారు 59 కి మీ
దూరం లో హరిద్రానదీ తీరం లో ఈ
దివ్యక్షేత్రం అలరారుతోంది. ఇచ్చట శ్రీ
నరసింహ స్వామి లక్ష్మీదేవి తో కూడి
స్వయంభూవ్యక్తుడై కొలువుతీరి ఉన్నాడు.ఈ నాచారం గుట్టనే నాచగిరి అని, శ్వేతగిరి అని కూడ పిలుస్తారు. గత
ఐదు శతాబ్దాలుగా ఈ నాచగిరి పైన శ్రీ
లక్ష్మీనరసింహస్వామి అభివ్యక్తుడై,
భక్తులచే పూజలందుకుంటూ, వారిని అనుగ్రహిస్తున్నట్లు స్థలపురాణం చెపుతోంది.
తోరణద్వారం
స్థలపురాణం .-- కృతయుగం లో దుష్టశిక్షణ కై ఆవిర్భవించిన శ్రీ
నారసింహుని ప్రాదుర్భావ సమయ సంజనిత గర్జారావం భూనభోంతరాళాల్లో దద్దరిల్లి ,
చతుర్దశభువనాల్లోను మార్మోగింది. ఆ సమయం లో నవనాథులు ఈ నాచగిరి క్షేత్రం లోని ఎత్తైన కొండలలోని గుహలనుండి వెలువడుతున్న నారసింహ గర్జనలను విని ఇది పరమ పవిత్ర ప్రదేశం
గా భావించి ఇచ్చటనే తపస్సు కు ఉపక్రమించారు.
ఆదిశేషుని రూపం లో ఉన్న గుహ లో శ్రీ స్వామి అర్చారూపుడుగా , స్వయంవ్యక్తుడై దర్శనమివ్వడం
తో సంతోషించారు.
ఆలయ ప్రధాన ప్రవేశద్వారం
శ్రీ స్వామి వారి
అనుగ్రహం తో హరిద్రానది పసుపు ,కుంకుమ
వర్ణాలు గల సాగు భూముల గుండా నీలవర్ణపు నీటిని
వెదజల్లుచూ ఆవిర్భవించి, స్వామి పాదాలచెంత ఉత్తరవాహినియై ప్రవహిస్తూ, భక్తజనుల కల్మషహారిణి యై ప్రసిద్ధి కెక్కింది.
ఆలయ రాజగోపురం
గార్గేయ మహర్షి ఈ ప్రదేశం లో తపస్సు
చేయడం వలన ఈ ప్రాంతాన్ని “గార్గేయ తపోవనం” గా కూడ పిలుస్తారు.
ఆలయ ఉత్తర ద్వారం
పైన చెప్పిన వృత్తాంతం లో
నవనాథుల ప్రస్తావన వచ్చింది కాని వారిని గూర్చిన వివరణ వేరొక గాథ లో లభిస్తోంది.
మరొక గాథ ననుసరించి -- కలియుగం ప్రారంభమై క్రీ.శ 2014 నాటికి
5114 సంవత్సరాలైనట్లు చెప్పబడుతోంది. కలియుగ
ప్రారంభం తో అధర్మం పెచ్చుపెరిగి , పాపం తాండవించసాగింది. పాపభారాన్ని భరించలేని
భూమాత విష్ణుమూర్తికి మొర పెట్టుకుంది. ఆ సర్వాంతర్యామికి తెలియనిదేముంది ?.
గర్భగుడి వెలుపలి వైపు దర్శనమిచ్చే దాసాంజనేయుడు
అందుకే ఈ ఉపద్రవాన్ని
కొంతవరకన్నా అరికట్టడానికి శ్రీమహావిష్ణువు తొమ్మండుగురిని పిలిచాడు. వారే
నవనాథులు. హరి,అంతరిక్షుడు, ప్రబుద్దుడు, పిప్పలాదుడు ,అవిర్హేతుడు ,ద్రుమిళుడు ,
చ్యవనుడు , కరభాజుడు ,కలి , అనే వారు నవనాథులు. శ్రీమహావిష్ణువు వారిని పిలిచి
కలియుగం లో రాబోయే ఉపద్రవాలను యథాశక్తి నిరోధింపుడని ఆజ్ఞాపించాడు. వారు
భూలోకానికి చేరుకొని, హరిద్రానదీ తీరానికి వచ్చారు. ఈ శ్వేతగిరి చెంతకు వచ్చే
సరికి , ఇచ్చటి గుహలో నుండి సింహగర్జనలు వినిపించాయి.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యదర్శనం
ఆ గర్జనలు వారిలో సంతోషాన్ని
ఉప్పొంగ చేశాయి. ఇంకేముంది. వెంటనే అష్టాక్షరి ని జపిస్తూ, మనసంతా శ్రీహరి మయం
కాగా అక్కడే తపస్సు ప్రారంభించారు నవనాథులు. వారి తపస్సుకు మెచ్చి, యుగాలనుండి
అక్కడే ఉంటున్నా, వీరికి దర్శనమిచ్చాడు స్వామి.
ఈ ఆలయ దృశ్యాలను you tube లో కూడ దర్శించవచ్చు.
శ్రీ స్వామిని దర్శించిన ఆ మహనీయులు అమ్మవారి తో కూడ శ్రీ స్వామి దర్శనం కావాలని కోరుకున్నారు. నవనాథుల కోరికను మన్నించారు శ్రీ నరసింహస్వామి. శ్రీ లక్ష్మీనరసింహుడై వారికి దర్శనమిచ్చారు స్వామి.
ఈ ఆలయ దృశ్యాలను you tube లో కూడ దర్శించవచ్చు.
శ్రీ స్వామిని దర్శించిన ఆ మహనీయులు అమ్మవారి తో కూడ శ్రీ స్వామి దర్శనం కావాలని కోరుకున్నారు. నవనాథుల కోరికను మన్నించారు శ్రీ నరసింహస్వామి. శ్రీ లక్ష్మీనరసింహుడై వారికి దర్శనమిచ్చారు స్వామి.
శ్రీ స్వామి వారి దివ్యరూపం
ఆ కొండ మీదనే
అదే రూపుతో కొలువై భక్తులను అనుగ్రహించ వలసిందిగా మహర్షులు వేడుకున్నారు. భక్తపరాధీనుడైన
లక్ష్మీనాథుడు వారికోరికను మన్నించాడు. శ్రీ లక్ష్మీనరసింహుడై నాచగిర పైన కొలువు
తీరి , కొలిచిన వారికి కొంగుబంగారమై,
ఆర్తుల నాదుకంటూ, భక్తజనమందారుడై మొక్కుల నందుకుంటున్నాడు.
ధ్వజస్థంభము
కొంతకాలానికి
నాచారమనే భక్తుడు, స్వామి సేవలో తరించి ,ఆయన లో ఐక్యమయ్యాడు. ఆ భక్తుని పేరనే ఈ
శ్వేతగిరి పిలవబడుతుందని భగవానుని ఆజ్ఞ. అందువల్లనే ఆ గిరి నాచారం గుట్ట
గాను, ఆ గిరి క్రింద ఏర్పడిన గ్రామాన్ని
నాచారం గాను పిలుస్తున్నారట.
శ్రీ సీతారామచంద్రస్వామి ఉపాలయం
ఇక్కడ ఉన్న ఉపాలయాలలో శ్రీ సీతారామచంద్రస్వామి , శ్రీ
సత్యనారాయణ స్వామి. ఆంజనేయుడు, సూర్యభగవానుడు , దత్తాత్రేయుడు , నవగ్రహాలను కూడ
దర్శించవచ్చు.
ఆలయప్రధాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ మందిరం , శ్రీ
షిర్డీ సాయిబాబా గుడి ప్రత్యేకంగా భక్తులను
ఆకర్షిస్తాయి.
ఆంజనేయ ఆలయ తోరణద్వారం
**********************************************************************************
No comments:
Post a Comment