Wednesday, 29 January 2014

ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ ఆలయం

                                      
                EEedupayala Sri Vanadurga Bhavani  Aalayam.

                                       
                        एडुपायल श्री वनदुर्गा भवानी आलयम्.        

                     ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ ఆలయం .
                                           


                                 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి  గ్రామం లో ఏడుపాయల చెంత  శ్రీ వనదుర్గామాత ఆలయం  అలరారుతోంది. ఇచ్చట మంజీరానది  గరుడగంగ గా ప్రవహిస్తోంది. ఈ ప్రదేశం లోని  ఏడుపాయలను సప్తఋషుల పేర్ల తో పిలుస్తారు. జమదగ్ని ,అత్రి , కశ్యప ,విశ్వామిత్ర, వశిష్ట, భరద్వాజ ,గౌతమ అనే పేర్ల తో ఇచ్చట నదీ ప్రవాహం   ఏడుపాయలు గా ప్రవహిస్తోందని భక్తుల విశ్వాసం
                        
                        ఈ సంగమ ప్రదేశం లో వనదుర్గామాత వెలసి భక్తుల పాలిట కల్పతరువై పూజలనందుకుంటోంది. మూడుపాయలు అమ్మవారి ఆలయానికి ముందు భాగం లోను, నాలుగుపాయలు ఆలయానికి వెనుక భాగం లోను ప్రవహిస్తున్నాయి.  సహజం గానే  ఆకుపచ్చని ప్రకృతి తో , ఎత్తైన పర్వత, పాషాణాదులతో ఆహ్లదకరం గా ఉండే ఈ ప్రదేశం, వర్షాకాలం లో   చుట్టూ వరదనీటితో జలజల ప్రవహించే ఏడుపాయలతో, నడుమ వనదుర్గా మాత ఆలయం తో మిక్కిలి రమణీయం గా  ప్రకాశిస్తూ, భక్తులకు మహాద్భుత దృశ్యాన్న్ని దర్శింపచేస్తుంది. ఈ ఆలయానికి కొద్దిదూరం లోనే  నిర్మించబడిన వనదుర్గామాత జలాశయం కూడ  ఇచ్చటి ప్రకృతి అందాలను  ఇనుమడింప చేస్తోంది.

                                       నాగసాన్పల్లి వద్ద కన్పించే తోరణద్వారం
                 
                       స్థలపురాణం .       జనమేజయుడు సర్పయాగాన్ని ఈప్రదేశం లోనే నిర్వహించినట్లు స్థలపురాణం చెపుతోంది.  జనమేజయుడు చేయుచున్న సర్పయాగము వలన సంభవించెడి మహానర్థాన్ని  నివారించడానికి తక్షకుడు తన అన్నయైన వాసుకి దగ్గరకు వచ్చాడు. అప్పుడు వాసుకి  అమ్మకద్రువ , నువ్వు చేసిన తప్పే ఇదంతా అని తక్షకుని మందలించాడు , బ్రహ్మదేవుని వలన  తాను  విన్న విషయాన్ని ఇలా వివరించాడు. మాతృశాపము తప్పించడం ఎవరితరము కాదు గాని ఒక ఉపాయముంది. మన చెల్లెలైన జరత్కార ను అదే పేరు గల్గిన జరత్కారువు అను మహర్షికి ఇచ్చి వివాహం చేసిన వారికి జన్మించిన కుమారుడు ఈ ఉపద్రవమును ఆపగలడని బ్రహ్మదేవుడు  తనకు చెప్పినట్లు  వాసుకి చెప్పాడు .
              వారిద్దరు కలిసి చెల్లెలైన జరత్కార దగ్గరకు వచ్చారు. మీ కుమారుడు , మామేనల్లుడు ఐన ఆస్తీకుడే ఈ ఉపద్రవాన్ని వారింప సమర్థుడు. అతడు నిరంతర వనదుర్గా మంత్రోపాసకుడు. అతడు వనదుర్గామహామంత్రాన్ని ఉపాశించి, వనదుర్గామాతను ప్రతిష్టించాడని ప్రతీతి. కావున ఆస్తీకుడే ఈ ఉపద్రవాన్ని నివారించగలడని పలికాడు వాసుకి. వారి మాటలను విన్న ఆస్తీకుడు తల్లిని , మేనమామ లను  ఊరడించి  మహాసర్పయాగశాల కు బయలుదేరాడు.  ఇంద్రుని సింహాసనానికి చుట్టుకొని దాక్కున్న తక్షకుని సహేంద్రతక్షకాయస్వాహా మంత్రం తో పింగళుడు ఇంద్రుని తో సహా తక్షకుని హోమగుండం లోకి ఆవాహన చేసే సమయానికి ఆస్తీకుడు యాగశాల లోనికి ప్రవేశించాడు. 
                         

                
                                                     రాజగోపురం
                ఆ మహాసర్ప యాగము ఆస్తీక మహాముని ప్రయత్నం తో  తక్షకుని మరణం జరక్క ముందే ఆగిపోయినది. అప్పటికే బూడిద రాశులుగా మాడిపోయిన తన బిడ్డలను చూసి, నెత్తి నేల మొత్తుకుంటూ దుఖిస్తోంది కద్రువ.  యాగశాలకు వచ్చిన సప్తఋషులను , మిగిలిన పెద్దలను చూసి, తన బిడ్డల చితాభస్మము ఇలా గాలిలో కలిసిపోవలసిందేనా. వారికి స్వర్గలోకప్రాప్తి కలుగజేయండని వేడుకొనెను. వారందరు ఈ సమస్య కు మార్గము చూపుమని సూతమహర్షి ని ప్రార్థించారు.
                       పాతాళలోకం లో భోగవతి అనే నది ప్రవహిస్తోంది. ఆ నది భాగీరథి సోదరి. ఆ నది ని తీసుకొచ్చి  ఈ యజ్ఞ గుండముల పై నుండి ప్రవహింప చేస్తే  వీరందరికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని , ఈ పనికి  వైనతేయుడొక్కడే సమర్థుడని సూతమహర్షి పల్కినాడు.
                  

                                                     గోపుర దృశ్యం
                           ఆ మాటలు విన్న గరుత్మంతుడు తల్లి ఆజ్ఞ కోసం శిరసు వంచాడు. సవతి యైన కద్రువ దుఖాన్ని చూసి జాలిపడిన వినతాదేవి భోగవతి నదిని పాతాళమునుండి తీసుకు రమ్మని  వైనతేయుని ఆజ్ఞాపించింది. అంత గరుత్మంతుడు తన స్వామియైన శ్రీమహావిష్ణువును ప్రార్థించి, తల్లికి నమస్కరించి, మహర్షుల యొక్క ఆశీస్సులను తీసుకొని పాతాళానికి చేరుకున్నాడు . భోగవతీ నదిని సమీపించి ఆమెను పరిపరి విధముల ప్రార్థించి,  భూమిపై ప్రవహించుటకు అంగీకరింపచేసుకున్నాడు. ఆమెను తన రెక్కలపై ఉంచుకొని  వాయువేగం తో భూమికి చేరిన గరుత్మంతుడు ఆ నదిని విదర్భ ప్రాంతం లో భూమి పైన దించాడు.
               

                          
                                                                      ఆలయ ధ్వజస్థంభము
            
                                      “అమ్మా ! నీవు ఏడుపాయల గుండా ప్రవహించి,మహాసర్పయాగ శాల యందలి యజ్ఞగుండములను పవిత్రం చేయవలసింది గాను, తాను ఆమెను అనుసరిస్తూ, ఆకాశమార్గమున  రాగలనని పల్కినాడు.  భోగవతీ నది  ఏడుపాయలగుండా మెలమెల్ల గా ముందుకు సాగి, యజ్ఞ గుండములను ముంచుచూ ముందుకు సాగి, గోదావరికి ఉపనది గా మారి  గోదావరి యందు కలిసి పోయినది. దేవేంద్రాది దేవతలు ,  జనమేజయుడు, ఆస్తీకాది మహర్షులు ఆ పుణ్యనది యందు  పవిత్ర స్నానాలు చేశారు.  
                   


                      ఆస్తీకమహర్షి, సూతమహాముని , సప్తఋషులు  కలసి ఈ ఏడుపాయలలో శ్రీ వనదుర్ఘామాతను ప్రతిష్టించారు.  శ్రీ అమ్మవారి పాదాలను కడుగుతున్నట్లు ఇప్పటికీ ఈ నది వాన కాలం లో  అమ్మవారి పాదాల వరకు  ప్రవహిస్తూనే ఉంటుంది.

                                                        ఆలయదృశ్యం
                    
                          పాతాళ లోకము నుండి గరుడునిచే తీసుకొని రాబడటం వలన  భోగవతి నది కి గరుడగంగ అని పేరు వచ్చింది. జనమేజయుడు యజ్ఞకర్త గా వ్యవహరించిన యజ్ఞము మధ్యలో ఆగిపోవడంచేత తన ముంజేతి కంకణాన్ని తీసి  ఈ నది లో  వేయడం వలన  ఈ నది కి మంజీరానది అని పేరు ప్రసిద్ధమైంది.
                                    భోగావతీ మహాపుణ్యా తీర్థానా ముత్తమోత్తమా
                                    సంజాతా నాగలోకే చ లోకానాం పావనాయ చ
                                    సా నదీ సుఖమాదాయ గరుడేన మహాత్మనా
                                    నాగానాం తాపనాశాయ లోకానాం హితకామ్యయా
                                     ఖ్యాత భూత్సర్వ లోకేషు తాక్ష్యగంగేతి నారద
                                     తస్య తీర్థస్య మాహాత్మ్యం మేషముక్త దివాకరే
                                     తీర్థానాం తు ఫలాధిక్యం వక్ష్యామ్యహ మతపరం
                  మేషరాశి యందు సూర్యుడు ప్రవేశించు కాలం లో ఈ గరుడగంగ యందు స్నానమాచరిస్తే మహాపుణ్యమని , సమస్తపాపాలు  నశించి  ఉత్తమలోకాలను పొందుతారని బ్రహ్మాండపురాణం తీర్థఖండం లోని బ్రహ్మనారద సంవాద ఘట్టం లోని గరుడగంగా మహత్మ్యం లో చెప్పబడిందని స్థలపురాణం .
     


                వనదుర్గామాత మహాత్య్మము.       మహామహోపాధ్యాయ శ్రీ కోలాచల మల్లినాథసూరి  నివాసభూమి యైన కోలాచల అగ్రహారం ఈ ఏడుపాయల కు  ఐదు మైళ్ల దూరం లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాళిదాస సరస్వతి దుర్వ్యాఖ్యా విషమూర్ఛిత కాగా సంజీవినీ వ్యాఖ్య తో ఆమెను పునరుజ్జీవింప చేసిన  మహానుభావుడు మల్లినాథసూరి మహోదయులు. ఈ మహానుభావుని సోదరుడు పెద్దిభట్టు. శ్రీ మల్లినాథసూరి కాశీ విజయానంతరం వీరిరువురు ఏడుపాయల వనదుర్గామాత సన్నిథి లో ఒక సంవత్సరకాలము  సహస్ర చండీయాగాన్ని నిర్వహించారట.
         

             
                      ‘ఆంథ్రదేశాధీశ్వర, ఆంథ్ర సురత్రాణ అనే బిరుదు లున్న ముసునూరి కాపయనాయకుడు మహమ్మదీయదండయాత్రలకు ఎదురొడ్డి పోరాడు చుండగా ,అతనికి అండగా, రక్షణ గా అమ్మ అనుగ్రహం కొరకు ఈ యాగము నిర్వహించబడినట్లు చెప్పబడుతోంది. నిర్విఘ్నముగా సహస్ర చండీయాగము పూర్తయింది. పూర్ణాహుతి సమర్పించగానే  ఆదిశక్తి స్వరూపిణి యైన వనదుర్గా భవానీమాత ఏడుపాయల ఆలయం లో  మెరుపుతీగ తో సమానమైన కాంతిచ్ఛట తో, సింహవాహనారూఢయై, కరవాలము,ఖేటము ,ధనుస్సు ,చక్రము ,గద ,బాణము పాశము,తర్జనీయము లను ధరించి, త్రినేత్రములతో, చూడామణీకృత చంద్రరేఖయై  ప్రత్యక్షమై, పెద్దిభట్టు నకు ఒక ఖడ్గాన్ని  ఇచ్చి, దానిని కాపయనాయకునకు  ఇప్పించింది.  
          

                                    
                                      శ్రీ వనదుర్గామాత దివ్యమంగళ విగ్రహము
         
                           దేవీప్రసాదితమైన ఖడ్గమును  పట్టిన ముసునూరి కాపయనాయకుడు ఆ అర్థరాత్రి మెదకు కోటను ముట్టడించుటకు బయలుదేరి.తురకవేగులు దాక్కున్న  దోషుల పాయ యందు వారిని వధించి ,జైత్రయాత్ర కు బయలుదేరినాడు.  ఆ సమయం లో కాకతీయ ప్రతాపరుద్రుడు నిర్మింపచేసిన మెదక్ కోట మాలిక్కాఫర్ అథీనం లో ఉంది. కాపయనాయకుని సైన్యం మెదక్ కోటను ముట్టడించి, సూర్యోదయమయ్యేసరికి,చంద్రధ్వజాన్ని కూల్చి,హిందూ పతాకను ఎగురవేశారట. అనంతర కాలం లో కర్ణాటకాధిపతి యైన మూడవ భల్లాలుని సహకారం తో కాపయనాయకుడు ఓరుగల్లు కోటను ముట్టడించి, ఆ దుర్గపాలకుడైన నాయబ్ వజీరుమలిక్ మక్బూల్ ను పారద్రోలి విజయాన్ని సాధించాడు. ఇదంతా వనదుర్గామాత కరుణా ప్రభావమేనని స్థలపురాణం లో  చెప్పబడింది.

          క్రీ.శ 1332- 1367-68 శాసనము లందు   మెదకు సీమ లోని మహమ్మదీయ దుండగాలను  నిలువరించడానికి పోరాడిన వీరుని గా ముసునూరి కాపయనాయకుని గూర్చి వ్రాస్తున్నారు. ఇతను ధర్మకర్మ నిరతుడని. కాశీవిశ్వపతి ప్రసాదితుడు , ప్రతాపరుద్రప్రభావుడని చెప్పబడ్డాడు.
      
       
      ఈ ఆలయ దృశ్యాలను you tube   లో చూడవచ్చు

             కాశీనాథ యోగీంద్రులు.         మహమ్మదీయ దండ యాత్రల కారణం గా ఈ పుణ్యదేవాలయము కాలానికి తలఒగ్గి, కొంతకాలం పాటు తన ప్రభావాన్ని ఉపసంహరించుకొని క్రీ.శ.1870 వరకు మరుగున ఉండిపోయింది. అనంతరం కాశీనాథ యోగీశ్వరులనే  ఒక దిగంబర యోగి కాశీనుండి షోడశకళలను (?) తీసుకొచ్చివనదుర్గామాత ఆలయం లో విడిది చేశాడట. ఆనాటి రాత్రి దేవీ వనదుర్గ ఆ యోగిపుంగవునకు దర్శనమిచ్చి క్షేత్రపునరుద్ధరణ చేయమని ఆజ్ఞాపించిందట. ఆ తల్లి ఆజ్ఞ ను శిరసావహించి, కాశీయోగీంద్రులు మహోత్కృష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  వాతాంబుపర్ణాశనుడుగా,ఆరుమాసాలు శీతోష్ణద్వంద్వాలను ఎదుర్కొంటూ, తన అనుష్ఠానాన్ని కొనసాగించాడు.  మూలరాతిపై  యంత్ర ప్రతిష్ట గావించి,  కాశీ నుండి తెచ్చిన పదహారు కళలను  ఆ యంత్రానికి  ధారపోశాడు ఆ మహాయోగి.
           
           
                         శ్రీ వనదుర్గా దేవి దివ్యమంగళ రూపము

                           ఆ తరువాత నాగసానిపల్లి నివాసియైన తలారి రాజన్న ను అమ్మవారి ఆలయానికి తీసుకు వచ్చి ఆలయాన్ని శుభ్రపరచడానికి నియోగించాడు. ఆ తరువాత కాశీనాథ యోగీంద్రులు ఒక నాలుగు సంవత్సరాల పాటు  అప్పుడప్పుడు మనుషులకు కన్పిస్తూ, అమ్మను సేవించి ఆమె అనుగ్రహానికి పాత్రులవ్వమని  సుద్దులు చెప్పేవాడట. క్రమేణా  ఆ మహనీయుని దర్శనం కరువైపోయింది. ఆయన అదృశ్యమై పోయాడు. ఆ యోగి వేసిన యంత్ర ప్రభావం వల్లనే  నేటివరకు ఏడుపాయల వనదుర్గా మాత భక్తుల కల్పవల్లి గా  వెలుగొందుతోంది.
         
              ఏడుపాయల వివరణ.      పాయ అను మాట నదీతీర వాసులకు పరిచయమైన పదమే.  నది లో నీరు చిన్న ప్రవాహం గా మారి ప్రవహించడాన్ని పాయ అంటారు.  గరుడగంగ  ఏడుపాయలుగా చీలి ఈ  ఆలయం చుట్టూ ప్రవహిస్తూ దీనిని ఏడుపాయలు  గా ప్రసిధ్ధి చేసింది..   
                              మొదటిది.     వనదుర్గామాత వెలసిన పాయను వనదుర్గామాత పాయ గా పిలుస్తారు. ఇది సుమారు పదిహేను ఎకరాల  విస్తీర్ణం కలిగి ఉంటుంది.
                    రెండవది  శ్రీ రాములవారి పాయ. త్రేతాయుగం లో శ్రీరామచంద్రుల వారు వనదుర్గామాత ను పూజించి , సేవించారట.  అందువలన దీనికి ఈ పేరు వచ్చింది. రాముల వారి పాయ 30 ఎకరాలు.
                 మూడవది లక్ష్మణ పాయ. దీనిపై గర్గముని తపస్సుచేయడం వలన దీనిని గార్గ్యముని పాయ అని పిలుస్తారు. ఇది 9 ఎకరాలు.
                నాల్గవది  చండభార్గవ పాయ. దీని పైన క్రీ.శ 1367 లో శ్రీ మల్లినాథ సూరి  సోదరుడు మహా మంత్రవేత్తయైన పెద్దిభట్టు పర్ణశాల ఏర్పరుచుకొని సహస్రచండీయాగం చేయడం వలన దీనినే పెద్దయేటిపాయ యని  కూడ పిలుస్తారు. ఇది 70 ఎకరాల లో ప్రవహిస్తోంది.
                ఐదవది  పింగళిఋషి పాయ. దీనిపైన మహామహోపాథ్యాయ శ్రీ మల్లినాథసూరి యాగ సమయం లో నివాసమేర్పరుచుకోవడం వల్ల దీనిని సూరి పాయ లేక చిన్నయేటి పాయ అనేవారు. దీని విస్తీర్ణం 11  ఎకరాలు.
               ఆరవది  వ్యాసముని తన శిష్యగణముతో నివాసమున్నది కావున వ్యాసముని పాయ. అయితే  అనంతర కాలం లో కాపయనాయకుడు   సైన్యాన్ని సమకూర్చుకొని తురకల నుండి మన కోటలను విడిపింతునని ప్రతిజ్ఞ చేసిన ప్రదేశమగుటచే  దీనినే కోటపాయ ,కాపయ నాయకుని పాయ అని కూడ పిలుస్తారు. ఇది 120 ఎకరాలు.
            ఏడవది   జనమేజయ పాయ .  జనమేజయుడు ఇచ్చట విడిది  చేసి, మంత్రలోచనం జరిపి, మహాసర్పయాగం నడిపించుటచే దీనిని మంత్రనాల పాయ అని,  తురక గూఢచారులను ఇక్కడే కాపయ నాయకుడు వధించుటచే దోషుల పాయ , లేక దొంతరాల పాయ అని కూడ పిలుస్తారు. ఇది ఐదెకరాల విస్తీర్ణము.


                                                   వనదుర్గ   జలాశయం

       మహాసర్పయాగ సాక్ష్యాలు.         జనమేజయుడు మహాసర్పయాగం ఇక్కడే నిర్వహించాడనటానికి సాక్ష్యం గా స్థానికులు కొన్ని సాక్ష్యాలను చూపిస్తున్నారు. ఎల్లాపురం సమీపం లో మంజీరానది పై నిర్మించిన వంతెన క్రింది భాగం లో సుమారు ఒక ఫర్లాంగు దూరం లో ఈరోజు కు కూడ సర్పయాగభూతి విభూతి రూపం లో లభిస్తుందట. దానిన శైవభక్తులు సేకరించుకొని విభూతి గా ధరిస్తున్నారని చెపుతారు.
       

                                   జలాశయం వద్ద కన్పించే దుర్గాదేవి విగ్రహం
                    నర్సపూర్ పట్టణానికి వాయవ్యం గా సుమారు 8 కి.మీ.  దూరం లో ఉన్న పాంబండ అనే గ్రామం లో పెద్దపెద్ద బండరాళ్లపై సర్పములు యాగమునకు వచ్చునప్పుడు వాటిబరువుకు బండలపై ఏర్పడిన దారులు ఇప్పటికీ కన్పిస్తున్నాయట.
                       

                                   
                                   జలాశయం వద్ద  పర్యాటకుల సందడి
                   
                  వనదుర్గా మాత స్థలపురాణం, మహాత్య్మాలను విద్వాన్ శ్రీ శాస్త్రుల  విశ్వనాథ శర్మ రచించిన గ్రంథాన్ని ఆధారం చేసుకొని, స్థానికులు చెప్పిన విషయాలను, కొన్ని పురాణాలను పరిశీలించి, క్రోడీకరించి  ఒక చిన్న పుస్తకాన్ని నాగ్సాన్పల్లి కి చెందిన  శ్రీ నారాయణ్ దుర్గారెడ్డి గారి సిద్దిరాం రెడ్డి  రచించారు.  అదే ఈ క్షేత్రం లో లభిస్తున్న  స్థలపురాణం.  

         ఉత్సవాలు .    ఇచ్చట జరిగే ఉత్సవాల్లో  శరన్నవరాత్రి ఉత్సవాలు , శివరాత్రి ఉత్సవాలు  ప్రసిద్ధమైనవి.   దసరా కు  జరిగే నవరాత్రి ఉత్సవాల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొంటారు. శివరాత్రి నుండి మూడు రోజుల పాటు బండి ఉత్సవం జరుగుతుంది. చుట్టుపక్కల ముప్ఫైరెండు గ్రామాలనుండి  అలంకరించిన వందలాది ఎడ్లబండ్లు  ఈ త్సవ లో పాల్గొంటాయి. మూడవరోజు రథోత్సవం తో వైభవం గా  ఈ ఉత్సవాలు ముగుస్తాయి.  తెలంగాణ ప్రాంతం లో సమ్మక్క-సారక్క జాతర తర్వాత అతి పెద్ద జాతర గా ఏడుపాయల జాతర కు పేరుంది.
        

                   ప్రతి సంవత్సరం ఇరవైలక్షలకు పైగా భక్తులు వనదుర్గామాతను దర్శించుకొని , మొక్కులు చెల్లించుకుంటారు. గొర్రెలను బలి ఇవ్వడం ఇక్కడ ఆచారం గా వస్తోంది. ఇక్కడ జరిగే ఉత్సవాలకు  రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలనుండి కూడ పెద్దఎత్తున భక్తులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.
                  

                       నాగసాన్పల్లి  మెయిన్రోడ్డు నుండి అమ్మవారి ఆలయం ఏడు కిలోమీటర్ల దూరం లో ఉంది. అందువలన ఆటోలు విరివిగా సర్వీసుల నందిస్తున్నాయి.

**********************************************************************************

No comments:

Post a Comment