Wednesday, 15 May 2013

కర్మన్ ఘాట్ శ్రీ థ్యానాంజనేయస్వామి వారి ఆలయం


                            Karmanghat Sri Dhyananjaneyaswamy Temple.
         
                             కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయస్వామి వారి ఆలయం.
          
                             कर्मन् घाट् श्री ध्यानांजनेयस्वामि  आलयम्.
             
                             కర్మన్ ఘాట్  శ్రీ థ్యానాంజనేయస్వామి వారి ఆలయం రంగారెడ్డి జిల్లా  లోని  సరూర్ నగర్  మండలం లో ఉంది. ఇది హైదరాబాద్ గల అతి ప్రాచీన  ఆలయాల్లో ఒకటి గా చెప్పబడుతోంది.   క్రీ.శ  1143  ప్రాంతం లో గోల్గొండ నేలిన రెండవ ప్రతాపరుద్రుడు  ఈ ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆథారాల ద్వారా తెలుస్తోంది.  అతి పురాతన కట్టడంగా భాసించే  ఈ ఆలయనిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం పెల్లుబుకుతుంది. అతిసుందర,సువిశాలమైన ఆలయ ఆవరణ  లో వివిథ దేవీ దేవతా మూర్తుల ఉపాలయాలు కూడ కొలువు తీరి ఉన్నాయి. ఈ ఆలయ స్థలపురాణం శ్రవణ మనోహరం గా ఉంటుంది.

                        
                                                          ఆలయ రాజగోపురం

         స్థలపురాణం. ;;;------          క్రీ. శ 1143 లో గోల్గొండ ను పరిపాలించిన  కాకతీయప్రభువైన రెండవప్రతాపరుద్రునకు వేట ఒక అలవాటు గా ఉండేది . ఈనాడు మనం హైదరాబాదు అని పిలిచే  ఈ ప్రాంతమంతా  ఆ రోజుల్లో  లక్ష్మీపురమనే పేరుతో పిలువబడుతూ అడవిగా ఉండేది. ఒకరోజు రాజైన ప్రతాపరుద్రుడు ఈలక్ష్మీపుర ప్రాంతానికి వేటకువచ్చాడు.,మథ్యాహ్నమవడంతో ఒక చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు రాజు .
                        
                         
                                 
                                        ఆలయ విమాన దృశ్యం

                 ఇంతలో దగ్గరలోని పొద లో నుండి పులి గాండ్రింపు వినబడింది.వెంటనే రాజు ఆ దిక్కుగా బయలుదేరాడు. ఆ పులి గాండ్రింపు చాలాదూరం రాజును తీసుకెళ్లి, మాయమై పోయింది. అలసిపోయిన మహారాజు, ఇదేదో మాయ లాగుందని భావిస్తూ, ఒక చెట్టునీడలో కూర్చుండి పోయాడు. అంతలో సమీపంలోని పొదలో నుంచి శ్రీరామ్, శ్రీరామ్, శ్రీరామ్ అనే తారక మంత్రం మంద్రంగా  రాజుకి వినిపించసాగింది. ఆశ్చర్యపోయిన రాజు తటాలున లేచి, ఆ పొద చెంతకు వెళ్లి,  తీగలను, ఆకులను ,తొలగించి చూడగా, థ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుని విగ్రహం దృశ్యమానమైంది. దాన్ని చూచి, భక్తితో చేతులు జోడించి, ప్రణతులర్పించి, కోటకు చేరాడు మహారాజు.
                


             
                                           ఆలయప్రాగణం
                        
                ఆ రాత్రి  రాజుకు కలలో  ప్రత్యక్షమైన శ్రీ ఆంజనేయుడు తనను చూచిన చోటే తనకు ఆలయ నిర్మాణం చేయమని, అందువలన నీకు సకల శుభాలు కలుగుతాయని, సకలైశ్వర్యాలు సంభవిస్తాయని, రాజును ఆదేశించాడు. ఆ ఆజ్ఞను శిరసావహించి రెండవప్రతాపరుద్రుడు  ఆలయ నిర్మాణం  పూర్తి గావించి,  క్రీ.శ 1143 హనుమజ్జయంతి రోజున తనతండ్రియైన రెండవప్రోలరాజు తో కలసి, ఆలయం లో స్వామికి పూజలు  నిర్వహించి, అర్చకుల ను  నియమించి.  రాజథానికి వెళ్లిపోయాడు.. ఆయన అనంతరం వచ్చిన కాకతీయ రాజులు కూడ స్వామిని సేవిస్తూ, ఆలయప్రాంగణం లో తమ ఇష్టదైవాలను ప్రతిష్ఠిస్తూ, ఆలయాభివృద్ధికి, ఎంతగానో  సహకరిస్తూ వచ్చారు.
  
       స్వామి దర్శనం  (కరో –మన్ –ఘాట్)   ::.              అనంతర కాలం లో 400సంవత్సరాల తర్వాత 17వ శతాబ్దం లో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించుకొని దేశం లోని నలుమూలలలకు తన సైన్యాన్ని పంపి హిందువులను,హిందూదేవాలయాలను నాశనంచేయమని ఆజ్ఞాపించాడు. ఆ సమయం లో ఈ ఆలయం లోకి తురుష్కసైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి, ఆలయప్రాకారం వరకు కూడ రాలేకపోయిందట. ఆ విషయాన్ని సైనికాథికారి ఔరంగజేబు కు తెలియజేశాడు.
        
                   

          
                                          దూరంగా శ్రీ స్వామి వారి ఆలయ ముఖద్వారం
               
                       ఆ వృత్తాంతాన్ని విన్న ఔరంగజీబు క్రుద్దుడై,  ఆలయాన్ని నేలమట్టం చేయడానికి పెద్ద (crowbar) బండలను తొలగించే సాధనం తో ఆలయముఖద్వారం  వద్దకు చేరుకున్నాడట. అతడు ప్రధానద్వారం  యొక్క గుమ్మం దగ్గరకు రాగానే  ఒక్కసారిగా మిరుమిట్లుగొలిపే కాంతితో, పిడుగుపాటువంటి భయంకర మైన శబ్దం విన్పించిందట.వెంటనే. అతని చేతుల్లోని crowbar ఆయుధం జారిపోగా, ఔరంగజీబు భయంతో వణికిపోయాడు.ఇంతలో ఆకాశంనుండి. मंदिर तोडना है तो राजन, पहले तुम करो मन घाट  అనే మాటలు విన్పించాయట.  (.if you want to break down the temple o king, strengthen  your heart first” ) .  ఆ మాటలు విన్న ఔరంగజేబు ధైర్యాన్ని కూడదీసుకొని నీవు నిజమైతే నాకు కన్పించు అన్నాడట.మహమ్మదీయ చక్రవర్తి అదృష్టం పండింది.
                                  

   
                                     శ్రీ స్వామి   వారి దివ్యదర్శనం
                    
        అంతే ఒక్కసారి గా ఆ ప్రాంతమంతా కాంతి ప్రవాహం లో మునిగిపోగా, ఆ కాంతిలో నుండి ఆకాశాన్ని తాకుతున్న అద్భుతము,సుందరమునైన    ధ్యానాంజనేయుని దివ్యరూపం ఒక్కసారి గా ప్రత్యక్షమై,అదృశ్యమైంది. ఆ పరిస్థితులను ఆకళించుకోలేని ఔరంగజీబు తనను తాను సంబాళించుకొని ఆ ప్రాంతం నుంచి జారుకున్నాడు.. ఆనాటి నుంచి ఈ ప్రాంతానికి కర్ -మన్ –ఘాట్ అనే పేరు శాశ్వతమై పోయింది.

                
                              ఆలయ ప్రాకారం

                    ****** (ఆలయ పూర్తి దృశ్యాన్ని you tube లో   నాచే పొందుపరచబడిన " karrmanghat sri dhyananjaneya swamy temple,saroornagar (md) Hyd " ద్వారా చూడవచ్చు)

 ఆలయ ప్రత్యేకత .  ;;---  ఈ ఆలయంలో స్వామిని మండలం రోజులు  ప్రదక్షిణలతో సేవిస్తే నిస్సంతువులు బిడ్డతల్లులయిన ఉదంతాలు ఈ ఆలయ చరిత్రలో కోకొల్లలని భక్తులు  చెప్పుకుంటుంటారు. వైద్యశాస్తానికి  లొంగని అనేకవ్యాథులు ఈ స్వామి సన్నిథిలో మటుమాయమైన ఘటనలున్నాయట.  గాలి.థూలి లాంటివి  స్వామిని సేవిస్తే పలాయనం చిత్తగిస్తాయి. వాహనపూజలు ప్రతిరోజు సర్వసాథారణం.
                  
                               శ్రీ స్వామి వారి సుందర రూపం
                      
               ఉపాలయాలు   ::---------      ఆలయ ఆవరణ లో శ్రీ  కోదండ రామస్వామి,, శ్రీవిశ్వనాథ,  శ్రీనాగేశ్వర ,  శ్రీ గణపతి , శ్రీ సంతోషీమాత,  శ్రీ సరస్వతీదేవి, శ్రీ దుర్గాదేవి, శ్రీ వేణుగోపాలస్వామి,  శ్రీ జగన్నాథ స్వామి  వార్లకు వేరు వేరు ఉపాలయాలున్నాయి.

                                         ఉపాలయాలు
  
                 ప్రత్యేక ఉత్సవాలు ::--------.      ఈ ఆలయం లో ఉగాది. శ్రీరామనవమి, హనుమజ్జయంతి, వాల్మీకిజయంతి, నాగ పంచమి, శ్రీగణేశచతుర్థి, విజయదశమి, కార్తీకపూర్ణిమ, మహాశివరాత్రి, ప్రత్యేక ఉత్సవాలు. ముఖ్యంగా హనుమజ్జయంతి ఈ ఆలయం లో ప్రముఖఉత్సవంగా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవానికి జంటనగర వాసులే కాక చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడ వేల సంఖ్య లో హాజరవుతారు, నిత్యాన్నదానం నిరాటంకంగా కొనసాగుతోంది.  ఆలయం సువిశాలంగా ఉండటం వలన భక్తులకు వసతి సౌకర్యాలు సమకూరుతున్నాయి.

                               శ్రీ కోదండ రామ స్వామి దివ్య మూర్తులు
 ఆలయ సమయాలు :: -------              ప్రతిరోజు ఉ.6 గం. ల  నుండి మ. 12 గం.ల వరకు, సా. 4. గం.ల నుండి  8 గం. ల వరకు. అయితే మంగళవారం, శనివారాల్లో మాత్రం ఉ.5.30. లనుండి  1 గం .వరకు, సా 4 గం ల నుండి రా. 9.గం ల వరకు ఆలయము తెరచి ఉంచబడును.

                  
                                 ఆలయ రమణీయ దృశ్యం
  
 రవాణా సౌకర్యాలు. :: -------               రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లోని కర్మన్ఘాట్ ఆలయం నాంపల్లి రైల్వేస్టేషన్ కు 15 కి.మీ  దూరం లోను, ఇమ్లీబన్ బస్టేషన్ కు 12 కి.మీ. దూరం లోను  
నాగార్జునసాగర్ కు వెళ్ళే మార్గం లో ఉంది.***************************************************************************************************************************************************************

Tuesday, 7 May 2013

పానగల్లు శ్రీ ఛాయాసోమేశ్వరస్వామి ఆలయం

   
       Panagallu Sri Chayasomeswara Swamy Aalayam.
                           
                      పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం.
                               
                   पानगल्लु श्री छायासोमेश्वरस्वामि आलयम् .            
            
                   నల్గొండజిల్లా  పానగల్లు ఒకనాడు కాకతీయ సామంతులైన  కందూరు చోళుల రాజథాని. క్రీ.శ 10,12 శతాబ్దాల నడుమ ఈనాటి నల్గొండ, మహబూబ్నగర్,ఖమ్మం ప్రాంతాలను రాజ్యంగా చేసుకొని  కందూరు చోళులు రాజ్యపాలన కొనసాగించారు. ఇచ్చట ఎన్నెన్నో దేవాలయాలు నిర్మింపబడినట్టు ఆచూకీ దొరుకుతున్నా, ఆథారాలు మాత్రం  దొరకని  ఎన్నో శిథిలాలు మనకిక్కడ దర్శనమిస్తాయి.
  
                            ఇప్పటికీ సజీవం గా నిలిచి ఆనాటి రాజుల కళాతృష్ణ కు, ఆనాటి శిల్పుల అపారమేథాసంపత్తికి  నిలువెత్తు సాక్ష్యం గా నిలిచి తెలుగు జాతి ప్రాచీన సాంస్కృతిక సంపద గా  వెలుగుతున్న అపూర్వ  నిర్మాణం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం.

         
                 చారిత్రక నేపథ్యం  .:---- కందూరి చాళుక్య ప్రభువైన  ఉదయభానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మింపజేసినట్లు చారిత్రక ఆథారాల ద్వారా తెలుస్తోంది. ఈ రాజు ఆలయానికి ముందు పెద్ద చెరువును కూడ తవ్వించి, ప్రజలకు సాగునీటిని ,త్రాగునీటిని అందించాడు. దీనినే ఉదయ సముద్రమని పిలుస్తారు. ఇప్పటికీ ఈ చెరువు ప్రజల సాగు, త్రాగునీటి అవసరాలను తీరుస్తూనే ఉంది. పొలాల మధ్య లో  నిర్మించబడిన ఈ ఆలయం  త్రికూటాలయం గా  ప్రసిద్ధి పొందింది.  ఆలయదర్శనానికి వెళ్లిన భక్తులకు ఇప్పటికీ ఈ చెరువులో నీళ్లు  రైతులు పంటచేలకు పెట్టుకుంటే చేలు నిండి దేవాలయ మార్గం లోకి, ఆలయ ప్రాంగణం లోకి నీళ్ళు పొర్లడం మనం గమనించవచ్చు.
                                     
                                               ఆలయ దృశ్యం
                         చెరువు లోకి కట్టిన  రాతిమెట్లు  సుమారు వెయ్యి సంవత్సరాల తర్వాత ఈనాటికి  కూడ చెక్కుచెదరకుండా ఉండి, భక్తులు  కాళ్ళు,చేతులు కడుక్కోవడానికి  ఉపకరిస్తున్నాయంటే ఆనాటి  వాటి నిర్మాతలకు  చేతులెత్తి  జోతలు అర్పించవలసిందే కదా.! ఈ కీర్తి  తెలుగుజాతికే గర్వకారణం కాదా.!
      
             శ్రీ ఛాయాసోమేశ్వరుడు. :----                   ఈ త్రికూటాలయం లో  ప్రతిష్ఠించబడిన  లింగరూపాలు, నందీశ్వరులు  ఏనాడో  ముష్కరుల సమ్మెటల, గుదియల దెబ్బలకు,పగిలి ,విరిగి పోగా మిగిలినవి మాత్రమే మనకు కన్పిస్తున్నాయి. ఆలయ శిఖరాలను సైతం  దేవాలయ విథ్వంసకులు విడిచి పెట్టలేదనడానికి ఎన్నో నిదర్శనాలు మనకు ఇక్కడ  మరియు  శ్రీ పచ్చల సోమేశ్వరాలయం లోను   ప్రత్యక్షం గా కన్పిస్తాయి.
                 

                    
                                                    ఆలయ ముఖమండపం
                        
                                         ఈ ఆలయానికి  చుట్టూ ప్రాకారం( ప్రహరీగోడ)  ఎత్తు మూడడుగులకు మించి ఉండదు.  ఆలయ ప్రాకారానికి తూర్పు వైపు  ప్రవేశద్వారం ఏక అంతస్తు గాను, పడమర  వైపు ప్రవేశ ద్వారం రెండు అంతస్తులు గా నిర్మించబడ్డాయి.  ఈ ఆలయం లోకి దక్షిణం వైపు  నుండి ప్రవేశమార్గం  ముఖమండపం లోకి   ఉంటుంది. ప్రాచీన శివాలయాల్లో ఎక్కువగా  ఆలయ ప్రవేశ ద్వారాలు దక్షిణం గా ఉంటున్న విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి.   ఆలయం  వెలుపల  గర్భగుడి చుట్టు ఒక కందక నిర్మాణం మనకు కన్పిస్తుంది. అది ఎప్పుడూ నీటితో ఉండటాన్ని కూడ మనం గమనించవచ్చు.  
           


                 
శ్రీ సోమేశ్వరుని దివ్యరూపం                                                                                                
                   
                        అభిషేకిస్తున్న భక్తులు                                                                

                         తూర్పు,దక్షిణం ,పడమర ముఖాలుగా మూడు ఆలయాలను నిర్మించి,  శివలింగాలను, నందులను ప్రతిష్ఠించారు ఆనాడు. కాని ఈనాడు   దక్షిణ, పశ్చిమ ముఖ ఆలయాల్లో లింగాలు పెకలించబడిన పానమట్టాలు, తలలు కొట్టి  వేయబడిన  మూడు నందీశ్వరుల రూపాలు   మనకు  కన్పిస్తాయి. కాని తూర్పుముఖంగా ప్రతిష్ఠించబడిన  సోమేశ్వరుడు మాత్రం భద్రంగా ఉండి, భక్తుల సేవలను ఈనాటికీ అందుకుంటున్నాడంటే కొంచెం ఆశ్చర్యమేనని పిస్తుంది. ఈయనే ఈనాడు ఇంతమంది భక్తుల్ని ఇక్కడకు రప్పించుకుంటున్నాడు.   ఆనాటి ప్రతిష్ఠా ముహూర్త బలం అంతగొప్పదై ఉంటుంది.
  

                                   
                                                      శిథిల నందులు

                   ఆలయ ప్రత్యేకత.::--                       శ్రీ సోమేశ్వరస్వామి  లింగరూపం ముఖమండపాని కంటే సుమారు ఐదు అడుగుల పల్లంగా పానుమట్టం మీద ప్రతిష్ఠించబడింది.   స్వామి చుట్టు  ఎప్పుడు రెండు, మూడడుగుల నీరు  నిండి ఉండటం ప్రత్యేకత. పానమట్టం మునిగి, లింగం సగం వరకు నీటిలో ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఆలయానికి ఎదురుగా ఉన్న చెఱువు లోనికి నిండుగా నీరు వచ్చినప్పుడు,  గర్భాలయం లోకి నిండుగా నీరు వచ్చి స్వామి పూర్తిగా నీటిలో ఉండిపోతారని స్థానికులు చెప్పారు.


         

                   ***  ( శ్రీ ఛాయాసోమేశ్వరుని పూర్తి వీడియోను  you tube.లో నాచేత పొందుపరచబడిన " Sri chayasomeswara swamy,panagallu " ద్వారా చూడవచ్చు )   ***      https://www.youtube.com/watch?v=doDs9mdV1uY
         
                       శ్రీ స్వామి మీద  సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు  నిశ్చలంగా ఉండే నిలవెత్తునీడ  పడుతూ ఉండటం వలన ఈయన ఛాయా సోమేశ్వరుడు గా ప్రసిద్ధి పొందాడు. ఆ నీడ ఎలా వస్తుందనేది --  ఆనాటి శిల్పుల శిల్ప శాస్త్ర వైదుష్యానికి   మచ్చుతునక. ఆ నీడ ఖచ్చితంగా గర్భగుడి మథ్యలో శ్రీ స్వామి వారి మీదు గా పడటం మనం పగలంతా గమనించవచ్చు.
                  

                                
                                                 శ్రీ ఛాయా సోమేశ్వరుడు

                                        ఇది గణిత, భౌతిక శాస్త్ర సంబంథ విషయం గా తద్విజ్ఞులు  భావిస్తున్నారు. సృష్టించబడిన ఆకారం లో ఏముందో చెప్పడం పరిశోథన. కాని  ఆకారాన్ని సృష్టించడం  అనేది విద్వత్తు .  అటువంటి  సృష్టికర్త కే మనం ఇప్పుడు చేతులెత్తి నమస్కరిస్తున్నాం.                                   గర్భాలయం లో ఛాయ ను స్పష్టంగా చూడవచ్చు

  . ఆలయాల్లో లింగాలు పెకలించబడటం తో ,దక్షిణ ముఖం గా ఉన్న ఆలయం లో బ్రహ్మశిల్పమున్న ఒక రాతిఫలకాన్ని ఉంచి పూజలు చేస్తున్నారు. పడమరముఖంగా ఉన్న ఆలయం లో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు.
           
           
                            
                                        బ్రహ్మ దేవుని మందిరం
   

                  
                శ్రీ పచ్చల సోమేశ్వర స్వా మి .  ::---              శ్రీ ఛాయాసోమేశ్వరాలయానికి  సుమారు రెండు కి.మీ దూరం లో పానగల్లు ఊరు మథ్య లో వెలసిన మరో దివ్యాలయం పచ్చల సోమేశ్వరాలయం.  కాకతీయ రాజైన ఉదయాదిత్యుడు  ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా  పరిశోథకులు భావిస్తున్నారు.

     
                                               శ్రీ  రాజరాజేశ్వరీ దేవి ఆలయ శిఖరం

 ఇక్కడ నల్లరాతి బండలు ఆనాటి శిల్పుల చేతుల్లో మైనపు ముద్దల్లాగా ఒదిగి అపురూప శి ల్పాలుగా అవతరించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
            

                   
                                       ఆలయ ముఖ మండప దశ్యం

                   70 స్థంభాలతో, మూడు రంగమండపాలతో ,తూర్పు ముఖం గా మూడు ఆలయాలు,పడమర ముఖంగా ఒక ఆలయము ఒకే ముఖమండపం తో అను సంథానించబడ్డాయి. ఈ ఆలయ  ముఖమండపం  ఎన్నో  పురాణ గాథలకు సంబంథించిన అపురూప శిల్పాలను  స్థంభాలమీద మనకు ప్రదర్శిస్తుంది. అందుకే వీటిని ప్రదర్శన మండపాలని కూడ పిలిచేవారు.                                         ఆలయ  స్థంభాలపై  కొలువు తీరిన పురాణ గాథలు

                        శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి వారి ముందున్న రంగమండపం లోని నాలుగు స్థంభాల మీద వరుసగా భారత, భాగవత , రామాయణ , శివపురాణ గాథల్ని చెక్కిన తీరు చూస్తే వర్ణించడానికి అక్షరాలు చాలవేమో ననిపిస్తుంది.     
                       

                                                                        
                                                           నందీశ్వరుడు
                               ప్రథాన ఆలయం లో రంగమండపానికి ముందు స్వామి వారికి ఎదురుగా సుందర నందీశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. అంత్రాలయ ప్రవేశం వద్ద మరొక చిన్న   నందీశ్వరుడు కాపలా కాస్తూ దర్శనమిస్తాడు. గర్భగుడి లో శ్రీ పచ్చల సోమేశ్వరుడు దివ్యకాంతి తో  విరాజిల్లుతూ,భక్తుల  నీరాజనా లందుకుంటున్నాడు. ఈ ఆలయం లో నున్న నందీశ్వరుల చూస్తే  ఆ ముష్కరు లొచ్చినప్పుడు వీళ్లిద్దరూ స్వామి వారి పని మీద బయటికెళ్లి ఉంటారేమో ?.లేకపోతే  శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం లోని  నందుల గతే  వీటికీ పట్టుండేది అనిపిస్తుంది.  పున: ప్రతిష్ఠచేసినవైనా అయ్యుండచ్చు.
      
                          
                                    
                                               స్థంభం పై  వెలసిన రామాయణ కథాఘట్టం


                      

               శ్రీ గణపతి  :::---             శ్రీ స్వామి వారికి ఎదురుగా ఉన్న ఉపాలయం లో  సంకట గణపతి దర్శనమిస్తాడు. ఈయన ను  చూస్తే  ఏదో  చరిత్ర కందని విశేషాన్ని దాచుకున్నట్లు  అనిపిస్తుంది. లేకపోతే  శివునకు  అభిముఖం గా గణపతి ప్రతిష్ఠ  కొంచెం  అరుదైన విషయమే.  అది కూడ విగ్రహం, పీఠం కలిపి ఏక కవచం తో కప్పి ఉంచడం కూడ  ప్రత్యేకత గానే చెప్పవచ్చు.  ఈ ఆలయానికి రెండువైపులా దగ్గర దగ్గరగా రెండు స్థం భాలు, ఈ రెంటికి మథ్యలో ఖచ్చితం గా గణపతి ఎదురుగా  12 అడుగుల  మరొస్థంభం  నిలపెట్టబడ్డాయి .  అంటే శివుని వద్ద నుండి చూస్తే గణపతి  సూటిగా కనపడడు.  

                   

                                             
                                                           శ్రీ గణపతి

                           ఈ ప్రాంగణం లో శ్రీ స్వామి వారికి కుడి వైపున ఉన్న  మరొక ఉపాలయం లో  శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. ఈ రెండు ఆలయాల మథ్యలో మరొక ఉపాలయం అర్థాంతరంగా నిర్మాణం నిలిచి పోయి  మనకు కన్పిస్తుంది. 
      
   ఆగిపోయిన ఆలయదృశ్యం


               ఈ ఆలయ నిర్మాణం  కోసం చెక్కిన శిలలు, శిల్పాలన్నీ  ఆలయం వెనుక ఉన్న  ఖాళీ ప్రదేశం లో వెయ్యి సంవత్సరాల నుండి పడి ఉన్నాయి. ఆలయ ఆవరణ నిండా  శిథిల శిల్పాలు   గుట్టలు  గుట్టలు గా కన్పిస్తూ, ఆనాటి విథ్వంసానికి చెరగని సాక్ష్యాలుగా  నిలిచి పోయాయి..
      

                                 
                                              శ్రీ సోమేశ్వర ఆలయం ,  అర్థనారీశ్వర శిల్పం 
                          
                         పురావస్తు  ప్రదర్శన శాల :-----                              ఈ ఆలయానికి ఎడమ వైపున  పురావస్తు ప్రదర్శన శాల ఆం.ప్ర. చే నిర్వహించబడుతోంది. దేవరకొండ,  భువనగిరి, యేలేశ్వరం, పిల్లలమఱ్రి మొదలైన ప్రదేశాలనుండి  సేకరించిన  చారిత్రక అవశేషాలను ఈ మ్యూజియం లో మనం చూడవచ్చు. కాని విచారించదగ్గ విషయమేమిటంటే ఇంత చారిత్రక ప్రాథాన్యం గల ఈ ప్రదేశం మీద  ఒక చిన్నపుస్తకం కాదు గదా.! 5,10 పేజీల కరపత్రం వంటిది కూడ  రేటులోనైనా అందుబాటులో  లేకపోవడం నిజం గా బాధాకరమైన విషయమే.

                               మ్యూజియం ఆవరణ లోని సప్తమాతృకలు

 శ్రీపచ్చల సోమేశ్వరాలయం వెలుపల ఉన్న  పురా.శాఖ  ప్రకటనను చూస్తే కాకతీయుల సామంతులు, కందూరుచోళులు  కట్టించారనే ఒక్కమాట తప్పితే    కనీసం నిర్మాత పేరు, కాలం కూడ తెలియనంత విథ్వంసం జరిగిందనేది మాత్రం మనకు అర్థమౌతుంది.  
                                     
                               మ్యూజియం లోని   కొన్ని అవశేషాలు

            శ్రీ వేంకటేశ్వరాలయం . ::------                  శ్రీపచ్చల సోమేశ్వరాలయానికి వెళ్లేమార్గంలోనే కన్పించే మరో ప్రాచీన ఆలయం  శ్రీ వెంకటేశ్వరాలయం.  క్రీ.శ.  1136నుండి 76 వరకు కందూరు చోళుడైన భానుకాలుడనే రాజు ఉదయనుడు అనే పేరుతో పానుగల్లు కోటను నిర్మించి,  రాజ్యమేలినట్లు చరిత్ర చెపుతోంది.  నల్గొండ జమీందార్లయిన  కాంచనపల్లి సింగరాజు  రాజాఉదయనుని వద్ద  దివాన్  గా పనిచేశాడు.
                            

                    
                                              శ్రీ వేంకటేశ్వర ఆలయ శిఖరం
                               ఆ రోజుల్లో ఒకసారి జైనులు తిరువేంగడత్తా న్  విగ్రహాన్ని గోకర్ణం నుండి తీసుకెడుతూ, ఒకరాత్రి ఈ ప్రాంతం లో విడిది చేశారట. మరుసటి ఉదయం మరల ప్రయాణం ప్రారంభించపోతే  బండ్లు కదలలేదట.  అప్పుడు స్వామి  ఈ ప్రాంతం తనకు నచ్చిందని, తాను ఇక్కడే ఉండిపోతానని,  పలికారట.  ఆ విగ్రహాన్ని రాజైన ఉదయనుడు దివాన్ శింగరాజు కిచ్చాడు. కాంచనపల్లి శింగరాజు ఈ  ఆలయాన్ని కట్టించి, తిరువేంగడ నాథుని, ప్రతిష్ఠించి పూజించాడు.  ఆ నాటి నుండి శ్రీ స్వామి శ్రీ,పద్మావతీ సమేత వేంకటేశ్వరుని గా పూజలందు కుంటున్నాడు. . ఆ పావనగల్లు ప్రజల వాడుక లో  పానగల్లు అయ్యుంటుందని జనవాక్యం.

ఆలయ  ముఖమండపం

రవాణా సౌకర్యాలు.     ఈ పానగల్లు దివ్యక్షేత్రం   విజయవాడ హైద్రాబాద్ జాతీయ  దారి లో నకిరేకల్ పట్టణం    నుండి  నల్గొండ వెళ్ళే మార్గంలో 23 కి.మీ దూరం లో ఉంది. నల్గొండ నుండి  మూడు కి.మీ దూరం లో పానగల్లు చేరుకోవచ్చు. రోడ్డుసౌకర్యం బాగానే ఉంది కాబట్టి ఆటోలు కూడ బాగానే తిరుగుతున్నాయి. కాఫీ, టీ,  టిఫిన్లు,శీతల పానీయాలు  దొరుకుతాయి.  

*****************************************************************************************************************************************************************