Tuesday, 19 July 2016

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం.

   


   ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం.



Vontimitta   Sri Kodandarama Swamy  TEMPLE .


   ऒंटिमिट्ट श्री कोदंडरामस्वामि आलयम् .

         


                   


                                                 ఉత్తర ద్వార గోపురం

                         ఒంటిమిట్ట  అతి ప్రసిద్దమైన పేరు.   ఆంధ్రమహాభాగవతాన్ని రచించిన మహాకవి బమ్మెర పోతన  ఒంటిమిట్ట నివాసి ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న గుర్తు. ఒంటిమిట్ట సీతాలక్ష్మణ సమేత  శ్రీ కోదండరాముడు కొలువు తీరిన చోటు. కడప కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం లో రాజంపేట కు సమీపం లో   ఈ ఆలయం ఉంది.
           
              చిన్నగుట్ట మీద నిర్మించిన రామాలయం ఇది.  ఈ ఒంటిమిట్ట నే ఏకశిలానగరమని కూడ పిలుస్తారు. ఈ ఆలయం 11 వ శతాబ్దానికే ప్రసిద్ధమైనట్టు శాసనాద్యాధారాలు కన్పిస్తున్నాయి. తొలుత చోళులు , అనంతర కాలం లో విజయనగర రాజులు ఈ స్వామి సేవలో తరించారు.
    
          



  
                                                 అనుబంధ మండపం

 ఆలయనిర్మాణం            ఈ ఆలయం మూడు దశలలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. తొలి దశ లో గర్భాలయం, రెడవదశ లో ముఖమండపం , మలి దశ లో ప్రాకార , రాజగోపురాలు నిర్మించబడినట్లు పరిశోధకులు  భావిస్తున్నారు. ఆలయ మంతా విజయనగర శిల్ప శైలి మురిపించి కనువిందు చేస్తుంది. గర్భాలయ నిర్మాణం చోళ సంప్రదాయం లో నిర్మించబడినట్లు  చరిత్రకారులు చెపుతున్నారు.
                 
                   ఆలయ గాలిగోపురాలు , ముఖమండపం  భాగవత ,రామాయణ కధా కథన శిల్పాలతో చూపరులను కట్టిపడేస్తాయి. ఏదో శిల్పం ఉన్నదిలే అన్నట్టు కాకుండా ప్రతి శిల్పం లోను జీవకళ ఉట్టిపడతూ ఉండటం ఇక్కడ శిల్పాల్లో మనం గమనించవచ్చు.
                         
             


                      ముఖమండపం విజయనగర సంప్రదాయ రీతి లో రంగమండపం గా తీర్చిదిద్దబడింది. ఈ మండపం ముఫైరెండు   బలమైన స్థంభాలతో నిర్మించబడింది. ప్రతి స్థంభము  శిల్పకళా చిత్రితమై ముగ్ధ మోహనం గా కన్పిస్తాయి. మన అదృష్టమేమిటంటే ఇంత అందమైన శిల్పం ఇన్ని వందల సంవత్సరాల తరువాత కూడ చెక్కుచెదరకుండా , ముష్కరుల చేత పగల గొట్టబడకుండా ఉండటం నిజం గా  మెచ్చుకోదగ్గ విషయం. ఆ రామచంద్రుడే ఈ శిల్పాన్ని దుండగుల నుంచి కాపాడుకున్నాడని  స్థానికులు   చెపుతారు.
                 

                                                     రాజగోపురం


                   ఒక మహమ్మదీయ రాజు  ఈ ఆలయ గోపురం మీద నున్న  శిల్పాలను ధ్వంసం చేస్తుంటే శ్రీ రాముడు అతనికి కన్పించి , ఆ దుష్కృత్యం నుంచి అతన్ని  నివారించాడని ,  అనంతరం ఆ  నవాబు స్వామిని సేవించి మాన్యాలను సమర్పించాడని , అప్పటి నుండి ముస్లిం భక్తులు కూడ ప్రతి శుక్రవారం ఆలయానికి వచ్చి శ్రీ స్వామి వారి ని దర్శించుకుంటారని  ఇక్కడి భక్తులు చెపుతున్నారు.


           

             
                                 ముఖమండపం లోని శిల్పాలు






                   ఆలయ చరిత్ర.          ఒంటడు మిట్టడు అనే ఇద్దరు భక్తులు ఈ గుడిని ఒక రాత్రి లో నిర్మించారని ఒక  ఐతిహ్యం. ఈ ఒంటడు , మిట్టడు అనే వాళ్లు బందిపోటు దొంగలని , వీరు ఎత్తుకొచ్చిన సొమ్మంతా ఈ కొండ మీద గుహల్లో దాచి పెట్టేవారని , అటువంటి వారికి రామయ్య కలలో కన్పించి   సద్బుద్ధి ని ప్రసాదించాడని , దానితో వారు రామభక్తులు గా మారి పోయి, ఈ ఆలయాన్ని కట్టించి అనంతర కాలంలో   శిలాకృతు లై   రామయ్య లో కలిసి పోయారని , అందువలన  వారిపేరు మీద ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఒక గాథ  ప్రచారం లో ఉంది.
                           

                  శ్రీ రామచంద్రుని వనవాసకాలం లో  ఆంజనేయుడు శ్రీరాముని కలవక ముందు జాంబవంతుడు ఈ  స్వామిని ప్రతిష్టించాడని, అందువల్లనే ఇక్కడ గర్బగుడి లో సీతారామలక్ష్మణులతో పాటు ఆంజనేయుడు లేడని ఒక వాదన విన్పిస్తోంది.  కాని ఇది   సత్యసహనం గా లేదు.  ఎందుకంటే ఆంజనేయుడు శ్రీరాముని కలవక ముందు ,   జాంబవంతుడు రాముని కలిసిన దాఖలాలు లేవు. అప్పటికే అపహరించబడిన సీతమ్మ  ను ఒక్కసారి  కూడ చూడని  జాంబవంతుడు విగ్రహాలను ప్రతిష్టించడం కొంచెం విపరీతం గా అన్పిస్తోంది.
          



                                                   రాయల వారి ఎదుర్కోలు మండపం
           

                          అందుకే మరి కొందరు ఈ కథ ను కొంచెం గా మార్చి ద్వాపర యుగం లో జాంబవంతుడు ప్రతిష్టించాడని మరో గాథ చెపుతున్నారు.  మరి ఇక్కడ ఆంజనేయుడు ఏమైనట్లు.  అగు గాక. "వందే వాల్మీకి కోకిలమ్" అని  ఆ మహర్షి కి ఒక నమస్కారం చేసి ఈ చర్చ ను ఆపేద్దాం.

   ఆలయ ప్రత్యేకత                      ఈ ఆలయ ప్రత్యేకతలలో  ముఖ్యమైంది గర్భగుడి లో  సీతాలక్ష్మణ సమేత కోదండ రాముడు ఒకే శిలపై మలచబడి ఉంటారు.  అంటే ఒకే రాతి లో నిర్మించ బడ్డారు.అందువల్లనే ఈ ప్రాంతానికి ఏకశిల , ఒంటిమిట్ట అనే పేర్లు ప్రసిద్ధమైనాయి.
           
   

                                       సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడు.

  అంతేకాదు. సీతారామ లక్ష్మణు లతో పాటుగర్భాలయం లో ఆంజనేయుడు లేకపోవడం ఒక ప్రత్యేకత. ముకుళిత హస్తుడైన అంజనీ సూనుడు స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ముఖమండపం లో నిర్మించబడిన ఉపాలయం లో దర్శనమిస్తున్నాడు.
               
              


                                                  ముఖమండపం లోని ఉపాలయం లో 
                                                             ఆంజనేయుడు




              ఈ  ఆలయానిక మూడు వైపులా మూడు గాలిగోపురాలు నిర్మించబడ్డాయి. తూర్పు , ఉత్తర ,దక్షిణ దిక్కులలో  అత్యున్నతంగా నిలిచిన ఈ రాజగోపురాలు యాత్రికులను  తమ శిఖర కలశాలనే చేతులతో ఆహ్వానిస్తున్నట్టు గా కన్పిస్తాయి.
                  
          

                                                              ధ్వజస్ధంభము
              
             తూర్పు రాజగోపురానికి ఎదురుగా వెలుపల  భవనాశి మాల ఓబయ్య మండపం కన్పిస్తుంది. ఓబయ్య రామభక్తుడు. శ్రీరామచంద్రుని మీద  కీర్తనలను రచించి , గానం చేసి , స్వామి అనుగ్రహాన్ని పొందిన పరమభక్తుడు.  అతని స్మృతి చిహ్నం గా నిర్మించబడిన మండపమది.  దీనినే ఉట్ల మండపం అని కూడ అంటారు. కుల, మతాలకు అతీతం గా  సేవలందుకున్న రామయ్య గా  ఒంటిమిట్ట రామయ్య ప్రకాశిస్తున్నాడు.భక్తులు గర్భాలయం వరకు వెళ్లి స్వామిని సేవించుకోవడం మొన్నమొన్నటి వరకు కొనసాగింది.
                           

                                    గాలిగోపుర చిత్రాల్లో శ్రీ వేంకటేశ్వరుడు
                      

             తూర్పు గాలిగోపురం ద్వారా మనం లోపలికి ప్రవేశించగానే కుడివైపు 1356 నాటి శాసనాలు ఒక మూడు కన్పిస్తాయి.  ప్రాకారం లోపల కల్యాణమండపం తో పాటు మరి రెండు మండపాలు కూడ మనకు కన్పిస్తాయి. వాటి లో ఒకటి రాయల వారి ఎదుర్కోలు మండపం గా చెప్పబడుతోంది. శ్రీకృష్ణదేవరాయల కాలం లో ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనం గా జరిగేవట.      
             



   

             ఇక్కడ జరిగే శ్రీరామనవమి కళ్యాణం కూడ  ప్రత్యేకమే. దేశమంతా  సీతారాముల కళ్యాణాన్ని శ్రీరామనవమి రోజున జరుపుకుంటే ఇక్కడ మాత్రం నవమి వెళ్లిన పున్నమి నాటి రాత్రి ఆరుబయట ప్రత్యేకం గా నిర్మించిన  మండపం లో జరుగుతుంది.

            
                                 
                                    విశాలమైన ప్రదేశం లో పున్నమి కళ్యాణ మండపము
      

               దీనికీ ఒక గాథ ఉంది.  ఆనాడు త్రేతాయుగం లో  ముక్కోటి దేవతలు ముదమార చూస్తుండ గా రామయ్య పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది మిథిలానగరం లో.    ఆ పెండ్లి ని కనులారా చూడలేని చంద్రుడు ఆ అదృష్టాన్ని తనకు ఎలాగైనా ప్రసాదించమని శ్రీరామచంద్రుని వేడుకున్నాడట. అసలే  ఆపన్న శరణ్యుడు, శరణాగత వత్సలుడు, భక్తమందారుడు కాబట్టి రామయ్య చంద్రుని ప్రార్ధన కు కరిగిపోయి నవమి వెళ్ళిన పున్నమి నాడు ఆరు బయట పెండ్లి చేసుకుంటానని, అంతేకాకుండా  తన పేరు చివర్లో చంద్ర శబ్దాన్ని చేర్చుకుంటానని చంద్రుని ఓదార్చాడట. ఆనాటి  నుండి   శ్రీరాముడు శ్రీరామచంద్రుడయ్యాడు.  ఒంటిమిట్ట లో  నవమి కళ్యాణం పున్నమి కళ్యాణం గా మారింది.
                         


          ఈ ఆలయం లోనే ప్రాకారానికి ఆనుకొని ఉన్న   ఉపాలయం లో శ్రీ రామలింగేశ్వర స్వామి ని కూడ మనం దర్శించ వచ్చు.             

      

                   
                                                             శ్రీ రామలింగేశ్వర స్వామి


                      ఆంథ్రమహాభాగవతాన్ని రచించిన బమ్మెరపోతన  ఈ ఆలయ ప్రాంగణం లో కూర్చునే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడని చెపుతారు. పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుడటయని పోతన చెప్పుకున్న రామయ్య   ఈ కోదండరాముడే.    ఆ మహానుభావునికి కృతజ్ఞత గా   ఆయన విగ్రహం ఒకటి  ముఖమండపం లో మనకు దర్శనమిస్తుంది. ఆ మహాకవి కి శతకోటి వందనాలు.
                                 ఈ విగ్రహం ప్రక్కనే మనకు ఒక శాసనం కన్పిస్తుంది.  అది ఆంథ్రవాల్మీకి  గా మన్నన లందుకున్న మహాకవి , రామభక్తుడు, తెలుగు జాతి కి మందరము అనే పేరు తో రామాయణానికి తెలుగులో వ్యాఖ్యానమందించిన  మహానుభావుడు   శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు వేయించిన శాసనమది.  ఈయననే వాసుదాసు అని భక్తి తో  పిలుచు కుంటున్నారు తెలుగు వారు.  ఈయన శాలివాహన శకం 1753 లో వేయించిన శాసనమిది. అంటే  క్రీ.శ  1831. ప్రమోదనామ సంవత్సరం చైత్రశుద్ధచతుర్దశి నాడు వ్రాయించిన శాసనమిది.
                   


                నూటఎనిమిది మార్లు వాల్మీకి రామాయణ పారాయణమును పూర్తిచేసి , తాను వ్రాయబోయే మందరమను రామాయణ తెలుగు  వ్యాఖ్యానానికి పూర్వాంగము గా హరిద్వారు మొదలుకొని  సింధూ బ్రహ్మపుత్ర పర్యంతము గల అయిదవందల దివ్య తీర్థములతో కోదండరామునకు  సహస్ర ఘటాభి షేకము చేసి, మిత్రులతోడ్పాటు తో కనకరత్న కిరీటములను సమర్పించి, శ్రీరామ పట్టాభిషేక మహా యజ్ఞమును ఏభైవేలమంది సమక్షం లో జరిపించినట్లు వేయించిన  శాసనమిది.
                    
   ఒంటిమిట్ట కు సమీపం లోనే కొండమీద వాసుదాసు ఆశ్రమం ఉంది.
      
                     సంకీర్తనాచార్య శ్రీ అన్నమాచార్య సైతం ఈ కోదండరాముని దర్శించి , తన కీర్తనలతో స్వామిని సేవించినట్లు చెప్పబడుతోంది.
                    
              1652 లో ఫ్రెంచి యాత్రికుడు జీన్-బాప్టిస్టు అనే ఆయన  ఈ  ఆలయాన్ని సందర్శించి, ఈ ఆలయ శిల్ప సంపదను , ఎత్తైన గాలి గోపురాలను ప్రశంసించాడు. భారత దేశం లోని అందమైన ఆలయాలలో ఒకటి గా దీనిని వర్ణించాడు.

                     

           శ్రీ రామచంద్రుని ఆలయాలలో  ఒక ప్రత్యేకత ను సంతరించుకున్న ఆలయమిది.




*********************************************************************