Wednesday, 14 August 2013

యాగంటి ఉమామహేశ్వర ఆలయం

                        
                           YAGANTI   UMAMAHESWARA   TEMPLE.
                       
                              యాగంటి  ఉమామహేశ్వర ఆలయం.  
                 
                              यागंटि उमामहेश्वर आलयम् .                    
                 
          
                  కర్నూలు  జిల్లా బనగానపల్లె మండలం లోని ఎర్రమల కొండల్లో వెలసిన ఉమామహేశ్వర  క్షేత్రం యాగంటి. ఈ క్షేత్రం లో  ఆది దంపతులైన ఉమామహేశ్వరులు  మరి ఎక్కడా లేని  విథంగా ఏకశిల లో స్వయంభువులు గా  వెలసి, భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇచ్చటి యాగంటి బసవన్న  తనస్వామితో సమానంగా కీర్తి ప్రతిష్టలను గడించాడు.
                        

                                         ఆలయ తోరణ ద్వారం

                 ప్రకృతి సోయగాలతో, ప్రశాంత ప్రదేశంలో భాసిల్లే ఈ క్షేత్రం లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలు,పుష్కరుణులు యాత్రికులకు  ఆనందాన్ని ఆహ్లాదాన్నే కాక  దైవశక్తి మీద ఉన్న అపారమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచేవిగా కూడ కన్పిస్తాయి.
                   
                 

                                    

                                    ఆలయ రాజగోపురం


               యాగంటి క్షేత్ర నిర్మాణం  ఎప్పుడు జరిగిందో  ఖచ్ఛితంగా తెలియక పోయినా ఇవన్నీ ఒకేసారి జరిగిన నిర్మాణాలు మాత్రం కాదనేది యథార్థం. ఈ నిర్మాణాలలో పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర రాజుల శైలి  స్పష్టంగా కన్పిస్తుంది. పూర్వపు రాజులు అసంపూర్తిగా వదిలిన  అనేక నిర్మాణాలను విజయనగర ప్రభువులైన హరిహరబుక్కరాయలు  మరియు ఇతర విజయనగర ప్రభువులు పూర్తి గావించినట్లు  చెప్పబడుతోంది .
                         
                 

                           పెద్ద  పుష్కరిణి మథ్యలోని మండపం

                ఆలయ విమానం మెట్లను కలిగి కోలగా నిర్మించబడటం( stepped pyramidal )  చాళుక్య వాస్తుకళకు ప్రతీక. అనగా ఇది  8-9 శతాబ్దాల నిర్మాణంగా చెప్పవచ్చు.ప్రథాన ఆలయం లోని మహామండపం, అలాగే కళ్యాణ మండపం, పుష్కరిణి ప్రాంగణము, ప్రాకార సాలు మండపాలు విజయనగర నిర్మాణ శైలిని ప్రతి ఫలిస్తున్నాయి. అంటే ఇవి 14-15 శతాబ్దాల నిర్మాణాలన్నమాట. ఈ ఆలయం చుట్టు ఉన్న ప్రాకార కుడ్యం కూడ ఇదే విషయాన్ని రూఢి చేస్తోంది.
                               ప్రథాన ఆలయ మహామండపంలోని గంట పై  “క్రీ.శ 1775 లో విజయనామ సం.మార్గశిర బహుళ సప్తమీ గురువారం  నాడు అవుకు గ్రామానికి చెందిన నాసయ్య కుమారుడైన ముసలయ్య గారి కుమారుడు నాగలింగం యాగంటీశ్వరునకు గంటను, వెండి గొడుగు ను సమర్పించెను అని చెక్కబడి ఉంది.
                     ఈ ఆలయ రాజగోపురం ఐదు అంతస్తుల ఎత్తు కలిగి, అతి సుందరమైన శిల్పకళాసంపదతో అలరారుతూ, ఎత్తైన ఎర్రని కొండల మద్య వెండికొండ వలె ప్రకాశిస్తూ ,ఉంటుంది. ఈ గోపుర నిర్మాణం విజయనగర వాస్తు శిల్పకళానైపుణ్యలకు నిదర్శనం గా పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ విజయబుక్కరాయలు పేరుతో వ్రాయించబడిన ఒక ప్రాచీన శాసనం కూడ మనకు కన్పిస్తుంది.
            
     


               అగస్య్త  మహర్షి దక్షిణదేశ యాత్రలు చేస్తూ యాగంటి క్షేత్రాన్నిచేరాడు. ఇచ్చటి ఆహ్లాదకరమైన ప్రకృతిని, పర్వత గుహలను, జలపాతాలను చూసి, పరవశుడైన, ఈ సుందర ప్రకృతి నడుమ  ఒక వైష్ణవాలయాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగింది. అనుకున్నదే తడవుగా శ్రీ వేంకటేశ్వరుని ప్రతిష్ఠించడానికి  సిద్ధపడ్డాడు. కాని ఆ విగ్రహానికి కాలి బొటన వ్రేలి గోరు శిథిలమై ఉండటాన్ని గమనించి ఆ విగ్రహాన్ని గుహలో అలాగే వదిలేశాడట. అదే నేడు కన్పించే శ్రీ వేంకటేశ్వరుని గుహ.

                 
                                          శ్రీ వేంకటేశ్వరుని గుహ

              తన సంకల్పం భగ్నమైనందుకు బాథా సంతప్త హృదయుడైన అగస్త్యుడు పార్వతీ పరమేశ్వరులను గూర్చి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన ఆదిదంపతులు  అగస్త్యుని అనునయించి, ఈ ప్రదేశం  శైవాలయానికి అనుకూలముగానున్నది.కావుననే నీ  ప్రయత్నము భగ్నమైనదని ఓదార్చారు.వెంటనే అగస్త్యుడు చేతులు జోడించి ఓ ఆది దంపతులారా!  ఈ లోకమునకు మాతా పితరులైన మీ ఇరువురు ఈ క్షేత్రమునందు  ఉమామహేశ్వరుల రూపం ఏకశిలలో వెలసి భక్తులను అనుగ్రహించవలసినదిగా ఫ్రార్థించాడట.
.
                             ుఉమామహేశ్వరుల దివ్యరూపం.
                
                        అగస్త్యుని అనుగ్రహించి  ఆదిదంపతులు ఏకశిల లో ప్రత్యక్ష మయ్యారు. ఆ విథంగా ఉమామహేశ్వరులను  దర్శించి మహదా నందం తో నేగంటి అంటూ  ఆనందనాట్యం చేశాడు అగస్త్యుడు. ఆ క్షేత్రమే  అనంతర కాలంలో యాగంటి అయ్యిందట.
                      శివభక్తులలో అగ్రగణ్యుడైన భృంగి ఈ గుహలలో తపస్సు చేసి, శివానుగ్రహం పొందినట్లు చెప్పబడుతోంది. ద్వాపరయుగం లో వనవాస సమయం లో పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు చెప్పబడుతోంది. కలియుగంలో శ్రీ ఆదిశంకరుని శిష్యుడు శ్రీ పద్మపాదుడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు ప్రతీతి. ఈ కొండ గుహలలో కాలజ్ఞాన కర్త శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి   తన శిష్యులైన గరిమిరెడ్డి అచ్చమాంబ, వెంకటరెడ్డి దంపతులకు ఆథ్యాత్మిక ప్రవచనాలు చేశారు. యాగంటి పల్లె నివాసులైన చిట్టెప్ప-లక్ష్మప్ప అనే గురుశిష్యులు యాగంటి ఉమామహేశ్వరులను సేవించి తరించి నట్లుగా కూడ ఒక కథ ప్రచారం లో ఉంది.
                 

               
                               మహా మండపం స్థంభాలపై శిల్పకళ
                   ఈ ఆలయం  గర్భాలయం, అంత్రాలయం,ముఖ మండపాలతో కూడిన ప్రథానాలయం  పూర్తిగా రాతి తో నిర్మించబడింది.గర్భాలయం చతురస్రాకారంలో  ఉంటుంది. ఈ ఆలయం లో శ్రీ ఉమామమహేశ్వరులు ఏకశిలలో స్వయంభువులు గా వెలసి భక్తులకు కొంగుబంగారమై వెలుగొందు తున్నారు.
 ఈ క్షేత్రానికి సంబంధించిన సంపూర్ణ దృశ్యాలను youtube  లో yaganti umamaheswara kshetra darsanam  part -1& 2      అని క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.www,youtube,com/user/raviprasadmuttevi
      
                  ప్రథానాలయం లోని ముఖమండపానికి తూర్పు,దక్షిణ ద్వారాలున్నాయి. ప్రథాన ఆలయ ముఖమండపాన్ని ఆనుకొని మహామండపం నిర్మించబడింది. 28 స్థంభాలతో నిర్మిం చ బడిన ఈ మహామండపం   మథ్యలో ఉన్న నాలుగుస్థంభాలపై శివపార్వతుల కళ్యాణ ఘట్టాలు. రామాయణం లోని ఘట్టాలు రమణీయం గా మలచబడ్డాయి.
   


యాగంటి బసవన్న             ఈ మహా మండపం లోనే ఈశాన్యం లో జగత్ప్రసిద్ది పొందిన యాగంటి బసవన్న కొలువుతీరి ఉన్నాడు. ఈ మండపానికి తూర్పు,ఉత్తర, దక్షిణ దిక్కులలో ప్రవేశ  మార్గాలున్నాయి.  ఈ యాగంటి బసవన్న సుమారు15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు కలిగి, ఒక చిన్నకొండ అక్కడ నందీశ్వరుడు గా వెలసిన అనుభూతిని కల్గిస్తుంది. ఈ నందీశ్వరుడు వేరొక చోట చెక్కి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినది కాదని  చూడగానే మనం గమనించవచ్చు. మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడున్న ఒక చిన్నకొండ నే శిల్పాచార్యులు తన నైపుణ్యం తో నందీశ్వరుని గా మార్చినట్లు మన కర్థ మౌతుంది.
    

              
                                           యాగంటి బసవన్న

           80,90 సంవత్సరాలకు పూర్వం వరకు కూడ  నాలుగుస్థంభాల నడుమ ఉన్న ఈ నందీశ్వరుని చుట్టు ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఖాళీస్థలం ఉండేదట. కానీ ప్రస్తుతం ఈ నందీశ్వరుడు  మహామండపం  నాలుగుస్థంభాలను ఆనుకొని    కూర్చొని ఉన్న కారణం గా ప్రదక్షిణానికి అవకాశం లేకుండా పోయింది. దీన్నిబట్టి ఈ బసవన్న పెరుగుతున్నాడని అర్థమౌతోంది. పురావస్తుశాఖ వారు కూడ  ఈ నందీశ్వరుడు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం మేర పెరుగుతున్నట్లు లెక్కించారని స్థలపురాణం లో వ్రాయబడింది.ఇటువంటి జీవశిలను  గుర్తించి నందీశ్వరునిగా మలచిన ఆ శిల్పాచార్యుని నైపుణ్యానికి మన తరం శిరసు వంచి శతథా, సహస్రథా కృతజ్ఞతాంజలులను సమర్పించాలి.                                
                      
    

                
  
                    ఈ నందీశ్వరుని గురించి మరొక కథ కూడ ప్రచారం లో ఉంది. ఆలయ మహామండప నిర్మాణ సమయంలో అడ్డుగా ఉన్న  పెద్ద బండరాయిని  అథికారుల ఆజ్ఞానుసారం పగులకొట్టి ముక్కలు చేయగా మరుసటి రోజుకి మళ్లీ  ఆ ముక్కలన్నీ ఒకటై బండగా  ఏర్పడేదట. దానితో భయపడిపోయిన పనివారు దాన్ని అలాగే వదిలేశారని, ఆ బండరాయే అనంతరకాలం లో  దైవానుగ్రహం వలన నందీశ్వరునిగా రూపుదాల్చిందని జనశృతి. ఈ నందీశ్వరుని గురించే  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమునందు రంకె వేసేనయా! అని చెప్పారట.
                    

                      ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి. ప్రథాన ఆలయానికి గల దక్షిణ ద్వారానిక్ ఎదురుగా వీరభద్రాలయం ఉంది. దీనిలో వీరభద్రుడు  ఏడడుగుల ఆజానుబాహడై, ఉత్తరాభిముఖుడిగా దర్శనమిస్తాడు. చతుర్భుజుడైన ఈ స్వామి కుడి వైపు చేతుల్లో బాణాన్ని,ఖడ్గాన్ని,ఎడమ వైపుచేతుల్లో  విల్లును, డాలును థరించి ఉంటాడు. ఆలయ ప్రాగణం  లో ఉన్న ఉపాలయాలలో  శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామిని, కాశీ విశ్వేశ్వరుని, మార్కండేశ్వరుని కూడ మనం దర్సించవచ్చు.
   
  దైవ పుష్కరిణి           యాగంటి మహా క్షేత్రాన్ని గూర్చి ప్రస్తావించేటప్పుడు  మనం ప్రత్యేకంగా చెప్పు కోవలసినవి పుష్కరుణులు. ఆలయ ప్రాకార కుడ్యానికి వాయవ్యంగా కన్పించే ప్రాకార గోపురంలోని ప్రవేశమార్గం అగస్త్యపుష్కరిణికి   దారి తీస్తుంది. దీనినే చిన్నకోనేరు అని కూడ  పిలుస్తారు. ఈ పుష్కరిణి లోని నీరు స్వచ్ఛము,నిర్మలము,ఓషథీ యుక్తమై,సర్వపాపహారిణి గా, సర్వరోగనివారిణిగా చెప్పబడుతోంది. ఇది ప్రకృతి సిద్ధముగా ఏర్పడిన  దైవ పుష్కరిణి. ఈ పుష్కరిణి లోకి నీరు ఈ క్షేత్రానికి 15 కి మీ.దూరంలో న్న ముచ్చట్ల అను పుణ్యక్షేత్రమునుండి పర్వత సానువుల గుండా  దృశ్యముగా ప్రవహించుచూ ఇక్కడ దృశ్య మాన మౌతోంది. ఆనాడు అగస్త్యమహర్షి  ఈ నీరు ఎక్కడనుండి వస్తోందో నని పరీక్షించదలచి, ముచ్చట్ల వద్ద నీటిలో పసుపు,కుంకుమ,పూలు  కలిపెనట. ఈ రహస్య జల మార్గమును అగస్త్యుడు కనుగొనుట వలన దీనికి అగస్త్యపుష్కరిణి అని పేరువచ్చింది. 




                                                            చిత్రము -1





                                                                చిత్రము -2

                      దీనిలో స్నానాలు, ముఖ పాదప్రక్షాళనలు నిషేథించబడ్డాయి. ఈ పుష్కరిణీ జలమునే శ్రీ ఉమా మహేశ్వరుల పూజా కైంకర్యాలకు వినియోగిస్తూ ఉంటారు . ప్రథాన ఆలయానికి ఎదురుగా ఉన్న  పెద్దపుష్కరిణి లోనికి  నీరు ఈ పుష్కరిణి నుండే చేరుతూ ఉంటుంది.
                      

  
                  

             
                ఆలయానికి ఎదురుగా కన్పించే కోనేరు ను  పెద్దకోనేరుఅంటారు.ఈ కోనేరు చుట్టు ప్రాకారకుడ్యం,  ఈ ప్రాకార కుడ్యాన్ని ఆనుకొని 52 రాతిస్థంభాలతో కూడిన సాలుమండపం కలిగి, నాలుగు వైపుల  ప్రవేశద్వారాలతో,వానిపై సుందరమైన మూడంతస్తుల గోపురాలతో, వానిపై అద్భుత  మైనశిల్పకళాచాతుర్యం తో, కోనేటి మథ్య లో అందమైన నాలుగు స్థంభాల  మండపం తో, మండపం మథ్యలో ముచ్చట గా కొలువు తీరిన నందీశ్వరునితో ,   చూపరులకు ఒక సుందర మనోహర దృశ్యాన్ని కనులముందు నిలబెడుతుంది. పడమరవైపు ప్రాకారకుడ్యాన్ని ఆనుకొని  వెలుపల కూడ  సాలుమండపం నిర్మించబడింది. ఇది సాధువులకు వసతిని కల్పిస్తోంది.

               
                ఆలయ రాజగోపుర మనోహర దృశ్యం
                  
                ఈ కోనేటి లో నీటి మట్టం  ఎప్పుడూ ఐదు అడుగులకు మించకుండా ఉండేటట్లు మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి.  కోనేటి లోపలి అంచులలో కుడ్యాలమీద నీటిపై తేలియాడుతున్నట్లు మనోహరమైన శిల్పాలు చెక్కబడ్డాయి. వానిలో ఉమామహేశ్వరులు, శివతాండవం,కిరాతార్జునీయం, లక్ష్మీనారాయణులు, నరసింహుడు,  అనంతపద్మనాభుడు వంటి శిల్పాలెన్నో ఉన్నాయి. ఈ శిల్ప సంపదంతా విజయ నగర శైలినే పోలి ఉంటుంది. ఈ పుష్కరిణి యాత్రికుల పుణ్యస్నానాలకు ఉపయోగ పడుతోంది. అన్నికాలాలలోను ఇక్కడ నీరు ఉండటం విశేషం. ఈ నీరు వెలుపలకు వెళ్లి ఒక కి.మీ దూరం ప్రవహించి అక్కడ 16 ఎకారాలకు మాత్రమే సేద్యానికి నీటిని అందించి, ఆ తరువాత అదృశ్యమై పోతుందని ఇక్కడ పూజారి గారు చెపుతున్నారు. ఈ కోనేటిని చూడగానే మనకు వెంటనే మహానంది క్షేత్రం లోని కోనేరు గుర్తుకొస్తుంది.

                       

                 పెద్దకోనేరు లోపలి అంచున మలచిన శిల్పాలు
           
            ఎర్రమల కొండలుగా ప్రసిద్దిపొందిన ఈ కొండలలో అనేక ప్రకృతిసిద్ధమైన గుహలు ఏర్పడ్డాయి. రోకళ్లగుహ, శ్రీవేంకటేశ్వరగుహ, శంకరగుహ, ఎర్రజాలగుహ వానిలో ముఖ్యమైనవి.

           

                                    కోనేటి మండపం లోని నందీశ్వరుడు


              ఆకాశదీపం ప్రత్యేకత.    ఆలయాలలో థ్వజస్థంభానికి వ్రేలాడదీయడం ద్వారా కాని,థ్వజస్థంభం దగ్గరగా కాని  ఆకాశ దీపం వెలిగించడం  ఆచారం. కాని ఈ క్షేత్రం లో  గర్భాలయానికి వెనుకవైపున ఉన్న  పర్వతశిఖరాగ్రాన ఆకాశదీపాన్ని వెలిగించడం ఆచారం గా వస్తోంది. ఇక్కడ ఆకాశ దీపారాధన చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగి, కోరుకున్నకోరికలు నెరవేరుతాయని, కుటుంబం సుఖ సౌఖ్యాలతో అభివృద్ధి చెందుతుందని అనాదిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందునా అమావాస్య రోజున  ఆకాశదీపాన్ని వెలిగింప చేస్తే సకల అరిష్టాలు తొలగిపోతాయని కూడ భక్తులు విశ్వసిస్తారు.


                            ఆకాశ దీపం పెట్టే కొండ కొన

   కాకులు కన్పించవు.          ఈ క్షేత్ర ప్రాముఖ్యలలో మరొకటి ఈ క్షేత్రం లో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశము లేదు. అగస్త్యుడు తపస్సు చేసుకుంటుంటే కాకసురుడనే వాడు కాకుల సమూహం తో వచ్చి అగస్త్యుని తపస్సుకు ఆటంకం కలిగించాడట. అది సహించలేని అగస్త్యమహర్షి ఈ ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడట. కనుకనే ఈ దివ్యక్షేత్రం లో కాకి మచ్చుకైనా కన్పడదు.అందువల్లనే ఈ క్షేత్రం శనిప్రభావం లేని దివ్యక్షేత్రం గా చెప్పబడు తోంది.   ఆ కారణం గానే ఈ ఆలయం లో నవగ్రహ మండపం  లేదు.
                      
              

                        

                                ఆలయానికి ఎదురుగా ఉన్న నందిస్థంభం
 
             ఈ ఆలయం జాతీయప్రాముఖ్యత గల కట్టడం గా గుర్తించబడి, ఫురావస్తు శాఖ అథీనం లో ఉంది. అయినప్పటికీ నిత్యపూజాదికాలు, ప్రత్యేక ఉత్సవాలను దేవాదాయశాఖ నిర్వహిస్తోంది.
                
               

           
  ప్రతి సోమవారం ,మరియు పర్వదినాల్లో భక్తులు విశేషం గా వచ్చి శ్రీ స్వామివారిని సేవించుకుంటారు. కార్తీక,దీపోత్సవాలు ఘనంగా జరుగుతాయి.. మహాశివరాత్రి ఉత్సవాలను మూడురోజులు  అత్యంత వైభవం గా నిర్వహిస్తారు కళ్యాణ, రథోత్సవ,పల్లకీ సేవాకార్య క్రమా లకు భక్తులు పెద్దసంఖ్య లో పాల్గొని తరిస్తారు. సంక్రాంతి రోజున పారువేట ఉత్సవం ఐదు గ్రామాలమీదుగా  వైభవం గా జరుగుతుంది.మాఘమాసానికి 11 రోజులముందు ఉమామహేశ్వరమాల మండలదీక్షను భక్తులు  ఆచరిస్తారు .
                         యాగంటి క్షేత్రదర్శనానికి వచ్చే యాత్రికులకు ఉమామహేశ్వర నిత్యాన్నదాన సత్రం లో భోజనసౌకర్యం ఉంటుంది.
         నంద్యాల రైల్వేష్టేషన్ నుంచి 50 కి.మీ దూరం లోను,బేతంచర్ల నుంచి ఇరవై కి.మీ దూరం లోను ఈ యాగంటి పుణ్యక్షేత్రం  ఉంది.
        ఓం త్రయంబకం యజామహే సుగన్థిం పుష్టివర్థనమ్ !
             ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ !!






********************************************************************************