Friday, 26 April 2013

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి


                    Yadagirigutta  Sree Lakhminarasimha Swamy
                                      యాదగిరిగుట్ట     శ్రీ లక్ష్మీనరసింహస్వామి
                          यादगिरिगुट्ट  श्रीलक्ष्मीनरसिंहस्वामि
                                 
                          నల్గొండజిల్లా  లోని యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహుని దివ్యధామం. ఇది  హైద్రాబాద్ నగరానికి 60 కి.మీ దూరం లో ఉంది. ఇచ్చట యోగానంద, జ్వాల ,లక్ష్మీనరసింహ మూర్తులతో స్వామి స్వయంభువు గా దర్శనమిస్తున్నారు. శ్రీ స్వామి అనుగ్రహం ఉంటే సమస్త గ్రహ బాథలు తొలగిపోతాయని, అనారోగ్య సమస్యలు  మటుమాయమౌతాయని, శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.యాదమహర్షి  శ్రీ స్వామినిగూర్చి తపస్సు చేసి, సాక్షాత్కరింప చేసుకున్న  ప్రదేశం కాబట్టి దీనిని యాద గిరి గుట్ట అని పిలుస్తున్నారు.

                         
                           ఆలయ రాజ గోపురం


 స్థలపురాణం:;--            స్కాంద,బ్రహ్మాండ పురాణాలలో  శ్రీ యాదగిరి క్షేత్ర మహాత్మ్యం వర్ణించ బడినట్లు స్థల పురాణం చెపుతోంది. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుని కుమారుడు యాద ఋషి. ఈమహర్షి నరసింహోపాసకుడు. శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షంగా దర్శించాలని ఈ మహర్షి కోరిక. అందుకొరకు ముందుగా భక్త పరాథీనుడైన శ్రీ ఆంజనేయుని ప్రార్థించాడు. ఆంజనేయుడు  యాద ఋషి కి కలలో కన్పించి, సమీపం లోని కొండగుహ లో  స్వామిని గూర్చి తపస్సుచేయమని,శ్రీ స్వామి సాక్షాత్కారం లభించగలదని  చెప్పాడు.
  

                                    
                           అదిగో..అల్లదిగో  యాదగిరి

                      శ్రీలక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనాభిలాషగల మహర్షి ఘోరతపస్సు తో శ్రీస్వామి వారిని ప్రసన్నుని చేసుకున్నాడు. యాద ఋషి కోరిక మేరకు శ్రీ స్వామి యోగానంద, జ్వాల, లక్ష్మీనరసింహ రూపాలతో గుహలో కొలువుతీరాడు. ఆమహర్షి పేరుతో   ఆ పర్వతము యాదగిరి గా ప్రసిద్ధమైంది. మూడువందల అడుగుల  ఎత్తు మాత్రమే గల కొండ కాబట్టి  ప్రజల వాడుకలో గుట్ట గా  పిలవబడుతూ,యాదగిరిగుట్ట గా ప్రసిద్ధి పొందింది.
                                       


               
                                                                మెట్లమార్గం ప్రవేశద్వారం
                              
                           ఆంజనేయుని అనుగ్రహం వల్లనే యాదమహర్షి కి  శ్రీ స్వామి  దర్శనం లభించింది కాబట్టి  మహర్షి కోరిక మేరకు  శ్రీ ఆంజనేయుడే ఇచ్చట  క్షేత్రపాలకుడు గా నిలిచి పూజలందుకుంటున్నాడు  శ్రీస్వామి వారి గుహాలయానికి వెలుపలనున్న ముఖమండపం లో ఆండాళమ్మ సన్నిథికి ఎడమవైపు అంజనీపుత్రుడు  వేంచేసియున్నాడు.

                                                               పుష్కరిణి
                       పుష్కరిణి ::--               పుష్కరిణి చెంత  శ్రీఆంజనేయునకు ప్రత్యేకం గా ఆలయం  నిర్మించ బడింది. పుష్కరిణి లో పవిత్రస్నానం చేసిన భక్తులు ముందుగా ఈ క్షేత్రపాలకుని దర్శించుకొని, ఆయన అనుమతి తోనే శ్రీలక్ష్మీనరసింహుని దర్శనానికి బయలుదేరుతారు.     

                                   పుష్కరిణి సమీపమందలి శ్రీ ఆంజనేయ ఆలయం
   శ్రీస్వామి దర్శనం.:--            ఇచ్చట శ్రీ స్వామివారు  గుహలో ఒక వేదికపై కొలువు తీరి ఉంటారు. గర్భాలయం, అంత్రాలయం అనేవి వేరుగా లేవు. భక్తులు నేరుగా ముఖమండపం నుండి స్వామి సన్నిథికి నడిపించబడతారు.  లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఉన్న శిలకు   యోగపట్టసమాసీనుడైన యోగనరసింహుని స్వయంభువు  రూపం మనకు దర్శనమిస్తుంది. 

        
                                           యాదగిరి  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య మంగళ రూపం

ఆయనకు కొంచెం ఎడమవైపున జ్వాలా నరసింహుని స్వయంభువ రూపం దక్షిణవైపు శిలకు స్పష్టాస్పష్టంగా కన్పిస్తుంది. ఇది గుహ లోపలికి  ఉండటం వలన    సామాన్య భక్తులు  దర్శించుకొనే అవకాశం తక్కువ. మనకు దర్శనమిచ్చే రూపం శ్రీలక్ష్మీ నరసింహస్వామి.  ఆనాడు యాదమహర్షి కి ప్రత్యక్షమైన రీతిలోనే శ్రీస్వామి  శ్రీలక్ష్మీ అమ్మవారితో కలసి, నిలిచి, భక్తులను అనుగ్రహిస్తున్న అర్చామూర్తిగానే మనకు దర్శనమిస్తారు.
  

                             
                                           ఆలయ విమాన దృశ్యం

             చారిత్రకత.::--                 భువనగిరి లోని ఏకశిలాపర్వతము పై కోటను నిర్మించిన త్రిభువన మల్లుడు (క్రీ.శ. 1148)  యాదగిరి శ్రీలక్ష్మీనరసింహుని సేవించినట్లు కొలనుపాక వీర నారాయణస్వామి ఆలయమందలి శాసనము వలన తెలియుచున్నది.
    

   
                          భువనగిరి కోట నిర్మించబడిన ఏకశిలా పర్వతము

ఆలయప్రత్యేకత ::--                         శ్రీ  యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ని నమ్మి  సేవిస్తే ఎటువంటి శారీరక రుగ్మతలైనా  తొలగిపోతాయనే విశ్వాసం  భక్తుల్లో అపారం గా ఉంది. అందుకనే ఈయననువైద్య నారసింహుడని భక్తులు భక్తి తో  పిలుచుకుంటారు. ఒక  మండలంరోజులు స్వామి చెంతనే ఉండి, పుష్కరిణి లో స్నానం చేసి, ప్రదక్షిణాలు చేస్తూ సేవించుకుంటే సమస్త బాధలు నశిస్తాయని విశ్వాసం.  కొన్ని నివారణ లేని వ్యాథులను సైతం  శ్రీ స్వామి రాత్రివేళ కలలోకి  వైద్యుని రూపం లో వచ్చి ఆపరేషన్ చేసి నయం చేశాడని,  ఆ అనుభూతి పొందిన భక్తులు చెపుతుంటారు.  ఇది ఈ స్వామి ప్రత్యేకత గా ప్రచారం పొందింది. నమ్మకాన్ని మించిన మందులేదు కదా ! గ్రహబాథలను పారద్రోలుతాడని నరసింహుని యెడల భక్తులకు అపార  విశ్వాసం.

                     
                                    జాతీయ రహదారి ప్రక్కన  కన్పించే  తోరణ ద్వారము
               
                                
                           శ్రీ స్వామి వారి సన్నిథి లో సత్యనారాయణవ్రతం చేసుకోవడం శుభమని భక్తులు భావిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా వ్రతమండపం కూడ నిర్మించబడింది.    
                

                                             శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం                                      

                గోశాల, తులసి వనం ,నిత్యాన్నదానపథకం,   ఉచిత ప్రసాద వినియోగం ,మొదలైన పథకాలను ఆలయ యాజమాన్య ఆధ్వర్యం లో సమర్థవంతం గా నిర్వహిస్తున్నారు. ఒక  సంస్కృత విద్యాపీఠాన్ని, ఒక అల్లోపతి, ఒక  ఆయుర్వేద వైద్యశాలల్ని కూడ  ఆలయ  ఆధ్వర్యం  లో నిర్వహించడం మిక్కిలి ప్రశంసించ దగ్గ విషయం .       
      ప్రత్యేక ఉత్సవాలు :;---                        ప్రతి సంవత్సరము ఫాల్గుణ శుద్ధ విదియ నుండి ద్వాదశి  వరకు వార్షిక బ్రహ్మోత్స వాలు, శ్రావణ శుద్ధ దశమి నుండి ఏకాదశి వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయి. నరసింహ జయంతి, ఆండాళ్ తిరునక్షత్రం, రామానుజ తిరునక్షత్రం,ముక్కోటి ఏకాదశి ,ధనుర్మాసం, శ్రీరామనవమి నవరాత్రులు, శ్రీకృష్ణాష్టమి, మొదలైనవి ప్రత్యేక ఉత్సవాలు . 
              

                  
                                                 కళ్యాణ నరసింహుని దివ్య దర్శనం

               చైత్రశుద్ధ పౌర్ణమి రోజున తెప్పోత్సవము ,వైశాఖబహుళ దశమి హనుమజ్జయంతిని, నిర్వహిస్తారు .ప్రతి నెలలోను శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శతఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు.

                                                                                       తెప్పోత్సవ దృశ్యం
          ఆలయ సమయాలు:::--   ఉ.4 .గం.లకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి.  రాత్రి 9.గం లవరకు వివిథ దర్శనాలు సమయానుగుణంగా అందుబాటులో ఉంటాయి.

                                        ఘాట్రోడ్డు పై కన్పించే తోరణ ద్వారం

                రవాణా వసతి సౌకర్యాలు :----        హైద్రాబాదు  వివిథ ఆర్టీసీ డిపోలనుండి అథిక సంఖ్య లో సర్వీసులు నడుప బడుతున్నాయి. కొండ పైకి చేరడానికి మెట్ల మార్గము, ఘాటు రోడ్డు సౌకర్యము రెండు కలవు.  ఘాటురోడ్డులో ఆటోల సౌకర్యం ఉంది. కొండపైన , క్రింద  కూడ  దేవస్థానం వారి అద్దె గదుల( ఏ.సి /నాన్ ఏ .సి ) సౌకర్యం  ఉంది.  భోజనం, కాఫీ,టిఫిన్లు, అందుబాటులో ఉంటాయి..   
*********************************************************************************

Sunday, 14 April 2013

ఉండవల్లి శ్రీ అనంతపద్మనాభస్వామి


                         Undavalli     Sree AnantaPadmanabha  Swamy Darsanam.
                                 
                                    ఉండవల్లి     శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనం.
                         
                   उंडवल्लि श्री अनंतपद्मनाभस्वामि  दर्शनम्                          
                           
                            గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ  ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై  కొద్దిగా ముందుకు వెళితే .... ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపు కు తిరిగి  అమరావతి రోడ్డు లో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు.
                             
                 
       
        
                       ఈ గుహాలయాలు క్రీ.శ 420 -620  ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలు గా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. విష్ణు కుండినులు మొదట్లో బౌద్ధమతానుయాయులుగా అనంతరం హిందూమతాన్ని ప్రోత్సహించినట్లు చరిత్ర చెపుతోంది .
     
               
                         శ్రీ అనంత పద్మనాభుని సుందరరూపం
                              
                  నిర్మాణ సోయగం.::-----    ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా,  విశాలమైన విహారాలుగా  మందిరాలుగా , అందమైన స్థంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా  వివిథా కృతులలో మలచిన ఆనాటి  శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసు వంచి జోహార్లు అర్పిస్తున్నాడు ఈనాడు  ప్రతి యాత్రీక భక్తుడు.  శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల  ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతిఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోతున్నారు.          
     

                         మొదటి అంతస్తు   ::--                  క్రింద  భాగం  మొదటి అంతస్తులో  గుప్తుల,చాళుక్యుల  కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ద సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం  ప్రారంభమైంది.    వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి   మార్గము , విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది.
   
       
   

        రెండవఅంతస్తు ::-----                    రెండవ అంతస్తు లోనికి   మెట్లమార్గం ఉంది.  దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా  చెపుతున్నారు గాని  ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న  వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతి గా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు.  వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు  స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి.
     

        
                        మూడవ అంతస్తు లోకి మెట్లమార్గం
               
                చారిత్రక నేపథ్యం  :::-----                    ఈ గుహాలయాలు  నాలుగు అంతస్తులు  కూడ రాయిను తొలిచి చేసిన నిర్మాణాలే కాని, పెట్టినవి, ప్రతిష్ఠించినవి లేవు. మూడవ అంతస్తు పూర్తిగా  విష్ణు సంబంధమైన గుహాలయము. సాథారణం గా బౌద్ధ ,జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు.       కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాథికారి గా పనిచేసిన మాథవరెడ్డి చేత ఈ అనంత పద్మనాభుని గుహాలయము  నిర్మింపజేసినట్లుగా చెప్పబడుతోంది. 

                 రెండవ అంతస్తు కు వెళ్లే మెట్లమార్గం ప్రక్కనే ఉన్న కొండపై శాసనం ఒకటి శిథిలమై కన్పిస్తోంది.  ఇక్కడ  నుండి 9 కి.మీ దూరం   సొరంగ  మార్గం  మంగళగిరి  నరసింహస్వామి  కొండపైకి ఉందని,  ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానది లో స్నానానికి,  పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించేవారని జనశృతి.  ఈ విషయాన్ని మంగళగిరి  శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి అనే  వ్యాసం లో ప్రస్తావించడం జరిగింది. ( చూ. divyakshetralu.blogspot.in ). రాజులు యుధ్ధసమయాల్లో శతృరాజులకు తెలియకుండా సైన్యాన్ని   ఈ సొరంగమార్గం ద్వారా తరలించేవారని ఒకరు వ్రాశారు.  కాని ప్రస్తుత కాలం లో దాపురించే వివిథ ప్రమాదాలను నివారించడానికి గాను అథికారులు  ఈ సొరంగ మార్గాన్ని  మూసివేశారు.

                                        శాసనం       
      
     మూడవ  అంతస్తు ::----       మూడవ అంతస్తు లోనికి    వెళ్లడానికి  గుహను అందగా తొలిచి మెట్లమార్గాన్ని నిర్మించారు.  మెట్లను మలిచిన విధానం లోనే ఈ అంతస్తు ప్రత్యేకతను  ప్రకటించారు  శిల్పులు.  ఈ గుహాలయం లోకి ప్రవేశించడమే ఓ వింత అనుభూతిని కల్గిస్తుంది.   రెండు వరుసల స్థంభాల మథ్యలో విశాలమైన మండపము విశ్రాంతిమండపం గా  భక్తుల్ని ఆహ్వానిస్తుంది. ఆ స్థంభాలపై  దశావ తారాలు, వివిథ దేవతామూర్తుల శిల్పాలు  కొలువు తీరి  చూడగానే పలకరిస్తున్నట్లు గా ఉంటాయి. ఎడమవైపు కు తిరిగితే వరుసగా కొండను తొలిచి   తీర్చిదిద్దిన  శిల్పాలు కనువిందు చేస్తాయి. వానిలో ముందుగా  మనల్ని ఆకర్షించేది గణ నాయకుడైన వినాయకుని రమణీయ శిల్పం.
                    

                    
                                             మహా గణపతి

                            లంబోదరుని సహస్ర రూపాలను దర్శించిన సందర్శకునికైనా ఈ వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను  శిల్పం లో దర్శింపజేయడం  నాన్యతో దర్శనీయం.                    తరువాత మనం చూడవలసిన వాడు చతుర్ముఖుడు. కొండరాతిలో రూపుదిద్దుకున్న ఎంతో అందమైన శిల్పం.
        

                  
                 ఉగ్రనరసింహుడు            ఈ రూపం ఈమండపం లోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలిక తో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో   శంకరుని తో పాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి. 
        

               
                                          శ్రీ లక్ష్మీదేవి తో   ఆదివరాహస్వామి

                స్థంభాలపై కన్పించే వానిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయం గా  దర్శనమిస్తాడు.
                                                                 
                                                                         కుడ్యశిల్పం
          
                         మరొకస్థంభం మీద కన్పించే శిల్పం ఉగ్ర నరసింహుడు. ఇందాక చూచిన రెండు శిల్పాల కంటే పూర్తి వైవిథ్యం కల్గిన మనోహర శిల్పం ఇది. 
   

             హిరణ్యకశిపుని సంహరిస్తున్న నరసింహునిలో మహోగ్ర రూపాన్ని చూస్తాం. కాని ఈ నారసింహుని  వదనం లో  ఒక మహోన్నతమైన ఆనందాన్ని ఎంత స్పష్ఠం గా ఆ శిల్పి చెక్కాడో మనం గమనించ వచ్చు. ఉగ్ర నరసింహుని ముఖం లో ఆనందాన్ని చూపించడానికి కారణం  ఆ శిల్పి గొప్ప  దైవభక్తుడు,ఉపాసనా పరుడై ఉండాలి.  హిరణ్యకశిపుని సంహరించడం వలన  తన ప్రియభక్తునికి విమోచనం  కలిగించాననే ఆనందం ఆ పరమాత్మకు కల్గిందనేది ఆ శిల్పి భావన. అందుకే ఆ ఉగ్రమూర్తి ముఖం లోని ఆనందాన్ని  అంత స్పష్టం గా  ప్రదర్శింప చేశాడో, చూడండి.
                    
                                              ఆ ప్రక్కనే కన్పించేది వామనావతార ఘట్టం

          

                                   వామనావతార ఘట్టము
                 
                        మరొకస్థంభం మీద రూపుదిద్దుకన్నది హనుమత్సందేశం
             
                                    
                                    హనుమత్సందేశ ఘట్టం
                             
                        . ఆ   కొండ లోపలి గూడు లో    అంజనీసుతుడు.


         
              శ్రీ అనంతపద్మనాభస్వామి   ::-----               మూడవ అంతస్తు చివరి మందిరం లో కొలువుతీరి ఉన్నాడు శ్రీ అనంతపద్మనాభుడు.   చూడటానికి రెండు కళ్లు చాలవనేది మనలో మాట.  కాని ఫోటో తీయడానికి కెమెరా  చాలడం  లేదనేది ఇక్కడి మాట.     

              నల్లని గ్రానైటు లో ఏకశిలా నిర్మితమై. పద్మపత్ర విశాలాక్షుడై ,అనంత శయనుడై, పద్మనాభుడై,   గగన చరులైన దేవతలందరూ ఆనందంనాట్యం చేస్తుంటే,  జయ ,విజయులు పాదాల చెంత  కర్తవ్య పాలనలో ఉండగా,, మహర్షులు తపోమగ్నులై యుండగా,  ఆకాశం లో గరుడుడు  నాట్యం చేస్తుంటే ,   దర్శనమిస్తున్నాడు   శ్రీ అనంత పద్మనాభస్వామి. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించి తరించవలసిందే కాని వర్ణింపవలవికాదు.  
              

           
          ప్రతిరోజు పూజారి గారు ఏడున్నరకు వచ్చి తొమ్మిదింటి దాక ఉంటారట. శనివారం నాడు దూర ప్రాంతాల నుండి కూడ భక్తులు వస్తారు. భక్తులు చల్లే పసుపుకుంకాలతో నల్లనయ్య రూపం ఎఱ్ఱ గా మారిపోయి, ఎఱ్ఱ గ్రానైటు తో చెక్కిన  శిల్పం వలె కన్పిస్తోంది.
               
                   
 
                                       నాభి కమలము నుండి  ఉద్భవించిన  బ్రహ్మ 
                     
       ***********  ( శ్రీ అనంత పద్మనాభ స్వామి పూర్తి వీడియోను you tube లో నాచేత పొందుపరచబడిన "  Ananta padmanabhaswamy,undavalli   "ద్వారా చూడవచ్చు )                         
                       https://www.youtube.com/watch?v=_iGqB3df40M
                         
          
                 శ్రీ పద్మనాభుని మందిరంలోని సమస్త దృశ్యాన్ని  ఒకేసారి మనం చూడగలిగితే .. ...  స్వామి తో పాటు పద్మోద్భవుడైన  బ్రహ్మ, ఆనందంలో  సురేశుని కీర్తిస్తున్న దేవతలు,   ధ్యానం లో ఉన్న ఋషులు,  ఆయుథ పాణులైన అంగరక్షకులు, గగనం లో  నర్తిస్తున్న గరుత్మంతుడు  ఇది దృశ్యం.
                      ఈ   అనంత శయనుణ్ణి చూడగానే  ఈ శ్లోకం  స్భురణ కొస్తుంది.
                శాంతాకారం ,భుజగశయనం, పద్మనాభం, సురేశం
                 విశ్వాకారం ,గగనసదృశం ,మేఘవర్ణం, శుభాంగం,
                  లక్ష్మీకాంతం,కమలనయనం, యోగి హృద్ధ్యానగమ్యం
                  వందే విష్ణుం  ........ ఈ శ్లోకమే  ఈ శిల్పికి ప్రేరకమై,  శ్రీ అనంతపద్మనాభుని రూపాన్ని  భువన మోహనం  గా మన ముందు రూపు కట్టించింది.
       
           
                   
                             ఆకాశం లో   విహరిస్తున్నట్లున్న  గరుత్మంతుడు

               నాగబంథం ::---                  మూడవ అంతస్తు లో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథసముదాయం కాని ఉండవచ్చని   కూడ ప్రచారం జరిగింది.
    

        
                   నారద తుంబురులా  ?         ఈ మూడవ అంతస్తు లో వెలుపల భాగాన నాలుగు  విగ్రహాలు ,సింహం  బొమ్మలు కన్పిస్తున్నాయి. వీటిని నారద,తుంబురులు అని వ్రాస్తున్నారు. నారద తుంబురులయితే ఇద్దరే ఉండాలి కదా.! కాని నాకెందుకో ఆ నలుగురు వేద పురుషులకు ప్రతీక లనే భావన కలుగుతోంది. వాటిని కొంచెం క్షుణ్ణం గా పరిశీలిస్తే...మొదటి పురుషుని కుడి చేతిలోజపమాల,రెండవ చేతిలో తాళపత్రాలు కన్పిస్తున్నాయి. ఋగ్వేదానికి ప్రతీక ఏమో.? అలాగే నాల్గవ పురుషుని చేతిలో తంత్రీ వాద్య విశేషం  ఉంది. ఇది సామవేదానికి ప్రతీక కావచ్చు. కావున పండితులు,మేథావులు, చరిత్ర పరిశోథకులు  మరొక్కసారి ఈ విగ్రహాలను పరిశీలిస్తే  విశేషం వెలుగు చూడవచ్చునేమో?
                   

            
                             వేదపురుషులా?

               ఈ గుహాలయాల్లో నాల్గవ అంతస్తు కూడ  అసంపూర్ణం గానే   మిగిలిపోయింది.

               రవాణాసౌకర్యాలు ::----       ప్రకాశం బ్యారేజి మీద బస్సులు వెళ్లవు కాబట్టి ఆటో చేసుకొని వెళ్లవచ్చు. లేదా మంగళగిరి నుండి ఉండవల్లి సెంటరుకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు.  మంచినీళ్లు తీసుకువెళ్లడం మాత్రం మరచిపోవద్దు.
**********  కాలో హ్యయం  నిరవథీ విపులాచ పృధ్వీ ************** ***********************