Tuesday, 26 February 2013

శ్రీ అమరారామం-అమరావతి పంచారామక్షేత్రం


               Sree AmaraaramamAmaravati Pancharamakshetram
                     
                శ్రీ అమరారామం అమరావతి పంచారామక్షేత్రం.
             
                గుంటూరు జిల్లా లో కృష్ణానదీ తీరాన వెలసిన పుణ్యతీర్ధం శ్రీ అమరారామం. దీనినే అమరావతి అని పిలుస్తున్నాం.  అమరలింగేశ్వరుడు కొలువు తీరిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రమిది. పంచారామాలలో మొదటిది గా సేవించబడుతోంది. కలిదోష నివృత్తి కొఱకు శౌనకాది మహామునులకు నారద మహర్షి  భూలోకమునందు గల  పవిత్ర పుణ్య స్థలాలను గూర్చి వివరిస్తూ  ఈ అమరేశ్వరుని  గురించి చెప్పినట్లు  స్కాంద పురాణం లో  కన్పిస్తోంది.
                                          
                                 अमरेश समं तीर्थं न भूतो न भविष्यति !
                                  अमरेशं महादेवं सर्वदेवमयं शुभम्  !!”
    

       
                                  ఆలయ రాజగోపురం

               స్థలపురాణం  ::------.      ఈ అమరారామాన్ని  గురించిన విశేషాలు, స్కాంద పురాణం లో సహ్యాద్రి ఖండం లోను ,బ్రహ్మపురాణం పూర్వ ఖండం లోను. పద్మపురాణం ఉత్తర భాగం లోను ప్రస్తావించబడినట్లు స్థలపురాణం చెపుతోంది.
                     
                 
                              కృష్ణానదిలోని  స్నాన ఘట్టం
                       
                    తారాకాసుర సంహారం పూర్తి చేశాడు కార్తికేయుడు. యుద్ధ సమయం లో తారకుని కంఠమందలి అమృతలింగం కుమారస్వామి శక్తి ఘాతాలకు ఐదు గా విడి పోయి ఆంధ్ర దేశం లో ఐదు ప్రదేశాల్లో పడ్డాయి.వాటినే మనం పంచారామాలని పిలుస్తున్నాము. ఆ పంచారామాల్లో ఒకటైన  ఈ అమరారామం లోని అమరేశ్వరుడైన ఇంద్రుని చేత ప్రతిష్ఠించబడటం వలన ఈ స్వామిని  అమరేశ్వరుడని, ఆ స్వామి కొలువైన ఈ నగరాన్ని ఇంద్రుని నగరం పేరున అమరావతి యని పిలుస్తున్నారు.  దీనిని దక్షిణ కాశి  యని  కూడ అంటారు..  దేవగురువైన బృహస్పతి ఆదేశానుసారం  ఇంద్రుడు  ఆశ్వయుజ శుద్ధదశమి నాడు  సమస్త దేవతా గణము జయజయధ్వానము లు చేయుచూ వెంటరాగా,    తారకాసురుని గళమందలి అమృత లింగము నుండి చెదిరిన ఒక శకలమును ఈ క్రౌంచగిరి పై ప్రతిష్ఠించినాడు .
                   
               
                                               అమరలింగేశ్వరుని దివ్యరూపం
                            
                   శుద్ధ ధవళ కాంతులతో  ప్రకాశించుచున్న ఆ అమరేశ్వరుడు ప్రతిష్ఠించిన వెంటనే పైపైకి పెరిగి పోవటం ప్రారంభించాడట. అంత దేవేంద్రుడు అభిషేకములు చేసి, వివిధ దేవతాకుసుమములతోను,  బిల్వ పత్రములతోను పూజించినను స్వామి పెరుగుదల ఆగక పోవటంచేత  లింగాగ్రముపై  సీల కొట్టి, కృష్ణవేణీ జలం తో అభిషేకించగా స్వామి పెరుగుదల ఆగిందట.   ఇప్పటికీ లింగాగ్రంలో  తలపై నుండి జాలువారిన నెత్తుటి చారలు కన్పిస్తాయని భక్తులు చెప్పుకుంటుంటారు. తారకాసురుని మరణానంతరం ఇంద్రుడు స్వామి ని  ప్రతిష్ఠించిన తర్వాతే   మహేంద్ర పదవిని మరల పొందాడు.  ఆ ఇంద్రుని చే ప్రతిష్ఠించబడిన స్వామి అమరేశ్వరుడిగా ఆరాథించబడుతున్నాడు.
                               
            
                    
                                            ఆలయప్రవేశ ప్రధాన ద్వారం
                  
                     ఈ విషయాన్ని విన్న రాక్షస గురువు శుక్రాచార్యుడు బృహస్పతి చెంతకు వచ్చాడు.  కృష్ణానదికి వరదలొస్తే అమరేశ్వరుడు మునిగి పోయే ప్రమాదం ఉంది గదా! అటువంటి ప్రదేశం లో స్వామిని ఎలా ప్రతిష్ఠ చేయించారనే సందేహాన్ని వెలిబుచ్చాడు బృహస్పతి తో శుక్రాచార్యుడు. అందుకు ఆత్మలింగం పడినచోట భూభాగం క్రింద పాతాళం వరకు క్రౌంచ పర్వతం ఉంది. దానిపై నున్న ఆమహాలింగం పెరగటం వల్ల, ఎంత వరదలొచ్చినా ఆ మహాలింగానికి వచ్చిన ముప్పు ఏమీలేదు.కృష్ణా ప్రవాహమే స్వామికి నమస్కరించి  ప్రక్కకు తిరిగింది కదా.  ఉత్తర దక్షిణాలు గా నది ప్రవహించడాన్ని మీరు గమనించారు కదా!” అన్నారట బృహస్పతి. ఆ యనంతరం దేవ గురువుల సూచనల మేరకు   అమరేశ్వరుని చుట్టుఅంబిక మొదలైన శివపరివారమంతా  కొలువు తీరింది .
            

                         ఆలయప్రాకారం మీద కుడ్యశిల్పం
             
                   లింగదర్శనం.::----               అమరేశ్వరుని  రూపం  పది అడుగుల ఎత్తు కలిగి, మూడు అడుగులకైవారం తో, శుద్ధ ధవళ వర్ణం తో మెరిసి పోతూ ఉంటుంది. పానమట్టం మీద స్వామి పదిహేను అడుగుల ఎత్తులో కన్పిస్తారు. అభిషేకం చేయడానికి  ప్రత్యేకమైన  ఏర్పాటు చేయబడింది. స్వామి  మాటి మాటికీ పెరుగుతూ ఉంటే ఆలయనిర్మాణం  మాటి మాటికీ మార్చవలసి వస్తోందని, స్వామి వారి పెరుగుదలను సీల కొట్టడం ధ్వారా నియంత్రించారనే మాట స్వామి రూపాన్ని ఛూస్తే వెంటనే స్మరణకు వస్తుంది.
   
                    ఉత్సవ సమయాల్లో అమరలింగేశ్వరుని దివ్యమంగళ విగ్రహం
          
             క్షేత్రమహిమ :---                  ఈ స్వామి పంచలింగాకారాలతో పంచాక్షరీ మహామంత్రాన్ని బోధిస్తూ ఉంటారని ప్రతీతి. ప్రణవేశ్వరుని గా, అగస్త్యేశ్వరుని గా, కోసలేశ్వరుని గా ,   సోమేశ్వరుని గా, పార్ధివేశ్వరుని గా  దర్శనమిచ్చే ఈ క్షేత్రం లో  అయిదు రోజులు నివసించి,  కృష్ణానది లో స్నానం చేస్తూ, పంచాక్షరిని జపిస్తూ, స్వామిని ఆరాథిస్తే కైవల్య ప్రాప్తి లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతున్నారు. 
                              
                             स्नानमात्रेण तत्तोये गो सहस्रफलं लभेत् !
                              सुरेश्वरं सकृद्दष्ठा पुनर्जन्म नविद्यते  !!”
    
                 అని  శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ క్రౌంచ పర్వతం మీద  గతం లో దేవతలు, కపిలుడు మొదలైన మహామునులు  తపస్సు చేసి కృతార్థులగుట వలన దీన్ని  సిద్థి క్షేత్రం గా కూడ పిలుస్తారు.   పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, ఆర్ధ్ర నక్షత్రము, ఆది వారము, సంక్రాంతి, సూర్య, చంద్రగ్రహణ కాలాల్లోను, సప్తమీ సోమవారం ,దక్షిణోత్తరాయణములందు ఈ అమరావతీ తీర్ధమందు స్నానం చేసి, అమరేశ్వరుని సేవించిన  యెడల వారికి  సహస్ర యజ్ఞఫలము  లభిస్తుందని చెప్పబడుతోంది.
           
                               అమ్మవారు బాల చాముండేశ్వరీ దేవి

                  ఆలయదర్శనం :::---         కృష్ణా నదీ తీరాన వెలసిన అతి ప్రాచీన ఆలయం అమరావతి.  మహోన్నత గోపురాలతో విరాజిల్లే  పౌరాణిక పుణ్యస్థలం అమరావతి. మూడు ప్రాకారాలతో విలసిల్లు తున్న అమరేశ్వరుని మందిరం ఇది. మొదటిప్రాకారం లో ప్రదక్షిణ రీతిలో బయలుదేరితే  వరుసగా ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీవిశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయస్వామి, రుద్రపాదాలు, జ్వాలముఖీ దేవి, అగస్త్యేశ్వర స్వామి, ఫార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు, మహిషాసురమర్థని, కోసలేశ్వరుడు, వీరభద్రుడు  దర్శనమిస్తారు. రెండవ ప్రాకారం లో నైరుతిన కాలభైరవుడు, తూర్పు దిక్కున ధ్వజస్థంభం, దాని సమీపం లోనే సూర్యభగవానుడు ప్రతిష్ఠంచబడటం తో ఇది పంచాయతన క్షేత్రం గా కొనియాడబడుతోంది.
                  
              
                  
                              ఉత్సవ సమయాల్లో  అమ్మవారి దివ్యరూపం
                   
                    మూడవ ప్రాకారం లో ప్రదక్షిణ మార్గంలో  బయలుదేరితే, ముందుగా  నైరుతీ దిశ లో శ్రీశైల మల్లేశ్వరుడు, వాయవ్యం లో కాశీవిశ్వేశ్వరుడు, ఈశాన్యం లో చండీశ్వరుడు, ఆ గ్నేయం లో శ్రీ కాళహస్తీశ్వరుడు దర్శనమిస్తారు. గర్భగుడి లో 10 అడుగుల ఎత్తులో ధగధ్ధగాయమానంగా ధవళ కాంతి తో అమరేశ్వరుడు ప్రత్యక్షమౌతాడు.  ముఖమండపం లో స్వామి కి ఎడమవైపు ఉపాలయం లో బాల చాముండేశ్వరీ దేవి దివ్యరూపం  దర్శనమిస్తుంది.  ఈ ఆలయం లో నాలుగు దిక్కుల నాలుగు ధ్వజస్థంభాలుండటం ప్రత్యేకత.  ముఖమండపం లో నందీశ్వరుని చెంతనే  ఈ ఆలయ అభివృద్ధి కి  అహరహము కృషిచేసిన  వదాన్యులు  శ్రీ రాజా వాసిరెడ్డి  వేంకటాద్రి నాయుడు   ముకుళిత హస్తాలతో స్వామి వారికి నమస్కరిస్తున్న లోహ విగ్రహం   మనకు దర్శనమౌతుంది. ముఖమండపం నుండి   స్వామి వారికి ఎడమవైపు కు తిరిగితే  శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం లోకి వెళతాము. ఈ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడు. శివకేశవాభేదానికి ఇది ఒక తార్కాణం గా చెప్పవచ్చు.
       
                       
                   రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు లోహ విగ్రహం
                 
                చారిత్రక నేపథ్యం. :-----                                                అమరావతి, 
ధరణి కోట అనే వేరు వేరు పేర్ల తో పిలువ బడే ఈ ప్రాంతం చరిత్రలో  ధాన్యకటకం గా ఫ్రసిద్ధి కెక్కింది. క్రీ.శ  8 వ శతాబ్దం నాటికే  అమరావతీ బౌద్ధస్ధూపం నిర్మించబడింది. శాతవాహనుల కాలం లో   దక్షిణాపథం గా పిలువబడిన ఈ ప్రాంతానికి ధాన్యకటకం రాజధానిగా ఉండేది. అశోకుని సార్వభౌమత్వాన్ని అంగీకరించిన శాతవాహనులు బౌద్ధమతాన్ని  ప్రచారం చేశారు.కొండవీటి రెడ్డిరాజుల కాలం లో ఈ ఆలయం పునరుద్ధరించబడినట్టలు తెలుస్తోంది.క్రీ.శ. 1158 లోని  కొమ్మనాయని శాసనం,కోటరాజుల శాసనాలు లభిస్తున్నాయి. అనవేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి అమరేశ్వరాలయం మీద  పంచసువర్ణ కలశాలను ఎత్తించిన శాసనం  వేంకటాద్రి నాయుడు  మండపం లో కన్పిస్తుంది.అలాగే క్రీ.శ 1517 లోని శ్రీకృష్ణ దేవరాయల  దాన శాసనం ఒకటి ఉంది. ముఖమండపం లో కోట కేతరాజు మంత్రి ప్రోలినాయుడు భార్య  స్వామి వారికి అఖండదీపారాథనకు చేసిన శాసనం కన్పిస్తుంది.
             
                        
                                          ముఖమండపం లోని శాసన స్ధంభాలు
            
                    శ్రీ కృష్ణ దేవరాయలు ఇచ్చటకు వచ్చి .  స్వామి కి తులాభారమిచ్చినట్లు తులాభారమండపం సాక్ష్యంగా నిలుస్తోంది. అనంతరం క్రీ.శ 1626 ల పెద్ద అప్పము గారు ఆలయాన్ని పునరుద్ధరించారు. అమరావతీ ఆలయ కుడ్యాల మీద నున్న ఎన్నో  శాసనాలు చరిత్ర పరిశోధకు లకు ఎంతో  విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి.
                         
                                                         బుద్ధ ప్రతిమ కలిగిన ఆలయస్థంభాలు
                    
                    రాజా వాసిరెడ్డి  వెంకటాద్రి నాయుడు చెంచులను తుదముట్టించిన తరువాత అమరేశ్వరుని ఆజ్ఞ మేరకు తన రాజధానిని చింతపల్లి నుండి అమరావతి కి  మార్చారు. అమరేశ్వరుని ఆలయ సమీపం లో క్రీ.శ.1795 ధరణికోట ను నిర్మించి తన రాజధాని గా చేసుకొని, స్వామి వారిని సేవించి తరించాడు. శ్రీ కృష్ణ దేవరాయలు వలెనే  స్వామి కి తులాభారాన్ని సమర్పించి, తులాభార మండపాన్ని నిర్మించాడు.   ఆలయ ప్రాకార మండప గోపురాలను నిర్మించి,స్వామిసేవలో తరించాడు. స్వామి పూజాదులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నవబ్రహ్మల్లాంటి అర్చకులను ఏర్పాటు చేసి, 300 సంవత్సరాలక్రిందటే ఒక్కొక్కరికి 12 ఎకరాల భూమిని దానం  చేసిన వదాన్యుడు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు. రాజా వేంకటాద్రి నాయుడు ఈ దేవాలయ పునర్నిర్మాణం చేయించేటప్పుడు బౌద్దారామ శిథిలాలు కొన్నింటిని కూడ ఆలయ నిర్మాణం లో వాడారనే అపప్రథ  నిజమేనేమో అన్నట్లు దేవాలయ స్థంభాలమీద అక్కడక్కడ బుద్ధ ప్రతిమలు దర్శనమిస్తాయి.

                                             గర్బాలయగోడల మీది కుడ్యచిత్రాలు
               
                       రవాణా వసతి సౌకర్యాలు   :----            గుంటూరు నుండి 35 కి.మీ, విజయవాడ నుండి 30 కి.మీ  దూరం లోను అమరావతి ఉంది.  ఆర్టీసి సర్వీసులు బహుళంగానే ఉంటాయి.  దేవాలయానికి దగ్గరగా వసతి సౌకర్యాలు లభిస్తాయి. కాఫీ ,టిఫిన్ భోజనవసతులు, హోటళ్లు ఉన్నాయి.
  


           
                      విద్యుత్కాంతిలో ఆలయప్రవేశ మార్గం           

               విశేష ఉత్సవాలు ::------      శ్రీ అమరేశ్వరస్వామి కి    మాఘ బహుళ దశమి తో ప్రారంభమయ్యే మహాశివరాత్రి  ఉత్సవాలు , అమావాస్య నాడు  జరిగే రథోత్సవాన్ని చూడటానికి భక్తులు వేలాది గా తరలి వస్తారు.  కార్తీకమాసోత్సవాలు  కన్నుల పండువుగా జరుగుతాయి.

                                                                    శ్రీ స్వామి వారి రథం

*********************************************************************************

Thursday, 21 February 2013

వాడపల్లి -- శ్రీ మీనాక్షీ సమేత అగస్త్యేశ్వర స్వామి


          

     adapalli   -   Sri  meenakshi sameta Agastesyewara swamy Aalayam
                               
              వాడపల్లి         శ్రీ   మీనాక్షీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయం
                            
                               वाडपल्लि श्री मीनाक्षी समेत अगस्त्येस्वर आलयंम्

                      నల్గొండ జిల్లా దామెరచర్ల మండలం  వాడపల్లి ఒకనాడు దక్షిణ భారత దేశంలోనే మహోన్నత దశ అందుకున్న ఓడరేవు పట్టణం. దీనినే ఇప్పుడు వజీరాబాద్ అని కూడ పిలుస్తున్నారు.  జగత్ప్రసిద్ది చెందిన పరిటాల, వెల్లటూరు ప్రాంతం లో లభించు వజ్రాలు, సన్నని నూలు బట్టలు, ఆహార పదార్ధాలు, ద్రాక్షరసం,రాగి ,సీసం ,వెండి,నీలిమందు మొదలైనవి వోడపల్లి రేవు నుండి ఎగుమతి చేయబడుతూ, సుగంధద్రవ్యాలు, చీనాంబ్రాలు, మొదలైనవి దిగుమతి చేసుకొనేవాళ్ళు. సార్ధ వాహులు ప్రాగ్దేశ వస్తువులను వినుకొండ ,మచిలీపట్నం, నుండి కృష్ణానది ద్వారా వాడపల్లి కి చేర్చి, ఇచ్చట నుండి  కళ్యాణి,తగర, పైఠాన్ నగరాల మీదుగా నాసిక్ కు చేరి అటునుండి బరుకచ్ఛం  చేరేవారట. ఆనాడు ఇంత చరిత్ర ,  ఇంత రవాణా సౌకర్యాలు గల వాడపల్లి ని ఈనాడు చేరాలంటే ఎంత కష్ట పడ్డామో క్రిందటి  వ్యాసం లో చెప్పాను.(  చూ.వాడపల్లి – శ్రీలక్ష్మీ నరసింహస్వామి ).
  
                                        ఆలయ శిఖరం
         
                      స్థలపురాణం. :----               ఈ వాడపల్లి   లోని ప్రసిద్ధ చెందిన మరొక ఆలయం శ్రీ మీనాక్షీ సమేత  అగస్త్యేశ్వర  స్వామి. ఈ స్వామి కూడ అగస్త్యమహర్షి ప్రతిష్ట   గా నే చెప్పబడుతోంది. కృష్ణామూసీసంగమ పవిత్ర ప్రాంత లో లోపాముద్రా సమేత అగస్త్య మహర్షి శివకేశవుల అభ్యర్ధన మేరకు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని, శ్రీ మీనాక్షీ అగస్త్యేశ్వరస్వామిని ప్రతిష్టించి నట్లు స్థలపురాణం చెపుతోంది. శివకేశవులను కాశీ కావడి లో ఉంచుకొని, వారిని ప్రతిష్ఠించడానికి  పవిత్ర ప్రదేశాన్ని వెదకుతూ, ముల్లోకాలు తిరుగుతూ  అగస్త్యమహర్షి  ఈ కృష్ణా మూసీ సంగమ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ కు రాగానే  శివకేశవులు ఇరువురు ఇక్కడే ఉండ దలచినట్లు ఆ కాశ వాణి పల్కిందట. దానితో అగస్త్యుడు  శ్రీలక్ష్మీ సమేతుడు గా నరసింహుని ప్రతిష్టించి, మీనాక్షీ సమేతం గా అగస్త్యేశ్వరుని ప్రతిష్టించాడు.  శ్రీ లక్ష్మీ నరసింహుడు  ధక్షిణాభిముఖుడై ఉండగా,  ఈశ్వరుడు తూర్పు వైపు తిరిగి ఉంటాడు. ఈ స్థలమహత్య్మం ఏమోగాని ఇక్కడ నెలకొన్న శివ కేశవులిద్దరు ఫ్రత్యేకతలను సంతరించుకునే ఉన్నారు. ఇటువంటి క్షేత్రాలు ఆంధ్ర దేశం లోనే కాదు. భరతఖండం లోనే అతి తక్కువని చెప్పవచ్చు. కాని సరైన రవాణా సౌకర్యాలు,  ప్రచారం  లేక పోవడం వలన ఈ ఆలయాలు అలా మారుమూల ఉండిపోయాయని పిస్తోంది.  ఆనాటి రాజుల అంతులేని కళాతృష్ణకు, ఆనాటి శిల్పుల అద్భుత కళా నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యాలు ఈ రెండు దేవాలయాలు.
                    
                          శ్రీ స్వామి వారి ఆలయ దృశ్యం
                  
                             మరొక కథనాన్ని అనుసరించి ఒకరోజున ఒక పావురాయి వేట గాని బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చి శ్రీఅగస్త్యేశ్వర స్వామిని శరణుగోరి వారి వెనుక దాక్కున్నది. దాన్ని వెతుక్కుంటూ వచ్చిన వేటగాడు  తన వేటను తనకు అప్పగించ వలసింది గా శంకరునితో వాదానికి దిగాడు. శరణు కోరిన పక్షి ని రక్షించడానికి  స్థిరచిత్తుడైన శంకరుడు పక్షి మాంసానికి బదులు అంతే  పరిమితి లో తన శిరోమాంసాన్ని  తీసుకోవలసింది గా  కిరాతుణ్ణి  కోరాడు. అందుకు నిరాకరించాడు వేటగాడు. పక్షిమాంసం తినే నేను శిరోమాంసాన్ని ఎలా తింటానని ఎదురు ప్రశ్న వేశాడు .దానికి శంకరుడు వాని పూర్వ జన్మ వృత్తాంతాన్ని వినిపించాడు.
                
              
                               కృష్ణా మూసీ సంగమ ప్రదేశం

                    పూర్వ జన్మ లో ఈ కిరాతుడు ఒక రాక్షసుడు. మనుషులను చంపి తింటూ ఉండేవాడు. అలా మనుషులను తింటున్న  వాడిలో దేవతామాంసం తినాలనే కోరిక ఉండేది. కాని అది ఆ జన్మ లో తీర లేదు. కాబట్టి ఈ జన్మలో వాడికోరిక తీర్చదలచాడు పార్వతీ నాథుడు.     తన తలలోని మాంసాన్ని తీసుకోమన్నాడు. శంకరుని  మాటలు విన్న కిరాతుడు శంకరుని శిరోమాంసాన్ని తీసుకోవడానికి సిద్ధపడ్డాడు.
          
                              శ్రీ అగస్త్యేశ్వర స్వామి

                    స్వామి దర్శనం:----         తన రెండు చేతులతో పదివేళ్లతో ఈశ్వరుని తలభాగాన్ని  గ్రుచ్చి ,లాగి,  శిరోమాంసాన్నితీసుకొని సేవించాడు. అందుమూలంగానే ఇక్కడ  అగస్త్యేశ్వర స్వామి తలపై ఇప్పటికీ పదివేళ్ల తో మాంసం తీసేసుకున్నట్లు  చారలు,  తలపై సొట్ట కన్పిస్తుంది.  అంతేకాదు ఆ వేళ్ల గాట్ల మధ్య లోనే,  కిరాతుడి ఒక బొటనవేలు, ఒక చిటికెన వేలు లోపలికి గాఢంగా గుచ్చుకోవడం మూలం గా రెండు గుంటలు ఏర్పడ్డాయి. ఒకటి  మూడు వేళ్లు పట్టేటంత ఉంటే రెండవది రెండు వేళ్లు పట్టేటంత ఉంటుంది. వానిలోనుండి అన్నికాలాల్లోను నీరు ఊరు తూనే ఉంటుంది. నీరు పొర్లడం ఉండదు. అర్చకులు భక్తులకు తలపై చల్లడానికి, తీర్థానికీ ఆ నీరే వినియోగిస్తుంటారు. 
                

                     స్వామి తలపై నున్న గంగమ్మ ను చూడవచ్చు
                             
                ఆ బిలము లోతు తెలుసుకోవడానికికొందరు (ఆది శంకరులే అని కొందరు) ప్రయత్నించారని, ఉద్దరణి కి (గుళ్లల్లో తీర్ధమిచ్చే చెంచా వంటి దాన్ని ఉద్ధరిణి అంటారు ) దారం కట్టి లోపలికి వదిలతే అది ఎంతో దూరం పోయిన తరువాత  మరల బయటకు  తీసిచూస్తే, ఆ  ఉద్ధరిణి కి  నెత్తురు అంటుకుని ఉందనే ఐతిహ్యాన్ని ఆలయం లోని పూజారి గారు  వచ్చిన భక్తులకు చెపుతున్నారు.  ఏమైనా లింగం  తలపై పది వేళ్ల గుర్తులు, రెండు రంద్రాలు , వాటిలో నుండి నీళ్లు రావడం మాత్రం నిజం. మేము ప్రత్యక్షం గా చూశాము. అందుకే నేను పై పేరాలో ఎరుపురంగు లో ఆ వాక్యాన్ని వ్రాయాల్సి వచ్చింది. కొన్నింటిని మనం కళ్లారా చూసినా నమ్మలేని స్థితి అంటే ఇదేనేమో.!
                      
                                 శ్రీ మీనాక్షీ దేవి

                      ఆలయదర్శనం.::-----                ఆలయం కృష్ణానది వైపు కు తిరిగి ఉంటుంది. ఆలయం   ముఖమండపం అంత్రాలయం, గర్భాలయం, గా మూడు  భాగాలుగా ఉంటుంది. ముఖమండపం లోనే స్వామి కి కుడివైపు మీనాక్షీ అగస్త్యేశ్వరుల ఉత్సవిగ్రహాలుంటాయి. అంతకు ముందే  ప్రసన్నగణపతి, కుమారస్వామి దర్శనమిస్తారు.  ముఖ మండపం లో శ్వామి కి వామ భాగాన  చిన్నమందిరం వంటి  అర లో మీనాక్షీ దేవి దర్శన మిస్తుంది. అక్కడే కొంచెం దూరం లో లోపాముద్ర అగస్త్య మహర్షి దంపతుల విగ్ర హాలను కూడ మనం దర్శించుకోవచ్చు.
        
                     స్నాన ఘట్టానికి దారి
              
               చారిత్రక నేపధ్యం. :::----                శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కుందూరు చోళులు   మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు ఆధారాలు లభిస్తున్నాయి.  క్రీ,శ .1050-65 మధ్య ఎఱయ తొండయ చోళుడు వాడపల్లి దుర్గాన్ని నిర్మించి ఓడరేవును అభివృద్ధి పరిచాడు.  రేచర్ల పద్మనాయకులు,రెడ్డి రాజుల అధీనం లో కూడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. వీరశైవ కాలం నాటికేఈఆలయం మహోజ్వల దశను  పొందినట్లు గా కన్పిస్తోంది.  కాకతీయుల కాలం లో నూతన నిర్మాణాలు జరిగి నట్లు  కూడా శాసనాల ద్వారా తెలుస్తోంది.
                   
                                           ఆలయ ప్రాగణం లోని శాసనాలు
               
                     క్రీ.శ 1377( శక సం .1299 )  నాటి శాసనం లో అనవేమయ సామంతుడైన కడియం పోతినాయుడు   స్వామి అన మాచయరెడ్డి గారికి పుణ్యం కొరకు శ్రీ కృష్ణ మూసీ సంగమమైన బదరికాశ్రమమందు అగస్ధేశ్వర దేవరకు పిల్లల మర్రి బేతిరెడ్డి  కట్టించిన గర్భగృహము మీద శిఖర ప్రతిష్ట చేసి, భేరిశాలను కట్టించిరి. అని తెలియ జేయ బడింది.

                              ముఖమండపం లోని అగస్త్యమహర్షి, లోపాముద్ర
         
              రవాణాసౌకర్యాలు.:---    మిర్యాల గూడ నుంచి బస్సు సర్వీసులు కలవు.  ఉండటానికి ఎటువంటి వసతి సౌకర్యాలు ఉండవు. ఆలయ సమీపం లోనే కాఫీ, టీ, వంటివి లభిస్తాయి.
       
        ఈ ఆలయ సజీవ దృశ్యాలను you tube లో దర్శించవచ్చు.https://www.youtube.com/watch?v=IWHIgvdPNWk&feature=c4-overview&list=UUrNtnyJK1VL3MFXOAv6YdgQ  ఆలయ వేళలు. ::---- మధ్యాహ్నం 12.30 వరకు, సాయంత్రం 4.గం.నుండి 7.30 వరకు దర్శనం లభిస్తుంది.

******************************************************************************