Wednesday, 26 September 2012

వేదాద్రి-పంచనారసిహక్షేత్రం                         Vedadri -Pancha Narasimha Kshetram.                                                           వేదాద్రి – పంచ నారసింహ  క్షేత్రం
                        
              
                    वेदाद्रि- पंच नारसिंहक्षेत्रम्.                                          వేదాద్రి  కృష్ణా జిల్లాలోని  ప్రాచీన దివ్య క్షేత్రాల లో ఒకటి. హైదరాబాదు- విజయవాడ జాతీయ రహదారి లో చిల్లకల్లు నుండి పది కిలోమీటర్లు దక్షిణంగా కృష్ణాతీరాన ఉన్న పుణ్య తీర్థ మిది. ఈ ప్రదేశంలో కృష్ణానది  ఉత్తరవాహిని గా ప్రవహిస్తోంది. ఉత్తరవాహిని ని పవిత్ర పుణ్యతీర్థంగా  భక్తులు  విశ్వసిస్తారు. ఇచ్చట నరసింహస్వామి  పంచ రూపాత్మకుడై జ్వాల సాలగ్రామ వీర యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి గా సేవ లందు కుంటున్నాడు. కావుననే యిది పంచ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. 
                                                                       యోగానంద నరసింహస్వామి
         స్థలపురాణం:--    
                 బ్రహ్మాండ పురాణాంతర్గత వేదాద్రి స్థలపురాణాన్ని  శ్రీ మందపాటి రామకృష్ణకవి 

 “వేదాచల మహాత్మ్యం గా రచించారు.  బ్రహ్మ దేవుని  వద్ద నుండి వేదములను అపహరించిన సోమకాసురుణ్ణి శ్రీమన్నారాయణుడు  మత్స్యావతారుడై సంహరించి , వేదములను ఉద్థరించినాడు. శ్రీ మహావిష్ణువుచే రక్షించబడిన వేదములు  పురుషరూపముల దాల్చి, దేవదేవుని పలురీతులుగా స్తుతించి , కష్టముల నుండి కడతేర్చినందుకు కొనియాడి, ఎల్లవేళల తమ శిరస్సులపై నెలకొని తమను తరింపజేయవలసినదిగా ప్రార్థించినవి. అందుకు సంతసిల్లిన ఆదినారాయణుడు నృసింహావతారమునందు హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుని రక్షించిన యనంతరము  పంచరూపాత్మకుండనై మీ శిరములపై  వసింతును. అప్పటివరకు మీరు కృష్ణవేణీ గర్భమున సాలగ్రామ రూపమున వర్తిల్లుడు. మీరు కోరినట్లు కృష్ణవేణియు ప్రతిదినమును అభిషేకము  చేయ నభిలషించుచున్నది. కావున మీ అందరి కోరికలు ఏక కాలమున తీరగలవని  వరమిచ్చెను. అనంతరము నృసింహ ఆవిర్భావము జరిగి హిరణ్యకశిపుని సంహరణానంతరము శ్రీమహావిష్ణువు జ్వాలా నారసింహమై  ఈ వేదాద్రి పై నెలకొనినట్లు స్థల పురాణము చెపుతోంది.


ఈ దివ్యక్షేత్రము యెుక్క పూర్తి వీడియో ను  you tube లో "  vedadri jwala salagrama veera yogananda lakshminarasimha swamy aalaya sandarsanam " లో చూడవచ్చు.     
                     
                  వ్యాసమహర్షి ఆదేశాను సారం ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ప్రదేశాన్ని అన్వేషిస్తూ  సంచరిస్తున్న కొంతమంది మహర్షులకు  వేదగిరి ప్రాంతానికి  రాగానే  స్వరయుక్తంగా వేదనాదం కొండలోనుంచి వినబడిందని , ఆ వేద నాదానికి ఆకర్షితులైన  మునులు  వేదగిరిని అథిరోహించి ,గుహలోనికి ప్రవేశించి, అచ్చట స్వామిని దర్శించి ఆయన ఆశీస్సులతో ఇక్కడే చిరకాలం తపస్సు చేస్తూ ఉండిపోయారని  కూడ ఒక  జనశృతి ప్రచారం లో ఉంది .  


            
                               కృష్ణవేణీ మధ్యస్థ సాలగ్రామ నరసింహస్వామి

                  సాలగ్రామ నారసింహం బ్రహ్మదేవుని ప్రతిష్ఠ కాగా  యోగానంద నారసింహం ఋష్యశృంగ ప్రతిష్ఠ. గరుడాదుల ప్రార్థనచే  గరుడాద్రి పై వీరనారసింహడు కొలువు తీరగా, వనదేవతల ప్రార్థనతో లక్ష్మీనరసింహమూర్తి  యోగానంద నారసింహ పీఠమున వెలసినాడు. మూలవిరాట్టు పడమటి ముఖం గా కృష్ణానది వైపు తిరిగి ఉంటుంది . స్వామికి ఎదురుగా నదిలో సాలగ్రామ రూపం వెలసి ఉంది.  ప్రథాన ఆలయానికి ఉత్తరంగా ఉన్న కొండమీదకు మెట్ల దారిన వెళితే  జ్వాలా నారసింహం దర్శనమిస్తుంది.వేదాద్రి నుండి తూర్పుగా రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే  గరుడాద్రి పైన  కొండ గుహ లో వీరనరసింహుడు   ఉగ్రరూపుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు.ఇచ్చట క్షేత్ర పాలకుడు గా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామి  కొలువు తీరియున్నాడు.


కళ్యాణోత్సవము :--           యోగనిష్ట లో నున్న స్వామి  కళ్యాణమునకు సంసిద్దుడు కాడని యెంచిన ఋష్యశృంగుడు శాంతాదేవితో  కూడి  లక్ష్మీనారసింహాన్ని ప్రతిష్ఠించి శాంతి కళ్యాణాన్ని  జరిపించాడని స్థలపురాణం. అదే సంప్రదాయంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలు  పంచాహ్నికంగా తిరుక్కళ్యాణము నిర్వహించబడుతోంది.                                        కొండ మీద వెలసిన జ్వాలా నరసింహస్వామి
     
  ప్రత్యేక ఉత్సవాలు :--          ధనుర్మాసము, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అథ్యయనఉత్సవాలు ఇచ్చట ప్రత్యేక ఉత్సవాలు. ఫ్రతి సంవత్సరం సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 1వ తేది వరకు త్రయాహ్నిక దీక్షతో శ్రీవైఖానసాగమానుసారంగా  పవిత్రోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.అనంతరం   శ్రీ స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగుతుంది.
    
 క్షేత్ర ప్రత్యేకత  :--                  
                                      ఇచ్చట ప్రథానమూర్తి యోగానంద నరసింహస్వామి. యోగపట్టసమాసీనుడై ,జానున్యస్త కరద్వయుడుగా చతుర్భుజుడై శంఖ చక్రాలతో  స్వామి ఆర్తులను అనుగ్రహిస్తున్నాడు.  చల్లని ఏటిగాలి, తియ్యని కృష్ణ నీరు, నిశ్శబ్ద వాతావరణం , రమ్యమైన ప్రకృతి  ఇచ్చటి ప్రత్యేకతలు.  దీర్ఘవ్యాథులు ,మానసిక రుగ్మతలు ఈ స్వామి ని  సేవిస్తే నశించి పోతాయని  భక్తుల విశ్వాసం.
      చారిత్రకత :--                   12 వ శతాబ్దం  లో ఈ ప్రాంతం  నృసింహతీర్ధం గా ప్రసిద్ది పొందినట్లు  దేవాలయంలోని శాసనం ద్వారా తెలుస్తోంది. క్రీ.శ. 1259 లో  చాగి మన్మ గణపతి దేవ రాజు వేయించిన ఈ శాసనం లో కృష్ణవేణీతీరమందు గల నరసింహతీర్థ నిలయుడైన  ప్రతాప నరసింహ దేవరకు వేములపల్లి గ్రామాన్ని దానమిచ్చినట్లు వ్రాయబడింది.


                           
                                  ఆలయ ప్రాగణం లోని శాసనం                   


                           సుమారు 2000 సంవత్సరానాటిదిగా భావిస్తున్న  జగ్గయ్యపేట బౌద్ద స్థూపం పై గల శాసనంలో కన్పించే  వేల్లగిరి >  వేదాద్రే నని వేదగిరి > వేల్లగిరి > ఏలాద్రి > వేదాద్రి గా  రూపాంతరం పొంది ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.
        
      ఆంథ్ర కవిత్రయము లో చివరి వాడైన  శ్రీ ఎఱ్ఱాప్రగడ మూడు రోజుల పాటు ఆలయములో ఈ విడిది  చేసి స్వామివారికి  ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ,ఛిద్రమైన ఒకశాసనం ఆలయ ప్రాగణం లో లభిస్తోంది. శ్రీనాథుడు  కాశీఖండం లో తన సాహిత్య సౌష్టవానికి పరిపుష్టి కల్గించినట్లు చెప్పుకున్న  వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలీ కల్హారమాలికా  గంథలహరి అనే పద్య పాదం లోని   వేదాద్రి నరసింహు డు  ఈ స్వామియేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం.                

                 అంతే కాకుండా      శ్రీకృష్ణలీలాతరంగిణి రచించిన  శ్రీ నారాయణ తీర్థులవారు శ్రీనరసింహుని అనుగ్రహం వలనే  తరంగాలు రచించినట్లు ఆథారాలు లభిస్తున్నాయి.  శ్రీనారాయణ తీర్థుల వారి అత్తవారిల్లు వేదాద్రి కి ఎదురుగా కృష్ణానదికి అవతలఒడ్డునఉన్న గింజుపల్లి. ఒకపర్యాయము వేసవి కాలంలో రావిరాల వద్ద నారాయణ తీర్థులు కృష్ణ దాటుతుండగా హఠాత్తుగా వరద వచ్చి  మునిగిపోవుదునన్నంత ప్రాణభయము  ఆయనకు ఏర్పడెను. ఇంతలో ఒక దివ్యథ్వని నీవు సన్యాసము తీసుకొనుము. కృష్ణ నీకుదారి తెరువీయగలదని వినిపించెను. వెంటనే ఆయన మానసికంగా సన్యసించి, అకస్మాత్తుగా వచ్చిన కవితాథారతో  వేదగిరీశుని వేదాద్రి శిఖర నారసింహ మాకలయామి అని స్తుతించి ఆ యనంతరము            స్వామి అనుగ్రహముచేతనే శ్రీ కృష్ణలీలా తరంగిణి రచించినట్లు చెప్పబడుచున్నది.    

పూజాది కార్యక్రమవివరాలు    ఉదయం 11 గం.లకు శ్రీ స్వామి వారికితులసీ సహస్రనామార్చన,అష్టోత్తరం,శ్రీచెంచులక్ష్మి అమ్మవారికి శ్రీఆంజనేయస్వామి వారికి తులసి అష్టోత్తర నామార్చన, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి,కుంకుమ అష్టోత్తర నామార్చన జరుగుతాయి. రా. 7.30.లకు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి మాత్రమే కుంకుమ సహస్ర నామార్చన అష్టోత్తర  శతనామార్చనలు జరుగుతాయి.  
                          
                                                                       ఆలయ గోపురం

                                  ఈ  ఆలయానికి ముక్త్యాల  రాజా  రాజా వాసిరెడ్డి రామ గోపాలకృష్ణమహేశ్వర ప్రసాద్  గారి వంశీకులు వంశపారంపర్య థర్మకర్తలుగా ఉంటున్నారు.

రవాణా సౌకర్యం:--                  విజయవాడ నుండి , జగ్గయ్యపేట నుండి  ఆర్టీసి బస్సులు  నడుపుతోంది. చిల్లకల్లు, జగ్గయ్యపేట ల నుండి ఆటోలు కూడ నడుస్తుంటాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పై బండిపాలెం అడ్డరోడ్డు నుండికూడఆటో సౌకర్యం ఉంటుంది.
.
వసతి సౌకర్యం  :--    తిరుమల తిరుపతి  దేవస్థానం , మరియు దాతల సహకారం తో దేవస్థానం నిర్మించిన  వసతి గదులు అద్దె కు లభిస్తాయి. నిత్యాన్నదానసత్రం నిర్వహించ బడుతోంది. కాఫీ , టిఫిన్లకు హోటల్ ఉంది.

ఆలయము తెఱచి ఉంచు వేళలు:--    ఉదయం 6గం నుండి రాత్రి 8గం వరకు అర్చన నివేదన వేళలను మినహాయించితే సర్వదర్శనం , ప్రత్యక దర్శనం  మార్పులతో స్వామి దర్శనం లభిస్తుంది.

  వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు.    9848256677       9848275069      08678-284899

                                           ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, ఇతర పూజాకార్యక్రమాలకు  చెల్లించవలసిన రుసుము ఇతర వివరాలు ఆలయము వారు ప్రకటించిన స్థలపురాణము వేదాద్రి క్షేత్ర మహిమ అనే పుస్తకంలో లభిస్తున్నాయి. వెల. రూ 10 .

*********************************************************************************